-కొడవటిగంటి కుటుంబరావు
“ఇవాళ కాబేజి సూప్ మరీ బాగుంది,” అంటూ సబాకివిచ్ చెంచాతో తాగుతూ, నంజుడు పెద్ద పెద్ద ముక్కలుగా నోట్లో వేసుకున్నాడు. కాబేజి సూప్ వెంట ఉండే ఈ నంజుడును గొర్రె పొట్టలో గోధుమపిండీ, మెదడూ, గొర్రె పాదాలూ కూరి తయారు చేస్తారు. “పట్నంలో తిండి ఏం తిండి? ఇటువంటి ఆదరువులు అక్కడ ఎన్నడూ అమరవు”.
“గవర్నరుగారింట వంట బాగానే ఉంటుంది మరి” అన్నాడు.
“ఆ వంట ఎలా చేస్తారో తెలుసా? తెలిస్తే నోట పెట్టుకోలేరు”.
“వంట ఏం పెట్టి చేసారో నాకు తెలీదు, అందుచేత ఆ విషయం ఏమీ చెప్పలేను. కాని పందిమాంసంతో చేసిన ‘చాఫ్’లూ, చేపకూర చాలా బాగున్నాయి.”
“మీరలా అనుకున్నారు. వాళ్ళు బజార్లో కొనేదేమిటో నేనెరుగుదునులెండి. వంటవెధవ ఫ్రాన్సులో తయారుతిన్నవాడు, పిల్లినికొని తోలు వొలిచి కుందేలని వడ్డిస్తాడు.”
“ఎబ్బే. ఎంత అసహ్యమైనమాటలంటున్నారు!” అన్నది భార్య.
“అవునోయ్. వాళ్ళు చేసే పనులవే. వాళ్ళలా చేస్తే అది నా తప్పా? అనగూడదేమోగాని, మన ఆల్కుల్క చెత్తబుట్టలో పడేస్తుంది చూడూ, అలాటి తుక్కంతా వాళ్ళు సూప్ లో వేసేస్తారు, సూప్ లో!”
“మీరు భోజనాల దగ్గిర ఎప్పుడూ ఇలాటి మాటలే అంటారు మరీనూ!” అని భార్య ఆక్షేపించింది.
“అది కాదోయ్. నేను అటువంటి పనులు చేస్తే కదా నువ్వు తప్పు పట్టవలసింది! నేను మాత్రం అటువంటి పెంట తినలేను, చెప్పొద్దూ. కప్పలమీద చక్కెర చల్లితే నేను ఒక్కనాటికి నోట్లో పెట్టుకోను. ఆయిస్టర్లు కూడా తినను. అవి ఎలావుండేదీ నాకు తెలుసు. “సబాకివిచ్ చిచీకవ్ కేసి తిరిగి, “కొంచం మాంసం వేయించుకోండి. ఇది మంచి తొంటిమాంసం, మార్కెటులో రోజుల తరబడి నిలువ ఉన్నది తెచ్చి మీ పట్టణాల్లో కైమా తయారు చేసిన బాపతు కాదు. అదంతా ఫ్రెంచి, జర్మను డాక్టర్లు చేసిన సృష్టి, వాళ్లను నేనైతే ఉరి తీసేస్తాను. వాళ్లు ఆకలి లేకుండా చెయ్యటానికి కూడా చికిత్స కనిపెట్టారు. వాళ్ళది రక్తహీనమైన జర్మను శరీరతత్వం కనక రష్యనుల పొట్టలకు కూడా చికిత్స చెయ్యగలమనుకుంటారు. శుద్ధ పొరపాటు, అంతా వాళ్ల భ్రమ, అంతా…” అంటూ తల కోపంగా ఆడించాడు.”సంస్కృతీ వికాసంట, సంస్కృతీ వికాసం. ఈ వికాసమంతా ఏమిటంటే…థూ! అన్నంముందు కూచున్నాంగాని, లేకపొతే సరి అయిన మాట చెబుదును. మా ఇంట్లో అదంతా పనికి రాదు. పంది మాంసం తినాలంటే పందినంతా తెచ్చి బల్లమీద పెట్టేస్తాం, గొర్రె మాంసం తినాలంటే మొత్తం గొర్రె రావలిసిందే, బాతైతే మొత్తం బాతు! తిన్నవి రెండే ఆధరువులైనా వాటినే కడుపునిండా తినాలని నా మతం!” సబాకివిచ్ ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూపాడు, తొంటి మాంసంలో సగం పళ్లెంలో పెట్టుకుని, ప్రతి చిన్న ఎముకనూ గీరుతూ, చీకుతూ అంతా తినేసాడు.
“అవును. ఈ మనిషికి ఏది ఏమిటో బాగా తెలుసు!” అనుకున్నాడు చిచీకవ్.
సబాకివిచ్ తనచేతిని గుడ్డతో తుడుచుకుంటూ, “నా ఇంట్లో అలాటివి పనికిరావు. ప్ల్యూష్కిన్ పద్ధతులు నాకు నచ్చవు; ఎనిమిది వందల కమతగాళ్ళను పెట్టుకుని ఆ మనిషి రెండుపూటలా గొర్రెలను కాసుకునేవాడల్లే భోంచేస్తాడు” అన్నాడు.
“ఎవరీ ప్ల్యూష్కిన్?” అని చిచీకిన్ అడిగాడు.
“ఒక లుచ్ఛా. ఎంత పిసినిగొట్టో మీరూహించలేరు. వాడికన్న ఖైదీలు మంచి తిండి తింటారు. కమతగాళ్ళందర్నీ తిండికి మాడ్చి చంపుకున్నాడు…”
చిచీకవ్ ఆసక్తితో, “నిజంగానా? ఆయన కమతగాళ్లు పెద్ద సంఖ్యలో చచ్చిపోయారేం?” అన్నాడు.
“ఈగలు చచ్చినట్లు చస్తారు.”
“నిజంగానే! ఈగలల్లేనా? ఆయన ఎంతదూరంలో వుండేదీ దయచేసి చెబుతారా?”
“నాలుగు మైళ్ళు.”
“నాలుగు మైళ్ళే? మీ గేటు దాటినాక కుడివైపు వెళ్లాలా, ఎడమవైపు వెళ్లాలా?” ఆన్నాడు చిచీకివ్. అతని గుండె కాస్త వేగంగా కొట్టుకుంటున్నది.
“ఆ గాడిద కొడుకు ఇంటికి మీరు దారి కూడా అడగరాదు. వాణ్ణి చూడబోయేకన్న ఏ పోరాని చోటికి పోయినా మేలే” అన్నాడు సబాకివిచ్.
“ఆ, నే నడిగింది ప్రత్యేకించి ఏమీ…నా కుతూహలమల్లా ఈ ప్రాంతాలను గురించి తెలుసుకుందామనే.”
గొర్రెమాంసం తరువాత మీగడ అచ్చులు వచ్చాయి, అవి ప్లేట్ల కన్న పెద్దవిగా ఉన్నాయి. ఆ తరువాత దూడ ప్రమాణం గల టర్కీ కోడి వచ్చింది. దాని నిండా రకరకాల పదార్థాలు కూరి వండారు. గుడ్లూ, వరి అన్నమూ, ఉలవకాయలు ఇంకేమేమిటో వచ్చాయి. వీటన్నింటితోనూ భోజనం ముగిసింది. బల్ల ముందు నుంచి లేచేటప్పుడు చిచీకవ్ కు తన బరువు ఒక సలక పెరిగిందనిపించింది. వాళ్ళు డ్రాయింగ్ రూములోకి వెళ్ళారు. అక్కడ పళ్లూ ఫలాలకు మారుగా ఒక సాసర్ లో జామ్ వారి కోసం సిద్దంగా ఉన్నది. ఆ సాసర్ ను వారిద్దరిలో ఎవరూ తాకలేదు. మరికొన్ని సాసర్లలో జామ్ పెట్టటానికి గాను ఇంటావిడ అవతలికి వెళ్ళింది.
ఆవిడ వెళ్ళగానే చిచీకవ్ సబాకివిచ్‌కేసి తిరిగాడు. ఆయన భుక్తాయాసంతో రొప్పుతూ, గొంతులోనుంచి ఏవో అర్థం లేని ధ్వనులు తెప్పిస్తూ, తనపైన సిలువ వేసుకుంటూ, పదేపదే చెయ్యి నోటి దగ్గర పెట్టుకోసాగాడు.
“ఒక చిన్న వ్యవహారం గురించి నేను తమతో కొద్దిగా మాట్లాడవలసి ఉంది,” అన్నాడు చిచీకవ్ ఆయనతో.
“ఇదిగో ఇంకా జామ్. చాలా మంచిది. తేనెతో చేసినది!”అంటూ ఇంటావిడ మరొక సాసర్ తెచ్చింది.
“తరువాత తీసుకుంటాంలే. నువు నీ పని చూసుకో ఇక. పావెల్ ఇవానవిచ్, నేనూ కోట్లు విప్పేసి కాస్త కునుకు తీస్తాం” అన్నాడు సబాకివిచ్.
ఆవిడ పరుపులూ, దిళ్ళూ తెప్పిస్తానని కూచుంది, “ఆక్కర్లేదు. ఈ వాలుకుర్చీలలోనే పడుకుంటాం” అని ఆయన అన్నాక వెళ్లిపోయింది.
సబాకివిచ్ తల కొంచెంగా వంచి వ్యవహారం ఏమిటో తెలుసు కోవటానికి సిద్ధపడ్డాడు.
చిచీకవ్ అసలు విషయానికి ఎంతో పెద్ద చుట్టు తిరిగి వచ్చాడు, స్థూలంగా రష్యను సామ్రాజ్యాన్ని ప్రస్తావించాడు, దాని విస్తృతిని మెచ్చుకున్నాడు, పూర్వం రోమను సామ్రాజ్యం కూడా ఇంత ఉండేదికాదని, అంచేతే ఇతర దేశాలవాళ్ళు కూడా దీన్ని చూసి విస్తుపోతున్నారనీ అన్నాడు…(సబాకివిచ్ అలాగే తలవంచి వింటున్నాడు) ప్రస్తుత ప్రభుత్వ శాసనాలను అనుసరించి – అవి నిజంగా అద్వితీయమైనవే -జనాభా లెక్కల్లో పేర్లుండి చనిపోయిన కమతగాళ్లూ, తిరిగి జనాభా లెక్క లు వేసేదాకా బతికున్నట్టే భావించబడతారు. లేకపోతే ప్రభుత్వ కచేరీలు స్వల్పవిషయాలను గురించి బోలెడంత జంజాటన పడవలిసొస్తుంది. అసలే క్లిష్టంగా ఉన్న పరిపాలనా యంత్రం మరింత చిక్కులు పడిపోతుంది…(సబాకివిచ్ ఇంకా తలవంచి వింటూనే ఉన్నాడు.) ఈ ఏర్పాటు సమర్థనీయమే అయినప్పటికీ, చాలామంది భూస్వాములు చచ్చిపోయిన కమతగాళ్ళ పైన కూడా పన్నులిచ్చుకోవలసి రావటం మూలాన కొంత నష్టపడిపోవడం జరుగుతున్నదనీ, ఆయన మీద ఉండే గౌరవం కొద్దీ ఆయన భారాన్ని కొంత తగ్గించాలని తనకు సంకల్పం ఏర్పడిందనీ చిచీకవ్ పూర్తి చేశాడు, అతను మాటలను ఎంతో జాగ్రత్తగా ఉపయోగిస్తూ, “లేని’ కమతగాళ్ళు అన్నాడు గాని చచ్చిన వాళ్ళనేమాట ఉచ్చరించలేదు.
సబాకివిచ్ వింటున్నంతసేపూ తలవంచి అలాగే ఉన్నాడు. ఆయన ముఖాన గల భావంలో ఏ కొంచెం మార్పు కూడా కలగలేదు. ఆయన బొందెలో ప్రాణమే లేనట్టూ, ఒకవేళ ఉన్నా అది ఉండవలసినచోట ఉండక మాయల ఫకీరు ప్రాణంలాగా సప్తసముద్రాలవతల కీకారణ్యం మధ్య ఏ చిలకలోనో ఉన్నట్టూ అనిపించింది.
“అందుకని మరి…?” చిచీకివ్ ఆయన సమాధానంకోసం భయం భయంగా ఎదురు చూశాడు.
“మీకు చచ్చిన కమతగాళ్ళు కావాలన్న మాట?” అన్నాడు సబాకివిచ్ నిర్లిప్తంగా, తాము మాట్లాడుకునేది ధాన్యం గురించి అయినట్టుగా.
“అవును, లేనివాళ్ళు,” అన్నాడు చిచీకవ్, మళ్ళీ మృదువైన మాటే ఉపయోగిస్తూ.
“కొందరున్నారు. అందుకేమీ సందేహం లేదు,” అన్నాడు సబాకివిచ్.
“ఇంకే.. అలాంటి వాళ్లుంటే వాళ్ళను వదిలించుకోవటం మీకే మంచిది”.
“అవశ్యం, వాళ్లను అమ్మటానికి నాకభ్యంతరం లేదు” అన్నాడు సబాకివిచ్, తల కొంచెంగా ఎత్తి, కొనే వాడికి అంతో ఇంతో లాభం ఉండక పోదనుకుంటూ.
“దీని దుంపతెగ, నేనింకా కొంటానని సూచించకుండానే అమ్ముతాట్ట,” అనుకుని చిచీకవ్, పైకి “మాటవరసకు ధర ఎంతా? కావటానికది విడ్డూరమైన సరుకనుకోండి…ధరను గురించి మాట్లాడటమే ఎబ్బెట్టుగా ఉంది,” అన్నాడు.
“ఎక్కువ అడగబోను, మనిషికి నూరు రూబుళ్ళివ్వండి,” అన్నాడు సబాకివిచ్.
“నూరే!” అంటూ చిచీకవ్ ఆయన ముఖంలోకి వింతగా, నోరు తెరుచుకొని చూశాడు, తన చెవులే పొరపాటు పడ్డాయో, బండనాలుక సరిగా పలకక సబాకివిచ్ ఒకమాట అనటానికి ఇంకొక మాట అన్నాడో అతను ఊహించలేకపోయాడు.
“ధర ఎక్కువంటున్నారా? మీరైతే ఏ ధర కడుగుతారూ?” అన్నాడు సబాకివిచ్.
“నా ధరా! మనం ఏదో పొరపాటుపడ్డాం, లేక ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోవటం లేదు. అందుచేత ఏం మాట్లాడుతున్నదీ మరచిపోయాం. గుండె మీద చెయ్యేసుకుని చెబుతున్నాను, మనిషికి ఎనభై కోపెక్కులకన్నా ఇవ్వలేను…అదే చాలా హెచ్చు!”
“ఎబ్బే, ఏమిటది, ఎనభై కోపెక్కులా!…”
“మరి నా ఉద్దేశంలో అంతకంటే హెచ్చు ఇవ్వనవసరం లేదు.”
“నేనేమన్నా అట్ట చెప్పులు అమ్ముతున్నాననా?”
“వాళ్ళు మనుషులు కారని మీకూ తెలుసుగా.”
“జనాభా లెక్కల్లో ఉన్న కమతగాణ్ణి నాలుగు ముష్టి కోపెక్కుల కమ్ముకునే మందమతి ఎవడైనా ఉంటాడాండీ?”
“వాళ్ళను గురించి అలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు బోధపడకుండా ఉంది. వాళ్ళు ఏనాడో చచ్చిపోయిరి. పేర్లు తప్ప ఏమీ మిగలలేదాయే. సరే పోనివ్వండి, మీరంతగా అడుగుతున్నారు గనక మనిషికి ఒకటిన్నర రూబులు చేసి ఇస్తాను, ఆ పైన నా వల్ల కాదు.
“ఇలాటి ధర ఇస్తాననటానికి మీరైనా సిగ్గుపడవలసిందే. మీరు బేరమాడుతున్నారు, మీరివ్వదలచిన అసలు ధర బయట పెట్టండి”.
“అంతకంటే ఇవ్వలేను, మిఖాయిల్ సిమ్యోనవిచ్, నా మాట నమ్మండి, నావల్ల కాదు; సాధ్యంకాని పని ఎలా చెయ్యటం?” అంటూనే చిచీకవ్ మరొక అరరూబులు పెంచాడు.
“మీరెందుకలా లోభిస్తున్నారు? ఖరీదు ఎక్కువేమీ కాదే! ఇంకొకడైతే మిమ్మల్ని మోసగించి కమతగాళ్ళకు బదులుగా ఏదో చెత్త యిచ్చేసును. నా మనుషులు గట్టివాళ్ళు, అందరూ ఫస్టుక్లాసు రకం; కొందరు వృత్తివిద్యలు నేర్చినవాళ్ళు, మరికొందరు గట్టిగా వ్యవసాయపు పనులు చెయ్యగలవాళ్ళు. చూడండి, బళ్ళు చేసే మిహ్వీవ్ ను తీసుకోండి, వాడు కమాన్లు లేని బండి చేసేవాడు కాడు. మీ మాస్కోలో వాళ్ళు చేసేలాటివి కావు… ఒక గంటకల్లా చెడిపోతూ… గట్టివి… వాటికి వాడే రంగులూ అవీ వేస్తాడు”.
చిచీకవ్ నోరు తెరచాడు; మిహ్యీన్ ఈ ప్రపంచాన్ని వదలి పెట్టిపోయాడు గదా అందామని అతని ఉద్దేశం. అయితే సబాకివిచ్ తన వాగ్ధోరణికి తానే సమ్మోహితుడైనవాడల్లే అనర్గళంగా మాట్లాడుకు పోసాగాడు.
“వడ్రంగం చేసే ప్రొబ్కస్తిపాన్! అలాటి కమతగాణ్ణి ఇంకొకణ్ణి చూపారంటే తలతీసి ఇచ్చేస్తాను! వాడి బలం ఏం బలం! వాడు సైన్యంలో చేరి ఉంటే ఏమిచ్చినా ఇచ్చేవాళ్లు, ఏడడుగులు మించిన ఎత్తు!”
ప్రోబ్క కూడా యీ లోకాన్ని వదిలేశాడని చిచీకవ్ అనబోయాడు; కాని ఆ వాగ్ధాటిని ఆపటం అతనివల్ల కాలేదు, అతను విని తీరవలసి వచ్చింది.
“తాపీపని చేసే మీలూష్కిన్ మీరు ఏ యింటో కట్టమంటే ఆ యింటో స్టవ్ కట్టేస్తాడు, మక్సీస్ తిల్యాత్నికవ్ చెప్పులు కుడతాడు, వాడు ఉలి తోలులో గుచ్చితేచాలు బూట్లు తయారైపోతాయి. అవి నిజంగా బూట్లే, ఎన్నడూ ఒక్క చుక్క తాగి యెరగడు. యెరెమి సరకప్ల్యోఖిన్! ఆ ఒక్కరైతే అందరి విలవా చేసును. వాడు మాస్కోలో వ్యాపారం చేసి తన కూలికి బదులుగా తడవకు అయిదువందల రూబుళ్ళు చొప్పున పంపేవాడు. అందరూ అలాంటివాళ్ళు! అటువంటి వాళ్లను ప్ల్యూష్కిన్ అమ్మగలడా?”
ఈ వాగ్ధారణను చూసి దిమ్మరపోయిన చిచీకవ్ చిట్టచివరకు, “తమరు మరోలా అనుకోకండి, వీళ్ళందరి గుణగణాలూ ఎందుకు వర్ణిస్తున్నారు? వాళ్ళిప్పుడెందుకూ కొరగారు, చచ్చారు గద! సామెత చెప్పినట్టు చచ్చినవాడు పోటీగా వుంచటానిక్కూడా పనికిరాడు,” అన్నాడు.
సబాకివిచ్ కొంచెం ఆలోచించినమీదట వాళ్లు చచ్చారని జ్ఞాపకంవచ్చినవాడిలాగా, “అవును, వాళ్ళు చచ్చారనుకోండీ, అయినా యీ బతికున్న వాళ్లు నిజంగా మనుషులనిపించుకోరు. ఈగలెంతో వీళ్లూ అంతే” అన్నాడు.
“అయితేనేం? వీళ్ళు బతికున్నారాయె, వాళ్లు కలలాగ అయిపోయిరి.”
“కరిగిపోవటమేమిటి? మిహ్యీన్ లాటివాడు మళ్ళీ పుట్టడన్న మాట! వాడు ఎంత ఆజానుబాహువంటే వాడు ఈ గదిలోకి రావటం సాధ్యమయేది కాదు. వాణ్ణి కల అనటానికి లేదు! వాడి భుజబలం గుర్రాన్ని మించి ఉండేది. అటువంటి కల మీకెక్కడ దొరుకుతుందో చెప్పండి, చూస్తాం!” ఈ ఆఖరు వాక్యాల నాయన గోడమీది బొమ్మలతో అన్నాడు. తరచు ఇలాగే జరుగుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటూన్నప్పుడు వారిలో ఒకడు తన మాటలను ఏ కారణంచేతనో రెండో వాడితో అనక ఆ సమయానికి అక్కడ తటస్థపడే మూడోమనిషితో అంటాడు, వాడు ముక్కూమొహమూ ఎరగనివాడైనాసరే, తాను మధ్యవర్తి కేసి చూసినట్టు ఎంత ఆత్రంగా చూసినప్పటికీ ఆ మనిషి ఒక జవాబు గాని, అభిప్రాయం గాని, కుమ్మక్కి గాని ఇవ్వకపోయినా సరే, ఆ కొత్తవాడు బయటపడి ఒక నిమిషం సేపు తనకేమీ తెలియని విషయం గురించి ఏమనాలో, అలాగే రాయిలా నిలబడి పోయి తన మర్యాద ఎలా కాపాడుకోవాలో తెలియని స్థితిలో చిక్కుకుని తరువాత లేచి తన దారిన పోతాడు.
“లేదు, నేను రెండు రూబుళ్ళపైన ఇవ్వలేను,” అన్నాడు చిచీకవ్.
“నేనేదో ఎక్కువ ధరకు అడిగాననీ, మీమాట తీసేశాననీ అనిపించుకోకుండా ఉండగలందుకు, కావాలంటే మనిషికి డెబ్భయ్యయిదు రూబుళ్ళు – అదికూడా మీరు స్నేహితులు గనక!”
“నేను వెర్రివాణ్ణనుకుంటున్నాడా ఏం?” అనుకుని చిచీకవ్ పైకి, “నాకు నిజంగా వింతగా వుంది: మనిద్దరమూ ఏదైనా నాటకంలో వేషాలు కట్టామా, హాస్యం చెబుతున్నామా అనిపిస్తుంది: అంతకంటే యిందులో నాకు మరేమీ కనబడటం లేదు… మీరు బాగా చదువుకున్నవారు గనక ఓ మాదిరి తెలివితేటలైనా వుండితీరాలి. మీరమ్మే వస్తువులు కేవలం… వాటికి విలవేమిటి, వాటివల్ల ఎవరికి గాని ఏం ఉపయోగం?” అన్నాడు.
“మీరు కొంటున్నారే మరీ, అందుచేత ఉపయోగమే.”
దీనికి ఏమి జవాబు చెప్పాలో తెలియక చిచీకవ్ పెదవి నొక్కుకున్నాడు. అతను తన కుటుంబ పరిస్థితులను గురించి సొంత సందర్భాలేవో వున్నాయనబోతుండగా సబాకివిచ్ అడ్డం వచ్చి, “మీ సొంత పరిస్థితులను గురించి తెలుసుకోవటం నా కిష్టం లేదు, ఇంకొకరి సొంత విషయాలలో నేనెప్పుడూ జోక్యం కలిగించుకోను, అదంతా మీకు సంబంధించిన విషయం. మీకు చచ్చిపోయినవాళ్ళు కావాలి, నేను అమ్ముతున్నాను. కొనకపోతే మీరే విచారిస్తారు” అన్నాడు.
“రెండు రూబుళ్ళు,” అన్నాడు చిచీకవ్.
“ఎబ్బే, నిజంగా: సామెత చెబుతారే , చిలక్కి ఒకే పేరు వస్తుందిట, అందర్నీ ఆ పేరే పిలుస్తుందిట. రెండు రూబుళ్ళు పట్టుకుని వదలకుండా వున్నారు. మీరివ్వదలచినదేదో చెప్పేద్దురూ!”
“వీడి తాడు తెగా! ఇంకొక్క అరరూబుల్ వీడి మొహాన తగలేస్తాను” అనుకుని చిచీకవ్, “పోనీ, కావాలంటే ఇంకొక అరరూబుల్ చేసుకోండి” అన్నాడు.
“సరే, ఇంకేం, నా ఆఖరు మాటకూడా చెప్పేస్తాను. యాభై రూబుళ్ళు! ఆ ధరకివ్వటం నష్టమేమరి. ఇలాటివాళ్ళు కొనాలన్నా మీకెక్కడా దొరకరు.”
“పిసినిగొట్టు ముండాకొడుకు!” అనుకున్నాడు చిచీకవ్. అతను విసుక్కుంటూ, “ఏమిటది, నిజంగా నిజమైన బేరమైనట్టు! ఎవరైనా ఊరికే యిస్తారే. అందాకా దేనికి, వాళ్లను వదిలించుకోవడానికైనా ఇవ్వచ్చునే. బొత్తిగా తెలియని వాళ్లే వాళ్లను ఉంచేసుకుని వాళ్ల మీద పన్నులు కడతారు!” అన్నాడు.
“ఇలాటి వ్యవహారాలున్నాయి. చూడండీ – స్నేహితులం గనక మనలో మాటగా చెబుతున్నాను – ఇవి ఎంతమాత్రం చెల్లవు. నేనుగాని, మరొకరుగాని ఈ సంగతి బయటపెడితే క్రయదారుకుగాని, విక్రయదారుకుగాని ఫలితం లేకుండా పోగలదు.”
“ఈ దొంగ వెధవ ఏ ఉద్దేశంతో ఇలా అంటున్నాడు” అనుకుని చిచీకవ్ నిర్లక్ష్యంగా “మీయిష్టం వచ్చినట్లు చేసుకోండి. మీరనుకుంటున్నట్టు నేను వీళ్లను కొంటున్నది నిజంగా అవసరం ఉండి కాదు, ఊరికే…కేవలం సరదాకొద్దీ, రెండున్నర రూబుళ్ల చొప్పున తీసుకోవటం తమ కిష్టం లేకపోతే సెలవిప్పించండి,” అన్నాడు.
ఇంతకంటే పెగలడు, మొండి వెధవ అనుకుని సబాకివిచ్. “మీ ఇల్లు బంగారంగాను, ముప్పై చేసి తీసుకోండి” అన్నాడు.
“లేదు, మీరు అమ్మే ధోరణిలో లేరు, సెలవిప్పించండి.”
“కోప్పడకండి, కోప్పడకండి,” అంటూ సబాకివిచ్ చిచీకవ్ చెయ్యి వదలకుండా పట్టుకుని కాలుకాస్తా తొక్కేసరికి, అజాగ్రత్తగా ఉన్నందుకు శిక్షపొందిన చిచీకవ్ ముడుచుకుపోయి ఒంటికాలిపై నిలబడ్డాడు. “నన్ను క్షమించాలి.మీకు ఇబ్బంది కలిగించినట్లున్నాను. దయచేసి ఇలా కూచోండి, దయచేసి!”
అలా అంటూ ఆయన అతన్ని ఒడుపుగా ఒక వాలుకుర్చీలో కూచోబెట్టాడు. కొన్ని శిక్షణ పొందిన ఎలుగుబంట్లు ఇలాగే పిల్లిమొగ్గలు వేస్తాయి. “మీష, పల్లెటూరి ఆడవాళ్లు ఆవిరిస్నానం ఎలా చేస్తారో చూపించు!…చిన్నపిల్లలు బఠానీలు ఎలా దొంగిలిస్తారో చూపించు, మీష!” అని అడిగినప్పుడు చిన్న చిన్న గమ్మత్తులు చేస్తాయి.
“నాకు వృధా కాలయాపన అయిపోతున్నది మరి, నేను వెళ్లాలి.”
“ఎంతో లేదు, మరొక్క నిమిషం ఆగండి, మీకు నచ్చేమాట మనవి చేస్తాను,” అంటూ సబాకివిచ్ దగ్గరికి జరిగి, చెవిలో రహస్యం చెప్పేవాడిలాగ, “పాతికయితే మీకు సమ్మతమేనా?” అన్నాడు.
“ఇరవైఅయిదు రూబుళ్లనా మీ అభిప్రాయం? లేదు, లేదు, లేదు. పాతికలో పాతిక కూడా ఇవ్వను. ఒక్క ఠోలికూడా పెచ్చు పెట్టను”.
సబాకివిచ్ మాట్లాడలేదు; చిచీకవ్ కూడా మౌనంగానే ఉండిపోయాడు. రెండు నిమిషాలసేపు నిశ్శబ్దం. గద్దముక్కు వేసుకుని చిగ్రాతియోన్ గోడమీది నుంచి ఈ వ్యవహారమంతా చూస్తున్నాడు.
చిట్టచివరకు సబాకివిచ్, “మీ ఆఖరు మాటేమిటి? ఆని అడిగాడు.
“రెండున్నరా!”
“మీ గుండె ఉడకేసిన చిలకడదుంపే. కనీసం మూడైనా చేసుకోగూడదూ?”
“నా వల్ల కాదు”.
“ఎబ్బే, మీతో ఏం చెయ్యటానికీ లేదు. సరే, కానివ్వండి. కాని ఏం చేస్తాం? నేను కుక్కలాటివాణ్ణి, సాటివాణ్ణి తృప్తి చెయ్యటానికి ఏదైనా చెయ్యబుద్ధవుతుంది నాకు. మళ్ళీ తభావతు రాకుండా విక్రయపత్రం ఒకటి రాయాలి గద”.
“అవును మరి”.
“అంతేగాక నేను పట్నంకూడా రావలసి ఉంటుంది”.
వ్యవహారం పరిష్కారమయింది. మర్నాడు ఇద్దరూ పట్నం వెళ్ళి విక్రయ దస్తావేజు తయారుచేయ నిశ్చయించారు. చిచీకవ్ కమతగాళ్ళ జాబితా అడిగాడు. సబాకివిచ్ వెంటనే ఒప్పుకుని, బీరువా వద్దకు వెళ్ళి, స్వహస్తంతో కేవలం మనుషుల పేర్ల జాబితాయేగాక, వారి ప్రత్యేకతలన్నీ కూడా నమోదు చేయసాగాడు. చిచీకవ్ రికామీగా ఉండటంచేత, తనకేసి వీపుపెట్టి కూచుని ఉన్న సబాకివిచ్ ని గమనించాడు. ఆయన వీపు లావైన వ్యాత్క గుర్రం లాగున్నది; రోడ్లప్రక్కన పాతే ఇనప స్తంభాల ప్రమాణంలో ఉన్న ఆయన కాళ్ళను చూసి అతను, “అబ్బ, దేవుడు నీకేమీ లోటు చెయ్యలేదు! గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదంటారే, ఆ బాపతు మనిషివి…నువు పుట్టుకతోనే ఎలుగ్గొడ్డునో, లేక ఈ అడివి జీవితంలో పడిపోయి, పొలాలు దున్నుతూ, రైతులతో మసులుతూ, ఎలుగ్గొడ్డువుగా తయారై, ‘కూలక్’ [ఈ మాటకు పిడికిలి అని అర్థం – అనువాదకుడు] అయావో నాకు భోధపడకుండా ఉంది. కాని అదేమీ కాదు; నీకు నవనాగరికమైన చదువు చెప్పించి, గొప్పవాళ్ళ సాంగత్యం కలిగించి, ఈ అడవి బతుకు కాకుండా పీటర్స్‌బర్గ్‌లో జీవింపజేసినా ఇలాగే ఉండేవాడివి. తేడా అల్లా ఏమిటంటే, ఇప్పుడు మాంసం బాగా తింటున్నావు. పళ్ళాలంత వెడల్పుగల జున్ను అచ్చులు తింటున్నావు. పీటర్స్‌బర్గ్‌లో అయితే కైమా కట్లెట్లు తిని ఉండేవాడివి. ప్రస్తుతం నీకింద కమతపు రైతులున్నారు, వాళ్లు నీ సొత్తుగనకా, వాళ్లకేదన్నా అయితే నీకే నష్టంగనకా వాళ్లతో సరిగా ఉండి, వాళ్లను బాగా చూసుకుంటున్నావు. ఇదేపట్నంలో అయితే నీకింద గుమాస్తాలుండేవాళ్లు. వాళ్ల పట్ల దారుణంగా ప్రవర్తించి ఉండేవాడివి, ఎందుకంటే వాళ్లు నీ కమతగాళ్లు కారుగా; లేదూ, సర్కారుసొత్తు కాజేసి ఉండేవాడివి. పిడికిలి బిగించిన వాడిచేత వదిలించటం సాధ్యం కాదు! ఒకవేళ ఒకటి, రెండు వేళ్లు తెరిచినా అందువల్ల మరింత నష్టమే. వాడు దారితప్పి ఏ విషయమైనా కాస్త తెలుసుకున్నాడో, తాను పెద్ద పదవి లోకి వచ్చాక ఆ విషయం నిజంగా తెలిసినవాళ్ళను కాల్చుకు తింటాడు! ఆ తరవాత, నేనేం చెయ్యగలనో చూపిస్తాను పట్టు, అంటాడేమో కూడానూ. ఆ తరువాత వాడు ఎంత యుక్తిగా నిబంధనలు తయారుచేస్తాడంటే అవతలివాళ్ళు హతం అయిపోతారు… బాబో, అందరూ ఇలాగే పిడికిళ్లు బిగిస్తే…”
“జాబితా అయింది!” అంటూ సబాకివిచ్ వెనక్కు తిరిగాడు.
“అయిందా? దయచేసి ఇలా ఇవ్వండి”. అతను దాన్ని పైనుంచి కిందకి చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. రచన చాలా శుభ్రంగానూ, సమగ్రంగానూ ఉన్నది. వాళ్ళవాళ్ళ వృత్తీ, పనీ, వయస్సూ, కుటుంబ పరిస్థితీ వివరంగా రాసి ఉండటమేగాక, ప్రక్కన ఉండే మార్జినులో ప్రవర్తన గురించీ, తాగుడు అలవాటు లేకపోవటం గురించీ వ్యాఖ్యలున్నాయి – ఎంతో చూడముచ్చటగా ఉన్నది.
“దయచేసి బయానా ఇస్తారా మరి?” అన్నాడు సబాకివిచ్.
“బయానా కూడా దేనికీ? చుప్తాగా డబ్బంతా పట్నంలోనే ఇచ్చేస్తాను”.
“అది రివాజు,” అన్నాడు సబాకివిచ్.
“ఎలా ఇవ్వమన్నారు? నా వెంట డబ్బు తేలేదు. అయినా ఇదుగో, పది రూబుళ్లు ఉన్నాయి”.
“పది ఎలా సరిపోతాయి? యాభై అన్నా ఇవ్వండి”
తన దగ్గిర అంత డబ్బులేదని అభ్యంతరం చెప్పబోయాడుగాని, సబాకివిచ్ డబ్బు లేకపోవట మేమిటని యెంత విశ్వాసంతో అన్నాడంటే, చిచీకవ్ మరొక నోటు పైకి తీస్తూ, “ఇదిగో? మరో పదిహేను రూబుళ్ళు, వెరశి యిరవై అయిదూ!మరి దయచేసి రశీదిప్పించండి” అన్నాడు.
“రశీదు దేనికీ?”
“రశీదంటూ వుండొద్దూ మరీ! ఎటుపోయి ఎటువచ్చినా… ఏమైనా జరగవచ్చు, చూడండి.”
“సరే, అయితే ఆ సొమ్మిలా యివ్వండి చెబుతాను.”
“సొమ్మివ్వటం దేనికీ? ఇదుగో నా చేతిలోనే వుందిగా. మీరు రశీదు రాసెయ్యగానే ఇచ్చేస్తాను.”
“క్షమించాలి, రశీదు ఎలా రాయను, ముందు డబ్బు చూసుకోవద్దూ?”
చికీకవ్ తన చేతుల్లో నుంచి నోట్లను తీసుకోనిచ్చాడు, సబాకివిచ్ వాటిని తీసుకుపోయి బల్ల మీద ఉంచి వాటి పైన ఎడమ చెయ్యి పెట్టి, కుడి చేత్తో కాగితం ముక్క పైన కమతగాళ్ల విక్రయం బాపతు బయానా కింద యిరవై ఆయిదు రూబుళ్లు పూర్తిగా ముట్టినట్టు రశీదు రాసి, సంతకం చేసి, నోట్లను వెలుతురుకు పెట్టి మరోసారి పరిశీలించి చూచుకొన్నాడు. ఆయన ఒక నోటును వెలుతురుకు పెట్టి చూస్తూ, “యీ నోటు పాతది, సరే పోనివ్వండి, స్నేహితంలో అలాంటివి పాటించడం భావ్యం కాదు” అన్నాడు.
“కూలక్, కూలక్! పైపెచ్చు వట్టి జంతువు” అనుకున్నాడు చిచీకవ్.
“అయితే ఆడవాళ్ళను కొనరా?”
“వద్దులెండి.”
“వాళ్లను అంత జాస్తి అడగను. మన పరిచయ జ్ఞాపకార్థం మనిషికి రూబుల్ చేసి తీసుకోండి.”
“వద్దు, నాకు ఆడవాళ్లు అవసరం లేదు.”
“సరే, మీరు అంతగా వద్దంటుంటే మాట్లాడి మటుకు ఏం లాభం? సామెత చెప్పినట్టు, ఒకడికి పూజారి ఇష్టమైతే, మరొకడికి పూజారి పెళ్లాం ఇష్టం. ఎవరి ఇష్టం వారిదీ.”
“నేను మిమ్మల్ని కోరే మరొక సంగతేమిటంటే ఈ వ్యవహారం గురించి మూడో మనిషికి తెలియగూడదు,” అన్నాడు చిచీకవ్ సెలవు పుచ్చుకుంటూ.
“ఆహా, అది ఎలాగూ ఉంది. ఇందులో మూడోమనిషి ప్రమేయం ఏమీ లేదు. స్నేహితుల మధ్య సజావుగా జరిగిన వ్యవహారం స్నేహితుల మధ్యనే ఉండిపోవాలి. సెలవు. మీరు వచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. మమ్మల్ని మాత్రం మరచిపోకండి. ఎప్పుడు కాస్త విరామం దొరికినా తప్పకుండా వచ్చి మాతో భోంచేసి కాలక్షేపం చెయ్యాలి. మనకు మళ్లీ ఒకరితో ఒకరికి పనిపడవచ్చు.”
“మళ్ళీ పనిపడకేం! మనిషికి రెండున్నర రూబుళ్ళు పిండి వసూలు చేశాడు, కర్కోటకుడు!” అనుకొన్నాడు చిచీకవ్.
అతనికి సబాకివిచ్ ప్రవర్తన కొంచెం కూడా నచ్చలేదు, ఎంత చెడ్డా తాను పరిచయం వున్న మనిషాయె, యిద్దరూ గవర్నరు గారింటా, పోలీసు అధిపతి ఇంటా కలుసుకుని వుంటిరి, అయినా ఆ మనిషి తనను మొహం ఎరగని వాణ్ణి పిండినట్టు పిండి డబ్బు కాజేసె! బండి ఆవరణ దాటాక కూడా సబాకివిచ్ మెట్లమీదే నిలబడి బండి ఎటు తిరుగుతుందా అని చూస్తూ వుండటం చిచీకవ్ గమనించాడు.
“లుచ్ఛా! ఇంకా నిలబడే వున్నాడు!” అని గొణుగుతూ అతను సేలిఫాన్‌తో, బండి ఇంటినుంచి కనిపించకుండా వుండగలందులకు, రైతుల గుడిసెల వేపు తోలమన్నాడు. ప్లూష్కిన్ క్రింద వుండే రైతులు ఈగలు చచ్చినట్లు చస్తున్నారని సబాకివిచ్ చెప్పాడు గనక ఆయన వద్దకు వెళ్ళాలని చిచీకవ్ వుద్దేశం, కాని యీ సంగతి సబాకివిచ్ కి తెలియటం అతని కిష్టం లేదు, బండి గ్రామం చివరకు చేరుకొనే సరికి ఒక రైతు, లావుపాటి దుంగను ఒక చివర భుజానికెత్తుకుని చీమలాగా యింటికి ఈడ్చుకుపోతూ ఎదురు తగిలాడు.
“ఏయ్, బవిరిగడ్డం! మీ షావుకారు ఇల్లు తగలకుండా ప్లూష్కిన్ ఇంటికి వెళ్ళాలంటే దారి ఎటు?”
రైతు యీ ప్రశ్న విని తికమక పడ్డట్టు కనపడ్డాడు.
“నీకు తెలీదా ఏం?”
“లేదండీ, నాకు తెలీదు?”
“ఏమిటది? జుట్టు నెరుస్తున్నది కూడాను, కమతగాళ్లకు సరిగా తిండి పెట్టని పిసినిగొట్టు ప్లూష్కిన్ నీకు తెలీదా?”
“ఓ, అతుకువేసిన చింకిబట్ట కట్టుకునే…గాడా?” అన్నాడు రైతు గట్టిగా. అతను ఉపయోగించిన విశేషం ఉచితమైనదే అయినప్పటికీ పెద్దమనుషుల నోట రాదగినది కాదుగనక దాన్ని వదిలేస్తున్నాం. అయితే ఆ మాట ఆ వ్యక్తికి ఎంతో బాగా అతికిపోయినదై ఉండాలి. అందుకనే చిచీకవ్ రైతు కనపడకుండాపోయి, బండి ఎంతో దూరం వెళ్ళినాక కూడా తనలో తాను నవ్వుకుంటూనే ఉన్నాడు. రష్యనులు మహా చమత్కారంగా మాట్లాడతారు. ఎవడికైనా ఒక పెట్టుడు పేరు వచ్చిందంటే అది వాడికి అంటుకుపోయి, ఉద్యోగంచేసినా, విరమించినా పీటర్సుబర్గుకూ, ప్రపంచంలో ఏ మారుమూల కయేది వెంటబడి వస్తుంది. వాడు తన పెట్టుడు పేరును బిరుదునామంలాగా చేసుకునేటందుకు తెలిసిన వారికి డబ్బిచ్చి వంశవృక్షమంతా ఘాలించి తమది ఎంత గొప్ప వంశమని రుజువు చేసినా సరే ఏమీ ప్రయోజనం వుండదు, కాకా ధ్వని కాకిజాడ తెలిపినట్టే ఈ పెట్టుడు పేరు కూడాను. అతికినట్టు కుదిరిన పేరు వుచ్చరించినా, లిఖించినా దాన్ని ఎన్నిగొడ్డళ్లూ కొట్టెయ్యలేవు. జర్మనులుగాని, ఫిన్లుగాని, ఇతర విదేశీయులుగాని రష్యా అంతర్భాగాలనుంచి ఎంత చక్కని సామెతలు వెలువడతాయి! అవి రష్యనులు తమ సహజ ప్రతిభలోనుంచి ఉత్పత్తి చేస్తారు; వారు ఒక మాటకోసం ఎన్నడూ తడువుకోరు, ఒక్క వాక్యాన్ని సృష్టించటానికి కోడిగుడ్లను పొదిగినట్టుగా ఆలోచిస్తూ కూచోరు! ఠకీమని ఒక్కమాట తగిలించారంటే అది ప్యాస్ పోర్టులాగా జీవితాంతందాకా వెంట ఉంటుంది; ఆ పైన నీ ముక్కూ, మూతీ వర్ణించేపనే ఉండదు, ఆ ఒక్క ముక్కా నిన్ను నఖశిఖ పర్యంతం వర్ణించేస్తుంది.
పవిత్రమైన రష్యా దేశమంతటా వెలసి ఉండే అసంఖ్యాకమైన చర్చీలూ, మఠాలు, వాటి శిఖరాలూ, డోములూ, శిలవలూలాగ భూమిమీద అసంఖ్యాకమైన జాతులూ, తరాలూ, వ్యక్తులూ, బహువర్ణాల మూక అటూ ఇటూ సంచరిస్తున్నది. ప్రతిఒక్క ప్రజా శక్తివంతమై, తనలో సృజనాత్మక శక్తులనూ, ఆధ్యాత్మిక శక్తులనూ నించుకుని, దేవుడిచ్చిన ఇతర శక్తులతో, తనకు విశిష్టంగా ఉండే ప్రత్యేకతతో కొన్ని సామెతలను సృష్టించి, అవి ఏయే విషయాలకు సంబంధించినవైనప్పటికీ వాటిలో తన స్వభావాన్ని ప్రతిబింబింపజేస్తుంది. బ్రిటిషు వారి సామెతలలో వారి హృదయాలలో ఉండే వివేకమూ, జీవితాన్ని అర్థం చేసుకోవటంలో వారికిగల జ్ఞానమూ కనిపిస్తుంది. ఫ్రెంచివాళ్ల వాక్చాతుర్యం క్షణికంగా ఉండి, షోకిలాలాగా కాస్సేపు సమ్మోహింపజేసి తరవాత మాసిపోతుంది. జర్మనులు ఆటే తెలివితేటలు లేని తమ ప్రవచనాలకు వింత బురఖాలు తగిలించి అందరికీ అర్థం కాకుండా చేస్తారు. కాని రష్యనులు అద్భుతంగా అతికేలాగ సృష్టించే సామెతల్లాగా విస్తృతీ, లక్ష్యశుద్ధీ కలిగి, హృదయకుహరంలో నుంచి ఉబికివచ్చేవి మరెక్కడా లేవు.
మా నాన్న కుటుంబరావుగారి శతజయంతి (1909-2009) సందర్భంగా విరసం ఆయన రచనలన్నిటినీ ప్రచురిస్తోంది. వీటిలో ఆయన రాసిన కల్పనాసాహిత్యమూ, వ్యాసాలూ, లేఖలూ ఉంటాయి. అయితే ఆయన అనువదించిన పుస్తకాలను ఎవరూ పునర్ముద్రించటం లేదు. పొద్దులో ఇది ఈ తరం పాఠకులకు పూర్తిగా లభ్యం కావడం ఒక ప్రత్యేక విషయం.
kandukoori auto biography ni KOKU abridge chaesaaru.CHANDAMAAMA lo kadhalu aayana raasinavi chaalaa vuntaayi.Machu kainaa oka samputi thesthae
baaguntundi.–DIVIKUMAR
1947 ప్రాంతాల్లో చక్రపాణిగారు సంపాదకత్వం వహించిన ఆంధ్రజ్యోతిలో మా నాన్న A Study in Scarlet అనే షెర్లాక్ హోమ్స్ నవలను నేరపరిశోధన అనే పేరుతో అనువదించారు. అది నాదగ్గరుంది. ఆ తరవాత Valley of Fear అనే మరొక నవలను కూడా అనువదించానని నాతో అన్నారు కాని అదెక్కడా దొరకలేదు. ఎవరైనా సంపాదించగలిగితే సంతోషిస్తాను.
వీరేశలింగం ఆత్మకథ (సంక్షిప్తం) నా దగ్గరుంది. ఇవికాక యువ మాసపత్రికలో అనేక బెంగాలీ నవలలను సంక్షిప్తీకరించారు. అందులో పనిలేని మంగలి శీర్షికతో పేరు లేకుండా చాలా వ్యాసాలు రాశారు. చందమామలాగే కినిమా మాసపత్రికలో కూడా cover to cover రాశారు.