దెయ్యమంటే భయమన్నది…

ఆంగ్ల మూలం: డా. శృతి మొహాపాత్ర
అనువాదం: కొల్లూరి సోమ శంకర్

నేను ఆవిడని బస్‌లో కలిసాను. బస్ నిండిపోయి ఉంది. ప్రయాణీకులందరినీ ఓ చిన్న పెట్టెలో ఉంచి మూతపెట్టేసినట్లుగా ఉంది. సీటు కోసం వెదుకుతున్న నా నిస్సహాయమైన చూపులను పట్టించుకోకుండా, ఆమె కాసేపు అటూ ఇటూ చూసింది. మళ్ళీ ఏమనుకుందో ఏమో, ఇద్దరికి సరిపోయే ఆ సీటులో కొంత ఖాళీ వదిలి ఎడమవైపుకి జరిగింది. అదే సీటులో ఉన్న ఇంకో ఆవిడ కోర చూపులను పట్టించుకోకుండా నేను వెంటనే ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాను.
బస్ మా కాలనీకి రాగానే, నేను ‘థాంక్స్’ అని గొణిగి, క్రిందకి దిగిపోయాను. బయటంతా చీకటిగా ఉంది; అప్పుడప్పుడూ వణికిస్తూ, చల్లటి గాలి వీస్తోంది. చలికాలపు సాయంత్రాలలో మాములుగా ఉన్నట్లే రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. దీనికి తోడు వీధి దీపాలేవీ వెలగడం లేదు. నేను ఇంటికి రావడం ఆలస్యమైపోయింది. మా స్కూలు వార్షికోత్సవం ఈ రోజు. ముఖ్య అతిథి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలస్యంగా రావడంతో, మొత్తం కార్యక్రమాలన్నీ ఆలస్యంగా మొదలయ్యాయి.
అమ్మా నాన్న కంగారుగా ఉంటారని నాకు తెలుసు. అందుకే తెలిసిన దారే కదాని ఇంటి వైపు గబగబా నడవసాగాను. కాసేపయ్యాక, నా వెనక ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడుతో బాటు ఎవరో నన్ను ఆగమన్నట్లుగా పిలుస్తున్నట్లు వినిపించింది. వెనక్కి తిరిగి చూసాను. ఆవిడే. బస్‌లో నాకు సీటు ఇచ్చినావిడ. ఆమె కూడా దిగి, నేను నడుస్తున్న వైపే వస్తోంది. నేనామె కేసి ప్రశ్నార్థకంగా చూసాను.
“మేము ‘173′ నెంబరు ఇంట్లోకి కొత్తగా అద్దెకి వచ్చాం” చెప్పిందామె. మా ఇంటికి మూడిళ్ళ అవతల ఉండే వాటాలోకి ఎవరో కొత్తగా వచ్చారని నిన్న అమ్మ చెప్పడం గుర్తొచ్చింది. చలిగాలికి తోడు చిన్నగా జల్లు మొదలైంది. మా నడకలో వేగం పెరిగింది.
“నువ్వు దెయ్యాలని నమ్ముతావా?”
“ఏంటి?”అడిగాను. దెయ్యాల ప్రసక్తి వస్తేనే నేను జడుసుకుంటాను. పైగా ఓ అపరిచితురాలు, ఇంత చీకటి రాత్రిలో చలిగాలి వీస్తుండగా, చిరుజల్లు పడుతుండగా నన్నా ప్రశ్న అడగడం నాకు మరింత భయం కలిగించింది. ఆమె కేసి చూసాను. ఆమె పెదాలపై నిస్త్రాణతో కూడిన నవ్వు కదలాడింది. ఉన్నట్లుండి ‘రామ్‌సే బ్రదర్స్ వారి డ్రాకులా షో’ లోని ఆడ డ్రాకులా రూపం నా ముందు కదలాడింది. రక్త పిశాచాలు మామూలు మనుషులలానే కనబడతాయట, కానీ మనుషుల రక్తం తాగుతాయట. కొంపదీసి ఈమె డ్రాకులా కాదు కదా?
“ఏమైంది? నీ మొహం ఎందుకలా పాలిపోయింది? నీకు దెయ్యాలంటే భయమా?” అడిగిందామె.
“అవును. మీకు భయంలేదా?” అని అడుగుతూ ఆమె కేసి తిరిగాను. కానీ ఆమె అక్కడ లేదు. చీకట్లో కలిసిపోయింది. ఒక్క క్షణం పాటు నా ఒళ్ళు జలదరించింది. కొంచెం వెనక నుంచి ఎవరో సాయం కోసం అరుస్తున్నారు. అది ఆమె గొంతులానే ఉంది. ఆమె కనపడడం లేదు, కానీ ఆమె గొంతు వినిపిస్తోంది. ఎవరామె? దెయ్యమా? లేక ఏదైనా శరీరం కోసం భూమి మీద తిరుగుతున్న ప్రేతాత్మా? నాచుట్టూ దెయ్యాలు, భూతాలు, పిశాచాలు తిరుగుతున్నట్లు నాకనిపించింది.
అంతే, నేను గట్టిగా కేకపెట్టి, పరుగందుకున్నాను. పిచ్చిగా పరిగెత్తి గుమ్మం దగ్గరున్న నాన్నని కౌగిలించేసుకున్నాను.
“ఏం జరిగింది పింకీ? ఎందుకా కంగారు?” అంటూ నాన్న నన్ను లోపలికి తీసుకెళ్ళాడు. భయంతో నాకు మాటలు పెగల్లేదు. దానికి తోడు ఒకటే రొప్పు. అమ్మ ఒళ్ళోకి చేరి బావురుమన్నాను.
“ఏమైందమ్మా?” నాన్న గొంతులో ఆందోళన.
“దెయ్యం! నేను బస్‌లో దెయ్యాన్ని చూసాను నాన్నా…” చెప్పాను వణకుతున్న గొంతుతో.
“బస్‌లో దెయ్యమా?” అంటూ అమ్మ కళ్ళజోడు పెట్టుకుని మరీ నాకేసి చూసింది.
“నాతో పాటే కూర్చుందమ్మా. దిగాక నా వెనకే వచ్చింది. పైగా నీకు దెయ్యాలంటే భయమా అని అడిగింది. ఇంతలో చీకటిలో మాయమైపోయింది. ఆ తర్వాత ఆ దెయ్యం నా శరీరం కావాలంటూ అరిచింది కూడా. నా శరీరం కోసం వచ్చిన ప్రేతాత్మ అది…” అని చెప్పాను. వర్షం, చీకటి, ఇంకా ముందు రాత్రి చూసిన హారర్ షో నా మీద చాలా ప్రభావం చూపాయి. నా మాటలు హేతుబద్ధంగా లేవు.
“నేనెలా తప్పించుకొచ్చానో నాకే తెలియదు. నేనెంత భయపడ్డానంటే…” అంటూ చెప్పుకొచ్చాను. నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు. దెయ్యాన్ని చూసినందుకు భయపడాలో, లేక మా కాలనీలో కొన్ని వారాల పాటు నేను ప్రముఖ వ్యక్తిగా చలామణి అయ్యే అవకాశమున్నందుకు సంతోషించాలో నాకు తెలియడం లేదు.
“ఇదంతా ఎక్కడ జరిగింది?” నాన్న వాకబు చేసాడు.
“నారంగ్ అంకుల్ ఇంటి ముందే”
“నువ్వు సరిగా చూసావా? ఆవిడ ఎక్కడైనా పడిపోయిందేమో?”
“లేదు. నేను చుట్టుపక్కలంతా చూసాను”
“మాన్‌హోల్” అంటూ అమ్మ ఏదో గుర్తొచ్చినదానిలా అరిచింది.
“మాన్‌హోలా?” అంటూ నేనూ, నాన్నా ఒకేసారి అడిగాం.
“అవును. సాయంత్రం నారంగ్ గారొచ్చి, వాళ్ళింటి ముందు రోడ్డు మీదున్న మాన్‌హోల్ ఇనుప మూతని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పారు…” అంది.
“పింకీ… నువ్వూ……” అంటూ ఏదో అనబోయాడు నాన్న. నన్ను ఇప్పుడే కోప్పడాలో లేక ఆవిడని రక్షించిన తర్వాత తిట్టాలో నాన్న తేల్చుకోలేకపోయాడు. ఆవిడని రక్షించడమే ముఖ్యం కాబట్టి, గబగబా బయటకి పరిగెత్తాడు. నాకంతా అయోమయంగా ఉంది, ఆతృతనాపుకోలేక నేను నాన్న వెనకలే వెళ్ళాను. అమ్మ కూడా వచ్చింది.
మేము వెళ్ళేసరికి అక్కడ నారంగ్ అంకుల్, ఆంటీ టార్చిలైట్ వెలుగులో ‘దెయ్యాన్ని’ రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.
కాసేపయ్యాక నాన్న, అంకుల్ కలిసి మొత్తానికి ఆమెని బయటకి లాగారు. తల నుంచి పాదాల దాకా మురికితో నిండిపోయిన ఆవిడ ఇప్పుడు దెయ్యంలా కాకుండా నీటిలో తడిసిన ఎలకలా అనిపించింది. “ఎలక దెయ్యం…” అని అనుకోగానే నాకు నవ్వొచ్చింది. కిసుక్కుమంటూ నవ్వుకోసాగాను. అమ్మ పెట్టిన చివాట్లతో మళ్ళీ వర్తమానంలోకి వచ్చాను. నాకేసి ఐదు జతల కళ్ళు తీవ్రంగా చూస్తున్నాయి. ఆ చూపుల్లో కోపం ఉంది, మందలింపు ఉంది.
కానీ నా ఊహాలోకాల గురించి వాళ్ళకేం తెలుసు? ‘సారీ’ అని గొణుగుతూ, తలొంచుకుని అక్కడి నుంచి వచ్చేసాను. ఆ రాత్రి నేను మూడు సంకల్పాలు చేసుకున్నాను – అపరిచితులతో మాట్లాడకూడదని, ఇకపై హారర్ షోలు చూడకూడదని, అన్నిటి కన్నా ముఖ్యమైనది చీకట్లో వీధులలో వెళ్ళాల్సివచ్చినప్పుడు తప్పని సరిగా టార్చిలైటు తీసుకువెళ్ళాలని!

—————

కొల్లూరి సోమశంకర్

అనువాద రచయితగా కొల్లూరి సోమశంకర్ సుపరిచితులే! 60 అనువాద కథలు, 30 దాకా స్వంత కథలు (10 పిల్లల కథలతో సహా) రాసారు. ఒక చిన్న పిల్లల నవలను, యోగకి సంబంధించిన రెండు నాన్- ఫిక్షన్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.

ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి తెలుగు కథలని హిందీలోకి అనువదిస్తున్నారు.

సోమశంకర్ రచనల పూర్తి జాబితా కోసం ఆయన బ్లాగు చూడవచ్చు

About కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలు హిందీలోకి అనువదించారు. కొన్ని దిన పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి.

2006లో ”మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో ”4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు.

వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. Carlo Collodi రాసిన, ’ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలని, అమార్త్య సేన్ రచన ”ది ఇడియా ఆఫ్ జస్టిస్”ని, ఎన్.సి.పండా రాసిన ”యోగనిద్ర”ని, Tejguru Sirshree Parkhi రాసిన ” ది మాజిక్ ఆఫ్ అవేకెనింగ్”ని తెలుగులోకి అనువదించారు.

సోమ శంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com అనే బ్లాగు చూడచ్చు.
వెబ్‌సైట్: http://www.teluguanuvaadam.com

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

10 Responses to దెయ్యమంటే భయమన్నది…

  1. parimalam says:

    కధ చదివాను .బావుంది .మనిషి కొన్ని బలహీనమైన క్షణాల్లో ఎలా ప్రవర్తిస్తారో హాస్యాస్పదంగా అనిపించినా ఇంచుమించుగా అందరి జీవితాల్లో ఎప్పుడోకప్పుడు ఎదురయ్యే పరిస్థితే .అభినందనలు .

  2. Sarath says:

    Very good story.Chaala chaala Baavundi.Short & Sweet

  3. Arya!

    achanalu enni pajeelu vundali? Weeklylo Rasee alavatu undidi. Ippudu Sikaraju garu leru. AA prothasam ledu. Nisprito raayadam manesanu. Ippudu mee poddu chuusaka raayalani anipistondi.

  4. గంటి రమా దేవి గారూ!
    మీ పేరు చలా రోజుల తర్వాథ మల్లీ ఇప్పుడు చూస్తున్నాను!
    అంధ్రభూమి లో ‘ విదేమారటింగ ” పేరు తో కూడా రాసేవారు కదా !
    మీరు బాగ రాస్తారు ..తప్పక రాయండి

  5. గంటి రమా దేవి గారూ!
    రచయితలకు సూచనలు పేజీ చూడండి.

  6. పరిమళ గారు, శరత్ గారు,
    ధన్యవాదాలు
    కొల్లూరి సోమ శంకర్

  7. raghu kumar says:

    chaala bagundi

  8. Sree says:

    మురికితో నిండిన “ఎలక దెయ్యం”.. సరదాగా సాగిపోయింది. మీరు పెట్టిన శీర్షిక కూడా బాగుంది 🙂

  9. karthika says:

    ammo ratri puta idi chadivesa.
    naku dayam kalalu vastayemo eroju :(.
    repu podduna chavina bagundu.

    http://nenu-nenuga.blogspot.com/

  10. arunank says:

    చిన్నప్పుడు పిల్లలు దయ్యాలగురించి ఎక్కువగా మాట్లాదుకుంటారు ఎందుకనో? .వారిమీద తర్వాత చాలా ప్రభావం చూపుతుంది.
    నాకు చిన్నప్పుడు కొరివి దయ్యాల గురించి స్నేహితులు చెప్పారు.రాత్రి పూట దూరంగా మంట ను చూసినా కొరివిదయ్యం అనుకునే వాడిని.
    పిల్లలకు దయ్యాలు లేవని నూరిపోయాలి.

Comments are closed.