-సిముర్గ్, వీవెన్, చదువరి
వెల్లువెత్తిన వ్యాఖ్యలు
ఈ నెల బ్లాగుల్లో వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. మామూలుగా జాబుకు పది పదిహేను వ్యాఖ్యలు ఉంటే బాగా ఉన్నట్టే! అలాంటిది, ముప్పై నలభై యాభై వ్యాఖ్యలు కూడా అందుకున్నాయి.
మీనాక్షి రాసిన నేను ఎందుకు ప్రేమించలేదంటే…..??? కు 51 వ్యాఖ్యలు వచ్చాయి. ఆమే రాసిన పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా..!!!.( సినిమా..) కు 40 కి పైగా వ్యాఖ్యలు వచ్చాయి.
సుజాత రాసిన నా జర్నలిస్టు ఉద్యోగం పరంపరకు మంచి స్పందన వచ్చింది. మొదటి భాగానికి 49 వ్యాఖ్యలు వచ్చాయి.
కత్తి మహేశ్ కుమార్ రాసిన కట్నానికి మరో వైపుకు 54 వ్యాఖ్యలు వచ్చాయి.
బ్లాగు వివాదాలు
జూలైలో బ్లాగుల్లో రేగిన వివాదాలు కొందరు బ్లాగరులకు కలత కలిగించాయి. కులం, మతం, బ్లాగు మర్యాద మొదలైనవాటిపై వివాదాస్పద జాబులు, వ్యాఖ్యలు కలకలం కలిగించాయి. ముందుగా.. కుల ఘర్షణల సమస్యపై తెగేదాకా లాగడం వరసలో తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం రాసిన నాలుగో జాబులో గట్టి చర్చే జరిగింది. ఈ విషయంపైనే కత్తి మహేష్ కుమార్ ఒక మెతుకు పట్టుకునిచూస్తే చాలా !?! అనే జాబు రాసారు.
కలగూరగంపలో జరిగిన ఆ చర్చల హోరు మతం గురించి రాస్తున్న మరో బ్లాగులో ప్రతిధ్వనించాయి. ఈ బ్లాగులో వివిధ మతాల ఆచారాలను పోలుస్తూ రాసిన జాబులు మరో కొత్త బ్లాగు సృష్టికి అంకురార్పణ చేసి ఆ రెండు బ్లాగుల మధ్య ఒక చిన్న బ్లాగు యుద్ధానికి దారి తీసాయి. ఆ తరువాత ఆ రెండు బ్లాగులనూ మూసివేయడంతో ఆ వివాదం సమసిపోయింది.
బ్లాగు మర్యాదలపై చెలరేగిన వివాదం తీవ్రమైన చర్చకు దారితీసింది. కూడలి కబుర్ల గదిలో కొత్తా పాతా బ్లాగరులు సమావేశమై చర్చ కూడా జరిపారు. బ్లాగరులు తమ జాబులను పదే పదే తాజాకరించడంతో కూడలిలో ఎల్లప్పుడూ పైనే ఉంటూ వచ్చిన వైనంపై తెలుగుబ్లాగు గూగుల్ గుంపులో జరిగిన చర్చతో వివాదం మొదలైంది. బ్లాగింగులో రాగింగు అంటూ సరస్వతీకుమార్ ఒక జాబు రాసారు. ఆదివారం నాడు కూడలి కబుర్లలో చర్చ కూడా జరిగింది. ఈలోగా.. టపాలు ఎన్ని రాయాలో, ఎలా రాయాలో కూడా మీరే చెప్పేస్తారాండీ అంటూ తెలుగువాడిని ఓ జాబు రాసారు. ఆ తరువాత రెండు రోజులకే వీవెన్ కూడలిలో తగుమార్పులు చెయ్యడంతో సమస్య పరిష్కారమైంది. దీనికి తోడు బ్లాగర్ల హక్కులేమిటి అంటూ కల్పనా రెంటాల రాసిన జాబులో కూడా చర్చ జరిగింది.
చర్చలు
- మగాళ్ళు ‘ఈవ్ టీజింగ్’ ఎందుకు చేస్తారు? అంటూ మహేశ్ మొదలు పెట్టిన చర్చని ఇంతులూ, ఇలా ఎదుర్కోండి అంటూ జ్యోతి పొడగించారు. ఇందుకు వివిధ పరిష్కారాలు, సూచనలతో మరో భాగంలో చర్చ జరుగుతూంది.
- దెబ్బతిన్న మనోభావాలు: ఈ మధ్య మనోభావాలు దెబ్బతిన్న కొందరు నాయకులు సమాజంలో సృష్టిస్తున్న హంగామాపై బ్లాగరులు స్పందించారు. మహేష్ ఒక చక్కని బొమ్మతో నా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ జాబు రాసారు. బ్రహ్మి రాసిన జాబు వ్యంగ్య ధోరణిలో సాగింది. జూలైలో మొదలైన ఈ బ్లాగులో ఇదే మొదటి జాబు. జంబలకిడిపంబలో మరో వ్యంగ్య విమర్శ వచ్చింది. ఇందులో ఇతర వార్తలతో పాటు మనోభావాలు దెబ్బతిన్న వార్త కూడా రాసారు. వీరికి భిన్నంగా స్పందిస్తూ నాగరాజా మంద కృష్ణ మాదిగ ది గ్రేట్ అనే జాబు రాసారు.
రాజకీయాలు / సామాజికం
- మేడిపండు ప్రజాస్వామ్యం అంటూ ఇటీవలి దేశ రాజకీయాల్లోని పరిణామాలని వివరిస్తున్నారు అంతర్యానం సాయి కిరణ్ కుమార్
- మన శాస్ర్తజ్ఞులలోనూ ఇలాంటి నమ్మకాలున్నాయా? అంటూ భోగట్టాతో సహా నరిశెట్టి ఇన్నయ్య ప్రశ్నిస్తున్నారు.
- హైదరాబాద్ పేరుని భాగ్యనగరం గా మార్చాలి అంటూ సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తున్నారు శివ.
- బెంగళూరు, అహ్మదాబాదుల్లో జరిగిన బాంబుపేలుళ్ళపై ఎక్కువమంది బ్లాగరులు స్పందించలేదు. బెంగళూరు బాంబుపేలుళ్ళు జరిగీ జరగ్గానే త్రివిక్రమ్ అవీ ఇవీలో జాబు రాసారు. భైరవభట్ల కామేశ్వరరావు రెండు కన్నీటి చుక్కలు రాల్చారు. ఈ పేలుళ్ళ నేపథ్యంలో మైనారిటీలది తప్పేకాదంటూ తేటగీతిలో వచ్చిన జాబుపై కొంత చర్చ జరిగింది. ఆ జాబును తీవ్రంగా విమర్శిస్తూ వ్యాఖ్యానించిన భావకుడన్ ఆ జాబు ధోరణిని ఖండించండంటూ తన బ్లాగులో పిలుపునిచ్చారు.
- పిల్లలతో అర్థనగ్న డ్యాన్సులా.. అంటూ నోరు నొక్కుకుంటున్నారు, ఎస్పీ జగదీష్.
- తెలుగుదేశం పిల్లిమొగ్గలు – కొత్తపల్లి జయశంకర్ అంటూ శ్రీకాంత్ ఒక జాబు రాసారు. రెండేళ్ళ్ అతరవాత ఈ బ్లాగులో కొత్త జాబు వచ్చింది.
- అణు ఒప్పందం ఒక ధృతరాష్ట్ర కౌగిలి అంటూ గుండెచప్పుడులో కొణతం దిలీప్ చెబుతున్నారు.
జ్ఞాపకాలు / ‘స్వ’గతాలు
- బ్లాగువనంలోఎస్కలేటరోఫోబియా
- సోడా గోళీతో బ్లాగాడిస్తా.
- తనకు హిందీ నేర్పిన వీరయ్య మాస్టారుని, వారింట్లోని సున్నుండల రుచినీ స్మరించుకుంటున్నారు వేణూ శ్రీకాంత్
- తన జర్నలిస్టు ఉద్యోగంలోని జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు మనసులో మాట సుజాత.
- సమాజసేవకై గ్రామాలకు వెళ్ళినపుడు తనకు ఎదురైన అనుభవాన్ని కృపాల్ కాశ్యప్ చెబుతున్నారు.
- నేనూ నా రచనలూ జాబులో నిడదవోలు మాలతి తన సాహితీ నేపథ్యం గురించి తెలియజేస్తున్నారు.
హాస్యం / వ్యంగ్యం
- మాటలు – సామెతలు – నిజాలు
- తలవంచని వీరుడు
- ఓ లేత సాఫ్టువేరు కుర్రోడి కష్టసుఖాలని జంబలకిడిపంబలో ఏకరువు పెడుతున్నారు
- క్రాంతి గాయం చెప్పే ఉప్మా పురాణం ఆలకించండి.
- హ హా హాసిని అంటూ విలపిస్తున్న మురళీ గానం వినండి
- సిద్ధ-బుద్ధల సంవాదానికి బ్లాగు లోకంలో అభిమానులు మెండు. వారం వారం రావలసిన ఈ విశేషానికి ఈ మధ్య కాస్త ఎడం వచ్చింది. ఆ విరహాన్ని భరించలేకేమో ఊకదంపుడు డూపు సిద్ధ డూపు బుద్ధల జాబు రాసారు. ఆ తరువాత విహారి బ్లాగులో అసలు సిద్ధ, బుద్ధలు తిరిగొచ్చారు. వారం వారం ఈ జాబు రాకపోతే మరింతమంది డూపులను రంగంలోకి దింపేందుకు ఇతర బ్లాగరులు సిద్ధపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
- బ్లాగరులే సినిమా తీస్తే.. రాకేశ్వరరావు ఈ ప్రయోగం చేసారు. ఈ విషయంపై వచ్చిన ౫ జాబుల్లో కొన్ని చక్కని వ్యాఖ్యలు కూడా చోటు చేసుకున్నాయి.
ఇతరత్రా
- నటనా రంగా వైభవ మూర్తి ఎస్వీ రంగారావు, సాంప్రదాయ సంగీత రహదారి కూడలి – మంగళంపల్లి అంటూ విశిష్ఠ తెలుగు వ్యక్తులని తెలుగురధంలో ఊరేగిస్తున్నారు కొంపెల్ల శర్మ. తెలుగు వారిలో ప్రతిభావంతుల గురించి తెలుసుకోవాలంటే, వీరి బ్లాగులో మన ప్రతిభావంతులు అన్న వర్గంలో చూడండి.
- XP లోనే Vista ఫీచర్స్ పొందడమెలాగో శ్రీనివాస బాబు వివరిస్తున్నారు.
- మానవత్వం మరచిపోయిన వైనాన్ని కవితలో పొదిగారు బొల్లోజు బాబా
- కొత్తపాళీ డీసీ ప్రయాణ విశెషాల గురించి చెబుతున్నారు.
- రానారె చెబుతున్న ఈ ప్రకృతి పరిశీలన చదివి, చూడండి.
- ఆడవాళ్ళమండి మేము అంటూ కొందరు స్త్రీల మనస్తత్వంపై రమణి రాసిన జాబులో చక్కటి చర్చ జరిగింది.
- శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వీలునామాతో నాలుగు నెలల తరువాత మళ్ళీ ఫణీంద్ర కలం పట్టారు.
బ్లాగుల గురించి
- బ్లాగంటే, ఇదిగో.. ఇలా ఉండాలి !
- మైక్రోబ్లాగింగు గురించి ప్రవీణ్ గార్లపాటి ఓ జాబు రాసారు.
- నాలెడ్జి వ్యాసాల గురించి కూడా విన్నారా? వీటిని నాల్ (Knol) అని అంటున్నారు.
కొత్త బ్లాగులు
- ఆడవాళ్ళ మనలో మాట
- అనేక జోకులను ఒక కథలో పేర్చి, హాస్యదర్బారుగా అందిస్తున్నారు అరిపిరాల సత్యప్రసాద్
- తెలుగువీర లేవరా అంటూ గళమెత్తారు, బ్లాగులకు పాతకాపే ఐన భైరవభట్ల కామేశ్వరరావు.
- తెలుగువ్యూస్ అనే ఈ బ్లాగును మధు రాస్తున్నారు. మొదటి నెలలోనే 37 జాబులు రాసారు.
ఈ నెల జాబులు:
- చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం బ్లాగరుల అభిమాన విషయం. చదువరుల గుండెలను తాకి, వారిని తన భావోద్వేగంలో లీనం చేసేసుకోగలగడం కొన్ని జాబుల ప్రత్యేకత. అలాంటి జాబు – శిలాక్షరాలైన క్షణాలు- 2. ఇది మా ఈనెల జాబుల్లో ఒకటి. ఇది రెండు జాబుల వరసలో రెండోది. మొదటి జాబు చదివి ఈ జాబుల నేపథ్యాన్ని తెలిసికొన్న తరవాత ఈ రెండో జాబు చదవండి.
- అణుఒప్పందం గురించి సవివరంగా విశ్లేషించిన జాబు ఇది. ఒక పరిశోధనాపత్రం లాగా, తగు మూలాలను, అకరాలను ఉదహరిస్తూ పప్పు నాగరాజు రాసిన ఈ జాబు మా ఈనెల జాబుల్లో ఒకటి.
హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారి బ్లాగు చూస్తున్నారా? తాము ప్రచురించిన పుస్తకాల గురించి వారీ బ్లాగు రాస్తున్నారు. మన మంచి పుస్తకాలు అంటూ రాసిన జాబులో, తమ పుస్తకాలను పాఠకులెలా తెప్పించుకోవచ్చో వ్యాఖ్యల్లో రాసారు. ప్రస్తుతం ఆన్లైనులో అమ్మే సౌకర్యం వారింకా ఏర్పాటు చేసుకోలేదు. ఎవరైనా సాంకేతిక సాయం చేస్తే వారు అందుకు సుముఖంగానే ఉన్నట్టున్నారు.
జల్లెడ వారు ఉత్తమ తెలుగు బ్లాగు టపాల పోటీ పెట్టారు చూసారా? మీరు పాల్గొంటున్నారా?
ఆది బ్లాగరిగా మన్ననలందిన చావా కిరణ్, తన బ్లాగును మూసేసి, బ్లాగు సెలవు పుచ్చుకున్నారు. ఒక అధ్యాయం ముగిసింది.
——————–
జూలైలో బ్లాగు మొదలుపెట్టి ఏకంగా 47 జాబులు రాసి పారేసిన ఓ బ్లాగరి గురించి చెబుదామనుకున్నాం. అయితే వారు రాయడం సంగతేమోగానీ, ఇతర బ్లాగుల్లోంచి జాబుల్ని కొట్టెయ్యడంలో మాత్రం సిద్ధహస్తులని తెలిసాక, ఆ బ్లాగుకు ఈ ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాం. వారి కళావైశిష్ట్యానికి మచ్చుతునకగా కింది లింకులను చూడండి. ఇలాంటివి ఆ బ్లాగులో మరిన్ని ఉన్నాయని తెలుస్తోంది. మీకు తెలిసినవి కూడా రాస్తే నికరంగా వారి స్వంత రచనలేవో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
- వారి బ్లాగులోని ముక్క:http://aradhanaa.blogspot.com/2008/07/blog-post_8862.html
- మూలం: http://vinnakanna.blogspot.com/2008/07/blog-post.html
———————-
-సిముర్గ్, వీవెన్, చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యులు
చాలా బాగా క్రోడీకరించారు.ఎక్కువ కామెంట్లు వచ్చిన టపా నాదవ్వడం, అదీ పాత సమస్యను ఉతికి గంజిపెట్టి వెలికితీసిన విషయంపై అవడం ఆ సమస్యకు మన సమాజంలో అలవడిన కొత్తకోణాన్ని తెలియజెబుతోంది.
‘ఈ నెలబ్లాగు’లో కట్- కాపీ- పేస్ట్ బ్లాగరి కనపడ్డం కాస్త బాధగా ఉంది.
నిజమే.. వేసవి వెళ్ళినా.. జూలై బ్లాగుల్లో “వేడి వేడి” గా జరిగాయి వాదనలు-ప్రతివాదనలు.
నా హాసిని టపాకి స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు.
నా టపా కు స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు.
మహేష గారు అన్నట్లు ఈ నెల బ్లాగు కొంచెం నిరాశ పరచింది, ఆ బ్లాగు కి అనవసర ప్రచారాన్ని కలిగిస్తున్నారేమో !!
నాకొక సందేహం ఎప్పటినుంచో వచ్చింది. మన టపాకి వచ్చిన వ్యాఖ్యలు సమాధానాలుగానో, కృతజ్ఞతలు తెల్పడానికో మనం రాసిన వ్యాఖ్యలు కూడా కామెంట్లలో చొటు చేసుకుంటాయి కదా! అవి కూడా వ్యాఖ్యల్లో లెక్కకి రావాలంటారా? ఒక్కోసారి వ్యాఖ్యలు రాసిన అందరికీ ఒకే వ్యాఖ్యలో కృతజ్ఞతలు చెప్పకుండా ఒక్కొక్కరికీ ఒకో వ్యాఖ్య రాశామనుకోండి. మన టపాకి వచ్చిన వ్యాఖ్యలతో సమాన సంఖ్యలో ఉంటాయి కాబట్టి, బోలెడన్ని వ్యాఖ్యలు కనపడతాయి.
మరో పరిస్థితి ఏమిటంటే టపా ఎక్కువ చర్చనీయాంశంగా ఉంటే మనకి వచ్చిన వ్యాఖ్యలకు ఒక్కో వ్యాఖ్యకు ఒక్కొక్క సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. (ఇప్పుడు నేను అదే చేసి వస్తున్నా! అందుకే భుజాలు తడుముకుంటున్నా) అప్పుడైనా కామెంట్ల సంఖ్య ఎక్కువగా కనపడుతుంది! కామెంట్ల సంఖ్యకు ఇంత ఇంపార్టెన్స్ అవసరమా!ఒక్కోసారి కొన్ని మంచి టపాలు అందరి కళ్ళా పడకుండానే వెనక్కి వెళ్లిపోతాయి. ఉదాహరణకి గడ్డిపూలు సుజాతగారు రాసిన తీవ్రవాదం టపాలు.(నాకు నచ్చాయి)
ఇది కేవలం నా సందేహం మాత్రమే! కామెంట్లు ఎక్కువ వస్తే ఎవరికైనా ఆనందమే!
నా టపాకి చోటు దక్కించినందుకు పొద్దు కు అనేక ధన్యవాదాలు!
బ్లాగర్ల టపాలతో “గ్రంధాలయం” సంకలనంచేయాలని
జూలై 22న టపా రాసాను.
గమనించగలరు
http://svapnam.blogspot.com/
సుజాత గారితో నేను ఏకీభవిస్తున్నాను…
అద్యక్షా… మీరు చెప్పినట్టు పదినుంచి పదిహేను వస్తే బాగా వచ్చినట్టేనా… అయితే నా కృతజ్ఞతలతో కలిపి పధ్నాలుగయ్యాయి(మరోసారి కృతజ్ఞతలు చెప్పేస్తే ఆ పాసుమార్కులయినా వచ్చేవి కదే మనసా..) మరి కొత్త బ్లాగర్ని కదూ… ప్రోత్సాహం ఏదీ మరి…
వ్యాఖ్యల సంఖ్య ఇవ్వడంలోని ఉద్దేశం కేవలం గణాంకాలను చూపించడం, అంతే! ఎవరెవరు ఎన్నెన్ని రాసారు వంటి విస్తృతమైన గణాంకాల జోలికి పోలేదని గమనించగలరు.
నా టపాకు స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు.
సుజాత వ్యాఖ్య, పొద్దువారి జవాబు చూసి రాయాలనిపించింది.
వ్యాఖ్యలసంఖ్యకీ, గణాంకాలలో చూపించే సంఖ్యలకీ (హిట్స్) తేడా వుందనిపిస్తోంది నాబ్లాగు లెక్కలు చూస్తే. నాకు చాలాసార్లు ఒక్క వ్యాఖ్య కూడా వుండదు కానీ స్టాట్స్ తృప్తికరంగానే వున్నాయి.
మాలతి
మాలతి గారూ, ఇక్కడ గణాంకాలంటే వ్యాఖ్యల సంఖ్య అనే అర్థంలోనే రాసాం -బ్లాగు పొందే హిట్ల గణాంకాలు కాదు.
పొద్దు పుణ్యమా అని మంచి పోస్టులు మళ్ళా మళ్ళా చదువుతున్నాము. మీ ఆకాశమంత కష్టానికి ఇంతకన్నా నేను ఏమి చెయ్యాలో తెలియట్లేదు.
ఒక బ్లాగు పొందిన హిట్ల గురించి పొద్దువారికి తెలిసే అవకాశం లేదు ఎందుకంటే అవి మన ‘password’ protection లో ఉంటాయి కాబట్టి. ఇక వారు చెప్పిన కామెంట్ల సంఖ్యంటారా,అంతగా అభ్యంతరంగా ఉంటే, బ్లాగరి కామెంట్లను తీసేసి ఎంచితే సరిపోయె.
నిజానికి ప్రతి బ్లాగూ చూసేవారి సంఖ్య ఎక్కువున్నా, కామెంటేవారు తక్కువే ఉంటారు. హిట్ల గణనాంకాలు తీసుకుంటే, గత ఒక నెలలోనే నా బ్లాగు హిట్లు దాదాపు 1200 కానీ కామెంట్ల సంఖ్య ….తక్కువేగా!
blaagulatO “graMdhaalayamu”,O goppa aiDiyaa! sari krotta aMSAniki,toli aDugu.
నా బ్లాగుకి స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు.