-కొవ్వలి శ్రావ్య వరాళి
ఆనగనగా ఒక ఊళ్ళో “కు” అనే ఒక పళ్ళ రసం అమ్మే ఆయన ఉండేవాడు. తనకి ఎటువంటి ధనం లేకపోయినప్పటికీ, తనదగ్గర ఒక విశ్వాసపాత్రమైన కుక్కా, ఒక ప్రియమైన పిల్లీ ఉండేవి. అవి ఎంతో ప్రేమగా, పరస్పరం సఖ్యంగా ఉండేవి. అవంటే యజమానికి కూడా ఎంతో ఇష్టం.
ఒక శీతాకాలపు రాత్రి, ఊరంతా చలికి గడగడ వణుకుతున్నప్పుడు, “కు” దుకాణానికి ఒక ముసలాయన వచ్చి, కాస్తే కాస్త పళ్ళరసం కోసం అడిగాడు. కానీ శీతాకాలం అవ్వడంతో రసం అంతా గడ్డకట్టుకుపోయింది. అయినప్పటికీ కాస్త వెచ్చ చేసి ఆ ముసలాయనకి ఇచ్చాడు, “కు”. ఆ గుక్కెడు రసాన్ని ఎంతో ఆనందంగా తాగి, “కు” చేసిన సహాయానికి బహుమతిగా ఒక ఇత్తడి నాణాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ చిన్న బహుమతికే చాలా ఆనంద పడి, దానిని తన పళ్ళ రసం పోసే గిన్నెలో వేసాడు -తనకు అంతకంటే సురక్షితమైన చోటు ఇంకేముంటుంది?
మర్నాడు లేస్తూనే జనం కొట్టు బయట ఎదురుచూస్తూండటంతో “కు” లోపలికి వెళ్ళి పళ్ళరసం పోసే గిన్నె తెచ్చాడు. ఆశ్చర్యంగా తెరవగానే ఆ గిన్నె నిండుగా ఉంది. ఖాళీ గిన్నె కాస్తా ఎలా నిండిందో మొదట్లో “కు” కి ఏమీ అర్ధం కాలేదు. ఆరోజు రాత్రి పడుకుని ఆలోచిస్తున్నప్పుడు, “కు” కు ఓ ఆలోచన తట్టింది. ఆ ముసలాయన ఇచ్చిన నాణెం వల్ల ఏమైనా జరిగిందా అని ఆలోచించి, మర్నాడు దాన్ని పరీక్షించాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. ఆ నాణెం వేయటం వల్ల పానీయం ఊరుతూ వచ్చింది. దాంతో ఆ నాణేన్ని తనదగ్గర జాగ్రత్తగా ఉంచుకుని, ప్రతి రాత్రి దాన్ని గిన్నెలో వేసేవాడు. పొద్దున్నే పానీయం గిన్నె నిండా ఉండేది. ఇలా చేయటం అలవాటైన “కు” కు ఒకసారి అదృష్టం బాగాలేక, అక్కడకొచ్చిన వారికి, రసంతో పాటు, ఆ నాణాన్ని కూడా ఇచ్చేసాడు. ఎప్పట్లాగే ఆ రాత్రి నాణాన్ని వేద్దామనుకునేసరికి, కనిపించలేదు. ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. దానితో “కు” బాధతో ఓ మూల కూర్చున్నాడు.
ఆ కుక్కా, పిల్లీ కూడా బాధతో బయట కూర్చుని ఆలోచించి, ఆ నాణేన్ని వెతకటానికి బయలుదేరాయి. అవి రెండూ ఒక గమ్యం లేకుండా అలా అలా వెళ్తూ ఉన్నాయి.
ఒక రోజు, అవి ఓ నది ఒడ్డున ప్రయాణం చేస్తూండగా కుక్కకు హటాత్తుగా ఆ నాణెం వాసన వచ్చింది. ఆ విషయం పిల్లికి చెప్పి, దానితో కలిసి నాణేన్ని వెతకసాగఇంది. కుక్క అటూ ఇటూ తిరుగుతూ నది వైపు వెళ్ళగానే వాసన బట్టి చూసి పిల్లితో “నాణెం నదిలోనే ఎక్కడో ఉంది.” అని చెప్పింది. అది వినగానే పిల్లి అక్కడకు వచ్చి, నదిలోకి వెళ్ళే మార్గం కోసం ఆలోచించ సాగింది. అదృష్టం కలిసి రావటం వల్ల, నది మీద మంచు పేరుకుని ఉంది. దాని మీద ఇద్దరు నడుచుకుంటూ, మధ్యలో ఉన్న పడవ దగ్గరకు చేరుకున్నారు.
పడవ లోకి దిగక ముందే, పిల్లి తన నిశిత దృష్టితో ఆ నాణెం కోసం వెతకడం మొదలెట్టింది. కుక్క నాణెం వాసన పసికట్టడానికి ప్రయత్నం చేస్తో ఉంది. చివరికి ఆ నాణం ఓ చెక్క పెట్టిలో ఉన్నట్లు కుక్క గ్రహించింది. కాని ఆ పెట్టికి తాళం వేసుంది.
ఉపాయం కోసం ఆలోచిస్తూంటే, కొన్ని ఎలుకలు అటువైపు నుండీ వెళ్తూ కనిపించాయి. సహాయం అవసరం గనక, వాటి కాళ్ళు పట్టుకుని సహాయం కోసం అడిగాయి. కానీ ఆ ఎలుకలు దానికి ఒప్పుకోలేదు. “మీరు మా శతృవులు. మేము మీ నుండి తప్పించుకోవటానికి ఎన్నో కష్టాలు పడ్డాం. మా చుట్టాలు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు.. ఒక్కొక్క సారి వారికి మీ నుండి తప్పించుకోవటం ఎంత కష్టం అవుతుందో. మమ్మల్ని ఇంత ఏడిపించే మీకు మేము సహాయం చెయ్యము గాక చెయ్యమ”ని తెగేసి చెప్పాయి. దీనికి ఎంతో బాధతో పిల్లి మరియు కుక్క ఏక కంఠంతో, ” మీరు గనక మాకు సహాయం చేస్తే మేము మళ్ళీ ఎప్పుడూ మీ వెంట పడి ఇబ్బంది పెట్టం” అని మాట ఇచ్చాయి. ఆ మాట విని ఎలుకలు సహాయం చెయ్యటానికి ఒప్పుకున్నాయి. అవి మెల్లగా ఆ చెక్క పెట్టెక్కి వాటి బలమైన పళ్ళతో దాన్ని కొరికి ఆ నాణాన్ని బయటకు తెచ్చాయి. ఎలుకల సహాయానికి కుక్క ఎంతో కృతజ్ఞతలు తెలియ జేసింది. పిల్లికి కూడా ఆనందమే కానీ, ఇంకెప్పటికీ ఎలుకలని తినలేకపోవడం రుచించలేదు.
అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. తన వెచ్చని కిరణాల వల్ల మంచంతా కరిగిపోయి, నది కనపడింది. వచ్చేటప్పుడు మంచు మీద చక్కగా నడుచుకుంటూ వచ్చేసిన పిల్లీ కుక్కకు వెనక్కెలా వెళ్ళాలో తోచలేదు. అప్పుడు కుక్కకు ఓ ఆలోచన తట్టింది. “నాకు కాస్తో కూస్తో ఈత వచ్చు గనక, నువ్వు నాణాన్ని నోటితో పట్టుకుని నా వీపు మీద ఎక్కు, నేను ఒడ్డు వైపు మెల్లగా ఈదుతా”. దీనికి పిల్లి కూడా ఒప్పుకుని, కుక్క వీపు మీద ఎక్కింది. వెంటనే కుక్క ఒడ్డువైపుకు మెల్లగా ఈదటం మొదలెట్టింది. కానీ దానికి దార్లో పిల్లి మీద అనుమానం వచ్చింది. “నాణాన్ని గట్టిగా పట్టుకున్నావా?” అని గట్టిగా అరిచింది. కుక్క ప్రశ్నకు పిల్లి ఎలా సమాధానం చెబుతుంది? దాని నోటిలో నాణెం ఉందిగా! అందుకనే ఏమీ సమాధానం చెప్పకుండా అలా కూర్చుంది. కానీ సమాధానం కోసం ఎదురుచూస్తున్న కుక్కకు మాత్రం అనుమానం పెరిగింది. ‘ఒకవేళ పిల్లి నాణాన్ని పాడేసిందా? లేకపోతే…’ అలా ఆలోచిస్తూనే, మరొక సారి గట్టిగా అడిగింది, “నాణెం జాగ్రత్త గానే ఉంది కదా?” కాసేపు ఆగి, “సమాధానం చెప్పు?” అని కసురుకుంది. దీనితో పిల్లి పిచ్చి కోపంతో, ” ఎందుకంత అనుమానం నీకు? నేను నాణాని గట్టిగానే పట్టుకున్నాను.” అంది. ఇలా అంటోండగా ఆ నాణం కాస్తా పిల్లి నోటిలో నుండి జారి కింద నీటిలో పడిపోయింది. కానీ అదృష్టం వల్ల అప్పటికే ఒడ్డు చేరుకున్నారు గనక పిల్లి వెంటనే నేల మీదకు దూకి పారిపోయింది. విషయం గ్రహించిన కుక్క బాధతో ఇంటికి తిరిగి వచ్చేసింది. దాన్ని చూసిన వెంటనే, “కు” ఆనందంతో, “తిరిగొచ్చేసావా!!! నువ్వు పారిపోయావేమోనని ఎంతో బాధపడ్డా. నాణెం దొరక్కపోతే పోనీలే. దాని గురించి వదిలేయ”మని రెండు మెత్తని మాటలు మాట్లాడాడు.
ఓరాత్రి పూట కుక్కకు, నది ఒడ్డున ఓ జాలరి కనబడ్డాడు. అప్పుడు దానికి ఓ ఆలోచన వచ్చింది. ఓ రెండు చేపలు తెస్తే తన యజమానికివ్వచ్చుగా అనుకుని ఆ జాలరి పట్టిన వాటిలో ఓ పెద్ద చేప తీసుకుని జోరుగా పరిగెట్టుకుంటూ ఇంటికి తిరిగొచ్చింది. ఆ చేపను “కు” తీసుకుని కొయ్యగానే దాని పొట్టలోనుండి నాణెం బయటపడింది. “ఏమిటీ విచిత్రం. నా నాణెం దొరికింది!!! ఆహాహా” అని ఆనందం తో “కు” ఎగిరి గంతులేసాడు. యజమమానిని అంత ఆనందంలో చూసి కుక్క కూడా ఎగరడం మొదలెట్టింది.
“కు” కుక్కకు కృతజ్ఞతలు తెలిపి ఎప్పటికీ తన దగ్గరే ఉంచుకుంటానని మాటిచ్చాడు.
ఈసారి నుండి జాగ్రత్త గా ఉండాలని తన విలువైన నాణేన్ని తీసుకెళ్ళి తన డబ్బులు పెట్టే డబ్బాలో వేసాడు. తను వేసినప్పుడు డబ్బాలో కొన్నే డబ్బులున్నప్పటికీ, మర్నాడు పొద్దున్న చూసినప్పుడు మాత్రం డబ్బా అంతా డబ్బులతో నిండిపోయింది. రహస్యం తెలుసుకున్న “కు”ఎంతో ధనవంతుడై బాగా పేరు తెచ్చుకున్నాడు. పారిపోయిన పిల్లి సంగతి కొస్తే, ఎలాగో నాణెం పోయిందిగా అని, ఎలుకల ఉపకారం మరచిపోయి, వాటి వెంటపడటం మొదలెట్టింది. కుక్క సంగతికొస్తే, పిల్లి చేసిన తప్పుకి దాన్ని వెంటాడటం మొదలెట్టింది. ఇప్పటికీ దాని కుక్క బుద్ధి పోనిచ్చుకుంది కాదు.
——————————————–
9 వ తరగతి చదువుతున్న శ్రావ్య వరాళి పిన్నవయసులోనే బ్లాగు రాయడం మొదలుపెట్టారు. అభిరుచులు కర్ణాటక సంగీత గాత్రం, కథలు చదవడం, రాయడం. మాగంటి.ఆర్గ్ వారు ప్రతిభ శీర్షికన నిర్వహించిన వ్యాసరచనపోటీకి ఆమె పంపిన వ్యాసం ప్రచురితమైంది. శ్రావ్య తండ్రి ప్రసిద్ధ బ్లాగరి కొవ్వలి సత్యసాయి.
Excellent story!
భలే బావుంది 🙂
చి. శ్రావ్యవరాళికి అభినందనలు, ఆశీస్సులు.
చాలా చక్కటి తెలుగులో రాశావు. యజమాని “కు” దృష్టితో చూస్తే కుక్కే మంచిది, పిల్లే చెడ్డది అనిపించ వచ్చు కానీ ఆ రెందు జంతువుల మధ్య జరిగిన వ్యవహారం దృష్ట్యా చూస్తే పిల్లి నోట్లోంచి నాణెం జారి పడడానికి కుక్క అనుమానపు బుద్ధే కారణం. కథ చివర్లో “దాని కుక్క బుద్ధి పోనిచ్చుకుంది కాదు” అని ముగించి ఈ సమతుల్యతని బాగా చూపించావు.
మరి నీ గాత్రం వినే భాగ్యం మాకెప్పుడు?
This is nice story…!!keep it up!!
sarali chinnavayasulone chakkaga rayakaligavu.neeku nasubhaseessulu
Very nice story! Commendable job. ఎవరో చెయ్యి తిరిగిన రచయిత అనుకున్నాను కానీ, చివరలో చూసేసరికి, తొమ్మిదో తరగతి అమ్మాయి ఇంత చక్కగా రాయడం వాహ్, వాహ్, మీ నాన్నగారికి కూడా అభినందనలు…
[ఈ వ్యాఖ్యలోని వాక్యాలు RTS నుంచి తెలుగులోనికి మార్చబడ్డాయి. -సం.]
it is really very good.it is very interesting.i am really appreciate you.
chala bagundi
it’s realy nice stiry