-వి.బి.సౌమ్య
“చైల్డ్‌హుడ్ డేస్” అన్నది ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రాయ్ చిన్నప్పటి అనుభవాల సంకలనం. ఈ చిన్న పుస్తకంలో రెండుభాగాలు – మొదటిభాగం చిన్ననాటి రోజుల జ్ఞాపకాలు. రెండో భాగం ఆయన సినిమాలు తీస్తున్నప్పటి అనుభవాలు – మేకింగ్ మూవీస్. ఈ పుస్తకం – అభిమానులకైతే చదివి తీరవలసినదీ, ఇతరులకి – ‘చదివితే పోయేదేం లేదు..తెలిసేదే తప్ప’ అన్న తరహా పుస్తకం. దీన్ని సత్యజిత్ రాయ్ బెంగాలీ లో “సందేశ్” పత్రిక కోసం రాసారు. తానే ఆంగ్లానువాదం చేద్దాం అనుకున్నా కూడా, ఆరోగ్య కారణాల దృష్ట్యా చేయలేకపోయారు. దానితో ఆయన సతీమణి బిజొయా రాయ్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. పుస్తకం మధ్యలో అక్కడక్కడా ఉన్న బొమ్మలు సత్యజిత్ రాయ్ గీసినవే. పుస్తకానికి రాసిన పరిచయ వాక్యాల్లోనే బిజొయ తనకూ, సత్యజిత్ రాయ్ కి ఉన్న అనుబంధం గురించి చెబుతూ సత్యజిత్ రాయ్ వ్యక్తిత్వాన్ని కూడా కొంతవరకూ మనముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇంతకీ, నాకు కొత్తగా తెలిసిన విషయం ఏమిటీ అంటే -వీళ్ళిద్దరూ బాల్య స్నేహితులని. పరిచయంలోనే వీళ్ళిద్దరి మధ్యా చిన్నప్పుడు వాళ్ళ బంధువు ఒకావిడ (కనక్ బిశ్వాస్ అన్న గాయని – రాయ్ కి పిన్ని ఔతారు) బొమ్మలు గీసే పోటీ ఒకటి పెడతారు. రాయ్ బిజొయా కంటే మూడేళ్ళు చిన్న. ఆ పోటీ జరిగినప్పుడు ఐదేళ్ళు రాయ్ కి. కానీ, రాయ్ బొమ్మ ఎంతబాగా గీశారో బిజొయా వర్ణన వింటేనే అర్థమౌతుంది – పువ్వు పుట్టినరోజు నుండే పరిమళాలు వెదజల్లింది అని. నిజానికి బిజొయాకి అంతకు కొద్దిరోజుల ముందే చిత్రలేఖనంలో బహుమతి కూడా రావడంతో, గెలుపు తనదేననే ధీమా కూడా ఉంటుంది. కానీ, ఆ పోటీలో గెలిచేది మాత్రం సత్యజిత్ రాయ్. ఆ సంఘటన రాస్తున్నప్పుడు ఆవిడకి గతం గుర్తుకు వచ్చి ఏమనిపించిందో మరి!
“చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఏవి మనకు గుర్తుండిపోతాయో…ఏవి మనం మరిచిపోతామో అన్నది చెప్పడం కష్టం..” అన్న వాక్యంతో మొదలౌతుంది ఈ పుస్తకంలోని మొదటి ఛాప్టర్. అక్కడ్నుంచి సత్యజిత్ బాల్యంలోకి మన ప్రయాణం మొదలు. మొదట ఆయన ఆ ఊరు ఎంతలా మారిపోయిందో చెప్పడంతో మొదలుపెడతారు. పాతవి వెళ్ళడం-కొత్తవి రావడం గురించి చెబుతూ ఉంటారు… ఓపెన్ టాప్ బస్సులు, పాత మోడల్ కార్లు, గుర్రపు బళ్ళు వంటి వాటి గురించి చెబుతూ ఉంటే, వయసులో పెద్దవాళ్ళు వాళ్ళ కాలంలోకి, చిన్నవాళ్ళు కొత్తలోకంలోకి వెళ్ళిపోతారు. కాస్తోకూస్తో ప్రపంచం చూసిన వారు ఎవరైనా కూడా తమ పరిధిలో మార్పుల్ని గమనిస్తూనే ఉంటారు అన్న నమ్మకంతో అంటున్నాను ఈ మాట. రోజూవారీ జీవితం ఎంతలా మారిందో అన్నది – నిజంగా ఎలా చెబుతారూ అంటే, మన తాతగారో అమ్మమ్మో నాయనమ్మో ఎవరో మన ముందు కూర్చుని కబుర్లు చెబుతున్నట్లే ఉంటుంది. రాయ్ కి రెండున్నరేళ్ళ వయసులో పితృవియోగం కలిగింది. తండ్రికి సంబంధించిన ఏకైక జ్ఞాపకాన్ని కూడా వర్ణిస్తారు మొదటి ఛాప్టర్ లో. రాయ్ కుటుంబం మొదట అతని తాత ఉపేంద్రకిశోర్ స్థాపించిన ప్రెస్సు – “యూ.రాయ్ అండ్ సన్స్” వెనుక భాగంలో ఉండేవారు. ఉపేంద్రకిశోర్ సత్యజిత్ పుట్టుకకు దాదాపు ఆరేళ్ళముందే చనిపోతే, సుకుమార్ రాయ్ (సత్యజిత్ తండ్రి) ప్రెస్సు బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆయన కూడా మరణించాక కొన్నాళ్ళకి రాయ్, అతని తల్లి -ఇద్దరూ ఈ బంగళా వదిలి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయారు. “ప్రెస్సు” ఉన్న బంగళా ని రాయ్ వర్ణించిన విధానం ఎలా ఉంటుంది అంటే, అది చదివేసరికి, మనకు ఓ మనోచిత్రం వచ్చేస్తుంది ఆ ఇల్లు ఎలా ఉంటుందా? అని. ఇందాక చెప్పినట్లు – ఆయన ఎదురుగ్గా కూర్చుని ఇదంతా చెబుతున్నట్లు ఉంటుంది. ఇందులో ఉన్న బొమ్మలు రాయ్ గీసినవే. తన చిన్నప్పుడు ఎవరో స్నేహితులు తయారుచేసిన వస్తువు ఎలా ఉందో చూపడానికి ఈ బొమ్మలు గీసారు. ఈ ఛాప్టర్ తో మనకి రాయ్ వంశవృక్షంలో “హూ ఈజ్ హూ” అన్నది, ఆయా మనుష్యుల జీవన విధానం, హాబీలతో సహా అర్థమైపోతుంది. పుస్తకం ఆదిలో వంశవృక్షాలు గీసారు – రాయ్ తండ్రి తరపుదీ,తల్లి తరపుదీ.
రాయ్ తండ్రి మరణం తరువాత కొద్దిరోజులకే ఆయనా,వాళ్ళమ్మా ఇద్దరూ గోర్పార్ లోని ఆ ఇల్లు వదిలేసి ఆమె పుట్టింటివైపు వారి వద్దకు భవానీపూర్ వెళ్ళిపోయారు. అదంతా ఓ కొత్త ప్రపంచం చిన్నారి రాయ్ కి. ఇక్కడ కూడా మనకు రాయ్ సాక్షిగా రెండు ఊళ్ళ మధ్యా ఉన్న తేడాలు అర్థమౌతాయి. అయితే, ఇది చిన్నపిల్లవాడు చెప్పే కథ కాదనీ…పెద్దాయన చిన్నప్పటి అనుభవాలు నెమరువేసుకోవడం అని గమనించాలి. ఈ ఇంట్లోనే రాయ్ ఫొటోగ్రఫీ గురించి తెలుసుకున్నాడు. సినిమాల గురించి తెలుసుకున్నాడు. పుస్తకాల మధ్య మునిగాడు.మ్యాజిక్ గురించి తెలుసుకున్నాడు. మాణిక్ అన్న బాలుడు మనకు తెలిసిన సత్యజిత్ రాయ్ గా ఎదగడానికి తొలి అడుగులు ఇక్కడే మొదలయ్యాయి అనుకోవచ్చనుకుంటా. ఆ పరంగా ఆలోచిస్తే, ఆ ఇల్లు ఎంత గొప్పదో అర్థమౌతుంది. (అసలే నా వీరాభిమానానికి అదో గుడి అనిపిస్తుంది నాకు!) ఇవన్నీ చెబుతున్నప్పుడే రాయ్ తనకు ఇంద్రజాల విద్యతో కల్గిన పరిచయం గురించి వివరిస్తూ రెండు మూడు సంఘటనలు చెబుతారు. అది చదువుతూ ‘ఇదంతా ఓ కథలో రాసారు కదా’…అనుకున్నాను. అంతా అయ్యాక చివర్లో ఆయనే – ఇదంతా ఓ కథలో వాడుకున్నాను అని రాసారు. నిజం చెప్పొద్దూ…ఆ చివరి వాక్యం చదివాక నాకు భలే ఆనందం కలిగింది… కనిపెట్టేశా…కనిపెట్టేశా! అని. ఆ కథ కి తెలుగు అనువాదం ఇక్కడ చూడవచ్చు.
(http://www.prajakala.org/mag/2007/12/iddaru_indrajalikulu)
అప్పటి రోడ్లపై తిరిగే వాహనాల గురించి, అప్పటి సినిమాల గురించీ, స్వదేశీ మేళా గురించీ, ఫొటోలు తీయడం గురించీ – అప్పటి జీవితం గురించి కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. కనక్ బిశ్వాస్ అన్న ఆవిడ బెంగాలీ లో ప్రఖ్యాత గాయని. ఆమె సత్యజిత్ రాయ్ కి పిన్ని. తొలి రికార్డింగ్ నాడు ఆమె ఎంత కంగారుగా ఉన్నారో… బిడియం వదలడానికి ఎంత అవస్థ పడ్డారో చదివితే ఆశ్చర్యంగా అనిపించింది. ఠాగోర్ తో రాయ్ తొలి పరిచయం, సందేశ్ కి రాసే రచయితల గురించీ, సత్యజిత్ రాయ్ అప్పట్లో కలిసిన ప్రముఖుల గురించి చదవడం చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. ఇవన్నీ దాదాపు డెబ్భై ఏళ్ళ క్రితం నాటి కథలు.. అప్పటి వారు రాసిన పుస్తకాలు కాకుంటే ఏవి చెబుతాయి అప్పటి చరిత్రను? టీ రుచిని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చో రాయ్ వాళ్ళ చోటో కాకా రాసిన ఎంట్రీ చదివాకే అర్థమైంది. అది నవ్వుకి నవ్వూ, ఆశ్చర్యానికి ఆశ్చర్యమూ-రెండూ కలిగించింది నాకు. ఇక, తరువాత సెలవుల గురించి… రాయ్ సెలవు రోజుల్ని తాను ఎలా గడిపేవాడినో, ఎవరితో గడిపే వాడినో… ఏమి చేసేవాడినో వివరించారు. అది ఎంత సామాన్యమైన బాల్యమో ఈ భాగం చదివాక అర్థమౌతుంది. ఈ క్షణాన కాస్త ఓ నలభై ఏళ్ళు పైబడ్డ మనిషి ఎవరన్నా తన చిన్నప్పటి సెలవుల గురించి రాస్తే, దానికీ, దీనికీ చాలా పోలికలు కనిపిస్తాయి. అంత “స్టోరీ నెక్స్ట్ డోర్” తరహా బాల్యం రాయ్ ది. అలాంటి మనిషి ఇంత గొప్ప మనిషి అవడం వెనుక కథ మాత్రం ఈ పుస్తకంలో లేదు…. అస లేపుస్తకంలోనైనా ఉందో లేదో… రాయ్ జీవితచరిత్ర ఎవరన్నా రాసి ఉంటే అందులో ఉండి ఉండొచ్చు. తనతో ఆడుకున్న స్నేహితులూ… వారి ప్రస్తుత వ్యాపకాలు ఇవన్నీ చెబుతూ ఉంటే, మీరూ మీ జ్ఞాపకాల్లోకి వెళ్ళక మానరు. ఆ శైలి అటువంటిది. అతి సాధారణంగా ఉంటుంది. అలా చదివేకొద్దీ మనలో ఇంకుతుంది… నా మటుకు నాకైతే మళ్ళీ మళ్ళీ చదవాలని కూడా అనిపిస్తోంది. చివరి అంకం – స్కూలు రోజుల గురించి. రాయ్ లో సహజంగా ఉండే హాస్యం ఇక్కడ బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక చోట, తన టీచర్ ని వర్ణిస్తూ.. “ఆయన షర్టు కాలర్లు పెద్దగా ఉండేవి..ఎంతగా అంటే, అవి గాలికి ఎగిరినప్పుడల్లా ఆయన రెక్కలు తగిలించుకుని గాల్లోకి ఎగరబోతున్నట్లుగా..” – ఈ తరహా వర్ణనలు రాయ్ రచనల నిండా ఉంటాయి. అందుకే చదువుతున్నంతసేపూ పాఠకుల పెదాలపై సన్నని చిర్నవ్వు చెదరకుండా ఉంటుంది.
ఇక్కడితో చిన్ననాటి అనుభవాల భాగం ముగిసి, సినిమాల గురించిన భాగం మొదలౌతుంది పుస్తకంలో. నా ఈ వ్యాసం రాయడానికి కారణం ఈ పుస్తకాన్ని సమీక్షించడం కంటే కూడా…రాయ్ బాల్యం గురించి ఆయనే చెప్పిన కథ గురించి మీతో పంచుకోవడం. రాయ్ జ్ఞాపకాల దారుల్లో వదిలిన పాదాల ముద్రలని అనుసరించి ఆయన జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం..అంతే. సత్యజిత్ రాయ్ అన్న మనిషిని…సినిమా డైరెక్టర్ గానో…రచయిత గానో… లేక అనేకానేకమైన విద్యలున్న మేధావిగానో చూడకుండా మామూలు మనిషిగా కూడా చూడాలి అన్న ఆసక్తి ఉన్న వారు ఈ పుస్తకం ద్వారా కొంతవరకూ తెలుసుకోవచ్చనే అనిపిస్తోంది నాకు. సత్యజిత్ రాయ్ ఆయన కుటుంబం గురించి మాట్లాడిన ఏకైక పుస్తకం ఈ “Childhood days” కనుక, ఆ పరంగా చూస్తే ఇది చాలా విలువైన పుస్తకం.
Childhood Days: A memoir -Satyajit Ray
(Translated from bengali by Bijoya Ray)
Penguin publishers
Rs:250
తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.
ఎన్నో వివరాలతో చాలా బాగుంది వ్యాసం. పుస్తకం మీద ఆసక్తిని కలుగజేసారు. నెనరులు.
నాకు తెలిసీ పుస్తక సమీక్ష రాయడమంత కష్టమైనది ఇంకోటి లేదు.. వందల పేజీల సారాంశాన్ని/సారాన్ని రెండు మూడు పేజీల్లో అందించగలగాలంటే భాష మీద ఎంతో పట్టు ఉండాలి.. ఏది ఎంత మాత్రం చెప్పాలో తెలియగల నైపుణ్యం ఉండాలి.. ఇవి రెండూ ఉండి ఎంతో సమర్ధవంతగా సమీక్ష రాసేది మీరే! అదీ కాక వెంట వెంటనే రాయగలిగేది కూడా మీరే!! ఇప్పుడే నవతరంగంలో మీ వ్యాసం చదివి అనుకున్నా ‘ఎక్కడ చూసినా తన వ్యాసాలు ఉంటాయి.. అసలు టైం ఎలా దొరుకుతుందో’ అని! అంతలోనే ఈ వ్యాసం చూడటం తటస్థించింది!! Excellent analysis!
@Nagaraja Garu: Thanks
@Nishiganda : Double Thanks… 🙂
🙂 నీవీరాభిమానం బాగా వ్యక్తమయింది సౌమ్యా. మామూలుగా నాకు జీవితచరిత్రలలో నాకు ఆసక్తి లేదు కానీ నిషిగంధ చెప్పినట్టు నువ్వు చదివించేలా చేస్తావు. కనీసం నీ సమీక్షలు తప్పకుండా చదువుతాను.
మాలతి
A good tribute to the great man on his birth day, by a great fan.Keep it up.
do u rapid read ?
సత్యజిత్ రాయ్ వంటి ఉన్నత విలువలు గలిగిన వ్యక్తి గురించి, ఏదో అభిమానం చూపించి వదిలేయకుండా ఇంత మంచి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఏదో ఒక క్షణంలో ఎవరో ఒకరైనా ఇలాంటివి చదివి ఇన్స్పైర్ అయి తమ వ్యక్తిత్వాన్ని మార్చుకునే అవకాశాన్ని కలిగిస్తాయి ఇలాంటి వ్యాసాలు.
@Malathi garu, Mohan garu and Nuvvu setty brothers: ధన్యవాదాలు..
@Sujatha: No, I dont. I am a moderate pace reader…only that I am a bit more regular…. 😉
నిజంగా మీలో మంచి కళాత్మక స్పృహ ఉంది. మీ రచనలు చదివిన తరువాత నాకు మంచి ప్రేరణ కలిగింది.
[ఈ వ్యాఖ్య RTS నుంచి తెలుగులోకి మార్చబడింది. -సం.]
Thank you, soumya garu.
సౌమ్య గారు, మీ రచనలు చాల బాగుంటాయి