రాసినది చదవడం

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ఇప్పటి తెలుగు ఉచ్చరించే పద్ధతిలో ఫోనెటిక్‌గా ఉంటుంది కనక మనకు అంత ఇబ్బందిగా ఉండదు. అయినా మామ, చీమ, దోమ వగైరా పదాలను కోస్తావారిలాగా తక్కిన తెలుగువారు మాఁవ, చీఁవ, దోఁవ అనకపోవడం చూస్తూనే ఉంటాం.

అక్షరాలకు ప్రాణం ఉండదు. అవి శబ్దాలకు కేవలం సూచకాలు మాత్రమే; ఉచ్చారణకు కొంతవరకే తోడ్పడతాయి కాని హావభావాలను పలికించలేవు. అందుకే ప్రతిభావంతులైన నటులు పసలేని నాటక సంభాషణకుకూడా ప్రాణం పోస్తూ ఉంటారు. నిత్యజీవితం మాటకొస్తే “దేవుని ఎదుట ప్రమాణంచేసి అంతా నిజమే చెప్తానూ? అబద్ధం చెప్పనూ?” అంటూ కోర్టులో స్వరం మార్చి సాక్ష్యం చెప్పే పాతకాలపు జోక్‌ ఒకటి వింటూ ఉంటాం. మొత్తం మీద రాయడం, చదవడం మధ్య తేడాలుండవచ్చు. లిఖిత సమాచారం మన మేధస్సుకు సహాయపడే ఊతకర్ర వంటిది. చిన్నప్పటినుంచీ నేర్చుకుంటాం కనక అక్షరాలను చదివి, మనసులోనో, బిగ్గరగానో ఉచ్చరిస్తూ పదాలను అర్థంచేసుకోవడం మనకు అలవా టవుతుంది. ఎందుకంటే ప్రపంచభాషల్లో వేటిలోనైనా అక్షరాల స్వరూపానికి స్వతహాగా అర్థమేమీ ఉండదు. ఎటువంటి వంకరగీతలు ఎటువంటి శబ్దాన్ని సూచిస్తాయో ముందుగా నిబంధించిన సూత్రాలనే అందరూ పాటిస్తారు. ఇదొక షార్ట్‌కట్‌ పద్ధతి. ఇది ఎన్ని రకాలుగానైనా ఉండవచ్చు. వివిధ ప్రాంతాల్లో, వివిధ యుగాల్లో అనేక పద్ధతులు మొదలై, వ్యాప్తిలోకి వచ్చాయి.

ఇంగ్లీష్‌ అక్షరాలలాగే కనిపిస్తున్నా వాటి ఉచ్చారణలో ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, స్పానిష్‌ మొదలైన భాషల్లో తేడాలుంటాయి. ఇవి సరిగ్గా తెలియకపోవడంవల్ల అంధుల లిపిని బ్రెయిల్‌ అనడానికి బదులుగా మనవాళ్ళు తెలుగులో బ్రెయిలీ అనీ, రాక్‌విల్‌ మొదలైన ఊళ్ళ పేర్లను రాక్‌విల్లీ అనీ రాస్తూ ఉంటారు. స్పానిష్‌ ఉచ్చారణ మరింత గొడవగా ఉంటుంది కనక శాన్‌హొసే అనే ఊరి పేరును చాలామంది శాన్‌జోస్‌ అని తప్పుగా పలుకుతారు. విదేశీ పదాలకూ, పేర్లకూ సరైన ఉచ్చారణను తెలిపే సదుపాయాలు ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చని ఈ కాలపు జర్నలిస్టులుకూడా గమనిస్తున్నట్టు కనబడదు. ఇంగ్లీషులోనే వోట్ అనేమాటను ఓటు అని రాయడం, పైలట్ అనేమాటను పైలెట్ అనడం, మైనారిటీ, మ్యునిసిపాలిటీ మొదలైన పదాలను మైనార్టీ, మున్సిపాల్టీ అని రాయడం వగైరా తప్పుడు సాంప్రదాయాలను వారే కొనసాగిస్తూ ఉంటారు.

మనలాగా కాకుండా చైనా భాష వంటివాటిలో ఒకే అక్షరం ఒక పూర్తి పదాన్ని సూచిస్తుందంటే మనకు కొత్తగా అనిపిస్తుంది కాని నిజానికి అంకెల విషయంలో మనకూ అటువంటి ఏర్పాటే ఉంది. 4 అని రాసినప్పటికీ మనం దాన్ని నాలుగు అనే మూడక్షరాల పదంగానే పరిగణిస్తాం. కొన్ని భాషల్లో ఒక్కొక్క సంకేతమూ ఒక్కొక్క ఉచ్చరించదగిన శబ్దంగా పనికొస్తుంది. ఈ సంకేతాలు ఒక్కొక్కటీ చిత్రలిపి కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది శ్లేష పద్ధతి. దీనికి ఉదాహరణగా ఆరుద్ర తన కవిత ఒకదానికి సరదాగా “6ద్ర 7పు” అనే శీర్షిక పెట్టారనేది చెప్పవచ్చు.

తెలుగులో ప్రాచీనకావ్యాల్లో అరసున్నా ఉండేదికాదు. ఎటొచ్చీ పూర్వకాలంలో తెలుగులో దాదాపు ఒకేలాంటి ఉచ్చారణ కలిగిన కొన్ని పదాలలో ఒకదాన్ని మామూలుగానూ, మరొకదాన్ని ముక్కుతో పలికేవారట. సందర్భాన్నిబట్టి ఏది ఎలా పలకాలో అందరికీ తెలిసేది. ఉదాహరణకు వాడు అంటే ఉపయోగించు, లేదా ఎండిపోవు అనే అర్థం ఉంది. మూడో అర్థంలో అతడు అని కూడా అనుకోవచ్చు. కానీ పండితులు మూడో సందర్భంలో మాత్రం వాఁడు అని రాయాలంటారు. ప్రాచీన కాలంలో లేని ఈ ప్రయోగం తరవాతి కాలంలో ఎందుకొచ్చిందో వివరిస్తూ తిరుమల రామచంద్రగారు కొన్ని విషయాలు రాశారు. పాత తెలుగులో వాండు అనే ప్రయోగం ఉండేది. ఇప్పటికీ రాయలసీమ మొదలైన ప్రాంతాల్లో బహువచనంలో వాండ్లు అనే అలవాటు కనబడుతుంది. ఈ వాండు అనే మాటను ఒక్కొక్కప్పుడు పూర్తి సున్నాతో వత్తి పలికేవారట. ఒక్కొక్కప్పుడు తేల్చి ముక్కుతో పలికేవారట. తేల్చి పలుకుతున్నప్పుడు అరసున్నా వాడాలి. ఆధునికయుగంలో భాష నేర్చుకోవడం పూర్తిగా పుస్తకాల మీదనే ఆధారపడుతున్న పరిస్థితుల్లో సరైన అర్థం తెలియడానికని అరసున్నా చేర్చే నిబంధన పెట్టుకుని ఉంటారు.

ఇలాంటి విషయాల్లో ఒక్కొక్కప్పుడు రాసినదానికీ, ఉచ్చారణకూ సంబంధం ఉండేది కాదు. రామచంద్రగారు 1065 నాటి శాసనంలోని ఈ పద్యాన్ని ఉదహరించారు.

“సకల వశుమతీశ మకుటలసద్రత్న
కిరణరుచి విరాజి చరణుణ్డయిన…”

ఇందులో చివరి పదాన్ని చరణుడయిన అనే చదవాలి. లేకపోతే ఆటవెలది నడక చెడిపోతుంది. ఇటువంటి పద్ధతుల కారణంగా మనకు ప్రాచీనకాలపు తెలుగు అక్షరాలు చదవడానికి కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ చదవగలిగినా ఈ అన్నమాచార్య రచనలాగా కొంత గందరగోళంగా అనిపిస్తుంది.

“…అద్దమరాతిరి దాంకా నంద్దు నింద్దు నుండ్డి వచ్చి వొద్దురవోరా
నీకు నింత్త వొలశి నొల్లములు..”.

ఇప్పటి తెలుగు ఉచ్చరించే పద్ధతిలో ఫోనెటిక్‌గా ఉంటుంది కనక మనకు అంత ఇబ్బందిగా ఉండదు. అయినా మామ, చీమ, దోమ వగైరా పదాలను కోస్తావారిలాగా తక్కిన తెలుగువారు మాఁవ, చీఁవ, దోఁవ అనకపోవడం చూస్తూనే ఉంటాం.

లిపులవల్ల ఈనాడు ఎన్నెన్నో ఉపయోగాలున్నాయి కనకనే వాటి ఉచ్చారణ గురించి ఎంతో చెప్పుకోవడం వీలవుతోంది. కానీ ఆనాడైనా, ఈనాడైనా అక్షరాల ముఖ్య ప్రయోజనం ప్రజలకు సమాచారాన్ని అందించడమే. రాసిపెట్టిన సమాచారం ఒకేసారిగా అనేకమందికి కనిపించినప్పుడో, అనేక సమయాల్లో అనేక తరాలకు అందుబాటులోకి వచ్చినప్పుడో సార్థకమవుతుంది.

సామాజిక ప్రయోజనమే రాసినది చదవడంలోని ముఖ్య విషయం. ఎందుకంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు తమకు మాత్రమే అర్థమయే రహస్యలిపిలో సందేశాలు రాసి పంపుకోవచ్చు. అది ఇతరులకేమీ ఉపకరించక పోవచ్చు. ప్రపంచంలో వ్యాప్తి చెందినవన్నీ అందరికీ ఉపయోగపడే రచనా పద్ధతులే. నాగరికత పెరిగి విస్తరించడానికి ఇవి చాలా తోడ్పడ్డాయి. కానీ ఈనాటి సమాచారవ్యవస్థలోని అతిముఖ్య అంశంగా పరిణమించిన లిపులు గతంలో విదేశీయులు ప్రవేశపెట్టినదాకా ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో తలెత్తనే లేదు. వీటిలో ఆస్ర్టేలియా, పసిఫిక్‌ దీవులూ, ఆఫ్రికాలో భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న ప్రదేశమూ, (మధ్యఅమెరికా ప్రాంతం మినహాగా) మొత్తం రెండు అమెరికా ఖండాలూ మొదలైనవి ఉన్నాయి. ఇతర నాగరికతలకు చెందిన అన్వేషకులూ, ఆక్రమణదారులూ ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారికి బోలెడంత లిఖితపూర్వకమైన సమాచారం సహాయపడింది. ఇందులో వారు స్థానికులపట్ల అవలంబించవలసిన వైఖరిని గురించిన అధికారిక సూచనలూ, పనికొచ్చే చరిత్ర వివరాలూ, యుద్ధ ప్రణాళికలూ మొదలైన వివరాలెన్నో ఉండేవి. వీటి సహాయంతో వ్యక్తిగతంగా గొప్ప తెలివితేటల అవసరం లేకుండా నిరక్షరాస్య సమాజాలను ఇతరులు సులువుగా లోబరుచుకోగలిగారు. అప్పటికే కొన్నివేల ఏళ్ళుగా పెంపొంది ఉన్న వారి నాగరికత వారికి పరోక్షంగా తోడ్పడిందనుకోవచ్చు.

అతిప్రాచీనమైన సింధునాగరికత ఎంత సువిశాలమైనదో ఆధునికులకు తెలియాలంటే.. అందులో ఈనాటి పాకిస్తాన్‌ పూర్తిగానూ, భారత, అఫ్ఘానిస్తాన్‌ దేశాల్లోని అనేక భాగాలూ ఉండేవనేది చెప్పాలి. 50 లక్షల జనాభాతో విలసిల్లిన ఈ నాగరికతకు చెందిన 800 కేంద్రాల ఆచూకీ ఇప్పటివరకూ తెలిసింది.

కానీ చరిత్రలో జరిగిన విచిత్ర పరిణామాల కారణంగా నాగరికతలన్నిటికీ పుట్టినిల్లయిన ఇరాక్‌ ప్రాంతంలో ఈనాడు ఎక్కువమంది నిరక్షరాస్యులుండగా జపాన్‌లోనూ, స్వీడన్‌ మొదలైన దేశాల్లోనూ ఎక్కువ అక్షరాస్యత కనబడుతోంది. చదవడం, రాయడం పుట్టుకతో వచ్చే విద్యలుకావు కనక వీటికి శిక్షణ అవసరం. 2000లో జరిపిన సర్వేప్రకారం మనదేశంలో కనీసస్థాయి అక్షరాస్యత పురుషుల్లో దాదాపు 68 శాతం, మహిళల్లో 42 శాతం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సంఖ్యలు మన పొరుగుదేశాలైన పాకిస్తాన్‌లో 58, 28 కాగా, బంగ్లాదేశ్‌లో 52, 30 అనీ, శ్రీలంకలో 95, 89 అనీ తేలింది. ఈనాడు సిటీ బస్సు నంబర్ల దగ్గర్నుంచీ ప్రతిదీ అక్షరాల రూపంలోనే కనిపిస్తుంది కనక చదువు రాకపోతే లాభం లేదు.

యునెస్కో జరిపిన పరిశీలనలను బట్టి చూస్తే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పేదరికమూ, తక్కువ ఆయుఃప్రమాణమూ, వెనకబాటుతనమూ, రాజకీయ నిరంకుశత్వమూ కనిపిస్తాయి. ఎటొచ్చీ అక్షరాస్యత అనేది వ్యక్తిగత సుఖసంతోషాలకు గాని, సమాజంలో ఆర్థిక ప్రగతికిగాని, ప్రజాస్వామిక వ్యవస్థకుగాని కారణం అవుతుందని చెప్పలేం. ప్రపంచ జనాభా పెరుగుతున్నకొద్దీ నిరక్షరాస్యుల సంఖ్యకూడా పెరుగుతోంది. క్యూబా, చైనా, టాంజానియా, నికరాగువా మొదలైన దేశాలు చేపట్టిన కార్యక్రమాలు నిరక్షరాస్యతను తగ్గించడంలో మంచి ఫలితాలు సాధించినట్టుగా తెలుస్తోంది.

మనదేశంలో లిపి చరిత్ర ప్రాచీనమైనది. అది మొదటగా తలెత్తిన నాగరికత సింధునది ప్రాంతంలో మొదలైనట్టుగా వింటాం. దాదాపు రెండులక్షల సంవత్సరాల క్రితం పుట్టుకొచ్చిన ఆధునిక మానవజాతి ప్రజలు కనీసం లక్షసంవత్సరాల క్రితమే ఆఫ్రికానుంచి ఆసియా, మొదలైన తక్కిన ప్రాంతాలకు వలసవెళ్ళినట్టుగా తెలుస్తోంది. వీరంతా సింధునది సమీపంలోనేకాక, మన దేశమంతటా స్థిరపడ్డారు. అయినప్పటికీ సింధునాగరికత ఎంతో విశిష్టమైనది. అక్కడ నిర్మించబడ్డ గొప్ప నగరాలూ, వీధుల రూపకల్పనా, తాగునీటికీ, మురుగునీటికీ అద్భుతమైన ఏర్పాట్లూ వగైరాలకు సాటిరాగల సమకాలీన నాగరికతలేవీ కనబడవు. నేటి పాకిస్తాన్‌లో 1920లలో జరిపిన మొహెంజోదడో, హడప్పా ప్రాంతాల్లో తొలి తవ్వకాలలో బైటపడ్డ అపూర్వమైన విశేషాలు సంచలనం కలిగించాయి. క్రీ.పూ. 2600-1900 మధ్యలో ఉచ్ఛదశకు చేరుకున్న ఈ నాగరికతలో లిపిని గురించిన ఆధారాలుకూడా దొరికాయి.

వేల సంవత్సరాల క్రితపు రచనా విశేషాలు చరిత్రకారులకు చిక్కు సమస్యలుగా తయారవడం మామూలే. ఎందుకంటే ప్రాచీన నాగరికతలన్నీ నేటిదాకా కొనసాగకుండా మధ్యలో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినవే. అప్పటి లిపులూ, భాషలూ అన్నీ ఎటువంటి సజీవ సాక్ష్యాలనీ మిగల్చకుండా మరుగునపడిపోయినవే. ఉదాహరణకు క్రీ.పూ.3300 ప్రాంతాల మొదలై, 3 వేల ఏళ్ళు అవిచ్ఛిన్నంగా కొనసాగిన ఈజిప్ట్‌ నాగరికత ప్రాచీన గ్రీక్‌ పర్యాటకులనుంచీ అనేకమందిని అద్భుతపరిచింది. అప్పటివారు నిర్మించిన బ్రహ్మాండమైన పిరమిడ్లనూ, దేవాలయాలనూ, ఇతర నిర్మాణాలనూ ఎందరో ఎంతో ఆసక్తితోనూ, ఆశ్చర్యంతోనూ పరిశీలించారు. కానీ వారి భాష గురించి తరవాతి యుగాల్లో ఎవరికీ తెలియలేదు. వారి చిత్రలిపిని గురించి ఎందరో పరిశోధనలు జరిపినప్పటికీ నెపోలియన్‌ కాలందాకా అది చిక్కుముడిగానే మిగిలిపోయింది.

ఎందరో విఫలయత్నాలు చేశాక 1821లో షాంపోలియోఁ అనే ఫ్రెంచ్‌ పరిశోధకుడి బృందానికి మూడు విభిన్న లిపులలో శాసనాలు చెక్కిన రోసెటా శిల ద్వారా సమాధానం లభించింది. అందులో ఒకే సమాచారాన్ని ప్రాచీన ఈజిప్ట్‌ చిత్రలిపి లోనూ, తరవాతి కాలపు డెమోటిక్‌ లిపిలోనూ, గ్రీక్‌ లిపిలోనూ రాసిఉంచారుకనక ఎలాగో అలా తంటాలుపడి ఈజిప్ట్‌ చిత్రలిపిని చదవగలిగారు. అలాగే మెసపొటేమియావారి కీలలిపి (క్యూనీఫాం) నమూనాలు యూరప్‌నుంచి వెళ్ళిన అన్వేషకులకు పదిహేడో శతాబ్దంలోనే లభించాయి కాని వాటిలో ఒకటి మూడు విభిన్న లిపులు కలిగినది కావడంతో కొన్ని దశాబ్దాల పాటు పరిశీలనలు జరిపిన మీదట సమస్య పరిష్కారమయింది. మన దేశానికి మాత్రం అటువంటి అవకాశమేదీ లభించలేదు.

రోసెటా శిల

సింధునాగరికత గురించి మొదటినుంచీ అనేక వివాదాస్పద సమస్యలుంటూనే ఉన్నాయి. మనవాళ్ళకు మొదటినుంచీ చారిత్రకదృష్టి కన్నా సంప్రదాయబద్ధమైన వీరావేశాలు ఎక్కువ. హిందువులకు వేల సంవత్సరాలుగా వేదాలమీద అపారమైన విశ్వాసమూ, భక్తిశ్రద్ధలూ ఉన్నాయి. లోకాయతవాదమూ, బౌద్ధ జైనాలూ తప్ప తక్కిన భారతీయ తత్వ్తధోరణులన్నీ వేదాలను ప్రామాణికమైనవిగా భావిస్తాయి. అందుచేత అవి ఎవరూ రాయనటువంటి అపౌరుషేయాలనీ, బ్రహ్మ ముఖంనుంచి పుట్టుకొచ్చాయనీ నిజంగానే నమ్మేవాళ్ళు ఈనాటికీ చాలామంది కనిపిస్తారు. ఇటువంటి నమ్మకాలేవీ లేని చరిత్రకారులు మాత్రం క్రీ.పూ.1500 ప్రాంతాల రచించబడ్డట్టుగా వేదాలకు కాలనిర్ణయం చేశారు. సింధునాగరికత మాత్రం అంతకు వెయ్యేళ్ళ ముందునుంచీ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది.

అక్కణ్ణించీ చిక్కులు మొదలయాయి. ఆర్యులనబడేవారు మధ్యఆసియానుంచి మనదేశానికి వలసవచ్చారనీ, సింధునాగరికత అప్పటికే వర్ధిల్లుతూ ఉందనీ చరిత్రకారులు అన్నారు. దీనర్థం ఏమిటంటే స్థానికులది ద్రావిడసంస్కృతి అని. దీనికి సనాతన హిందూమతాభిమానులు అంగీకరించరు. వేదాలు రచించిన ఆర్యసంస్కారం ఈ “పుణ్యభూమి”కి చెందినదేననీ, అంత గొప్ప ఆర్యజాతి మనకు విదేశీయం కాజాలదనీ ముఖ్యంగా ఉత్తరాదివారు వాదిస్తారు. ద్రావిడ సంస్కృతి అనేది ఏమైనప్పటికీ అది ఆర్య సంస్కృతికన్నా నీచమైనదని వారు స్పష్టంగా అనకపోయినా వారి ఉద్దేశం అదే అనిపిస్తుంది. ఇంతకీ వేదాలది సంస్కృతభాష. (ఇది మనం అనుకునే సంస్కృతం కాదనీ, మరేదో దేవభాష అనీ చెప్పే మేధావులూ ఉన్నారు). దీనికీ సింధులిపికీ ఏ సంబంధమూ కనబడదు.

సింధు నాగరికతలో దొరికిన లిపి ఆనవాళ్ళన్నీ ముద్రికల రూపంలో ఉన్న అచ్చులు. సుమారు 2 వేలకు పైగా దొరికిన ఈ ముద్రికలను బంకమట్టి ముద్దలవంటి వాటిమీద గుర్తులు వెయ్యటానికి ఉపయోగించి ఉంటారు. అక్కడివారికి అప్పటికే మెసపొటేమియా ప్రాంతం ప్రజలతో వర్తకవాణిజ్యాలు జోరుగా సాగుతూ ఉండేవి. సరుకుల బంగీలమీద ముద్రలు వేసి ఎగుమతి చేసేవారని మెసొపొటేమియాలోని సాక్ష్యాలవల్ల తెలుస్తోంది. అతిప్రాచీనమైన సింధునాగరికత ఎంత సువిశాలమైనదో ఆధునికులకు తెలియాలంటే.. అందులో ఈనాటి పాకిస్తాన్‌ పూర్తిగానూ, భారత, అఫ్ఘానిస్తాన్‌ దేశాల్లోని అనేక భాగాలూ ఉండేవనేది చెప్పాలి. 50 లక్షల జనాభాతో విలసిల్లిన ఈ నాగరికతకు చెందిన 800 కేంద్రాల ఆచూకీ ఇప్పటివరకూ తెలిసింది. వీటిలో సింధునదీ తీరాన ఉన్నవి వందకు లోపే. ఇంత పెద్ద స్థాయిలో వర్ధిల్లిన నాగరికతలో లిపి ఉపయోగం జరిగేఉండాలి.

దురదృష్టవశాత్తూ మనకు దొరికిన ముద్రికల్లో ఏది చూసినా 5 నుంచి 26 గుర్తులే కనిపిస్తున్నాయి. ఇవన్నీ అక్షరాలా, పదాలా, శబ్దాలకు సంకేతాలా అనే విషయం 70 ఏళ్ళ క్రితం దాకా తెలియనేలేదు. ఆ తరవాత సోవియట్‌ యూనియన్‌, ఫిన్లండ్‌ మొదలైన దేశాలకు చెందిన పరిశోధకులూ, భారత, పాకిస్తాన్‌ శాస్త్రవేత్తలూకూడా పరిశీలనలు జరిపి ఈ లిపిని చదవగలిగే స్థాయికి చేరుకున్నారు. ఎటొచ్చీ వీరిలో తీవ్రమైన అభిప్రాయభేదాలున్నాయి.

సింధు ముద్రిక

సింధు నాగరికతలో దొరికిన ముద్రిక

విస్తృతంగా పరిశీలనలు జరిపిన పార్‌పోలా (ఫిన్లండ్‌), అతనితో అంగీకరించిన ఐరావతం మహాదేవన్‌ తదితరులు ఈ భాష తమిళాన్ని పోలిన ద్రావిడభాష అని భావిస్తున్నారు. ఉత్తర భారతీయ పరిశోధకులైన మధుసూదన్‌ మిశ్రా వంటివారు మాత్రం అది తప్పనీ, ఆ గుర్తులన్నీ సంస్కృతాన్ని పోలిన అక్షరాలకు సంకేతాలనీ అంటున్నారు. కెనడాలోని పరిశోధకులు కొందరు మరికొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు.

సింధులిపికీ తెలుగు, తదితర ద్రావిడ భాషలకూ సంబంధం ఉండవచ్చని కొందరంటే, సింధులిపిని ఈనాటికీ వాడుతున్న ఆదివాసీ తెగలు బిహార్‌లో కనబడుతున్నాయని మరికొంద రంటున్నారు. ఈ ప్రతిపాదనలకు కొంత ప్రాధాన్యత కనిపిస్తుంది. ఎందుకంటే సింధు నాగరికత ద్రావిడులకు సంబంధించనిదని అంటున్నవారు ముఖ్యంగా పేర్కొనే కారణం సింధునది ప్రాంతంలో తరవాతి కాలంలో ద్రావిడ సంస్కృతి కనబడటం లేదన్నదే. తరవాతి యుగాల్లో ఇండో ఇరానియన్‌ సంస్కృతికి చెందిన ప్రజలు చేసిన అనేక దాడుల కారణంగా ద్రావిడ సంస్కృతి తూర్పుదిక్కుకూ, దక్షిణాదికీ తరలి ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ప్రతిపాదనలే. వీటి నిరూపణకై ఎన్నో సాక్ష్యాలు సేకరించవలసి ఉంది. వ్యక్తిగత భావాలూ, ఆవేశాలూ ఎటువంటివైనా, వీటి గురించి చదివి తెలుసుకుంటూ ఉండడమే మనవంటి సామాన్యుల పని. వాదోపవాదాలూ, చర్చలూ నిపుణులైన పరిశోధకులు మాత్రమే చెయ్యాలి.

ఇవన్నీ అలా ఉంచితే అసలు లిపుల్లో అత్యంత ప్రాచీనమైనది సుమేరియన్‌ కీలలిపి కాదనీ, సింధునాగరికతకు చెందినదేననీ 1999లో బిబిసి ప్రకటించింది. అయిదున్నర వేల ఏళ్ళనాటి కుండపెంకులమీద గీసిన గుర్తులే ప్రపంచంలో అన్నిటికన్నా మొదటి లిపికి నమూనా అని పరిశోధకులు చెపుతున్నారు.

హడప్పా ప్రాంతంలో దొరికిన పెంకు

హడప్పా ప్రాంతంలో దొరికిన పెంకు

హడప్పా ప్రాంతంలో దొరికిన ఈ పెంకు మీది గుర్తులు కుండను ఆవంలో కాల్చక ముందూ, తరవాతా కూడా గీసినట్టుగా కనిపిస్తున్నాయని వారు చెప్పారు. ఈ గుర్తులకు కుండలోని పదార్థంతోనో, దేవతలతోనో సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ లిపి గురించీ, తక్కిన నమూనాల గురించీ మనకేమీ తెలియకపోవడానికి కారణం ఈ భాషకు తరవాత వారసత్వమేదీ మిగలకపోవడమే. వేదకాలంలో లిపికి ప్రాధాన్యత ఉన్నట్టు కనబడదు. భారతదేశపు లిపులన్నిటికీ మూలమైన బ్రాహ్మీ లిపి క్రీ.పూ. నాలుగో శతాబ్దం తరవాత ప్రాచుర్యంలోకి వచ్చినట్టుగా భావిస్తున్నారు.

———————————

కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) నుండి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త. తెలుగులో http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) అనే బ్లాగులు రాస్తూంటారు.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

4 Responses to రాసినది చదవడం

  1. నరేంద్ర భాస్కర్ S.P says:

    ఫ్రసాద్ గారికి నమస్తే,
    మీరు చెప్పాలనుకున్న దానిని మీకున్నఙానం తో అనుసంధానిస్తూ సవివారాణాత్మకంగా, సచిత్రికంగా చాలా చక్కగా చెప్పారు, నెనర్లు. కాకఫొతే మీ బ్లాగూ, దాని లో పొస్టులతో పొలిస్తే, ఇక్కడ మీరు రాసిన పద్దతి వేరేగా ఉంది, ఎడిటింగ్ మహిమా?

  2. viswam says:

    scientific amsalani sunnitanga chakkaga chepparu.uda lipiunna vedalani kristu purvam kpddi samvatsaralake raayadamlaantivi

  3. mana draaviDa caritrapaina,aaryulaku,aaTTE avagaahana kanabaDadu,alaagani,vidvEshamU agupaDadu.saMskRtulu rUpu diddukuMTUnna toli daSalO aMtakaMTE aaskaaraM uMDadu.oa SRI raamuDU, tana vyaktitvaMto iTu aaryulanU,aTu draviDa,siMdhU munnagu aaryEtara saMskRtulanU prabhaavitaM cEsaaDu.aatani vyaktitvaM eMta goppadI aMTE ii naaTiki kUDaa aa svaami mudrayE ,kuTuMba vyavasthanu,tadvaaraa nIti niyamamulaku aalavaalamaina saMghaannI nirmiMci,kaMcu kOTalaa kaapaaDutUnnadi.

Comments are closed.