సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 2

ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి

(ఇంటర్వ్యూ మొదటి భాగం)
మీ రచనల్లో నాకు తెలిసిన వాటిలో ‘నేను-తను’ కథగానూ, కవితగానూ రెండు రూపాల్లో వుంది. వాటిల్లో మీరు ముందు కథ రాశారా? లేక కవితా? ఇంకే కథనైనా కవితగా గానీ, కవితను కథగా గానీ రాశారా? ఆ ఉద్దేశ్యమేమైనా ఉందా?

కవితగా రాసినప్పుడే దాన్ని కథగా పునర్నిర్మించాల్సిన అవసరం కలగొచ్చు గాని, కథగా రాసింతర్వాత కవితగా మార్చాల్సిన అవసరం రాదు. ‘నేను-తను’ ముందు కవితగా రాశాను. తర్వాతనే కథగా మలిచాను. దీని కంటే ముందు ‘ఒక్క వాన చాలు’ కవితను కథగా రాశాను. దీనికి కథల పోటీలో ద్వితీయ బహుమతి కూడా వచ్చింది. ‘కొడుకు-కూతురు’ కథ కూడా ముందు కవితే. నా కథల్లో ఎక్కువ పాళ్ళు కవితాంశాలు ఉండటానికి కారణం బహుశా కవిత్వం, కథ పెనవేసుకు వచ్చిన పురాతన కావ్యాలతో దగ్గరి పరిచయం ఉండటం వల్ల కావొచ్చు.

నేను-తను‘ కవిత చదివి ఫణీంద్ర ‘సరిహద్దుకిరువైపులా‘ అనే కథ రాశారు. ఆ కవితకు అంతర్జాలంలో వచ్చిన స్పందన తెలిశాక మీరెలా ఫీలవుతున్నారు?

‘నేను-తను’ కవిత మొదట ఆంధ్రజ్యోతి వీక్లీలో ఈ వారం కవితగా వచ్చినప్పుడు ప్రసిద్ధ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు స్పందించి అభినందిస్తూ ఉత్తరం రాశారు. అంతర్జాలంలో ఫణీంద్ర గారు ఏకంగా కథే రాశారు. నా కవిత పుట్టుకకు ఇంతకన్నా సార్థకత ఏముంటుంది. సుమతీ శతకకారుడు చెప్పిన ‘పుత్రోత్సాహం’ భావన నాకు పరిపూర్ణంగా అందినట్లుగా భావిస్తున్నాను.

పత్రికల్లో యీ రకమైన స్పందనకు అవకాశం లేదుగదా! మీ రచనల్ని అంతర్జాలంలోకి తీసుకు రావాలనుకుంటున్నారా?

మీరు చెప్పింది వాస్తవమే. మూల రచన వద్దే స్పందనలు కనిపించేలా చేయటం పత్రికల్లో కష్టమే. మీరు.. మీరు చెబుతున్నట్లు పుస్తకాలు చదవటం కన్నా అంతర్జాలం చూసి స్పందించటానికే పాఠకులు ఇష్టపడుతున్నారనే విషయం నాకు తెలీదు. నిజమే కాబోలు. నాకా అంతర్జాలం అందుబాటులో లేదు. అంతర్జాలంలో ఇలాంటి తక్షణ స్పందనలు వస్తాయనీ, ఆ స్పందనలు ఇంత అపురూపంగా వుంటాయనీ నాకు రుచి చూపించిన మిమ్మల్ని నేను మరిచిపోలేను. నా రచనల మీది స్పందనల్ని అంతర్జాలం లోంచి ప్రింటవుట్ తీసి ఎక్కడో మారుమూల పల్లెలో ఉంటోన్న నాకు పంపి, ఒక అద్భుతమైన అనుభూతినిచ్చినందుకు మీకు ఋణపడి వుంటాను. ఎక్కడయితే పాఠకులు స్పందిస్తారో, ఆ వేదిక మీదే రచనలు కూడా ఉండటం సముచితం. నా రచనల్ని అంతర్జాలంలోకి ప్రవేశపెట్టటం నాకిష్టమే.

ఇతరుల రచనలు చదివి ఉత్తేజితులై ప్రేరణ పొంది మీరు రచన చేసిన సందర్భాలేమైనా వున్నాయా?

సన్నపురెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డితో (కుడివైపున)
సన్నపురెడ్డి. ఫోటో సౌజన్యం: స్వాతీ శ్రీపాద

ఇతరుల రచనలు చదివి ప్రేరణ పొంది తక్షణమే వాటిని అనుకరిస్తూ రచనలు చేసిన సందర్భం నా రచనా జీవితంలో ఏర్పడినట్లుగా నాకు గుర్తులేదు. అలాగని ప్రేరణ లేకుండా నేనేమీ రాయలేదు. పద్య సాహిత్యం చదివి చదివి, ప్రేరణ పొందే పద్యాలు రాశాను. అలాగే కవితలు, కథలు, నవలలు. నేను కథలు రాసే తొలి నాళ్ళలో సింగమనేని నారాయణ, కేతు విశ్వనాథరెడ్డి, పి.రామక్రిష్ణారెడ్డి లాంటి కథకుల కథలు చదివి కథా వస్తువు గురించిన సరైన స్పృహ ఏర్పరుచుకొన్నాను. నా చుట్టూ వున్న, నాకు తెలిసిన, నా అనుభవానికి వచ్చిన జీవితాల్నే కథలుగా ఎలా మలుచుకోవచ్చో వాళ్ళనుంచి ప్రేరణ పొందాను. వాళ్ళను చదివింతర్వాత వస్తువు కోసం గాల్లోకి చూడకుండా, ఎక్కడో వెతుక్కోకుండా నా చుట్టూ ఉన్న వ్యవసాయ జీవితాల్లోంచే ఎలా స్వీకరించవచ్చో తెలిసికొన్నాను. అంతేగాని ఒక కవిత, కథ, నవల చదివి అలాంటి కవితే, కథే, నవలే రాయాలని, వాటిని అనుకరించాలని నేనెప్పుడూ ప్రేరణ పొందలేదు. నాలో పాఠకుడు వేరు-రచయిత వేరు. ప్రపంచంలోని అందరి రచయితల అనుభవాల్ని తనవిగా అనుభూతించే తత్వం నాలోని పాఠకుడికి వుంటే, తనదైన ప్రత్యేకత కలిగిన అనుభవాల పరంపరల్ని పాఠకుల అనుభూతికి తెచ్చేందుకు నాలోని రచయిత తాపత్రయ పడుతుంటాడు. పాఠకుడిగా బైట్నించి ఎంత కొత్త జీవితానుభవాల్ని తను తీసికొంటున్నాడో, రచయితగా అంతే నూతనత్వాన్ని ప్రపంచానికి అందించాలనే కసి నాకుంది. నేను జీవించే సమాజం అలాంటి శక్తిని నాకిస్తోంది. నా చుట్టూ సమాజంలో మార్పును పసిగట్ట గలుగుతున్నాను కాబట్టి నాకు కథలకు గాని, నవలలకు గాని వస్తువు కొదవలేదు.

ఒక మారుమూల పల్లెటూళ్ళో ఉండటం ఒక రచయితగా మీకు లాభించిందా? లేక సాహితీ మిత్రుల సాంగత్యంలో ఉన్నట్లయితే మరింత బాగా రచనలు చేసేవాణ్నని భావిస్తున్నారా?

నిబద్ధత కలిగిన రచయితకు ఏ ప్రాంతమైనా ఒకటే. పల్లెటూర్లో కథావస్తువులు ఎక్కువగా దొరుకుతాయని, నగర జీవితంలో దొరకవనీ అనుకోవటం పొరబాటు. జనజీవనం లోని మార్పుల్ని పసిగట్టే దృష్టికోణం ఒకటి ఉంటే, మానవ సంబంధాల పట్ల ఆర్తివుంటే, జీవితాంతం రాసుకున్నా తరిగిపోని కథల నిధి తన చుట్టూనే వుంటుంది. పల్లెలకంటే కూడా పట్టణాలలోనే మనిషి జీవితం తీవ్ర వేగంగా మారిపోతూవుంది. ఆ జీవితాల్లోకి చొచ్చుకుపోయి, ఆ మార్పుల్ని పట్టుకోగలిగితే కుప్పలు తెప్పలుగా వచ్చిపడే కథావస్తువుల్ని చూసి రచయితే ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి వస్తుంది. తనచుట్టూ తాను గిరిగీసికొని, ఆ గిరిలోకి వచ్చిన విషయాల్ని మాత్రమే కథలుగా రాయటం వల్ల కథావస్తువుల కొరత ఉంటుందేమోగాని, గిరి దాటుకుని ఎదుటి జీవితాల్లోకి చొరబడగలిగిన వాళ్ళకి ఏం తక్కువ? ఏ రచయిత అయినా తను జీవిస్తోన్న పరిసరాల్లోంచే కథా వస్తువుల్ని తయారు చేసికోవాలి. నా వరకైతే నేను ఎక్కడున్నా ఇదే విధంగా సాహిత్య సృజన చేయగలను.

సన్నపురెడ్డి రాసిన ఛందోబద్ధ పద్యాల్లో కొన్ని.
భారతి మాసపత్రిక 1988 ఏప్రిల్ సంచికలో వచ్చాయి.

మగబుద్ధి

“తరణి తరుణ కిరణ సరణి తెమ్మెరదేలి
వచ్చి తనువుదాక వణకి భీతి
దండమిడెదు కలువ రెండు చేతులు మోడ్చి
ఎంత వెఱ్ఱి నీకు? యినుడు ప్రభువె?

బెదరి పదరి యదరి భీతిల్లి కుంచించు
కొనెదు తనువు. నెత్తికొనవదేమి
భూమిగన్నదలను యా మిహిరుడు రాగ.
పోషితుండె? భర్తె? పూజ్యమేల?

ఎర్రమంటల మీ తనువెల్ల గాల్చి
కొల్లగొట్టిన సౌందర్యమెల్లగూర్చి
తన సతులకిచ్చునట గదా తరణి. యట్టి
ధూర్తునకు దండమిడెదేల తొలగి తొలగి?”

“అతడు హితుడో… అహితుడౌనో… ధూర్తహృదియొ
సత్ హృదియొ… ప్రభువౌను యీ సమయమునకు.
వందనమిడుట మాబోంట్ల వర్తనమ్ము
కాదనెదె యనుభవశూన్య! కవికుమార!

గురు విభూతి వెలుగు పరపురుషుని గన
నుచితమే కులకాంతకు? నువిద దలను
వంచ శుభమౌనెగాని దుష్టులమదెద్ది?
అడ్డుపడువాడు యేడి యేదైన జరుగ?

ఒక్క భాస్కరుడేమి? యీ యుర్వి పురుష
వర్గమెల్లను… నీవొ… నీవొక్కరుడవు
మంచివాడవె? మా తనూ మహిత విభవ
మెల్ల కొల్లలాడెదు సందొకింత నబ్బ.”

దీర్ఘకాలంగా ఒక మారుమూల పల్లెలో ఉంటున్నారు, రాయడం కొనసాగిస్తున్నారు. ఇంతకాలంగా మిమ్ముల్ని యీ వ్యాసంగంలోనే నిలబెట్టి వుంచిన కారకాలేమిటి?

చదవటం రాయటమనే యీ అలవాటు బాల్యం నించి నాతోనే పయనమై వస్తోంది. ఈ రెండు క్రియలు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లా నా జీవితం నిండా పెనవేసుకుపోయి సాహిత్యపు వూపిరి ఐంది. ఇప్పుడు నిజంగా చదవకుండా రాయకుండా బతకలేని పరిస్థితి. శ్వాసలేకుండా బతకలేం గదా! చిన్నతనాన మొదలైన యీ సాహిత్యపు సహవాస బంధం రాను రాను బలపడుతోందే తప్ప పలుచనవటం లేదు. ఈ సహవాసం వల్ల నేను సంస్కరించబడుతున్నాను. నేను రాసే ప్రతి కథా నన్ను పుటం పెట్టి కాల్చి ప్రక్షాళన చేసింతర్వాతే బైటకొస్తూ వుంది. కర్షకులు, కార్మికులు, దళితులు, స్త్రీల విషయంలో, కులాలు మతాల విషయంలో నా రక్తంలో జీర్ణమై ఉన్న పాత వాసనలెన్నింటినో నేను సృష్టించే సాహిత్యం సంస్కరిస్తూ వుంది. ఉదాహరణకు – స్త్రీల విషయంలో తరతరాలుగా ఆనువంశికంగా వస్తోన్న మగ అహంకారపు అవలక్షణాలు నాలోనూ వున్నాయి. వాటి ఉనికిని గురించిన స్పృహ సాహిత్యమే నాకిచ్చింది. నన్ను నేను సంస్కరించుకునే క్రమంలోనే నా చుట్టూ వున్న సమాజంలోంచి మహిళలకు సంబంధించిన ఎన్నో సంఘటనలు అర్థమై కథలుగా తయారయ్యాయి. అలాగే దళితులూ, వ్యవసాయ కూలీలూ, బడుగు బలహీన వర్గాలూ… యీ కథలన్నీ నన్ను సంస్కరిస్తూ బైటకొచ్చినవే.

బేసిగ్గా మిమ్ముల్ని మీరు కవిగా భావిస్తారా? కథా రచయితగానా? నవలా రచయితగానా?

బేసిగ్గా నేను కవినే, సందేహం లేదు. అయితే నేనిక్కడ ఓ విషయం చెప్పాల్సి వుంది. నామీద ఎంతో కొంత ప్రాచీన సాహిత్య ప్రభావం వుంది. వాళ్ళు కవిత్వపు చట్రంలో కథను ఇమిడిస్తారు. ఛందోబద్ధ పద్యాల లయాన్విత కదలికల మద్య కథనీ, వచనాన్నీ నడిపిస్తారు. నేను వచనం మధ్య కవిత్వాన్ని పలికిస్తాను. అది లయాన్విత శబ్దాలతో కూడినది కాకపోవచ్చు. కథకు అనుగుణంగా, పాత్రోచితంగా, లయాన్విత భావాలతో కూడిన కవిత్వాన్ని వచనం సందుగొందుల్లో అందంగా అమర్చటం నాకిష్టం -అందుకే నేను బేసిగ్గా కవినే.

మీ దృష్టిలో సాహిత్య ప్రయోజనం ఏమిటి? ఇప్పటిదాకా మీ రచనల ద్వారా మీరు ఆ లక్ష్య సాధనలో ఎంతవరకు పురోగతి సాధించగలిగారని భావిస్తున్నారు?

సాహిత్యం మనిషిని సంస్కారవంతున్ని చేయగలిగితే చాలు. ముందుగా తను సంస్కరించబడిన తరువాతే రచయిత మంచి సాహిత్యాన్ని సృష్టించగలడు. సాహిత్య సృష్టి కోసం నన్ను నేను సంస్కరించుకోవటమే నా సాహిత్యం వల్ల కలిగిన మొదటి ప్రయోజనంగా నేను భావిస్తున్నాను. ప్రయోజనాన్ని గురించి పక్కన పడితే – నా కథలు, కవితలు, నవలలు చదివి చాలామంది పాఠకులు అందులోని పాత్రలతో తమను పోల్చుకుంటూ మమేకమౌతూ నాకా విషయాన్ని చెప్పినప్పుడు -సాహిత్యకారునిగా మరింత సాహిత్య సృజనకు ప్రేరణ పొందుతాను.
మీరు రాసిన వాటిలో మీకు బాగా తృప్తి నిచ్చిన కథ ఏది? ఎందుకు?

కొత్త దుప్పటి కథాసంపుటి ఆవిష్కరణ

కొత్త దుప్పటి కథాసంపుటి ఆవిష్కరణ సభలో పాలగిరి విశ్వప్రసాద్, సింగమనేని నారాయణ, ఆవిష్కర్త కోట పురుషోత్తం, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, చిల్లర భవానీదేవి, డా. మల్లెమాల వేణుగోపాల రెడ్డి

నాకు బాగా నచ్చిన కథ ‘కొత్త దుప్పటి’. నిలువెత్తు ప్రేమరాహిత్యానికి అచ్చమైన ప్రేమతత్వం ఎదురుపడి ప్రశ్నార్థకమై సంధించినప్పుడు, ప్రేమరాహిత్యం కాస్తా చిట్లి, పగుళ్ళుబారే సవ్వడులు యీ కథలో స్పష్టంగా వినిపిస్తాయి. మానవ సంబంధాల తడి కథనిండా అలుముకొని వుంటుంది. పల్లెటూరి పంట కళ్లాల్లో ఒక చీకటి రాత్రి జరిగిన సంఘటన అత్యంత సహజంగా చిత్రీకరించబడింది. పల్లె సంస్కృతి, వ్యావసాయిక జీవన చిత్రణ, మానవసంబంధాల స్పర్శ, జానపద భావన, చిన్నచిన్న అవసరాల్ని కూడా తీర్చుకోలేనితనం పట్ల మనిషి అసంతృప్తి, ఆవేదన, ముసలివాళ్ళ పట్ల పెరుగుతోన్న అనాదరణ, ప్రేమరాహిత్యం వగైరా భావాలన్నీ కథలో అంతర్లీనంగా వస్తూ, ఇవన్నీ తను వ్యక్తీకరిస్తున్నాననే విషయం రచయితకు తెలీకుండానే -కథ, కథలోని పాత్రల, పరిసరాల వాతావరణం యొక్క అవసరాల మేరకు ఆవిష్కరించబడిన వైనం యీ కథలోని ప్రత్యేకత.

మీకు నచ్చిన మీ కవిత ఏది? ఎందుకు?
నాకు నచ్చిన నా కవిత ‘బడి పిల్లలు’. ఉపాధ్యాయునిగా నా తాత్వికతకు ప్రతిరూపం అది.

మీకు బాగా నచ్చిన మీ నవల ఏది? ఎందుకు?
నాకు బాగా నచ్చిన నా నవల ‘కాడి’. దీన్ని గురించి పూర్తిగా చెప్పాలంటే చాలా పేజీలే ఖర్చవుతాయి. ‘కాడి ‘ అనగానే రెండెడ్లు పూన్చిన రైతు దృశ్యం కళ్లముందు కదలాడుతుంది. యాభై యేళ్ల రాయలసీమ మెట్ట వ్యవసాయం లోని స్థితిగతుల్ని చర్చించిన నవల ఇది.

‘కోపుయాస’ లేని ఎద్దుల్ని పూన్చినప్పుడే ‘కాడి’ రమ్యంగా వుంటుంది. కొంత కోపుయాస వున్నా, బలమైన ఎద్దు తన మీద పర్రేసుకొని (భారం తనమీద పడేలా నాగల్ని తనవైపు సర్ది కాడి కట్టటం) అయినా యీడ్చే మానసిక ఉన్నతి ఉన్నప్పుడే కాడి సత్ఫలితాలనిస్తుంది.

కాడికి కోపుయాస లేని ఎద్దులు ఎలాగో-
వ్యవసాయ జీవనానికి రైతులు, దళితులు కూడా అలాగే-
వైవాహిక జీవితానికి ఆలుమగలు అంతే-
వ్యక్తిగత జీవితానికి చదువూ శారీరక శ్రమా అంతే-
వృత్తుల్ని బట్టి కులాలేర్పడ్డాయి. వృత్తులు మాసిపోతున్నాయి గాని, కులాలు మాత్రం బలపడుతున్నాయి.

కాడి నవల ప్రధాన ఆశయమేమంటే –
– కులాలు పోయి వృత్తులే మిగలాలని.
– పనిమానుకొని సుఖ జీవనం కోసం అన్వేషించే బదులు పనిలోనే సుఖాన్వేషణ చేయాలని.
– ప్రతి తండ్రి తన సంతానాన్ని సోమరిగా బతికేందుకు దారులు వెదకే బదులు, బతికేందుకు తనకు తెలిసిన వృత్తిని వారసత్వంగా అందివ్వాలని.
– శ్రమచేయని చేతులకు అన్నం కలిపి ముద్ద జేసికొనే హక్కు లేదనే విషయం వంశపారంపర్యపు నీతి సూత్రంగా అందివ్వాలని.

పల్లెల ఆత్మ స్వరూపాన్ని పట్టుకున్న నవలగా ‘కాడి’ నాకు నచ్చిన నవల.

మీరు చదివిన ఇతరుల రచనల్లో మీకు బాగా నచ్చిన రచన ఏది?

మహాభారతం. పాఠకుడిగా చాలాకాలం మహాభారతాన్ని చదివి ఆనందపడ్డమాట వాస్తవమే కాని, రచయితగా మారింతర్వాత భారతం నన్ను అడుగడుగునా ఆశ్చర్యానికి గురిజేస్తూవుంది. అసంఖ్యాకమైన పాత్రలు, విలక్షణమైన మానసిక చిత్రణలూ, విభిన్న జీవన ధోరణులూ, వేనవేల జీవిత దృశ్యాలూ.. సృజనాత్మకతకు పరాకాష్ట మహాభారతం -సందేహమే లేదు.

———————-

రానారె, త్రివిక్రమ్, చదువరి లు పొద్దు సంపాదకవర్గ సభ్యులు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

One Response to సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 2

  1. తవ్వా విజయభాస్కరరెడ్డి says:

    మీ ప్రయత్నం అభినందనీయం. సన్నపురెడ్డిగారితో మీ సంభాషణ బాగుంది.పొద్దు పది కాలాల పాటు మనగలగాలని ఆశిస్తూ…

Comments are closed.