అత్తెసరు – పచ్చిపులుసు

– వెంపటి హేమ

“అమ్మా” అని ఆర్తనాదం లాంటి కేక పెట్టాడు ఆదిత్య. పాపం! చేతకాని పనేమో, కూర తరుగుతూంటే చెయ్యి తెగింది. కాని అదేమీ పట్టించుకోకుండా, హాల్లో సోఫాలో పడుకుని సీరియస్సుగా నవలేదో చదువుతున్న బాలాజీ హాస్య సన్నివేశం వచ్చింది కాబోలు పడీ పడీ నవ్వుతున్నాడు. పైపనంతా చేసి, వంటకన్నీ అమర్చిన తరువాత ఆదిత్య వెళ్లి చెపితే అప్పుడొచ్చి వంట మొదలుపెడతాడు బాలాజీ. అది వాళ్లిద్దరి మధ్యా జరిగిన ఒప్పందం. తనకు వంట చేతకానందుకు తనని తానే తిట్టుకున్నాడు ఆదిత్య. వెంటనే అతనికి తల్లి మాటలు గుర్తు వచ్చాయి….

ఆమె ఎప్పుడూ పోరేది, ” ఎప్పుడైనా అవసరం రావచ్చు, కాస్త అత్తెసరు పడేసి, పచ్చిపులుసు చేసు కోడమైనా నేర్చుకోరా నాయనా ” అని. కాని తాను ఆ మాటలు పెడచెవిని పెట్టాడు. ఏ రోజునా “రేపు”, ” రేపు” అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలం గడిపేశాడు కాని, ఆ పని కాస్తా నేర్చుకున్న పాపాన పోలేదు. దాని ఫలితమే ఈ వెట్టిచాకిరీ.

ఎలక్ట్రానిక్ బూమ్ వచ్చిన తొలి రోజుల్లో గాలిలో (విమానం ఎక్కి) ఎగిరి వచ్చిన వాళ్లలో మన ఆదిత్య కూడా ఒకడు. అమెరికా నైసర్గిక స్వరూపాన్ని మాప్‌లో చూశాడే తప్ప, దాని నిజ స్వరూపాన్ని ఏమీ ఎరిగున్న వాడు కాదు అతడు. రాగానే తిండికి గొప్ప ఇబ్బంది వచ్చి పడింది, పాపం! అతడు, పూర్తి శాకాహారి కావడమే కాదు, బొత్తిగా అమ్మచేతి వంటకి అలవాటు పడిన వాడు కూడా కావడంతో గొప్ప చిక్కే వచ్చింది. ఆవూరిలో అప్పటిలో ఉన్న ఒకే ఒక్క ఇండియన్ హోటల్ అతని ఆఫీసు ఉన్న చోటికి చాలా చాలా దూరం. ఆదిత్య డైలమాలో పడ్డాడు…. ఆఫీసుకి దగ్గరలో ఉంటే బాగుంటుంది గాని తిండికి ఇబ్బంది పడాలిసొస్తుంది. అలాగని హోటల్‌కి దగ్గరైతే వేళకి ఆఫీసు చేరుకోడం కష్టమౌతుంది……. ఏంచెయ్యాలి ?
హండ్రెడ్ డాలర్ల కొశ్చన్ అయ్యిందది! ప్రస్తుతం ఆఫీసుకి దగ్గరలో ఉంది తన తాత్కాలిక నివాసం. అందుకని తను చాలా వరకు బ్రెడ్డూ, జాంల మీద ఆధార పడవలసి వస్తోంది. త్వరలోనే ఇక్కడనుండి వెళ్లి పోవలసి ఉంది. తను ఏ దిక్కున చేరాలన్నది తోచక ఆదిత్య జుట్టు పీక్కుంటున్న సమయంలో, అదే ఆఫీసులో తనకంటే ముందుగానే వచ్చి చేరి, స్థిరపడిన క్లాస్‌మేట్ బాలాజీ కనిపించాడు. సాక్షాత్తు ఆ భగవంతుడే కనిపించినంత ఆనందం వచ్చింది ఆదిత్యకు. ఆప్యాయంగా పలకరించుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఇద్దరూ.

స్నేహితు లిద్దరూ పాతవీ కొత్తవీ ఎన్నోకబుర్లు చెప్పుకున్నారు. పనిలోపనిగా తన ఇబ్బందిని వెళ్లబోశాడు ఆదిత్య. వెంటనే స్పందించాడు బాలాజీ. తనుండే అపార్టుమెంటులోనే ఇద్దరూ కలిసి ఉండవచ్చునని చెప్పాడు.
“ఇంత వరకు ఒకతను ఉండేవాడు నాతో. ఇద్దరం కలిసి వండుకునే వాళ్లం. ఒక వారం అతను వండితే, నేను పైపని చేసేవాడిని. మరుసటి వారం నేను వండితే, అతడు పైపని చేసేవాడు. అన్ని ఖర్చులూ చెరిసగంగా పంచుకునే వాళ్లం. మనమూ అలాగే చేద్దాం” అన్నాడు బాలాజీ.

ఆదిత్య సిగ్గుపడ్డాడు. “నాకు వండడం రాదు. కనుక, పైపని నేను చేస్తా, వంట నువ్వు చెయ్యి” అన్నాడు, పైపని అంటే ఏమిటో అసలు తెలియని ఆదిత్య. బాలాజీ చాలా సంతోషించాడు. “సై” అంటే “సై” అనేసుకున్నారు ఇద్దరూ.

త్వరలోనే బాలాజీ ఉన్న అపార్టుమెంటుకి మారిపోయాడు ఆదిత్య, ఇకనుండీ షడ్రుచోపేతమైన ఆంధ్రా భోజనం దొరుకుతుందన్న ఆనందం తలమునకలౌతూండగా.

బాలాజీకి వంట ఒక హాబీ కావడంతో రకరకాల వంటలు చేసేవాడు, అది భోజన ప్రియుడైన ఆదిత్యకు బాగా నచ్చింది. అదిత్య లొసుగుల్ని కనిపెట్టిన బాలాజీ, కనికరమన్నది లేకుండా ఇంటిని శుభ్రం చెయ్యడం, బాత్రూమ్సు క్లీన్ చెయ్యడం, డిష్‌ వాషర్ లోడింగ్ అండ్ అన్‌లోడింగ్ వగైరా పనులన్నీ ఆదిత్యకే వదిలెయ్యడం కాకుండా, వంటకు కూడా అన్నీ అమర్చి పెట్టాకే వచ్చి గరిట విలాసంగా అటూ ఇటూ తిప్పేసి, ఇట్టే వంటచేసి పడేసే వాడు. అమెరికా సాంప్రదాయం ప్రకారం వంట అన్నది రాత్రి ఒఖ్ఖ పూటే చేయాలి కనుక, ఆపైన అంతా తీరుబడే కావడంతో బాలాజీ సోఫాలో వయ్యారంగా పడుకుని ఏదో నవలను చదువుతూ కాలక్షేపం చేసేవాడు. బాలాజీ కున్న మరో దుర్గుణం అతి శుభ్రం. ఎంతో కష్టపడి ఆదిత్య పనంతా చేశాక, “ఇక్కడ పాల మరకంటింది,” “అక్కడ కూర మరక పడింది” అంటూ వంకలు పెట్టి అదేపనిని మళ్లీ చేయించేవాడు.

అది చూస్తే ఆదిత్యకి ఒళ్లు మండిపోయేది. ఆఫీసు వేళలు మినహాయించి తక్కిన రోజంతా చేసినా, అసలే పని చేతకాకపోడంతో, ఆదిత్యకు పని తెమిలేది కాదు. అప్పుడప్పుడు, ఆదిత్యకు బాలాజీని కూరకింద తరిగిపారెయ్యాలన్న ఆలోచన వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాని బాలాజీ వంట మొదలెట్టగానే ఆ మాట మరిచిపోయేవాడు. “హబ్బా! ఏమి ఘుమ ఘుమలు” అనుకునేవాడు, ఆవంట తిని “ఆహా!! ఏమి రుచి” అని లొట్టలు వేయడంతో ఆదిత్య బాధంతా ” జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం” ఐపోయి. అక్కడితో సమస్య సమసిపోయేది. మళ్లీ ఎప్పటి ఆటే మొదలయ్యేది.

* * * * *

ఛాప్టర్ అయ్యిపోడంతో పేజీ తిరగేస్తూ తలెత్తి చూసిన బాలాజీ, గడియారం ముల్లు బెదిరించడంతో “కెవ్వు” మన్నాడు. “ఒరేయ్, ఆదీ! ఏంచేస్తున్నావురా! టైం ఎంతో తెలుసా? ఎప్పుడు వండాలి, ఎప్పుడు తిని నిద్రపోవాలి? మళ్లీ పొద్దున్నే లేవొద్దా ?”

వంటింట్లోంచి జవాబేమీ రాలేదు… ఆదిత్య అక్కడే ఉన్న దానికి గుర్తుగా ఒక నిట్టూర్పు శబ్దం మాత్రం వినిపించింది. బాలాజీ పుస్తకం మూసి లేచి వంట గదిలోకి వెళ్లాడు. అతనికి అక్కడ టాప్ క్రింద చెయ్యి పెట్టి రక్తం కడుక్కుంటున్న ఆదిత్య కనిపించాడు.

“చెయ్యి తెగిందా? ఇవన్నీ కొత్తలో మామూలే లేరా. ‘సింపుల్ ఆక్యుపేషనల్ హెజార్డ్సు’, తప్పవు” అన్నాడు.
“సారీ” అన్న చిన్న మాటైనా లేకుండా బాలాజీ అలా తేలికచేసి మాట్లాడడం ఆదిత్యకు చాలా కోపం తెప్పించింది. ”నీకేమిరా బాలూ ! అనుభవిస్తున్నది నేనుగా, పొద్దున్న మొదలు రాత్రి దాకా చాకిరీ చేసి చస్తున్నది నేను కదా! నీకేం, మహరాజువి! నువ్వు ఎన్నైనా చెపుతావు. అసలు హాయిగా సోఫాలో పడుకుని చదువుకోక ఇలా వచ్చావెందుకు” అన్నాడు నిష్టూరంగా.

“ఇది నువ్వు పెట్టిన షరతేకదా! తీరుబడి ఉన్నప్పుడు ఏదైనా చదువుకోడం కూడా తప్పేనా ఏమిటి” అన్నాడు బాలాజీ.

“రేపటినుండి నేనూ వంట చేస్తా. వెనకటిలాగే ఒక రోజు నువ్వూ, ఒక రోజు నేనూ చేద్దాం” అన్నాడు ఆదిత్య..

బాలాజీ, మాంత్రికుడు మంత్ర దండాన్ని తిప్పినట్లుగా సునాయాసంగా గరిట తిప్పేసి, వంటలూ, పిండివంటలూ చేసెయ్యడం చూస్తున్న ఆదిత్యకు, అది మరీ అంత కష్టమైన పని కాదేమో ననిపించింది.
బలాజీ పక్కలదిరేలా పడీ పడీ నవ్వడం మొదలుపెట్టాడు. నవ్వి నవ్వి నవ్వాపుకుని, “బండపనే చేయ్యలేక ఛస్తున్నాననే నువ్వు ఇక వంటపనేం చెయ్యగలవురా. ఒక్క రోజున నువ్వు కాఫీ సరిగా కలిపిన పాపాన పోయావా, చెప్పు? రుచిగల చిక్కని కాఫీ చెయ్యాలంటే, ఫిల్టర్‌లో ఎంత కాఫీపొడి వెయ్యాలి, కప్పు కాఫీకి ఎంత చక్కెర వెయ్యాలి అన్నదైనా ఒంటపట్ట లేదు గాని… వంట జరిగేది పొయ్యిమీద కాదురా, తలలో! ఏ వంట రుచిగా రావాలన్నా పడవలసిన పదార్థాలన్నీ సరైన పాళ్లలో పడాలి తెలుసా! ఈ పద్ధతి నీకు నచ్చకపోతే, నువ్విక్కడనుండి ఎప్పుడైనా వెళ్లిపోవచ్చు. అది నీ ఇష్టం, గుర్తుపెట్టుకో” అన్నాడు బాలాజీ ఖరాఖండీగా.

ఆరాత్రి ఆదిత్యకు చాలా సేపటివరకు నిద్ర పట్టలేదు. తండ్రి, తల్లి, చెల్లి…. అంతా గుర్తువచ్చారు. తండ్రి తనను పైచదువులకు పంపుతూ చెప్పాడు, “బాబూ, ఆదిత్యా! చదువు బాగా వస్తోందని ఉన్నదంతా పెట్టి నీకు చదువు చెప్పిస్తున్నా. నీ చెల్లెలి పెళ్లి నీ బాధ్యత సుమీ, గుర్తుంచుకో. మనవి “చాపంత పెద్దవీ, చదరమంత చిన్నవీ” కాని మధ్యతరగతి జీవితాలు” అంటూ హెచ్చరించాడు.

చెల్లెలు చిత్ర తెలివైనది. అందంగా, ముద్దొస్తూ చలాకీగా ఉంటుంది. దానికి మంచి మొగుణ్ణి తెచ్చి పెళ్లి చెయ్యాలంటే తను డబ్బు కూడబెట్టాలి. ఈ వేళ బాలాజీ మీద కోపం తెచ్చుకుని తను ఇక్కడ నుండి వేరే ఇంటికి మారితే వచ్చే లాభం ఏమీ ఉండదు. అక్కడ వంటపనీ, పైపనీ… రెండూ తనే చచ్చినట్లు చేసుకోవలసిరావడమే కాకుండా, భాగస్వాము లెవరూ లేక ఖర్చు మొత్తం తనే భరించాల్సి వస్తుంది. ఇక్కడ తనకు వంట రాకపోయినా రుచైన భోజనం పెడుతున్నాడు బాలాజీ. ఏమాట కామాటే చెప్పుకోడం బాగుంటుంది. అనుకున్నాడు ఆదిత్య.

ఆదిత్య మనసులో వివేకం చోటుచేసుకుంది. తల్లిని తలుచుకున్నాడు, “అమ్మ చేసిన హెచ్చరికను పట్టించుకోనందుకు నాకీ శిక్ష తప్పదు” అనుకుని మనసు సరిపెట్టేసుకున్నాడు. మళ్లీ ఎప్పుడూ ఆ విషయం అతడు బాలాజీ దగ్గర ఎత్తకపోయినా మనసులో మాత్రం అనుకునేవాడు, ‘ఏదో ఒక రోజు చెల్లాయి పెళ్లి ఔతుందనీ, ఆ వెనువెంటనే తన పెళ్లీ జరిగిపోతుందనీ, అక్కడితో కష్టాలు గట్టెక్కిపోతాయనీ’ ఊహించుకుంటూ, ఆ రోజుకోసం ఎదురుచూస్తూ తలవంచుకుని తన వంతు పని చేసుకుపోతూ కాలం గడపడం సాగించాడు ఆదిత్య. అలా ఓ సంవత్సరం గడిచింది.

ఒక రోజు ఆదిత్యకి తండ్రి ఫోన్‌చేసి, చిత్రకి ఒక మంచి సంబంధం వచ్చిందనీ, అబ్బాయి చాలా మంచివాడనీ, వాళ్ల స్వంత బిజినెస్సునే తండ్రి తో పాటుగా మేనేజిమెంటు తనూ చూసుకుంటున్నాడనీ చెప్పి, ఒక చిన్న మెలిక ఉందనీ, వాళ్లు కుండ మార్పిడి అడుగుతున్నారనీ అన్నారు. “కుండ మార్పిడి” అంటే అదేదో పెళ్ళిలో అన్నం కుండల్లో వార్చి వడ్డించే షరతేమో అనుకున్న ఆదిత్యకు అవిరేణి కుండల గురించి, కుండ మార్పిడి గురించి ఓపిగ్గా వివరించారు ఆయన. “నీ చెల్లిని వాళ్ల అబ్బాయికిచ్చి పెళ్లి చేసి, అతడి చెల్లెల్ని నువ్వు పెళ్లిచేసుకోడం అన్నమాట. మనకు ఇంత చక్కని సంబంధం మళ్లీ దొరకదు. నువ్వు సెలవు పెట్టి రా. పిల్ల నీకు నచ్చితే వెంటనే పెళ్లి జరిపించెయ్యడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇది పెళ్లిళ్ల సీజనే కనుక దగ్గరలోనే ఏదో ఒక ముహూర్తం దొరక్కపోదు. నువ్వు రావడమే ఆలస్యం.”

వెంటనే ఆ విషయం బాలాజీకి చెప్పి, ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టేశాడు ఆదిత్య. బాలాజీ మీద సొడ్డేస్తున్నందుకు అతనికి చాలా సంతోషంగా ఉంది. ఆ రాత్రి ఆదిత్యకు కల కూడా వచ్చింది…
సాయంకాలం తను ఆఫీసు నుండి వచ్చేసరికి, ఎంతో నీటుగా సర్దబడిన ఇంటిలో, పులు కడిగిన ముత్యంలా పరిశుభ్రంగా ముస్తాబై ఎదురొచ్చి తన భార్య ఘుమఘుమ లాడే ఫిల్టర్ కాఫీ ఉన్న కప్పు చేతికిచ్చి, తానది తాగుతూ సోఫాలో కూర్చుంటే, ఆమె వచ్చి తన కాలి బూట్లు విప్పుతూండగా, పలుకరించి పోదామని వచ్చిన బాలాజీకి, తన వైభోగం చూడగానే అసూయతో కళ్ల నీళ్లు దొడ దొడా కారిపోయినట్లుగా!
* * * * * *

ఆ పిల్ల, చిత్రంత అందగత్తె కాకపోయినా, ఫరవాలేదు బాగుంది అన్నారు అందరూ. సంసారపక్షంగా ఉంది, ముఖ్యంగా ఆదిత్యకు నచ్చింది. రెండు పెళ్లిళ్లకీ దగ్గరలోనే ముహూర్తాలు దొరికాయి కూడా. కుండమార్పిడి కావడంతో అలకలూ, ఆడంబరాలూ లాంటి గందరగోళాలేమీ లేకుండా పెళ్లిళ్లు సాఫీగా జరిగిపోయాయి. చిత్ర అటు, రవళి ఇటు గృహప్రవేశం చేసేశారు. గృహప్రవేశానికి, సత్యనారాయణ వ్రతానికీ ముహూర్తం పెట్టిన రోజునే నూతన వధూవరుల తొలి సమాగమానికి కూడా ముహూర్తం పెట్టేసారు.

ఆ రోజే తొలిసారిగా ఆదిత్య, రవళి ఏకాంతంలో కలుసుకున్నారు. ఆదిత్యకు ” తిష్ట కుదిరితేనేగాని నిష్ఠ కుదరదు” అన్న మాట గుర్తొచ్చింది. ముందుగా తన మనసులో ఉన్న సందేహం తీర్చేసుకుంటే మంచిది – అనుకున్నాడు. రవళిని ప్రేమగా దగ్గరకు తీసుకుని, “డార్లింగ్ ! నీకు వంటపని, ఇంటిపని వచ్చుకదూ” అంటూ అడిగాడు.

రవళి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, “పనా! పనంటే ఏమిటీ?” అని అడిగింది. మంచి అనుభవం ఉన్నవాడేమో.. ఆదిత్య అదేమిటో వివరించి చెప్పాడు ఆమెకు. రవళి కళ్లు రెప రెప లాడిస్తూ చెప్పింది. ”ఇలాంటివేం నేనే కాదు, మా అమ్మ కూడా చెయ్యదు. మా ఇంట్లో వంటపని సుబ్బమ్మ గారు చేస్తారు. అంట్ల గిన్నెలు నర్సమ్మ తోముతుంది. పైపని రత్తాలు చేస్తుంది. తోటపనికి రాములు ఉన్నాడు. కారు పని డ్రైవరు చూసుకుంటాడు. సరుకులు తేడానికి అబ్బులు వస్తాడు. అసలు ఇప్పుడు మీరు చెప్పేవరకూ వాటిని పనులంటారనిగానీ, ప్రతివాళ్ళూ చెయ్యాలిసొస్తుందని గానీ నాకు తెలియనే తెలియదు ! సారీ” అంది ఆమె.

తెల్లబోయాడు ఆదిత్య. కొంచెం కోపం కూడా వచ్చింది. “కోరుకున్నవన్నీ వచ్చి ఒళ్లో పడిపోతుంటే రోజు ఎలా గడుస్తోందో తెలియకుండానే గడిచిపోతుంది. ఏపనీ చేతకాని నువ్వు అమెరికాలో ఉండే వాడిని తప్ప పెళ్లాడనని పట్టు పట్టావుట, అక్కడకి వచ్చి ఏం చేద్దామని నీ ఉద్దేశం” అని అడిగాడు.

“ముగ్గురో, నలుగురో పనివాళ్లని పెట్టుకుందాం” అంది రవళి ముద్దు ముద్దుగా.

“అయితే నీకు అమెరికా గురించి ఏమీ తెలిసినట్లు లేదు” అన్నాడు ఆదిత్య.

“తెలుసు. నా ఫ్రెండ్ సంహిత అక్క అక్కడే ఉంటుంది. నా ఫ్రెండు నా కంతా చెప్పింది. అది చాలా గొప్ప దేశమనీ, గాలి చల్లగా హాయిగా ఉంటుందనీ, అందరికీ కార్లు ఉంటాయనీ, అక్కడి వాళ్లకు అన్నీ మిషన్లే అమర్చి పెడతాయనీ చెప్పింది. అక్కడ పసిపిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడుతారుట! … ఎన్నో చెప్పింది. ఇక్కడ మనం ఒక్క డాలరు మార్చితే దోసిలి నిండా రూపాయిలు వస్తాయి కదా! అంతేనా… అక్కడ నుండి వచ్చిన వాళ్లను ఇక్కడి వాళ్లు ఎంతో గౌరవంగా, ప్రత్యేకంగా చూస్తారు! నా కదంతా చాలా నచ్చింది. అవన్నీ తెలుసు కనుకే నేను ఆ దేశంలో బ్రతకాలని కోరుకున్నా, తప్పా?”

అమాయకంగా, చిన్న పిల్లలా మాట్లాడుతున్న రవళిని చూస్తూంటే చిరాకొచ్చింది ఆదిత్యకు. “నాణానికి ఒక పక్క మాత్రమే చూశావు. రెండో వైపున ఏముందో నీకు తెలియదన్నమాట! ఇక్కడలా అక్కడ ప్రతిదానికీ పనివాళ్లను పెట్టుకోలేము. చిన్న పనికి కూడా పెద్ద మొత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. రోజుకి ఇంతని కాకుండా అక్కడ, గంటకు ఇంత అని ఇవ్వాలి. ఆ లెక్క కూడా చాలా ఎక్కువ. అందుకే, అక్కడ ఎవరి పనిని వాళ్లే చేసుకుంటారు. రిపేర్లూ చాలా వరకూ స్వంతంగానే చేసుకుంటారు, తెలుసా. డాలర్ని ఇక్కడకు తెస్తే దోసెడు రూపాయి లౌతుందేమోగాని, అక్కడ ఒక డాలరుకి ఏమీ రావు. ఎక్కడి డబ్బులు అక్కడి ఖర్చులకే సరి. దిగాక గానీ లోతు తెలియదు – అంటారు అందుకే.

అమెరికా రావాలనుకున్న వాళ్లు ముందుగా తమ పనులు తామే చేసుకోడం నేర్చుకోవాలి. అసలు ఈ పెద్దాళ్లని అనాలి…….. పిల్లనిచ్చే ముందు కులం – గోత్రం, డబ్బు – దస్కం చూస్తారే తప్ప, రేపు మన పిల్ల అక్కడ సద్దుబాటు చేసుకుని బ్రతకగలదా – లేక, ఇబ్బందులతో అల్లాడి పోతుందా – అన్నది మాత్రం ఆలోచించరు కదా ” అన్నాడు ఆదిత్య, ఆశాభంగంతో వచ్చిన చిరాకుతో.

రవళి అతని వైపు పులుకూ పులుకూ చూసింది. ”మా వాళ్లు తెలివి తక్కువవాళ్లేం కారు. అంత దూరం పిల్లని పంపించే టప్పుడు, అక్కడ, వాళ్లపిల్లకి ఎటువంటి తిప్పలూ ఉండ కూడదనే మీ చెల్లెల్ని మా ఇంటి కోడల్ని చేసుకున్నారు, తెలుసా?” అంది రవళి.

ఆదిత్య బుర్ర తిరిగిపోయింది. “అమ్మ దీనిల్లు బంగారం కానూ! “కుండ మార్పిడి” అంతరార్థం ఇదన్నమాట” – అనుకున్నాడు బాధగా. తన సత్ప్రవర్తనకు గ్యారంటీగా ఉందన్నమాట తన చెల్లెలి కాపురం! వెంటనే ఆదిత్య మనసు నీరు కారిపోయింది. నోరు సంబాళించుకుని, “రవళీ! నామాట సరిగా అర్థం చేసుకో. ఇది నీకే కాదు నాకూ వర్తిస్తుంది. ఈ ఏణ్ణర్థం నుండి నేను నానా తిప్పలూ పడ్డాకే వచ్చి నీకు చెపుతున్నా. అమెరికాలో “డిగ్నిటీ ఆఫ్ లేబర్” ఉంది. అక్కడ ఇక్కడిలా చవక పనీ, చవకబారు పనీ కూడా ఉండవు. అక్కడ బాగా బ్రతకాలంటే మన పనులు మనమే చేసుకో గలిగి ఉండాలి. “సెల్ఫు సఫిషియన్సీ” అన్నది అమెరికా వాళ్ల సుఖజీవనానికి మూల సూత్రం. “రోమ్ వెళితే, రోమన్లా ఉండాలి” అంటారు కదా, అలాగే అమెరికా వెళ్తే మనమూ అమెరికన్ పద్ధతిలోనే బ్రతకాల్సి వస్తుంది. మన కోసం అక్కడి చలిగానీ, అక్కడి పద్ధతులుగానీ మారవు. వాటితో సద్దుకుపోయి బ్రతుకుతూనే, అక్కడి మంచిని గ్రహిస్తూ, చెడుని విడిచిపెడుతూ, మన సంస్కృతిని చెడగొట్టుకోకుండా మనం మనంగా బ్రతకాలి ” అంటూ భార్యకు హితోపదేశం చేశాడు ఆదిత్య.

“మరైతే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి?” అంది రవళి అతనికి దగ్గరగా జరుగుతూ.

“ఏం చెయ్యాలో నేను చెపుతా. నువ్వు నా మాట ప్రకారం చేస్తే చాలు, మనకు మంచి జరుగుతుంది” అన్నాడు ఆదిత్య ఆమెను దగ్గరకు తీసుకుంటూ.

* * * * * *

ఆదిత్య తల్లి అన్నపూర్ణ, కొడుక్కి ఇష్టమని ఆరోజున, “బ్రేక్‌ఫాస్టు”గా, ఆంధ్రా స్పెషల్ ”పెసరట్టు – ఉప్మా” చేస్తూ వంటగదిలో ఉంది. చిత్ర అత్తవారింటికి వెళ్లిపోడంతో, మొత్తం పనంతా ఆమే చేసుకుంటోంది. పని హడావిడిలో ఉండడంతో, హఠాత్తుగా కొడుకూ కోడలూ వచ్చి కాళ్ల మీద పడేసరికి కంగారు పడుతూ, వాళ్లని తడి చేతులతోనే లేవదీసింది. ఇద్దరూ వినయంగా చేతులు జోడించి ఆమెకు ఎదురుగా నిలబడ్డారు.

ఆదిత్య ”భోజనం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ! నువ్వు కనీసం అత్తెసరూ, పచ్చిపులుసూ చెయ్యడమైనా మాకు నేర్పితేగాని, అమెరికాలో మా బ్రతుకు బాగుండదు. అమ్మా ! కరుణించు” అన్నాడు దీనమైన కంఠస్వరంతో.

అన్నపూర్ణకి నవ్వొచ్చింది, “ఒక్క అత్తెసరూ, పచ్చిపులుసూ మాత్రమేనా, మీరు కావాలంటే బొబ్బట్లూ, పులిహోరా, ఇంకా ఇంకా ఎన్నెన్నో వంటలూ, పనులూ కూడా చిటికలో నేర్పించనూ” అంది ఆమె ఆనందంగా.

—————-

వెంపటి హేమ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్నారు. కలికి అన్న కలం పేరుతో ఆమె రాసిన కథలు ఆంద్రప్రభ, యువ వంటి పత్రికలలో 1970 వ దశకంలో ప్రచురించబడ్డాయి. కారణాంతరాలవల్ల రాయడం మానేసినా, మళ్ళీ 2006 నుండి రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

About వెంపటి హేమ

వెంపటి హేమ గారు కాలిఫోర్నియాలో వారి అబ్బాయి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. 1959 తో వారి కాలేజీ చదువు పూర్తయింది. ఫిజిక్సులో డిగ్రీ చేసారు. మాతృభాష మీద మక్కువ. గృహిణిగా స్థిరపడినా. 1970 వ దశకంలో, ”కలికి” అన్న కలం పేరుతో కథలు రాసారు. అవి ఆంధ్రప్రభ వీక్లీ, యువ లాంటి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. కారణాంతరాలవల్ల రాయడం మానేసారు.

తరువాత చాలా కాలానికి, చెయ్యిజారిందనుకున్న కలాన్ని వెతికి పట్టుకుని సత్కాలక్షేపంగా మళ్ళీ రాయడం మొదలుపెట్టారు. ”కలికి” పేరుతో ఆమె రాసిన నవలను, 2006 లో మొదలుపెట్టి సంవత్సరంన్నర పాటు ధారావాహికంగా ఆంధ్రభూమిలో ప్రచురించారు. విశాఖపట్నంలో జరిగిన ఏ.ఎన్.మూర్తి కథలపోటీలో ఆమె రాసిన కథ ”పారిజాతం”కి కన్సొలేషన్ బహుమతి వచ్చింది.

కొన్ని కథలు నవ్య, ఆంధ్రభూమి మొదలైన పత్రికల్లో, అలాగే కొన్ని కవితలు కూడా ప్రచురించబడ్డాయి.
అమెరికాలో స్థిరపడ్డాక, ఆమె కథలు కొన్ని ”సుజనరంజని” వెబ్జైన్‌లో వచ్చాయి.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

10 Responses to అత్తెసరు – పచ్చిపులుసు

  1. vinay chakravarthi says:

    baagundi neat ga…………….keep it up………chaala chaala baagundi………

  2. parimalam says:

    “అత్తెసరూ, పచ్చిపులుసూ “పేరు వినపడగానే మా అమ్మ ,నాన్నగారు లేనప్పుడు అన్నయ్యచేసే వంట గుర్తొచ్చేసింది .పప్పులేని అత్తెసరు ….వంకాయ లేని పచ్చిపులుసు చేసిపెట్టేవాడు . ఏంచేస్తాం మా రైల్వే క్వార్టర్స్ లో ఏమీ దొరకవుమరి . అదే అమృతం …కాలేకడుపుకి … 🙂 🙂 ! కధబావుంది .

  3. akshaya says:

    chala bagundi….

  4. బావుందండీ! వంటరాని నా బ్యాచిలర్ తమ్ముడి కష్టాలు గుర్తొచ్చాయి 🙂

  5. radhika says:

    :)బావుందండీ

  6. భలే చక్కగా చెప్పారు, ఏ లింగమైతేనేమి గాని సాపాటుకు పాట్లు పడకుండా ఉండాలని. వాస్తవాన్ని కష్ట పెట్టకుండా చెప్పారు.

  7. Lalita says:

    సాధారణంగా నేను హాస్య కధలు కూడా నవ్వుకుంటూ చదవను. అలాంటిది ఈ కధ చదివినంత సేపూ పగలబడి నవ్వుకున్నాను. చాల చక్కగా ఉంది. వ్రాసినవారికీ ప్రచురించిన వారికీ కూడా ధన్యవాదాలు.

  8. munnaswamy says:

    అత్తెసరు పచ్చి పులుసు , వెంపటి హేమ
    బర్తకు దగ్గరగా జరుగుతూ ఇప్పుడు మనమేమి చేయాలి అన్న పెల్లికుతురి మనస్సు కొంత shaanthamu మరియు సర్దుకుపోయే గునముకలదని గుర్తించిన ఆదిత్య తగినట్లుగానే థనూ ఒక అడుగు ముందుకేసి తనూ దగ్గరగా జర్జ్గుతూ రవలినీ జయించేడు.

  9. bvr babu says:

    ఈ కథ చదువుంటే మా అబ్బాయి పడ్డ కస్టాలన్ని గుర్తుకి వచ్చాయి.

  10. Sree says:

    I remembered my good old days. First time in motheinlaws place I cooked UPMA. Guess what I used same quantity of salt for ravva. maa attagaaru “Vuppumaa” bagane chesav annaru. I felt very bad for not even knowing how to cook upma. I started learning cooking from mum and friends. Now I am proud to say I cook every thing very well.

Comments are closed.