రామ చిలుక

-వెంపటి హేమ

చిగురాకు జొంపాల చక్కగా ఇముడుచూ
కాయ కసరులు తింటూ కాలము గడిపేటి
శుద్ధ సాత్వికమూర్తివి కీరమా నీవు !

తోటివారల గూడి తోటలందాడుచూ
గుంపులుగ చేరి కిల కిలలాడేటి
రామచిలుకా, నీతోటి రగడ ఎవ్వరికే
పట్టి బంధించి నీతో పంతాలుపోగా !

ఆకాశ వీధిలో ఆటలాడుచు ఎపుడు
మధురాతి మధురమౌ మామిడి పళ్ళు,
దోరజామి పళ్ళ తీపి రుచుల నాని
గోధూళి వేళకు గూటికి జేరుకొని
ఆదమరచి హాయిని నిదురపోయెదవు.

శుక వతంసమా ! చూడగా నిను వెతకి
పట్టి బందీని చేసేటి పాపి ఎవరొకో !

చిగురుటాకును బోలు మేని ఛాయయు,
కెంపులను గేలిచేసేటి ఒంపుముక్కును,
తేనె లొలికించు తీయని గళపు పటిమతో
మమ్ము మురిపించు ప్రతిభయే ముప్పాయె !
నీ లోని సొగసులే నీకయ్యె శత్రువులు,
నీ ప్రజ్ఞలే నీకు శాపములాయె !

అనుకరణలో అంత నేర్పరితనమేల ?
మనిషిలా నీవు మాట్లాడు టెందుకు ?

నీపలుకు నీ సొగసు లాసించి జనులు
పట్టి నిను పంజరాన ఉంచి పెంచి,
స్వేచ్ఛ నడచి సదా నిను వేధింతురు కదా !
అభము శుభమూ తెలియని పక్షి జన్మే ఐనా
అనుభవించక తప్పదమ్మా నుదుటి వ్రాత !

రచయిత్రి పరిచయం: వెంపటి హేమ గారు ప్రస్తుతం కాలిఫోర్నియా లో ఉంటున్నారు. ఫిజిక్స్ లో డిగ్రీ  పూర్తి చేసి కలికి అన్న కలం పేరు తో ఈవిడ రాసిన కథలు ఆంద్ర ప్రభ, యువ వంటి పత్రికలలో 1970 వ దశకం లో ప్రచురించబడ్డాయి. కారణాంతరాల వల్ల రాయడం మానేసినా మళ్ళీ 2006 నుండి రచనా ప్రస్థానాన్ని తిరిగి ప్రారంభించి పత్రికల్లో, పోటీల్లో పాల్గొంటున్నారు.

About వెంపటి హేమ

వెంపటి హేమ గారు కాలిఫోర్నియాలో వారి అబ్బాయి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. 1959 తో వారి కాలేజీ చదువు పూర్తయింది. ఫిజిక్సులో డిగ్రీ చేసారు. మాతృభాష మీద మక్కువ. గృహిణిగా స్థిరపడినా. 1970 వ దశకంలో, ”కలికి” అన్న కలం పేరుతో కథలు రాసారు. అవి ఆంధ్రప్రభ వీక్లీ, యువ లాంటి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. కారణాంతరాలవల్ల రాయడం మానేసారు.

తరువాత చాలా కాలానికి, చెయ్యిజారిందనుకున్న కలాన్ని వెతికి పట్టుకుని సత్కాలక్షేపంగా మళ్ళీ రాయడం మొదలుపెట్టారు. ”కలికి” పేరుతో ఆమె రాసిన నవలను, 2006 లో మొదలుపెట్టి సంవత్సరంన్నర పాటు ధారావాహికంగా ఆంధ్రభూమిలో ప్రచురించారు. విశాఖపట్నంలో జరిగిన ఏ.ఎన్.మూర్తి కథలపోటీలో ఆమె రాసిన కథ ”పారిజాతం”కి కన్సొలేషన్ బహుమతి వచ్చింది.

కొన్ని కథలు నవ్య, ఆంధ్రభూమి మొదలైన పత్రికల్లో, అలాగే కొన్ని కవితలు కూడా ప్రచురించబడ్డాయి.
అమెరికాలో స్థిరపడ్డాక, ఆమె కథలు కొన్ని ”సుజనరంజని” వెబ్జైన్‌లో వచ్చాయి.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.