ఏప్రిల్ బ్లాగు విశేషాలు

-చదువరి

ఏప్రిల్‌లో బ్లాగుల్లో బాగా నలిగిన మాట జీవిత పరమార్థం. మూమెంట్ ఆఫ్ క్లారిటీ అంటూ కొత్తపాళీ రాసిన జాబు బ్లాగరుల్లో మేథోమథనాన్నే కలిగించింది. వ్యాఖ్యల పరంగా 40 వ్యాఖ్యలతో ఇదొక రికార్డు. స్పందన పూర్వక జాబుల పరంగా ఇదొక సంచలనం. దీనిపై వచ్చిన స్పందనల్లో కొన్ని:

  1. నాకు ఏమీ తెలియదని తెలుసుకోగలిగాను అంటూ విశాఖతీరాన మొదలైంది స్పందన.
  2. నేను నా వాళ్ళు, ఇదేనా జీవితం…” అంటూ డా. రామ్స్ రాసారు.
  3. అర్దం, పరమార్దం – అపార్దం అంటూ “..ఉబుసుపోక..” లో రాసారు
  4. జీవిత పరమార్థం ఏమిటి? అంటూ నాగరాజా తెలుగునేలలో తర్కించారు
  5. దైవానిక జోరుగా హుషారుగా రాసారు
  6. జి.ఎస్.నవీన్ ఆనందానికి 10 సూత్రాలు అంటూ రాసారు.

ప్రస్తుతం పత్రికా యుద్ధం జరుగుతోంది. గతంలో ఇలా యుద్ధాలు జరిగేవి కావు.. ఒకవేళ జరిగినా అవి ప్రచ్ఛన్న యుద్ధాలే. ఇప్పుడు మాత్రం ఒక దానిపై ఒకటి దుమ్మెత్తిపోసుకోవడం చూస్తున్నాం. ఇది ప్రత్యక్ష యుద్ధం. ఈ భాగోతంపై బ్లాగరుల స్పందనలు చూడండి:


సర్వధారి ఉగాది వేడుకలు:
భువన విజయం పేరిట పొద్దు చేసిన పద్యాల సందడితో పాటు బ్లాగరులు కూడా యథాశక్తి కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. ప్రవీణ్ బ్లాగు పుస్తకాన్ని విడుదల చేసి పండగ చేసారు. తెలుగు బ్లాగుల్లోని ఉత్తమమైన జాబులను ఒకచో చేర్చి, కుట్టిన ఈ పుస్తకం ప్రశంసనీయంగా ఉంది. దీనికి కర్త, కర్మ, క్రియ ఐన ప్రవీణ్‌కు అభినందనలు. సహకరించిన బ్లాగరులకు కూడా అభినందనలు. సాటి బ్లాగరులు ఆ పుస్తకాన్ని ఆనందంగా స్వాగతించారు.

తెలుగు బ్లాగులకు ఇది వివాదాలు, చర్చల నెల. చిన్నాచితకా తగువులు, టీకప్పులో తుపానులు, గాలిదుమారాలు, వ్యాఖ్యల వడగాడ్పులు, కొండొకచో తేలికపాటి వానలు, .. ఇలాగ వాతావరణం మారుతూ వచ్చింది. తెలుగు బ్లాగు చదువరులకు మంచి కాలక్షేపాన్నందించిందీ నెల. ఆ వివాదాల్లో కొన్ని:

  • పుస్తకాలు చదవకండి అంటూ నెటిజెన్ జాబు రాసారు. ఇది కొందరు బ్లాగరులకు కోపం తెప్పించింది. ఈ జాబుకు వ్యాఖ్య రాస్తూ సుజాత తన నిరసనను నేరుగానే తెలియజేసారు. పత్రికలూ బ్లాగులూ రచయితలూ అనే జాబులో కస్తూరి మురళీకృష్ణ తన వాదనను రాసారు.
  • గట్టిగా చర్చ జరిగిన బ్లాగు: ప్రేమ ఉన్మాదం అని కాలాస్త్రి బ్లాగులోని జాబుపై పెద్ద చర్చ జరిగింది. ప్రేమోన్మాదంతో చంపడానికి తెగబడిన సంఘటనలపై ఈ జాబును శ్రీ రాసారు. దీనిపై మంచి చర్చే జరిగింది. చర్చలో పాల్గొన్నవారందరూ వాదనలపై వాదనలు విసురుకున్నప్పటికీ… అందరి వాదనలూ సరైనవే కావటం ఈ చర్చలోని విశేషం.ఇదే విషయంపై వచ్చిన మరికొన్ని జాబులు:
  • వేరే బ్లాగులో రాసిన ఒక వ్యాఖ్యపై స్పందనగా చక్రవర్తి రాసిన ఒక జాబు ఓ చిన్నపాటి చర్చను లేవనెత్తింది.

మరికొన్ని బ్లాగు విశేషాలు:

  • ఇకపై బ్లాగరులు తమ బ్లాగు వీలునామాలు కూడా రాయవచ్చు. ఆ సంగతేంటో చూడండి.
  • తెలుగువాడి పత్రికా హక్కు గురించి అరుణ్ కుమార్ రాసారు.
  • కొత్తపాళీ కథాకేళిలో లేటుగా పాల్గొన్న రాయలు, తెల్లకాగితంపై ఓ కథ రాసారు.
  • “క్రేజీ కాంబినేషన”నేది, “డిఫరెంటు” లాంటి బబుల్‌గమ్ మాట. తెలుగు సినిమాజనం ఈ మాటలని బాగా అరగదీసేసి, ఇవంటేనే, ఈ మాటలు వింటేనే మనకు కంపరం కలిగేలా చేసారు. అయితే, క్రేజీ కాంబినేషన్లని పేరుపెట్టి జ్యోతి ఓ జాబు రాసి ఆ మాటచేత ఒక కొత్త పాత్ర వేయించి, దానికో విలువను ఆపాదించారు. అది చదివిన వారికి జఠరాగ్నిలో ఆజ్యం పోసినట్టైంది.
  • తేటగీతి అనే పేరు తన బ్లాగుకు పెట్టుకుని, పద్యాలు రాయకపోతే బాగుండదనుకున్నారేమో.. మురళి పద్యాలు వర్షించటం మొదలుపెట్టారు. ఛందో నియమాలకు పూర్తిగా లోబడనప్పటికీ, పద్యాల అర్థాలు అలరిస్తున్నాయి. కొత్తపాళీ వీటిని ప్రశంసించారు. ఇంకా ఇతర కవుల దృష్టి వీటిపై పడినట్టులేదు.
  • తెలుగు జాతి ఉన్నంత కాలం నిలిచివుండే చిరంజీవులు వీరు అంటూ తనకు నచ్చిన పదిమందిని మేటి దీవిటీలుగా ఎంచి, వారి గురించి పద్యాలని రాసే ప్రయత్నం చదువరి మొదలు పెట్టారు. ఆ వరసలో మొదటి దివిటీ వేమన.

హాస్యం, వ్యంగ్యం:

  • విహారి రాసిన అయాం నాటే లెజెండ్ చూడండి. జీవితం మన్మొహన్ సింగు లాగా నడుస్తోంది నా ప్రమేయమేమీ లేకుండా వంటి మెరుపులున్నాయి ఈ జాబులో.
  • ప్రవీణ్ మీరు సినిమాలు చూస్తారా.. మీదేటైపో అంటూ సినిమా ప్రేక్షకులను వర్గీకరించారు.
  • అన్వేషి రాసిన క్రికెట్టోపాఖ్యానంలో క్రికెట్ ప్రేక్షకులను వర్గీకరించారు. తెలుగు సినిమా దర్శకుడి లాగా ప్రవీణ్ బ్లాగును అనుకరిస్తున్నానని చెప్పుకున్నా.., ఈ జాబు ఎంతో సృజనాత్మకంగా ఉంది.

ఇతర సాహిత్య ప్రక్రియలు:

  • బుసాని పృథ్వీరాజ్‌వర్మ రాస్తున్న కవితల బ్లాగు చూసారా? కవితల బ్లాగుల్లో కవితకు జోడీగా బొమ్మలు పెట్టడం చూస్తూంటాం. ఈ బ్లాగులో ప్రత్యేకత ఏంటంటే ఆ బొమ్మల్ను బ్లాగరి స్వయంగా వేసినవే కావడం. బొమ్మలు చక్కగా వేస్తారు. ప్రముఖుల బొమ్మలు కూడా వేస్తారు. వాటి కంటే ఫిక్షను బొమ్మలే బాగుంటాయి, భావస్ఫోరకంగానూ ఉంటాయి. మచ్చుకు ప్రేమపిలుపు అనే జాబులో వేసిన బొమ్మ చూడండి. కవి బ్లాగరుల దృష్టికి ఇంకా ఈ బ్లాగు, ముఖ్యంగా ఈ జాబు వచ్చినట్టు లేదు.మామూలుగా కవులు విరహ తాపం గురించి రాస్తూంటారు. అయితే, ఈ కవితలో విరహ జల్లులున్నాయి!
  • నీతోనెట్టేటె పిల్లా.. అంటూ సాహితీఝరిలో అంటున్నారు భావకుడన్
  • రామ పదాబ్జముల్ అంటూ రానారె ఇచ్చిన ఒక సమస్యకు చక్కటి పూరణలు వచ్చాయి.

కొత్త బ్లాగులు:

  • చెన్నే కొత్తపల్లి బడి కబుర్లు చెబుతూ నారాయణశర్మ గారు బ్లాగు మొదలుపెట్టారు. ఆ బడి సంగతేంటో తెలుసుకోండి.
  • డా.రామ్‌స్ అంటూ డాలరు గుర్తుతో ఒక బ్లాగు దూసుకొచ్చింది ఈ నెల్లో. బ్లాగరులకు పావలా వడ్డీకే రుణాలు అంటూ వచ్చేసారీ డాక్టరు గారు.
  • యవ్వనపు డైరీ రాస్తున్నారు వెంకట్. ఆయన స్నేహితుడు, ఆయన -ఇద్దరూ బీర్‌బలులేనని తెలిసింది. వెంకట్ స్నేహితుడు గిరీష్ లోకం ఇది. ఈ బ్లాగు మార్చి ఆఖరులో మొదలైంది.
  • జంబలకిడిపంబ అంటూ బ్లాగరులపై విమర్శలతో వచ్చిందీ బ్లాగు; ఆనందం రాస్తున్నారు.
  • తెలుగు పోయెమ్స్ అంటూ విశ్వామిత్ర ఓ కవిత్వ బ్లాగు మొదలుపెట్టారు. ఒక్క రోజునే పాతిక దాకా కవితలను బ్లాగుకెక్కించారు. కారాలెక్కువైన వంటలు తిని ఇలా.. “కారం కలవని (నా) కడుపున చెరువైనా తవ్వరే” అంటూ వాపోయారు
  • సాహితీయానం చేస్తూ బొల్లోజు అహ్మదాలీ బాబా బ్లాగులోకంలోకి వచ్చేసారు. వీరు బ్లాగు రాయడమే గాక, అనేక బ్లాగులను పరిశీలనగా చదివి, సునిశిత వ్యాఖ్యలు కూడా చేసారు.
  • కలువరేకులతో శ్వేత బ్లాగు ప్రవేశం చేసారు.

—————

చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

This entry was posted in జాలవీక్షణం and tagged , , . Bookmark the permalink.

5 Responses to ఏప్రిల్ బ్లాగు విశేషాలు

  1. కలువరేకులు బ్లాగ్ రచయిత స్వాతి కాదండి … శ్వేత

  2. radhika says:

    ఈ నెల అంతా చర్చలు,వాదనలతోనే సరిపోయింది.కొన్ని వాదనలు చాలా దూరం వెళ్ళినా ఎవరూ దూషణలకు దిగకుండా ఎంతో సమ్యమనం పాటించారు.ఇదే వాతావరణం మన తెలుగు బ్లాగుల్లో ఎప్పుడూ నిలవాలని కోరుకుంటున్నాను.
    చదువరిగారికి,పొద్దువారికి అభినందనలు.
    అలాగే తెలుగుబ్లాగుల గురించి ఆంధ్ర జ్యోతిలో వచ్చిన విషయాన్ని కూడా చేరిస్తే బాగుంటుందేమో?

  3. తెలుగువాడిని గారూ, స్వాతి / శ్వేత – మార్చాను. నెనరులు

  4. నేను కూడా కొత్త బ్లాగుల్లోకి వస్తాను, కానీ నా బ్లాగు విషయం పైన చర్చించి నందులకు ధన్యవాదములు. అంతే కాకుండా పొద్దు వారు ఇలా నెల నెల వ్రాస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. పొద్దు వారి సహాయంతో ఇన్ని బ్లాగు పుటలని చదివి, ఓపికగా సంకలనం చేసి ఇంత శ్రమ పడిన బృందానికి, మనసారా కృతఙ్ఞతలు.

    మీరు పది కాలాల పాటు ఇలాగే ప్రొద్దుగుంక కుండా ఉండాలని ఆశిస్తున్నాను.

  5. bollojubaba says:

    బ్లాగులోకానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.

    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

Comments are closed.