ఉగాది సంపాదకీయం

-స్వాతికుమారి

“ఈ నెలలో ఐదు శుక్రవారాలొచ్చాయి.”

“ఈ మంత్ లో ఫయివ్ ఫ్రైడేస్ ఉన్నాయి” అని కాకుండా పై విధంగా ఏ చదువుకున్న తెలుగువాడైనా అంటే ఆశ్చర్య పోవటమో, ముసిముసిగా నవ్వటమో, అలా అన్న వ్యక్తితో కొంచం చనువుంటే “are you alright?” అని మేలమాడ్డమో వీటిల్లో ఏదో ఒకటి తోటి తెలుగువాడి ప్రతిస్పందనగా ఎదురయ్యే స్థితిలో ఉంది ప్రస్తుతం తెలుగు జాతి.

దైనందిన జీవితంలో తెలుగు:

ఈ సమస్య సామాజిక పరిణామంత పెద్దదైనప్పటికీ, పరిష్కారం మాత్రం ప్రతివ్యక్తి/సంస్థ తనకి తాను అమలు చేయగలిగిన చిన్న మార్పుల ద్వారా సాధ్యమౌతుంది.

ఏ భాషైనా జీవనది లాంటిది. ఎన్నో పిల్లకాలువ లొచ్చి నదిలో కలుస్తుంటాయి. అలానే కలిశాయి. బస్సు, రైలు లాంటి ఎన్నో పదాలను తెలుగు భాష లోకి సాదరంగా అహ్వానించాం. తెలుగు భాషకి అన్యభాషా పదాలని తనలో కలుపుకొనే వెసులుబాటు ఉంది. కాబట్టి -మన భాషలో ఇలాటి అన్యభాషా పదాలు వచ్చి చేరాయి, చేరుతూ ఉంటాయి, మన భాషలో లీనమైపోతుంటాయి. ఇదే విధమైన సహజ పరిణామక్రమం కొనసాగి ఉంటే ఇది మనకు ఇంతటి ఆందోళన కలిగించి ఉండేది కాదు.

కానీ ప్రపంచీకరణ, సమాచార/సాంకేతిక విప్లవ ప్రభావమో మరేమో కానీ గత కొన్నేళ్ళుగా తెలుగు భాష పిల్లకాలువల్ని కలుపుకోవటం మాని తనే వెళ్ళి ఒక మహాప్రవాహంలో కలిసి ఇంగ్లీషులో ఐక్యమైపోయే దిశగా మళ్ళింది. ఈ సంపాదకీయం మొదట్లోచెప్పిన ఉదాహరణే ఇందుకు సాక్ష్యం. ఇదేమీ ఉన్నట్టుండి వచ్చి పడిన ఉపద్రవం కాదు. దాదాపు ఒక రెండు దశాబ్దాలుగా ఈ మార్పు చాలా స్పష్టంగా తెలుస్తున్నా, దానిని అభివృద్ధిగా భావించి నిర్లక్ష్యం చెయ్యటం వల్లే ప్రస్తుతం సగం పైగా ఇంగ్లీషుతో సంకరమైపోయిన తెలుగు భాషను మాత్రమే మనం వినగలుగుతున్నాం.

అసలు ఈ పరిస్థితికి కారణాలను అన్వేషిస్తే ఈ కింద చెప్పినవి ముఖ్యంగా కనపడతాయి.

  1. విదేశాలలో మంచి ఉద్యోగావకాశాలు ఉండటం వల్ల ఆ దిశగా సిద్ధం చేసే ఆంగ్లమాధ్యమం లోని చదువే గొప్పదని మధ్యతరగతి వర్గంలో బలపడ్డ అభిప్రాయం.
  2. వ్యావహారిక, మాండలిక, పుస్తక స్థాయిల్లోని తెలుగు తర్వాత ఇంగ్లీషులో మాట్లాడ్డమే మెరుగైన నాగరికతా చిహ్నంగా పల్లెటూరినుంచి నగరానికి వలస వచ్చాక తమ జీవన విధానంలోని అభివృద్ధిని తెలియజేసే సాధనంగా భావించడం.
  3. గత కొన్నేళ్ళుగా ఇక్కడ విస్తృతంగా ఉద్యోగాలు కల్పిస్తున్న విదేశీ సంస్థలలో తెలుగువాళ్ళు పని చేయటంవల్ల భాష లోనూ, ఆచార వ్యవహారాల్లోనూ పొడసూపే మార్పులకి సర్దుబాటవటం కోసం సొంత భాష, సంస్కృతులను నిర్లక్ష్యం చెయ్యటం.
  4. ఎటువంటి ఉద్యోగాల్లోకైనా అభ్యర్ధుల ఇంగ్లీషు సామర్థ్యాన్ని ఆశించినట్టు, మాతృ భాషా జ్ఞానాన్ని ఏ సంస్థలూ అడగకపోవటం. ఇందువల్లే చాలామంది, తెలుగురాకపోతే నాకొచ్చే నష్టం ఏమిటి అని ప్రశ్నించగలుగుతున్నారు.

ఇలాంటివే మరికొన్ని కారణాలు.

ఐతే ఇక్కడ సమస్య ఇతర భాషలు నేర్చుకోవటం కాదు. మాతృభాష వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదనే నిర్ణయానికి వచ్చి, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యటం. మరోలా చెప్పాలంటే నాకు తెలుగు సరిగ్గా రాదు అని గర్వంగా చెప్పుకోగలగటం. ఐతే మాతృభాష మట్టిగలిసిపోనీ గాక – మనకొచ్చే జీతమేమైనా తగ్గుతుందా, అసలు మనకి తెలుగు రాకపోతేనేం? వేరే భాషతో కలగాపులగం చేస్తేనేం? అనే ప్రశ్నలకి ఆర్ధిక లాభనష్టాల భాషలో సమాధానం ఇవ్వటం కష్టమే. కాకపోతే మాతృభాషని మర్చిపోవటంవల్ల మన ఆత్మని, అస్తిత్వాన్ని కించపరచుకున్న వాళ్ళమౌతాము. ఎన్నో గొప్ప భావవ్యక్తీకరణలను, సాహితీ సంపదను, సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించలేని మూఢులమౌతాము.

ఇంతకీ మనందరం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఇతర భాషలను నేర్చుకోవటంద్వారా జ్ఞానాన్ని పెంచుకోవటం, భాషేతరులతో సత్సంబంధాలు, అభివృద్ధి – ఇవి మాత్రమేలక్ష్యాలు. కానీ రోజువారీ జీవితంలో వాటికి మాతృభాషని మించిన ప్రాధాన్యం ఇవ్వటం (అవసరం లేని సందర్భాల్లో కూడా) నిశ్చయంగా ఇతరుల దృష్టిలో (వాస్తవంగా కూడా) మనని మనం దిగజార్చుకోవటమే.

ఈ సమస్య సామాజిక పరిణామంత పెద్దదైనప్పటికీ, పరిష్కారం మాత్రం ప్రతివ్యక్తి/సంస్థ తనకి తాను అమలు చేయగలిగిన చిన్న మార్పుల ద్వారా సాధ్యమౌతుంది.

1. ఎదుటి వ్యక్తి తెలుగువాడే అయినప్పుడు అంకెలు, వారాల వంటి వాటిని, ఇతర సాధారణ సంభాషణల్లోని పదాలను తెలుగులోనే చెప్పటం అలవాటు చేసుకోవాలి.
2. అభ్యర్ధుల ఇంగ్లీషు సామర్ధ్యాన్ని పరీక్షించే సంస్థలు మాతృభాషలో కనీస అవగాహన ఉండటం కూడా ఒక తప్పనిసరి అర్హతగా గుర్తించాలి.
3. మనలో, మన వాళ్ళలో తగ్గిపోతున్న (తెలుగు) చదివే అలవాటును మనకు మనంగా పునరుద్ధరించుకోవాలి. ఏ విషయాన్నైనా మాతృభాషలో చదివి అర్ధం చేసుకోవటంవల్ల ఆలోచనా విధానం, అవగాహనా శక్తి తప్పక మెరుగౌతాయి.

పైన చెప్పినవాటితో పాటు ఇతర మార్గాల్లో తెలుగు భాష పునరుద్ధరణ కోసం ఇప్పటికే కొంత కృషి జరుగుతోంది. ఈ మధ్య కాలంలో అంతర్జాలంలో ఎందరో తెలుగువారు బ్లాగుల ద్వారా, చర్చావేదికల ద్వారా మరుగున పడ్ద సాహిత్యాన్ని, భాషా విజ్ఞానాన్ని అందరితోపంచుకొని తమ తోటి వారికి అవగాహన కల్పించగలిగారు. వర్ధమాన రచయితలకు కూడా ఇవి మంచి వేదికలుగా మారాయి. ఇదిలా ఉండగా మరికొందరు ఔత్సాహికులు ఆన్‌లైన్ పత్రికల ద్వారా భాషాభివృద్ధిని, ప్రాచీన సాహితీ ప్రక్రియల్నీ ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా ఆశాజనకమైన పరిణామం. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ‘పొద్దు’ వినూత్న శైలిలో ‘భువన విజయం’ పేరిట దేశ విదేశాల్లోని తెలుగువారితో ఆన్‌లైన్ కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. దీనిని ఉగాది పర్వదిన సందర్భంగా పాఠకులకు సవినయంగా సమర్పిస్తున్నాం.

భావితరాల కోసం తెలుగు:

మనకి మనం భాష ప్రాముఖ్యతని, అవసరాన్ని, గొప్పతనాన్ని గుర్తించటం వల్ల కొంతవరకూ ఉపయోగం ఉన్నా.., అంతకన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు రాబట్టాలంటే మనపిల్లలకు ఈ వారసత్వాన్ని అందించటం ముఖ్యం. మాతృభాషలో కనీస జ్ఞానం సంపాదించక పోయినా ప్రాథమిక స్థాయి నుండి వృత్తి విద్యల వరకూ ఏదైనా పూర్తిచెయ్యగల విద్యావిధానాన్ని అనుమతించిన ప్రభుత్వాల్ని తప్పుపట్టేకన్నా, ఎవరి పిల్లల విషయంలో వారికి ఆచరణసాధ్యమైన సూత్రాలు కొన్నిటిని పాటించవచ్చు.

– పిల్లలకి ఇంగ్లిష్ ఒక్కటే కాదు, ఇంకో డజను భాషలు నేర్పినా తప్పు లేదు. కాని ఆ నేర్చుకునే భాషల్లో తెలుగు కూడా (!) ఉండేలా చూడాలి.
– పిల్లల్ని బళ్ళో వేసేప్పుడు తెలుగు మాట్లాడితే ఫైన్ తరహా నియమాల్లేకుండాచూసి, కనీసం రెండో, మూడో భాషగా ఐనా తెలుగు నేర్పేచోట చేర్చటం.
– పిల్లలకి తెలుగు కథలు, పద్యాలు వంటివి నేర్పటం. (ముందు మనంనేర్చుకోవాలి). సామెతలు, జాతీయాల వంటివి మనం వాడటం ద్వారా వాళ్ళకి ఆసక్తిని కలిగించి భాషనే కాక, లోక జ్ఞానాన్ని కూడా నేర్పిన వాళ్ళమౌతాము.
-వారి వయసుకు, స్థాయికీ తగ్గ పుస్తకాలను ఎప్పటికప్పుడు కొని చదివిస్తూ, ఆ చదివిన దాని సారాన్ని వాళ్ళు తిరిగి మనతో చర్చించేలా అలవాటు చెయ్యాలి. పిల్లలకు ఇచ్చే బహుమతుల్లో పుస్తకాలు, డైరీలు ఉండేలా చూస్తే అవి విలువైన వస్తువులనే అభిప్రాయం కలగటమే కాకుండా భాషను చదవటమూ తిరిగి రాయటం మీదా కూడా పట్టు సాధించగలుగుతారు.
– మంచి సాహిత్యం, అర్ధం ఉన్న పాటలను వినిపించటం, భాషా ఉచ్చారణ చక్కగా ఉండే టీ వీ కార్యక్రమాలను చూపించటం ద్వారా వారికెన్నో కొత్త పదాలను,వాడుకను నేర్పవచ్చు. మంచి భాషాభిరుచిని పెంపొందించవచ్చు.

చిన్నారులకి ఏం నేర్పినా భాషలోని మాధుర్యాన్ని వారు అస్వాదించి అర్ధంచేసుకునేలా మానసికంగా సిద్ధం చెయ్యటం అవసరం. లేదంటే, ప్రపంచమంతా వేరేలా ఉంటే తమని మాత్రం మనం తెలుగు నేర్చుకొమ్మని నిర్బంధిస్తున్నామనే భావన వాళ్ళకి కలగొచ్చు. వ్యక్తిగతంగా తల్లిదండ్రుల బాధ్యతగానే కాక, ఒక సామాజిక బాధ్యత గల పత్రికగా ఈ దిశగా పొద్దు వైపు నుంచి మేము కొన్ని ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నాం. పిల్లల్లో తెలుగు పుస్తక పఠనాభిరుచిని పెంపొందించడంలో తల్లిదండ్రులకు సాయపడే దిశలో మా ఆలోచనలు సాగుతున్నాయి. మా ఆలోచనలు అమలు జరిపే దశకు చేరుకున్నాక, వీటి వివరాలను ప్రకటిస్తాం.

మా ఈ ప్రయత్నాలన్నిటికీ ఎప్పటిలానే పాఠకుల, రచయితల తోడ్పాటు, ప్రోత్సాహం ఉంటాయని మా పూర్తి నమ్మకం. ఇదంతా మనందరం కలిసి సాధించవలసిన ఒక మహోన్నత లక్ష్యం.

————

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యుల్లో ఒకరు.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

11 Responses to ఉగాది సంపాదకీయం

  1. జాన్ హైడ్ కనుమూరి says:

    అభినందనలు స్వాతి గారు

    విజయోస్తు

  2. Lalitha G says:

    “పిల్లల్లో తెలుగు పుస్తక పఠనాభిరుచిని పెంపొందించడంలో తల్లిదండ్రులకు సాయపడే దిశలో మా ఆలోచనలు సాగుతున్నాయి.”
    ఇది స్వాగతించ వలసిన విషయం.
    ఇందులో భాగంగా మంచి పిల్లల పుస్తకాల గురించి వివరంగా పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను.
    పిల్లలకు తెలుగు (నిజానికి ఏ భాషా skills అయినా)నేర్పడానికి తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం కావాలి అని నేను నమ్ముతాను.
    http://www.telugu4kids.com

  3. స్వాతి గారూ, పొద్దు సంపాదకవర్గంలో భాగమైందుకు హృదయపూర్వక అభినందనలు..

    వ్యాసం చాలా చక్కగా రాశారు.. జీవనది లాంటి భాష పిల్ల కాలువలా అయిపోతున్నదన్న భావం ఆవేదనని కలుగజేస్తున్నది.. మీ కవి సమ్మేళనం ఆలోచన అమోఘం!

    పొద్దు సంపాదక వర్గానికి ఉగాది శుభాకాంక్షలు..

  4. పొద్దు సంపాదకులకు నాదొక వినతి, విజ్ఞాపన, సందేహం, ఆరోపణ (ఏదో ఒకటి ) … రాన్రాను పొద్దు పత్రిక కవులు, రచయితలు, రచయిత్రులు, ఉద్ధండ పండితులు రాసిన రచనలతో నిండిపోతుంది. ఇది మంచి పరిణామమే. కాని నా లాంటి సామన్య ప్రజలేమైపోవాలి. అందులో పావు భాగం మాత్రం అర్ధమయ్యే పాండిత్యం ఉన్నవాళ్ళం. అందుకే కాస్త సామాన్య ప్రజలు రాసిన, పాఠకులు కూడా చురుకుగా పాల్గొనే మరి కొన్ని విభాగాలు చేర్చండీ. ఇంకా మహిళలకు ఒక ప్రత్యేక పేజి మొదలుపెట్టకూడదు. మహిళా బ్లాగర్లు తమకున్న నైపుణ్యాన్ని చూపించుకుంటారు. అదేంటో మరి.. పొద్దు పత్రిక రోజు రోజుకు మరీ సీరియస్ పత్రిక ఐపోతుంది.

  5. స్వాతిగారూ, నాఅభినందనలు స్వీకరించండి. మీరన్నట్టు ఇంగ్లీషు ఎంత అలవాటైపోయినా, తెలుగుమీద అభిమానం వుంటే ఒకక్షణం ఆగి ఫైడే అనడానికి బదులు శుక్రవారం అనే ప్రయత్నం చెయ్యాలి. ముఖ్యంగా బ్లాగుల్లో వ్యాఖ్యలలో సగం సగం కనిపించే ఇంగ్లీషు చూస్తే నాకు ఆశ్చర్యంగా వుంది. ఏమైనా మీసలహాలు బాగున్నాయి.

  6. స్వాతిగారూ, ఈ వ్యాసం చాలా బాగా రాశారు. మీరు చెప్పిన విషయాలు కొన్నిటితో ఏకీభవిస్తాను, మరి కొన్నిటితో ఏకీభవించను గానీ మీరు దీన్ని గురించి బాగా ఆలోచించి రాశారు అనిపిస్తోంది. అవును రోజువారీ సాధారణ వాడుకలో మనం ఎంత తెలుగు వాడుతున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే పిల్లల విషయంలోనూ. పిల్లలు తమ తలిదండ్రుల నించే కాక చుట్టూ వాతావరణాన్నించి కూడ అనేకం గ్రహిస్తారు. నాకు బాగా చిన్నప్పుడు మా యింట్లో ఒక చిన్న కుటుంబం అద్దెకుండేవారు. వాళ్ల పిల్లలు మాకంటే బాగా చిన్న వాళ్ళు. మేం పోటీలు పడి తెలుగు పుస్తకాలు చదవడం, పాత సినిమా పాటలు వినడం .. దీంతో వాళ్ళకీ బాగానే తెలుగు పిచ్చి పట్టుకుంది.
    మొన్న ఆదివారం ఇక్కడ మా వూళ్ళో పిల్లలకి తెలుగు పద విజ్నాన పోటీలు జరిగాయి. సుమారు 50 మంది పిల్లలు, వివిధ వయసుల వాళ్ళు పాల్గొన్నారు. ఎవరైనా సరైన సమాధానం చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొట్టటం, చివరికి చక్కటి ట్రోఫీలు ఇవ్వడం .. ఇవన్నీ పిల్లల్లో “ఇది కూడా నేను నేర్చుకోవాలి” అనే కాంక్ష kaలగ జేస్తాయి.
    మీరు గనక ఏదన్నా ఎపార్టుమెంటు కాంప్లెక్సు లో ఉంటే, పిల్లకాయల్ని కూడ గట్టి ఒక ఆదివారం పూట మీరే నిర్వహించొచ్చు ఇలాంటి పోటీ. ఒక నాలుగు 5-స్టార్లు బహుమతి అంటే సరి.

  7. జ్యోతి గారూ, మీ సొంతం సరదా పేజి ఒకటుండేది గదండీ. మళ్ళీ మీరే పునరుద్ధరించి నడిపితే సరి. ఐనా ఇక్కడ సామాన్య ప్రజలూ ఉద్దండ పండితులూ అంటూ వేర్వేరుగా ఎవరూ లేరండీ .. లోకోః భిన్న రుచిః – అంతే

  8. అయ్యో కొత్తపాళిగారు, నేను చెప్పింది సరదా కోసం కాదు. పొద్దులోవచ్చిన కవితలు, వ్యాసాలు, మొన్నటి భువనవిజయం లోని పద్యాలు అర్ధం చేసుకోవాలంటే నాకు ఎన్ని రోజులు పడతాయో మీకేంతెలుసు? ఈనాడులోని వసుంధరలా, ఆంధ్రజ్యోతిలోని నవ్యలా పొద్దులో కూడా ఒక లలన పేజిని మొదలుపెట్టమని కోరుతున్నాను. ఎలాగూ స్వాతి సంపాదకవర్గంలో చేరింది కాబట్టి తను చూసుకుంటుంది గదా అని. అది కూడా వీలైతేనే.

  9. radhika says:

    స్వాతిగారూ అభినందనలు.చక్కని పరిష్కారాలు సూచించారు.
    @కొత్తపాళీ గారు మేము కూడా మా ఊరిలో అలానే చేసేవాళ్ళము “బాలగోకులం” పేరుతో.తెలుగనే కాకుండా ఎవరి మాతృభాషలో వాళ్ళు చెప్పేలా.ఒక 3 నెలలు చాలా బాగా జరిగింది.తరువాత తరువాత తల్లిదండ్రులకు ఆశక్తి తగ్గింది.వారం వారం బహుమతుల పంపిణీ,అలాగే నిర్వహణా ఖర్చులు పెరగడం,మేము ఒకవారం అందుబాటులో లేకపోతే ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వంటి పరిస్థితులవల్ల ఆపేయవలసి వచ్చింది.నిజం చెప్పొద్దూ పిల్లలు మాత్రం చాలా ఆశక్తిగా,ఉత్సాహం తో నేర్చుకునేవారు.

  10. gks raja says:

    స్వాతి గారు!. సంపాదకీయం చాలా చక్కగా వ్రాశారు. మీ ఉద్దేశ్యం ఇది ప్రవాసాంధ్రుల లోనే ఎక్కువగా ఉందనా? మొత్తం సమాజం అంతా ఇలాగే మార్పు చెందుతూ ఉంది. ఫ్రెంచ్, చైనీస్, జపానీస్ మొదలగు వారు వాళ్ళ భాషను వదల కుండానే అభివృద్ధి,
    అంతర్జాతీయ సంబంధాలు సాధించడం లేదా. మీ వంటి వారి కృషి వల్ల తప్పక ఫలితం ఉంటుంది.

    ఏప్రిల్ 16, 2008 – ఉద 2:28

  11. తెలుగు గురించి మరో మాట టీవిలో వచ్చే పరిచయ కార్య క్రమాలల్లో పరిచయ కర్త ఎదుటివారి మాటలకు మాటిమాటికి ఎదుటి వ్యక్తి తో ఓకే,యస్,నొ, ….ఇలా అంటుంటారు. వంటల కాఅర్యక్రమంలొ చూడాలి బలే తమాషాగా వుంటుంది. …..ఇప్పుడు కొంచెం కరియండమ్ పౌడర్ వేయాలి, ఆ తర్వాత జింజర్ పౌడర్ వేసి తరిగిన ఆనియన్ ముక్కలు వేసి, …….ఇలావుంటుంది వారి సంభాషణ. ఇది వింటుంటే నాకు అదోమాదిరిగా వుంటుంది. ప్రస్తుతం పరిస్తితి ఎలా వుందంటే “ఎవరైన ఐదు నిముషాలపాటు ఆంగ్ల పదం రాకుండా మాట్లాడ గలరా .. పందెం కట్తాం” అంత వరకు వచ్చింది.
    నాకనిపిస్తుంది అలా మట్లాడే వారికి సమాజంలో తమ పరపతి పెరుగుతుందనుకుంటారనిపిస్తుంది.

Comments are closed.