ఈ భాగం లో నిషిగంధ గారి పుష్ప విలాసం పై చర్చను చదవండి.
నిషిగంధ:
*పుష్పవిలాసం*
**
రంగో రూపమో లోపమెక్కడుందో..
గుడిలోకి కాకున్నా
ఆమె జడలోకైనా
ఎంచుకోలేదు!
ఇక నీ లోకమిదేనని
సహచరులు వెక్కిరిస్తూ వెడలిపోయారు..
అస్పష్ట సందేహమేదో
ఒంటరిని చేస్తుంటే
ఏటవాలు కిరణమొకటి
వెచ్చగా హత్తుకుంది..
తెమ్మెరేమో బుగ్గ తడిమి వెళ్ళింది..
స్థానభ్రంశం లేకున్నా
తల్లిపొదనే తనువు చాలించే
స్వేచ్ఛ నా సొంతమనే
కోయిల సందేశం చేరుతుండగానే
తుమ్మెద తొలిముద్దు పెట్టింది!
మహేష్:
మొదటి వాక్యం “రంగో రూపమో లోపమెక్కడుందో.. ” అవసరం లేదనిపిస్తోంది.
నూ. రాఘవేంద్రరావు:
నిషిగంధ గారికి,
మీ భావన అద్భుతం గా ఉంది.
మొదటి వాక్యం లో నాదో సలహా “రంగో రూపమో, గంధమో, వాసనో” అంటే ఎలా ఉంటుంది.
“గుడి లోకి కాకున్నా” అనే పదాన్ని “గుడికి కాకున్నా” అనీ; “ఆమె జడ లోకి” అనే వాక్యం లో ‘ఆమె ‘ అనే పదాన్ని తీసివేసినా స్త్రీ అనే తెలుస్తుంది.
“ఇక నీ లోకమిదే” అనే వాక్యం లో “ఇక”అ నే పదం తీసేస్తే
గద్య రూపం నుంచి కవితా రూపం చెందుతుందని నా భావన.
‘నీ లోకమిదే ని’ నీ బ్రతుకింతే గా మార్చి చూడండి. వెక్కిరిస్తూ *వెడలి పొయారు* బదులు వెళ్ళిపోయారు ఎలా వుంటుందంటారు?
“అస్పష్ట సందేహమేదో” లో సందేహమేదో అన్న పదం అతికి నట్లు లేదనిపించింది.
రవిశంకర్:
చివరి వాక్యం అలాగే ఉంచి, అంతకు ముందు వాక్యాలు కొంత మార్పుచేసుకుంటే మంచిది. కవిత ఫరవాలేదనిపించినా, ఇతివృత్తం నాకు కొంత పాతగా అనిపించింది. మరింత కొత్త ఊహల్ని,
అనుభవాల్ని అక్షరీకరించే ప్రయత్నం చెయ్యండి .
కామేశ్వర రావు:
నిషిగంధ గారు,
ఈ కవితలో మీ మార్కు కనీ కనిపించకుండా కనిపిస్తోందండి. కాస్త తొందరలో
రాసినట్టున్నారు. “ఏటవాలు కిరణమొకటి వెచ్చగా హత్తుకుంది” – చాలా బావుంది.
శీర్షిక మాత్రం నచ్చలేదు, పాతవాసన కోడుతోంది 🙂 “ఓ గడ్డిపూవు ఊసు” అంటే
బావుంటుందేమో.
నిషిగంధ:
రాఘవేంద్ర రావు గారు, మహేష్ గారు, రవిశంకర్ గారు, మరియు కామేశ్వరరావు గారు –
కవిత పై మీ అభిప్రాయాలు విశదీకరించినందుకు ధన్యవాదాలు..
*మహేష్,* మీరు చెప్పినట్టు మొదటి లైన్ పూర్తిగా తీసేయకుండా రెండవ చరణం తర్వాత
ఉంచితే ఎలా ఉంటుందంటారు?
“గుడిలోకి కాకున్నా
ఆమె జడలోకైనా
ఎంచుకోలేదు!
ఇక నీ లోకమిదేనని
సహచరులు వెక్కిరిస్తూ వెడలిపోయారు..
రంగో రూపమో లోపమెక్కడుందో!?
అస్పష్ట సందేహమేదో
ఒంటరిని చేస్తుంటే…..”
*రవిశంకర్ గారు,* తప్పకుండా మీ సలహాని ఆచరించడానికి ప్రయత్నిస్తాను.. మీరు
చెప్పింది నిజమే ఈ కవిత ఇతివృత్తం పాతదే! కానీ చెప్పేసిన విషయాన్నే నా కలం
ద్వారా కాస్త కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం..
*కామేశ్వరరావు గారు,* అయితే మీరన్నట్లు పేరు వలనే కవిత కూడా పాతది
అనిపిస్తుండొంచ్చు.. కానీ నేను ‘విలాపం’ విన్నాను కానీ ‘విలాసం’ గురించి
వినలేదు.. అందుకే ఆలోచించకుండా పెట్టేసాను..
-కృతజ్ఞతలతో
*నిషిగంధ*
నిషిగంధ, ఆమె అన్నపదం లేకపోతేనే మరింత చిక్కగా వుంటుందనిపించింది.
ఏటవాలు కిరణమొకటి
వెచ్చగా హత్తుకుంది..
తెమ్మెరేమో బుగ్గ తడిమి వెళ్ళింది..
నాకు చాలా బాగున్నాయి. బుగ్గకంటె చెంపలు అంచే బాగుండేమో.
మాలతిగారు, ‘ఆమె’ తీసివేస్తే కవితకి క్లుప్తత, చిక్కదనం వస్తుంది కానీ నేను ఆ పదం వాడటం వెనకాల చిన్న గూఢార్ధం ఉందండి..
పువ్వులు కోసింది ‘ఆమె’ అని చెప్పడమే కాకుండా సహజంగా పూలంటే ఎంతో ఇష్టపడే ‘అమె’ కే నేనక్కర్లేకుండా పోయాను అన్నది ఆ పువ్వు బాధ..
ఇక, ‘బుగ్గలు’ ముద్దొచ్చినంతగా ‘చెంపలు’ రావు కదండీ 🙂 🙂
నిషిగంధ, బాగా చెప్పారు. నేను నా కామెంటు విత్ డ్రా చేసుకుంటున్నాను.
మరోమాట. నాకు ఇలాటి చర్చలు – మాయింట్లో కూర్చునే (నిజమే కదా) మాటాడుకుంటున్నట్టు వున్నందున కూడా చాలా సంతోషంగా వున్నాయి