– రవి
గ్రీష్మం.
హేమంతం, శిశిరం, వసంతం, వర్షర్తువు, శరత్తు – ఈ మిగిలిన ఋతువులన్నీ ఎందరో కవులను ఆకర్షించాయి. వసంతంలో కోకిల కూజితం ఓ కవికి ప్రణవమై, కవితా గానాన్ని ప్రేరేపిస్తే, శరజ్జ్యోత్స్నలు మరో కవిలో ప్రణయభావాలను మేల్కొలుపుతాయి. హేమంతం నీహారికలను అందిస్తే, ప్రావృష మేఘమాలలు మరోకవి, ప్రియురాలికి సందేశాన్నంపడానికి ప్రేరేపిస్తాయి.
మరి గ్రీష్మం?
గ్రీష్మానికి అచ్చట్లు ముచ్చట్లు లేవా? అలా ఎండుతూ, మండుతూ కూర్చోవలసిందేనా?
బహుశా గ్రీష్మానికి ఆ కొరత తీరడానికనేనేమో.. ప్రకృతి, గ్రీష్మంలో – వైశాఖ మాసం – కొందరు గొప్ప కవులను, గాయకులను, మానవజాతి ఉన్నంతకాలమూ గుర్తుంచుకోడానికన్నట్లు కొందరు మహానుభావులను సృజించింది.
ఓ బుద్ధుడు,
ఓ కబీరు,
ఓ శంకరాచార్యుడు,
ఓ కృష్ణయ్య,
ఓ అన్నమయ్య,
ఓ రామతీర్థుడు,
ఓ కృష్ణమూర్తి…….. ఓ రవీంద్రుడు….
రవీంద్రుణ్ణి అంతంత పెద్ద పేర్ల సరసన చేర్చడం న్యాయమా అంటారా? వేటూరి ప్రభాకర శాస్త్రి గారింట్లో బుద్ధుడు, గాంధీ ఇలా రకరకాల చిత్రపటాలుండేవట. ఆ పటాల చివర్లో ఆయన పటమూ. ఎవరో ఆయన్ను, వాళ్ళందరి సరసన మీ పటం ఉంచేసుకున్నారేమని అడిగితే, ఇట్నుంచీ చూసుకోండి, నేనే ఫస్టు అన్నారట ఆయన.
రవీంద్రుడు కేవలం రచయితో, కవో, వ్యాసకర్తో, చిత్రకారుడో, ఓ సంగీతకారుడో, ఓ కళాశాల సంస్థాపకుడో, ఓ నోబుల్ బహుమతి గ్రహీతో, రెండు దేశాలకు జాతీయగీత రూపకర్తో మాత్రమే కాదు. ఆయన ఓ యోగి. మార్మికుడు, మహాత్ముడు, మహానుభావుడూనూ. మధురభక్తి అన్నది భక్తి పరంపరలో ఓ ముఖ్యమైన విధానం. మధురభక్తిలో భక్తుడు తనను తాను దేవుడి మిత్రుడిగా, అనుంగు చెలికత్తెగా, ఇలా రకరకాలుగా మనసులో భావిస్తూ, ఆ భావనలలో తాదాత్మ్యం చెందుతాడు.
రవీంద్ర కవీంద్రుడు మధురకవి. భగవంతుని ఉనికిని సన్యాస వైరాగ్యాలలో కాక, ప్రకృతిలో, జీవితంలో, జీవితంలో చిన్న చిన్న మధురానుభూతుల వెల్లువలలో అన్వేషిస్తూ, ఆ అన్వేషణలోనే తాదాత్మ్యత చెందుతాడు కవి. భగవంతుడి ప్రసాదమైన జీవితాన్ని, జీవితంలోని ఆనందాలనూ కవి నిరసించడు. పైగా అవి భగవత్ ప్రసాదాలుగా భావిస్తూ, వాటిని ప్రసాదించిన ప్రభువుకు కృతజ్ఞుడై ఉంటాడు.
మురళి.
నన్ను నీవు చిరంజీవిని చేశావు. అదే నీకు ఆనందదాయకం.
ఈ విశీర్ణ పాత్రను ఎప్పటికప్పుడు నవజీవనంతో నింపుతావు.
ఈ మురళిని, కొండకోనల మీదుగా తీసుకుపోయి
నవ్య నూతన రాగాలను సృజిస్తావు.
నీ అమృత కర స్పర్శతో, నా ఎద పట్టరాని ఆనందాలను నింపుకుని,
పలుకలేని శబ్దాలను పలికిస్తుంది.
లెక్కలేనన్ని కానుకలు నా చిన్ని చేతులకు అందిస్తావు.
యుగాలు గడుస్తాయి. అయినా నీ కరుణరసం నాపై కురిపిస్తూనే ఉంటావు.
అయినా ఈ పాత్ర నిండనే నిండదు.
(గీతాంజలి)
భౌతిక సుఖాల పట్ల విరక్తి చెంది, వాటి అశాశ్వతను గుర్తించి, శాశ్వత ఆనంద ప్రాప్తికై వెతకడం వైరాగ్యమైతే, భగవంతుని సృష్టిని, సృష్టిలో వైవిధ్యాన్ని, అందాలను, భగవత్ ప్రసాదితమైన జీవితం సహాయంతో కనుగొంటూ, ఆ ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పుకోవడం ప్రార్థన.
ఇంద్రియాలు.
విముక్తి నా వరకు సన్యాసంలో లేదు.
స్వేచ్చా పరిష్వంగాలను వేల ప్రమోదాల శృంఖలాల్లో నేను కనుగొంటాను.
ప్రభువు వివిధ వర్ణాల, వివిధ సౌరభాల ద్రాక్షాసవాన్ని
ఈ మృణ్మయ పాత్రికలో నిరంతరం నింపుతునే ఉంటాడు.
నా ప్రపంచపు వందల దీపాలు ప్రభువు జ్వాలతో ప్రజ్వలితమై
ప్రభువు పూజా మందిరంలో వెలుగులీనుతాయి.
లేదు. నా ఇంద్రియ ద్వారాలను నేనెప్పటికీ మూయలేను.
ఈ దృశ్య, శ్రవణ, స్పర్శోల్లాసాలు ప్రభువు ఆనందాన్ని మోస్తూనే ఉంటాయి.
నా భ్రమలు హర్షోల్లాసాల దీప్తులతో భస్మితమవుతాయి.
ఆ ఆశలు ప్రేమ ఫలాలై పరిపక్వమవుతాయి.
(గీతాంజలి)
*****************************************************
గ్రీష్మం ప్రస్తావన ఇందాక వచ్చింది కాబట్టి – ఇందాకటి గ్రీష్మం రవీంద్రుడి కలంలో కరిగితే ఇలా కవిత (అనే రసానుభూతి) జాలువారుతుంది.
గ్రీష్మం.
దినభారాన్ని ఉధృతం చేస్తున్న దినకరుడి ప్రచండతేజం.
దాహంతో అంగలార్చిన ధరిత్రి.
నదివైపు నుండీ, “ప్రియతమా! రమ్మ”ని ఓ పిలుపు.
పుస్తకం మూసి, కిటికీ తెరిచి చూశాను.
మట్టి మరకలతో, నది ఒడ్డున తన వెడల్పాటి కళ్ళతో-
అచ్చెరువుతో నుంచున్నదో గేదె.
ఆ గేదెను స్నానానికి రమ్మంటూ,
మొలలోతు నీళ్ళలో ఓ కుర్రాడు.
ఓ దిగ్భ్రమ దరహాసమై, ఓ మధురిమ హృదయాన్ని స్పర్శించింది.
(తోటమాలి – 78)
*****************************************************
రామకృష్ణ పరమహంస గురించిన ఓ చిన్న ఉదంతం. ఎంతవరకు నిజమో తెలియదు. ఆయన చివరి రోజుల్లో ఉదరకోశ వ్యాధి (కాన్సర్) వచ్చింది. అప్పుడు ఆయన శిష్యులలో ఎవరో అడిగారుట. ” స్వామీ, మీరు కాళీమాత వర ప్రసాదులు కదా. కాళీమాత, మీరు పిలుస్తే పలుకుతుంది. ఇప్పుడు ఆ మాత అనుగ్రహంతో ఈ భయంకర వ్యాధి బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా?” అని. అప్పుడాయన, ” ఈ వ్యాధి, మృత్యువూ కూడా ఆ తల్లి అనుగ్రహమే నాయనా” అన్నాడుట.
మృత్యువును ఓ అందమైన మజిలీగా, ఓ అతిథిలా ఆదరిస్తూ, ఆహ్వానించినవారు చాలా అరుదు. సోక్రటీసు మహోన్నత మరణ సన్నివేశం అందుకు ఓ ఉదాహరణ. మన దేశం వరకు వస్తే, కృష్ణమూర్తి, మృత్యువు గురించి అందమైన అద్భుతమైన వ్యాఖ్యానం చేశాడు.
అయితే, మృత్యువును నవనూతన వరుడిలా భావిస్తూ, జీవితాన్ని శోభనరాత్రి వధువులా కల్పన చేయటం అనుభూతికి పరాకాష్ట.
మరణం.
జీవితపు ఆఖరు మజిలీ,
ఓ నా మృత్యువా, వచ్చి నాతో ఊసులాడు.
ప్రతిదినం నేను నీ రాకకై ఎదురుచూస్తున్నా ప్రభూ,
నా జీవితపు ప్రమోదాలను జీవింపజేస్తూ.
నేను, నా సర్వస్వం, బహుశా నా ప్రేమ
రహస్య అగాధాల వరకు నీ వైపు ప్రవహించాయి.
ఒక్క నీ ఆఖరు వాలుచూపు..
నా జీవితం అంతా నీది.
సుమాలు, సుమమాలలు వధువు కోసం సిద్ధం.
వివాహం తరువాత వధువు ఇంటిని విడిచి పయనం
తన ప్రభువును ఏకాంతపు రాత్రులలో కలవడం కోసం.
-(గీతాంజలి)
మరణాన్ని అంత ప్రేమించాడు కనుకనే, రవీంద్రుడు జీవితం పట్ల అంతే గాఢంగా అనురక్తి చెందాడు.
ఓ ప్రభాతం,
పూదోటలో ఓ అంధబాలిక.
తామరాకుల దొప్పెలో అర్పించిందో పూమాలిక.
మెడలో అలంకరించుకోగానే,
కనుల నుండీ జాలువారిన అశ్రువులు.
బాలికను ముద్దాడి చెప్పాను.
“ఈ కుసుమాల వలెనే నీవు అంధురాలవు.
నీ ఈ కానుక ఎంత అందమైనదని నీకు తెలియదు.”
-(తోటమాలి – 58)
ఓ ప్రభాత కుసుమం,
ఓ పసిపాప నవ్వు,
ఓ పిల్లతెమ్మెర,
ఓ పడవవాడిపాట,
ఓ ప్రభువుకై విన్నపం,
ఓ పశుపాలకుడి మురళీరవం,
ఓ పడవ కాగితం,
ఓ పక్షుల గుంపు,
………..
………..
అనుభూతి పేరేదేయితేనేం?
అనుభూతికి ఆధారం మనసు. రవి నిశ్చయంగా మనసుకవి.
సంస్కృత సాహిత్యంలో బాణకవిని గురించి చెబుతూ, “బాణోచ్చిష్టం జగత్సర్వమ్” (ఈ జగత్తులో ప్రతి విషయం, బాణకవి నమిలి వేసినదే) అని ఉదహరిస్తారు. విశ్వకవి రవీంద్రుడు చూ(ప)డని అనుభూతులు గానీ కొలవని గాఢమైన అనురక్తులు కానీ లేవని చెప్పడం అతిశయోక్తి కాదు. ఓ పాశ్చాత్య కవి యేట్స్, గీతాంజలి గురించి చెబుతూ, “ఎన్నోసార్లు ఈ పుస్తకం చదువుతూ, కళ్ళు తుడుచుకుంటూ, పక్కన ఎవరైనా నా కన్నీళ్ళను గమనిస్తున్నారేమో అని సంకోచపడవలసి వచ్చింది” అంటారు. అలాగే పోలండ్‌లో విప్లవం రగులుతున్న రోజుల్లో, వీధి నాటకాల్లో రవీంద్రుడి “పోస్ట్ మాస్టర్” కథను నాటకంగా ప్రదర్శించే వారుట. రవీంద్రుడిని “విశ్వకవి” అనడం నజరానానో, బహుమతో కాదు. అది ఓ సూచిక మాత్రమే.
రవి (సూర్యుడికి) అస్తమయం తప్ప విరామమూ, విముక్తీ లేవు.
రవీంద్రుడి (సూర్యులలో శ్రేష్టుడు) శరీరానికి భౌతికమైన మృతి తప్ప ఆయన అందించిన అనుభూతుల వెల్లువలకు మరణం లేదు. మరణమే కాదు, వార్ధక్యమూ లేదు.
కవి అజరామరుడు.
ఆయన ఏ మురళిగానంలోనో, ఏ పసిపాప నవ్వులోనో, ఇంకే అనుభూతుల రహస్యాలవెనుకనో దాక్కునే ఉంటాడు. వెతికితే కనబడకపోడు!
(వ్యాసంలో ఉటంకించిన విశ్వకవి వచన కవితలు, వ్యాసకర్త స్వేచ్చానువాదాలు)
——————
కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన రవి, ప్రస్తుతం ఉద్యోగరీత్యా బెంగళూరులో నివాసముంటున్నారు. 2007 సెప్టెంబరు నుండి బ్లాగాడిస్తూ ఉన్నారు.
గతంలో ఇతర వెబ్సైట్లలో సమీక్షలు పేరడీలూ రాసేవారు.
తెలుగు మీద మమకారంతో పాటు, వీరికి సంస్కృత భాషతో పరిచయమూ ఉంది.
చాలా బాగా వ్రాశారు. గ్రీష్మం గురించి మీరు చెప్తుంటే కొంత కాలం క్రితం నేను పొందిన అనుభూతి గుర్తుకొచ్చింది. వివరం ఈ లింకులో
http://palakabalapam.blogspot.com/2009/04/blog-post_6737.html
విశ్వకవి జయంతి రోజు ఆయన కవితల్ని మాకందించారు .కృతఙ్ఞతలు .
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
చందురువర్ణుని యందచదమును హృదయారవిందమునఁజూచి బ్రహ్మానంద మనుభవించు వారెందరో..
అలాంటి మహానుభావులలో రవీంద్రుని పేరు తప్పకుండా చేర్చుకోవచ్చు. దానికి ఒక పూర్తి వ్యాసం యొక్క అవసరం కూడా లేదు. గీతాంజలి తెఱచి, మొదటి వాఖ్యం చదివితే చాలు. 🙂
Thou hast made me endless, such is thy pleasure. This frail
vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.
చందురువర్ణుని అందం. ఆహాః .
i went through a wonderful feeling after reading dis. its incredible. congrats !!!