అప్పుడూ ఇప్పుడూ

– కొడవటిగంటి రోహిణీప్రసాద్

చూస్తూండగానే ప్రపంచం మారిపోతోంది. ఒకటి రెండు దశాబ్దాల కిందట తెలుగువాళ్ళింటికి ఎప్పుడైనా వెళితే పిల్లలు తలుపు తీసి లోపలికెళ్ళి తల్లిదండ్రుల్ని పిలుచుకొచ్చేవాళ్ళు. ఆ తరవాత పిల్లలు కనబడేవాళ్ళు కాదు. టీవీలో తెలుగు ప్రోగ్రాం పెట్టినా, తెలుగుకి సంబంధించిన ఏ విషయాన్నయినా సీదా స్థాయిలో చర్చించినా పిల్లలు కూర్చోవడంగాని, వినడంగాని చేసేవారు కాదు. ‘వాళ్ళ ఇంట్రస్టులు వేరులెండి’ అని తల్లిదండ్రులు ముద్దుగా, కాస్త గొప్పగా చెప్పేవారు. నిజమే. ఏ తరాని కాతరం మారిపోతుంది. అయితే ఆ పద్ధతిలో మాతృభాషతో ఏ విధమైన సంపర్కమూ లేకుండా పెరిగిన (లేదా పెంచిన) పిల్లలు ప్రస్తుతం పెద్దవాళ్ళయిపోయారు. వారు కోల్పోయిన సంస్కారం ఎటువంటి మార్పులు తెస్తోందో ప్రతిచోటా కనిపిస్తోంది. ఇది తెలుగువాళ్ళ విషయంలోనే కాదు. అన్ని భాషలకూ వర్తిస్తుంది.

అసలీ సొదంతా ఎందుకు? పోయినవాళ్ళ గురించి ఇన్నేళ్ళ తరవాత వ్యక్తిపూజ చెయ్యడం అవసరమా?

తెలుగు మరుగున పడడానికి ఇంగ్లీషును మాత్రమే తప్పుపట్టి లాభం లేదు. మనతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం తక్కువే. ఆ కారణంగా అక్కడివారు సాప్ట్‌వేర్ తదితర ఉద్యోగాలకు పోటీ పడలేకపోతున్నారనే ఫిర్యాదుకూడా ఉంది. అయితే అక్కడివారికి జాతీయ, ప్రాంతీయ సంస్కారం పెరిగిందా అంటే అవునని చెప్పలేం. ఇంగ్లీషు మానేస్తే సరిపోదు; మాతృభాష గురించీ, సంస్కృతి గురించీ పిల్లలకు నేర్పడం తప్పనిసరి. మీడియా ఆ పని సవ్యంగా చెయ్యటంలేదు కనక తల్లిదండ్రులే అందుకు పూనుకోవాలి.

స్కూలు, కాలేజీల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకుని కాస్త పెద్దయాక పశ్చాత్తాపంతో తెలుగును గురించి తెలుసుకుందామనుకునేవారూ, కోల్పోయిన సంపర్కాన్ని మెరుగుపరుచుకుందా మనుకునేవారూ కనిపిస్తారు. వీరికి మంచి విషయాలను సులభపరిచయం ద్వారా తెలియజెయ్యడం ఒక బాధ్యతగా పెద్దవారు తీసుకోవాలి. ఆసక్తి లేనివారు ‘ఇదంతా అనవసరపు సుత్తి’ అనుకున్నా సరే. తమకు తెలిసిన విషయాలనూ, అనుభవాలనూ ఏదో ఒక విధంగా యువతరంతో పంచుకోవాలి. ఈ సందర్భంలో నేను గమనించిన ఒకటి రెండు విషయాలను ప్రస్తావిస్తాను.

చాలా ఏళ్ళ క్రితం మానాన్న కొడవటిగంటి కుటుంబరావుగారు (ఆయన శతసంవత్సర జయంతి అక్టోబర్ 28న మొదలయింది) ఒక ఇంటర్వ్యూలో తన ఆత్మకథ రాసే ఉద్దేశం లేదని చెపుతూ, తనకు తెనాలిలో చిన్నతనంలో పరిచయస్థులందరూ తరవాత ప్రసిద్ధికెక్కారనీ, ఆత్మకథ రాస్తే అదంతా నేమ్ డ్రాపింగ్‌లాగా ఉంటుందనీ అన్నారు. చక్రపాణి, సినీదర్శకుడు పి.పుల్లయ్య, ప్రముఖ నటుడు స్థానం నరసింహారావు, సినీనటులు సి.ఎస్.ఆర్ (మాయాబజార్ శకుని)., లింగమూర్తి, నటగాయకుడు రఘురామయ్య, ‘ఆంధ్రగంధర్వ’ గా ఆరోజుల్లో పేరు మోసిన జొన్నవిత్తుల శేషగిరిరావు (ఈ తరం సినీ రచయిత తాతగారు), షావుకారు సినిమాలో షావుకారు పాత్రధారి గోవిందరాజు సుబ్బారావు, డజన్ల కొద్దీ రచయితలు, మహాకవులు, సాహితీపరులు ఇలా అందరితోనూ ఆయనకు పరిచయాలుండేవి. ఆ రోజుల్లో వారెలా ఉండేవారో, ఎలా ఎదిగారో ఆ వివరాలన్నీ ఆయన ఎక్కడో అక్కడ చెప్పిఉంటే తరవాతి తరాలకు ఎంతో ఆసక్తికరంగా పరిణమించేది. కొన్ని వ్యాసాల్లో అరుదుగా తప్ప ఆయన ఆ పని చెయ్యలేదు. మహాకవి గురజాడకు శిష్యుడైన బుర్రా శేషగిరిరావు మా నాన్నకు ఉపాధ్యాయుడు. ఆయన గురించి కొంత తెలియజేశారు. విజయనగరంలో చదువుకున్నప్పటికీ ఆదిభట్ల నారాయణదాసును గురించి ఒక్క ముక్క రాయలేదు; నెగెటివ్‌గానైనా సరే! తరవాత గొప్ప సంగీతదర్శకుడైన సాలూరు రాజేశ్వరరావు ఏడో ఏట కచేరీ చెయ్యడం గురించి చెప్పారు. అంతే.

‘చందమామ’లో తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు మొదలైన అద్భుత సీరియల్ రచనలు చేసిన దాసరి సుబ్రహ్మణ్యంగారిని ఈ మధ్య విజయవాడలో కలుసుకున్నప్పుడు ఆయన చక్రపాణిగారి గురించి వివరంగా రాయడానికి తాను నిరాకరించినట్టుగా చెప్పారు. ఎందుకు? అదంతా ‘రిఫ్లెక్టెడ్ గ్లోరీ’ అని! చక్రపాణిగారితో ఆయనకు రెండున్నర దశాబ్దాల పరిచయం ఉంది. ఇప్పుడు మన మధ్య లేని నాగిరెడ్డి, చక్రపాణి తదితరుల గురించిన స్మృతులన్నీ పంచుకోదగినవే అని ఇప్పటివారు అనుకోవచ్చు. 83 ఏళ్ళ వయసున్న సుబ్రహ్మణ్యంగారిని ఒప్పించడమే కష్టం!

ఈ పై ఉదాహరణలు రెండూ నిరాశ కలిగించేవే. గత తరం అనుభవాలను గురించి రాసే రచయిత ఎవరైనా సరే, వాటిని తన గొప్పలు చెప్పుకోకుండా వర్ణించినట్టయితే అవెంతో విలువైనవిగా తయారవుతాయి. ఇటువంటివాటిని నేమ్ డ్రాపింగ్‌ అనిగాని, రిఫ్లెక్టెడ్ గ్లోరీ అనిగాని అనుకోకూడదు. అలా అనుకుంటే మనకే నష్టం. ఇదొక రకమైన జర్నలిజం అనుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో రచయిత విలేకరిగా మాత్రమే పనిచెయ్యాలి. విషయం చెప్పేవాడి గురించికాక ప్రసిద్ధవ్యక్తిని గురించినదై ఉండాలి. చెపుతున్న విషయానికి ఇప్పటి సందర్భంలో ఎటువంటి ప్రాముఖ్యత ఉందో వివరించాలి.

అసలీ సొదంతా ఎందుకు? పోయినవాళ్ళ గురించి ఇన్నేళ్ళ తరవాత వ్యక్తిపూజ చెయ్యడం అవసరమా? కొంతవరకూ అవసరమే. వివిధ రంగాల్లో చెప్పుకోదగ్గ కృషి చేసినవారు మన సంస్కృతికి కాస్తకాస్తగా తోడ్పడినవారు. వారిని పూజించనక్కర్లేదుగాని సాంస్కృతిక విలువలు పెరగడానికీ, నిలదొక్కుకోవడానికీ వారేమేం చేశారో తెలుసుకుంటే ఒక జాతిగా మనం ఆ వారసత్వాన్ని మరింత బాగా కొనసాగించగలుగుతాం. ఎక్కణ్ణుంచి వచ్చామో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో మరింత బాగా తెలుస్తుంది.

చాలా ఏళ్ళ క్రితం నేనొకసారి మా మిత్రుడి తండ్రిగారిని ఒకాయనని కలుసుకున్నాను. అప్పటికే ఆయనకు 85 ఏళ్ళు. ఆయనది విజయనగరమని చెప్పగానే నేనాయన్ని ‘మీకు గురజాడ అప్పారావుగారు తెలుసా?‘ అనడిగాను. ‘అయ్యో మేమంతా చిన్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాం‘ అని ఆయన చెప్పడం నాకు అద్భుతం అనిపించింది. ఎందుకంటే అప్పారావుగారు 1915లోనే మరణించారు. ఆయనను చూడలేకపోయినా ఆయనను బతికుండగా చూసినాయనను చూడగలిగాను! అదే గొప్ప. అంతకు ముందు అప్పారావుగారి మనుమడు ఒకాయన బొంబాయిలో తగిలాడు కాని ఆయన తన తాతయ్యను ఎన్నడూ చూడలేదట.

బ్లాగ్ రచయితలు పెరుగుతున్నారు. వారిలో కొందరికి తెలుగు స్పెల్లింగులు కూడా సరిగ్గా రాని మాట నిజమేగాని తెలుగులో రాయాలనే వారి ఉత్సాహం, తపన మెచ్చుకోదగ్గవి.

నేనీమధ్య చదివిన గొల్లపూడి మారుతీరావుగారి ఆత్మకథ ‘అమ్మ కడుపు చల్లగా‘ అనే ఆసక్తికరమైన పుస్తకంలో ఆయన తాను కలుసుకున్న ప్రసిద్ధులు అనేకుల గురించి క్లుప్తంగా, చక్కగా వర్ణించారు. వారిలో ప్రముఖ నటుడు, నాటక ప్రయోక్త కె.వెంకటేశ్వరరావు గురించి కూడా ఉంది. ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం 1960లలో ప్రసారం చేసిన కన్యాశుల్కం నాటకంలో వెంకటేశ్వరరావు దర్శకుడుగా, గిరీశంగా పోషించిన పాత్ర అద్భుతం. నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదివినప్పుడు ఆయన థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్‌గా ఉండేవారు. ఆయనతో గిరీశం పాత్రను గురించి ముచ్చటించడం, ఆయన దర్శకత్వం వహించిన రావిశాస్త్రి నాటకం ‘విషాదం’ చూడడం, ఆయన స్వయంగా నటించిన కనకపుష్యరాగం తిలకించడం ఎన్నటికీ మరిచిపోలేను. నటన గురించి ఆయన తరుచుగా ఇచ్చిన ఉపన్యాసాలు వినేవాళ్ళం. 1969లో గాంధీ శతజయంతికి ఆయన అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖలో నిర్వహించిన షాడోప్లే నోళ్ళు తెరుచుకు చూశాం. గొల్లపూడివారి పుస్తకం చదువుతూంటే ఆ అనుభవాలన్నీ గుర్తుకొచ్చాయి. మారుతిరావుగారికి ఇలా ఎందరితో మధురమైన స్మృతులున్నాయో కదా అనిపించింది.

పాతదంతా గొప్ప అని ఎందుకనుకోవాలి? దీనికి స్పష్టమైన సమాధానం లేదు. రాజకీయాలతో సహా ఏ రంగంలోనైనా రానురాను నిజాయితీ లోపించడం కనబడుతుంది. సినిమాల విషయం తీసుకుంటే సినీ గోయర్ డాట్‌కామ్ వంటి సైట్లలో నిర్మాతలతోనూ, డిస్ట్రిబ్యూటర్లతోనూ ఆసక్తికరమైన ఇంటర్వ్యూలు కనబడతాయి. నేను గమనించినంతవరకూ 1970, 80ల తరవాత వచ్చినవారంతా ‘ఫలానా సినిమాలు తీశాం, ఫలానాది బాగా పోయింది, ఫలానాది ఫెయిలైయింది’ అని చెప్పడం మినహా మరేమీ కనబడదు. అదే ఏ బి.ఎన్.రెడ్డిగారో అయితే తమ సినిమాల కథ గురించో, ఇతివృత్తం గురించో చెప్పకుండా మానరు. సినిమాల్లో కళ వాసనలు పోయి వ్యాపారం మాత్రమే మిగిలిందని కొన్ని ఇంటర్వ్యూల్లో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది.

రాజకీయాలైనా, సినిమాలైనా, సాహిత్యమైనా వ్యాపారదృష్టి ప్రతి తరంలోనూ తప్పనిసరిగా కనిపిస్తుంది. అయితే దానితో బాటు ‘గ్రాఫు’ నిరంతరం కిందికే జారుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. కాలమహిమ అనాలేమోగాని 1960ల ‘మాస్’ సినిమాలు కూడా ఇప్పుడు క్లాసిక్స్‌లాగా అనిపిస్తాయి. అయితే బురదలోంచి పంకజం పుట్టినట్టు నవతరంగాలు లేస్తూనే ఉంటాయి. గత వైభవాన్ని తలుచుకున్న కొందరైనా పరిస్థితిని మార్చడానికి పూనుకుంటారు. ప్రస్తుతం మనకు కావలసినది అదే. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా స్ఫుర్తిని పొందే మార్గం అదేనేమో.

సాహిత్యానికి సంబంధించినంతవరకూ వ్యాపారదృష్టి లేని వెబ్ పత్రికలు ఔత్సాహిక రచయితలని బాగా ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా విడేశాల్లో స్థిరపడ్డవాళ్ళు తెలుగును మరిచిపోకుండా ఉండడానికి ఇవి తోడ్పడుతున్నాయి. రాసే విషయాల్లో వైవిధ్యం పెరుగుతోంది. (నాకు తెలిసిన ఒక తెలుగు మిత్రుడు అమెరికాలో స్థిరపడే ముందు నార్వేలో నేవల్ ఇంజనీరింగ్ చదివి కెనడా ఉత్తర ప్రాంతాల్లో మంచులో దుర్భరపరిస్థితుల్లో నౌకలు నడిపాడట. తన అనుభవాలను వచ్చీరాని తెలుగులోనైనా సరే రాయమని నేను చాలా సార్లు అడిగాను కాని అతనింకా పూనుకోలేదు) బ్లాగ్ రచయితలు పెరుగుతున్నారు. వారిలో కొందరికి తెలుగు స్పెల్లింగులు కూడా సరిగ్గా రాని మాట నిజమేగాని తెలుగులో రాయాలనే వారి ఉత్సాహం, తపన మెచ్చుకోదగ్గవి.

ఒకప్పుడు సాహిత్యం పండితుల చేతుల్లో ఉండేది. 1930లలో మాసపత్రికలూ, వారపత్రికలూ రావడంతో ‘కాలక్షేపం’ కథలూ, కొత్త రచయితలూ పుట్టుకొచ్చారు. 1950, 60లు పత్రికలకు స్వర్ణయుగమే. ఆ తరవాత తెలుగువారికి ‘జనరల్’గా సాహిత్యంలో ఆసక్తి తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉండగా ఉద్యమసాహిత్యం ఊపందుకుంది. విప్లవరచనలూ, స్త్రీవాదం, దళితవాదం, ముస్లిం రచయితలూ, తెలంగాణా రచయితలూ పెరిగారు. కాలక్షేపానికి పుస్తకాలకు ప్రత్యామ్నాయంగా ముందు సినిమాలూ, తరవాత టీవీ వచ్చాయి. ఆ కారణంగా ఉద్యమాల్లో ఆసక్తిలేనివారితో కూడిన చదువుకున్న నిరక్షరాస్య సమాజం ఒకటి తయారయింది. ఈ రోజుల్లో ఏ ప్రోగ్రామింగో నేర్చుకుని నాలుగు రాళ్ళు సంపాదించకుండా సాహిత్యం, భాష, సంస్కృతి అని మథనపడేవాళ్ళు వెర్రివాళ్లలా కనిపిస్తున్నారు. తెలుగు రాయడం, చదవడం వచ్చినవారి సంఖ్య తగ్గుతోంది కనక అవి రెండూ చెయ్యగలిగిన ‘వెర్రివాళ్ల’ మీదున్న బాధ్యత మరింత పెరుగుతోంది. భాషని బతికించవలసినది వాళ్ళే.

————————–

కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) నుండి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త. తెలుగులో http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) అనే బ్లాగులు రాస్తూంటారు.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

19 Responses to అప్పుడూ ఇప్పుడూ

  1. ఇంటర్నెట్ , తెలుగు యూనికోడ్ల దయవల్ల తెలుగు చదివేవారు పెరగవచ్చు . టీవీలకి ప్రత్య్మాయం ఇంటర్నెట్టే . దీనివల్ల పఠనం పెరుగుతుంది. అందరూ అనుకుంటున్నట్టుగా తెలుగుకు వచ్చిన డోకా ఏమీలేదు .

  2. Rohiniprasad says:

    శివ బండారుగారూ, ఇంటర్నెట్ ద్వారా తెలుగు పుస్తకాల వితరణ వగైరాల గురించి మీరు మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విదేశాల్లో ఉంటున్నవారిని మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నవారు ఇంటర్నెట్ ను ప్రధానంగా ఈ మెయిల్ పంపడానికి మాత్రమే వాడుతున్నట్టు నేను ఇటీవల గమనించాను. ఇప్పట్లో టీవీకి ఇంటర్నెట్ ప్రత్యామ్నాయంగా పోటీపడుతుందా అనేది అనుమానాస్పదమే. వ్యాపారధోరణులు సోకకుండా ఆలోచనాపరులైన తెలుగువారు ఆరోగ్యకరమైన సాహితీప్రయత్నాలు చెయ్యడానికి మటుకు ఇంటర్నెట్ బాగా పనికొస్తుంది. More power to them!

  3. “సాహిత్యం, భాష, సంస్కృతి అని మథనపడేవాళ్ళు వెర్రివాళ్లలా కనిపిస్తున్నారు” ఈ వాక్యం అక్షరాల నిజం. ఇలా వెర్రివాళ్ళమైనా ఫర్వాలేదు అనుకోని ముందుకు సాగటమే

  4. baabjeelu says:

    మీరు రాసింది రైటే.
    కానీ “సాహిత్యం” వల్ల భాష ఎలా బతుకుతుంది?
    “సంస్కృతం” లో సాహిత్యం ఆగిపోవడం వల్ల “సంస్కృతం” మరుగున పడిపోయిందా? అలాగే “పాలీ” వగైరా భాషలు.

    జనజీవన స్రవంతికి వుపయోగపడే భాష జీవంతో వుంటుంది. కాదంటారా?

    మీరు “వ్యాసాల్ని” “సింపుల్గా” చారు పెట్టినట్టూ, అబ్బో అనిపించేట్టూ, మీ లాగ, ఎలా రాయాలో వివరిస్తే దుర్భర పరిస్థితుల్లో జీవిత నౌకలు నడిపే నా లాటి వాళ్ళందరికీ వుపయోగ పడుతుంది.

    [ఈ వ్యాఖ్య RTS నుంచి తెలుగు లిపి లోనికి మార్చబడింది. -సం.]

  5. sudhakar korrapati says:

    Rohiniprasad garu, VERRIVALLAKU CHENDINA EE VYASAM KONTHAMANDI VERRIVALLUKU BAAGUNTUNDI.NAAKU BAAGUNDI.NENANUKUNTANU VERRIVALLU KAANI VAARI PRAMUKHYATHALU MAARIPOYAAYI.DABBU DABBU…IDI UNTE[ELA SAMPADINCHINA] IPPUTI JANAM CHAALA GOWRAVANGA CHUUSTHUNNAARU.MEE MANCHIKI MEE PANITHANANIKI ENTHAMANDI GOWRAVAMISTHUNNARU.THALLIDANDRULA PRIORITIES MAARINAVI.YANTHRALANU[PILLALANU] THAYAARU CHESI DABBU SAMPAADANA KOSAM EE PRAPANCHAMLOKI VADILESTHUNNAARU.CHADUVUNU CHINNANAATI NUNDI KONUKKUNTUNNAARU.SPOORTHIPRADAATALAINA UPAADHYAAYULU KARUVAINAARU IPPUDU .ANDARILONU ABHADRATHABHAAVAM KANIPISTHONDI.ENTHA SAMPAADINCHINAA THRUPHTIGAA UNDADAM LEDU.KAAVUNA MANA BHASHA GURINCHI AALOCHANA THALLIDANDRULAKI,PILLALAKI,PAATASAALALAKU NAAMAMAATHRANGAANAINA LEDU
    AINA AALOCHANALLO MAARPUVATSHODANI AASISTHU
    O BHAASHAABHIMAANI
    MANNICHANDI NAAKU COMP. LO TELUGU TYPE CHEYADAM RAADU,NERCHUKUNTAANU

    (పాఠకుల సౌకర్యార్థం లిప్యంతరీకరించిన వ్యాఖ్యను క్రింద ఇస్తున్నాం -సం.

    రోహిణీప్రసాద్ గారూ, వెర్రివాళ్లకు చెందిన ఈ వ్యాసం కొంతమంది వెర్రివాళ్లకు బాగుంటుంది. నాకు బాగుంది. నేననుకుంటాను వెర్రివాళ్లు కాని వారి ప్రాముఖ్యతలు మారిపోయాయి. డబ్బు డబ్బు…ఇది ఉంటే[ఎలా సంపాదించినా] ఇప్పుటి జనం చాలా గౌరవంగా చూస్తున్నారు. మీ మంచికి, మీ పనితనానికి ఎంతమంది గౌరవమిస్తున్నారు? తల్లిదండ్రుల priorities మారినవి. యంత్రాలను[పిల్లలను] తయారు చేసి డబ్బు సంపాదన కోసం ఈ ప్రపంచంలోకి వదిలేస్తున్నారు. చదువును చిన్ననాటి నుండి కొనుక్కుంటున్నారు. స్ఫూర్తిప్రదాతలైన ఉపాధ్యాయులు కరువైనారు ఇప్పుడు. అందరిలోనూ అభద్రతాభావం కనిపిస్తోంది. ఎంత సంపాదించినా తృప్తిగా ఉండడం లేదు. కావున మన భాష గురించి ఆలోచన తల్లిదండ్రులకి, పిల్లలకి, పాఠశాలలకు నామమాత్రంగానైనా లేదు.
    ఐనా ఆలోచనల్లో మార్పువస్తుందని ఆశిస్తూ
    ఒ భాషాభిమాని
    మన్నించండి నాకు కంప్యూటరులో తెలుగు టైప్ చెయ్యడం రాదు, నేర్చుకుంటాను)

  6. Rohiniprasad says:

    సుధాకర్‌గారి ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. కానీ సమాజాన్ని నడిపించే ఆర్థికశక్తులు చాలా బలమైనవి. వాటిని ఎదుర్కునే సామర్థ్యం సాహిత్యం, కళలూ వగైరాలకు ఉండదు. బాబ్జీలు గారన్నది కూడా నిజమే. భాష ప్రజల నోళ్ళలోనూ, మనసుల్లోనూ జీవిస్తుంది. అయితే వర్తమాన యుగంలో భాషలకూ, సంస్కృతికీ పాఠ్యపుస్తకాలతో బాటు మామూలు రచనలు కూడా కొంత ప్రామాణికతను కలగజేస్తాయి. ఇటీవలి సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడం సామాన్య పాఠకులకు లాభిస్తుంది. ఇదంతా లోకోత్తరమైన, ఉదాత్తమైన సాహిత్యం కాకపోవచ్చు. ఉదాహరణకు రావి కొండలరావుగారు ఈనాడులో పాత సినిమాలను గురించి రాస్తున్న ఆణిముత్యాలు అనే శీర్షిక. టీవీలో చూపిస్తున్నవే తెలుసుకోదగ్గ విషయాలు అని భావించే ప్రస్తుత తరానికి ఇవి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను.

    మరొక్క విషయం. తెలుగులో కామెంట్లు రాయడానికి lekhini.orgలో టైప్‌చేసి ఇక్కడ copy/paste చెయ్యవచ్చు.

  7. మీ వ్యాసంలో నన్ను నేను చాలా సార్లు చూసుకోగలిగాను.

    నేను కూడా ATM అవడానికని పెంచబడ్డాను. చిన్నప్పుడు లెక్కలు చదివితే డబ్బు బాగా సంపాదించవచ్చు అని చెబితే అదే ధ్యాసగా చదివేవాడిని. అమెరికా వెళ్ళడమే నిర్వాణంగా భావించేవడిని. ఇప్పుడు అమెరికా వెళ్ళడం, తోక ముడుచుకొని వెనక్కి రావడం అన్నీ అయ్యిపోయిన తరువాత, చిన్నప్పుడు మా తెలుగు మాస్టారు చెప్పిన అనేక ఆసక్తికరమైన భాషాసాహిత్యసంబంధ విషయాలు మెల్లగా గుర్తుకు రావడం మొదలయ్యాయి.

    కానీ నేను తెలుగు రాయడం పూర్తిగా మరచిపోయాను. అప్పటిలో కూడా తెలుగులో మార్కులు సరిగా వచ్చేవి కావు. కానీ మెల్లగా inscript నేర్చుకొని (నాకు ఆంగ్ల ఆక్షరాలు వాడి తెలుగు టైపింగు చేయడం అంటే పూర్తి అయిష్టం), బ్లాగు మొదలు పెట్టాను. మొదట్లో మీ బ్లాగు చదివితే వికారం వస్తుంది అన్నారు కొందరు. కానీ కష్టపడి భాష నేర్చి, సాహిత్యం కవితలూ చదివి, ఇప్పుడు ఒక స్థాయికి చేరుకున్నాను.

    ఇక నేను ఇంటికాడఁ గాని, చుట్టాల మధ్యగాని మంచి సాహిత్యాన్ని ప్రస్థావిస్తే, బాబోయ్ మమ్మల్ని వదిలేయయ్యా అన్నట్టు చూస్తూంటారు జనం. అలా బ్లాగర్లతో కొత్త కుటుంబాన్ని చూసకొనవలసివచ్చింది.తెలుగువారి మనోరంజనా మాధ్యాల స్థాయి రోజురోజుకీ దిగజారిపోవడం చూస్తూంటే చాలా బాధగా వుంది.

    మొత్తానికి మళ్ళీ తెలుగు సాహిత్యం చదవడం మొదలు పెట్టాను. శ్రీశ్రీ, తిలక్ కవితలు చదివితే భాష మీద ఆసక్తి ఇంకా పదింతలు పెరిగిపోయింది. అలానే అన్నమాచార్యుల కీర్తనలు అర్థం చేసుకోవడం వంటివి చేస్తుంటే, జీవితం ఎంతో అర్థవంతంగా వున్నట్టనిపిస్తుంది. మొత్తానికి ATM నుండి చాలా దూరం వచ్చాను. పోతన పద్యాలు, తిరుపతి వేంకట కవుల పద్యాలు వచ్చునిప్పుడు.

    ప్రత్యేకించి చెప్పుకోవలసిన ఒక విషయం,
    నేను నిరుడు విశాలాంధ్రలో చాలా పుస్తకాలు కొనుకున్నాను, పెద్దల సూచనల మేరకు.

    అందులో నా కూడా చదువు మఱియు చివరకు మిగిలేది కర్ణాటకం తీసుకెళ్ళగా, ముందు చివరకు మిగిలేది చదివాను. అబ్బో తెలుగులో చాలా మంచి నవలలు వున్నాయని కొత్తపాళీ గారితోనంటే, ఆయన చదువు కూడా తప్పక చదవవలసిందని, అప్పటి తెలుగు జీవితానికి మంచి డాకుమెంటరీ వంటిదని చెప్పగా అది చదవడం మొదలు పెట్టాను.

    మెదలు పెట్టిన తరువాత, ఏదో సస్పెన్సు నవల చదువుతున్నట్టు అసలు క్రింద పెట్టలేకపోయాను. నేను ఆ కాలంలో పుడితే అచ్చం సుందరంలా ఆలోచించేవాడినని, అతను చేసిన పనులే చేసేవాడినేమోనని అనిపించింది. ఇది కుటుంబరావుగారి గొప్పతనం అనే చెప్పాలి. నవల చదువుతున్నంత కాలం మనసు ఉప్పొంగే వుంది. చదివిన తరువాత ఒక టపా రాద్దామనుకున్నాను గాని, ఆ భావాలు అట్టే ఆక్షరాలలోఁ వ్యక్తపరచలేక, విరమించుకున్నాను. కానీ, నేనూ ఒక నాడు ఒక సుందరం గుఱించి వ్రాయాలని, చిన్న కోరిక బుఱ్ఱ వెనుకు నమోదు చేసుకున్నాను. వంద ఏండ్లకైనా అలాంటి పుస్తకం ఒకటి వుండాలిగా.

    మీ టపా చదివితే, నా మూఁడేండ్ల తెలుఁగు బ్లాగు జీవితాన్ని, నిర్వాణ సోపానమదిరోహణముగా వివరిస్తూ టపా వ్రాయాలనిపిస్తుంది.

    మీ
    రాకేశ్వరం (long way from రాకేష్ కుమార్)

  8. రాఘవ says:

    మా రాకేశ్వరుని వ్యాఖ్యఁ జదివి నాకు కూడ నేదైనఁ జెప్పాలనిపించి…
    వేరేవారికిఁ జెప్పేముందుగా నేను సరిగా నుండాలని యిప్పుడు బుద్ధిగాఁ (బాల) వ్యాకరణం నేర్చుకుందా మనుకుంటూన్నాను.

  9. క్షమించాలి, నేను చదువు కొన లేదు. తోటి బ్లాగర్లలో ఒకరు బహుమతిగా ఇచ్చారు.

    @ రాఘవ
    విశాలాంధ్రలో బాలవ్యాకరణం దొరకదనుకుంట 🙂

  10. Rohiniprasad says:

    కుటుంబాల్లో పిల్లలకు పది, పదిహేనేళ్ళ వయసు లోపల తెలుగు మాట్లాడడం, చదవడం, రాయడం అలవాటు చేస్తే మంచిది. మా పిల్లలు బొంబాయిలో పుట్టి పెరిగినప్పటికీ ఇంట్లో ఉన్నప్పుడు తెలుగులోనే మాట్లాడే అలవాటు చేశాం.

  11. రాకేశా, ఆప్పుడెప్పుడో చెప్పుకున్నావు చూడు, “నాకసలే మంచి వ్యాఖ్యలు రాస్తానని పేరూ” అని- దాని అర్ధం ఇవాళ తెలిసింది.
    టోపీ తీస్తున్నా, వ్యాఖ్య కి, వ్యక్తిత్వానికీ.

  12. రాకేశ్వరం గారు చాలా బా రాశారు కామెంట్, ఆ చదువు గురించి చెపుతుంటే చదవాలని పిస్తుంది,

  13. Purnima says:

    రాకేశ్వర రావు గారు:
    అభినందనలు! బ్లాగ్లోకంలోకొచ్చిన చాన్నాళ్ళకి గానీ మీ గురించి తెలియలేదు. తెలిసిన దగ్గరనుండీ మాత్రం, తెలుగులో నేను తడబడుతున్న ప్రతీసారి మీ ప్రయాణాన్ని స్పూర్తిగా తీసుకుంటూ వచ్చాను. మీ నోటే, మీ కథ వినాలనుంది. త్వరగా రాయరూ.. దయచేసి.

    మరో మారు అభినందనలతో,
    పూర్ణిమ

  14. @ రోహిణీప్రసాద్ గారు,
    మీ పిల్లలకు కూడా తెలుగు మాట్లాడం రాకపోతే చాలా చాలా దారుణంగా వుండేది, that would seriously depress me 🙂 హూఁ మంచి సినిమా కథకు ఉపాయమిచ్చారు, నెనర్లు.

    @ విశ్వామిత్ర, అశ్విన్, పూర్ణిమ గార్లు,
    మీ అభినందనలుకు పెక్కు కృతజ్ఞతలు. మీ ఆశ త్వరలో నెరవేర్చగలనని ఆశిస్తున్నాను.

  15. Rohiniprasad says:

    అప్పట్లో మా అబ్బాయి కంప్యూటర్‌మీద పోతన ఫాంట్లో తెలుగు టైప్ చెయ్యడం నేర్చుకున్నాడు. బొంబాయి హిందీ టీవీ సీరియళ్ళకూ, గోడ్జిల్లావంటి సినిమాలకూ తెలుగు డబ్బింగ్ కూడా చెప్పాడు. మా పిల్లలిద్దరూ చిన్నప్పుడు బొంబాయిలో తెలుగు నాటికల్లో తెలుగులోనే స్క్రిప్టు రాసుకుని నటించారు. 1977-81 ప్రాంతాల బొంబాయిలో పుట్టి పెరిగిన తెలుగు పిల్లల్లో ఇది అరుదైన విషయమే. నేను పుట్టి పెరిగినది మద్రాసులోనేనని కూడా చెప్పాలి!

  16. Pingback: రెండు ప్రకటనలు « ఊక దంపుడు

  17. It is good for Telugu People and could help to telugu interested people

  18. చాలా మంచి వ్యాసం. అలాగే రాకేశ్వర రావు గారి వ్యాఖ్య కూడా.
    // సాహిత్యం, భాష, సంస్కృతి అని మథనపడేవాళ్ళు వెర్రివాళ్లలా కనిపిస్తున్నారు.
    వీరు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. వీళ్ళు మరికొంత మంది వెర్రివాళ్ళను తయారు చేయటమే.

  19. Pingback: ఈమాట » కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం

Comments are closed.