కైవల్యం

– టి. శ్రీవల్లీ రాధిక

సగం సగం ఆత్మల్ని
సంపూర్ణ శరీరాలలో నింపి
దేవుడు వేడుక చూస్తుంటాడు

మనుషుల్ని ఒకచోట
మనసుల్ని మరోచోట విసిరేసి
మరణించేలోపల వెతుక్కోమంటాడు.

పున్నమి రోజునా సగం చంద్రుడే
కనిపిస్తూన్నపుడూ
యుగళగీతాలలోనూ ఒక్క స్వరమే
వినిపిస్తూన్నపుడూ
ఆ విషయం మనకి అర్ధమవుతుంది

మనదైన మరోసగం కోసం
వయో లింగ బేధాలూ
జాతిమత వైరుధ్యాలూ లెక్కచేయని
అన్వేషణ మొదలవుతుంది.

భూగోళం మొత్తాన్నీ
ఓ అరచేతిలో నిలిపి
భూతద్దం మరో చేతికి యిచ్చినా
కనులతో దానిని కనిపెట్టలేమని
త్వరలోనే తెలుస్తుంది

భూమ్యాకాశాలని
చాపలా చుట్టే సామర్ధ్యం సాధించినా
చేతులతో దానిని అందుకోలేమని
క్రమంగా అవగతమవుతుంది.

ఆతర్వాతే అసలు నరకం
మొదలవుతుంది
రొజురోజుకీ దగ్గరవుతున్న ప్రపంచం
మనకుమాత్రం అనంత శూన్యంగా
అగుపిస్తుంది

అన్నీ తెలిసిన భాషలే
అయినా మాటలు అర్ధం కావు
మళ్ళీ మళ్ళీ చూసిన మొహాలే
అయినా మనసులో నిలబడవు

రోజు తర్వాత రోజు గడుస్తూ వుంటుంది
మనసు చుట్టూ గోడ మరింత గట్టిపడుతుంది
కళ్ళనుంచి అపుడో చుక్క అపుడో చుక్క
తడబడుతూ రాలుతుంటుంది

కళ్ళు మూసే లోపల కలుసుకోలేని నేస్తం కో్సం
గుండె గుక్క పడుతుంది
మరెవరికీ కనబడని ఈ వైకల్యం
మనల్ని నిర్వీర్యం చేస్తుంటుంది

మనం అసహాయంగా చూస్తుండగానే అది
మెల్లమెల్లగా మనల్ని కబళిస్తుంది

—————————-

టి. శ్రీవల్లీ రాధిక హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. “రేవు చూడని నావ” అనే కవితాసంపుటి, “మహార్ణవం”, “ఆలోచన అమృతం” అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువాదమై “మిత్‌వా” అనే పుస్తకంగా వచ్చాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలోకి అనువదింపబడ్డాయి. “నా స్నేహితుడు” అనే కథకు 1994 లో “కథ” అవార్డు అందుకున్నారు. మహార్ణవం అనే పేరుతో బ్లాగు రాస్తూంటారు.

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

22 Responses to కైవల్యం

  1. Subrahmanyam Mula says:

    చాలా బావుందండీ.

  2. ఇక్కడ చాలనన్ని “చాలా”లు పెట్టాలనుంది. కానీ ఎన్ని పెట్టినా ఈ కవితకు తగిన గౌరవమియ్యలేవు. కాబట్టి, చాలా బాగుంది.

  3. “మనుషుల్ని ఒకచోట
    మనసుల్ని మరోచోట విసిరేసి
    మరణించేలోపల వెతుక్కోమంటాడు.”
    ఈ మాటలు మాత్రం నన్ను ఒక అర నిమిషం ఒక శిలగా మార్చేశాయి. ఇక కవిత గురించి మీలాంటి వారికి నాబోటోళ్ళు చెప్పేదేముంటుంది? చెప్పినా దానికేం విలువుంటుంది?

    – రాకేశ్వర
    ps: కవితలో అన్ని పాదాల మధ్యా అదే గ్యాపు ఇచ్చారు. పారాలు గా విడగొడితే, బాగుండేదేమో, అసలే పంక్చుయేషన్ కూడలేదు.

  4. గిరి says:

    మీ కవితకి కైవల్యం అని ఎందుకు పేరు పెట్టారు?

  5. రాధిక says:

    Subrahmanyam గారూ! ఫణీంద్ర గారూ! రాకేశ్వరరావు గారూ!
    Thank you.
    “ఇక కవిత గురించి మీలాంటి వారికి నాబోటోళ్ళు చెప్పేదేముంటుంది? చెప్పినా దానికేం విలువుంటుంది?” – ఈ వాక్యాలు చదివి నేనూ శిలనయ్యానండీ. దయచేసి అలా అనకండి. ఒక మంచి కామెంట్ (ప్రశంసయినా, విమర్శయినా) ఎప్పటికీ అమూల్యమే.

  6. మైగాడ్! పొద్దున్నించీ ఇది ఐదోసారి చదవడం. అయినా ప్రతీసారీ, ప్రతి పంక్తీ తొలిసారి చదివినప్పటి స్వఛ్చతతోనే గుండె తడుతుంది.

    సంబంధం లేకపోయినా ఎందుకో ప్లేటో రాసిన “సింపోజియం” గుర్తుకు వచ్చింది. అందులో అరిస్టోఫేన్స్ అనే కవి “ప్రేమ” పుట్టుక గురించి చెప్తాడు. సృష్ట్యాదిలో స్త్రీ పురుషులు వేర్వేరు కాదట. దేవుడు మొదట స్త్రీలూ పురుషులంటూ ఇద్దర్ని సృజించలేదట. ఇద్దర్నీ కలిపి ఒక శరీరంగానే పుట్టించాడట—నాలుగు కాళ్ళు, నాలుగు చేతులు, రెండు తలలతో. ఈ జీవి చాలా బలంగా ఉండేది. ఎంతగానంటే, కొన్నాళ్ళకే తనని సృష్టించిన దేవతలపైనే యుద్ధానికి బయల్దేరింది. దీంతో దేవతలకేమీ పాలుపోలేదు. మిగతా రాక్షసుల్లా వీరినీ చంపేస్తే తమకు పూజలు పునస్కారాలు చేసేవారుండరు. అలాగని వదిలేస్తే తమపైకే వస్తున్నారు. దేవతలంతా సమావేశమై చర్చించారు. మన దేవతలకు ఇంద్రుడున్నట్టూ గ్రీకు దేవతలకు ‘జుయెస్‌’ అనే దేవుడు అధిపతిగా ఉండేవాడు. అతనో సలహా ఇచ్చాడు: ఈ జీవిని రెండు ముక్కలుగా కోసేస్తే వీళ్ళ శక్తి సగమైపోతుందన్నాడు. అంతేకాక, కోయబడిన సగ భాగం తన రెండో భాగాన్ని వెతకడంతోనే జీవితమంతా ప్రయత్నిస్తూ దేవతలపై దండెత్తే విషయాన్ని మర్చిపోతుందన్నాడు. చివరకు అలాగే కోసేసారు. అప్పట్నించీ పుట్టిన ప్రతీ మనిషీ తన రెండో సగం కోసం జీవితాంతం వెతుకుతూనే ఉంటాడట. ఈ వెతుక్కోవడమే ప్రేమ అట. రెండో అర్థభాగం దొరికాకా దాన్ని తమలో పూర్తిగా కలిపేసుకోవాలనే వృథా ప్రయత్నమే శృంగారమట. నమ్మాలనిపిస్తుంది కదూ! కొంతమందికి వెతగ్గా వెతగ్గా ఆ మరో సగం దొరుకుతుంది. మరికొందరికి దొరక్కుండానే జీవితం ముగిసిపోతుంది. ఇక కొంతమంది ఉంటారు, తామున్నది సగమేనన్న స్పృహే లేకుండా, అస్సలు వెతికే ప్రయత్నమే చేయకుండా బతికేస్తారు. వాళ్ళు అదృష్టవంతులు.

    “మరెవ్వరికీ కనపడని ఈ వైకల్యం / మనల్ని నిర్వీర్యం చేస్తూంటుంది”

    —ఈ పంక్తుల దగ్గర ఇదే గుర్తొచ్చింది నాకు. నిజంగా చాలా మంచి కవిత.

  7. bollojubaba says:

    ఏం రాసారండీ.
    చాలా బాగుంది.
    పదాలమధ్య ఇమిడిపోయిన భావాన్ని అర్ధం చేసుకుంటూంటే ఎంత గొప్పగా ఉందండీ.

    మరెవరికీ కనబడని ఈ వైకల్యం
    మనల్ని నిర్వీర్యం చేస్తుంటుంది

    ఎంత చక్కగా చెప్పారు. ఒక learned helplessness ని.

    ఎప్పుడో ఒకప్పుడు/అప్పుడప్పుడూ హృదయాన్ని గుక్కపెట్టించేలాంటి వాస్తవం కళ్లముందు నిలిపారు.

    హాట్సాఫ్

    అభినందనలతో
    బొల్లోజు బాబా

  8. Vaidehi Sasidhar says:

    బ్యూటిఫుల్!!
    రాధిక గారూ,మీ కవిత చదివినప్పుడు తెలియని వేదన ఏదో గుక్కపట్టినట్లు ఉంది.
    మంచి కవిత.

    అభినందనలు
    వైదేహి శశిధర్

  9. “కళ్ళు మూసే లోపల కలుసుకోలేని నేస్తం కో్సం
    గుండె గుక్క పడుతుంది
    మరెవరికీ కనబడని ఈ వైకల్యం
    మనల్ని నిర్వీర్యం చేస్తుంటుంది”

    ఎన్నిసార్లు చదివానో రాధిక గారూ.. మొదటిసారి చదివిన తర్వాతైతే అచేతనంగా అనిపించింది.. అద్భుతమైన కవిత!

    ఇంత మంచి కవితని ప్రచురించిన ‘పొద్దు ‘ వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు!

  10. ప్రతిపదమూ అర్థవంతంగా కూర్చబడిన సంపూర్ణ కవిత!
    ఈ కవిత, దీనికి వస్తున్న స్పందన చూస్తూ ఉంటే, మనిషి రానురానూ ఎంత ఒంటరివాడైపోతున్నాడో తెలిసొస్తోంది. జాలి కలుగుతోంది.

  11. మనం అసహాయంగా చూస్తుండగానే అది
    మెల్లమెల్లగా మనల్ని కబళిస్తుంది

    One of the most scariest stuff that I ever read!
    పేరాలు గా విడగొట్టినందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడింకా బాగా వుంటబట్టింది కవిత.

    @ కామేశ్వర రావు గారు,
    మీ వాక్యాలు కూడా చాలా చేదు నిజాన్ని గుర్తుచేస్తునట్లుగా వున్నాయి. ఆధునిక జీవితం మరింత సంక్లిష్టం అయ్యేకొద్దీ, మనిషి మరింత ఒంటరౌతుంది(తాడు).

  12. రాధిక says:

    గిరి గారూ: కవితకి కైవల్యం అని పేరు పెట్టడానికి కారణం .. బాధనీ, మాయనీ కవితలోనూ, పరిష్కారాన్నీ,తాత్విక సత్యాన్నీ శీర్షిక లోనూ చూపించాలనే ప్రయత్నం.

    ఫణీంద్ర, బొల్లోజుబాబా, వైదేహి, నిషిగంధ, కామేశ్వరరావు, రాకేశ్వరరావు గార్లకు: మీ అందరి అభిప్రాయాలకూ, అభినందనలకూ ధన్యవాదాలు.

  13. గిరి says:

    రాధిక గారు, మీ ఆలోచన, మీ కవిత చాల బావున్నాయి, నాకు నచ్చాయి

  14. Purnima says:

    మాటల్లో పెట్టలేని భావాలుంటాయా, మాటలు చేతనవ్వాలే గాని అనిపిస్తుంది ఇలాంటివి చదివితే! మాటల వల్ల భావాలు పల్చనయ్యిపోతాయి అని ఒక వాదం. మాటల వల్లే అనంత భావరాగాలు మదిన మెదిలాయి ఈ కవిత చదువుతుంటే!

    ఓ “బాగుంది”తో పని అయ్యిపోతే బాగుణ్ణు, కానీ మీ కవితలు నన్నక్కడ ఆపడం లేదు. 🙂

  15. పైన చెప్పినవాళ్ళకన్నా బాగా చెప్పలేను.అందుకే చాలా బాగుంది తో ఆగుతున్నాను.

  16. arunank says:

    మనుషుల్ని ఒకచోట
    మనసుల్ని మరోచోట విసిరేసి
    మరణించేలోపల వెతుక్కోమంటాడు.
    I dont agree with you.No body can seperate your mind from you.It is the man who is seperating him self.
    please read my coment athttp://arunank.blogspot.com/2008/10/blog-post.html

  17. radhika, kaivalyam poem strong madhanam,. tatvika bhumika to aalochimpajestundi. title inkosari aalochinchalemo. all the best.. bhavani

  18. మాధవ్ says:

    మీ కవితలో క్లుప్తత బాగా లోపించింది. అందుకని మార్చుకుని చదువు కున్నాను, కింద చూపినట్టు. మిగతా పదాలూ పాదాలన్నీ అనవసరపు ఆభరణాలే. సహజమైన అందం ఉన్న కవిత కాబట్టీ, ఇలా…

    దేవుడు మనుషుల్ని ఒకచోట
    మనసుల్ని మరోచోట విసిరేసి
    మరణించేలోపల వెతుక్కోమంటాడు.

    అన్నీ తెలిసిన భాషలే
    అయినా మాటలు అర్ధం కావు
    మళ్ళీ మళ్ళీ చూసిన మొహాలే
    అయినా మనసులో నిలబడవు

    రోజు తర్వాత రోజు గడుస్తూ వుంటుంది
    మనసు చుట్టూ గోడ మరింత గట్టిపడుతుంది
    మరెవరికీ కనబడని ఈ వైకల్యం
    మెల్లమెల్లగా మనల్ని కబళిస్తుంది

  19. To: మాధవ్,

    ఆ కవితలో క్లుప్తత లోపించి ఉండవచ్చు; మీరు “మార్చుకుని” చదువుకున్న వెర్షన్లో జీవం లోపించింది, మీరే చెప్పిన “సహజమైన అందం” లోపించింది.

    కొన్ని భావాలు అలా విశృంఖలంగానే బావుంటాయి, ఇలా కత్తెర్లు వేస్తే ఊపిరాడక చచ్చూరుకుంటాయి.

  20. శ్రీ వల్లీ రాధిక గారు !

    ఈ మధ్యనే ఈ బ్లాగుల లొకం లొకి అదుగు పెట్టాను. ఆ అన్వేషణలోనే ఒక సారి మీ మహార్ణవం కూదా యెదురైంది. చాల సంతోషించాను. ఇక ఇప్పుదు ఈ కైవల్యం శీర్షిక నుంచి ప్రతి పదం ఎంతో అద్భుతం గా ఉంది. కవిత లో అభివ్యక్తి చాలా బావుంది. శ్రీ ఫణీంద్ర గారు గుర్తు చేసిన ” సింఫొజియం ” కూడా చాలా రిలేటివ్ గా వుంది.

    అభినందనలు.

  21. Saradaunty says:

    .Dear Radhi,

    Devudu vesina sikshalathone edustu brathikesthunte, gundeloni vedananu kagitham meeda unchi, nee kavitha ane bhuthaddam chethikichavu, chuddamante kanti ninda kanneellu.
    Na chethullo ethukunna na chinni Radhi yena, ee radhi?
    Next time telugu lo type cheyyatam nerchukuni rasthanu, ee sariki ibbandi padu. Sri Phanindra garu rasina symphosiam kuda chala bavundi.

    Bhasha edaina bhavam loni vedana okkate ani malli malli gurthu chesindi.
    Kavityha gurinchi cheppataniki matalu levu, kanneelle sakshyam.

  22. sailajamithra says:

    Raadhika gaaritho modata ee poem thone parichayam.. kavithwam raayadamlo raadhika epudu ditte..kaani ee poem naaku chaala aatmeeyangaa undi.. epudu okasaari ee kavithanu malli vinipinchamani adagaalanukuntaanu. kaani poddu naaku adrustaanni kaliginchindi.. thanq raadhika.. and many many thanks to poddu.net

Comments are closed.