కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం!

– రంగనాయకమ్మ

‘పొద్దు.నెట్’ పత్రికలో వచ్చిన నిడదవోలు మాలతి గారితో ఇంటర్వ్యూ చూశాను. దానిలో, “రంగనాయకమ్మ రాసిన పుస్తకంలో నా కధని వాడుకున్న తీరుకి నా అభ్యంతరాలు” అన్న ఉపశీర్షిక కింద మాలతి గారు నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. వాటికి నా సమాధానం ఇదీ:
—————————-
మాలతి గారు తన ఇంటర్వ్యూలో, తను రాసిన కధ పేరు ప్రస్తావించారు (“నిజానికీ ఫెమినిజానికీ మధ్య”). కానీ ఆమె కధని ఏ పుస్తకంలో నేను వాడుకున్నానని ఆమె అన్నారో, ఆ పుస్తకం పేరు చెప్పలేదు. ఆ పుస్తకం పేరు: “అసమానత్వంలోనించి, అసమానత్వంలోకే! [స్త్రీ-పురుష సంబంధాల గురించి బూర్జువా ఫెమినిస్టులు చేసే వాదనలను మోర్గాన్, ఏంగెల్స్, లెనిన్‌ల సూత్రీకరణల ఆధారంగా విమర్శించిన వ్యాసాలు!]” 1989 సెప్టెంబర్‌లో మొదటిసారి వచ్చిన ఈ పుస్తకం, ఇప్పటికి 4 ముద్రణలు పడింది.

ఇప్పుడు వరసగా ఆమె ఆరోపణలూ, నా జవాబులూ!

మాలతి గారి మొదటి ఆరోపణ: “అసలు ఆ పుస్తకం మంచి రచయితకి వుండ వలసిన సంయమనంతో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేదిగా కాక, తనకి మరెవరి మీదో వున్న కక్ష తీర్చుకోడానికి రాసింది. నా కధని ఒక ఆయుధంగా వాడుకున్నట్టు కనిపిస్తుంది.”

ఆ పుస్తకాన్ని ఎందుకు, ఏ సందర్భంలో రాశానో మొదటి ముద్రణకు రాసిన ముందు మాటలోనే చాలా వివరంగా చెప్పాను. మాలతి గారి మొదటి ఆరోపణకు, ఆ ముందు మాటే జవాబు చెబుతుంది. దాన్ని ‘పొద్దు’ పాఠకుల కోసం ఇక్కడ తిరిగి ఇస్తున్నాను.

ముందు మాట
(మొదటి ముద్రణకు రాసినది)

” ‘మూడు తరాలు’ అని ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది, మీరు చూశారా? దాని మీద మీరు తప్పకుండా ఏదన్నా రాయాలి” అనీ, “ఏమన్నా రాస్తున్నారా?” అనీ, ఆ పుస్తకం వచ్చిన కొత్తలో నాకు కొన్ని ఉత్తరాలు వచ్చాయి.
ఆ ఉత్తరాలన్నిటికీ నేను ఒకటే సమాధానం రాశాను – “ఆ పుస్తకం బాగోలేదని మీరంటున్నారు కదా? ఆ మాటే ఏదన్నా పత్రిక్కి మీరే ఎందుకు రాయరూ? ఏం బాగో లేదో మీకెలా అనిపిస్తే అలా మీరే రాయండి. కావాలంటే, మీరు రాసింది ఒకసారి నాకు పంపించండి. నా అభిప్రాయం చెపుతాను” అని.
ఆ తర్వాత కొన్నాళ్ళకి హైదరాబాదులోనే కొందరు కాలేజీ అమ్మాయిలు ఏడెనిమిది పేజీల వ్యాసం ఒకటి రాసి పట్టుకొచ్చారు. కొన్ని పాయింట్లు రాశారు గానీ, అది చాలా తక్కువ. కనీసంగా చెప్పవలసిన దాంట్లో పదోవంతు కూడా రాలేదు అందులో. పైగా, చెప్పిన విషయాలు ఒక వరసలో లేవు.
“సరే, నేను ఇంకా కొన్ని పాయింట్లు చేర్చి అన్నీ ఒక వరసలో పెట్టి ఇస్తాను. తర్వాత మీరు మళ్ళీ రాయండి” అన్నాను.
ఆ రోజే నేను, అదే విషయం మీద, ఇంకొకరికి కూడా టైము ఇచ్చి ఉండడం వల్ల, ఇద్దరు ‘లా’ కాలేజీ అబ్బాయిలు కూడా ఒక వ్యాసం తీసుకొచ్చారు. కొంతమంది స్టూడెంట్సు కలిసి డిస్కస్ చేసుకుని అది రాశామని చెప్పారు. అందరం కలిసి ఆ వ్యాసం కూడా చదివాము. దాన్ని ఇంకా సరిచేసి మళ్ళీ రాసి ఏదన్నా పత్రిక్కి పంపిస్తామని ఆ స్టూడెంట్సు అన్నారు.

అమ్మాయిల వ్యాసం గురించి, ‘రెండు రోజుల్లో కొంచెం మార్చి, కొన్ని పాయింట్లు చేర్చి ఇస్తాన’ని అమ్మాయిలతో చెప్పాను. ఆ వ్యాసానికి ఇంకో 50 పాయింట్ల దాకా చేర్చాను. ప్రారంభం మార్చి, అన్నీ ఒక వరసలో పెట్టి, దాన్ని తర్వాత ఆ అమ్మాయిలకు చూపించాను. వాళ్ళు దాన్ని చూసి, “ఇదంతా మేము రాయడం కష్టం, మీరే రాయండి” అని దాన్ని వదిలేసి వెళ్ళారు. తర్వాత నేనే దాని పని చేశాను.

‘మూడు తరాలు’ కధ చాలా చిన్న కధే. లెనిన్ కాలం నాటి కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, ‘స్త్రీ పురుష సంబంధాల’ గురించి మార్క్సిస్టు దృష్టితో చెపుతున్నానంటూ రాసిన కధ కావడమే ఈ కధ ప్రత్యేకత. ‘ఈ కధ, స్త్రీలకు గొప్పగా ఉపకరిస్తుందని ఇప్పుడు ఒక ‘స్త్రీల సంఘం’ ఈ కధని పూర్తిగా సమర్థించడం ఇంకో ప్రత్యేకత. (ఈ వివరాలన్నీ వ్యాసంలో ఉన్నాయి.)

‘స్త్రీ పురుష సంబంధాల’ గురించి అనేక హేతు విరుద్ధ మార్గాలు గతంలో కన్నా విజృంభించి, మారిన రూపాలతో ప్రచారమవుతోన్న ఈనాడు ఇది తేలిగ్గా వదిలి వెయ్య వలసిన విషయం కాదు.

వ్యాపార పత్రికల్లో లక్ష రకాల తప్పుడు సాహిత్యం వస్తూ ఉంటుంది. కానీ, అది “అభ్యుదయం”గానో, “విప్లవం”గానో పోజు పెట్టదు. అది ‘వ్యాపార’ సాహిత్యం’ అని రాసే వాళ్ళకీ, వేసే వాళ్ళకీ, చదివే వాళ్ళకీ, తెలుస్తూనే ఉంటుంది. దాని ప్రభావంలో పడే పాఠకులు కూడా ‘అభ్యుదయ మార్గం’లో సాగిపోతున్నామని తాము భావించడం గానీ, ఇతరులకు బోధించడం గానీ, చెయ్యరు. తాగుళ్ళూ, మత్తు మందులూ అలవాటైపోతూ ఉన్నట్టే, వ్యాపార సాహిత్యం కూడా ఒక వ్యసనంలా అలవాటైపోతూ ఉంటుంది. అది తెలిసిపోతూనే ఉంటుంది.
కానీ, ఈ ‘నూతన ఉద్యమాల’ పోజుతో వచ్చే సాహిత్యంతోనే పాఠకులు గందరగోళ పడతారు. ఆ ఉద్యమంలోకి ‘మార్క్సిజం’ అనే మాట కలిస్తే ఆ గందరగోళం వెయ్యి రెట్లవుతుంది.

‘మార్క్సిజం’ అనే సిద్ధాంతానికి, సహజంగానే బలం ఉంది. సత్యానికీ, న్యాయానికీ ఉండే బలం అది! అయితే, దాన్ని గ్రహించడంలో ఉండే అనేక అస్పష్టతల వల్లా, దాన్ని ఆచరించవలసిన నాయకులే దానికి విరుద్ధమైన బూర్జువా భావజాలంలో పడి కొట్టు కుంటూ ఉండడం వల్లా, మార్క్సిజం ఇంకా ఇంకా పెద్ద పెద్ద అపజయాల మీదుగా సాగుతోంది. అది ఎన్ని అపజయాలు పొందినా, ఆ సిద్ధాంతంలో అంతర్గతంగా ఉన్న శక్తి వల్ల, ఒక బూర్జువా సిద్ధాంతం కూడా ‘మార్క్సిజం’ ముసుగు వేసుకోగానే, ఆ మాటతోనే, అది అనేక భ్రమలు కల్పిస్తుంది.
‘మూడు తరాలు’ కధ రాసింది ఒకప్పటి రష్యన్ కమ్యూనిస్టు నాయకురాలు కాబట్టి, ఆ కధలో ఏదో ‘నూతన మార్గం’ ఉన్నట్టుగా కొందరు పాఠకులైనా భావిస్తారు. అయితే, ఆ రకం భావాల్ని లెనిన్ లాంటి మార్క్సిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారనే విషయం మాత్రం ఆ పుస్తకం ద్వారా తెలీదు.

అలాగే, ఒక “స్త్రీల సంఘం” అనేది, స్త్రీల గురించి ఏమైనా చెప్పగానే, “స్త్రీల గురించి స్త్రీలే చెపుతున్నారు కాబట్టి ఇది కరక్టే అయివుంటుంది” అనిపిస్తుంది. కానీ, ఒక ‘స్త్రీల సంఘం’ చెప్పేదే స్త్రీలందరి అభిప్రాయం కాదనీ; స్త్రీలలో కూడా బూర్జువా వర్గ స్త్రీలూ, శ్రామిక వర్గ స్త్రీలూ ఉన్నారనీ; శ్రామిక వర్గ స్త్రీలలో కూడా బూర్జువా వర్గ భావాలతో కొట్టుకుపోయే వాళ్ళు ఉన్నారనీ – చాలామంది పాఠకులకు తెలీదు.
పాఠకుల్లోనే రెండు వర్గాలూ ఉన్నారు!

‘వర్గ సమాజం’లో సంఘాలూ, ఉద్యమాలూ వర్గాతీతమైనవి కావు. ‘స్త్రీల సంఘాలు’ అనగానే అవి తప్పని సరిగా స్త్రీలకు మేలు చేస్తాయనీ, ‘కార్మిక సంఘాలు’ అనగానే అవి తప్పని సరిగా కార్మికులకు మేలు చేస్తాయనీ, ‘జాతీయ పార్టీలు’ అనగానే అవి తప్పని సరిగా ‘జాతి’కి మేలు చేస్తాయనీ – ఇలా, భావిస్తూ పోతే, అంతకన్నా పెద్ద భ్రమ ఏదీ ఉండదు.

కాబట్టి, సంఘాలకీ, ఉద్యమాలకీ ఉండే ‘పేర్లు’ ముఖ్యం కాదు. వాటి ‘సారాంశం’ ముఖ్యం! ఒక వ్యక్తి గానీ, ఒక సంఘం గానీ, ఒక ఉద్యమం గానీ, ఏం చెప్పినా, దాన్ని “హేతుబద్ధతగల తర్కం”తో విమర్శించి చూడాలి. ఆ పరీక్షలో నిలబడినదాన్నే సరైనదాన్నిగా గ్రహించి తీసుకోవాలి.
‘మూడు తరాలు’ కధ మీద నేను రాసిన వ్యాసం ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో 10-2-89 సంచిక నించీ, 14-4-89 సంచిక వరకూ 10 వారాల పాటు వచ్చింది.

ఆ తర్వాత 8 వారాల పాటు దాని మీద అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కొన్ని ఉత్తరాలు కూడా వచ్చాయి. ఆ ఉత్తరాల్లో అనుకూలమైన వాటి గురించి చెప్పవలసిందేమీ లేదు కాబట్టి, వ్యతిరేకమైన 5 ఉత్తరాల్నీ, ఉత్తరం కాని ఇంకో విమర్శనీ ఎంచుకుని, వాటికి జవాబులు రాశాను. ఆ జవాబులన్నీ ఈ పుస్తకంలోనే “వ్యాసం తర్వాత …” అనే చాప్టరులో ఉన్నాయి.
ఆ రకం ధోరణుల్లో మరింత ప్రత్యేకత గల ధోరణి “అతడి బిడ్డ సిద్ధాంతం!” ఇదేమిటో అక్కడే చూడండి.
తర్వాత, ముగింపు సూచనలు!

– రంగనాయకమ్మ
4-9-1989

ఆ వ్యాసం రాసిన సందర్భాన్ని ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా, “మరెవరి మీదో కక్ష తీర్చుకోడానికి” రాసినట్టూ, తన కధని నేను “ఒక ఆయుధంగా వాడుకున్న”ట్టూ మాలతి గారు అంటే, ఇక దానికి మళ్ళీ చెప్పవలసిందేమీ లేదు.

మాలతి గారిని నేను అడగగలిగేది ఒకటే. “మరెవరి మీదో కక్ష తీర్చుకోడానికి” మీ కధని “ఒక ఆయుధంగా వాడుకున్న” నన్ను, నేను రాసిన “ఆర్తనాదం” కధని ఇంగ్లీషులోకి అనువదించుకోడానికి అనుమతి ఎందుకు అడిగారు? ఎందుకు అనువదించారు? అనువదించాక, మరి కొన్ని కధలతో, ఒక సంకలనంలో నా కధని కూడా చేర్చుకోడానికి మళ్ళీ అనుమతి ఎందుకు అడిగారు?

సంకలనంలో వేసుకోడానికి అనుమతి ఇస్తూ, ఇతరుల రచనల అనువాదాల సంకలనాన్ని సంకలన కర్తలు, తమవారికి అంకితాలివ్వడం చూశాననీ, అలా అంకితాలిచ్చే వుద్దేశం వుంటే మాత్రం, నా కధని చేర్చవద్దనీ నేను అన్నాను. అలాంటి అనుమతి మీకు ఇవ్వనందుకే, మీరు “కక్ష” గట్టి, ఈ ఇంటర్వ్యూ సందర్బాన్ని “ఒక ఆయుధంగా” వాడుకున్నారని, నేను అంటే ఎలా వుంటుంది? కాబట్టి, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం ఎవరికీ మంచిది కాదు. ‘కాలు జారితే తీసుకోవచ్చు గానీ, నోరు జారితే తీసుకోలేం’ అనే సామెత తెలుగులో వున్నదే!

ఇక, మాలతి గారి రెండో ఆరోపణ. “నా రెండో అభ్యంతరం – నా కధలో ఒక వాక్యాన్ని తీసుకుని “మార్చి” వాడుకున్నానని చెప్పడం. నిజానికి నా దృష్టిలో అది సామాన్యంగా అలాంటి సందర్భంలో తేలిగ్గా ఎవరయినా అనగలిగిన వాక్యం. దాన్ని ఆవిడ “మార్చడం”లో నేనేదో అసభ్యకరమయిన మాట రాసినట్టు, తాను దాన్ని శిష్టజన వ్యావహారికం చేసినట్టు ధ్వని వుంది. నా కధలో వాక్యం భార్యకీ, వెలయాలికీ గల తారతమ్యం ఎత్తి చూపుతుంది. రంగనాయకమ్మ వాక్యానికి (మీ ప్రేయసులలో ఒక ప్రేయసిగా వుండను) ఆ అర్థం రాదు. అంచేత అది పూర్తిగా ఆవిడ వాక్యమే. అక్కడ నా వాక్యమేదో తాను వాడుకున్నాననడం అనవసరం.”

మాలతి గారి ఈ ఆరోపణ ఎంత నిరాధారమో తెలియాలంటే, నా పుస్తకంలో, ఆమె కధని ప్రస్తావిస్తూ నేను ఇచ్చిన పెద్ద ఫుట్ నోట్‌ని, ‘పొద్దు’ పాఠకుల కోసం, తిరిగి ఇక్కడ ఇవ్వక తప్పదు.

“నీ ప్రియుల్లో ఒక ప్రియుడిగా నేను ఉండదల్చుకోలేదు” – అనే మాటల్ని నేను ‘నిడదవోలు మాలతి’ అనే రచయిత్రి రాసిన ఒక కధ ఆధారంతో తయారు చేశాను. మాలతి, (23.9.1987 ‘ఆంధ్రప్రభ’ వీక్లీలో) “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” అనే కధ రాసింది. ఆ కధ ఏమిటంటే: ఇద్దరు తెలుగు భార్యాభర్తలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. భర్త, ప్రొఫెసరు. ఇతను సరిగ్గా ‘మూడు తరాలు’ కధలో ‘యం’ లాంటి తిరుగుబోతు. పైకి మాత్రం ‘స్త్రీల హక్కులూ స్వేచ్చలూ సమస్యలు’ అని మాట్లాడుతూ ఉంటాడు. (‘యం’ కైతే ఈ ‘స్త్రీల హక్కుల’ పోజు లేదు). ఈ భర్త ‘విజిటింగ్ ప్రొఫెసరు’గా ఇండియాకి వచ్చి పోతూ ఉంటాడు. ఇతను ఇండియాలో ఉన్న (హైదరాబాదులోనో ఎక్కడో, కధలో వివరాలు లేవు) తెలుగు ప్రియురాళ్లతో తిరిగే సంఘటనలే కధలో ప్రధానంగా ఉంటాయి. ఈ ప్రియురాళ్ళు కూడా భర్తలూ, బిడ్డలూ ఉన్నవాళ్ళే. అందులో ఒకామె కవయిత్రి కూడానట! ఈ ప్రియురాళ్ళు అమెరికాలో ఉన్న ప్రొఫెసర్ ప్రియుడికి ప్రేమలేఖలు మిడుకుతూ ఉంటారు. “34 నెంబరు బ్రాలు తీసుకురండి. బంగారం తీసుకురండి. కెమేరా తీసుకురండి. నైలాన్ కోకలు తీసుకురండి” ఇదీ ప్రేమలేఖల్లో భాగోతం! ఇదంతా ‘నిజమైన ప్రేమ’ అనీ, దేనికీ ఆశించి చేసే వ్యభిచారం కాదనీ, ఈ బాపతు వాళ్ళు అంటారనుకోండీ! సంఘంలో మర్యాదల కోసం వెనకాల భార్యలూ, భర్తలూ ఉండవలసిందే. కానీ వాళ్ళు పాతబడిపోతూ ఉంటారు. భార్యలూ, భర్తలూ నచ్చకపోతే వాళ్ళతో విడిపోకుండా వాళ్ళని అలా ‘రిజర్వ్’లో ఉంచి, బయట వ్యవహారాలు నడుపుతూ ఉంటారు.

ప్రొఫెసర్ గారికి ప్రియురాళ్ళు మిడికే ప్రేమలేఖలు అతని భార్య చేతుల్లో పడతాయి. ఆ ఇంట్లో ఆ బాపతు ఉత్తరాలు, పుస్తకాల్లోనూ, అలమార్లలోనూ, టేబుళ్ళ మీదా కుర్చీలకిందా ఎక్కడికక్కడే దొర్లుతూ ఉంటాయి. ఆ ఉత్తరాలు చూసిన భార్య, చాలా బాధపడుతూ భర్తని అడుగుతుంది. భర్త, తన నైజానికి తగ్గట్టుగా చాలా సహజంగానే, అబద్ధాలు చెప్పుకొస్తాడు. ‘శోభ రచయిత్రి. తెలుగు రచయిత్రులు ఏవేవో ఊహల్లో తేలుతూ ఉత్తరాల్లో అలాగే రాస్తారు కదా? అంతకన్నా ఏం లేదు’ అని ఒకామె గురించి చెబుతాడు. ఇంకో ఆమె గురించి, ‘గాయత్రి ఈమధ్య కొంచెం మానసికంగా అనారోగ్యంగా ఉంది. ఆమెకి ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఆమె మీద సానుభూతితో స్నేహంగా రాస్తున్నాను. అంతే’ అని చెపుతాడు. ఇవన్నీ అబద్ధాలని భార్యకీ తెలుసు. కానీ, తెగించే ధైర్యం లేక ‘ఏమో, నేను అనవసరంగా అపోహలు పడుతున్నానేమో. అతను చెప్పేదంతా నిజమేనేమో’ అని ఆత్మవంచన చేసుకుంటూ కొంతకాలం గడుపుతుంది. భర్తకి ఇండియా నించి వచ్చే ప్రేమలేఖలు ఆగవు. పైగా టెలిగ్రాములూ, ఫోను సంభాషణలూ కూడా సాగుతూ ఉంటాయి. భార్య ఇక సహించలేక ఒక రోజు తన సామానంతా సర్దేసుకుని, అతను ఇంటికి రాగానే, “నేను వేరే ఎపార్టుమెంటులోకి వెళ్ళిపోతాను’ అని చెప్పేస్తుంది.

‘మీలాంటి మేధావులు బృహత్ గ్రంథాలు రాసీ, చదివీ, అవే వల్లె వేసి కాలం గడుపుతారు. మరో పక్క శోభలూ, గాయత్రులూ అనుభూతులూ, సానుభూతులూ అంటూ ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటారు. వాళ్ళు ఆర్తులు. మీరు ఆర్తత్రాణ పరాయణులు! మీకు వాళ్ళూ, వాళ్ళకి మీరూ చాలా అవసరం. మీ జాతికీ, వాళ్ళ జాతికీ చెందని నూటికి తొంభై తొమ్మిది మందిలో నేనొక దాన్ని. నేను నెమ్మదిగా సావకాశంగా నాటు బండిలో రోజులూ వారాలూ గడుపుకుంటూ బతుకుతాను… మీ ముండల్లో ఒక ముండగా నేనుండదల్చుకోలేదు” అని చెప్పేస్తుంది. (ఈ భార్య, భర్త నించి విడిపోయే క్షణాల్లో కూడా అతన్ని ‘మీరు’ అనడం బాగా లేదు గానీ, అది పాత అలవాటు. ఆ మాట కన్నా, ఆత్మ గౌరవంతో ఆమె చేసిన పనే ముఖ్యం.)

కొన్నాళ్ళ కిందట చదివిన ఈ కధలో ఆ చివరి మాటలు బాగా నచ్చడం వల్ల, అవి నాకు బాగా గుర్తున్నాయి. ఈ వ్యాసంలో, కాన్‌స్టాన్‌టిన్ పాత్రని విమర్శించేటప్పుడు, ఆ మాటలే కొంచెం మార్చి ‘నీ ప్రియుల్లో, ఒక ప్రియుడిగా నేనుండ దల్చుకోలేదు‘ అని వాడాను. స్త్రీ అయినా పురుషుడైనా, భర్తనించో, భార్యనించో అవమానం ఎదురైనప్పుడు తక్షణం అనవలసిన మాటలు అవి.”

మాలతి గారి కధని ప్రస్తావించిన సందర్భంలో, ఎక్కడైనా “మీ ప్రేయసులలో ఒక ప్రేయసిగా వుండను” అనే వాక్యం వుందా? నేను రాయని వాక్యాన్ని తీసుకొచ్చి, నాకు అంటగట్టడాన్ని ఏమనాలి? మాలతి గారి మాటలే వాడాలంటే, దాన్ని “కక్ష” అనాలా? “విశ్లేషణా లోపం” అనాలా? “ఆత్మవంచన” అనాలా?

తన కధలో భార్య చేత మాలతి గారు చెప్పించిన వాక్యం ఏమిటి? “మీ ముండల్లో ఒక ముండగా నేనుండ దల్చుకోలేదు” అని. ఈ వాక్యాన్ని నేను యధాతథంగానే వుంచాను. అది ఎంతో నచ్చింది నాకు.

ఈ పద్ధతిలోనే, నేను విమర్శించిన ‘మూడు తరాలు’ కధలో ఒక భర్త పాత్ర అలా అనవల్సిందనీ, కానీ అలా అనలేదనీ అంటూ నేను రాసిన వాక్యం ఏమిటి? “నీ ప్రియుల్లో, ఒక ప్రియుడిగా నేనుండదల్చుకోలేదు” అని. ఇక్కడ నేను మాలతి గారి వాక్యాన్ని వక్రీకరించినది గానీ, ‘శిష్ట జన వ్యావహారికం’ చేసినది గానీ ఏమిటి?

ఎవరి మీదైనా విమర్శ చేసేటప్పుడు, “మంచి రచయిత” ఎలా వుండాలని మాలతి గారు ఉద్బోధించారో, ఆ “సంయమనమూ”, ఆ బాధ్యతా ఆమెకి వుండొద్దూ?

—————–

ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి పొద్దుకు ఇచ్చిన ఇంటర్వ్యూ

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

38 Responses to కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం!

  1. రంగనాయకమ్మ గారు పొద్దు చదువుతారు అంటే, వినడానికి ఎంతో ఆనందంగా ఉంది. 🙂
    ఈ సమాధానం చదివాను. నాదో చిన్న వ్యాఖ్య:
    “మాలతి గారిని నేను అడగగలిగేది ఒకటే. “మరెవరి మీదో కక్ష తీర్చుకోడానికి” మీ కధని “ఒక ఆయుధంగా వాడుకున్న” నన్ను, నేను రాసిన “ఆర్తనాదం” కధని ఇంగ్లీషులోకి అనువదించుకోడానికి అనుమతి ఎందుకు అడిగారు? ఎందుకు అనువదించారు? అనువదించాక, మరి కొన్ని కధలతో, ఒక సంకలనంలో నా కధని కూడా చేర్చుకోడానికి మళ్ళీ అనుమతి ఎందుకు అడిగారు?”
    – దానికీ, మీరు ఆవిడ కథను వాడుకున్నారని ఆవిడ అనడానికి సంబంధం లేదు కదండీ. మీ కథలు నచ్చి అనువాదం చేయాలనుకున్నారు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి చేసింది నచ్చలేదని ప్రతి సందర్భంలోనూ ఆ వ్యక్తి ఏది చేసినా నచ్చకూడదు అనలేము కదా…

  2. మాలతి గారి జవాబు కోసం చూస్తున్నాను.

  3. రంగనాయకమ్మగారి సమాధానం చూశాను.
    ఈవిషయం నాకు తలకు మించినది. నిజానికి వాదోపవాదాలు చేతకాదు.
    ఇక్కడ నేను ఇచ్చింది ఇంటర్వూ. ఆదిలోనే చెప్పేను నాకు గుర్తున్నంతవరకూ నా అభిప్రాయాలు చెప్తానని. ఆవిడ పుస్తకం చదివినపుడు నాకు కలిగిన అభిప్రాయాలు అవి. అవి పొరపాటు కావచ్చు కానీ అందులో కాలు జారడం ఏమీ లేదు. నిజానికి రంగనాయకమ్మగారు కూడా తాము వెలిబుచ్చిన అభిప్రాయాలు మార్చుకున్న సందర్భాలు వున్నాయి. ఆమె వాటిని కాలు జారడం అనలేదు కదా.
    నాకు కక్షలు లేవు కనకనే అనువాదాలు చేసేను. ఆమెకి అభ్యంతరం కనకనే నాసంకలనంలో ఆమెకథకి నాఅనువాదం చేర్చుకోలేదు.
    మంచిరచనకి వస్తునిష్ఠ ముఖ్యం. పైసమాధానంలో అనువాదాలచర్చ అసందర్భం.
    సంయమనం అంటే ఎలా చెప్పాలో నాకు తెలీదు.
    కాగా, ఈ సమాధానంవల్ల నాకథకీ, రంగనాయకమ్మ పుస్తకానికీ మరో విడత ప్రచారం వచ్చింది. అందుకు పొద్దువారికి ధన్యవాదాలు.

  4. వేణు says:

    మాలతి గారి సమాధానం కన్విన్సింగ్ గా లేదు. అంతా స్పష్టంగా ఉన్న సందర్భంలో కూడా ‘ఈ విషయం నాకు తలకు మించినది’ అనీ, ‘వాదోపవాదాలు చేతకాదు’ అనీ, ‘సంయమనం అంటే ఎలా చెప్పాలో నాకు తెలీదు’ అనీ తప్పుకోవాలని ప్రయత్నించటం సబబు కాదు.
    ఇంటర్వ్యూ ఇచ్చినపుడు గుర్తున్నంతవరకూ చెప్పారు సరే, ఇప్పడు రంగనాయకమ్మ గారి సమాధానం చూశాక జరిగిన పొరపాటును గుర్తించగలిగే అవకాశం వచ్చింది కదా? రంగనాయకమ్మగారు రాయని వాక్యాన్ని తీసుకొచ్చి, ఆమెకు అంటగట్టడం గురించి విచారం ప్రకటిస్తే బావుండేది కదా!

    ‘ఈ సమాధానంవల్ల నాకథకీ, రంగనాయకమ్మ పుస్తకానికీ మరో విడత ప్రచారం వచ్చింది’ అనటం ఈ సందర్భంలో పూర్తిగా అనవసరం.
    ‘నిజానికీ ఫెమినిజానికీ మధ్య’లాంటి చక్కని కథను రాసిన రచయిత్రి నుంచి ఇలాంటి స్పందనను నేను ఊహించలేదు.

  5. జె. యు. బి. వి. ప్రసాద్ says:

    రంగనాయకమ్మ గారి స్పందనకి మాలతి గారి ప్రతి స్పందన చదివాక, కొన్ని ప్రశ్న లుద్భవించాయి.
    1. “ఆవిడ పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన అభిప్రాయాలు అవి” అని మాలతి గారు అన్న దాంట్లో అర్థమే కనిపించ లేదు. అలా అని ఎందుకనిపించింది? మాలతి గారి వాక్యాన్ని మార్చకపోతే, మార్చినట్టు మాలతి గారికి ఎందుకు అనిపించింది? మాలతి గారి వాక్యాన్ని యథాతథంగా వుంచినపుడు, అలా అనిపించడంలో అర్థం ఏమన్నా వుందా? మాలతి గారి జవాబు మాలాంటి పాఠకులకి ఏ మాత్రమూ సబబుగా లేదు.
    2. “కాలు జారడం” గురించి రంగనాయకమ్మ గారు ఏమని రాశారూ? అందులో తప్పు లేదనే రాశారు (వేరే చెడ్డర్థాలు తీసుకోకుండా). ఫరవాలేదనే రాశారు. “నోరు జారడం” గురించే తప్పని అన్నారు. ఆ విషయం వదిలేసి, అభిప్రాయాలు మార్చుకోవడాన్ని కాలు జారడంతో పోల్చుకుంటూ వుంటే ఏవన్నా అర్థం వుందా? నోరు జారడం సంగతి ఏమయ్యిందీ? “తప్పు అభిప్రాయాలు ఏర్పరచుకోడం” లాంటి ‘కాలు జారడాలు’ ఎవరన్నా సరిదిద్దు కోవచ్చు. వాక్యాలని సరిగా అర్థం చేసుకోక పోతే ఏమనాలి?
    3. “ఇంటర్వ్యూ ఇచ్చినపుడు ఆ పుస్తకం లోని విషయాలు సరిగా గుర్తు లేవు. అది పొరపాటయ్యింది” అని అంటే ఎంత చక్కగా, ఎంత గంభీరంగా, ఎంత హుందాగా వుండేదీ? “నేను మళ్ళీ చెక్ చెయ్యకుండా తప్పుగా రాశాను” అని అనంటే ఎంత నిజాయితీగా వుండేదీ?
    4. “నాకు కక్షలు లేవు కనకనే అనువాదాలు చేసేను” అని మాలతిగారు, రంగనాయకమ్మ గారు ‘కక్షని ఇంటర్వ్యూ సంధర్భంలో వాడుకున్నారా’ అని అడిగిన దానికి బదులుగా రాశారు. అనువాదం చేసే సమయానికి మాలతి గారికి ‘కక్ష’ వచ్చే పరిస్థితి లేదు. ‘అంకితాల’కి వ్యతిరేకంగా రంగనాయకమ్మ గారు మాలతి గారికి సంకలనంలో ఆ అనువాదాన్ని చేర్చడానికి అనుమతి ఇవ్వనపుడే, ఆ ‘కక్ష’ లాంటిది కలిగే అవకాశం వుంటుంది. ఇదీ ఇక్కడి తర్కం. అర్హ్తం చేసుకోలేక పోతే ఎలా?

    జె. యు. బి. వి. ప్రసాద్

  6. “నాకథకీ, రంగనాయకమ్మ పుస్తకానికీ మరో విడత ప్రచారం వచ్చింది. అందుకు పొద్దువారికి ధన్యవాదాలు.”

    మాలతి గారూ,
    రంగనాయకమ్మ గారి రచనలకు, ఇప్పుడు కొత్తగా ప్రాచుర్యం ఒకరివ్వాల్సిన పరిస్థితి ఉందంటారా? అలాగే మాలతి అనగానే గుర్తొచ్చే కథే ‘నిజానికీ…”! దానిక్కూడా ప్రాచుర్యం కొత్తగా రావలసిన పని లేదనుకుంటాను!

  7. valliswar says:

    This is an avoidable squabble in Telugu literary world.

  8. davidraj says:

    ranganayakamma vadana correct.

  9. రంగనాయకమ్మంతటివారు “నోరుచేసుకోవల్సిన” విషయం కాదే!
    మొత్తానికి సాహితీచర్చలుకూడా మన బ్లాగు వ్యాఖ్యుఅలస్థాయిల్లోనే జరుగుతాయన్నమాట. పెద్ద తేడా లేదు.

  10. వేణు says:

    మహేష్ కుమార్ గారూ, మీ వ్యాఖ్యలో ‘నోరు చేసుకోవల్సిన’ అనటం బాగా లేదండీ.

    రంగనాయకమ్మ గారిపై మాలతి గారు చేసిన రెండు ఆరోపణలూ అంత స్వల్పమైనవా?
    మొదటిది ఆమె రచన స్వభావాన్నే తప్పు పట్టిన తీవ్రమైన ఆరోపణ. రెండోది వక్రీకరణ అనదగ్గ ఆరోపణ.
    ఈ సందర్భంలో రంగనాయకమ్మ గారు స్పందించడం చాలా సరైన విషయం. లేకుంటే పాఠకుల్లో కొంతమందికి అయినా వాస్తవాలు తెలియకుండా పోయేవి.

  11. JR.NAGABHUSHANAM says:

    “ఒక సందర్భంలో ఒక వ్యక్తి చేసింది నచ్చలేదని ప్రతి సందర్భంలోనూ ఆ వ్యక్తి ఏది చేసినా నచ్చకూడదు అనలేము కదా?” అని రామసీతగారు విచిత్ర తర్కం చేశారు.
    మరెవరిమీదో కక్ష తీర్చుకోవడానికి ఇతరుల కథని వాడుకుంటే, అలా వాడుకున్న వ్యక్తికి నిజాయితీ లేదని అర్థం. అలాంటి వ్యక్తి ఏ సందర్భంలోనూ నచ్చకూడదు. అలా నచ్చడం అంటే, ఇవతలి వ్యక్తి తన అవసరం కోసం (ఆ అవసరం అనువాదానికి అనుమతి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు) దేన్నైనా భరిస్తుందని అర్థం. దీన్ని ‘అవకాశవాదం’ అనీ, ‘కెరీరిజం’ అనీ అంటారు.

  12. Bhushan says:

    “ఒక సందర్భంలో ఒక వ్యక్తి చేసింది నచ్చలేదని ప్రతి సందర్భంలోనూ ఆ వ్యక్తి ఏది చేసినా నచ్చకూడదు అనలేము కదా?” అని రామసీతగారు విచిత్ర తర్కం చేశారు.

    మరెవరిమీదో కక్ష తీర్చుకోవడానికి ఇతరుల కథని వాడుకుంటే, అలా వాడుకున్న వ్యక్తికి నిజాయితీ లేదని అర్థం. అలాంటి వ్యక్తి ఏ సందర్భంలోనూ నచ్చకూడదు. అలా నచ్చడం అంటే, ఇవతలి వ్యక్తి తన అవసరం కోసం (ఆ అవసరం అనువాదానికి అనుమతి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు) దేన్నైనా భరిస్తుందని అర్థం. దీన్ని ‘అవకాశవాదం’ అనీ, ‘కెరీరిజం’ అనీ అంటారు.

  13. అబ్బ వదిలేద్దురూ
    చాలా సమస్యలు కలిసి మాట్లాడుకున్నప్పుడు మబ్బుల్లా వీడిపోతాయి.వాళ్లిద్దరు నేరుగా కాకున్నా అన్నేరుగా అయినా మాట్లాడుకున్నారు కదా. మద్యలో మనం ఇంకా ఎగదొయ్యడమెందుకు

  14. ramani says:

    చావా కిరణ్ గారు భలె పరిష్కరించేస్తారు సమస్యలని ఇట్టే .. చిటికెన వేలితో తీసేసినట్లుగా.. “అబ్బా వదిలేద్దురూ ” అంటూ

    ఎటొచ్చి దీని వల్ల రంగనాయకమ్మగారి మరియు మాలతి గారి ప్రశ్న జవాబులు చదివే అవకాశం కల్పించిన పొద్దు వారికి చదువరులందరూ కృతజ్ఞతా హారం వెయ్యాల్సిందే.

    @ మాలతి గారు : వాదాలు పెంచుకోలేక సమాధానం చెప్పినట్లుగా ఉంది తప్పితే రంగనాయకమ్మగారికి సరి అయిన వివరణ ఇవ్వలేదని అనిపిస్తోంది. సుజాత గారన్నట్లు మీకు గాని రంగనాయకమ్మగారికి గాని మీ మీ రచనలకి ప్రాచుర్యం అవసరం లేదు.

  15. anonymous says:

    paina vaakyalu chesina vaaramdaru malathi garu rasimdi kani, ranganayakamma gaaru raasimdi kaani chadive chesaramtaara? JUBV, Sujata veellamtaa ranganayakamma gaari bhajana parulu. JUBV ayite aameku pedda bhajanaparuLLo okaru ani amdariki telisina vishayame. ranganayakamma gari vitamdavaadam (anni chotla amedi ade) ikkada evariki ardhamkaaledaa?

  16. Malakpet Rowdy says:

    LOl This is hilarious though –

    సాధారణంగా “నేను వ్రాసిన దానిని ఆవిడ వాడుకుంది” అని, “కాదు కాదు ఇది నా స్వంతం” అని కొట్టుకుంటూ ఉంటారు – ఇక్కడ గొడవ వేరేగా ఉన్నట్టుంది.

    “ఆవిడ వాక్యం ఆవిడ స్వంతమే – నాది కాదు” అని ఒకరు, “అబ్బెబ్బే ఇది ఆవిడదే నేను నిజంగా మార్చి వ్రాశాను” అని ఇంకొకరు :))

    Or am I getting something wrong?

  17. భూషణ్ says:

    తమ తమ అభిప్రాయాలు చెప్పడం “ఎగదొయ్యడం” కాదు.

    అనానిమస్ – పాఠకుల అభిప్రాయాలు కూడా చదివి అర్థం చేసుకోవడం చేతకాని మీకు రంగనాయకమ్మగారి వాదన వితండవాదమే.

    వితండవాదం అంటే తమ వాదనలో ఏమీ పస లేకుండా సాగదియ్యడం. సరైన వాదాన్ని కూడా వితండవాదం అంటే అది మూర్ఖత్వమే అవుతుంది.

    తమకు నచ్చినవారు తప్పులు చేసినా వెనకేసుకొచ్చేవాళ్లనే భజనపరులు అంటారు. రంగనాయకమ్మగారి వాదనని సమర్థిస్తే అది భజనపరత్వం అవదు.

  18. జె. యు. బి. వి. ప్రసాద్ says:

    అనానిమస్ గారి వాఖ్య చూశాను. ఇక్కడ జరుగుతున్నది ఒక చర్చ కదా? అందులో ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెబుతారు కదా? చర్చని ‘భజన’ అనడమేమిటీ? రంగనాయకమ్మ గారి వాదనని అనానిమస్ గారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, అనానిమస్ గారిని “మాలతి గారి భజన పరులు” అంటే వారేమంటారూ? మాలతి గారి వాదంతో అంగీకరిస్తున్న వారు “మాలతి భజన పరులూ”, రంగనాయకమ్మ గారి వాదంతో అంగీకరిస్తున్న వారు “రంగనాయకమ్మ భజన పరులూ” అయ్యేటట్టయితే, ఇక పాఠకులకి స్వయం ప్రతిపత్తి ఏముంది?
    ఒకరి అభిప్రాయాలను చదివి, అర్థం చేసుకుని, ఆపైన స్వంతం చేసుకుని, ఆ తర్వాత వాటిని అనుసరించడం గానీ, అనుసరించడానికి ప్రయత్నించడం గానీ చేస్తే, అది ‘భజన’ అవదు.
    అదీగాక, “రామాయణ విషవృక్షం” చదివి, నాస్తికత్వానికి సరైన అర్థాన్నీ, సమాజాన్ని ఎలా పరిశీలించాలీ అన్న విషయాన్నీ నేర్చుకుని, అనుసరించడమే ‘భజన’ అయితే, అవును, నేను రంగనాయకమ్మ గారి ‘భజన పరుడి’నే!
    “జానకి విముక్తి” చదివి స్త్రీపురుష సంబంధాల గురించి సశాస్త్రీయంగా అర్థం చేసుకుని, వాటిని అనుసరించడానికి ప్రయత్నించడమే ‘భజన’ అయితే, అవును, నేను రంగనాయకమ్మ గారి ‘భజన పరుడి’నే.
    “కాపిటల్” చదివి శ్రమ దోపిడినీ, పెట్టుబడిదారీ తత్వాన్నీ గ్రహించుకుని, చేతనయినంత వరకూ అనుసరించడానికి ప్రయత్నించడమే ‘భజన’ అయితే, అవును, నేను రంగనాయకమ్మ గారి ‘భజన పరుడి’నే.
    “అసమానత్వంలోంచి అసమానత్వంలోకే!” చదివి బూర్జువా ఫెమినిస్టుల గురించీ, స్త్రీపురుష సంబంధాల్లోని వైరుధ్యాల గురించీ అర్థం చేసుకోవడమే ‘భజన’ అయితే, అవును, నేను రంగనాయకమ్మ గారి ‘భజన పరుడి’నే.
    ఇలా చాలా రాసుకుంటూ పోవచ్చు. ఈ విధంగా ‘భజన పరుడి’ని అని అనిపించుకోవడం నాకు సంతోషమే!
    భూషణ్ గారన్నట్టు, తప్పులు చేసినా తమకి నచ్చిన వారిని సమర్థిస్తేనే, వారిని ‘భజన పరులు’ అంటారు. లేకపోతే వారి మీద కోపంతో విషం కక్కడమే అవుతుంది అలా విమర్శించడం. “వితండ వాదం”, “వితండ వాదం” అని పది సార్లు కేకలేస్తే ఏం ప్రయోజనం, ఏది వితంద వాదమో సశాస్త్రీయంగా చూప లేకపోయాక?
    దీనర్థం ప్రతీ ఒక్కరూ రంగనాయకమ్మ గారి వాదం తోనో, మాలతి గారి వాదం తోనో ఏకీభవించి తీరాలని కాదు. అయితే చర్చ లోకి వస్తున్నప్పుడు కొంచెం సభ్యతా, సంస్కారాలని ప్రదర్శించాలి. లేకపోతే అది బరి తెగించి ఒకరి నొకరు తిట్టుకోవడమే అవుతుంది. ఇంత కన్నా చెప్పడానికి ఏమన్నా వుంటుందని నేననుకోవడం లేదు. అర్థం పర్థం లేకుండా తిట్టే వాళ్ళని ఏమీ చెయ్యలేము.

    – జె. యు. బి. వి. ప్రసాద్

  19. Suresh T says:

    విషవృక్షం లాంటి చెత్త లో కూడా విషయాన్ని వెతికారంటే మీ భజనకు నిజంగా జోహార్లు. చూడబోతే ఆవిడ వ్రాసే చెత్తని సమర్ధించే ఆలిండియా భజనపరుల సంఘానికి అధ్యక్ష్యులు మీరేలా ఉన్నా

  20. dr.d.l.vidya says:

    nenu ranganayakammagari asamanatwam lonchi asamanatwam loke chadivanu.Ranganayakammagari vadana correct.Avida eppudu vitandavadam cheyya ledu.Avida abhimanulandaru avidani abhimaninchedi anduke.Avidani vitandavadi annavallanta vitandavadule.

  21. మాలతి గారి కథలోనూ, రంగనాయకమ్మ గారి పుస్తకంలోనూ వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. http://viplavatarangam.net/?p=11

    రచయితలు తెలిసి ఆ భాష వాడినా, తెలియక ఆ భాష వాడినా జనం కంఫ్యూజ్ అయిపోతారు. గద్దర్, శ్రీశ్రీ లాంటి వాళ్ళు వాడిన భాషని విమర్శించిన రంగనాయకమ్మ గారు ఈ విషయంలో భాషలో జాగ్రత్త ఎందుకు తీసుకోలేకపోయారు?

  22. భాష గురించి నేను వ్రాసిన వ్యాసం చదివి JUBV అనే ఒక సాహిత్యాభిమాని బాధ్యత రహితమైన సమాధానం కూడా పంపాడు. poddu.net లో చర్చించమని సలహా కూడా ఇచ్చాడు. చర్చించాల్సింది భాషని మెరుగు పరచడానికా, దిగజార్చడానికా? అతని సమాధానం గురించి http://viplavatarangam.net/?p=14 లో వ్రాసాను.

  23. పుస్తకం.నెట్ లో “అసమానత్వం నుంచి అసమానత్వంలోకే” పుస్తకం పై రివ్యూ వ్రాసింది నేనే. http://pustakam.net/?p=765 అప్పట్లో “విప్లవ తరంగం” వెబ్ సైట్ డిజైనింగ్ పూర్తవ్వలేదని ఆ రివ్యూని పుస్తకం.నెట్ కి పంపించాను.

  24. భూషణ్ says:

    మాలతిగారి కథలో ఒక పాత్ర, భర్త చేసిన మోసానికీ, రహస్య వ్యభిచార ప్రవర్తనకీ చాలా బాధపడి, కోపంతో, ఆ మాటలు (‘మీ ముండల్లో ఒక ముండగా వుండదల్చుకోలేదు’) అంటుంది.  ఒక పాత్ర అలా అనకూడదని ఎవరూ శాసించలేరు.  ఆ మాటల్ని పాత్ర అన్న మాటలుగా చూడాలిగానీ రచయిత్రినో, ఇంకొకరినో తప్పుపట్టడం సాహిత్య అవివేకం అవుతుంది.  యాంత్రికంగా సాహిత్య హితబోధలు చెయ్యడం మానుకోవాలి.  మాలతిగారు ఆ పాత్రచేత ఆ మాటలు అనిపించడం ఆ పాత్ర పరిస్థితికీ, సందర్భానికీ ఎంతో సముచితంగా వున్నాయి.  వాటిని రంగనాయకమ్మగారు తిరిగి సందర్భాన్ని ప్రస్తావిస్తూ రాశారు.

  25. యాహూ గ్రూప్స్ లో కనిపించిన నాగభూషణం, మీరూ ఒకరేనా? భాష విషయంలో తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా జనం కంఫ్యూజ్ అయిపోతారు. మళ్ళీ చదవండి:

    “చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ కూడా స్త్రీలని కించపరిచే భాష వాడే వాడు. “మొగుడు చచ్చినా ముండకి బుద్ధి రాలేదు” లాంటి అఫెన్సివ్ సామెతలు పలుకుతూ స్టూడెంట్స్ ని తిట్టేవాడు. ఒక స్టూడెంట్ “ముండ అంటే ఏమిటి” అని మాస్టర్ ని అడిగాడు. “పూర్వం భర్త చనిపోయిన స్త్రీలకి బలవంతంగా గుండు గియ్యించి తెల్ల చీర కట్టేవాళ్ళు, గుండు గియ్యంచబడిన స్త్రీని ముండ అనేవాళ్ళు” అని మాస్టర్ అన్నాడు. “ఇప్పుడెవరూ ఆడవాళ్ళకి గుండు గియ్యించడం లేదు కదా, మరి ముండ అనే పదం ప్రయోగించడం ఎందుకు సర్?” అని నేను అడిగాను. అతను సమాధానం చెప్పలేకపోయాడు. నేను చదివినది ఇంగ్లిష్ మీడియం స్కూల్ లోనే. రంగనాయకమ్మ గారు, మాలతి గారు చదువుకునే రోజుల్లో ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు లేకపోయి ఉండొచ్చు. వాళ్ళకి నా కంటే బాగా తెలుగు తెలిసి ఉండాలి. నా కంటే బాగా తెలుగు తెలిసినవాళ్ళే ఈ విషయంలో భాషా దోషానికి పోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.”

  26. భాష విషయంలో గద్దర్ ని, శ్రీశ్రీని విమర్శించిన రంగనాయకమ్మ గారు ఈ విషయంలో భాషా దోషానికి పోవడం మరో విచిత్రం.

  27. రంగనాయకమ్మ గారు తన వ్యాసాలలో గద్దర్, శ్రీశ్రీ తదితరుల భాషని ఎలా విమర్శించారో short discriptions నా బ్లాగ్ లో వ్రాసాను.
    http://telugu.stalin-mao.net/2009/05/26/442
    గద్దర్, శ్రీశ్రీలు తెలిసి తెలిసి తప్పులు చేశారు కానీ తెలియక భాషా దోషానికి పోయినా ప్రోబ్లంస్ వస్తాయి.

  28. Sree says:

    మార్తాండ గారితో అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను…

  29. Sree says:

    *ముద్రారాక్షసం 🙁
    మార్తాండగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

  30. తెలియక అనేక పదాలని wrong context లో వాడుతాం కానీ తెలిసిన తరువాత తప్పు ఒప్పుకోవాలి. వీరేశలింగం గారు భర్త చనిపోయిన స్త్రీలకి మళ్లీ పెళ్ళిళ్ళు చేసేవారు. వీరేశలింగం గారి అభిమానులే భర్త చనిపోయిన స్త్రీలని కించ పరిచే “ముండ మోపి” లాంటి పదాలు వాడితే వీరేశలింగం గారి వారసత్వం(legacy)కి ఎంత అవమానం? తెలియక తెలియక wrong contextలో అలాంటి పదం వాడినా అర్థం తెలిసిన వాళ్ళకి బాధ కలుగుతుంది. Moreoverగా ఇది ఆడవాళ్ళకి అవమానకరం. మగవాడినైన నాకే ఇలాంటి పదాలు వినడానికి సిగ్గేస్తోంటే ఆడవాళ్ళకి ఇంకెంత సిగ్గెయ్యాలి? వీరేశలింగం, చలం లాంటి మహామహుల రచనలు చదివితే సరిపోదు, ఆచరణలో కూడా వారి సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి.

  31. dr.d.l.vidya says:

    ranganayakamma gari bhashalo gani malathi gari bhshalo gani emi tappu ledu. A bhasha vallu vadinattu avadu. Adi a pathra vadina bhasha.Pathra ouchithyaniki taggattu gane MALATHI garu abhasha vaderu. A vakyalane Ranganayakamma garu kot cheseru. dantlo Ranganayakamma garu vadina tappu bhsha emundi? Raganayakamma garu SRISRIni gaddarni bhasha vishayamlo ee sandahrbhamlo vimarsinchero oosari malli chudandi.Veeresalingamgari sishuralu acharanalo patinchanidi eemi ledu.

  32. “ముండ” అనే పదం కాకుండా ఉంపుడుగత్తె (concubine) అనే పదం వాడి ఉండాల్సింది. ఈ కథ ప్రకారం సీతాపతి స్త్రీలని ఉంపుడుగత్తెలుగానే చూశాడు. భాష విషయంలో తెలియక తప్పు చేసినా జనం కంఫ్యూజ్ అయిపోతారు. శిరోముండనం చెయ్యించబడ్డ స్త్రీలు మాత్రమే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని అర్థం వచ్చేలా వ్రాస్తే హాస్యాస్పదంగా ఉంటుంది.

  33. విప్లవ తరంగంలో కూడా నేను ఇదే సమాధానం వ్రాసాను”
    >>>>>
    ముండ అనే పదం కాకుండా ఉంపుడుగత్తె (concubine) అనే పదం వాడి ఉండొచ్చు. ఈ కథలో సీతాపతి ఆడవాళ్ళని ఉంపుడుగత్తెలుగానే చూసాడు. “నీ ఉంపుడుగత్తెలలో ఒక ఉంపుడుగత్తెగా నేను ఉండదలచుకోలేదు” అని వ్రాసి ఉండాల్సింది. ముండ అనే పదం వాడడం వల్ల కంఫ్యూజన్ కలిగే అవకాశాలు ఉన్నాయి.
    >>>>>
    ఇప్పుడు అంత కంటే కొంచెం వివరంగా సమాధానం వ్రాసాను. నేను కూడా రంగనాయకమ్మ గారి రచనలు చదువుతుంటాను. వీరేశలింగం, చలం గార్ల సాహిత్యం చదివిన రంగనాయకమ్మ గారు కూడా తెలియక తెలియక ప్రగతి నిరోధక భూస్వామ్య సంప్రదాయాల్ని నమ్మేవాళ్ళు వాడే భాష మాట్లాడితే ఎలా? ఈ కథ చదివితే మాలతి గారు కూడా వీరేశలింగం సాహిత్యం చదివినట్టు కనిపిస్తోంది. “వీరేశలింగం గారు విధవలకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసి ఉద్దరిస్తే, సీతాపతి ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళ భర్తలని వెధవల్ని చేస్తున్నాడు” అనే డైలాగ్ చదివితే మాలతి గారికి కూడా వీరేశలింగం గారి గురించి తెలుసు అని అర్థమవుతోంది. వీరేశలింగం గారి గురించి తెలిసి కూడా అతని సిద్ధాంతాలకి విరుద్ధమైన భాష వాడడం ఎందుకు?

  34. Subbarao says:

    “ముండ” అనేది కొన్ని ప్రాంతాల్లో ఉంపుడుగత్తెకి పర్యాయపదం.
    అలాగే పనికిమాలిన చవటకి గూడా.

  35. సుబ్బారావు గారూ, శిరోముండనం చెయ్యించబడ్డ స్త్రీలు మాత్రమే ఉంపుడుగత్తెలుగా వెళ్తారు అని చెప్పడం మీ ఉద్దేశమా? ..[తొలగించాం-సం]

  36. బాష గురించి నేను పెద్ద వ్యాసం వ్రాయబోతున్నాను. ఇక ఈ టాపిక్ లో వచ్చే రెస్పాన్స్ లని నేను సమాధానం చెప్పదలచుకోలేదు. ..[తొలగించాం-సం]

  37. మార్తాండ గారూ,
    హుందాగా జరగాల్సిన చర్చను మీరిలా వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్ళడం విచారకరం. సుబ్బారావు గారు చెప్పిన విషయాన్ని సూటిగా గ్రహించకుండా ఆయనకు మీరిచ్చిన జవాబు అసంబద్ధంగా ఉంది. ఆయన కేవలం ఆ పదానికి కొన్ని ప్రాంతాల్లో ఉన్న అర్థాన్ని చెప్పారంతే, దాన్ని సమర్ధించలేదు. ఒకవేళ సమర్ధించి ఉన్నా, మీరు చేసిన వ్యాఖ్య అమర్యాదకరమే, అసంబద్ధమే. ఆయనపై మీరు చేసిన ఈ అమర్యాదకరమైన వ్యాఖ్యలను తొలగిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడమని మిమ్మల్ని కోరుతున్నాం.

    ఇప్పటికే ఈ చర్చ అసలు విషయాన్నుంచి పక్కదారి పట్టింది. అందుచేత, ఇక ఈ వ్యాసంపై చర్చను నిలిపివేస్తున్నాం.

Comments are closed.