-స్వాతీ శ్రీపాద
ప్రస్తావన:
సాధారణంగా ఏ కథాసంపుటిలో ఐనా చాలావరకు మంచి కథలు, కొన్ని సాదా సీదా కథలు, ఒకటో రెండో గొప్ప కథలు ఉంటాయి. కానీ కొత్త దుప్పటిలో మాత్రం అన్నీ గొప్ప కథలే. నా ఒక్కడికే ఇలా అనిపించిందా లేక నిజంగా ఇవన్నీ గొప్ప కథలేనా అని సందేహమొచ్చి ప్రతిమకు ఫోన్ చేసి అడిగాను…
– సింగమనేని నారాయణ, ప్రసిద్ధ కథారచయిత, విశ్లేషకుడు (కొత్త దుప్పటి ఆవిష్కరణ సభలో).
ఈ కొత్త దుప్పటి కథాసంపుటిని పొద్దు కోసం సమీక్షించడానికి కూర్చున్నప్పుడు ఒక సమీక్షా వ్యాసంలో ఆ సంపుటిని సమగ్రంగా పరిచయం చెయ్యడం ఏ సమీక్షకుడికీ/సమీక్షకురాలికీ సాధ్యం కాదనిపించింది. అందుకే సాంప్రదాయిక సమీక్షలకు భిన్నంగా ఈ సంపుటిలోని ఒక్కో కథ గురించి విడివిడిగా ఒక్కో సమీక్షావ్యాసం ప్రచురించబూనుకున్నాం. ప్రముఖ కవయిత్రి, కథారచయిత్రి, అనువాదకురాలు అయిన స్వాతీ శ్రీపాద గారు రాస్తున్న ఈ వ్యాస పరంపరను కొత్త దుప్పటి కథపై సమీక్షావ్యాసంతో మొదలుపెడుతున్నాం. (సం.)
“నెలరోజులైంది చలి మొదలై” అంటూ మొదలవుతుంది కథ. కథకుడు ఆరంభానికై ఎంత మథన పడి, మథనపడి ఈ ప్రారంభాన్ని సాధించారో కథే విశదీకరిస్తుంది. కొత్తదుప్పటికీ చలికీ వున్న లంకె ఏమిటనేది కథ సాగేకొద్దీ తెలుస్తుంది. మామూలుగా చలితో మొదలైన కథ మంచు తడిసిన గాలిగా మారి దుప్పటై ఆక్రమించుకునే సన్నాహాలను, చలితీవ్రతను తెలియజేసే చతురత రచయితది. కళ్ళకు కట్టినట్టుగా ఒకదాని వెనక ఒకటిగా వచ్చే దృశ్యమాలికలు కథను క్రమ విధానంలో నడిపిస్తాయి.
రామయ్య తాత పాత్ర, ఒకదాని వెంట మరొకటిగా తెలిసివచ్చే అతని వివరాలు, “కూతుర్నీ ఆస్తినీ ఇచ్చి పట్టం గట్టడం” అనే పదంలోనే ఒకరకమైన అసంతృప్తీ జరగబోయేదానికి నాందిగా కనిపిస్తాయి. అమాయకంగా మాట్లాడే అయిదేళ్ళ సుబ్బలక్ష్మి మాటలను తండ్రి అడ్డుకోవడం, సహజత్వానికి ప్రతిగా ఉన్నాయి. ఆ మాటల్లోనే కథ చూఛాయగా మసక మసగ్గా కనిపిస్తూనే ఉంటుంది.
ఓ చిన్న, అతి మామూలు సంఘటన -కళ్ళానికి కాపలా… ఆరు బయట పడుకోవడం… చలి.. మనవడు పంపిస్తానన్న కొత్త బొచ్చు దుప్పటి. మనవరాలి పట్ల తాత ఆపేక్ష, ఆదుర్దా ఒక వైపూ, ముసలాడని అల్లుడి నిరాదరణ మరొకవైపూ కథను సమతూకంలో నడిపిస్తాయి.
నిజానికి మనవడు పంపిన కొత్తదుప్పటిని తాతకివ్వని అల్లుడి సంకుచితత్వం, అప్పటికే పంపినదాన్ని నలుగురు చూసి మెచ్చుకోవాలనే ఓబన్న ఆరాటం, ముసలివాడికి ఏదో ఒకదానితో కాలం గడచి పోతుంది కదా అనే నిరాదరణ, నిరసన ధోరణి వీటన్నింటి మధ్యా అల్లుడి విశ్లేషణ-పాఠకులు ఉత్కంఠగా కథను చదివేలా చేస్తాయి..
చలిమంట వేసుకోమంటూ పుల్లలు కుప్పబోసి వెళ్ళినా అల్లుడు తిరిగి వచ్చేసరికి పుల్ల ల్నోపక్కన ఉంచి వేడి కోసం బూడిద మెదుపుతూ కనిపించిన రామయ్యను చూసి ఓబన్న చిరాకుపడటం, కొత్త దుప్పటి గురించి ఆరా తియ్యడం చూసి విసుక్కోవడం, అవన్నీ కొత్త దుప్పటి కోసం అతని ఎత్తులని నిందించడం ఈ తరపు పోకడలకు నిలువెత్తు ప్రతీక. ఓపక్క కొత్త దుప్పటి గురించి గొణుగుతూనే పుల్లలు మిగిల్చి అల్లుడు చలికి ఇబ్బంది పడతాడని ఆలోచించడం -అతన్ని చలి కాచుకుందుకు ఆహ్వానించడంతో అతని మనసు నావరించుకుని ఉన్న కొత్తదుప్పటి కుప్పలా జారిపడింది. ఎండు చితుకులతో పాటు అంటుకున్నది మరేమిటన్నది పాఠకులకే వదిలారు రచయిత.
రచయిత పుట్టిపెరిగిన వాతావరణం సుపరిచితమైన పరిసరాలతోబాటు, జీవితాలు కథకు ఒక నిబద్ధతను, నిజాయితీని ఆపాదిస్తాయి. ఓ చలి రాత్రి కళ్ళాల వద్ద కాపలాగా ఆరుబయట పడక, రాయలసీమ గ్రామీణ జీవన విధానం, అక్కడి వాతావరణం, సమస్యలు కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించబడ్డాయి. ఈ మామూలు వాతావరణం పరదా వెనక అంతరించిపోతున్న మానవ సంబంధాలు, సున్నితమైన భావాలు –వాటి పట్ల రచయితగా ఏదో చెయ్యాలన్న తపన కనిపిస్తాయి. పాత్ర చిత్రణ సమయోచితంగా, సందర్భానుసారంగా తీర్చిదిద్దారు. ఎంత ఒద్దన్నా, భాషా పటాటోపం లేకున్నా అక్కడో ఇక్కడో కవితాత్మ తొంగిచూస్తూనే వుంటుంది.
“మంచులో తడిసిన గాలి బరువుగా మనుషులను ఆక్రమించుకోవడం”, ముడిగింజల కుప్పలను దుప్పటై ఆక్రమించుకుందుకు మంచు సన్నాహం చెయ్యడం, పల్చని మజ్జిగలాంటి పంచమి చంద్రుని కాంతి, నిశ్శబ్దాన్ని పరవడం, నల్లని చీకటిముద్దలా వున్న బర్రె, చెట్లు మౌనంగా ఆకు దోసిళ్ళతో మంచుముత్యాలు రాల్చడం వద్దన్నా తొంగిచూసే కవిత్వానికి మచ్చు తునకలు.
ఇక కథ విషయానికి వస్తే రెండు తరాల మధ్య అంతరం, మృగ్యమయిపోతున్న మానవ సంబంధాలు, వాటిని నిలబెట్టాలనే తపన ఓబయ్య, రామయ్య పాత్రలద్వారా రచయిత చాలా బలంగా చిత్రించారు. మానవ విలువలు, ప్రేమ ముందు ఎలాంటి అహమయినా, స్వార్థమయినా దిగదుడుపే అని చాటి చెప్పే కథ కొత్తదుప్పటి.
ఆధునిక సంకుచితత్వం కరిగిపోతుంది. ఎప్పటికయినా మానవతదే పెద్ద పీట అనే గొప్ప ఆశా వాదాన్ని నిశ్శబ్దంగా ఘోషించే కథ కొత్తదుప్పటి.
అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.
చాలా సంతోషం. ఈ పుస్తకం కొత్తగా విడుదలైందా? ప్రచురణ వివరాలు తెలియచేయ గలరు.
కొత్త దుప్పటి లోని కథలు పరిచయంచేస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. స్వాతి శ్రీపాద వ్యాసాన్ని బాగారాసారు.
సంపాదకులు పుస్తకాన్ని కూడా పరిచయంచేయండి
ఎవరు రాసారు? ఎక్కడదొరుకుతుంది? వెల … ఇలా కొన్ని
మంచి ప్రయత్నం అభినందనలు
ఈ పుస్తకం గత జూలైలో విడుదలైంది. విశాలాంధ్ర ప్రచురణ. వెల: 120/-. AVKF లో కూడా దొరుకుతుంది. లింకు: http://www.avkf.org/BookLink/view_titles.php?cat_id=8327 వెల: 2.72 USD.
కొత్త ప్రయోగం బాగుంది..
Go ahead.. ఇందులో ప్రతి కథా సమీక్షించాల్సిందే..
– పెరుగు
[ఈ వ్యాఖ్యలో RTS లో ఉన్న వాక్యాలు తెలుగులోనికి మార్చబడ్డాయి. -సం.]
తెలుగు వారు గర్వపడే చాసో స్పూర్తి అవార్డ్ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారికి ప్రకటించటం మనందరికీ హర్షదాయకం. జనవరి 17 న జరిగే సభలో విజయనగరంలో ఈ అవార్డ్ ప్రధానం జరుగుతుంది. అభినందనలు
sameeksha chal bagundandi..