స్వేచ్ఛా మృదుసామగ్రి — పరిచయం

-వీవెన్

మీరు కొన్న వస్తువును ఎందుకోసమైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ మీకు ఉన్నట్టే, మీ కంప్యూటర్ ఉపకరణాలని కూడా ఏ ఉద్దేశంతోనైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ మీకు ఉండాలి. వాణిజ్యపరంగా లభించే చాలా ఉపకరణాలలో అవి ఏయే ఉద్దేశాలకు ఉపయోగించవచ్చో కొన్ని సార్లు నియంత్రణలు పెడతారు.

మీరు స్వేచ్ఛా మరియు ఓపెన్ సోర్స్ మృదుసామగ్రి (free and open source software) గురించి వినేవుంటారు. వీటిని వాడమని ప్రబోధించే వారినీ చూసే ఉంటారు. ఈ మధ్య కాలంలో ప్రతీ అవసరానికీ ఓపెన్ సోర్స్ ఉపకరణాలు లభ్యమవుతున్నాయి. (ప్రఖ్యాత జాల విహారిణి తెలుగులో మనం అభిమానంగా మంటనక్కగా పిలుచుకునే ఫైర్‌ఫాక్స్ కూడా స్వేచ్ఛా మరియు ఓపెన్ సోర్స్ ఉపకరణమే.) వీటిని ఉపయోగించేవారూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వీటి వెనుకనున్న స్వేచ్ఛ అన్నదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

స్వేచ్ఛ మరియు ఓపెన్ సోర్స్ అనేవి రెండు భావనలు. రెంటి యొక్క అంతిమ ప్రభావం ఒకటే అయినా వీటి (దృక్పథాల) మధ్య భేదాలున్నాయి. ఓపెన్ సోర్సు అనే భావన ప్రకారం చూస్తే ఓ మృదు ఉపకరణం యొక్క అభివృద్ధికి అవలంబించే విధానంపై దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. స్వేచ్ఛ అనే భావనలో ఉపకరణవాడుకరులకి లభించే స్వేచ్ఛకి మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది.

స్వేచ్ఛా దృక్పథం నుండి చూసినప్పుడు, స్వేచ్ఛా మృదుసామగ్రి (free software) అని పిలుస్తారు. ఫ్రీ అంటే ఉచితం అన్న అర్థంలో కాకుండా స్వేచ్ఛ అన్న అర్థంలో అన్న మాట. అంటే వాడుకరి యొక్క స్వేచ్ఛకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. స్వేచ్ఛ అనేది మనం అనుభవించే స్థితి. దీన్ని వివరించడం గహనంగా ఉంటుంది కాబట్టి, కొన్ని ఉదాహరణలతో, మృదు ఉపకరణాలకు స్వేచ్ఛ అనే భావన ఎలా వర్తిస్తుంది అన్న దాన్ని పరిశీలిద్దాం.

ఓ స్వేచ్ఛా మృదు ఉపకరణాన్ని మీరు ఉపయోగిస్తుంటే, దానికి సంబంధించి మీకు ఈ క్రింది స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నట్టే:

  1. ఆ ఉపకరణాన్ని ఏ ఉద్దేశానికైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ
  2. ఆ ఉపకరణం ఎలా పనిచేస్తుందో తెలుసుకుని, అధ్యయనం చేసి, నేర్చుకొనగలిగే స్వేచ్ఛ (అందుకు ఆ ఉపకరణపు మూలసంకేతం (source code) కూడా మీకు అందుబాటులో ఉంటుంది.)
  3. ఆ ఉపకరణాన్ని పంపిణీ చేసే స్వేచ్ఛ (అంటే మీ స్నేహితులతో పంచుకోవచ్చు)
  4. మీ అవసరాలకు తగిన విధంగా ఆ ఉపకరణానికి మార్పుచేర్పులు చేసుకునే మరియు మీ మార్పుచేర్పులని ఇతరులతో పంచుకునే స్వేచ్ఛ

ఈ స్వాతంత్ర్యాలు చాలా మామూలువే అనిపించవచ్చు. వీటి గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తే, మరియు స్వేచ్ఛారహిత ఉపకరణాలు మనకు మిగిల్చే స్వాతంత్ర్యాన్ని అర్థం చేసుకుంటే, ఈ స్వేచ్ఛల ఆవశ్యకత తెలుస్తుంది.

ఏ ఉద్దేశానికైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ
మీరు కొన్న వస్తువును ఎందుకోసమైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ మీకు ఉన్నట్టే, మీ కంప్యూటర్ ఉపకరణాలని కూడా ఏ ఉద్దేశంతోనైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ మీకు ఉండాలి. వాణిజ్యపరంగా లభించే చాలా ఉపకరణాలలో అవి ఏయే ఉద్దేశాలకు ఉపయోగించవచ్చో కొన్ని సార్లు నియంత్రణలు పెడతారు. మరికొన్నింటిలో మనం ఏయే ఉద్దేశాలకి (కార్యాలయంలోనా, ఇంట్లోనా, గట్రా) ఉపయోగిస్తున్నామో తయారీదారుకి చెప్పవలసివుంటుంది. ఉచితంగా లభించే స్వేచ్ఛారహిత మృదుపరికరాలని (వీటిని freeware అంటారు) వాణిజ్యావసరాలకు ఉపయోగించుకోడానికి సాధారణంగా వాటి లైసెన్సు అనుమతించదు.

స్వేచ్ఛా ఉపకరణాలనేవి ఇటువంటి నిబంధనలు లేకుండానే, మీరు వాటిని ఏ ఉద్దేశానికైనా ఉపయోగించుకునే వీలు కల్పిస్తాయి.

పరిశీలన మరియు అధ్యయన స్వేచ్ఛ
ఓ ఉపకరణం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం అనేది కొన్ని సందర్భాలలో అవసరమౌతుంది. మనకి కంప్యూటర్లంటే ఉండే ఆసక్తి వల్ల మృదూపకరణాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనుకోవచ్చు. కంప్యూటర్ రంగంలోని విద్యార్థులు బయటి ప్రపంచంలో వాడుకలో ఉన్న మృదుపరికరాలని అధ్యయనం చేయడం ద్వారా చాలా మెళకువలు (అకడమిక్‌గా నేర్చుకోలేనివి) నేర్చుకోవచ్చు. ఓ మృదు ఉపకరణాన్ని ఈ స్థాయిలో అధ్యయనం చేయాలంటే, దాని మూలసంకేతం అందుబాటులో ఉంటేనే సాధ్యం.

భద్రతాపరంగా ఓ ఉపకరణం సురక్షితమో కాదో తెలుసుకోవడానికి దాన్ని అధ్యయనం చేయాల్సిరావచ్చు. మీరు స్థాపించుకున్న ఉపకరణం మీ కంప్యూటరు నుండి మీ (లేదా మీ సంస్థ యొక్క) కలాపాలని దాని తయారీదారుకి చేరవేస్తుండవచ్చు (spyware), లేదా ఆ ఉపకరణం మీ కంప్యూటర్లో వినాశకర వైరస్సులని నడిపిస్తూండవచ్చు. లేదా ఆ ఉపకరణంలో అంతుచిక్కని లోపాలుండవచ్చు, అవి భవిష్యత్తులో మీ కంప్యూటర్ని దుష్ట హ్యాకర్ బారిన పడేయవచ్చు. ఓ ఉపకరణం భద్రతాపరంగా పూర్తి సంరక్షితం అని తేల్చకోడానికి దాని మూలసంకేతాన్ని చూడకుండా ధృవీకరించడం మేడిపండు చందంగా ఉంటుంది.

ఇప్పుడున్న పద్ధతులని సంపూర్ణంగా అధ్యయనం చేయడం ద్వారానే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా వినూత్న ఆలోచనలతో పరిష్కారాలను కనుగొనే వీలుంటుంది. చక్రం నుండి కారు వరకూ టైపుమిషన్ నుండి సూపర్ కంప్యూటర్ వరకూ ఆవిష్కరణలు పరిశీలన, పరిశోధన, మరియు అధ్యయనాల ద్వారానే సాధ్యమయ్యాయి. వైజ్ఞానిక పురోభివృద్ధికి ఈ స్వేచ్ఛ అత్యంత ఆవశ్యకం.

చాలా వరకు వాణిజ్య మృదుపరికరాలలో ఈ అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నా, అది ఎన్నో నిబంధనలతో కూడి ఉంటుంది.

పంచుకునే స్వేచ్ఛ

మనం ఉపయోగించే మృదు ఉపకరణాలు, నైతికంగా మరియు చట్టబద్ధంగా మనకి వాడుకరులుగా ఏయే హక్కులని అందిస్తున్నాయో, మనకున్న ఏయే స్వేచ్ఛలని మనకి మిగులుస్తున్నాయో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాటి పొరుగు వాడికి సహాయపడడం మన హక్కు మరియు నైతిక ధర్మం.

తోటివారికి సహాయపడటమనేది మానవుల సహజమైన లక్షణం. స్నేహితులతో, ఇరుగుపొరుగువారితో ఇచ్చిపుచ్చుకోవడాలు అనేది సర్వసాధారణం. పక్కింటాయన దగ్గరనుంచి ఓ పుస్తకాన్ని చదువుకోడానికి తీసుకున్నట్టే, లేదా మీ కారుని మీ స్నేహితుని అవసరానికి అరువిచ్చినట్టే, స్వేచ్ఛా మృదుపరికరాలని మన తోటివారితో పంచుకోవచ్చు.

చాలా వాణిజ్య మృదుపరికరాల లైసెన్సుల ప్రకారం ఇలా పంచుకోవడం నేరం. కొన్ని సందర్భాలలో మీరు ఆ మృదుపరికరాన్ని కేవలం ఒక్క కంప్యూటరులో మాత్రమే ఉపయోగించాలన్న నిబంధన ఉంటుంది. మరికొన్ని మృదుపరికరాలను, దాన్ని వాడే కంప్యూటరు స్వరూపణం (configuration) మారినా కూడా ఉపయోగించకూడదని నియంత్రణలు ఉంటాయి. ఒకవేళ సాంకేతికంగా మీరు చేయగలిగినా, చట్టబద్ధంగా నేరస్తులవుతారు.

మెరుగుపరుచుకునే స్వేచ్ఛ
ఎవరి అవసరాలు వారికుంటాయి. అవసరాలకు తగ్గట్టుగా ఉపకరణాలను మార్చుకునే స్వేచ్ఛ ఉండాలి. మామూలుగా కంప్యూటర్ ఉపకరణాలు కొద్దిపాటి స్థాయి ప్రత్యేకీకరణ (తయారీదారు ఎంత పరిమితిస్తే అంతే) సౌలభ్యంతో వస్తాయి. మీకున్న అన్ని అవసరాలకీ ఈ స్థాయి సరిపోకపోవచ్చు. మారుతున్న పరిస్థితుల వల్ల మీకు కొత్త అవసరాలు పుట్టుకురావచ్చు. మారిన పరిస్థితులను, కొత్త అవసరాలను సంభాళించడానికి ఉపకరణాలని మెరుగుపరచాల్సి ఉంటుంది. అందుకోసం తయారీదారు కొత్త సంచికను విడుదల చేసేవరకు వేచివుండాల్సివస్తుంది. ఒకవేళ ఆ అవసరాలు చాలా కొద్దిమందికి మాత్రమే పరిమితమైతే, తయారీదారు అసలు పట్టించుకోకపోవచ్చు. లేక ఈ మార్పులు తయారీదారు ప్రాధాన్యతలలో అట్టడుగున ఉండవచ్చు. మరికొన్ని సందర్భాలలో అసలా ఉపకరణ తయారీనే నిలిపివేసి వుండవచ్చు.

ఈ ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఉపకరణాల మూలసంకేతం అందుబాటులో ఉంటే.., చేయగలిగితే మనమే చేసుకోవచ్చు, లేదంటే నిపుణులను పెట్టుకుని చేయించుకోవచ్చు. (మోటారు సైకిల్ కంపెనీ సేవాకేంద్రం మన ప్రాంతంలో లేకపోతే, లేదా అది రద్దీగా ఉన్నప్పుడో స్థానిక మెకానిక్కు దగ్గరివెళ్తాం కదా. తయారీలోలేని పాత మోటారు సైకిళ్ళని స్థానిక మెకానిక్కుల సాయంతో నడిపిస్తూ ఉంటాం కదా.) స్వేచ్ఛా మృదూపకరణాలు మీకు ఈ వీలుని కల్పించడంతో బాటు, మీ మార్పుచేర్పులను కూడా ఇతరులతో పంచుకునే హక్కుతో వస్తాయి.

ఉపసంహారం

మనం ఉపయోగించే మృదు ఉపకరణాలు, నైతికంగా మరియు చట్టబద్ధంగా మనకి వాడుకరులుగా ఏయే హక్కులని అందిస్తున్నాయో, మనకున్న ఏయే స్వేచ్ఛలని మనకి మిగులుస్తున్నాయో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పొరుగువాడికి సహాయపడడం మన హక్కు మరియు నైతిక ధర్మం. అలా అని లైసెన్సుని ఉల్లంఘించి వాణిజ్య ఉపకరణాలని పంచుకుంటే, చట్టపరంగా నేరస్తులవుతాం. వాడుకరులుగా మన స్వేచ్ఛకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే, స్వేచ్ఛా మృదు పరికరాలనే వాడడం అలవాటు చేసుకోవాలి.

ప్రభుత్వాలు స్వేచ్ఛా మృదూపకరణాలని వాడడం ద్వారా ఏదో ఒకటే వాణిజ్య సంస్థపై ఆధారపడకుండా ఉండవచ్చు. స్వేచ్ఛా ఉపకరణాలు ఉచితంగానే లభిస్తాయి కాబట్టి ప్రజాధనాన్ని పొదుపుగా వాడడానికి ఇది ఓ మార్గం. ఇటీవల చాలా దేశాల ప్రభుత్వాలు స్వేచ్ఛా ఉపకరణాలకి మారుతున్నాయి (సంబంధిత వార్తలు). కానీ మన రాష్ట్రంలో మాత్రం స్వేచ్ఛారహిత వాణిజ్య ఉపకరణాలు వాడడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.

స్వేచ్ఛా మృదుసామగ్రిపై పూర్తి వివరాలకు ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారి వెబ్ సైటులో చూడండి. ముఖ్య స్వేచ్ఛారహిత ఉపకరణాలకు తగ్గ స్వేచ్ఛా ప్రత్యామ్నాయాలకై, osalt.com లో చూడండి.

————-

-వీవెన్ పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

This entry was posted in వ్యాసం and tagged , . Bookmark the permalink.

5 Responses to స్వేచ్ఛా మృదుసామగ్రి — పరిచయం

  1. మంచి వివరాలు అందించారు. ప్రభుత్వాలు ఎందుకు స్వేచ్ఛా మృదుసామగ్రి వాడట్లేదో? అన్నట్లు – మీ రెయిన్ బో ఎఫ్ఫెమ్ ఇంటర్వ్యూ విశేషాలు పంచుకోగలరు.

  2. బాగుంది, పంచుకోవాలంటే ఏం పాటించాలో చెప్తే బాగుంటుందేమో

    ~సూర్యుడు 🙂

  3. సత్యసాయిగారు, వివెన్ రేడియో ఇంటర్వ్యూ సీబీరావుగారి బ్లాగులో ఉంది.
    బైదవే, కొత్త గడి బాగుంది.

  4. Pingback: డిసెంబర్ 2009 « వీవెనుడి టెక్కునిక్కులు

Comments are closed.