విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – మొదటి అంకము

ఉగాది అనగానే లేత మామిడికాయలూ వేప్పూతా ఉగాది పచ్చడీ ఎలా సహజమో, తెలుగునాట ఉగాది అనగానే కవిసమ్మేళనం కూడా అంతే సహజం. గత ఏడాది సర్వధారి ఉగాదికి పొద్దు నిర్వాహకుల ప్రోత్సాహంతో తెలుగుబ్లాగ్లోకంలో పద్యరచన అంటే ఉత్సాహం ఉన్నవారిని కూడగట్టి మొదటి సారిగా ఉగాది కవి సమ్మేళనము నిర్వహించాము. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. శ్రీ చింతా రామకృష్ణారావు గారు, శ్రీ భైరవభట్ల కామేశ్వర్రావుగార్ల వంటి పద్యరచనలో చెయ్యి తిరిగిన కవులు కూడా మా ఈ చిన్న ప్రయత్నంలో ఆసక్తి చూపించడం ఒక యెత్తయితే, తమతోటివారు అలవోకగా పద్యాలు కట్టేస్తూ సమర్ధవంతంగా సమస్యలు పూరించడం గమనించి చాలా మంది యువతరం వారు ఛందోనియమాలు నేర్చుకుని అనతికాలంలోనే చక్కటి పద్యాలు రాస్తుండటం ఇంకొక యెత్తు. ఇలా వెల్లువెత్తిన ఉత్సాహంతో గత విజయదశమి సందర్భంగా రెండవ కవి సమ్మేళనం నిర్వహించాము. ఈ సభలో వందకి పైగా పద్య కుసుమాలు విరబూసినాయి.

ఏడాది క్రిందట సరదాగా మొదలైన ఈ సంరంభం ఈ ఉగాదితో సంప్రదాయంగా మారుతోంది. ఈ సభలో ఇరవైమందికి పైగా కవులు పాల్గొన్నారు. చమత్కార భరితమైనవీ, దుష్కర ప్రాసలతో కూడినవీ, ఎటూ పొంతన లేకుండా దుర్గమంగా అనిపించేవీ అయిన సమస్యలు, కవుల సృజనాత్మకతని సవాలు చేసే దత్తపదులూ, ఊహాశక్తికి గీటురాళ్ళైన వర్ణనలూ .. ఈ అంశాలు సాధారణంగానే ఉండగా, ఈ సభలో అనువాదమని ఒక కొత్త అంశము ప్రవేశ పెట్టాము. పద్యం రాయడమంటే కేవలం గణాలకి తగ్గట్టు అక్షరాలు పేర్చుకోవడమూ, ఎలాగో కిందా మీదా పడి సమస్యని పద్యంలో ఇరికించెయ్యడమూ కాదు, పద్యమంటే మనసుని ఉత్తేజ పరిచే భావ ధారని మనసుకి హత్తుకునే శబ్ద చాతుర్యంతో చెప్పే కవనమని విశ్వసించి, సంస్కృతాంగ్లాలనుండి కొన్ని ప్రసిద్ధ కవితా పంక్తుల్ని పద్యాల్లో అనువదించమని కోరాము. ఫలితాలు మీరే చూస్తారుగా.

పద్యాలు చాలా పెద్ద సంఖ్యలో రావడం వలన అన్ని పూరణలనీ ఈ నివేదికలో పొందు పరచడం సాధ్యముకాలేదు. అదీ కాక, ప్రత్యక్ష సభలో అందరు కవులూ పాల్గొన లేకపోయారు. అందువలన మొత్తం పద్యాలనుండి కొన్నిటిని మాత్రమే ఈ నివేదికలో ప్రచురించ గలుగుతున్నాము.

{స్వాగత వచనములతో … కొత్తపాళీ}:కం||

స్వాగతమీ కవితతికిని
స్వాగతము విరోధినామ వత్సరమునకున్
స్వాగతము కావ్య కన్యకు
వాగర్ధములకు సరసపు స్వాగత మిత్తున్

{కొత్తపాళీ}: అలనాడు రాయల కొలువులో ముక్కు తిమ్మనార్యునిలా మన సభని రంజింప చేయడానికి వచ్చిన ముక్కు రాఘవ కవీ,
{రాఘవ}: సెలవీయండి
{కొత్తపాళీ}: విఘ్నేశ్వరాది ఇష్టదేవతా ప్రార్ధనముతో మీ కవితా గానం ఆరంభించమని కోరుతున్నాను
{రాఘవ}: శా||

మూలాధారరథాంగదైవతమ! చాముండార్భకజ్యేష్ఠ! చి |
త్రాలంకారవిశేషభూష! తరుణార్కప్రద్యుతీ! సర్వవి |
ద్యాలక్ష్యా! సకలాగమస్తుతమతీ! దన్త్యాస్య! విఘ్నేశ్వరా!
నీ లీలం బలికింపఁజేయుమయ వాణిం బద్యరూపంబులో


{కామేశ్వరరావు}:
విఘ్నేశ్వరుని ప్రార్థన చాలా బావుంది రాఘవగారు!
{కృష్ణమోహన్}: రాఘవ! పద్యం చాలా బాగుంది.
{కొత్తపాళీ}: దన్త్యాస్య .. ఈ సంబోధన నాకు చాలా నచ్చింది. రాఘవా, అలాగే సరస్వతీ దేవిని కూడా స్తుతించి ఆహ్వానించండి.
{రాఘవ}: తప్పకుండానండీ
ఉ||

పిల్లసమీరముల్ గగనవీథిని వీచుచునుండ బ్రహ్మతోఁ
దెల్లనియంచనెక్కి సురదివ్యపురంబుల సంచరించుచుం
బిల్లల పద్యమాలికలఁ విన్చు తలూపుచు సత్కృపన్ సదా
చల్లగఁ జూచుఁగాఁత మము శారద శారదనీరదాభయై


{రాకేశ్వర}:
చాలా క్యూట్ (క్షమించాలి) గా వుంది ఈ పద్యం 🙂
{కొత్తపాళీ}: హహ్హహ్హ. క్యూటెందుకంటే అచ్చ తెలుగు కాబట్టి
{రానారె}: రాకేశ్వరమాటే నామాట. కథ వింటున్నట్టుంది పద్యం వింటున్నట్టు లేదు. అంటే కళ్లకు కట్టినట్టుగా అని నా ఉద్దేశం.
{కృష్ణమోహన్}: సోర్సూ, డెస్టినేషనూ రెంటినీ రాఘవగారే కీర్తించేసారు 🙂 శారద సకలవిద్యా దాత – సకల విద్యాలక్ష్యా అంటూ విఘేశ్వరుడ్ని.. 🙂
{రాఘవ}: పట్టేసారు కృష్ణమోహన్ గారు
{రామకృష్ణ}: శారదా సాక్షాత్కారం అయింది. చాలా బాగుంది.
{సత్యనారాయణ}: పద్యము చాల బాగ వచ్చింది
{భావకుడన్}: ఇది నాకు అర్థంయ్యిందోచ్ 🙂 చాలా బావుందండి.
{రాఘవ}: పద్యం అందంగా వచ్చిందీ అంటే అది పెద్దల ఆశీర్వాదమూ అమ్మ దయానూ

{కొత్తపాళీ}: విజయదశమి సభలో కామేశ్వర్రావు గారు సీస మాలిక రాశారు తెలుగు భారతి నుద్దేశించి. దానికి దీటుగా ఉందిది.
{రాఘవ}: తెలుగుభారతికి వెలుగుభారతి అన్నమయ్య పదాలు వింటూంటే అవే వచ్చేస్తాయండీ మంచి పదాలు.
{కృష్ణమోహన్}: తెలుగు భారతికి వెలుగు హారతి కూడా అన్నమయ్యే!
{పుష్యం}: చెల్లును మీకు గుండె అది ఝిల్లన పద్యములల్ల రాఘవా
{కామేశ్వరరావు}: అయితే “వీథి”లో చుక్క ఉందంటారన్నమాట రాఘవగారు 🙂
{రాఘవ}: ఔను. చుక్కలేకపోతే ఎలాగు చెప్పండి. శారదచంద్రుడు బాధపడడూ! 🙂
{రామకృష్ణ}: మీకు అవధానం అలవాటుందా చేయడం?
{రాఘవ}: రామకృష్ణగారూ, ఎవరిని ఉద్దేశించి అడిగారో తెలియదు కానీనండీ, నేను కనీసం పృచ్ఛకత్వం కూడా వహించలేదండీ.
{రాకేశ్వర}: అవధానానికి మా తరం నుండి ప్రతినిధిగా రాఘవని పంపబోతున్నాం, రామకృష్ణగారు 🙂
{రామకృష్ణ}: శుభం

{కొత్తపాళీ}: ఇష్టదేవతా ప్రార్ధన కూడా కానియ్యండి రాఘవా .. ఇక అసలు సభలోకి వెళదాం
{రాఘవ}: సరే. ఇష్టదైవతప్రార్థన
చం||

శరదిశశాంకపూర్ణసమసౌఖ్యదచారుముఖంబువాని దా
శరథిని ధర్మవిగ్రహుని సత్యపరాక్రమునార్తరక్షకున్
శరధనుఖడ్గధారిని విశాలభుజాంతరసీమవానినిన్
శరధిశయానునిం గొలుతు శంకరసన్నుతు రామచంద్రునిన్

{రామకృష్ణ}: చాలా బాగుందండి
{కృష్ణమోహన్}: స్వస్తుతి అన్నమాట.. అందుకని… మరింత అందంగా వచ్చింది.. 🙂
{రాఘవ}: కృష్ణమోహన్ గారూ… మా కులదైవం పేరు నాకు పెట్టారు అంతేనండీ 🙂

{కొత్తపాళీ}: రామకృష్ణ కవి గారూ, కొత్తకొత్తగా వస్తున్న కొత్త సంవత్సరానికి మీ మధుర వాక్కులతో ఆహ్వానం పలకాలని మా కోరిక.
{రామకృష్ణ}: శ్రీమద్విరోధికి స్వాగతం . చిత్తగించండి.
ఉ||

స్వాగతమమ్మ! సత్కవుల సంగతినీవవిరోధివమ్మ! నీ
యాగమనమ్ము మాదు పరమాద్భుత భావికి సూచనమ్మ! సద్
యోగమునిమ్మ! దుష్టులకయోగము గొల్పు విరోధివౌచు, యే
రోగముఁ లేక మాకిల పురోగతి నిమ్మ! విరోధి వర్షమా!

ఉ||

సద్రచనాభిలాషులగు సజ్జన వర్యుల శత్రు సంహతిన్
రుద్రుని పోలి చీల్చగ విరోధిగ పేరును దాల్చి వచ్చి, మా
భద్రతఁ జూచు నీకు నిట పల్కెద మిమ్ముల స్వాగతమ్ము. సత్
క్షౌద్రము లొల్కుచున్ జనులఁ గౌరవమొప్పఁగఁ గావు మిమ్మహిన్.

{కొత్తపాళీ}: మాష్టారూ కొంచెం తాత్పర్యం చెప్పాలి
{కొత్తపాళీ}: సత్ క్షౌద్రము లొల్కుచున్ ??
{రామకృష్ణ}: క్షౌద్రము = తేనె, నీరు
{రామకృష్ణ}: అందించుతూ
{రాఘవ}: క్షుద్రమంటే తేనెటీగ కదండీ… క్షౌద్రమంటే తేనె
{కొత్తపాళీ}: ఆహా, బాగుంది. నీ యాగమనమ్ము మాదు పరమాద్భుత భావికి సూచనమ్మ – చాలా బావుంది
{రాఘవ}: రామకృష్ణారావుగారూ, భలే చెప్పారండీ. విరోధిర్భవతు నో విరోధవిరోధిః.
{కృష్ణమోహన్}: ఏమి ఉగాదో… ప్రతీ సంవత్సరం పేరు మార్చుకు వచ్చేస్తోంది.. అసలు తను మారుతోందో లేదో తెలియడం లేదు 🙂
{రాఘవ}: ఇలా అంటున్నారనే పేరుతో పాటు ఈ సారి షేరు కూడా మార్చింది 😉
{కొత్తపాళీ}: క్రిమో, ఉగాది ఎప్పుడూ నవ యుగాదే. సంవత్సరాలే మారుతుంటాయ్
{కామేశ్వరరావు}: పేరుకి “క్షుద్రం”గా కనిపించినా అది తేనెలనే అందిస్తుందని ధ్వని! చాలా బావుంది!
{రానారె}: రుద్రుని పోలి చీల్చగ… బ్రమ్మాండంగా ఉంది.

{కృష్ణ}: సభకు నమస్కారములు
{కొత్తపాళీ}: కొండూరి కృష్ణరాయా స్వాగతం. కృష్ణ గారు మనందరికీ ఆత్రేయ బ్లాగు కర్తగా సుపరిచితులు

{కొత్తపాళీ}: కామేశ్వర్రావు గారూ .. సిద్ధమా?
{కామేశ్వరరావు}: మీదే ఆలశ్యం 🙂
{కొత్తపాళీ}: మీ వసంతాహ్వాన కోకిల గానం వినిపించండి 🙂
{కామేశ్వరరావు}:

చం||

మనుషుల గుండెలోతులను మాయని మానవతామరందమున్
గనుగొని, గ్రోలి, కమ్మనగు కైతల తేనెలపట్లు గట్ట, ర
మ్మని పిలిచేనుగా మనల నామని పొద్దు ఉగాదివేళ ఝు
మ్మను మధుగీతి బద్యముల స్వాగతమిత్తము క్రొత్తయేటికిన్


{రానారె}:
అహా! తెలుగు పద్యం 🙂
{రాఘవ}: భలే. మళ్లీ తేనెపట్టు.
{గిరిధర్}: కమ్మని కైతలని తీయని తేనె పట్టులో బానే ఇరికించేసారు
{కొత్తపాళీ}: అంతే తేనెలు వాకలు కడుతున్నాయి 🙂
{రామకృష్ణ}: తేనెలవాగులు ప్రవహిస్తుందీ సంవత్సరం

{కామేశ్వరరావు}: మరొక్క పద్యం.

సీ||

తెలుగన్న తులలేని వలపు తీగలుసాగి జాలానుబంధమై సౌరుమీర
ప్రత్యక్షమైన ఏ పరిచయమ్మును లేని వారి బద్యాలతో పలుకరింప
వర్షాది శుభవేళ హర్షాతిరేకాన నిలువెల్ల హృదయాలు పులకరించ
హృదయాల వికసించు మృదుభావ కుసుమాల మాలలతో తోరాణాలు గట్ట

తే||

వచ్చి వాలితిమి కువకువల్ సెలంగ
గువ్వలటు శారదాలయ గోపురమున
పలుకులమ్మకు మనసార ప్రణతి జేసి
మొదలుపెట్టెదమిక మన ముచ్చటలను

{రానారె}: అలాగే నండి. ఇంత మధురంగా చెప్పిన తరువాత అలాగేనని తలలూపాల్సిందే.
{రామకృష్ణ}: మాటలా తెనుగు తేటలా
{గిరిధర్}: ఆహా, చాల బావుంది
{భావకుడన్}: పలుకులమ్మకు కువకువల స్వాగతం…చాలా మధురంగా ఉంది.
{కామేశ్వరరావు}: గిరిగారు, తేనెపట్లలోంచి తేనెలని తీసే బాధ్యత రసజ్ఞులైన విమర్శకులది!
{రాఘవ}: ఆహాహా. జాలానుబంధం. పద్యాలపలుకరింపు. హర్షాతిరేకం. కువకువలు. శారదాలయగోపురం…. భలే భలే భలే.
{కొత్తపాళీ}: సెబాసు
{రానారె}: తెలుగన్న తులలేని వలపు సాగినట్లే సాగిందీ పద్యం కూడా
{రోహిణి}:
విరోధి ఉగాది శుభాకాంక్షలు
శా||

శ్రీమద్వేంకట నాయకుండు, గ్రహముల్ శ్రేయస్సులన్నిచ్చి, మీ
క్షేమంబున్ నవ వర్షమందు సకలాభీష్టంబు సద్భక్తియున్,
క్షామంబింతయు లేక భూమి శుభముల్ గాంచంగ, పద్మావతీ
శ్రీమాతన్ కొనియాడి వేడెద విరోధీ వర్ష యారంభమున్.

————
(తొలి అంకం సమాప్తం)
————

తరువాతి అంకం: సమస్యాపూరణం (త్వరలో)

This entry was posted in కవిత్వం and tagged , , . Bookmark the permalink.

6 Responses to విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – మొదటి అంకము

  1. సూర్యుడు says:

    ఈ కవి సమ్మేళణం ఒక్క కవులకే ప్రవేశమా లేక ఆశక్తి ఉన్నవాళ్లెవరైనా రావచ్చా? రావచ్చంటే ఎక్కడకి? 🙂

    ~సూర్యుడు 🙂

  2. సూర్యుడు గారూ, ఈ సారి చాలా మంది కవులు పాల్గొంటూ ఉండడంతో బహు కొద్దిమంది ప్రేక్షకులని మాత్రమే ఆహ్వానించగలిగాము. మీకు ఆసక్తి ఉంటే చెప్పండి. వీలుని బట్టి మళ్ళీ జరిగే సభకి ఆహ్వానిస్తాము.

  3. సూర్యుడు says:

    కొత్తపాళీ గారు, తప్పకుండా. ఈ సారి వీలైతే చెప్పండి.

  4. రవి says:

    ఇంత అలవోక గా పద్యాలు చెప్పడం ఎలా కుదురుతుందో తెలియకుండా ఉంది. సత్కవులందరికీ, పొద్దు వారికి, పాల్గొన్న సభ్యులకు శుభకామనలు.

    “విరోధిరస్తు నో sవిరోధిః” (రాఘవ గారి స్వస్తి వచనం నుంచి అందిన ప్రోత్సాహంతో..)

  5. సూర్యుడు గారు, ఇది చూస్తే నాకు మెయిల్ చెయ్యండి.
    కొత్త ఉగాది సభకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
    kottapali at gmail dot com

  6. సూర్యుడు says:

    కొత్తపాళీ గారు,

    మీరు నన్ను పేరు పెట్టి మరీ ఆహ్వానించారు, నేనే చూసుకోలేదు.

    గుర్తుపెట్టుకుని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.

    నమస్కారములతో,
    సూర్యుడు 🙂

Comments are closed.