రాలిన చింతపండు – కొత్త దుప్పటి

– స్వాతీ శ్రీపాద

మామూలు గ్రామీణ వాతావరణంలో ప్రతిచిన్న విషయానికీ ప్రాముఖ్యత వుంది. గ్రామీణులు చిన్నచిన్న విషయాలలో కూడా ఎంత జాగ్రత్త, పొదుపరితనం పాటిస్తారో; అది వారికి ఎందుకు అవసరమో ఇదే రచయిత తన చినుకుల సవ్వడి నవలలో అద్భుతంగా చూపాడు. చెట్టు నుండి రాలే చింతపండు గురించి ఇంతవరకు ఎవరూ కథ రాయాలని అనుకుని వుండరు. దాన్ని కథాంశంగా ఎంచుకోవడం రచయిత సూక్ష్మదృష్టికి నిదర్శనం. “రాలిన చింతపండు” సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథాసంపుటి “కొత్త దుప్పటి”లోని ఐదవ కథ. “శివరాత్రి దాటి వారం రోజులైంది.” – అని కథను ప్రారంభిస్తూ శివరాత్రి తో పాటు ఆరోజుల వాతావరణాన్ని, పక్షుల వ్యవహారాలను, సంబంధిత వివరాలను సూక్ష్మంగా వర్ణిస్తూ తనదైన శైలిలో కథను సాగించాడు రచయిత.

చిలుకలు దానిమ్మ గింజలను తింటే తప్పేమిటి అనుకునే సౌహార్ధ్రత ఉత్తమ పురుషలో నడిచే ఈ కథలోని కథకుడిలో కనిపిస్తుంది. రాలిన చింతకాయలకోసం ఊరిలో ఆడవారి తగువు కళ్ళకు కట్టినట్టుగా చిత్రించాడు.

పైటలు జారి, కోక ముడులు విడిపోయే తగువులు… అదీ ఏరుకున్న చింతకాయల కోసరం.
ఆర్థికంగా ఏ చిన్న ఆసరా దొరికినా సమస్యల సముద్రాన్ని ఈ దరినుంచి ఆ దరికి ఈదేందుకు సిద్ధపడేవాళ్ళు – వాళ్ళు.

ఇంకోవైపు పొలాల సరిహద్దులు దాటి తన చేలో చెట్లనీడలు కమ్మేసినా మొక్కమొలవక భూమి పనికిరాకుండా పోయినా ఏమనలేని పరిస్థితి కథకుడిది. రాలిన చింతపండు కోసం ఉదయం పోట్లాడి గుడ్డలున్నాయో లేవో తెలీకుండా ఎగబడిన శేషమ్మ తాను ఏరుకున్న కొత్త చింతపండు శుభ్రం చేసి మరీ తెచ్చి ఇంటావిడకు ఇవ్వడం కథకుడికి ఆశ్చర్యం కలిగిస్తుంది. మళ్ళీ ఇద్దరిమధ్యా తగువు ప్రస్తావన వస్తుంది. శేషమ్మ ఉక్రోషంగా జవాబిస్తుంది –
“దానెమ్మ మొగుని సొమ్మా” అని.
“మీ సేనంతా ఆ చెట్లతోనే నాశనమైంది. నాయానికి మీ పక్క కొమ్మల కాయలన్నీ మీకే రావాల. అందుకే నేనేరకొచ్చి మీ కిస్తండా” అంటుంది.
ఇంతకూ ఆమె తెచ్చి ఇచ్చేందుకు సిద్ధ పడటానికి కారణం జ్వరపడిన పిల్లవాడికి పొద్దున ఇచ్చేందుకు కాసిని కాఫీ నీళ్ళు, రెండు పూటలా కాస్త చారన్నం.

చింత పండు అమ్ముకున్నా ఓ పూట గడుస్తుందేమో కాని ఏది చేసినా ఇంట్లో వాళ్ళందరికీ చెయ్యాలి – అదీ ఒక్క పూటకు చాలదు. ఇలాగైతే జ్వరపడిన వాడికి కాస్త ఆసరా దొరుకుతుందని ఆమె ఆశ. కొట్లాటలు మామూలే అని ఇల్లాలు సమాధాన పడటం, ‘నాక్కాకుంటే మరొకరికి అమ్ముకుని అవసరం తీర్చుకుంటుంది గనక మన చేలో రాలిన చింతపండు ఎవరో ఎందుకు తినాల’ని భార్య అడగటం తో కథకుడు సర్దుబాటు కాకున్నా జ్వరం మాత్రలున్నాయి అవయినా ఇమ్మని సూచించటం లో గ్రామీణ వాతావరణంలోని వట్టిపోని ఉదారత కనిపిస్తుంది. అనువంశిక లక్షణాలు మనిషిని ఏవైపు నడిపిస్తున్నాయనే ఊహను పాఠకుడికే వదిలేసాడు రచయిత.
చూడటానికి కథా వస్తువు అతి మామూలుగా అనిపించినా, కథలోని పాత్రల వెనుక దారిద్ర్యపు ఛాయలు, వాటి ప్రభావం వల్ల మారిపోతున్న విలువలు, దానికి గల కారణాలు సవిస్తారంగా పాఠకుడికి అందించారు రచయిత. ముఖ్యంగా అభాగ్యుల పట్ల కథకుడు చూపే సానుభూతి మనుషుల్లో మిగిలిపోయిన మానవత్వాన్ని ఎత్తి చూపుతుంది.

ఏదేమైనా జీవితంలోంచి, వాస్తవాలనుంచి, చిన్న ఘటనలనుంచి పెద్ద భావాలను కథలుగా మలచగల నైపుణ్యం ఈ కథలో చూపుతారు రచయిత.
అభినందించ దగిన కథల్లో ఇదొకటి.

————————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.