నిశ్శబ్దానికి మరోవైపు

“ఈ పుస్తకాలని సోమవారం తెస్తానమ్మా…..”

“థాంక్యూ సార్, మీకు నా కృతజ్ఞతలు …” అంది కావ్య. తరువాత మోహన్ తన పనులలో మునిగిపోయాడు.

ఈ రోజు సాయంత్రం ఏమైందో తెలుసా? మా లైబ్రరీలో పుస్తకాలు, పేపర్లు చదివి ప్రిపేరైన ఓ పేద అమ్మాయి డి.ఎస్సీ లో సెలక్టయింది. ఆమెకి రేపోమాపో ప్రభుత్వోద్యోగం వస్తుంది.

మధ్యాహ్నం మూడు గంటలకి పోస్టు వచ్చింది. అనుకున్నట్లుగానే జిల్లా కేంద్ర గ్రంథాలయం నుంచి రెండు ఉత్తరాలు వచ్చాయి. ఒక ఉత్తరంలో తన లైబ్రరీలో పాతపుస్తకాలు, పేపర్ల బరువు, వాటిని అమ్మితే వచ్చే డబ్బెంతో రాసి పంపారు. వేలంపాటలో నెగ్గినవారు సోమవారం నాడు వచ్చి పాత పత్రికలు, పేపర్లు తీసుకువెడతారని రాసారు.

రెండో ఉత్తరంలో భోగాపురం బ్రాంచి లైబ్రరీలో, కొత్త చందాదార్లు ఎవరూ ఉండడం లేదని, అందువల్ల ఓ ఇంక్రిమెంటు కట్ చేస్తున్నట్లు, ఇంకా కొంత కాలం ఇలాగే జరిగితే గ్రేడ్ తగ్గిస్తామని రాసారు.

సాయంత్రం ఆరు గంటలకి సీతారామయ్యగారు వచ్చారు. కరెంట్ పోవడంతో, చదువరులు ఒక్కొక్కరు, మెల్లగా ఇళ్ళకి వెళ్ళిపోసాగారు. మోహన్ రెండు కుర్చీలు తెచ్చి బయట వరండాలో వేసాడు. “రా బాబాయి, బయట కూర్చుందాం” అంటూ సీతారామయ్యగారిని పిలిచాడు మోహన్.

“విశేషాలు ఏమున్నాయి అబ్బాయి?” అంటూ కూర్చున్నారు సీతారామయ్యగారు.

“సోమవారం మన లైబ్రరీలోని పాత పుస్తకాలు, పేపర్లు అమ్మేస్తున్నాం బాబాయి. నువ్వు, సర్పంచ్‌గారు వచ్చి సాక్షి సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా ఉండాల్సిన బరువు కంటే తక్కువే తూగుతాయి….” అన్నాడు మోహన్ గట్టిగా నిట్టూరుస్తూ.

“పోన్లేరా బాధ పడకు! ఈ సారి నుంచి పత్రికలను ఎవరూ చించకుండా జాగ్రత్త వహించేలా, నువ్వు పెట్టుకున్న కుర్రాడికి తర్ఫీదునివ్వు”
“ఇదే కాదు బాబాయి, కొత్తగా చందాదారులు ఎవరూ చేరడం లేదని నాకో ఇంక్రిమెంట్ కట్ చేసారు” మోహన్ స్వరంలో బాధ వ్యక్తమైంది.

“ఇవ్వాల్సిన జీతం బకాయిలు చెల్లించకుండా, పైగా ఇదొకటా! మా కాలంలో గ్రంథాలయాలను ఎంతో ఉపయోగించుకునేవాళ్ళం! ఇప్పుడు ‘రీడర్‌షిప్’ బాగా తగ్గినట్లుంది. ఎందుకంటావు?”

“పుస్తకాలు కొనడానికి గ్రాంట్లు ఇవ్వడం తగ్గించేసింది ప్రభుత్వం. దాంతో గ్రంథాలయాలలో కొత్త పుస్తకాలు కొనడం లేదు. పైగా ద్రవ్వోల్బణం, ప్రైవేటీకరణ, ఆర్ధిక సంస్కరణలు ప్రజల జీవన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ‘పుస్తకాలు కొని చదవడం ఎలాగూ కష్టం, కనీసం లైబ్రరీలోనైనా చదువుకుందాం’ అని లైబ్రరీకి వచ్చేవాళ్ళు, కొత్తపుస్తకాలు లేకపోయేసరికి నిరాశ చెందుతున్నారు. దీనికి తోడు కేబుల్‌టీవీ ప్రజల తీరిక సమయాన్ని తన వశం చేసుకుని పాఠకులలో పఠనాసక్తిని తగ్గించేసింది….”

“నువ్వు చెప్పింది నిజమే. మా స్కూల్ మాస్టార్లతో మాట్లాడుతాను. వాళ్ళు ఎవరైనా కొత్త చందాదారుల్ని పంపుతారేమో చూద్దాం” అంటూ, “చీకటి పడుతోంది. నేనిక బయల్దేరనా?” అని అడిగారు.

“సరే బాబాయి, సోమవారం కలుద్దాం”

“ఏం ఆదివారం రావా?”

“రాను బాబాయి. ఆదివారం హెడాఫీసులో పనులు ఉన్నాయి. అందుకని బయట తలుపుమీద నోటీస్ అంటించి వెళ్ళిపోతాను.”

“సరే ఉంటాను” అంటూ వెళ్ళిపోయారు సీతారామయ్యగారు.

ఆరూ యాభైఐదు అవుతోంది. కరెంట్ ఇంకా రాకపోడంతో, పుస్తకాలన్ని సర్ది, తలుపు మీద నోటీస్ అంటించి, తనూ బయల్దేరాడు మోహన్.

* * *

శుక్రవారం శ్రావణికి ఎంతో ఇష్టమైన రోజు. పిల్లలను బడికి పంపాక, మార్కెట్‌కి వెళ్ళి కూరలు తెచ్చుకుంటారు శ్రావణి, మోహన్. ఆ తర్వాత ఆ రోజంతా కబుర్లతోనే గడిచిపోతుంది. ఏవైనా బిల్లులు కట్టడం….. లాంటి పనులని శుక్రవారం పెట్టుకుంటాడు మోహన్. లైబ్రరీలో అలవాటైన నిశ్శబ్దం, ఏ పుస్తకం ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టడం లాంటి పద్ధతులు ఇంట్లో కూడ పాటిస్తాడు. ఒక్క శుక్రవారం మాత్రం వీటన్నింటికీ మినహాయింపు. సాయంత్రం బడినుంచి ఇంటి కొచ్చేసరికి నాన్న ఇంట్లో ఉంటే పిల్లలకి ఎంతో హుషారు. శుక్రవారాలు సాయంత్రంపూట పార్కుకి తీసుకెళ్ళి, ఆటలు ఆడిస్తూంటాడు మోహన్. ఈ సారి రెండో శనివారం కూడ కలిసొచ్చింది. శనివారం నాడు పిల్లలతో కలిసి కైలాసగిరి వెళ్ళారు శ్రావణి, మోహన్. కొండ మీద నుంచి చూస్తుంటే, విశాలమైన సముద్రం కనువిందు చేసింది. ఆ తర్వాత జూపార్క్‌కి వెళ్ళారు. పిల్లల ఆనందానికి అంతే లేదు. రాత్రి అందరూ కలిసి భోంచేస్తుంటే…. “ప్రతీరోజూ రెండో శనివారం అయితే ఎంత బావుంటుందో కదా నాన్నా” అని అంది మోహన్ కూతురు. ఆ చిన్నారి ఆశకి నవ్వుకున్నారు అమ్మానాన్నా. ఆదివారం జిల్లా గ్రంథాలయానికి వెళ్ళి, తన పనులు చూసుకుని, కావ్య అడిగిన పుస్తకాలు తీసుకున్నాడు మోహన్.

* * *

సోమవారం మామూలుగానే ఎనిమిది గంటల కల్లా వెళ్ళి లైబ్రరీ తెరిచాడు. అతడి అసిస్టెంట్ కూడ అప్పటికే వచ్చేసున్నాడు. పేపర్లు సర్దే పనిని అసిస్టెంట్ చూసుకుంటూండడంతో మోహన్ తీరికగా కూర్చుని, తను ఈ మధ్యే కొనుక్కున్న గొల్లపూడి మారుతీరావు గారి “సాయంకాలమైంది” అనే నవల చదువుకుంటున్నాడు. ఇంతలో తన అసిస్టెంట్ ఎవరితోనో గొడవపడడం వినిపించి బయటకు వచ్చాడు మోహన్.

“ఏంటి గొడవ?” అని అడిగాడు.

“చూడండి సార్. ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా, గేట్ రిజిస్టర్‌లో సంతకం చేయకుండా లోపలికి వచ్చేస్తారు. పైగా నీకెందుకు పోరా, అంటున్నారు…….” ఫిర్యాదు చేసాడు అసిస్టెంట్.

“చూడండి మాస్టారు! గేట్ రిజిస్టర్‌లో సంతకం చేయడం తప్పనిసరి. ఎందుకంటే మన శాఖా గ్రంథాలయానికి ఏడాదికి కనీసం 896 మంది చదువరులు వచ్చినట్లుగా ఋజువు ఉంటేనే లైబ్రరీని నడిపిస్తారు. ఆ సంఖ్య ఏ మాత్రం తగ్గినా, లైబ్రరీని మూసేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు కాలక్షేపం కోసం వచ్చే మీలాంటి వాళ్ళకి పెద్దగా నష్టమేమీ ఉండదు. కాని రిఫరెన్సు మెటీరియల్స్ కోసం వచ్చే విద్యార్థులు, ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు మాత్రం నష్టపోతారు. కాబట్టి సంతకం చేసి లోపలికి రండి” అంటూ వివరంగా చెపాడు మోహన్.

ఆయన మౌనంగా సంతకం చేసి లోపలికి వెళ్ళి పేపరందుకున్నాడు. కాసేపయ్యాక కావ్య వచ్చింది. ఆమె కోసం తెచ్చిన పుస్తకాలని అందిస్తూ, జాగ్రత్తలు చెప్పాడు మోహన్. అన్నింటికీ తలూపి, ఆ పుస్తకాలని తీసుకువెళ్ళింది. నెల రోజుల తర్వాత, ఆ పుస్తకాలను భద్రంగా తిరిగిచ్చేసింది. ఆరు నెలలు గడిచాయి.

“అసలే గ్రంథాలయాలకి ఆదరణ లేదు. ఇలాంటి ఉత్సవాల పేరుతోనైనా ఏర్పాట్లు బాగా చేస్తే, నలుగురు వచ్చి పుస్తకాలు చదువుతారు. సంస్థా బాగుపడుతుంది….”

“కానీ నిశ్శబ్దం తప్ప మీకు దక్కింది ఏముంది? మీరు ఎంతగా శ్రమిస్తున్నారో నాకు తెలుసు…” శ్రావణి గొంతులో భర్త పట్ల సానుభూతి వ్యక్తమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రంథాలయ వారోత్సవాల తేదీ ప్రకటించారు. ఈ వారోత్సవాల సమయంలో, గదులకి సున్నాలు వేయించడం, రంగు రంగుల కాగితాలు అతికించడం, లైబ్రరీ ఆవరణలో సభ ఏర్పాటు చేయించడం, ఎవరైనా సుప్రసిద్ధ రచయిత/రచయిత్రిని ముఖ్య అతిథిగా పిలవడం, సభని సజావుగా జరిపించడం వంటి పనులెన్నో లైబ్రేరియన్లు చేయాల్సుంటుంది. జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒక్కో శాఖా గ్రంథాలయానికి రూ.250/- నుంచి రూ. 500/- మధ్యలో ఇస్తుంది. కానీ ఈ ఏర్పాట్లన్నీ చేయాలంటే కనీసం పదిహేను వందలన్నా కావలసివస్తాయి. ఉత్సవాలని ఘనంగా చేయించాలంటే మాత్రం, మిగతా మొత్తాన్ని బ్రాంచి లైబ్రేరియన్లు పెట్టుకోవాల్సిందే. కాకపోతే కొంత మొత్తాన్ని చందాల రూపంలో వసూలు చేసుకోవచ్చు.

మోహన్, సీతారామయ్య గారూ, కావ్య కలసి విరాళాల కోసం తెగ తిరిగారు. మొత్తం మీద ఎనిమిది వందల రూపాయలు పోగయ్యాయి. హెడాఫీసు నుంచి వచ్చిన ఐదొందలకి, తాము పోగు చేసిన మొత్తానికి పైన తన జేబులోంచి ఇంకో రెండు వందల రూపాయలు వేసుకుని మొత్తం పదిహేనువందల రూపాయలతో వారోత్సవాలని బాగానే నిర్వహించాడు. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్ర పోయాడు మోహన్.

మర్నాడు పొద్దున్నే లైబ్రరీకి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇల్లు చేరాక అతడు ఎంతో సంతోషంగా కనిపించాడు. రాత్రి భార్యతో మాట్లాడుతుంటే వారోత్సవాల ఖర్చుల ప్రసక్తి వచ్చింది.

“ఎందుకొచ్చిన తిప్పలండీ ఇవన్నీ? ఏదో వృత్తిధర్మంగా మీకెంత ఇస్తే ఆ డబ్బుతోనే ఏర్పాట్లు చేయచ్చుగా?”

“అసలే గ్రంథాలయాలకి ఆదరణ లేదు. ఇలాంటి ఉత్సవాల పేరుతోనైనా ఏర్పాట్లు బాగా చేస్తే, నలుగురు వచ్చి పుస్తకాలు చదువుతారు. సంస్థా బాగుపడుతుంది….”

“కానీ నిశ్శబ్దం తప్ప మీకు దక్కింది ఏముంది? మీరు ఎంతగా శ్రమిస్తున్నారో నాకు తెలుసు…” శ్రావణి గొంతులో భర్త పట్ల సానుభూతి వ్యక్తమైంది.

“నిజమే. ప్రతీ వృత్తిలోను సాధకబాధకాలు ఉంటాయి. కానీ నా ఉద్యోగాన్ని ఏదో చాకిరీలా కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఆ బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నాననే ఆనందం నాకు దక్కుతోంది. ఈ రోజు సాయంత్రం ఏమైందో తెలుసా? మా లైబ్రరీలో పుస్తకాలు, పేపర్లు చదివి ప్రిపేరైన ఓ పేద అమ్మాయి డి.ఎస్సీ లో సెలక్టయింది. ఆమెకి రేపోమాపో ప్రభుత్వోద్యోగం వస్తుంది. ఆ అమ్మాయి ఎంతగా కృతజ్ఞతలు చెప్పిందనుకున్నావు? ఈ ఒక్క ఉదాహరణ చాలు, మా బాధ్యత ఎంత గురుతరమైనదో చెప్పడానికి. భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన‘ అనే శ్లోకాన్ని గుర్తుతెచ్చుకో. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం. ఫలితం భగవంతుడికి వదిలేద్దాం. ఇందాక నువ్వన్నావే – నిశ్శబ్దం తప్ప నాకు ఏం దక్కిందని? కాని ఆ నిశ్శబ్దానికి మరో వైపు ఎనలేని ఆత్మసంతృప్తి ఉంది. అది చాలు నాకు…..” చెప్పాడు మోహన్.

మూడేళ్ళ తర్వాత, జిల్లాలోనే ఉత్తమ లైబ్రేరియన్‌గా ఎంపికయ్యాడు మోహన్.

<<మొదటిపేజీ

~~~~~~~~~~~~~

కథా నేపథ్యం:
ఈ కథ మొదటిసారి ఆంధ్రభూమి వారపత్రికలో 16 సెప్టెంబరు 2004 సంచికలో ప్రచురితమైంది.

నేను 2004-05 మధ్య కాలంలో ఉద్యోగ రీత్యా విజయనగరంలో ఉండేవాడిని. కథలు, నవలలు చదవడం కోసం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్నాను. అక్కడి లైబ్రేరియన్‌గారితో బాగా పరిచయం అయ్యాక అప్పుడప్పుడు ఆయనతో నా కథలు, అనువాదాల గురించి, ఇతర సాహిత్యం గురించి చర్చిస్తుండేవాడిని. నేను ఎక్కువగా అనువాదాలు చేస్తుంటే, సొంత కథలు కూడా రాస్తూండాలని ఆయన చెప్పేవారు.

ఒకసారి మా సంభాషణల మధ్య – రోజులో చాలా సేపు మౌనంగా గడపడం లైబ్రేరియన్ల వ్యక్తిగత జీవితాల పై ఎలాంటి ప్రభావం చూపుతుందని అడిగాను. అలాంటిదేదైనా ఉంటే ఆ అంశంతో ఒక కథ రాస్తానని చెప్పాను. బదులుగా ఆయన లైబ్రేరియన్ల వృత్తిలో సాధకబాధకాలను ప్రస్తావించి, వాటి పై ఓ కథ రాయమని అడిగారు. వాళ్ళ విధినిర్వహణలో బయటి ప్రపంచానికి తెలియని చాలా ఇబ్బందులు ఉన్నాయని, వాటి గురించి కొందరికైనా తెలిస్తే, తమ సమస్యలు కొన్నైనా తగ్గుముఖం పడతాయని చెప్పారు.

భోగాపురం శాఖా గ్రంథాలయంలో పనిచేసినప్పుడు ఆయన ఎదుర్కొన్న సమస్యలని ప్రస్తావిస్తూ, ఆయన అందించిన వివరాలతో ఈ కథ అల్లాను. ఈ కథని నేను 2004 జూలైలో రాసాను. అయితే ఈ వాలుగేళ్ళ కాలంలో అ లైబ్రరీ సమస్యలు పరిష్కారమయ్యాయేమో నాకు తెలియదు. బ్రాంచి లైబ్రేరియన్లకి ఎదురయ్యే చాలా సమస్యలని చెప్పడం వల్ల కథ నిడివి కాస్త ఎక్కువైనట్లు అనిపిస్తుంది. కొందరికి ఇది ‘కేవలం సమాచారం ముద్దలా’ అనిపించినా, ఈ కథనం చదివిస్తుందని, ఆలోచింపచేస్తుందని నేను నమ్ముతున్నాను.

—————–

కొల్లూరి సోమశంకర్

అనువాద రచయితగా కొల్లూరి సోమశంకర్ సుపరిచితులే! 56 అనువాద రచనలు, 30 దాకా స్వంత రచనలూ (10 పిల్లల కథలతో సహా) చేసిన అనుభవం ఆయనది. 2004 లో మిత్రులతో కలసి 4 X 5 అనే కథా సంకలనం వెలువరించారు. 2006 లో, మనీ ప్లాంట్ అనే అనువాద కథా సంకలనం వెలువరించారు.

ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి తెలుగు కథలని హిందీలోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతానికి 4 కథలని అనువదించారు. 3 కథలు అచ్చవగా, నాల్గవది (ప్రముఖ కథా రచయిత శ్రీ కె.వి.నరేందర్ రాసిన “చీపురు” అనే తెలుగు కథకి అనువాదం) పరిశీలనలో ఉంది.

గతంలో కొన్ని దిన పత్రికలలో శీర్షికలు కూడా నిర్వహించారు. వ్యాసాలు రాసారు. సొంత కథలు, అనువాదాలు వివిధ తెలుగు పత్రికలలోనూ, వివిధ వెబ్‌జైన్లలోనూ ప్రచురితమయ్యాయి.

సోమశంకర్ రచనల పూర్తి జాబితా కోసం ఆయన బ్లాగు చూడవచ్చు

About కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలు హిందీలోకి అనువదించారు. కొన్ని దిన పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి.

2006లో ”మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో ”4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు.

వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. Carlo Collodi రాసిన, ’ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలని, అమార్త్య సేన్ రచన ”ది ఇడియా ఆఫ్ జస్టిస్”ని, ఎన్.సి.పండా రాసిన ”యోగనిద్ర”ని, Tejguru Sirshree Parkhi రాసిన ” ది మాజిక్ ఆఫ్ అవేకెనింగ్”ని తెలుగులోకి అనువదించారు.

సోమ శంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com అనే బ్లాగు చూడచ్చు.
వెబ్‌సైట్: http://www.teluguanuvaadam.com

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

14 Responses to నిశ్శబ్దానికి మరోవైపు

  1. అన్వేషి says:

    లైబ్రరీ లను మనం/మన ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామన్న ప్రస్తుత పరిస్థితికి మీ కథ అద్దం పడుతుంది. లైబ్రరీలు మన జీవితాల్ని ఎంతో ప్రభావితం చేస్తాయన్నది అక్షర సత్యం. మొన్నీ మధ్య హైదరాబాదులో ఒక నెల రోజుల పాటు వున్నప్పుడు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్ గంజ్ లో చాలా సమయం గడిపాను. అద్భుత మైన కలెక్షన్ అక్కడ వుంది. అసలు అక్కడ లేని పుస్తకం ఏదైనా ఉందా అని వెతికితే దాదాపు ప్రతీ పుస్తకం దొరికింది నాకు. కానీ పుస్తకాలు వెతుక్కోడానికి నా మొబైల్ ఫోన్ ని ఒక టార్చ్ లైట్ లా ఉపయోగించాల్సి రావడం మన లైబ్రరీల దయనీయ పరిస్థితిని సూచిస్తుంది.
    పక్కనే ఉన్న టాయిలెట్ నుంచి వీస్తున్న సువాసనలు భరించలేక ఒక చేత్తో ముక్కు పట్టుకుని, అందని ఎత్తులో చీకట్లో వున్న పుస్తాకాలను చేరలేక అష్టకష్టాలు పడ్డా కూడా కావలసి పుస్తకం ఇంకా ఎక్కడో దగ్గర దొరుకుతుందనే ధైర్యం నన్ను చాలా రోజులు ఆ లైబ్రరీలో అతిధిగా ఉండనిచ్చింది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థుతుల్లో ఆ పుస్తకాలు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయో అన్న అనుమానం ఇంకా వేధిస్తూనే వుంది.
    ప్రజల్లో చైతన్యం తేవడానికి పుస్తకాలు ఎంతో అవసరం, ఆ పుస్తకాల నిలయమైన లైబ్రరీలు మనకిప్పుడూ అత్యవసరం. కానీ మరి కొన్నేళ్ళలో ఈ లైబ్రరీలు మూతబడకపోయినా ఇంకా ఘోరంగా దిగజారే పరిస్థితి కనిపిస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు చేపట్టకపోవడం ఎంతో ఆశ్చర్యకరంగా వుంది.
    పురాతన భవంతి లో ఉన్న మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లో ఉక్కపోత, దుమ్ముకొట్టుకుపోయిన పుస్తకాలు, ఈ ఎలక్ట్రానిక్ యుగంలో కూడా ఒక కంప్యూటరైజ్డ్ కాటలాగ్ లేని పరిస్థుతులు ఇలాగే కొనసాగకుండా ఎవరైనా ఏదైనా చేయాలి.
    ఒక విధంగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కంటే చిక్కడపల్లి లో ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీ కొంచెం మేలు. అక్కడ కొన్ని గదులు ఎయిర్ కండిషన్డ్ కాబట్టి జనాలు బాగానే వస్తూంటారు. చాలా మంది నిద్రపోవడానికే అనేది వేరే సంగతి.
    ఇక్కడ పూర్తిగా పనిచేయని ఒక కంప్యూటరైజ్డ్ కాటలాగ్ కూడా వుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థుతుల్లో చాలా కొద్ది రోజుల్లోనే ఎన్నో విలువైన పుస్తకాలు మనకు అందకుండా పోతాయనడానికి అక్కడ ఎన్నో సాక్ష్యాలున్నాయి.
    కనీసం పాత పుస్తకాలను సేల్ పెట్టి నా కూడా ఎక్కడో దగ్గర ఆ పుస్తకాలు ఉంటాయి. కానీ అలాంటి ప్రయత్నాలు కూడా ఏం జరగటం లేదు.
    మనందరం ఈ విషయం పై చర్చింది ప్రభుత్వానికి విన్నవించుకోవడమో లేదా అక్కడి పుస్తకాలన్నింటినీ డిజిటల్ గా మార్చి రక్షించుకోవడమో ఏదో చెయ్యకపోతే కష్టమే.

  2. జాన్ హైడ్ కనుమూరి says:

    గ్రంధాలయాల గురించిన టపాలతో సంకలనం చెయ్యాలనుకున్న నాకు ఆశ్చర్యానికి గురిచేసింది.

  3. chavakiran says:

    ప్రస్తుతం కూడా పరిస్తితులు ఇలాగే ఉన్నాయి.

    ఏదో ఒకటి చెయ్యాలి.

    ముందు బిల్డింగులు కట్టించాలి

    తరువాత ఫర్నిచర్

    తరువాత పుస్తకాలు

  4. ఈ కథ చదవడం ద్వారా నాకు అర్థమైందేమిటంటే వాటికంటే ముందు మనం –

    మనకు దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి వారానికి ఒకసారైనా వెళ్ళడం, అక్కడ మనకు పనికొచ్చే పుస్తకాలు ఒకటి రెండున్నాసరే సభ్యులుగా చేరడం అత్యవసరం అని.

    1993 నుంచి లైబ్రరీలలో నవలలు తెప్పించడం మానేసారు. కాంపిటీటివ్ పుస్తకాలు, ఇయర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, కథా సంకలనాలు వంటివే తెప్పిస్తున్నారు.

    అని ఈ కథలో ఉన్నప్పటికీ 2007 నుంచి లైబ్రరీలలో కథాసంకలనాలతో సహా సాహిత్యపుస్తకాలను తెప్పించడం పూర్తిగా మానేశారు. ఇలా ఒక్కొక్కటే తగ్గించుకుంటూ అసలు గ్రంథాలయాలనే పూర్తిగా ఎత్తేస్తారేమో అని భయమేస్తోంది.

  5. అవును, కథలాగా లేదు కానీ సాధక బాధకాలన్నీ బాగా చర్చించారు. మీ రచన శైలి సరళంగా ఉండి హాయిగా చదివిస్తుంది. అసలు కథకీ, వార్తా కథనానికి మధ్య ఇంకో వర్గాన్ని సృష్టించవచ్చునేమో ఇటువంటి కథనాలతో. వెస్టులో ఇలాంటి పుస్తకాలు అమ్ముతుంటారు .. “A fictionalized account fo a real even” అని

  6. సగటు దేశీయుని “స్వార్ధపూరిత” స్వలాభేపేక్ష అనే చదపురుగు, ఒక్క గ్రంధాలయాల్లో ముక్కి మూలుగుతున్న పుస్తకాలకే కాదు,

    కార్యాలయాల బల్లలకు, దేవాలయాల భూములకు,
    శౌచాలయాల సొంపులకు, విద్యాలయాల విలువలకు
    రాజకీయాల విశ్వసనీయతకు, చివరకు మన మనుగడకే పట్టిన ….

    పోనీ గ్రంధాలయాలకు ప్రత్యామ్నాయలను వెతుకుదామంటే,

    “ఏమున్నవి ఏ పొత్తము చదువనెరింగిన, విషాక్షర బీజములు తప్ప,
    ఏమున్నవి ఏ చిత్తము చదువనెరింగిన, అపనమ్మకపు అంకురములు తప్ప”

  7. radhika says:

    civaidaakaa cadivimcimdamDi.kadha modalu saadaagaa praarambhamainaa civariki vacheasariki mamci feel ni ichindi.

  8. @అన్వేషి గారూ, @చావా కిరణ్ గారూ, @ సుగాత్రి గారూ: గ్రంథాలయాలను ఎలా కాపాడుకోవాలనే అంశం పై చర్చను ప్రారంబించి, సూచనలు చేసినందుకు నెనరులు.
    @జాన్ హైడ్ గారూ, పొద్దు వారికి అభ్యంతరం లేకపోతే ఈ కథని బ్లాగరులు గ్రంథాలయాలపై రాసిన టపాలతో మీరు కూర్చదలచిన సంకలనంలో చేర్చండి.
    @కొత్తపాళీ గారూ, @ రాధిక గారూ,
    నెనరులు.

  9. krishna says:

    I remember going to the competetions held for this in my school age and were not happy about the prize books they gave me when I won.I was expecting some good autobiographys like ghandhi and nehru etc,but they used to give books like “jeevam ela puttindi?” Now I know the otherside.

    This story is truly an eye opener.

  10. కొల్లూరి సోమ శంకర్ says:

    @అసంఖ్య ధవళ గారూ, @ krishnaగారూ,
    నెనరులు.

  11. రాజేంద్రకుమార్ says:

    చాలా ఆలస్యంగా స్పందిస్తున్నాను,మన్నించాలి.ఇప్ప్టటివరకూ నాజీవితములో కనీసం పావు భాగానికిపైగా గ్రంధాలయాల్లో గడిపినవాడిని,ఒక చదువరిగా.లైబ్రరీలు లేని ఊర్లకు చిన్నప్పుడు అసలు వెళ్ళెవాడిని కాదు.

    ప్రభుత్వాల నిర్వహణలోని గ్రంధాలయాల తీరు నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నది,అందరికీ తెలిసిందీ,పాతసామెత.కానీ ప్రత్యేకబాధ్యతలతో,ప్రత్యేక నిధులతో నడిచే చాలా విశ్వవిద్యాలయాల గ్రంధాలయాలు ఇంకా కనాకష్టం గా బతుకీడుస్తున్నాయి.
    సుగాత్రి గారన్నట్లు మనమంతా ఏదో ఒక గ్రంధాలయములో సభ్యత్వం తీసుకోవటం వల్ల కాస్త ప్రయోజనం ఉండొచ్చు.ఆ నమ్మికతోనే నేను కొన్ని నెలలక్రితం విశాఖపట్నం పౌరగ్రంధాలయం లో శాశ్వతసభ్యత్వం తీసుకున్నా.

  12. hema says:

    manchi kadha

  13. కొల్లూరి సోమ శంకర్ says:

    @రాజేంద్రకుమార్ గారూ, @hema గారూ,
    నెనరులు.

  14. గ్రంధాలయాధికారి విధి నిర్వహణ లో ఇన్ని ముళ్లున్నాయా? కధ మాటెలావున్నా, కధనం ఆసక్తికరంగా వుంది. కధలోని వివరణ, చివర్లో ఏదైన ఓ సంఘటనకు నాందియేమోననుకున్నాను. అతడు ఉత్తమ గ్రంధాలాధికారి పురస్కారాన్నందుకున్నాడని, ఒక్క ముక్కలో తేల్చేసినట్లనిపించింది. మొత్తమ్మీద అభినందించదగ్గ ప్రయోగం.

Comments are closed.