-వెంపటి హేమ
చిగురాకు జొంపాల చక్కగా ఇముడుచూ
కాయ కసరులు తింటూ కాలము గడిపేటి
శుద్ధ సాత్వికమూర్తివి కీరమా నీవు !
తోటివారల గూడి తోటలందాడుచూ
గుంపులుగ చేరి కిల కిలలాడేటి
రామచిలుకా, నీతోటి రగడ ఎవ్వరికే
పట్టి బంధించి నీతో పంతాలుపోగా !
ఆకాశ వీధిలో ఆటలాడుచు ఎపుడు
మధురాతి మధురమౌ మామిడి పళ్ళు,
దోరజామి పళ్ళ తీపి రుచుల నాని
గోధూళి వేళకు గూటికి జేరుకొని
ఆదమరచి హాయిని నిదురపోయెదవు.
శుక వతంసమా ! చూడగా నిను వెతకి
పట్టి బందీని చేసేటి పాపి ఎవరొకో !
చిగురుటాకును బోలు మేని ఛాయయు,
కెంపులను గేలిచేసేటి ఒంపుముక్కును,
తేనె లొలికించు తీయని గళపు పటిమతో
మమ్ము మురిపించు ప్రతిభయే ముప్పాయె !
నీ లోని సొగసులే నీకయ్యె శత్రువులు,
నీ ప్రజ్ఞలే నీకు శాపములాయె !
అనుకరణలో అంత నేర్పరితనమేల ?
మనిషిలా నీవు మాట్లాడు టెందుకు ?
నీపలుకు నీ సొగసు లాసించి జనులు
పట్టి నిను పంజరాన ఉంచి పెంచి,
స్వేచ్ఛ నడచి సదా నిను వేధింతురు కదా !
అభము శుభమూ తెలియని పక్షి జన్మే ఐనా
అనుభవించక తప్పదమ్మా నుదుటి వ్రాత !
రచయిత్రి పరిచయం: వెంపటి హేమ గారు ప్రస్తుతం కాలిఫోర్నియా లో ఉంటున్నారు. ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేసి కలికి అన్న కలం పేరు తో ఈవిడ రాసిన కథలు ఆంద్ర ప్రభ, యువ వంటి పత్రికలలో 1970 వ దశకం లో ప్రచురించబడ్డాయి. కారణాంతరాల వల్ల రాయడం మానేసినా మళ్ళీ 2006 నుండి రచనా ప్రస్థానాన్ని తిరిగి ప్రారంభించి పత్రికల్లో, పోటీల్లో పాల్గొంటున్నారు.