-వెంపటి హేమ
అమ్మవారి గుడి పక్కనే ఉన్న గంగరావి చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఒంటరి కాకి, కనిపించని దేవుణ్ణి కనికరించమని వేడుకుంటున్నదానిలా శక్తిగొద్దీ “కావు, కావు” మంటూ జీరబోయిన గొంతెత్తి గట్టిగా అరుస్తోంది. తెల్లవారి చాలాసేపయ్యింది. తూరుపు దిక్కున సూర్యుడు బారెడు ఎత్తున రక్త వర్ణంలో, అప్పుడే రేగిన పుండులా భగభగా మండుతూ, ఎర్రగా కనిపిస్తున్నాడు. ఒక చేత్తో కర్ర పట్టుకుని, రెండవ చేత్తో మనుమడు సిద్ధప్ప చెయ్యి పట్టుకుని పొలం వైపుగా నడుస్తున్న బంగారప్పకు, బట్టతలమీద పడిన ఎండ చురుక్కు మనిపించడంతో బుజం మీది తుండుగుడ్డ తీసి తలకి చుట్టుకున్నాడు.
చుట్టూ ఉన్న నేల బంగన బయలు కావడంతో, ఎండపడి బొగులు బొగులుమంటూ నిప్పులు చెరుగుతోంది అప్పుడే! ఆ ఎండలో దూరాన ఏదో తెల్లగా మెరుస్తూ తన దృష్టిని ఆకర్షించడంతో తాత చెయ్యి విడిపించుకుని సిద్దూ ముందుకు పరుగెత్తాడు. అలవాటుగా చెయ్యి ఓరజేసుకుని, తల పైకెత్తి ఆకాశాన్ని పరికించి చూసి, గాఢంగా నిట్టూర్చాడు బంగారప్ప.
బంగారప్ప ఒకప్పుడు ఆ ప్రాంతంలో భూకామందుగా మంచి పేరున్నవాడే. కాని వరుసగా తగిలిన దెబ్బలవల్ల చితికి చీకిరి అయ్యి, ఇప్పుడొక బక్క రైతుగా మారాడు. వచ్చిన నష్టాన్ని చూడగానే,ఒక్క సారిగా శక్తి యుక్తులన్నీ ఉడిగిపోయినట్లు డీలాపడిపోయాడతడు. వ్యవసాయం తాలూకు బరువు బాధ్యతలన్నీ కొడుకు శీనప్పకి అప్పగించేసి, తాను పక్కకు తప్పుకున్నాడు బంగారప్ప. కాని మొదటినుండీ ఉన్న అలవాటు పోక, దినామూ ఒకసారైనా పొలానికి వెళ్లి వస్తూంటాడు, అదే అతని దినచర్యలోని ప్రధాన విషయ మైనట్లుగా!
**********************
కొత్తకాలువ వల్ల కొంతవరకు పరిస్థితులు మెరుగైనా, ఇంకా ఆ చెమ్మ తగలని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి ఆ సీమలో! అదునుకు కరగని మేఘాలు, భూమిని ఎంతలోతు తవ్వినా పలుకరించని పాతాళగంగ రైతుల్ని భయపెడుతూనే ఉన్నాయి.
కొడుకుతో కలిసి తనకున్న పొలాన్ని సాగు చేసుకుంటూ, వర్షాధారంతో తిండిగింజల్ని, కాయగూరల్ని పండిస్తూ తనదైన బోద కొట్టంలో సుఖంగా బ్రతికేవాడు కుటుంబంతో బంగారప్ప. కొడుకు శీనప్పకు పెండ్లయ్యి భార్య మల్లమ్మ కాపురానికి వచ్చింది. ఇద్దరు మనుమలు కూడా కలిగారు.
ఆ సంవత్సరం సకాలంలో వానలు పడ్డాయి. బంగారప్ప మాత్రమే కాదు, ఇంకా చాలామంది, కూడబలుక్కున్నట్లు పత్తిని విత్తారు. పత్తిమొక్కలు గునగునా పెరిగి పూతకొచ్చాయి. పేనూ గీనూ పుట్ట కూడదని మందులు తెచ్చి చల్లారు. విరగ కాసిన పత్తి కాయలు పగిలాయి. మంచు ముద్దల్లాంటి పత్తితో పొలాలన్నీ తెల్లగా కళ్లు మిరిమిట్లు గొల్పాయి. తాము కుబేరులైపోయినట్లుగా కలలు కనసాగారు రైతన్నలు. ఏరేతలు మొదలయ్యాయి. పొలాల్లో పత్తి రాసులు ఏర్పడ్డాయి. ఇంక రెండు రోజుల్లో పత్తి మొత్తం లారీలమీద గొడౌన్లకి చేరిపోతుందనగా వచ్చింది, పెద్దపెద్ద చినుకులతో గాలివాన! పొలాల్లో ఉన్న పత్తంతా ఎందుకూ పనికిరాకుండా పోయింది. రైతుల గుండెలు బద్దలయ్యాయి. ఇన్నాళ్ల కష్టమూ ఎందుకూ కొరగాకుండా పోయింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన వాళ్లకి బ్రతుకు అంధకారమైపోయింది. దిక్కు తోచని రెండు కుటుంబాలు ఆత్మహత్యలకు తలపడ్డాయి! ఎటుచూసినా హాహాకారాలే వినిపించ సాగాయి పత్తి రైతుల ఇళ్లల్లో.
బంగారప్పకి పదేండ్ల ముదిమి ఒక్కసారిగా మీదబడినట్టయింది. జవసత్వాలు ఉడిగిపోయి, కొడుకును కౌగిలించుకుని బావురుమన్నాడు. “ఇదేందిర అబ్బీ, ఇట్ట బంగపన్నేము! ఇన్ని దినాలా కట్టపడి సంపాదిచ్చిందంతా ఒకటే ఏటుతో కొట్టుకోని పోయె గదరా” అంటూ.
సీనప్ప తండ్రిని ఓదార్చాడు, ” ఏందిప్పా నువ్వుగూడా ఏడుస్తాండావు? నీకు తెలీని సేద్దెమా? ఇయ్యన్నీ మావూలే! నేనుండా నీకు. ఎట్టనో ఒకట్టా బైటపడేదానికి సూడాల గాని, ఇట్ట్నా?! ఇంతకే మనం సన్నబడతా మనుకోగాకప్పా. ఇంగంతా నేన్ జూస్తా, నువ్ బేజారు గాకుండా గమ్మునుండు” అన్నాడు తండ్రికి ధైర్యం చెపుతూ.
అన్నమాట ప్రకారమే అప్పటినుండీ సేద్యం తాలూకు బాధ్యతలు తనమీద వేసుకుని పొలం పని చూసుకోసాగాడు సీనప్ప, తండ్రికి విశ్రాంతి నిస్తూ. చూస్తూండగా ఏడాది గిర్రున తిరిగింది.
ఆషాఢ మాసం వచ్చింది లగాయతు ఆశగా అరనోరు తెరుచుకుని, వాన మేఘాల రాకకోసం మోరలెత్తుకుని ఆకాశాన్ని పరికించి చూడడం అక్కడి రైతన్నలకి మామూలే. సేద్యం తప్ప మరో బ్రతుకు లేదు వాళ్లకు. అదునుకు వాన పడితే చాలు, సంతోషంతో అరకలు కట్టి, పొలం దున్ని, పదునుచేసి అప్పో సొప్పో చేసైనా విత్తనాలు తెచ్చి నాటాలని చూస్తారు. ఆ సమయంలో వాళ్లకు తాము నమ్మిన ఈ నేల తమకు అన్యాయం చెయ్యదనే పూర్తి విశ్వాసం ఉంటుంది. కాని సకాలంలో వానలు పడితేకదా!
ఉలిక్కిపడ్డాడు బంగారప్ప.
ఏరువాకలు మొదలయ్యాయి. ఆ సంవత్సరం కూడా సకాలంలో వానలు పడినాయి. ఆ సాలుకు వేరుసెనగ వెయ్యాలనుకున్నాడు సీనప్ప. విత్తనాలు కొనడానికి బయలుదేరబోతూ డబ్బు లెక్కబెట్టుకున్నాడు. చాలదనిపించింది. “అప్పా! దుడ్లు సన్నబడినాయ్. రెడ్డప్ప తాన అప్పు…”
ఉలిక్కిపడ్డాడు బంగారప్ప.
“అప్పు! అందునా పగోడి తాన అప్పు … ముప్పుర అబ్బీ”
“నిజమే ప్పా, దుడ్లు ఇచ్చేవోడు ఇంకెవుడుండాడు?” ఖండితంగా చెప్పేశాడు సీనప్ప.
బంగారప్ప గుటకలు మింగాడు. “బద్రం! వాడొట్టి కటికోడు. బద్రమప్పా” అంటూ దిగులుతో లేచి, అక్కడినుండి వెళ్లిపోయాడు, అంతవరకు అప్పుచేసి ఎరుగని బంగారప్ప.
చక్కగా మొలకెత్తి, రెపరెపా పెరుగుతున్న వేరుసెనగ మళ్లని చూసి రైతుల ముఖాలు వికసించాయి. క్రమంగా మొక్కలు పెరిగి పూతకొచ్చాయి. ఏపుగా ఉండి నిండా పూతతో ఉన్న వేరుసెనగ మొక్కల్ని చూసి పొంగిపోయాడు బంగారప్ప.
“సూడబ్బీ, పూత ఎట్టొస్చినాదో, దీన్ని సూస్తాంటే సాలు, దొడ్డ కుశాలగుండాది” అంటూ కొడుక్కి చెప్పి మురిసిపోయాడు బంగారప్ప.
నిండా పూతతో ఉన్న చేలను కన్నార చూసుకున్నంతసేపు పట్ట లేదు వాళ్లకు. మళ్లీ వానన్నది కురవకపోడంతో, నానాటికీ మొక్కలు క్షీణగతికి జారడం మొదలుపెట్టాయి. రైతులు హడలెత్తి, ఆకాశాన్ని పరికించి చూశారు. ఏకిన దూది కుప్పల్లాంటి మేఘాలు ఆకాశంలో తేలిపోతూ కనిపిస్తున్నాయేగాని, నీటితో తెపతెప లాడుతూ, నిండు గర్భిణిలా బరువుగా కదిలే మేఘం ఒక్కటీ కనిపించ లేదు.
రైతన్నల గుండెల్లో మంటలు పుట్టాయి. మొక్కులు పెట్టుకున్నారు, గుళ్లకు వెళ్లి పూజలు చేయించారు, గ్రామదేవతలకి బలులు సమర్పించారు… ఎన్ని చేసినా వానదేవుడు కరుణించలేదు. బొట్టు వాన కూడా పడలేదు. పైగా, రేడియోలో వస్తున్న, “కోస్తా ఆంధ్ర భారీ వర్షాలలో మునిగి, కొట్టుకుపోతోంది” అన్న వార్త వాళ్ల బాధను మరీ పెంచింది. “అతివృష్టి ఒకచోట, అనావృష్టి మరొకచోట! ఏ దేవుడైనా కరుణించి ఆ వానలో కొంత ఇటు పంపితే ఎంత బాగుంటుంది” అనుకున్నారు కొందరు. మేఘమథనం కోసం గవర్నమెంటుకు అర్జీలు వ్రాసి పంపారు. పెద్ద పెద్ద గోదురు కప్పల్ని వెతికి తెచ్చి వాటికి పెళ్లి చేసి, గొప్పగా ఊరేగింపు చేశారు. కాని దేనికీ ప్రయోజనం మాత్రం లేకపోయింది. దాంతో వాళ్లు పూర్తిగా నిస్త్రాణపడిపోయారు.
రెండేళ్లు వరసగా వానలు అలా దగా చెయ్యడంతో, కళ్ల కెదురుగా ఎండి, మాడి మసైపోతున్న పంటచేలను చూసి, నిస్సహాయంగా కుప్ప కూలిపోయారు రైతులు. ఫలసాయం లేకపోయినా, రోజు రోజుకీ వడ్డీతో కలిసి పెరిగిపోతున్న – విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మొదలైనవి కొనడానికి చేసిన – అప్పులు మాత్రం తీర్చక తప్పని పరిస్థితివచ్చింది. ఇంక నిభాయించే త్రాణ లేని రైతులు, మిగిలి ఉన్న మడిచెక్కను అప్పులకు దఖలుపరచి, కట్టు గుడ్డలతో ఊరు విడిచి వలసపోడం మొదలుపెట్టారు. ఒకప్పుడు బాగా బ్రతికిన బంగారప్ప లాంటివాళ్లు కూడా ఇప్పుడు డీలా పడిపోయారు. ఎవరి ముఖం చూసినా నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఎవరి ఆలోచనల్లోనూ స్థిరత్వం ఉండటం లేదు. చిన్న అభిప్రాయ భేదం వచ్చినా జనం పెద్దగా కొట్లాటలకు దిగుతున్నారు. కక్షలూ, కావేషాలూ రోజు రోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. ఉన్న కర్మ చాలక ఉపాకర్మ ఒకటి …. అన్నట్లుగా, అదే సమయంలో సీనప్ప తల్లి మరణం కూడా తోడవ్వడంతో, బంగారప్ప కుటుంబం మరీ డీలా పడిపోయింది.
మనుష్యులే ఇల్లా ఉంటే ఇక పశువుల గతి చెప్పాలా! చూస్తూండగా పంట పొలాలు గడ్డి బీళ్లుగా మారాయి. అంతలో ఆ గడ్డి కూడా వాడి వత్తలైపోయింది. కొన్నాళ్లు ఆ ఎండిపోయిన గడ్డే తిని బ్రతకసాగాయి పశువులు. ఇప్పుడు అదికూడా సరిగా దొరకటం లేదు. ఎటు చూసినా బోడి బయళ్లే కనిపిస్తున్నాయి. క్రమంగా బావులూ ఎండిపోతున్నాయి. బోరు బావుల్లో నీరు కూడ నానాటికీ అధఃపాతాళంలోకి వెళ్లిపోతోంది.
కడుపు కింత గడ్డీ, నీళ్లూ దొరక్క పశువులు, ఎండిన డొక్కలతో, ఆకలి పేగులతో అల్లాడిపోతున్నాయి. తిండికే కటకట రావడంతో చాలామంది వాటిని మేపలేక, ఐనకాడికి అమ్మేసి ఆ డబ్బు తమ అవసరాలకి వాడుకోడం మొదలు పెట్టారు. ఇదే అదనని వచ్చిపడిన దళారులు, వాటిని చవగ్గా కొని, లారీలమీద దూరంగా తీసుకుపోయి, ఎక్కువ లాభానికి కబేళాలకు అమ్మి, ఇబ్బడి ముబ్బడిగా సొమ్ము చేసుకోడం సాగించారు.
**********************
ముందుకెళ్ళిన మనవడు వెనక్కొచ్చి తన చెయ్యి పట్టుకుని ఊపుతూ “తాతా, తాతా!” అని పిలవడంతో ఆలోచనల్లోంచి తేరుకున్న బంగారప్ప రెండడుగుల్లో మనుమడు చూపిన చోటికి చేరుకున్నాడు.
” తాతా, ఇటు సూడు! ఈడొక సెవులపిల్లి ఎట్టా నిద్దరబోతా ఉండాదో” అంటూ గుస గుసగా చెపుతూ, సిద్దూ వేలు చాపి తాతకు దాన్ని చూపించాడు.
మనుమడి మాటలు బంగారప్పకి సరిగా వినిపించలేదు. “ఏందప్పా?” అని తను కూడా గుసగుసగా అంటూ, వాడు వేలు చాపిన వైపుగా చూశాడు.
” ఇద్గిదే! దీన్ని జూడు తాతా! ఎండనబడి ఎట్టా నిద్దరబోతా ఉండాదో!”
సిద్దూ వేలెట్టి చూపించినచోట, చావడానికి సిద్ధంగా ఉన్న చికిలింత పొద పక్కన, ఎండిపోయిన గడ్డిలో, ఒరిగినట్లుగా పడుకునివున్న ఒక కుందేలు కనిపించింది బంగారప్పకి. ఎముకల మీద తోలు కప్పినట్లుగా బాగా బక్కచిక్కి, హృదయ విదారకంగా ఉంది అది. శుక్లాలతో మసకబారిన కళ్లకు చెయ్యి ఓరజేసుకుని దానిని పరికించి చూశాడు బంగారప్ప. రవంత అలికిడికే బెదిరి పరుగులు పెట్టే కుందేలు, మనుష్యులు దగ్గరగా వచ్చినా కదలక పోడం చూసి, సందేహంతో అతడు దాన్ని కాలితో కదిపి చూశాడు. అది ఎప్పుడో చచ్చిపోయి కట్టెలా బిగిసిపోయి ఉంది.
భూమిలో బొరియలు చేసుకుని నివాసముండే అల్పజీవులు అక్కడి తాపాన్ని భరించలేక ఇలా, బయటికి వచ్చి, ప్రాణాలు వదిలేస్తున్నాయి – అంటే, నేలతల్లి గర్భం కూడా ఎండిపోయిందనే అర్థం! ఆ విషయం అనుభవజ్ఞుడైన బంగారప్పకి తెలుసు. చెరువుల్లో నీరు ఎండిపోడంతో చేపలూ చచ్చిపోయాయి. ఈ ఘోరకాటకానికి ముగింపు ఎప్పుడో! మళ్లీ ఈ గడ్డ మీద సరైన వానలు పడి జనం సుఖపడేది ఎప్పుడో … అనుకున్నాడు బంగారప్ప దుఃఖంతో.
తాత కళ్లలో ఊరిన నీళ్లను తెల్లబోయి చూశాడు సిద్దప్ప. ఒక కుందేలు చావులో ఇంత విషాదం ఉందని వాడి పసిమనసుకు తెలియలేదు. ఓదార్పుగా తాత చెయ్యి పట్టుకున్నాడు.
“ ఏడుస్తాండావా తాతా!” అడిగాడు ఆశ్చర్యంతో.
” ఏడ్సక ఇంగేమి జేస్తాం నాయనా! బొరియల్లో ఉండనూగాక, ఎలికొచ్చి బతకనూగాక ఇయ్యి ఈమాదిరి సస్తాండాయంటే, బూగరబాన కూడా సెమ్మ ఇగిరిపోయిందని కదా. తాగే నీళ్లకు కూడా కరువొస్తుందింక” అన్నాడు బంగారప్ప పై గుడ్డతో కళ్లు వొత్తుకుంటూ.
చచ్చి పడివున్న కుందేలు వైపు కన్నార్పకుండా చూశాడు సిద్దు. “తాతా, దీన్ని ఇంటికి పట్టకపోదామా?” అని అడిగాడు ఆశగా.
” ఏందిర తిక్కలోడా! దీన్ని ఈడనుంచి పట్టకపోయి, ఇంటికాడ ఇసిరి కొడతావా” ఆశ్చర్యంగా అడిగాడు బంగారప్ప.
“నేన్ దింటా దీన్ని.” ఖండితంగా చెప్పాడు సిద్దు
“ఎట్టెట్టా! దీన్ని దింటావా? సంపి తిను. బాగుంటాది. సచ్చిందాన్ని తినగాకు. అట్ట దింటే రోగాలొచ్చి సస్తారు! బద్రం” అంటూ మనుమడిని వారించాడు బంగారప్ప.
“తాతా! నా కడుపు కొలిమి మాదిరిగా మండుతా ఉండాది. మాయమ్మ ఏనాడూ కడుపునిండా బువ్వ బెట్టదే! ఒక్క పిడస సంగటి ముద్ద, ఇంత ఊరుబిండి. అంతే. లోటా నిండుకీ నీలుగూడా ఈదు.” తల్లి మీద నిష్టూరం వేశాడు సిద్దు.
ఉసూరుమన్నాడు బంగారప్ప. ఇప్పుడు తమ కుటుంబ పరిస్థితి ఎలాఉందో అతనికి తెలుసు. పాపం! ఉన్నది కాస్తా వండి నలుగురికీ పంచుతూ నేర్పుగా ఇల్లు నడుపుతోంది కోడలు మల్లమ్మ.
“సిద్దప్పా, సతాయించగాకు, గమ్మునుండు. ఈ కుందుస్తు పూరా తప్పినాంక గాని మనకు కడుపుకి పూటుగా బువ్వ రాగాదు. వానలు పడాల, వాగులు వంకలూ పొంగి పొర్లాల, సెరువుల దొరువుల తెప్పలు తేలాల…. అంత దాక మనకీ అతలాకుతలం తప్పదురా” అంటూ మనుమణ్ణి దగ్గరగా తీసుకోబోయాడు బంగారప్ప.
సిద్దూ కోపంగా మూతి ముడుచుకుని తాతకు ఎడంగా జరిగాడు. వాడి బుంగమూతి చూస్తూంటే బంగారప్పకి ముచ్చటేసింది. చెయ్యి జాపి వాడిని అందుకుని చేరదీసుకున్నాడు.
“ఏందిర తిక్కోడా అట్ట సూస్తాండావు! కోపమా? సింత పడగాకు. ఇల్లు సేరంగనే నీకు జోబీ నిండుకూ చెనిగి బేడలు బెడ్తా. ఏడ్సగాకు” అన్నాడు బంగారప్ప.
“అదేంగాదు. నే నీడనే దీన్ని దింటా” పట్టుబట్టాడు సిద్దూ.
“అదెట్టా? దీన్ని ఇడదీసి ఉడకేసి, రోంత ఉప్పూ కారం అద్ది……..”
బంగారప్ప మాట ఇంకా పూర్తి కాకముందే, ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగురుతూ, భూమిపైనున్న తన ఆహారం కోసం వెతుక్కుంటున్న పెద్ద గద్ద ఒకటి చివ్వున దిగివచ్చి, ఆ కుందేటి కళేబరాన్ని కాలి గోళ్లతో పట్టుకుని పైకిలేచి రివ్వున ఎగిరిపోయింది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. దాని వేగాన్ని చూస్తూ, తాతా మనుమలిద్దరూ నిర్ఘాంతపోయి చేష్టలుదక్కి నిలబడిపోయారు.
కొంత సేపటికి తెలివి తెచ్చుకుని కోపంతో తాత వైపు గుర్రుగా చూశాడు సిద్దూ. బంగారప్ప మనసు చివుక్కుమంది. కాని ఏమీ చూడనట్లు వెనక్కి తిరిగి, పొలంవైపుగా నడవసాగాడు. అతన్ని అనుసరించక తప్పలేదు సిద్దూకి. ఇద్దరూ పొలం దగ్గరకు చేరుకున్నారు. పొలాన్ని కొంత అవసరాలకు అమ్ముకోగా ఇంకొక పది ఎకరాల కొండ్ర మాత్రం మిగిలి ఉంది. కాని దానివల్ల వాళ్లకి ఏ ఫలసాయం లేకపోయింది. ఈ సాలుకి ఇంకా దుక్కి దున్నిన పాపాన పోలేదు ఎవరూ. అసలు తొలకరిస్తేకదా! పండితే పంట, పండకపోతే పెంటా నాయె! ఎక్కడా చిన్న గడ్డిదుబ్బు కూడా మిగిలిలేదు పొలాన! ఎండ పడి ఎర్రగా మెరుస్తోంది మన్ను. ఎక్కడా పచ్చతనం లేని ఆ బోడి బయలునే ఇంతసేపు పరికించి చూసి నిట్టూర్చి వెనక్కి తిరిగేడు బంగారప్ప. దారిలో రోడ్డు కవతలగా, పల్లంలో సగం సగంగా ఎండిపోయిన రేగిచెట్టుకి పై కొమ్మకి ఎండిన రేగిపళ్లు మూడు కనిపిస్తే, చేతిలోని కర్రతో వంచి, నెమ్మదిగా వాటిని అందుకోగలిగాడు బంగారప్ప. వాటిని పుణికి మనుమడికి రెండిచ్చి తాను ఒకటి నోట్లో వేసుకున్నాడు.
దారిలో ఒకళ్లిద్దరు తెలిసిన వాళ్లు కనిపించారు. కాని పలుకరించి ఆప్యాయతలు చూపించుకుని మాట్లాడుకోడానికి తగిన మనఃస్థితి వాళ్లల్లో ఎవరికీ లేకపోయింది. అందరి ముఖాల్లోనూ దైన్యం, అందరి కళ్లల్లోనూ ఆకలి! అందరివీ అగచాట్ల బతుకులే అయ్యాయి కదా! ఇంక చెప్పుకోదగ్గ విశేషాలు ఏముంటాయి కనక! …. అందరి మనసుల్లోనూ అదే భావం కావడంతో ఒకరినొకరు పలుకరించుకోకుండానే ఎవరి దారిన వాళ్లు ముందుకి సాగిపోయారు. ముసలి బంగారప్ప, మనుమడి చెయ్యి పట్టుకుని నడుస్తూ ఇంటిదారి పట్టాడు.
తాతా మనుమలు ఇంటి మలుపు తిరిగేసరికి ఇంటికి ఎదురుగా ఆగివున్న లారీ కనిపించింది. అక్కడంతా గోలగా ఉంది. కొడుకు సీనప్ప దుక్కిటెడ్లు రాము లచ్చుములను అదిలించి లారీ ఎక్కించడానికి చూస్తున్నాడు. అవి మోరలెత్తి అంబా అని మొరాయిస్తున్నాయి. సీనప్పకి విసుకొచ్చింది. ములుగర్రతో వాటిని చెరో రెండు దెబ్బలూ వేశాడు. వాటి ఎండిన డొక్కలకి కర్ర తగిలి పెద్దగా శబ్దం వచ్చింది.
అల్లంత దూరం నుండి అది చూసిన బంగారప్పకి ఆ దెబ్బలు తనవీపుమీదే పడ్డట్టుగా అనిపించి అదిరిపడ్డాడు. మనసు నిండిన ఉద్వేగంతో లేని ఓపిక తెచ్చుకుని, ఒక్క విసురునవచ్చి గుమ్మంలో వాలి, కొడుకు చేతిలో ఉన్న కర్రను లాక్కుని దూరంగా విసిరి పారేశాడు. ఎడ్లకు దగ్గరగావెళ్లి రెండు చేతులతోనూ రెండింటి మెడలనూ కౌగిలించుకుని, కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. వాటి మూపుల్ని ప్రేమగా నిమిరాడు. ఎండి, ఎముకలు తేలివున్న వాటి డొక్కల్ని ఆప్యాయంగా తడిమాడు. అంతసేపూ అతని కళ్లు వర్షిస్తూనే ఉన్నాయి.
బలవంతంగా, దుఃఖంతో పూడిపోయిన గొంతు పెగుల్చుకుని కొడుకుని కోప్పడ్డాడు బంగారప్ప, “ఇదేం గోరకలప్పా? ఈటి నేంజేస్తన్నావ్” అంటూ కంఠ శోషగా. అక్కడ జరుగుతోన్నది ఏమిటో అతనికి తెలిసిపోయింది. ఐనా అడిగాడు.
తండ్రి ఉగ్రం చూడగానే పులిలాంటి సీనప్ప పిల్లైపోయాడు. తండ్రి ముందు అపరాధిలా తలవంచుకుని చేతులుకట్టుకుని నిలబడ్డాడు. వినయంగా, “నా కింక ఈటిని సాకే సత్తా లేకపాయె. బావులన్నీ వట్టిపోయి, సేద నిండుకూ మన్ను వస్తావుండాది. నీళ్లు సేదీ, కావిళ్లు మోసీ నా సేతులూ, బుజాలూ కూడా కాయలు కాసిపోయినయ్. అలుగొంక పక్క బాయిలో మాత్తరం రోన్ని నీళ్లుండాయ్. అదికూడా ఎండిపోతే, తాగే నీళ్లు గుడకా ఉండవ్. నీళ్లకోసరం యాడికి బోవాల్నో యేమో. యేం జేసేది. నువ్వేజెప్పుప్పా!” అన్నాడు.
“సేద్దెగానికి దుక్కిటెద్దులు రెండూ రెండు కళ్లు గదప్పా! వాటినిడిసి బతికేదానికి గాదప్పా. నిదానించి ……….”
తండ్రిని మాట పూర్తి చెయ్యనివ్వలేదు సీనప్ప. “ఈటిని మేపను నా నింటీ గాదు. నీళ్ల కావిళ్లు మోసి మోసి నా జబ్బలు పులిసిపోయినయ్. ఈటికి నీళ్లు తాపించడం ఇంగ నాతో కాదు. ఇయ్యి మన కండ్ల ముందర్నే తిండికీ, నీళ్లకూ మొగమాసిపోయి, గాటికాడనే నీలిగేకంటే ఇదే మంచిదికదా! మల్లా వానలు కుదురుగా పడి మనం సేద్దెం జేసే ఆశ నాకు లేదప్పా. అమ్మేస్తే ఇయ్యి వేరే తావునైనా ఇంతకంటె బద్రంగా వుంటాయనిపించింది. నువ్వేజెప్పు!” అన్నాడు.
కొడుకును నిదానించి చూశాడు బంగారప్ప. శీనప్ప వెనకటి శీనప్పలా లేడు. బక్క చిక్కి బడుగులా ఉన్నాడు. కండలు సడలిపోడంతో, కావిళ్లకొద్దీ నీళ్లు మోసుకుంటూ మైళ్లు మైళ్లు నడిచిన దానికి గుర్తుగా భుజాలమీద ఏర్పడ్డ కాయలు పగిలి నెత్తురుచిమ్ముతూ స్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు భీముడిలావున్న మనిషి ఇప్పుడు దీనుడిలా మారాడు. బంగారప్ప మనసంతా కొడుకు మీద జాలితో నిండిపోయింది. ముద్దబంతిపూవులా నిండుగా ఉండే కోడలు మల్లమ్మ కూడా, ఇప్పుడు ఒక్కినరంలా తయారయ్యింది. భవిష్యత్తు ఏమిటో తెలియని అయోమయంలో పడి, బిక్కమొహం పెట్టుకు చూస్తూ గడప లోపల తలుపువార నిలబడింది. ఆమె చంకనెత్తుకున్న మూడేళ్ల కూతురు లచ్చిమీపాప కుడిచేతి బొటనవేలు నోట్లో ఉంచుకుని చీకుతూ, తృప్తి ననుభవిస్తోంది.
తలతిప్పి దుక్కిటెడ్లవైపు చూశాడు బంగారప్ప. అవీ బాగా లేవు. ఎండిన డొక్కలతో, ఆకలితో, దాహంతో ఆవురావురని ఏడుస్తున్న పేగులతో; పైకి అరచి చెప్పుకోలేని మూగ వేదనతో కళ్లనీరు నింపుకుని అతనినే చూస్తున్నాయి అవికూడా.
వాటి కళ్లతో తన కళ్లు కలబడగానే బంగారప్పకు గుండెల్లోని దుఃఖం ఎగదన్నింది. కన్నీరు ధారలయ్యింది. ఏడుపుతో పూడుకుపోయి ఎలుగురాచిన కంఠంతో, “వొరే శీనప్పా! దుడ్ల మీది ఆసతో బిడ్డల్ని కటికోల్లకి అమ్మేస్తామంట్రా” అని అడిగాడు సూటిగా.
లేగదూడలుగా అవి తమ వాకిట చిందులు వేసిన రోజులు గుర్తు వచ్చాయి బంగారప్పకి. ఆ లేగలు పెరిగి పెద్దవై దుక్కిటెడ్లుగా మారాక కూడా, అవి అతనికి తువ్వాయిలుగానే కనిపించేవి! వాటిని అతనెప్పుడూ ములుగర్రతో అదలించిన పాపాన పోలేదు. అతని మనసెరిగిన వాటిలా మసిలేవి అవి. ఆ రాము లచ్చుములు రెండూ తన రెండు కళ్లూ అనే, అనుకునేవాడు బంగారప్ప కూడా.
“అప్పా! అయన్నీ నా మతికి రాలేదనా? తిండీ నీళ్లూ లేక గిజాటుపడి గాటి కాడనే నీలిగి సచ్చేకంటే, ఒక్క ఏటున మెడ తెగి సస్తేనే బతుకు పీడ సిటికలో ఇరగడై పోతాది. ఐనా, ఏదో ఓటి సిటుక్కున మనం అనేసుకోడమేగాని, ఈటిని కొనేటోళ్లు కటికోళ్లో, కరునించేటోళ్లో ఎట్ట ఎరికైతాదప్పా! నొసల రాసుంటే ఇయ్యి సందెడు గరిక, గోలెండు కుడితినీలు దొరికే తాన సేరొచ్చు” అన్నాడు సీనప్ప. అక్కడితో ఊరుకోకుండా “అయ్యేగాదులే, మనమూ బువ్వెతుక్కుంటా ఊరిడిసి పోయే దినం దగ్గరలోనే ఉండాది” అంటూ గొణిగాడు.
కొడుకు మాటలు నమ్మలేకపోయాడు బంగరప్ప. కాని, గుబులునిండిన అతని మనసులో విరక్తి పొడజూపింది. ప్రతి జీవికీ భవిష్యత్తేమిటో ఆ భగవంతుడు ముందే నిర్నయించి ఉంచుతాడు. పరిస్థితులన్నీ ఆ ప్రకారమే ఏర్పడి ఉండి, జీవిని అటుపక్కకే నడిపిస్తాయి. దానిని తను ఆపగలడా! పొంగి వస్తున్న కెరటాన్ని అరచెయ్యి అడ్డం పెడితే ఆగుతుందా? తనవెర్రిగాని …… అనుకుని నిరాశ చేసుకున్నాడు.
“తిండికి మొగమాసి సచ్చేదానికంటే ఏ సావైనా మేలే! ఇంగ మీ ఋడం తీరిపోయింది. పొండి, నా రాము లచ్చుముల్లారా, ఎలిపోండి” అంటూ ఆ ఎడ్ల మూపులు నిమిరి భోరున ఏడ్చేడు బంగారప్ప.
అన్నీ తెలిసున్న వాటిలా ఆ ఎడ్లు తలలూపాయి. ఏనాడో బంగారప్ప ప్రేమగా వాటి మెడల్లో కట్టిన కంచు గంటలు ఖంగున మ్రోగాయి. అవి కడసారిగా బంగారప్ప వైపు చూసి, తలవాల్చి, లారీ మీదనుండి నేలమీదకి ఏటవాలుగా వేసివున్న బల్లచెక్కల మీదుగా, ఒక్క ఉదుటున లారీ ఎక్కి నిలబడ్డాయి. అక్కడే కనిపెట్టుకుని ఉన్న దళారి వెంటనే తలుపు బిగించాడు. కడసారి వీడ్కోలు చెపుతున్నవాటిలా ఆ ఎడ్లు “అంబా” అంటూ మోరలెత్తి దీనంగా అరిచాయి. లారీ కదిలి, దుమ్ము రేపుకుంటూ వెళ్లిపోయింది.
ముఖాన పైగుడ్డ కప్పుకుని ఏడుస్తూ అరుగమీద చతికిలబడ్డ బంగారప్పకి తన పంచప్రాణాలూ ఎవరో తోడేసుకు పోతున్నట్లు అనిపించింది. ఇక త్రాణ లేనట్లుగా, ఉన్న చోటే ఉన్నబడంగా కుప్ప కూలిపోయాడు. గుండె ఆగిపోడంతో అతడు పక్కకి ఒరిగిపోయాడు. అతన్నీ, కుటుంబాన్నీ ఇన్నాళ్లూ ప్రేమతో వెన్నుకాచి పోషించిన రాము లచ్చుములు ఇంకా అడంగు చేరుకోకముందే, బంగారప్ప ప్రాణవాయువులు అనంత వాయువుల్లో లీనమైపోయాయి.
*******************************
తండ్రి మరణంతో అంతా శూన్యంగా కనిపించింది శీనప్పకు. ఎడ్లను అమ్మగా వచ్చిన డబ్బు ఖర్చుచేసి తండ్రికి క్లుప్తంగా అంత్యక్రియలు జరిపించాడు అతడు. చేతిలో మిగిలివున్న కొద్దిపాటి దుడ్లూ ఖర్చైపోకముందే ఊరు వదలిపోడం మంచిదనే నిర్ణయానికి వచ్చాడు శీనప్ప.
ముఖ్యమనిపించిన కొద్దిపాటి సామాను కుదురుగా మూటకట్టి కావడిలో సద్దుకున్నారు. నాలుగ్గంటలకి స్టేషన్‌కి వచ్చే తూరుపు పోయే రైలు బండి ఎక్కాలని, భోజనాలు అవ్వగానే ఇల్లు సద్ది, ఇంటికి తాళం వేసి ఇరుగుపొరుగులకు చెప్పి బయలుదేరారు వాళ్లు. సీనప్ప కావడి బుజానికి ఎత్తుకున్నాడు. మల్లమ్మ లచ్చిమిపాపని ఎత్తుకుని, సిద్దు చెయ్యి పట్టుకుని గుమ్మాలు దిగింది.
ఎలా తెలిసిందోగాని, మందీ మార్బలంతో వచ్చాడు రెడ్డెప్ప బాకీ వసూలుకు! వేరుసెనగ విత్తినప్పుడూ, తల్లికి జబ్బుచేసినప్పుడూ చేసిన అప్పు ఇప్పుడు అసలూ వడ్డీ తో కలిసి మోపెడై కూర్చుంది. అది తీరుమానం చెయ్యకపోతే కదలనిచ్చేలా లేడు రెడ్డప్ప. ఇంక చేసేదిలేక, పొలం తాలూకు, ఇంటి తాలూకు దస్తావేజులు అతనికి దఖలు పరచక తప్పిందికాదు సీనప్పకి. అప్పుడు సెలవిచ్చాడు వాళ్లకి రెడ్డప్ప.
“మల్లా వానలుపడి ఈ పొలం పండినప్పటి మాట! విచ్చు రూపాయలు నీ కిచ్చా కదప్పా” అని సీనప్ప మీద నిష్టూరం వేసి మరీ కదిలాడు రెడ్డప్ప.
మిట్టమధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి నుండగా, స్వంత ఊరును వదలి వలసపోడానికి నాందిగా, అక్కడకి ఆరు మైళ్ల దూరంలోఉన్న స్టేషనుకి కాలినడకను బయలుదేరాడు సీనప్ప, కుటుంబంతో సహా. హృదయ భారంతో పాటుగా కావడి భారాన్ని కూడా బుజాన ఎత్తుకుని, భారంగా అడుగులువేస్తూ ముందు నడుస్తున్నాడు సీనప్ప. వెంట నడిచింది మల్లమ్మ, బిడ్డని ఎత్తుకుని. ఎండ వేడికి తల్లి బుజం మీద వాలి కళ్లు మూసుకుని పడుకుంది లచ్చిమీపాప. కొత్తగా పెళ్లై కన్న వారి ఇంటినుండి అత్తింటికి వెడుతున్న ఆడపిల్ల మనసులా ఉంది ఆమె మనసు! తల్లిగడ్డను విడిచిపోతున్నందుకు దుఃఖంతోపాటుగా ఆమెకు, ఈ నీటి ఎద్దడి, కరువు కాటకాల నుండి దూరంగా వెళ్లిపోయి, తనూ తన భర్తా కాయకష్టం చేసైనా పిల్లలకు కడుపునిండా బువ్వ తినిపించవచ్చు – అనే ఆశ కూడా ఉంది ఆమెకు. ఐనా, క్షణానికోసారి ఆమె పైట కొంగుతో కళ్లు ఒత్తుకుంటూనేవుంది. ఇంకపోతే, అభం శుభం తెలియని సిద్దూ మాత్రం తొలిసారిగా రైలుని చూసే సంబరంతో, రైలు బండిలా కూతవేస్తూ, అటూ ఇటూ పరుగులు పెడుతూ, తల్లి తండ్రులతోపాటుగా ముందుకి సాగుతున్నాడు.
చుట్టుపక్కల ఏ చల్లదనం లేకపోడంతో మిట్టమధ్యాన్నపు ఎండ నెత్తి మాడుస్తోంది. కాళ్ల కింద నిప్పులా ఉండి మంటలు పుట్టిస్తోంది వేడిగా ఉన్న ఇసక. రెండు మైళ్లైనా నడవకముందే అందరికీ దాహంతో నోరు పిడచ కట్టినట్లయ్యింది. వెంట తెచ్చుకున్న సీసాలో నీళ్లు తలోకాసినీ పంచుకు తాగారు. కాని ఎవరికీ దాహం తీరినట్లే అనిపించలేదు. రోడ్డుకి ఇరుపక్కలా కనుచూపుమేర అంతా బోడి దిబ్బలే వ్యాపించి ఉన్నాయి. ఎక్కడా పచ్చదనమన్నది లేదు. అక్కడక్కడ ఒకో చెట్టు ఉన్నా నీరు లేక అవీ వాడిన కొద్దిపాటి ఆకులతో జీవత్‌శవాలుగా, నామమాత్రంగా ఉన్నాయి. దాంతో ఆ ఎర్రచెక్కునేలలు మరీ బొగులు బొగులు మంటూ కనిపించి కళ్లు మండిస్తున్నాయి. ఎంత కష్టంగా ఉన్నా వాళ్లు నాలుగ్గంటల రైలు అందుకోవాలని పట్టుదలగా నడుస్తున్నారు. వాళ్ల అడుగుల తాకిడికి ఎర్రమట్టి ధూళి మేఘంలా పైకంతా లేస్తోంది.
సిద్దూ తల్లిని కొంగు పట్టి ఆపుతూ “అమ్మా, దప్పిక” అంటూ ఉండుండీ ఆమె కాళ్లకు అడ్డుపడుతూనే ఉన్నాడు. కాని ఆమె ఏ జవాబూ చెప్పలేక వాడిని విదిలించుకుని నడుస్తూనే ఉంది. అకస్మాత్తుగా సిద్దూ పెద్ద పెద్ద కేకలుపెడుతూ కేరింతలు కొట్టాడు ….
“అద్గదిగో! ఆడ సెరువుండాది, సూడు! నేబోయి నీలు తాగేదా?”
సిద్దూ వేలెట్టి చూపిస్తున్న వైపుగా చూసింది మల్లమ్మ. నిజమే, అక్కడున్న చెరువు మల్లమ్మకు కూడా కనిపించింది, నిండుగా నీళ్లతో, ఆ నీళ్లలో కదులుతున్న చిరు అలలతో! ఆమె కళ్లు ఆనందంతో మిలమిలా మెరిశాయి. తొందరగా రెండడుగులు ముందుకు వేసి భర్తను బుజం పట్టి ఆపింది.
సిద్దూ వేలెట్టి చూపిస్తున్న వైపుగా చూసింది మల్లమ్మ. నిజమే, అక్కడున్న చెరువు మల్లమ్మకు కూడా కనిపించింది, నిండుగా నీళ్లతో, ఆ నీళ్లలో కదులుతున్న చిరు అలలతో! ఆమె కళ్లు ఆనందంతో మిలమిలా మెరిశాయి. తొందరగా రెండడుగులు ముందుకు వేసి భర్తను బుజం పట్టి ఆపింది.
వేలితో చూపిస్తూ, “సూడప్పా, ఎన్ని నీల్లో! పోయి తాగేదా” అని అడిగింది.
శీనప్ప మనసు నీరయ్యింది. భార్యవైపు చూసి వెడనవ్వు నవ్వాడు. “ఎర్రిదానా! అది ఎండమావి! అంతా మాయ! అక్కడ నీళ్లూ లేవు పాడూ లేవూ. అన్ని నీళ్లు ఉంటే మనకీ కరమమేమిటికి? నీళ్లనుకుని ఆటి యంట పడితే, అయి అందీ అందకుండా ఉండి మన్ని సచ్చేదాంక నడిపిస్తయి. బోడి పర్రల్లో ఎండ చురుక్కుమనేటేళల్లో అట్టా అవుపడి ఆశపుట్టిస్తాయి, బద్రం” అంటూ గబగబా ముందుకి నడిచాడు.
“అంతా బ్రెమేనా, నీల్లుగావా!” సిద్దూ బిక్కమొగంవేశాడు. నిరాశతో నెత్తి గీరుకుని, ఉసూరుమంది మల్లమ్మ. అంతలో, శీనప్పను అందుకోడానికి పరుగెట్టారు ఇద్దరూ.
ఎట్టకేలకు వాళ్లు గమ్యాన్ని సమీపించారు. అల్లంత దూరంలో కనిపించింది స్టేషన్. వాళ్లు స్తిమితపడి, “అమ్మయ్య” అనుకునేటంతలో రైలు కూత వినిపించింది. సిగ్నల్ స్తంభం మీది రెక్క వాలింది. దడ దడ చప్పుడు చేసుకుంటూ వచ్చి, రైలు స్టేషన్‌లో ఆగింది. అంతలోనే, చూస్తూండగా బయలుదేరి వెళ్లిపోయింది ఆ రైలు. అది అక్కడ రెండు నిముషాలకంటే ఎక్కువసేపు ఆగదు.
స్టేషన్ మాష్టర్‌ని అడిగితే, తరవాత బండి మరునాటి పొద్దున్నే వస్తుందని చెప్పాడు. ఇంక చేసేదేమీ లేక, ఆ రాత్రికి అక్కడే ఉండిపోయి, మరునాడు ఉదయం వచ్చే బండిని ఎక్కాలని నిర్నయించుకున్నారు వాళ్లు. వెంట తెచ్చుకున్న తిండి తిని, ప్లాట్‌ఫారం మీద గుడ్డలు పరుచుకుని, మూటలు తల కింద పెట్టుకుని పడుకున్నారు. అలసి ఉన్నారేమో మరుక్షణంలో నిద్రపోయారు.
ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అంటారు. ఒళ్లుమరచి నిద్రపోతున్న శీనప్పకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఢమ ఢమా, చీనారేకులమీద ఎవరో సుత్తితో కొడుతున్నట్లు శబ్దాలు వినిపించ సాగాయి. అది ఏమిటో తెలియలేదు. అతడు, ఎందుకైనా మంచిదని, కంగారుగా పెళ్లాం బిడ్డల్ని తీసుకుని ఆరు బయటికి పరుగెత్తాడు.
గులకరాళ్లలా, ఒక జడిగా వచ్చిన పెద్ద పెద్ద చినుకులు వాళ్లమీద పడ్డాయి. సీనప్ప తలెత్తి ఆకాశం వైపు చూశాడు. పెద్దగా మెరిసిన మెరుపు అతని కళ్లు మిరిమిట్లు గొల్పింది. వెనువెంటనే, చెవులు పగిలిపోయేలా గట్టిగా వినిపించింది ఉరుము శబ్దం. అడ్డూ, అదుపూలేని ఆకాశంలో, మత్త గజాల్లాంటి మేఘాలు ఒకదాన్నొకటి ఢీకొంటూ, ఒకటై కలిసిపోతూ వానకురిపించే సన్నాహంలో ఉన్నాయి. తూరుపు వాకిట తలెత్తి, తొంగిచూస్తున్న అరుణ కిరణాలు వాటితో పోటీ పడలేక చాటుకి తప్పుకున్నాయి. చిరు జల్లు మొదలయ్యింది.
“వాన పడతాండాది” అంటూ ఆనందంతో కేరింతలు కొట్టాడు సిద్దూ. రెండు చేతులూ బారజాపి ఆ చినుకులలో తడుస్తూ, గిర గిరా తిరుగుతూ పాట పాడడం మొదలుపెట్టాడు. —
” వానా వానా వల్లప్ప, వాకిట తిరుగు చెల్లప్ప!
తిరుగూ తిరుగూ తిమ్మప్ప, తిరగ లేని నరసప్ప!”
అన్నగారి సంబరం చూసి, తల్లి చేతుల్లో ఉండకుండా జారివచ్చి, తన చిట్టి చేతులుచాపి, బుడిబుడి అడుగులు వేస్తూ, గిర గిర తిరుగుతూ తనూ పాడడం మొదలెట్టింది, నిండా మూడేళ్లైనా లేని లచ్చిమీపాప. ఆ చిరుజల్లులో తడవడం వాళ్లకి ఎంతో ఆనందాన్నిచ్చింది.
వర్షం క్రమంగా పెరిగి ఏకధారగా కురవడం మొదలెట్టింది.
“ఇన్నాళ్లకా నువ్వొచ్చేది?” అని కోపంగా అడుగుతున్న దానిలా, వానపడగానే నెరియలు విచ్చివున్న ఆ నేల సెగలు పొగలు కక్కి, బుసబుసా పొంగి హడావిడి చేసింది. కాని అంతలోనే సద్దుకుని తన్మయత్వంతో, ఆ నీటిని జుర్రుకోడం మొదలెట్టింది. కమ్మని మట్టి వాసనలు చెలరేగాయి. ఆ వాసనని గాఢంగా పీల్చుకున్నాడు సీనప్ప. అతని ముఖంలో రవంత వెలుగు కనిపించింది.
భర్త ముఖంలో మెరుపు కనిపించగానే మల్లమ్మ మొగం కూడా వికసించింది. “ఇదో! ఇంగ మనం యేరే ఊరికి బోవాల్నా” అని అడిగింది.
చూస్తూండగా రంగులు మారయి సీనప్ప మొహంలో. కళ్ల నిండా దుఃఖం నింపుకుని, “సతాయించబాక! ఇంటికి బొయ్యి ఏం జెయ్యాల? యేముండాదాడ! బంగారట్టా ఎద్దల్ను కటికోని పాల్జేస్తి! మాయప్పా పోయ. అరక్కట్టి దున్నాల్సిన బూమీ పాయె! అదునుకు ఆదుకోని ఈ వాన ఎవరికోసమో! …… మనకోసం మాత్రం కాదు.
పూలమ్మిన తావున కట్టె లమ్మగాదు. అంతకన్నా యేరే బిడువు జేరి, బతికేదానికి పుడక లేరుకునేదే మేలు” అంటూ, పై గుడ్డతో కళ్లు వొత్తుకున్నాడు సీనప్ప. ఇంతలో దూరాన వెలుగు కనిపించింది. సిగ్నల్ స్తంభం మీది రెక్క వాలింది. పెద్దగా కూత పెట్టుకుంటూ రైలు వచ్చి స్టేషన్లో ఆగింది.
పద్ధతిగా అది అక్కడ రెండే రెండు నిమిషాలు ఆగి, బయలుదేరి ముందుకు సాగిపోయింది. స్టేషన్‌లో సందడి సద్దుమణిగింది. ఖాళీగా ఉన్న ఫ్లాట్ఫారం బిక్కమొగం పెట్టుకుని వెళ్లిపోతున్న రైలునే చూస్తూ, ఉన్న చోటనే ఉండిపోయింది. వాన మాత్రం హోరుమంటూ కురుస్తూనే ఉంది. అదును తప్పి వచ్చిన వాన!
****************************
“వానా వానా వల్లప్ప” అన్న ఈ కథ వెంపటి హేమ 1970వ దశకంలో రాసారు. “కలికి” – అన్న కలంపేరుతో, సుప్రసిద్ధ వారపత్రిక, “ఆంధ్రప్రభ” లో ప్రచురితమైంది. ఆ కథనే ఇప్పుడు కొన్ని మార్పులు, చేర్పులు చేసి తిరిగి రాసి పొద్దుకు పంపించారు.
వెంపటి హేమ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్నారు. కలికి పేరుతో ఆమె రాసిన కథలు ఆంద్రప్రభ, యువ వంటి పత్రికలలో 1970 వ దశకంలో ప్రచురించబడ్డాయి. కారణాంతరాలవల్ల రాయడం మానేసినా, మళ్ళీ 2006 నుండి రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.
mmmmmmmmmmmmmmm…………
ఆద్యంతం హత్తుకునేలా రాశారు. మంచి కథ.
వెంపటి హేమ గారి “వానా వానా వల్లప్పా ” కథ రాయలసీమ లో నెలకొన్న కరువు పరిస్థితులకు దర్పణం పట్టింది.
30, 35 ఏళ్ళ కిందట రాయలసీమలో ఉన్న పరిస్థితులకూ , ఇప్పటి స్థితిగతులకూ పెద్ద తేడా లేదు.
రాయలసీమకు ఏదైనా మేలు చేద్దామని ఎవరైనా ప్రయత్నం చేసినా కొన్ని రాజకీయ పార్తీలూ, ప్రత్యెకించి ఒక ప్రాంతానికి చెందిన మీడియా వర్గాలూ అడ్డుకోవడం జరుగుతోంది.
సీమలో కరువు పరిస్థితులపై ఎన్నివేల కథల్ని రాసినా ఇంకా ఎన్నో కోణాలు మిగిలే ఉంటాయన్నది వాస్తవం.
వెంపటి హేమ గారికి అభినందనలు. సీమ కరువును నాలుగు దశాబ్దాల కిందటే అక్షరబద్దం చెసిన హేమ గారికి నా నమస్సులు.
.