మృతజీవులు – 18

– కొడవటిగంటి కుటుంబరావు

తరవాత వాళ్ళు రకరకాల పైపులు చూశారు, కొయ్యవీ, మట్టివీ, కాల్చినవీ, కాల్చనివీ, షాణమాయ్ తోలు కప్పినవీ, కప్పనివీ, ఆ మధ్య పేకాటలో గెలుచుకున్న ఒక చిబూక్ పైపు, అంబరు నోటి గొట్టం కలదీ, ఒక జమీందారిణి ఎంబ్రాయిడరీ చేసిన పొగాకు సంచీ – ఆమె అతన్ని ఎక్కడో కలుసుకుని అమాంతంగా ప్రేమించేసిందట. వాళ్ళు ముందుగా ఉప్పుచేపలు ఫలహారం చేసి తరవాత అయిదింటికి భోజనానికి కూచున్నారు. నజ్‌ద్ర్యోవ్ జీవితంలో తిండికీ ప్రాధాన్యత ఉన్నట్టు లేదు. వంటకాలు ఏమంత ఆకర్షవంతంగా లేవు, కొన్ని మాడాయి, కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి. వంటవాడు కేవలమూ దేవుడి మీద భారం వేసి, చేతికి ఏది చిక్కితే అదల్లా వేసేసినట్టు కనబడ్డాడు. ముందు చేతికి మిరియాలు దొరికితే మిరియాలు వేశాడు, తరవాత కాబేజీ దొరికితే అది వేశాడు, అలాగే పాలూ, మాంసమూ, బఠానీలూ – చేతికి అందినదల్లా అడ్డదిడ్డంగా వంటలో పడేసి, వేడిగా ఉండాలేగానీ ఏదో ఒక రుచి రాకపోదు అనుకున్నాడు.

సారాయిల విషయంలో మాత్రం నజ్‌ద్ర్యోవ్ చాలా శ్రద్ధ కనబరిచాడు. ఇంకా అందరికీ సూప్ వడ్డన కాకముందే అతను పెద్దపెద్ద గ్లాసుల్లో పోర్ట్ సారాహోసొటార్న్ అనే తెల్లద్రాక్షసారా అందిచ్చాడు. అతను ఒక మదీరాబుడ్డి, “ఏ ఫీల్డ్‌మార్షల్ అంతకంటే మంచిది తాగలేడు” ఆర్డరిచ్చాడు. మదీరా గొంతు మండేలాగే ఉన్నది. ఎందుకంటే సారా వర్తకులకు మదీరా ఎలా ఉంటే పల్లెటూరి ధనికులకు నచ్చేదీ బాగా తెలుసు, అందుకని వారు మదీరాలో రమ్‌గానీ, స్వచ్ఛమైన వోడ్కాగాని దట్టించేసి, రష్యను పెద్దమనుషుల జీర్ణకోశాల మీద భారం వేసేస్తారు. తరవాత నజ్‌ద్ర్యోవ్ ఇంకో బుడ్డీ తెప్పించాడు. అందులో బర్గండీ, షాంపేను కలిసి ఉన్నాయని అతడు చెప్పాడు. దాన్ని అతను బావకూ, చిచీకవ్‌కూ ధారాళంగా పోసేశాడు, అయితే తాను మాత్రం ఎక్కువగా తీసుకోలేదు. చిచీకవ్ ఈ సంగతిని క్రీగంట గమనించి, నజ్‌ద్ర్యోవ్ తన బావమరిదికి సారాపోస్తూ, మాట్లాడుతూ వున్న సమయంలో, తన గ్లాసులో ఉన్న సారాను ప్లేటులోకి వంచేశాడు. కొంచెం సేపయాక, నజ్‌ద్ర్యోవ్ ఇంకో సారా తెప్పించి, అది అచ్చగా మీగడ రుచిగా ఉంటుందన్నాడు, కానీ దాని అసలు రుచి ఘాటైన బ్రాందీని పోలి ఉన్నది. తరవాత ఇంకేదో జిగురుగా ఉన్న పదార్థం తాగారు. దానిపేరు సులువుగా జ్ఞాపకం ఉండేది కాదు, అదీగాక నజ్‌ద్ర్యోవ్ కొంతసేపైనాక దానిపేరు మరొకటి చెప్పాడు.

భోజనం ఎప్పుడో ముగిసింది, అతిథులు అన్ని రకాల సారా చవిచూశారు. కాని బల్లముందునుంచి యెవరూ లేవలేదు. బావ ఉండగా నజ్‌ద్ర్యోవ్‌తో తన అసలు పని మాట్లాడటం చిచీకవ్‌కు ఇష్టం లేకపోయింది; అది స్నేహపూర్వకంగా ప్రస్తావించే విషయం, బావ పరాయివాడు. అయినా అతన్ని చూసి ఏమాత్రమూ భయపడనవసరం లేదు. ఎందుకంటే అతను బాగా నిషా ఎక్కి కుర్చీలో జోగుతున్నాడు. అతను తన స్థితి ఏమీ బాగాలేదని గ్రహించి, బలహీనమైన గొంతుతో, చిమ్టాతో గుర్రం మెడకు పట్టీ తగిలించమని రష్యను రైతులు అన్న మోస్తరుగా, ఇంటికి పోతానన్నాడు.

“లేదు, లేదు. నువు వెళ్ళటానికి వీల్లేదు” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“కాదు, నన్ను వేధించకు, బాబూ, నేను నిజంగా వెళుతున్నాను. నీ ధోరణి ఏమీ బాగాలేదు”

“అదంతా తీసెయ్యి. ఒక్క నిమిషంలో పేకాటకు కూచుంటున్నాం”.

“వద్దు, నువ్వాడుకో బాబూ, నావల్లకాదు. మా ఆవిడ ఊరుకోదు. నేను వెళ్ళి సంత సంగతులన్నీ చెప్పాలి. తప్పదు, అదంతా చెప్పి మంచి చేసుకోవాలి. వద్దు, నన్ను నిలపకు.”

“మీ ఆవిడను పోయి…! మహ గొప్పపనే!”

“లేదురా, బాబూ. ఆవిడ చాలా మంచిది, ఆదర్శప్రాయమైనది, పతివ్రత, దొడ్డది. నాకు ఎంతో సేవ చేస్తుంది… మీరు నమ్ముతారో నమ్మరో. తలుచుకుంటే కళ్ళనీళ్ళొస్తాయి. వద్దు, నన్ను ఉండమనొద్దు. నేను సజావైనవాణ్ణి గనక వెళ్ళి తీరాలి. ఎంతొట్టు బడితే అంతొట్టు”

“అతన్ని వెళ్ళనివ్వరాదూ? ఉండి ఏంచేస్తాడూ?” అన్నాడు చిచీకవ్ నజ్‌ద్ర్యోవ్‌తో.

“అదీ నిజమే. ఈ ఏడుపుగొట్టువాళ్ళంటే నాకు చెడ్డ చికాకు.” అని నజ్‌ద్ర్యోవ్ గట్టిగా, “ఇంకేం, వెళ్ళి పెళ్ళాంతో కులుకు, వాజమ్మా!” అన్నాడు.

“నన్ను తిట్టకురా బాబూ, నేనావిడకు, నా భార్యకు, చాలా రుణపడి ఉన్నాను. ఎంతో దయగలది, మంచిది. నన్నెంతో బాగా చూస్తుంది. కళ్ళవెంబడి నీళ్ళు తెప్పిస్తుంది. సంత విశేషాలేమిటని అడిగితే చెప్పాలి… చాలా మంచి మనిషిలే!”

“ఇంకేం వెళ్ళూ… ఆవిడకి సొళ్ళు కబుర్లన్నీ చెప్పు! ఇదుగో నీ టోపీ”.

“అహ, నువ్వావిణ్ణి గురించి అలా మట్లాడరాదురా బాబూ. ఆవిణ్ణి అలా అనడం నన్ను అవమానించడమే, అంత మంచిది.”

“సరే అయితే వెళ్ళి ఆవిడ దగ్గర వాలు”

“నిజమేరా బాబూ. నేను పోతున్నాను. ఉండనందుకు నువు మరోలా అనుకోవద్దు. నాకూ ఉండాలనే ఉందిగాని, వీల్లేదు”. ఈ ధోరణిలో బావ అన్నదే మళ్ళా అంటూ చాలాసేపు క్షమాపణలు చెప్పాడు తాను బండిలో ఉన్న సంగతీ, బండి గేటు దాటి పొలాల మధ్యగా పోతున్న సంగతీ కూడా గమనించకుండా. అతని భార్యకు సంత సంగతులేవీ తెలియలేదని మనం అనుకోవచ్చు.

వెళ్ళిపోతున్న బండిని కిటికీ వద్ద నిలబడి చూస్తూ నజ్‌ద్ర్యోవ్ “ఎంత పనికిమాలిన చవట! బండి ఎలా పోతున్నదో చూడు, ఆ పగ్గపు గుర్రం ఫరవాలేదు. దాన్ని ఎలాగైనా కాజెయ్యాలని ఎంతోకాలంగా చూస్తున్నాను, కాని దారికిరాకుండా ఉన్నాడు. వాజ, వట్టివాజ!” అన్నాడు.

తరవాత వాళ్ళిద్దరూ ఇంకో గదిలోకి వెళ్ళారు. పర్ఫీరి కొవ్వొత్తులు తెచ్చాడు. గారడీ లాగా నజ్‌ద్ర్యోవ్ చేతిలో పేకముక్కలు ప్రత్యక్షం కావటం చిచీకవ్ గమనించాడు.

“అయితే ఏమోయ్. కాలక్షేపం కోసం మూడువందల రూబుళ్ళు బాంకు పెడతాను”, అంటూ అతను చేతిలో ఉన్న పేకను వేళ్ళతో కొంచెంగా నొక్కి వంచేసరికి, దానికి చుట్టి ఉన్న కాగితం చినిగి పడిపోయింది.

చిచీకవ్ అతని మాటలు విననట్టు నటించి, అప్పుడే తట్టినట్టుగా “అన్నట్టు, నేను నిన్ను ఒక విషయం అడగాలి” అన్నాడు.

“ఏమిటది?”

“చేస్తానంటే చెబుతాను”

“అదేమిటని?”

“ముందు మాట ఇయ్యి”

“సరే”

“ప్రమాణపూర్తిగానా?”

“ప్రమాణపూర్తిగా!”

“విషయం ఇదీ! జనాభా లిస్టు నుంచి ఇంకా కొట్టెయ్యకుండా నీ కమతగాళ్ళు చాలామంది చచ్చిపోయి ఉంటారనుకుంటాను?”

“ఉన్నారు, దేనికీ?”

“వాళ్లను నా పేరబెట్టు”

“వాళ్ళతో నీకేం పనీ?”

“ఏంలేదు, నాకు కావాలి”

“ఎందుకు?”

“ఏంలేదు, నాకు కావాలి… అది నా గొడవ, నిజానికి వాళ్ళతో నాకు పని ఉంది”.

“ఏదో ఎత్తుగడ ఆలోచించావనుకుంటాను. చెప్పెయ్యి. ఏమిటది?”

“ఎత్తుగడ ఏముందీ? అంత పనికిమాలిన సరుకుతో ఎత్తుగడ ఏముంటుందీ?”

“మరి వాళ్ళను ఏం చేసుకుంటావు?”

“ఈ మనిషికి అక్కర్లేంది లేదే! ప్రతి పనికిమాలిన విషయంలోనూ వేలు పెడుతాడు, జోక్యం చేసుకుంటాడు!”

“మరి నాతో ఎందుకు చెప్పవూ?”

“తెలుసుకున్నందువల్ల నీకేం ఒరుగుతుందీ? ఇది నా సరదా”.

“సరే అయితే, నువు చెబితేగాని నేను చెయ్యను”

“చూశావా ఇది మర్యాద అయిన పని కాదు, ప్రమాణం చేసి మాట తప్పుతున్నావు”

“ఏమన్నా అనుకో. కాని నువు నిజం చెప్పినదాకా నేనేమీ చెయ్యను”

“వీడితో ఏమని చెప్పేది?” అని చిచీకవ్ తనలో అనుకుని, ఒక నిమిషం ఆలోచించి, ప్రస్తుతం తన వద్ద మాన్యాలేమీ లేవనీ, తన హోదాను చచ్చిపోయిన కమతగాళ్ళతో పెంచుకోదలచాననీ, మాన్యాలు దొరికేదాకా ఏ బాపతు కమతగాళ్ళతోనైనా తృప్తిపడతాననీ అన్నాడు.

అతని మాట పూర్తికాకముందే నజ్‌ద్ర్యోవ్, “వట్టి అబద్ధాలు, వట్టి అబద్ధాలు! వట్టి అబద్ధాలోయ్” అన్నాడు.

తాను చేసిన కల్పన నమ్మదగినట్టుగా లేదనీ, బొత్తుగా చచ్చు సాకులాగా ఉన్నదనీ చిచీకవ్ గ్రహించి, “సరే పోనీ అసలు సంగతి చెప్పేస్తాను. దయచేసి మరెవరితోనూ అనవద్దు. నేను పెళ్ళాడబోతున్నాను. కాని నా కాబోయే మామగారూ, అత్తగారూ దురాశాపరులు. చెడ్డచిక్కు వచ్చిపడింది. ఈ పెళ్ళి ఎందుకు తలపెట్టానా అనుకొంటున్నాను. వాళ్ళమ్మాయిని పెళ్ళాడేవాడికి మూడు వందలమంది కమతగాళ్ళయినా ఉండాలిట. నాకింకా నూటయాభైమంది దొరికితేగాని…” అన్నాడు.

“అదీ అబద్ధమే, ఒప్పేసుకో!” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“నిజంగా ఇది కూడా అబద్ధం కాదు.” అంటూ రెండువేళ్ళ కొసలు కలిపిపెట్టి చూసాడు.

“అబద్ధమాడుతున్నావని నా తల ఒడ్డేస్తాను!”

“ఇది చాలా అన్యాయం. నన్ను గురించి ఏమిటి నీ అభిప్రాయం? నేను అబద్ధమాడుతున్నానని ఎలా చెప్పగలుగుతున్నావు?”

“ఎందుకంటే నీ సంగతి నాకు తెలుసుగనక; నువు లుచ్ఛావి! స్నేహపూర్వకంగా చెబుతున్నాను. నేను నీ పై అధికారినైతే అందుబాటులో ఉన్న చెట్టుకు ఉరితీసి ఉందును”

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.

3 Responses to మృతజీవులు – 18

  1. KOLLURU SIVA NAGESWARARAO says:

    VERY NICE

  2. chandrasekhar says:

    మృతజీవులు చాలా గొప్ప నవల. పాతికేళ్లకుపైగా ఐంది చదివి. Great satire. ప్రపంచ సాహిత్యంలోని అతి కొద్ది గొప్ప satire లలో ఒకటి. మళ్లీ గుర్తు చేసినందుకు థాంక్స్.

  3. chandrasekhar says:

    తెలుగులో నాకు తెలిసినంతవరకు ఇటువంటి నవల లేదు. చిలకమర్తి గణపతిని ఒక రకంగా దీంతో పోల్చవచ్చు.

Comments are closed.