ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికరంగం

-కొణతం దిలీప్

“అభివృద్ధిని అర్థం చేసుకోవడం చాలా తేలిక. అదే సమయంలో చాలా కష్టం కూడా. అభివృద్ధి చాలా బలంగా కనపడుతుంది కాబట్టి దానిని అర్థం చేసుకోవడం సుళువు. అదే సమయంలో అభివృద్ధిని అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టమైన వ్యవహారం. ఎందుకంటే మిరుమిట్లు గొలిపే అభివృద్ధి వెలుగుల మధ్య అది సృష్టించే నల్లని చారలు మన కంటికి కనపడవు”

ఆర్. ఎస్. రావు (ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త)

మేం ప్రయాణిస్తున్న ఏసీ ఇండికా కారు ముంబై హైవేపై పరుగులు తీస్తోంది. సిటీకి దాదాపు పాతిక కిలోమీటర్ల దూరంలో కొత్తగా వెలసిన ఒక రిసార్టుకు ఆఫీసు నుండి మా టీం సభ్యులమంతా పిక్నిక్ కొరకు బయలుదేరాం. అప్పటి దాకా వాతావరణం గురించీ, హైదరాబాద్ ట్రాఫిక్ గురించీ జరిగిన మా కబుర్లు హఠాత్తుగా రాజకీయాలపైకి మళ్లాయి. వెనుక సీట్లో ఉన్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన కొలీగ్ అన్నాడు – “You guys from Andhra are really lucky, man. You have a great leader like Chandra Babu Naidu”. ఆ మాట నేను వినడం అది మొదటిసారి కాదు. రాష్ట్రం వెలుపలి నుండి వచ్చిన వారెవరైనా చంద్రబాబును పొగడకుండా ఉండటం అరుదు. అందులో యువత మరీను. అన్న ఎన్.టి.ఆర్. తెలుగు వాడి ఖ్యాతిని డిల్లీ దాకా తీసుకువెళ్తే మన బాబుగారేమో ఆ ఖ్యాతిని దేశ తీరాలను దాటించి న్యూయార్క్, వాషింగ్టన్ దాకా వ్యాపింపజేశాడు. ఇంత పేరు సంపాదించడానికి మీడియా కన్సల్టెంట్లకు తగలేసిన ప్రభుత్వ సొమ్మెంత అనేది వేరే విషయం.

మన రాష్ట్రానికి ఉన్న అప్పు దాదాపు లక్షకోట్లు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో దాదాపు 50 వేల కోట్ల పై చిలుకు ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మింది. అప్పులు తెచ్చుకుని, ఆస్తులు అమ్ముకుని సాధించే అభివృద్ధికి ఏమైనా అర్థం ఉందా?

నేను చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కొంచెం మాత్రమేనని, ఆ సమయంలోనే రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ అప్పుల విషవలయంలో చిక్కుకు పోయిందని చెప్పానా అబ్బాయికి.

“వరల్డ్ బ్యాంక్?” ప్రశ్నార్ధకంగా మారిందా అబ్బాయి ముఖం.

“Is it some bank like Citi Bank?” అని అడిగాడా యువకుడు.

నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. రాజకీయార్ధిక విషయాలపై మన దేశపు యువతలో ఉన్న విషయపరిజ్ఞానానికి ఆ కుర్రాడు ఒక ఉదాహరణ మాత్రమే.

మనదేశంలో సంస్కరణలకు ఆద్యుడిగా, ఒక పోస్టర్ బాయ్ గా నిలిచినవాడు చంద్రబాబు. అటువంటి వ్యక్తి ఇటీవలి కాలంలో మండుటెండల్లో ఉరూరా తిరుగుతూ వ్యవసాయానికి 12 గంటల ఉచిత కరెంటు ఇస్తానని తిరగడం ప్రపంచీకరణ సమర్థకులకు ఒక చెంపపెట్టు వంటిది. ఒక విధంగా ఇది ప్రజల విజయం. చంద్రబాబు నాయుడిని 2004 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తే గానీ.., ఈ దేశప్రభువులకు సంస్కరణలు దారి తప్పుతున్నాయని తెలియ రాలేదు. ఎన్ని హైటెక్కులొచ్చినా బువ్వపెట్టే వాడు రైతన్నేనని, అతనికి మేలు చేయని ఏ విధానమూ దేశానికి మేలు చేయదనీ మత్తు వదిలేలా చేసినవాడు మన తెలుగు రైతన్నే. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికరంగం ఎలా ఉందో, సమీప భవిష్యత్తులో అది ఎలా ఉండబోతుందో అన్నది రేఖామాత్రంగా చర్చించడమే ఈ వ్యాసోద్దేశం.


రాష్ట్ర ఆర్ధిక రంగం- ప్రస్తుత స్థితి

పోయిన సంవత్సరం రాష్ట్రంలో స్థూల వార్షికోత్పత్తి (GSDP) దాదాపు పది శాతం పెరిగి 2,29,461 కోట్లకు చేరుకుంది. అన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లాగే మన రాష్ట్ర ఆర్ధిక రంగం కూడా మెల్లగా ప్రాథమిక రంగమైన వ్యవసాయం నుండి తృతీయ రంగం అయిన సేవల వైపు మళ్లింది. ఒకప్పుడు మన రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 65 శాతాన్ని సమకూర్చిన వ్యవసాయ రంగం వాటా ఇప్పుడు 26 శాతానికి పడిపోయింది. ద్వితీయ రంగమైన పరిశ్రమల వాటా 9 శాతం నుండి 21 శాతానికి చేరగా, సేవల (ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, హోటల్స్, ఇన్స్యూరెన్స్ వంటివి) వాటా 27 శాతం నుండి 52 శాతానికి పెరిగింది.

ఈ యేడు మన రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు దాటింది. ఇది బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల బడ్జెట్ల కన్నా ఎక్కువని మన ఆర్థిక మంత్రి చెప్పారు కూడా. మన వ్యవసాయ వృద్ధి రేటు 8.38 శాతం. జాతీయ స్థాయిలో ఇది 2.59 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ప్రస్తుత సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 180 లక్షల టన్నులు ఉండగలదని అంచనా; ఇదొక రికార్డు. తలసరి ఆదాయ వృద్ది రేటు జాతీయ స్థాయిలో 7.55 శాతం ఉంటే మన రాష్ట్రానిది 9.35 శాతం ఉంది. ఇవన్నీ సంతోషించాల్సిన విషయాలే. అయితే ఈ మెరుపుల వెనుక కనపడని మరకల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ అభివృద్ధికి సరైన కారణాలు, దీనికి చోదక శక్తిగా పనిచేస్తున్న వ్యక్తులు, శక్తులు, విధానాల గురించి మనం అలోచించాలి. కొన్ని గణాంకాలు వాటికవే కథ మొత్తాన్నీ చెప్పవు. దాని వెనుకున్న ఇంకొక గణాంకం తెలిస్తే కానీ దాని రెలెవెన్స్ అర్థం కాదు.

ఒక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. దేశంలో ఎక్కడా జరగనంత మెరుగ్గా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన రాష్ట్రంలో అమలవుతుంది. లబ్దిదారులకు జాబ్ కార్డులు ఇచ్చి, పోస్టాఫీసు ద్వారా చెల్లింపులు జరిపి మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా నిలిచింది. కొన్ని లక్షల మంది పేదలు ఈ పథకం వల్ల లబ్ది పొందారు.

ఒకసారి ఈ గణాంకాలు కూడా చూడండి. స్థూల రాష్ట్రోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా గత నాలుగు దశాబ్దాల్లో సగానికి సగం తగ్గగా ఆ రంగంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య మాత్రం 8 శాతమే తగ్గింది. దీనర్ధం ఏమిటంటే తక్కువ మంది ఆధారపడ్డ రంగం ఎక్కువ సంపాదిస్తుంటే, ఎక్కువమంది ఆధారపడ్డ రంగం తక్కువ సంపాదిస్తున్నది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగడం రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం సర్వీసుల రంగంపై ఆధారపడి మనవంటి రాష్ట్రం అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. వ్యవసాయ వృద్ధి రేటు పడిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సకాలంలో రుతుపవనాలు రావడం వల్ల నీటి లభ్యత పెరగడం, ఉచిత విద్యుత్తు మూలంగా ఇప్పుడు వ్యవసాయ రంగం పరిస్థితి ఫర్వాలేదు.కానీ ఈ రెండిట్లో ఏది లేకపోయినా మళ్ళీ కథ మొదటికొస్తుంది.

మన రాష్ట్రానికి ఉన్న అప్పు దాదాపు లక్షకోట్లు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో దాదాపు 50 వేల కోట్ల పై చిలుకు ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మింది. అప్పులు తెచ్చుకుని, ఆస్తులు అమ్ముకుని సాధించే అభివృద్ధికి ఏమైనా అర్థం ఉందా?

అభివృద్ధికి అసలైన కొలమానంగా భావించే మానవాభివృద్ధి సూచిక (Human Development Index)లో ఆంధ్ర ప్రదేశ్ 1991 సంవత్సరంలో 9వ స్థానంలో ఉంటే 2001 నాటికి 10వ స్థానానికి దిగజారింది. ఇక కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మానవాభివృద్ధి నివేదిక (Human Development Report) ను తయారుచేస్తానని చెప్పి ఆ మేరకు నిధులు కూడా పొందిన రాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ తయారయినా బయట పెట్టట్లేదు. ఆ నివేదిక బయటికి వస్తే ఈ అభివృద్ధి బండారం బయటపడుతుందని భయం.

పేరుకు పెద్ద బడ్జెట్ అని ఇప్పుడు ఢంకా బజాయించినా అనేక రంగాలకు ఘనమైన కేటాయింపులు జరిపి యేడాది చివరకు అందులో చాలా నిధులు ఖర్చు చేయకపోవడం, చేసినా ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో ఆదరా బాదరాగా ఖర్చు చేసి వృధా చేయడం గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం వంటి రంగాలకు కోతపెట్టి డబ్బు ఆదా చేసే పద్ధతి ఏ మాత్రం సమర్ధనీయం కాదు.

రెండు రూపాయలకు కిలో బియ్యం పధకానికి ఈ బడ్జెట్లో 1980 కోట్లు కేటాయించారు. పేదవారికి తక్కువ ధరలో బుక్కెడు బువ్వ పెట్టాలనుకోవడం సంతోషమే కానీ అదే సమయంలో ఆ పథకం అమలుకు అవసరమైన డబ్బులు ఆబ్కారీ ఆదాయం పెంచుకోవడం ద్వారా సమకూర్చుకోవాలనుకోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. పేదల కుటుంబాలను గుల్లచేసేటట్టు మద్యం పారించి ఆ డబ్బుతోనే వారికి సబ్సిడీ బియ్యం ఇవ్వడం ఏ విధంగా సంక్షేమ రాజ్యం అవుతుందో ఏలికలే చెప్పాలి.

ఒక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. దేశంలో ఎక్కడా జరగనంత మెరుగ్గా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన రాష్ట్రంలో అమలవుతుంది. లబ్ది దారులకు జాబ్ కార్డులు ఇచ్చి, పోస్టాఫీసు ద్వారా చెల్లింపులు జరిపి మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా నిలిచింది. కొన్ని లక్షల మంది పేదలు ఈ పథకం వల్ల లబ్ది పొందారు.

ఇక బడ్జెట్లో అన్ని ప్రాంతాల మధ్య సమతులనం పాటించడం ప్రభుత్వ బాధ్యత. తెలంగాణా ప్రాంతంలో వచ్చిన రాబడిని ఆంధ్ర ప్రాంతానికి వినియోగిస్తున్నారని ముప్ఫై యేళ్ల కిందటే లలిత్ కమిటీ తేల్చి చెప్పినా, గత సంవత్సరం కూడా రాష్ట్ర శాసనసభలో ఆర్ధిక మంత్రి ఈనాటికీ అలాగే జరుగుతున్నదని ఒప్పుకోవడం ప్రాంతీయ భావాలు ఇంకా రెచ్చగొట్టే అంశమే.

ప్రపంచ బ్యాంకు – చంద్రబాబు – వైయెస్

భారత్ వంటి ఫెడరల్ దేశాల్లో రాష్ట్రాల ఆర్ధిక రంగాలు అనేక విషయాల్లో కేంద్ర నిర్ణయాలను బట్టి ఉంటాయి. 1991 తరువాత మన దేశంలో సరళీకరణ పేరిట జరిగే అనేక విధాన నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం పెద్దగా లేదు. అయితే రాష్ట్ర స్థాయిలో జరిగే అనేక విధాన నిర్ణయాల్లో ఎటువంటి దారిలో వెళ్లాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంది.

ఇక ప్రపంచ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వాన్ని బైపాస్ చేసి నేరుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే వ్యవహారాలు నడపడం, రాష్ట్ర ఆర్ధిక రంగంలో నేరుగా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది ఆంధ్ర ప్రదేశ్ లోనే. ఒక విధంగా మన రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ ఒక Lab Rat గా, ఒక Guinea Pig గా వాడుకుంది.

చంద్రబాబు నాయుడు హయాంలో మన రాష్ట్రం సంస్కరణల అమలులో దేశానికే ఒక దిశా నిర్దేశం చేసే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణల విషయంలో కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి అయితే అవకాశం దొరికినప్పుడల్లా చంద్ర బాబును ఆకాశానికెత్తేవాడు. విద్యుత్ రంగంలో బాబు మొదలు పెట్టిన ప్రైవేటీకరణ ఘోరంగా విఫలమయ్యాక ఇప్పుడు ఆ మాటెత్తే ధైర్యం చేయట్లేదెవరూ. నాయుడుగారు మరొకసారి గెలిచి ఉంటే ఈ పాటికి సింగరేణి, ఆర్టీసి, హైదరాబాద్ మంచి నీటి సరఫరా ప్రైవేటుపరం అయ్యేవి. విద్యుత్ బోర్డులో అర్ధాంతరంగా ఆగిన ప్రైవేటీకరణ పూర్తి అయ్యేది.

ఇంకొన్నేళ్ల దాకా మన రాజకీయాలన్నీ వ్యవసాయ రంగం చుట్టే తిరుగుతాయనడంలో సందేహం లేదు. అయితే పరిస్థితి రాత్రికి రాత్రే వ్యవసాయానికి అనుకూలంగా మారలేదు. ఉచిత విద్యుత్తు ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన చంద్రబాబు మెడలు వంచి ఇప్పుడు నేను కూడా ఉచిత విద్యుత్తు ఇస్తాననే వరకూ తేగలిగింది ప్రజల చైతన్యమే.

చంద్రబాబు హయాంలో ప్రపంచ బ్యాంకు నేతృత్వంలో రాష్ట్రంలో జరిగిన సంస్కరణల యజ్ఞం వికటించింది. ఇప్పటి ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకు వద్ద అప్పులు చేస్తూనే ఉన్నా, బ్యాంకు షరతుల విషయంలో కొంచెం జాగరూకతతో వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తున్నది.

నాయుడు ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు చాలా అధ్వాన్నంగా ఉండేవి. ఏ పూటకు ఆ పూట అప్పుచేస్తే కానీ బండి నడవని పరిస్థితి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేసేది రాష్ట్ర ప్రభుత్వం. 2000-01 సంవత్సరంలోనయితే కొత్తగా తీసుకున్న అప్పులో 71% పాత అప్పులు తీర్చడానికే సరిపోయింది. ఆ అప్పుల భారం నేటికీ అలా పెరుగుతూనే ఉంది.

తాకట్టుపెట్టే వాడు పోయి అమ్మేవాడొచ్చాడు

ఏ హైదరాబాద్ చుట్టు పక్కలనయితే ఇంత అన్యాయంగా ప్రభుత్వం భూములు అమ్ముకుంటోందో అదే హైదరాబాద్ లో ఉన్న 800 గవర్నమెంటు స్కూళ్లలో 200 పైచిలుకు స్కూళ్ళు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయంటే మన అభివృద్ధి ఎంత డొల్లనో అర్థం అవుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త అప్పులు చేయడం కాస్త తగ్గినట్టే కనిపిస్తున్నా ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడానికి ప్రభుత్వం మరొక ప్రమాదకర పద్ధతి ఎంచుకుంది. సాక్షాత్తూ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ దళారీగా అవతారమెత్తింది. హుడా, హౌసింగ్ బోర్డ్, ఎ.పి.ఐ.ఐ.సి. వంటి సంస్థల వద్ద ఉన్న భూములను అందినకాడికి తెగనమ్మేస్తోంది. ప్రభుత్వశాఖలకు నెలవారీ టార్గెట్లు పెట్టి మరీ భూములు అమ్మడం ప్రపంచ చరిత్రలో ఇదివరకు ఎవరూ చేసి ఉండని పిచ్చిపని. ఎ.పి.ఐ.ఐ.సి అయితే తన వద్ద ఉన్న భూములే కాక యేటా కొన్ని వేల ఎకరాల భూములను రైతులనుంచి బలవంతంగా తక్కువ ధరలకు సేకరించి ప్రైవేటు కంపెనీలకు, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటోంది.

తాజాగా భూముల వ్యాపారం చేయడానికి డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించి పబ్లిక్ గా తాను దళారీ వ్యాపారం చేయాలనుకుంటున్నానని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటోంది మన రాష్ట్ర ప్రభుత్వం.

ఏ హైదరాబాద్ చుట్టు పక్కలనయితే ఇంత అన్యాయంగా ప్రభుత్వం భూములు అమ్ముకుంటోందో అదే హైదరాబాద్ లో ఉన్న 800 గవర్నమెంటు స్కూళ్లలో 200 పైచిలుకు స్కూళ్ళు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయంటే మన అభివృద్ధి ఎంత డొల్లనో అర్థం అవుతుంది.

భవిష్యత్తేమిటి?

రాష్ట్ర భవిష్యత్తే ప్రశ్నార్ధకమైన రోజులివి. ఆర్థిక రంగ భవిష్యత్తు చెప్పడం కొంచెం కష్టమే. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు కొత్త జలవనరులు ఏర్పాటు చేయడం, రుణాలు ఇప్పించడం, మార్కెటింగ్ సౌకర్యం మెరుగుపరచడం వంటి చర్యలు చేపడితే వ్యవసాయరంగం మనల్ని పదికాలాల పాటు చల్లగా ఉంచుతుంది. జల యజ్ఞం పనుల్లో జరుగుతున్న భారీ అవినీతిని అరికడితే గానీ అటువంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడవు.

సాఫ్ట్ వేర్ రంగంపై అమెరికా మాంద్యం నీలి నీడలు కమ్ముకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మాంద్యం ప్రభావం ఎక్కువైతే మనకు ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగావకాశాలపై దెబ్బపడటమే కాక అమెరికా నుండి మనవాళ్ళు పంపుతున్న డబ్బు (Remittances) కూడా తగ్గుముఖం పడుతుంది. సాఫ్ట్ వేర్ రంగం నుండి వచ్చే డబ్బులు తగ్గితే రాష్ట్ర ఆర్థిక రంగంపై కూడా స్వల్ప ప్రభావం ఉండక తప్పదు. ఏదేమైనా ఈ రంగం నుండి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంతో ఖచ్చితంగా అంచనా వేయాల్సిన సమయం వచ్చింది. పరిశ్రమ వృద్ధి దెబ్బతినకుండా ఈ రంగం నుండి ఆదాయం వచ్చే మార్గాలు అన్వేషించాలి.

ఇప్పటికే స్పెక్యులేషన్ తో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన రియల్ ఎస్టేట్ ధరలు నేల వైపు దిగి రావడం మొదలైంది. కొన్నాళ్లైతే రియల్ ఎస్టేట్ భూముల ధరలు స్థిరీకరణ పొందుతాయి. ఈ రంగంలో విచ్చలవిడిగా చలామణి అవుతున్న నల్లడబ్బుకు కళ్లెం వేయాలి. అప్పుడే రాష్ట్ర ఖజానాకు ఏమైనా లాభం వస్తుంది. రిజిస్ట్రేషన్ విలువలను హేతుబద్ధం చేయడం ఇందులో తొలిమెట్టు కాగలదు.

కొత్త ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నిస్తే మనకు రాబడి మార్గాలు చాలానే ఉన్నాయి. అప్పులు, ఆస్తుల అమ్మకం చేయకుండా కూడా ఈ రాష్ట్రాన్ని చక్కగా నడపొచ్చు. ఇనుము, బాక్సైట్, సహజ వాయువు, చమురు, బొగ్గు వంటి సహజ వనరులను ప్రభుత్వమే వెలికితీసి అమ్ముకుంటే యేటా వేలకోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. (ఒక్క సింగరేణి బొగ్గు అమ్మకం ద్వారానే 350 కోట్ల ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి)

ఇక సేల్స్ ట్యాక్స్, ఇతర వాణిజ్య పన్నులను సరిగ్గా వసూలు చేయడం ద్వారా ఇంకొన్ని వేలకోట్ల రూపాయలు సంపాదించవచ్చు.

ఇవన్నీ జరగాలంటే చిత్తశుద్ధి ఉండాలి. మరి రేపు వచ్చే కథానాయకులకు అది ఉన్నదా? కాలమే జవాబు చెప్పాలి.

——————-

కొణతం దిలీప్ కొణతం దిలీప్ తెలుగు జాల పాఠకులకే కాక, పుస్తక పాఠకులకు కూడా పరిచితులే. 2006లో ఇంగ్లీషులో ప్రచురితమయిన కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్‌మ్యాన్ ను ఒక దళారీ పశ్చాత్తాపం పేరిట తెలుగులోకి అనువదించారు. ఆ అనువాద పుస్తకం రెండేళ్లలో ఆరు ముద్రణలు పొందింది. అదొక రికార్డు.

దిలీప్ నల్గొండ జిల్లా మోత్కూరు పక్కనే ఉన్న ఆరెగూడెం గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వీ.వీ కాలేజిలో బీయస్సీ, వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుండి యెంబీఏ (మార్కెటింగ్) చదివి, ప్రస్తుతం హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో నాన్-సాఫ్టువేరు ఉద్యోగం చేస్తున్నారు.

దిలీప్ మొదటి రచన “సహస్రాబ్దికి స్వాగతం” అనే సీరియల్ 2000 సంవత్సరంలో స్వాతి వారపత్రికలో ప్రచురితమయ్యింది. ఆ పత్రిక నిర్వహించిన పోటీలో 25,000 రూపాయల నగదు బహుమతి గెల్చుకుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపట్ల తన అభిప్రాయాలను తన బ్లాగు – hridayam.wordpress.com – లో వెల్లడిస్తూంటారు. వీక్షణం పత్రికలో కూడా వ్యాసాలు రాస్తూంటారు.

About కొణతం దిలీప్

కొణతం దిలీప్ తెలుగు జాల పాఠకులకే కాక, పుస్తక పాఠకులకు కూడా పరిచితులే. 2006లో ఇంగ్లీషులో ప్రచురితమయిన కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్‌మ్యాన్ ను ఒక దళారీ పశ్చాత్తాపం పేరిట తెలుగులోకి అనువదించారు. ఆ అనువాద పుస్తకం రెండేళ్లలో ఆరు ముద్రణలు పొందింది. అదొక రికార్డు. దిలీప్ నల్గొండ జిల్లా మోత్కూరు పక్కనే ఉన్న ఆరెగూడెం గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వీ.వీ కాలేజిలో బీయస్సీ, వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుండి యెంబీఏ (మార్కెటింగ్) చదివి, ప్రస్తుతం హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో నాన్-సాఫ్టువేరు ఉద్యోగం చేస్తున్నారు. దిలీప్ మొదటి రచన “సహస్రాబ్దికి స్వాగతం” అనే సీరియల్ 2000 సంవత్సరంలో స్వాతి వారపత్రికలో ప్రచురితమయ్యింది. ఆ పత్రిక నిర్వహించిన పోటీలో 25,000 రూపాయల నగదు బహుమతి గెల్చుకుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపట్ల తన అభిప్రాయాలను తన బ్లాగు – hridayam.wordpress.com – లో వెల్లడిస్తూంటారు. వీక్షణం పత్రికలో కూడా వ్యాసాలు రాస్తూంటారు.
This entry was posted in వ్యాసం and tagged , , . Bookmark the permalink.

20 Responses to ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికరంగం

  1. మంచి విశ్లేషణాత్మకమైన వ్యాసం. చాలా బాగుంది. పాలకులు తమ విజ్ఞత చూపాల్సిన సమయం ఆసన్నమైంది.
    దిలీప్ గారికి, పొద్దు సంపాదక బృందానికి అభినందనలు

  2. Harish says:

    Hi Dil,
    Very good article.
    Harish

  3. Naveen Garla says:

    ఇలాంటి వ్యాసాలు పొద్దులో మరిన్ని ప్రచురించాలని కోరుతున్నాను

  4. sriku says:

    చాలా బాగా రాసారు , కాని కొన్నివిషయాల్లో మాత్రం నాకు మీ అభిప్రాయలు సరి అయినవిగా అనిపించడం లేదు , ఉదాహరణకి ఆస్తుల అమ్మకం తరవాత తెలంగాణా ప్రాంతంలో వచ్చిన రాబడిని ఆంధ్ర ప్రాంతానికి వినియోగిస్తున్నారని అనడం సరిగ్గాలేదు,
    తెలంగాణా అంటే బహుసా మీరు హైదరాబాద్ ని కలుపుకొని చెప్పి ఉండచ్చు
    హైదరాబాద్ అనేది రాష్ట్ర రాజధాని అది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకీ వర్తిస్తుంది

  5. వాసు.బొజ్జ says:

    మంచి విశ్లేషణాత్మకమైన వ్యాసం.చాలా చక్కగా రాసారు.
    sriku గారి అభిప్రాయమే నాది కూడా.
    అభినందనలు.

  6. > ఇనుము, బాక్సైట్, సహజ వాయువు, చమురు, బొగ్గు వంటి సహజ వనరులను ప్రభుత్వమే వెలికితీసి అమ్ముకుంటే యేటా వేలకోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. (ఒక్క సింగరేణి బొగ్గు అమ్మకం ద్వారానే 350 కోట్ల ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి)

    ఈ ముడి పదార్థాలని చైనాకి అమ్మాలా ? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు దేశంలో సహజ సంపదలని కొల్లగొట్టుకు పోయారు, ఇప్పుడు మనం చైనాకి ఈ ముడి పదార్థాలు అమ్ముతూ సంప్రదాయం కొనసాగిస్తున్నాం.

    సింగరేణి బొగ్గుని అమ్ముకోవడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నామా ? ఇది వ్యభిచారం చేసుకోవడం కన్నా హీనం. బొగ్గుని అర్జెంటుగా వాడడం మానాలి. వాతావరణాన్ని సర్వనాశనం చేస్తోందిది.

    మనం చైనాకి ముడి పదార్థాలు అమ్మితే, వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టి వస్తువులు అమెరికాకి, యూరపుకి అమ్మకం చేస్తారు. వాళ్ళ అభివృద్ధికి మనం సహజ సంపదలు సమర్పిచ్చినట్లు అవుతుంది.

    దేశం అభివృద్ధి చెందాలంటే ఫ్యాక్టరీలలో తయారు చేసిన వస్తువుల (finished goods) ఎగుమతుల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ ఎగుమతులు మేన్యుఫాక్చర్ గూడ్సు కావచ్చు సర్వీసు గూడ్సు కావచ్చు (సాఫ్టువేరు వగైరా).

    ముడిపదార్థాలు (raw materials) అమ్ముకోవడం, వ్యవసాయంపై జనాలని ఆధారపడాలనడం నిజంగా మూర్ఖత్వం. ఈ విధానాలపై ఆధారపడి అభివృద్ధి సాధించిన దేశం పేరు ఒక్కటి చెప్పండి.

  7. uma maheeswari says:

    mee abhiprayam chaala baagaa vyaktam chesinaaru

  8. అయ్యా వారణాశి కిరణ్ గారూ!
    మీకు తెలుసో లేదో ప్రభుత్వం సింగరేణి బొగ్గును ప్రభుత్వమే నడిపే థర్మల్ పవర్ ప్లాంట్లకు కూడా ‘అమ్ముకుంటోంది’. మన దేశంలో సంప్రదాయేతర ఇంధనవనరుల మీదకు ఇప్పుడిప్పుడే దృష్టి మళ్ళుతోంది. ప్రజలు బత్తీబంద్ లాంటి కార్యక్రమాల ద్వారా తమ వాణిని గట్టిగా వినిపించగలిగితే అది ఊపందుకుంటుంది. అంతవరకు ‘వాతావరణాన్ని సర్వనాశనం’ చేస్తోన్న థర్మల్ పవరే మనకు గతి. ఒక్క జలవిద్యుత్తునే నమ్ముకుంటే కిరసనాయిలు బుడ్లే మనకు గతి. అవి కూడా ‘వాతావరణాన్ని సర్వనాశనం’ చేస్తాయి. నిజానికి వాతావరణ కాలుష్యంలో బొగ్గుది స్వల్పపాత్రే. పారిశ్రామిక కాలుష్యమే అతిప్రమాదకారి. మీరేమో “దేశం అభివృద్ధి చెందాలంటే ఫ్యాక్టరీలలో తయారు చేసిన వస్తువుల (finished goods) ఎగుమతుల ద్వారానే సాధ్యమవుతుంది.” అంటున్నారు. జనం బతకాలంటే తిండి కావాలి. వ్యవసాయాన్ని విస్మరించడం ఆత్మహత్యాసదృశం. అదయ్యాక ద్వితీయ ప్రాధాన్యతారంగంగా ‘వాతావరణాన్ని నాశనం’ చేసే (నిజానికి నాశనమయ్యేది వాతావరణమొక్కటే కాదు. శిలావరణం, జలావరణం, వాతావరణం కలిసి మొత్తం పర్యావరణమే నాశనమౌతుంది.) వస్తూత్పత్తి (పారిశ్రామిక) రంగం కంటే సేవలరంగాన్ని అభివృద్ధి చేసుకోవడం మేలు.

  9. వారణాసి కిరణ్ గారూ,

    మంచి పాయింటు లేవనెత్తారు. నా ఉద్దేశ్యం ప్రభుత్వమే వెలికితీసి వినియోగించుకోవాలని. అంతే కానీ వేరే దేశాలకు “అమ్ముకోవాలని” కాదు. సరైన పదం వాడకపోవడం నా పొరపాటే.

    ఇనుప ఖనిజం ఎగుమతులపై నాకు అస్సలు సదభిప్రాయం లేదు. మన దేశంలో ఇళ్లు కట్టుకోవాలంటే స్టీల్ ధరలు మండిపోతున్నాయి. అదే సమయంలో మన కంపెనీలు గత రెండు దశాబ్దాలుగా విచ్చలవిడిగా ఇనుప ఖనిజాన్ని చౌకగా అటు జపాన్, ఇటు చైనాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఇది అరికట్టాల్సిన అవసరం ఉంది.

    ఇక బొగ్గు వాడకం అంటారా…అది మరొక చర్చ. ఒకే చోట అన్నిటిగురించీ మాట్లాడుకోలేం కదా…గమనించగలరు.

  10. బాగారాసారు. ఇలాంటి వ్యాసాలు నిష్పక్షపాతంగా ఉండాలి. చంద్రబాబుని దుయ్యబట్టడం ఆయన కంట్రిబ్యూషన్ ని సరిగా గుర్తించక పోవడం లాంటివి, ఇలాంటి వ్యాసాలవిలువ తగ్గిస్తాయి. ఇప్పటిదాకా మనరాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో విజన్ మాటెత్తినాయన బాబే. ఉచితవిద్యుత్తు ఇస్తాననే స్థితికి ఆయనని జనాలు తీసుకురావడాన్ని చైతన్యం అనడం అనార్ధికంగా లేదూ?

  11. సత్య సాయి గారూ,

    చంద్రబాబు హయాంలో జరిగిన సో కాల్డ్ అభివృద్ధి మనం ఎంతో తిట్టుకునే చాలా మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో కూడా జరిగింది/ జరుగుతున్నది అన్నది మనం ఒప్పుకుని తీరాల్సిన నిజం.

    ఇక విజన్ గురించి ప్రస్తావించారు. మీరు విజన్ 2020 డాక్యుమెంటును చదవాలి. మన రాష్ట్రం పై ఏమాత్రం అవగాహనలేని మెకన్సీ మేధావులు రాశారు ఆ డాక్యుమెంటును. అందులో ఉన్న సలహాలన్నీ పాటిస్తే మన సమాజం అల్లకల్లోలమవుతుంది. విజన్ 2020 డాక్యుమెంటుపై ఎన్. వేణుగోపాల్ రాసిన “అమ్మకానికి ఆంధ్రప్రదేశ్” కూడా చదవాలి మీరు. నిజంగానే విజన్ పత్రం అవసరం అయితే దానిని తయారు చెయ్యడానికి మన దేశానికి చెందిన ఎందరో మేధావులు, బ్యూరోక్రాట్లు ఉన్నారు. వారిని వదిలేసి ఇక్కడి పరిస్థితులపై, సమాజం పై అవగాహన లేని ఒక బహుళజాతి కన్సల్టెన్సీ సంస్థ మన ఎలా అభివృద్ధి జరగాలో చెప్పడమేమిటి? ప్రపంచబ్యాంకు అడుగు పెట్టిన ఎన్నో దేశాల్లో ఇటువంటి మల్టి కలర్ విజన్ సినిమాలు ప్రదర్శించారు.

    మన తొలితరం నేతలు అభివృద్ధి కొరకు పంచవర్ష ప్రణాళికలు రచించారు. వాటిని ఇప్పటి తరం నేతలు భ్రష్టు పట్టించారు. వర్తమానంలోని బాధ్యతలు తప్పించుకోవడానికే ఈ ఇరవై ఏండ్ల విజన్ సినిమాలు పనికి వస్తాయి అని నా నమ్మకం.

    ఇక ఉచిత విద్యుత్ గురించి. ఇందులో “అనార్ధికం” ఏముంది? అన్నీ తెలిసిన వారు మీరే ఇలా అంటే ఎట్లా? కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వమే ప్రాజెక్టులు కట్టించి వ్యవసాయానికి నీళ్లందిస్తుంది. ప్రాజెక్టుల కింది రైతులు నామమాత్రపు నీటి తీరువా కట్టి పంటలు సాగుచేసుకుంటారు. అదే ప్రాజెక్టులు, కాలువలు లేని ప్రాంతాల్లో రైతులే 50 వేలు పెట్టి బోరును, మోటారును సమకూర్చుకుంటారు. వీరు నెలకు వందల రూపాయల కరెంటు బిల్లు కడుతూ ఎప్పటికీ వ్యవసాయం చేయలేరు. అందుకే వీరికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి అనేది.

    ఉచిత విద్యుత్ అనేది ఒక ఇన్ పుట్ సబ్సిడీగానే చూడాలి.

  12. సోమేశ్వరరావు says:

    నాకు ఆర్ధికరంగానికి సంబంధించిన విషయాల పైన పెద్దగా అవగాహన లేదు కాని, ఇప్పుడు మన దేశంలో వ్యవసాయరంగం చిన్న చూపునకు గురి అవుతోంది అని మాత్రం అనిపిస్తోంది. “స్థూల రాష్ట్రోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా గత నాలుగు దశాబ్దాల్లో సగానికి సగం తగ్గగా ఆ రంగంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య మాత్రం 8 శాతమే తగ్గింది”– ఇది చాలా విచారించవలసిన , ఆలోచించవలసిన విషయం. వ్యవసాయ రంగంలో ఆదాయం తగ్గటానికి కారణం? మన రైతుల వ్యవసాయ పద్దతులు అంటారా? వారికి దొరికే కల్తీ విత్తనాలు, ఎరువులు వగైరాలా? లేక ప్రకృతి వైపరీత్యాలా?
    మొదటిదయితే, ప్రభుత్వం కొంచెం చిత్తశుద్ధితో రైతులకు అవగాహనా సదస్సులు ఏర్పాటు చెయ్యాలి. కనీసం మండలానికి ఒకటికి తగ్గకుండా రైతులను చైతన్య పరిచడానికి, వారికి కావలసిన సమాచారాన్ని అందించటానికి కార్యాలయాలను ఏర్పాటు చెయ్యాలి. ఈ కార్యాలయాల్లో వ్యవసాయరంగానికి సంబంధించిన విద్యనభ్యసించిన వారిని తీసులోవాలి. ఒకటి లేదా రెండు వారాలకి ఒకసారి చొప్పున ఈ కార్యాలయం నించి ప్రతినిథులు గ్రామాలలో పర్యటించాలి, రైతులకు కావలిసిన సహకారాఅన్ని అందించాలి. భూసారాన్ని కాపాడుకోవతానికి తీసుకూవలిసిన జాగ్రత్తలు, వగైరాలని గురించిన విషయాలు చెప్పాలి. రైతులు పంట వేసే ముందు భూసార పరిక్ష చేసి అక్కడ ఏ పంట వేస్తే బాగుంటుందో చెప్పాలి. ఈ విధమైన కార్యాచరణ పద్దతులతో కార్యాలయాలను సమర్థవంతంగా నడపగలిగితే రైతుల అవగాహనారాహిత్యాన్ని తగ్గించవచ్చు. దీనికి అనుబంధంగా agricltural BSc, etc.. చదివిన వారికి కుడా ఉపాధి లభిస్తుంది.
    ఇక రెండవదయితే, అవినీతిని అరికట్టాలి. ఇది జరగాలని ఆశిద్దాం. దీని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోవటం అనవసరం.
    ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే నష్టాలగురించి, ఏమైనా భీమా పాలసీలు వుంటే బాగుంతుందేమో…. పూర్తిగా ప్రభుత్వం నించి సహాయాన్ని ఆశించడానికి నేను వ్యతిరేకిని.
    అంతిమంగా వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు అభివృద్ధి చెందాలి(విదేశి కంపెనీలు కాకపోతే మంచిది).Food processing వంటివి చెసి, ఎగుమతి చేస్తే ఎక్కువ లాభం వుండొచ్చు అని నా అభిప్రాయం. దీని వలన ఇక్కడ ఉపాధి అవకాసాలు కుడా పెరుగుతాయి.
    ఈవిధమైన ఇంకొన్ని సంస్కరణలు వ్యవసాయరంగంలో చేపడితే, నీరసించిపోతున్న మన వ్యవసాయాన్ని, బక్కచిక్కిపోతున్న రైతును కాపాడుకోవచ్చు.

  13. @ దిలీప్ గారు

    ముందుగా ఆర్.ఎస్ రావు గారి మాటలని నేను నమ్ముతున్నాను.

    ****

    ఏ విజన్ లేకుండటం కన్న కాలపరిమితి ఉన్న ఏదో ఒకటి ఉండటమే మంచిదని నేను నమ్ముతాను.

    “అమ్మకానికి ఆంధ్ర ప్రదేశ్” అంతర్జాలంలో ఎక్కడైన దొరుకుతుందేమో తెలుపగలరు.

    “ఒకసారి ఈ గణాంకాలు కూడా చూడండి. స్థూల రాష్ట్రోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా గత నాలుగు దశాబ్దాల్లో సగానికి సగం తగ్గగా ఆ రంగంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య మాత్రం 8 శాతమే తగ్గింది. దీనర్ధం ఏమిటంటే తక్కువ మంది ఆధారపడ్డ రంగం ఎక్కువ సంపాదిస్తుంటే, ఎక్కువమంది ఆధారపడ్డ రంగం తక్కువ సంపాదిస్తున్నది.”

    దీనిలో ఇంకో కోణం ఉంది. ఒక్కసారి గమనించండి. అంటే తక్కువ మంది ఆధారపడ్డ రంగం ఎక్కువ ఉత్పత్తి చేస్తుంటే, ఎక్కువ మంది ఆధారపడ్డ రంగం తక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగ పెరుగుతుంది, తక్కువ ఉత్పత్తి చేసే వాళ్ళ సంఖ్య అంత ఎక్కువగ తగ్గడం లేదు. ఆ ఉత్పత్తి ఏదైన అవ్వనివ్వండీ. స్థూలోత్పత్తికి దోహదం చేసేది అయి ఉండాలి. ఇంక ఇది మన రాష్ట్ర పరిస్థితి మాత్రమే కాదు. భారత దేశంలో అత్యధిక రాష్ట్రాల పరిస్థితి.

    “ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగడం రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు.”

    నిజమే ఇది ఇలా కొనసాగ కూడదు. ఇప్పుడున్న నిష్పత్తిలోనే ఉత్పత్తి దారులని(అంటే రైతులని గానీ, వేరే రంగాలలో ఉన్నవాళ్ళని గానీ) ఉంచేస్తే అది భవిష్యత్తుకి అసలు మంచిది కాదు. దుర్భరమైపోతుంది. కాబట్టి వ్యవసాయరంగంలో కూడా తక్కువ మంది చేత ఎక్కువ ఉత్పత్తి వచ్చేట్టు వారి సామర్ధ్యాన్ని పెంచాలి. మిగిలిన వాళ్ళని రకరకాల విద్యల ద్వారా ప్రభుత్వం నైపుణ్యాన్ని పెంచి వివిధ రంగాలలో ప్రవేశించేట్టు చెయ్యాలి. దానికి సమయం పట్టొచ్చు. కాల పరిమితి గల లక్ష్యాలతో సాధించలేనిది కాదు అది.

    ఇప్పటి రైతులని గమనిస్తే రొజు రొజుకీ బక్క రైతులు పెరిగిపోతున్నారు. ఒకప్పుడు ఒక కుటుంబాన్నికి 10 ఎకరాల పొలం ఉంటే, ఇప్పుడు అది నాలుగు కుటుంబాలయింది. చదవని ఆ కుటుంబం అంతా వ్యవసాయం మీదే ఆధారపడి 2.5 ఎకరాల రైతులని తయారు చేసింది. వాళ్ళకి వేరే విద్య తెలియదు. సహజ సిద్ధమైన మానవ లక్షణం అలవాటైన పని చెయ్యడం. కొత్తది నేర్చుకోవడానికి విముఖత చూపడం. ఆ 2.5 ఎకరాలలో మాగాణి ఎంతో, మెట్టెంతో?!! ఉన్నదంతా దాని మీద పేడుతున్నాడు. వైపరీత్యాలని తట్టుకునే శక్తి సన్నగిల్లింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి లాగా తనకి 10 ఎకరాలు లేవు, నాలుగు పంటలు పండించలేడు. ఒకే పంట మీద ఆధారపడతాడు. ఆ కాలంలో పండితే వచ్చినట్టు లేకపోతే లేనట్టు. ఆ రకంగా ఉత్పాదక సామర్ధ్యం తగ్గిపోయింది.

    ఇంకా అతను అలా చస్తూ వ్యవసాయమే చెయ్యాలా? ఎదుగు బొదుగు లేకుండా అలానే కొనసాగాలా?

    సంఘటిత వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. దానితో వ్యవసాయ ఉత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది. వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గి వేరే రంగాల్లోకి అడుగుపెడతారు. ఆ విధంగా స్థూలోత్పత్తి పెరుగుతుంది.

    మన వ్యవస్థ యొక్క మౌలిక రూపాన్ని కోల్పోకూడదు. అలా అని మారుతున్న కాలానికి తగ్గట్టు మారకపోతే ఆ వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతుంది.

    “గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం సర్వీసుల రంగంపై ఆధారపడి మనవంటి రాష్ట్రం అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. వ్యవసాయ వృద్ధి రేటు పడిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.”

    పూర్తిగా అంగీకరించలేను. ఇక్కడ వ్యవసాయ వృద్ధి రేటు అంటే దానీ మీద అధారపడే జనం వృద్ధి రేటు కానప్పుడు, అది కేవలం ఉత్పత్తి రేటు మాత్రమే అయినప్పుడు రెండొ లైనుతో ఏకీభవిస్తాను.

    ” సకాలంలో రుతుపవనాలు రావడం వల్ల నీటి లభ్యత పెరగడం, ఉచిత విద్యుత్తు మూలంగా ఇప్పుడు వ్యవసాయ రంగం పరిస్థితి ఫర్వాలేదు.కానీ ఈ రెండిట్లో ఏది లేకపోయినా మళ్ళీ కథ మొదటికొస్తుంది.”

    అలా జరగకుండా కరువొస్తే, ఉచిత విద్యుత్తు కూడా ఇవ్వలేరు. ఏమీ చెయ్యలేక బక్క రైతు చిక్కి చిక్కి బతక లేక ఆత్మ హత్య చేసుకోవడమో, ఆకలితో చనిపోవడమో జరుగుతుంది.

    ****

    ఇంకా ఎదైతే గ్రామాలని చంద్రబాబు పట్టించుకోలేదు అని కొంతమంది వాదిస్తారో అదే గ్రామాల్లొ ఆయన హయాము(1998-2005)లో అత్యధిక ఉపాధి కల్పన జరిగింది. ఇది ఈ మధ్య కేంద్ర గణాంకాల సంస్థ విడుదల చేసిన రిపోర్టు. ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మీ రెఫెరెన్సు కోసం

    http://in.news.yahoo.com/financialexpress/20080529/r_t_fe_bs_india/tbs-employment-grows-2-78-in-98-05-perio-e247859.html

    పై రిపోర్టు మీద మీ అభిప్రాయం తెలుసుకోగోరుతున్నాను.

    అలా జనం కళ్ళ ముందు కూడా కొంత ప్రగతి కనపడింది కాబట్టే తన పార్టి తక్కువ శాతం ఓట్లతో ఓడిపోయింది అని నమ్ముతున్నాను(ప్రతి పక్షాలన్నీ ఏకమైన సరే).

    ఇంకా చంద్రబాబు తలపెట్టిన ప్రైవేటీకరణ విఫలమైంది అని చెప్పినప్పుడు, ఆయన హయాములోనే ప్రభుత్వ రంగంలోని విధ్యుత్ సంస్థ దేశంలోనే అత్యంత సమర్ధవంతమయిన వ్యవస్థగా తయారు అయింది అని కూడా చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది అంటే ఆ సమర్ధత వల్లే అని మనం మరిచిపోకూడదు. నాకు ఆ పేరాలో ఎంచెప్పదలచుకున్నారో అర్ధం కాలేదు.

    ఇంక ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎలా జరుగుతుందంటారు? మీకేమైన గణాంకాలు తెలుసా? నాకు తెలిసిన కొన్ని పరిచయాలు చెప్పినదాని ప్రకారం ఉపాధి హామిలో డబ్బులు మాత్రం పంచుతున్నారు, కానీ వాళ్ళ చేత ఏ పనీ చేయించడం లేదని. అన్ని చోట్ల ఇలానే జరుగుతుందా? ఆయా గ్రామాలకి ఉపయోగపడే పనులు ఏమైన జరుగుతున్నాయా? మీకు తెలిస్తే పంచుకోగలరు.

  14. ఏకాంతపు దిలీప్ గారు,

    మీ ప్రశ్నలకు జవాబులు ఒక్కసారిగా కాకుండా విడతలవారీగా ఇస్తాను.

    1)”అమ్మకానికి ఆంధ్ర ప్రదేశ్” అంతర్జాలంలో లభ్యం కావటం లేదు.

    2) బాబు హయాంలో జరిగిన విద్యుత్ సంస్కరణల గురించి త్వరలోనే నా బ్లాగులో ఒక టపా రాస్తాను.

    3) మీరు ఉపాధి కల్పన గురించి పంపిన లంకె పనిచేయటం లేదు. ఒక సారి సరిచూడగలరు.

    4) మన రాష్ట్రంలో ఉపాధి హామీ పధకం అమలు ఇతర రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉండటానికి ప్రధాన కారణం లబ్ది దారులకు నేరుగా నగదు ఇవ్వకుండా పోస్టు ఆఫీసుల ద్వారా చెల్లింపులు జరపడం. ఈ పద్ధతి వల్ల అవినీతి చాలా వరకూ అరికట్టబడింది. ఇక ఉపాధి హామీ నిధుల్లో కొంత భాగాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి ఇతర పనులకు మళ్లించిందనే ఇటీవలి వార్తలు నా అభిప్రాయం మొత్తం సరికాదని తెలుపుతున్నాయి.

  15. దిలీప్ గారు,

    2) బాబు హయాంలో జరిగిన విద్యుత్ సంస్కరణల గురించి త్వరలోనే నా బ్లాగులో ఒక టపా రాస్తాను.

    >>నేనెదురు చూస్తాను. మీరు ఏ విధంగా విద్యుత్ రంగ వ్యవస్థని ( సంస్కరణలకి పూర్వం, సంస్కరణల తరవాత) విశదీకరిస్తారో తెలుసుకోవాలని ఉంది.

    3) మీరు ఉపాధి కల్పన గురించి పంపిన లంకె పనిచేయటం లేదు. ఒక సారి సరిచూడగలరు.

    >>అది మే 29,30న దేశ వ్యాప్తంగా ప్రచురితమైన వార్త. ఈనాడులో కూడా వేసారు. అంతర్జాలంలో ఎక్కువ కాలం ఉంచరు కాబట్టి నేను ఇంతకుముందిచ్చిన లంకె పని చెయ్యలేదు. అదే ఇక్కడ చూడండి. రెండు లంకె లు ఇస్తున్నాను.
    http://www.financialexpress.com/news/Employment-grows-2.78-in-9805-period/316215/

    http://www.dailyexcelsior.com/web1/08may30/national.htm

    అవి చూసిన తరవాత అభివృద్ధిని మీరు ఏ కొలబద్దలతో బేరీజు వేసుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ గణాంకాలు ఖచ్చితంగా బాబు హయాము గురించి తెలిపేవే. అతని హయాములో భారత దేశపు గ్రామాల్లో సృష్టించబడిన ఉద్యోగాల్లో 13.5% ఆంధ్ర ఫ్రదేష్లోనే అని గణాంకాలు ధృవీకరించాయి.

    4) మన రాష్ట్రంలో ఉపాధి హామీ పధకం అమలు ఇతర రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉండటానికి ప్రధాన కారణం లబ్ది దారులకు నేరుగా నగదు ఇవ్వకుండా పోస్టు ఆఫీసుల ద్వారా చెల్లింపులు జరపడం. ఈ పద్ధతి వల్ల అవినీతి చాలా వరకూ అరికట్టబడింది. ఇక ఉపాధి హామీ నిధుల్లో కొంత భాగాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి ఇతర పనులకు మళ్లించిందనే ఇటీవలి వార్తలు నా అభిప్రాయం మొత్తం సరికాదని తెలుపుతున్నాయి.

    >>హైజాక్ చెయ్యడం ఒక సమస్య. అనర్హులైన కార్య కర్తలని లబ్ధిదారులుగ చూపించడం. లబ్ధిదారులకి కూడా డబ్బుని ఉచితంగా పంచడం. నాకు తెలిసిన కొంతమంది చెప్పిన సమాచారం అది. ఈ రకమైన అవినీతి ఇంకా ప్రమాదకరమైనదని నమ్ముతాను. భారీగా అలా జరుగుతుందో, అక్కడక్కడా అలా జరుగుతుందో తెలియదు.

  16. ఏకాంతపు దిలీప్ గారు,

    జాతీయ ఉపాధి హామీ పధకం మన రాష్ట్రంలో అమలవుతున్న తీరు గురించి ఈ వ్యాసం కొంత ఉపయుక్తమైన సమాచారం ఇస్తుంది. చదవగలరు.

    http://www.hindu.com/2008/09/08/stories/2008090856271000.htm

  17. @ దిలీప్ గారు

    ఇప్పుడే చదివానండి… ఈ వ్యాసం చెప్తుందేమిటంటే సమయానికి డబ్బులు ఇచేస్తున్నారు అని… అలా ఇవ్వడానికి సమాచార విజ్ఞానాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకుంటున్నారు అని.మంచిది అండి… కానీ అందులోనే ఇలా రాసారు “Despite these achievements, several weaknesses remain. The most important have to do with the quality of assets created. The government has not paid adequate attention to strengthening the process of people’s planning and implementation of works. The immense potential of NREGA for transforming rural livelihoods thus remains completely unrealised. Social audit is, after all, mainly a post-facto exercise. More important is what is done prior to works being started.”

    నేను ఇంతకముందు విన్నవి ఆ పైన పరిశీలించినవి ఒకేలా ఉన్నాయి. డబ్బులైతే సకాలంలో ఉపాధి హామీ కింద పంచుతున్నారు కానీ, ఆ ఉపాధి దేనికోసమై సృష్టించబడినదో ( వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మాత్రం కాదు) ఆ లక్ష్యం నెరవేరలేదు. ఉపాధి హామీ వల్ల ఎలాంటి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్నారో అది అసలు జరగలేదు. ఇది ప్రభుత్వపు అవినీతిలో/ఉదాశీనతలో పేద ప్రజలని భాగస్వాములు చెయ్యడం కాదంటారా? పేద ప్రజలకి డబ్బు హామీ అందుతుందని సంతోషించి ఊరుకోవాలా? ప్రస్తుత ప్రభుత్వ పని తీరు ఎలా ఉందంటే సకాలంలో చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయి.సమర్ధతని పక్కకి నెట్టేస్తున్నారు. ఉపాధి హామీ ఒక్కటే కాదు, రుణాల మాఫీ, ఉచితంగా ఇస్తున్న విద్యుత్తు. ఇవన్నీ ప్రజల శక్తి యుక్తులని నిర్వీర్యం చేసే దిశగానే సాగుతున్నాయి. ఎల్లప్పుడూ ప్రభుత్వం మీద ఆధార పడేట్టు…

    ఉపాధి హామీ కిందే గత ప్రభుత్వ హయాములో జన్మ భూమిలో కొన్ని పనులు, నీరు-మీరు కార్యక్రమం లాంటివి ఖచ్చితమైన లక్ష్యాలని నిర్దేశించబడి ఆ లక్ష్యం దిశగా అభివృద్ధి జరిగింది. అవి భవిష్యత్తు ఉత్పత్తి, సమర్ధత పెంచే దిశగా జరిగింది.

    ఇక్కడే నా అవగాహనలోకి వచ్చిన ఇంకో రెండు విషయాలని ప్రస్తావిస్తున్నా.

    గత ప్రభుత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి రేటులో రెండవ స్థానంలో ఉంది. కానీ పేదరికం తరుగుదల రేటులో అందరికన్నా ముందు ఉంది. ఈ గణాంకాలు అభివృద్ధి రేటూ, పేదరికం తరుగుదల రేటూ అవినాభావ సంభంధంలో ఉండకపోవచ్చని చెప్తున్నాయి. మన రాష్ట్రం ఆ కాలంలో గణనీయమైన అభివృద్ధి రేటుని ప్రదర్శించడమే కాకుండా, పేదరైకపు తరుగుదల రేటులో కూడా అందరికికన్నా ముందు ఉంది.పాపం చంద్రబాబు నాయుడుకి ఈ లెక్కలు చెప్పుకోవడానికి ఆధారాలు లేవు… ఎందుకంటే ప్రభుత్వ గణాంకాల సంస్థలు సెన్సస్ రెపోర్టులని ఆయా కాలాల తరవాత వదులుతాయి… ఈ వివరాలు 2007 లో విడుదల చేసారు.. ఈ వివరాలు మనకి ఏమి చెప్తున్నాయి అంటే, భారత దేశంలోనే అత్యధికంగా అప్పటి ప్రభుత్వం పేదరిక నిర్మూలనకి కృషి చేసిందని. నిజానికి చంద్రబాబు విజన్ లో మొదట చెప్పిన విషయం అది, 2020 నాటికి రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అని. ఈ గణాంకాలు అప్పటి ప్రభుత్వం ఆ దిశగానే ప్రయత్నించిందని తెలియచేస్తున్నాయి…

    http://in.rediff.com/money/2007/mar/29guest.htm

    అదే విధంగా బాల కార్మికులు చంద్రబాబు హయాములో 49% తగ్గారు. నాకైతే గుర్తు ఉంది, అతని కాలంలో బాల కార్మికుల విషయం మీద శ్రద్ధ పెట్టినట్టు.. ఈ వివరాలు 2008 లొ విడుదల చేసారు..

    http://news.oneindia.mobi/2008/01/01/518578.html

    రైతు పక్షపాతులు, పెదరికపు( పేద ప్రజల) పక్షపాతులు, మానవ హక్కుల రక్షకులు ఈ ఫలితాలని కనీసం లెక్కలోకి తీసుకుంటారా? హర్షిస్తారా?

    చంద్రబాబు ఆర్ధిక విధానాలని తీవ్రంగా వ్యతిరేకించి సొమ్ము చేసుకున్న రాజకీయులు, ఇప్పుడు అంత కన్నా భయంకరంగా వ్యవహరిస్తున్నారు. అప్పటి ప్రభుత్వం ఆ విధానాలని అభివృద్ధి, సమర్ధత కోసం వెచ్చిస్తే ఇప్పటి ప్రభుత్వం ఆ విధానాలనే పాటిస్తూ సంస్క్షేమం పేరుతో ప్రజలని నిర్వీర్యం చేసే పనిలో తీవ్రంగా కృషి చేస్తుంది. విచిత్రమేమిటంటే, అతని విధానాలని వ్యతిరేకించిన స్వచ్చందులు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు, అసలు పట్టనట్టు ఉంటున్నారు. వారి దృష్టిలో నిజమైన అభివృద్ధి ఏంటో!

    నేను ఈ మధ్య కొంత మంది రైతులతో మాట్లాడటం జరిగింది. కొందరు సారవంతమైన నల్ల నేలలో వ్యవసాయం చేసేవారు, ఇంకొందరు అంతగా సారవంతం కాని ఎర్ర నేలలో చేసేవారు. ఇద్దరూ ఇప్పటి రైతుల స్థితి గతులని ఒకేరకంగా తెలియ చేసారు.ఎక్కువ మంది ఈ తరం రైతులు కూడా వ్యవసాయం నిష్టగా చెయ్యడం లేదు, కానీ వారికి డబ్బు కావాలి, మోజులు తీరాలి. కూలీలు నిష్టగా పని చెయ్యడం లేదు, కానీ వారు డిమాండ్ చేసినట్టు రోజువారీ కూలీ ఇవ్వాలి, చాలా మంది అంత ఇస్తేనే పనిలోకి వస్తున్నారు.రైతులంతా కలిసి ఉండటం లేదు. నేటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపట్టిన సంక్షేమ పథకాలు అగ్నికి ఆజ్యం పోసినట్టు గ్రామ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాయి. అలా లభించిన సంక్షేమంతో, వ్యవసాయ కూలీ పనులు చేస్తూ వస్తున్న వారు ఇళ్ళల్లో కూర్చుని టివి లు చూస్తున్నారు. వారికి పనికి రావాల్సిన అవసరం తగ్గిపోయింది… ఎందుకు కష్టపడాలి?

    ఉచిత విద్యుత్తు పేరు చెప్పి ఇచ్చే 7 ఘంటలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల రైతులు వాళ్ళ పొలాలనే తడుపుకోలేకపోతున్నారు. నీటి బోర్లని, నీళ్ళని పంచుకోలేకపోతున్నారు. ఇది ఎవరి పొలంలో వాళ్ళు ఎంత చిన్న రైతైనా బోర్లు వేసుకునే పరిస్థితికి దారి తీస్తుంది. వేసుకోలేకపోతే తనకి వచ్చిన పంటని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి… ఇదంతా ఎకరానికి సంవత్సరానికి ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం ఇస్తున్న 1000 రూపాయల మాఫీ మూలంగా అనుభవించాల్సిన పరిస్థితి.

    వారు అడుగుతున్న సూటి ప్రశ్న ఇప్పుడు రైతు చేసిన బియ్యం 15 రూపాయలు అమ్ముతుంటే అదే బియ్యాన్ని అదే ఊరిలో సగం మంది 2 రూపాయలకే కొనుక్కుంటున్నప్పుడు, ఎవరికి కష్టం విలువ తెలుస్తుంది? ఎవరు కష్టం చేస్తారు? వరి పండించని రైతు కొనుక్కోవాలంటే అది 25 రూపాయలు ఉంటుంది… గతంలో 6 రూపాయలు ఉన్న బియ్యాన్ని 9 రూపాయలు చెయ్యకుండా, 2 రూపాయలు చెయ్యడం లో గ్రామాల్లో పని సంస్కృతి ఏ విధంగా దెబ్బతింటుందో పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఉంది…

    రైతులు కూడా మారిపోతున్నారు. గ్రామాల్లో శ్రమైక జీవన విధానం అస్థవ్యస్థమైపోతుంది. కష్టం చెయ్యకుండా ప్రభుత్వం తమకేమి ఇస్తుందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ ఆలోచనా విధానాన్ని ఏనాడూ లేనంత విధంగా ఈ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది…

    ఆశ్చర్యంగా ఆ రెండు ప్రాంతాల రైతులు ఒకే అభిప్రాయాన్ని చివరకి చెప్పారు, ఇలా వ్యవస్థ కుళ్ళిపోయి కరువు కాటకాలు పెరిగిపోయి జీవనం దుర్భరమయ్యే పరిస్థితి వస్తుందని… అప్పుడు ఏదైనా ఉద్యమం వస్తే గానీ మార్పు రాదని!

    అక్కడక్కడా చెప్పిందే మరలా చెప్పినట్టు అనిపించొచ్చు… అది నా ఆవేదన వల్ల జరిగింది అని గ్రహించగలరు..

  18. ఆది says:

    డియర్ దిలీప్ కొణతం గారు… ధన్యవాదములు. మీయొక్క దళారిపశ్చాతాపాన్ని అందరూ చదివి వూరుకుంటే నేను మాత్రం కంఠతా పట్టాను. అంతేకాదు. ఆ ఇన్స్సిరేషన్ తో ఆజాడలు అనే నాటిక కూడా రాశాను. ఒక రకంగా ప్రపంచ రాజకీయ చిత్రాన్ని చాయామాత్రంగా చూపిన పుస్తకమిది. అలనాడు ఇందిర తన తండ్రి ఉత్తరాలను చదివి ఎంత తెలుసుకుందో అంతా ఈ బుక్ వల్ల తెలుసుకున్నాననే చెప్పాలి. ఇందుకు ముఖ్యంగా మూల రచయిత కన్నా ముందు, మీకే ధన్యవాదములు చెప్పాలి. మిమ్మల్ని ఇలా నెట్ ట్రాఫిక్ లో కలుస్తానని అనుకోలేదు. నౌ ఐయామ ఇన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ యాజ్ ఏ సబ్ఎడిటర్. మీ రెస్పాన్స్ కోరుతూ… ఆది.

  19. ఆది గారూ,

    ఒక దళారీ పశ్చాత్తాపం ఆధారంగా మీరొక నాటిక రాశారని తెలిసి చాలా సంతోషం కలిగింది. వీలుంటే ఆ నాటిక ప్రతిని నాకు పంపగలరు.

    కొణతం దిలీప్
    konatham.dileep(AT)gmail.com

  20. ప్రియమైన దిలీప్ గారు,
    మీరు అనువదించిన‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తకం చాలా బాగుంది. అది మా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శుభాకాంక్షలు.
    మీ
    దార్ల

Comments are closed.