అభ్యుదయం

– స్వాతీ శ్రీపాద

“మీరు చాలా అందంగా వుంటారు”
వసుమతికి నవ్వొచ్చింది. కాని నవ్వలేదు.
ఏం అనాలో అర్థం కాలేదు. అయిష్టంగా చిరునవ్వు విసిరింది.
పొగడ్త ఎంత సంతోషాన్నిచ్చినా మరీ ఇంతలా అతిశయోక్తి చెప్పనఖ్ఖర్లేదుగా!
అయినా తనేమయినా పదహారేళ్ళ పాపాయా పొగడగానే పొంగిపోయి ఒళ్ళుమరచిపోడానికి? ఐదు పదులు దాటిన వయసు. కాదంటే జుట్టింకా నెరవలేదు. ఒంటి బిగి సడలలేదు. చెక్కిళ్ళపై మెరుపులు తగ్గలేదు. యౌవనంలో అడుగు పెట్టాక వయసు కొన్నేళ్ళపాటు ఒకే చోట పాతుకు పోయినట్టు… కనీసం పదేళ్ళయినా చిన్నదానిగా కనిపిస్తానని ఆమెకు తెలుసు. అయినా అతనలా పొగడటం మనసుకు నచ్చటం లేదు.
ఎదుటి వ్యక్తి తన నగ్న శరీరపు కొలతలు తీసుకుంటున్న అనుభూతి. వికృతమైన కొండచిలువేదో శరీరాన్ని అదృశ్యంగా పెనవేసుకున్న భావన.
“మీరేదో ఆలోచనలో ఉన్నట్టున్నారు నే చెప్పింది వినలేదు” కాస్త కినుకగా వుందతని స్వరం.
“అబ్బే! చెప్పండి”
“ఏదేమైన పదేళ్ళు చిన్నగా కనపడటం మామూలు విషయమా? సర్టిఫికెట్ లో మీ పుట్టిన సంవత్సరం చూసుండకపోతే నమ్మేవాడినే కాదు. వయసు ఎంత ఎక్కువ వేసినా…”
మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పటం ఎబ్బెట్టుగా తోచింది వసుమతికి.
మనసు కాస్త కుంచించుకు పోయింది.
ఈ మాట ఎవరు చెప్తే బాగుంటుందో వాళ్ళు చెప్పాలి గాని ప్రతి అడ్డమయిన వాళ్ళూ చెప్తే దానికి విలువెక్కడ?
“ఎక్కువ వేసుకోలేదు, నా వయసు అంతే. మా పెద్దమ్మాయికి ముప్ఫై ఏళ్ళు. నాకూ తనకూ ఇరవై రెండేళ్ళ తేడా” ఒకరకమైన చేదు భావన మాటల్లో గుప్పిస్తూ అంది వసుమతి.
ఇంకేదో అనాలని ఉన్నా అతి బలవంతాన తనను తాను అదుపులో పెట్టుకుంది.
పత్రికాఫీస్ లో సబ్ ఎడిటర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ అది.
ఈ పని లేకున్నా కొంపలు మునిగేదేంలేదు, వాడి మొహాన చరిచినట్టు లేచి వెళ్ళిపోదామా అని కూడా అనుకుంది.
ఆమె మొహంలో అసహనం చదివినట్టుగా మరికా విషయం వదిలేసి రచనల గురించి, ఆమె సాహిత్యాభిరుచి గురించి ఏవో ప్రశ్నలడిగాడు.
“ఎప్పుడు చేరతారు?”చివరిగా అడిగిన ప్రశ్న.
“చేరను” అని చెబ్దామనిపించింది. కాని తమాయించుకుంది.
‘ఎంతకని ఈ ధోరణి నించి పారి పోవడం, నిలదొక్కుకుని పోరాడాలి’.
అందుకే కాస్త ఆలోచించి “రేపు చేరనా?” అంది.
“సరే , ఒక్క పది నిమిషాలాగి అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకు వెళ్ళండి”
తల ఊపి బయటపడింది.
బయట విజిటర్స్ లౌంజ్ లో కూర్చుని ఆలోచనల్లో పడింది.
ఇలా బయటకు వచ్చి ఈ మనుషుల్ను ఎదుర్కోవడం కొత్తగా ఉంది.
మొదలు మొదల్లో ఎబ్బెట్టుగా ఫీలయి, ఎప్పటిలా తన ఒంటరితనపు జైల్లో ఖైదీగా ఉండటమే ఉత్తమమనిపించింది.
కాని ఎన్నాళ్ళలా?
తప్పదు, ఇలా ఇంట్లో మగ్గిపోతే జ్ఞాపకాల ఊబిలో ఉక్కిరిబిక్కిరై ఉనికిని కోల్పోవడం ఖాయం.
చిన్నప్పటినుండి స్వతంత్ర భావాలతో పెరిగిన మనసు వాళ్ళకో వీళ్ళకో ఊడిగం చేస్తూ గడపటానికి సుతరామూ సమ్మతించదే… అది కన్న తల్లిదండ్రులైనా, కన్నపిల్లలయినా సరే.
అందుకే ఈ కొత్త పోరాటం.
పెరిగి పెళ్ళిళ్ళయిన పిల్లలుండి వయసు కాస్త పైబడింది గనక ఈ రకమైన ఇబ్బందుల్ను అస్సలు ఊహించలేదు. ఇదో కొత్త అనుభవం.
మొదట్లో ఎవరైనా ఇలా మెచ్చుకుంటే నిజం చెప్పొద్దూ కాస్త గర్వంగానే అనిపించేది.
ఈ వయసులోనూ ఇలా మెరుపుతీగలా చురుకుగా చలాకీగా కనిపించడం సరదాగానే తోచినా పోనుపోను ఈ ధోరణి వెగటు పుట్టిస్తోంది.
బంగళా లాంటి అంతపెద్ద ఇంట్లో ఉండటం అసౌకర్యంగా అనిపించి, అందులోనూ మరచిపోలేని జ్ఞాపకాల జాతర నుండి తప్పించుకోవాలని చిన్న అపార్ట్మెంట్ రెంట్ కి తీసుకోవాలని ప్రయత్నించింది.
సవాలక్ష ప్రశ్నలు.
స్వంత ఇల్లు ఎందుకు వదిలేస్తున్నారు? ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎందుకొచ్చిన బాదరబందీ కొడుకు దగ్గరకే వెళ్ళిపోవచ్చుగా? రెంట్ ఎలా ఇస్తారు?
మేం ఇల్లు ఉద్యోగస్తులకే ఇస్తాం. ఇలా ఒంటరి వాళ్ళకు ఇవ్వదలచుకోలేదండి.
మనుషులు ఆధునికతవైపు అడుగులు వేస్తున్నారా లేక అనాగరికత వైపా? నెలకు అద్దె ఇవ్వడం ముఖ్యం గాని ఈ వివరాలన్నీ వీళ్ళకు అవసరమా?
మరిక ఆ ప్రసక్తి వదులుకుని తన ఇంట్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకు ఓ చిన్న పోర్షన్ అద్దెకిచ్చింది.
ఇప్పుడిలా ఉద్యోగాలవేటలో ఈ అనుభవాలు.
ఉద్యమాలంటారు, విప్లవమంటారు, వల్లకాడంటారు – కాని వాస్తవానికొచ్చేసరికి ఏ కాస్త సడలింపునూ సరిపెట్టుకోలేరు. బలం కొద్దీ వ్రాసి పారేస్తే సమాజం మారుతుందా – ముందు మార్పు అనేది ఎవరికి వారు తెచ్చుకోవద్దూ!
అపాయింట్ మెంట్ ఆర్డర్ రావడంతో లేచి బయటకు నడిచింది.
****************

కొత్త ఉద్యోగం బాగానే వుంది.
అడపా దడపా వ్యక్తిగత వివరాల సేకరణాభిలాష కొంచం ఇబ్బందిగా అనిపించినా, రోజంతా ఏదో ఒక పనిలో నిమగ్నమైపోవడం, జీవిత విషాదాల్ను కాస్సేపైనా ఆవలకు నెట్టి బ్రతకడం, ముఖ్యంగా ‘నేనూ ఏదో ఒకటి చెయ్యగలన’నే ఆత్మవిశ్వాసం. ఘడియలు, గంటలు, రోజులు లెక్ఖ పెట్టుకుంటూ నిరాశ పడిపోవడం నించి ఓ మెట్టెక్కి ‘నా జీవితమిది’ అనుకునే స్థాయికి రావడం కొంత సంతృప్తిగానేవుంది. ఆఫీస్ పని కూడా నామకహా కాకుండా మనసు పెట్టి చెయ్యడంతో నలుగురికీ నచ్చుతూనే వుంది. కాదంటే మధ్య మధ్య ఈ ఎడిటర్ గారి రొదే కాస్త ఇబ్బందిని కలిగిస్తోంది.
ఆ రోజు ఆఫీస్ కి వస్తూనే ఒక రకమైన అలర్ట్ నెస్ గమనించింది వసుమతి. అయినా ఆరాలు తియ్యడం అలవాటు లేనిది కావడంతో నిశ్శబ్దంగా తనపని తాను చేసుకుపోతూనే వుంది. కావలసిన కథల ఎంపిక, ఆ తరువాత కవితల పరిశీలన, ఇంటర్నెట్ నుండి సరిపోయే చిత్రాలు సేకరించి లంచ్ టైం కావడంతో పని ఓ పక్కకు పెట్టి ఎప్పటిలానే పక్కటేబుల్ వద్దకు జరిగి టిఫిన్ బాక్స్ మూత తీస్తోంది.
అనూహ్యంగా ఆఫీస్ బాయ్ పిలుపు.
“సార్ పిలుస్తున్నారు ” అంటూ
“ఎవరు ఎడిటర్ గారా?” కాస్త కలవరంగా అడిగింది.
ఇప్పుడు వెడితే అనవసరంగా పనికిరాని సుత్తి కనీసం ఓ గంటయినా కొట్టందే వదలడు. ఎప్పుడూ వున్న గొడవే. నువ్వింత అందంగా వున్నావు అంత అందంగా వున్నావు, రంభవు వూర్వశివి అంటూ. సినిమాకి వస్తారా, లంచ్ కి రాకూడదూ అనే ఆహ్వానం. ఇండైరెక్ట్ గా, అవకాశమున్నప్పుడే జీవితం అనుభవించాలంటూ హితబోధ.
” కాదు. పెద్ద ఎడిటర్ గారు..”
‘పెద్ద ఎడిటర్ గారా..’ పైకి అనకుండా టిఫిన్ బాక్స్ మూత పెట్టి లేచి నించుంది. ఎడిటరంటే వేటగాడు అని స్థిరపడిపోయిన వసుమతి ‘కొత్తగా వచ్చిపడ్డ ఈ పెద్ద వేటగాడెవరా’ అనుకుంటూ ఆందోళనతో బాయ్ వెంట నడిచింది.
ఎడిటర్ గారి రూం లో అడుగుపెడుతూనే – గమనించింది.
కళ్ళద్దాలు పెట్టుకుని హుందాగా ఉన్న ఆ నడివయసు వ్యక్తి, అతని ఎదురుగా ఎడిటర్ గారు.
వసుమతి స్పందించే లోగానే అతనే చేతులు జోడించి “నమస్కారమమ్మా… కొత్తగా చేరారటగా… నేను ఈ పత్రిక స్థాపకుడిని. నర్సింగ్ రావ్.”
‘ఓహ్! ఎడిటరంటే పబ్లిషరా!’ ఆఫీస్ బాయ్ అజ్ఞానానికి నవ్వుకుంటూ తేలిగ్గా నిట్టూర్చి చేతులు జోడించింది ఏ పత్రికలో ఐనా పబ్లిషరే నిజానికి పెద్ద ఎడిటర్ అని తెలియని వసుమతి.
*********
ఈ మధ్య ఎడిటర్ గారి ప్రవర్తన లో ఏదో మార్పు. చీటికి మాటికీ చిరు బురు లాడటం, ఎద్దేవాగా మాట్లాడటం ‘సిన్సియర్ సిన్సియర్’ అని ఎత్తిపొడవటం, వసుమతికి కొంత అసహనంగానే వుంది.
అయినా తమాయించుకుని తన పని తాను చేసుకుపోతూనే వుంది.
ఆ రోజు పత్రిక పని ముగించి ప్రింట్ కి పంపేసరికే ఆరు దాటింది.
హడావిడిలో సెల్ ఫోన్ టేబుల్ మీదే పెట్టేసిన సంగతి బస్ స్టాండ్ కి వచ్చాక గాని గుర్తు రాలేదు.
ఫోన్ లేకపోతే పిల్లలు కాల్ చేస్తే ఇబ్బంది. జవాబు రాకపోతే వరీ అవుతారు. అందుకే మళ్ళీ వెనక్కు నడిచింది.
తన రూం లో ఫోన్ అందుకుని వెనక్కు తిరగబోతూ ఎడిటర్ గారి గదిలోంచి మాటల్లో తన పేరు వినపడి ఆగిపోయింది.
“ఏదో దారిలో పెడదామని అవసరమున్నా లేకున్నా ఉద్యోగమిస్తే నాప్రాణానికి ఏకుమేకై కూర్చుంది. ఎన్నిరకాల ప్రయత్నించినా ఉలకదు, పలకదు. రాయి. అవునులే యాభై ఏళ్ళుదాటి ముసలి మొహం పడ్డాక, ఏం కోరికలుంటాయి. ఒట్టి జడపదార్ధం. పోనీ ఏదో వంకన ఉద్వాసన పలికి మరో పిట్టను ట్రై చేద్దామనుకునే లోగానే మా బాస్ గాడొకడు – వాడికి దీని పని బాగా నచ్చిందట. పని నచ్చిందో అది నచ్చిందో కాని ఒకటే పొగడ్తలు.
పొమ్మనలేక పొగబెట్టినట్టు ఏదో రకంగా దీన్ని తరిమి కొట్టాలి……”
ఆ మాటలు ఇంకెంత వరకు సాగేవో, మరింక వినలేక వసుమతి చర చరా నడిచి ఓరగా వేసివున్న అతని రూం తలుపు ధడాల్న శబ్దం చేస్తూ తోసింది.

టేబుల్ అంచుమీద కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్న అతని చేతిలో ఫోన్ జారి పోయింది. విస విసా నడిచి వెళ్ళి బర్ మన్న శబ్దంతో కుర్చీ లాక్కుని కూర్చున్న వసుమతి ముక్కు పుటాలదరడం స్పష్టంగా కనిపిస్తోంది. గుడ్లప్పగించి చూస్తూనే గుటకలు మింగుతూ అప్రయత్నంగానే లేచి నిల్చున్నాడు. ” ఎందుకు నించున్నారు కూర్చోండి, నేను మీతో మాట్లాడాలి ” ఆజ్ఞాపించినట్టుగా వుందామె స్వరం.
మారుమాట్లాడకుండా కూర్చున్నాడు.
” మీకంటే నేను పెద్దో చిన్నో తెలీదు, కాని ఒక్క మాట మాత్రం మీకు చెప్పకుండా ఇక్కడినుండి కదలను. మిమ్ములను కదలనివ్వను. కూర్చోండి”
భయం భయంగా చూసాడు. “కూర్చోండి” గద్దించింది.
ఠక్కున కుర్చీ అంచుకు ఆనుకు కూర్చున్నాడు.
“ఇన్ని పత్రికలు, వాటి నిండా అభ్యుదయం ఒలకబోసే మీకు, ప్రత్యేకంగా మీలా ఆలోచించే మగజాతికి ఉన్న సంస్కారం స్థాయి ఇంతేనా?” నిలదీసింది.
అప్రయత్నంగానే అతని తలవాలిపోయింది.
“నడి వయసులోనున్న నానుండి మీరు ఏం ఆశిస్తున్నారు?
భర్త లేకపోయినంత మాత్రాన మీకళ్ళకు నేనో ఆటబొమ్మలా, కోరికల్తో మదమెక్కిన విరహిణిలా కనిపిస్తున్నానా?
మనిషికి వెయ్యి కోరికలుండవచ్చు, అలాగని ఆ గుర్రాలెక్కి పరుగులు తియ్యడమేనా జీవితం? నువ్వు రంభవు, ఊర్వశివి అనగానే ఒళ్ళు మరచిపోయి మీవెంట పెంపుడు కుక్కలమవుతామనుకున్నారా?” కోపంతో ఒళ్ళుమరచిపోయి అరచినట్టుగానే మాట్లాడుతోందామె.
“ఓ పక్కన అద్భుతంగా ఉన్నరంటూ పొగిడిన మీ నాలుకే అది ఇది అని మాట్లాడటమా? ఏ పేరుతో దీన్ని పిలవాలి?
దారిలో పెడదామనుకున్నారా? నేను రాచమార్గంలోనే ఉన్నాను, మీరే ఏదో దారి తప్పినట్టనిపిస్తోంది. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఇందరున్నా మీరే వక్రమార్గంలోకి వస్తున్నారు.
నేనేమీ అందగత్తెనని మీకు చెప్పలేదే, ముసలిమొహం అని ఎద్దేవా చేసేందుకు?
నేను జడపదార్థాన్నా? మీ కవ్వింపులకు లొంగిపోనంత మాత్రాన నేనేమిటో మీకు తెలిసిపోయిందా?
ఏ స్త్రీ ఈ ప్రపంచంలో జడ పదార్థం కాదు, మీరైనా నడివీధుల్లో నగ్నంగా తిరగాలనిపించగానే గుడ్డలిప్పుకు పరుగెడుతున్నారా అంతమాత్రాన మీరంతా జడులేనా? జవాబు చెప్పండి”
“సారీ” అస్పష్టంగా వినీవినిపించనట్టు పలికాడు.
“చూడండి మిస్టర్, ఈ రోజున నేను. రేపు అదే మీ అక్కో చెల్లో, మీ భార్యో, మీ కూతురో కూడా కావచ్చు. వాళ్ళకు బ్రతుకు మీద ఆశ కలిగించేది పోయి ఇలా సతాయించే వాళ్ళే ఎదురు పడితే ఎలాగన్నది ఒక్కసారయినా ఆలోచించారా?
మీ మనసు కందని విషయం ఒకటుంది. ప్రతి వారికి ఓ మనసు, దానికి ఇష్టాయిష్టాలుంటాయి.
ఈ మనిషి కోసం నేనేదైనా చెయ్యగలననుకునే స్థితికి వచ్చినప్పుడు కాని ఎవరి హృదయమూ స్పందించదు. అది ఆడైనా మగైనా – మనసుకి ఈ అంతరాలున్నాయా?
సహృదయత, మంచితనం లేనప్పుడు శరీరం ఒక జీవచ్ఛవమే,
ఇన్ని మాటలు మాట్లాడి నేనేదో ఉద్యోగం వదిలేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాననుకుంటున్నారేమో , ఇది వాస్తవం, రంగుల సినిమా కాదు. నేను ఆఫీస్ లోకి మళ్ళీ రావడం చూసే నేను వినాలనే మీరిలా మాట్లాడారని నాకు తెలుసు”
అతని మొహం పాలిపోయింది.
“మీ ఎదురుగా ఉన్న అద్దంలో నా రాక కనిపించిందనే నిజాన్ని మీరు కాదన్నా మీ అద్దం కాదనదు.
ఏదేమైనా, సవ్యంగా ఆలోచించుకునేందుకు మీకో అవకాశమిస్తున్నాను. అదీ మీ మీద జాలితో కాదు, మీ హద్దుల్లో మీరుండాలని ఆశపడుతూ, మానవత్వం మీద నమ్మకంతో.. ” అనదలచుకున్నవి అనేసి రాచఠీవి తో లేచి బయటకు నడిచింది వసుమతి.
అయితే తలుపు పక్కనే వున్న పెద్ద ఎడిటర్ నర్సింగ్ రావును ఆమె గమనించనే లేదు.

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.
This entry was posted in కథ. Bookmark the permalink.

8 Responses to అభ్యుదయం

  1. చక్కని కథ. బావుంది.

  2. teresa says:

    బావుంది. కథలో కాబట్టి ఆవిడ చడామడా తిట్టాగానే అతను సారీ చెప్పాడు. నిజ జీవితంలో ఈ విషయం ఇంత wishfulగా end అవటం అరుదు!

  3. parimalam says:

    కథ బావుంది.నిజమే, నిజ జీవితంలో ఈ విషయం ఇంత wishfulగా end అవటం జరగదు.

  4. ramana says:

    paata kathey…kothaga
    chepparu….

  5. ramarao says:

    kosamerupu bagundi.
    ayite talupu pakkana niluchunna…….etc.

    malladi valla laga kosa merupu or twist chala bagundi.

  6. chaala baagundi office lo mahilala vedimpulu subject
    old iyina treatment kottadi

  7. munnaswamy says:

    స్వాతి శ్రీపాద గారు ఎడిటర్ గారి వితన్తువు(స్త్రి)ల పై గల అభిప్రాయలను ముందుగానే చెప్పారు అభ్యుదయా బవాలుగల పత్రికనుండి సమాజాన్ని ఉన్నతబవాలు, అబ్యున్నత సమాజాన్ని మార్చాలని వసుమతిమతి రూపములో చూపించారు.

  8. Surya says:

    there is a good moral hide in the tale, methinks this is a tale as a slap for the human being like Editor

Comments are closed.