అభినవ భువనవిజయము -9- సర్వధారికి సుస్వాగతము

(<< గత భాగము)

‹కొత్తపాళీ› విశ్వామిత్రా .. కొత్త సంవత్సరానికి స్వాగత పద్యం ఏమన్నా చెబుతారా?
* రాఘవ సాహిత్యంలో చేరారు
‹విశ్వామిత్ర› చిత్తగించండి

సీ. తెలుగింట తొలినాడు పలు రుచులను కల-
గలపు పచ్చడందు పులుపు నాది!
వనమంత తిరుగాడి తనగొంతు ఎలుగెత్తి
బులుపించు పాటకోయిలయు నాది!
మదికింపు గలిగించి మరులెన్నొ గురిపించి
మన్మధు మురిపించు మల్లె నాది!
తిమిరమ్ము తొలగించి దీపమ్ము వెలిగించి
నవ్య కాంతు లీను రవియు నాది!

ఆ.వె.

అనెడి ఆమనికిదె ఆహ్వానమనెదను
ఆరు ఋతువులకును ఆది;ఆశ
లకు పునాది, మా తెలుగువారి యుగాది
శాంతి సుఖములిమ్మ సర్వధారి.

‹నాగరాజు› వావ్..
‹కొత్తపాళీ› భలె భలె
‹రాకేశ్వరుఁడు› అద్భుతం
‹molla› భళీ
‹రాఘవ› భళీ
‹చదువరి› బ్రహ్మాండంగా ఉంది పద్యం!
‹నాగరాజు› మన్మధుడిని మురిపించే మల్లె – ఏం చమత్కారమండీ! ఆయన పంచబాణాల్లో అది కూడా ఒకటి కాదూ!?
‹భట్టుమూర్తి› విశ్వామిత్ర, ఇలాంటి సీసాలు విన్నప్పుడే … ఫుల్లు సీసా కొట్టినంత కంటే మాంచి కిక్కు వస్తుంది.
‹చదువరి› భట్టుమూర్తి, 🙂
‹విశ్వామిత్ర› భట్టుమూర్తి, 🙂 :0
‹కొత్తపాళీ› భట్టుమూర్తి, ఫుల్లులెందుకు నాయనా .. పుల్లసరోజనేత్రలను చూచుకొమ్ము
‹భట్టుమూర్తి› ‘ఫుల్లు’సరోజ నేత్ర … హహ్హహ్హ
‹భట్టుమూర్తి› ఎంత బాగుందీ పద్యం ! సీరియస్ గా చెబుతున్నా… చివర్లో శాంతిసౌఖ్యాలిమ్మని సర్వధారిని కోరుతూ ముగించడం గొప్పగా వుంది!
‹రాకేశ్వరుఁడు› నాకెక్కడో శ్రీశ్రీ కవితల్లోని దూకుడు కూడా కనిపిస్తుంది ఈ సీసంలో…
‹కొత్తపాళీ› రాకేశ్వరుఁడు, శ్రీ శ్రీ కవిత చాలా వరకూ రగడల్ని అనుసరించి రాశాడు. రగడలు సీసానికి దగ్గరి అక్కచెల్లెళ్ళే.
రాఘవ› ఓహో… నేను శ్రీశ్రీని అంతగా చదవలేదు
‹రాకేశ్వరుఁడు› కొత్తపాళీ, ఈ రగడలను ఓ పట్టు పట్టాలైతే…

‹విశ్వామిత్ర› అదే చమత్కారం, మళ్లీ ఉగాది చివరి పాదం ఒక్కటీ మార్చి వస్తా

‹molla› అడగొచ్చా, విశ్వామిత్రుడు ఎవరూ?
‹చదువరి› మొల్ల, మీరెవరో చెప్పకుండానే..!?
‹molla› నేను మొల్లనే!
‹విశ్వామిత్ర› విశ్వానికే మిత్రుడు. మిగతా వివరాలు పొద్దులో.
‹molla› సరే.

‹కొత్తపాళీ› రాఘవ కవీ మళ్ళీ వేంచేశారు .. మీ వంతు … పొద్దుపొడుపును వర్ణించండి
‹రాఘవ› తప్పకుండా. అవధరించండి.

త. తెలుపుచూ మన భాష కీర్తిని దేశదేశములందునూ
కలుపుకోలుతనమ్ముఁ జూపుచు, ఆంధ్రసాహితి వెల్లువన్
నిలుపువారికి నూతమిచ్చుచు నిర్మలోత్సుకతన్ మరో
మలుపు తిప్పెను పొద్దు పత్రిక పంచనెజ్జనపుత్రియై.

* బ్లాగేశ్వరుడు సాహిత్యంలో చేరారు (అంతవరకూ మౌన ప్రేక్షకులుగా పద్యాలను ఆలకిస్తూ వుండిన ఒరెమూనాగారు బ్లాగేశ్వరుని రాకను సభాధ్యక్షులకు తెలియజేశారు)
‹విశ్వామిత్ర› బ్లాగేశ్వరులకి వందనాలు,
‹రాకేశ్వరుఁడు› బ్లాగేశ్వరుడు, మీరు చాలా మిస్సయ్యారు … మఱి …
‹చదువరి› బ్లాగేశ్వరుడు, స్వాగతం!
‹బ్లాగేశ్వరుడు› అందరికి వందనాలు

‹కొత్తపాళీ› చదువరి, మీ ‘పొద్దు‘ని కూడ వెలయించండి
‹చదువరి›

జాల మహా సముద్రమున జాలరి వీరులు గూగిలించుచో
వేలకు వేలుగా పడును పెద్దవి చిన్నవి సైటులెన్నియో
తాలులు తప్పలన్ విడిచి నాణ్యత కల్గిన వాటినెంచినన్
పూలగు సైటులందొకటి పొద్దయి నిల్చిన ముద్దగున్ గదా

‹విశ్వామిత్ర› “గూగిలించుచో” బావుంది ప్రయోగం
‹కొత్తపాళీ› రూపకం మొదటి పాదంలో శోభించింది
‹రాఘవ› భలే… రంజుగా వుందీ పజ్జెం
‹రాకేశ్వరుఁడు› చదువరి, భావకవిత్వపు రూపకాల్ని బలే బంధించారు ఛందస్సులోఁ
‹భట్టుమూర్తి› నాలుగోపాదంలో … పూలగు … ఆంగ్లమేనా?
‹చదువరి› భట్టుమూర్తి, ఔను
‹బ్లాగేశ్వరుడు› చదువరి గారు భళి భళి
‹రాఘవ› నాకు ఇక్కడకి ఆ పూలవాసన తెలుస్తోంది

‹కొత్తపాళీ› కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మరి కొందరు కూడా రాశారు .. రాకేశ్వరా, నీదొక సీసం ఉన్నట్టుంది, కానివ్వు.
‹రాకేశ్వరుఁడు› నా సీసమా … తెరుస్తాను కాసుకోండి
‹రాకేశ్వరుఁడు› ఇది యుగాది గీతం.
సీ. కాలముతో నాయె కారులె తురఁగలు,
‹రాఘవ› గీతమా?
‹నాగరాజు› రాఘవ – రాకేశ్వరుడు చెపితే అది ‘గే’తము కదా?
‹రాఘవ› నాగరాజు, కేకకి నిర్వచనం చెప్పారు కదా
‹కొత్తపాళీ› తురకలా?
‹విశ్వామిత్ర› తురఁగలు. ఓహో గుఱ్ఱాలా!
‹రాకేశ్వరుఁడు› వినండి.

సీ. కాలముతో నాయె కారులె తురఁగలు,
యంత్రము లొచ్చెను యడ్ల బదులు
సూర్యుడు తారాయె సోముడు రాయాయె,
మాఱెను మా తిండ్లు మాఱెనిండ్లు
ఎన్ని మాఱిన యిల నన్ని మాఱిన గాని,
నీవు మాత్రము యిలా నెపమెఱుఁగక
శివమహా రాత్రికిఁ శ్రీరామ నవమికిన్
నడుమనే వత్తువు నడుమ మాకుఁ
తేగీ. ఆశనే నమ్మిన జనుల కాశ నమ్ము
కొను యో పబ్బరాజమా, గుఱుతు నీవు
మాఱు కాలానికే, మఱి మాఱుతువని
యునికి మాది నమ్ముటయెలా? యో యుగాది!

‹కొత్తపాళీ› పబ్బ రాజమా .. బాగుంది
‹విశ్వామిత్ర› పబ్బరాజమా బాగు
‹భట్టుమూర్తి› చాలా బాగుంది
‹నాగరాజు› చాలా బావుంది రాకేశ్వరా – నీ పద ప్రయోగాలు అన్నీ అదుర్సు.
‹రాఘవ› పాతదనం చెప్పడంలో మరీ పురాతనానికి వెళ్ళి అతిశయోక్తి ఛాయ కూడ తెచ్చారు కదా… భళా
‹కొత్తపాళీ› ఉగాది పండుగ శివరాత్రికీ శ్రీరామ నవమికీ మధ్య రావడం కూడా మంచి సందర్భోచితంగా ఉంది
‹భట్టుమూర్తి› ఔను… ఉగాదిని పబ్బరాజమనడం బాగుబాగు !

‹రాకేశ్వరుఁడు› నా మొదటి సీసము, మరియు తేటగీతము … యుగాదికి అర్పితం.
‹రాఘవ› ‘శకట’రేఫప్రయోగంలోనూ నీకు నీవే సాటి రాకేశా
(శకటము అంటే బండి కదా!)
‹రాకేశ్వరుఁడు› ఱాకేశా 😉
‹కొత్తపాళీ› రాఘవ, ఆయనకిది నల్లేరు మీద ‘బండి’ కదా 🙂
‹చదువరి› పద్యంలో ఎన్ని ఱ లో!
‹భట్టుమూర్తి› ఱాకేశ్వరుఁడా …
‹రాఘవ› శకటాలకూర్చి చెప్పేటప్పుడు శకటరేఫం… అదుర్స్

‹రాకేశ్వరుఁడు› రాఘవ, మీ అంత ఆలోచించలేదండి.. ఏవో అనుకోకుండా వచ్చిన బండి చక్రాలు ..
‹కొత్తపాళీ› ఱాకు ఈశ్వరుండు ఱాకు ఱాకు!
‹భట్టుమూర్తి› ఇకనుండి ఆంగ్ల పదాలకు, కొత్తపదాలకు ఱ వాడాలి.. 🙂
‹బ్లాగేశ్వరుడు› రాకేశ్వరా చాలా బాగున్నది.

‹రాకేశ్వరుఁడు› అన్నట్టు … ఆశను నమ్ముకునే జనాలకు పండగలు వచ్చి ఆశను అమ్ముతాయని … భావం
‹రాఘవ› రాకేశ్వరుఁడు, మొదటే అర్థమైంది. ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది.
‹కొత్తపాళీ› రాకేశ్వరుఁడు, ఆ భావం బహు గడుసైన భావం .. మిగతావన్నీ పద్యానికి అలంకారాలే అయినా ఇలాంటి భావాలే ప్రాణం పోసేది.
‹విశ్వామిత్ర› అవును.
‹రాఘవ› కొత్తపాళీ, చక్కగా చెప్పారు.
‹నాగరాజు› ఎలాగు పాతదనం పోతోందని వాపోతున్నప్పుడు, ఇప్పుడు వాడుకలోలేని బండి ర ప్రయోగం కూడా పద్యానికి ఓ లోతుని తెచ్చింది.
‹రాకేశ్వరుఁడు› నాగరాజు, బాగా చెప్పారు … నాకు కొత్త దనం లో లేని మోజును indirect గా అది కూడా సూచిస్తుంది…

‹కొత్తపాళీ› ఉగాది గురించి ఇంకెవరన్నా చెబుతారా? ఇంక దానితో ముగిద్దాము
‹విశ్వామిత్ర› అవును

‹కొత్తపాళీ› ఉగాది గురించి ఇంకెవరన్నా చెబుతారా?
‹రాఘవ› నేనెప్పుడో అంటే ఒక ఐదేళ్ళక్రితం రాసాను ఈ పద్యం. ఇప్పటికీ సరిపోతుంది.

కం. శుక పికముల రవములతో
వికసించిన హృదయమందు విడువక భక్తిన్
ఇక కొలిచెదమా రాముని
సకల శుభమ్ములు కలుగగ సతతము భువిలో.

‹కొత్తపాళీ› రాఘవ, మంచి మంగళాశాసనం చెప్పారు.
‹చదువరి› చక్కటి ముగింపు పద్యం!
‹రాఘవ› నవమికి వ్రాసాను. ఉగాది దగ్గరే కదా.

‹కొత్తపాళీ› ఇక దీనితో అధికారిక సభ ముగిస్తున్నాను. సభ్యులు ఇచ్ఛకొలదీ ముచ్చట్లాడుకోవచ్చు. ముగింపుగా నా వందన సమర్పణ ఇది…

ఆ.వె. కవులు పండితులును కావ్య పఠన జేసి
సభను రక్తి జేయ సరసముగను
కొత్త వత్సరమిది కోరిన వరమిచ్చు
సర్వ శుభములిచ్చు సర్వధారి

‹విశ్వామిత్ర› సభా సరస్వతికి, కెమ్మోవిపై చిరునవ్వు చెదరకుండా సాగింది సభ.
‹రాఘవ›

క్రొత్తపాళి మాకు కూరిమి రాయలై
సభను కనులవిందు సలిపె కనుక
నాకు తోచినట్టి నాల్గు మాటలెనీకు
భూషలనుచు నేఁ ప్రభు చదివింతు

(నాలుగో పాదాన్ని రాఘవ పూరించబోతుండగా…మిగతావారు ప్రయత్నించారిలా… )

‹చదువరి› విన్నవింతునయ్య (భువన)విజయ రాయ.
‹విశ్వామిత్ర› కానుకనెద నన్ను కవిని జేయ.
‹భట్టుమూర్తి› సమర్పింతును నేడు సన్నుతముగ.
‹రాకేశ్వరుఁడు› విశ్వామిత్ర, కానుకనెద నన్ను కవిని జేయ మాః బా జెప్పారు.
‹రాఘవ› అబ్బో… ఇంతమంది కవుల నడుమ వున్నానంటే అదో సంతృప్తి…. కాదు కాదు. తుత్తి.
‹రాకేశ్వరుఁడు› రాఘవ, అదీ ఈ యుగంలో … !

‹కొత్తపాళీ› తాడేపల్లిగారు ప్రత్యక్షంగా లేని లోటు లోటుగానే ఉండిపోయింది.
‹నాగరాజు› కొత్తపాళీ – నిజమే, ఆయన కూడా ఉంటే చాలా బాగుండేది. మళ్ళీ ఉగాదికి – తప్పకుండా వస్తారు లెండి.
‹కొత్తపాళీ› గ్లోబల్ వార్మింగ్ సమస్య మీద మంచి చమత్కారమైన పద్యం చెప్పారాయన. చెప్పనా?
‹నాగరాజు› చెప్పండి.
‹చదువరి› చెప్పండి.

కం. ఓబామా ప్రైమరులను
సాబాలునకంటె గెలువ సతికిఁ జెమర్చెన్
గాబరపడి క్లింటనడుగ
గ్లోబలు వార్మింగ్ అటంచు గోముగ బలికెన్.

‹రాకేశ్వరుఁడు› కొత్తపాళీ, నేను కందం తప్పక రాయాలి అని, ఇలాంటి ఉపాయం కోసం ఎంత వెతికిన నాకు తట్టలేదు…
‹నాగరాజు› కొత్తపాళీ – సూపర్. చాలా బావుంది.
‹కొత్తపాళీ› దాన్ని నేను మొదట ‘ఓ భామా’ అని చదివా
‹రాకేశ్వరుఁడు› సాబాలున కంటే అనగా … ?
(సాబాలు అంటే సగభాగము)
‹నాగరాజు› కొత్తపాళీ – కాని ఎప్పుడైనా గోముగా మాట్లాడిందా అని నా సందేహం!!
‹చదువరి› నాగరాజు, 🙂
‹కొత్తపాళీ› నాగరాజు, నిజమే 🙂

‹రాకేశ్వరుఁడు› గోముగ అంటే ఏఁవిటండి ఇంతకీ?
‹చదువరి› సాబాలునకంటె అంటే..?
‹రాకేశ్వరుఁడు› సగం కంటే ఎక్కవ.
‹భట్టుమూర్తి› గోముగ అంటే చెప్పండి …ఱాకేశ్ అడిగాడు 🙂 ఇక్కడ అది తెలిసిన పెద్దలు చాలామంది ఉన్నారుగా.
‹కొత్తపాళీ› గోముగ అంటే … నయా గారాన్ని అడుగు.
‹నాగరాజు› రాకేశ్వరా – “గోముగా అంటే ఏవిటండీ ఇంతకీ..” అని ఒక అందమైన అమ్మాయి రెచ్చగొట్టేటట్టు అడిగితే, అదే నీ ప్రశ్నకి సమాధానం.
‹రాకేశ్వరుఁడు› కోమలంగా అనా…
‹కొత్తపాళీ› రాకేశ్వరుఁడు, అర్ధం చేసుకోవూ … గారంగా …
‹రాకేశ్వరుఁడు› నాగరాజు, మీతో ముఖ పరిచయం లేని వారు మీ వయస్సు పదహారేమో అనుకుంటారు…
‹భట్టుమూర్తి› గారాలు పోతూ… అనునాసికంగా… ఇంకా కొంచెం ముందుకెళ్లొచ్చు…
‹చదువరి› ముద్దుగా, వయ్యారంగా, గారంగా, జాణతనంతో, … అలా ఇలా..
‹చదువరి› గోముగా!
‹రాకేశ్వరుఁడు› మొన్న నన్ను నవతరంగంలో ఒకతను … ‘ఓయ్ ముసలాడా నీకేమి అర్థమవుతాయి యూత్ ఆలోచనలు’ అని ఆడి పోసుకున్నాడు …
‹రాకేశ్వరుఁడు› నాగరాజు, మీలాంటి వారి దగ్గర నుండి నేర్చుకోవాలి .. కొన్ని యూత్ పాఠాలు…
‹చదువరి› 🙂
‹నాగరాజు›పగిలేటి పానపాత్రికలో మిగిలేటి కాస్త మధువుంటే అదియె సుమా ఉగాది, మన బతుకునకదియె పునాది“, అన్నాడు కృష్ణశాస్ట్ర్హి, పానపాత్రిక పగలలేదని, మధువులింకా ఊరుతున్నాయని మీరంతా ఋజువు చేసారు.

(సంభాషణ ఇలా ఉల్లాసంగా సాగుతూవుండగా భారతావనిలో బాగా పొద్దుపోవడంవల్లనూ, భూమికి మరోవైపున మధ్యాహ్నభోజనసమయం కావడంతోనూ మెల్లమెల్లగా ఒక్కొక్కరూ మిగతావారికి వీడ్కోలు చెప్పి నిష్క్రమించడంతో అభినవ భువనవిజయ సభ విజయవంతంగా ముగిసింది.)

——————-

సంకలనం: రానారె

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

10 Responses to అభినవ భువనవిజయము -9- సర్వధారికి సుస్వాగతము

  1. ఆసం… నోట మాట పెగలట్లేదు ఈ భువన విజయం చదువుతుంటే.
    పాల్గొన్న కవులందరికీ టోపీలు తీసేసాం.

  2. చక్కటి ప్రయోగం. అందరికీ అభినందనలు.

  3. Lalitha G says:

    అభినవ భువన విజయానికి అభినందనలు.
    దీన్ని విజయం చేయించిన వారందరికీ జోహార్లు.

  4. ramani says:

    చాలా బాగుందీ ఈ అభినవ భువనవిజయ ప్రయోగం. చక్కటి పద్యాలతో సభని రక్తి కట్టించారు. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలాంటి కవులని జ్ఞప్తి కి తెచ్చినట్లుగా చాల బాగుంది.

  5. కామేశ్వర రావు says:

    బాగున్నదీ ప్రయత్నము
    బాగున్నవి పద్యప్రియుల పద సరసోక్తుల్!
    బాగుండె పద్యధారలు
    బ్లాగన్నల తెలుగుప్రీతి బహుబాగుండెన్!

    యతులన్ గొన్నిట జూచుకొంచు సరియౌ వ్యాకర్ణమింకొద్దిగా
    మతిదల్పన్ కమనీయ పద్యకవితా మందారముల్ పూసి ధీ
    మతులౌ నెట్కవులంత సత్కవులుగా మాన్యత్వమున్ బొందరే!
    వితతస్ఫూర్తిని దెల్గుపద్యమికపై వేయేండ్లు వర్థిల్లదే!

  6. చాలా అద్భుతమైన ప్రయోగం. నిర్వహించిన పొద్దు వారికి, పాల్గొన్న కవివర్యులకు అభినందనలు.. ముందు ముందు ఇలాటి ప్రయోగాలు ఇంకా జరపాలని కోరుకుంటున్నాను.

  7. కామేశ్వర్రావుగారూ, మిగుల ధన్యవాదాలు మీ అభిమానానికి

  8. కామేశ్వర రావుగారూ,

    హితకరములు మీపలుకులు
    సుతిమెత్తని సూచనలును సులువులు సూక్తుల్
    మతిమంతుల మానసముల
    సితకాంతుల వెలయించును చిరుదీపములై!

    వితతస్ఫూర్తిని దెల్గుపద్యమికపై వేయేండ్లు వర్థిల్లదే! — మీ ఆశీర్వాదం ఫలించి పద్యం వర్థిల్లుగాక.
    ధీ మతులౌ నెట్కవులంత సత్కవులుగా మాన్యత్వమున్ బొందరే! — ఈ పలుకు కూడా. 🙂

    -రానారె.

  9. విశ్వామిత్ర says:

    నే నెట్టుకొచ్చే వాడినే 🙂
    “నెట్టు”కవిని గాక, నేనెట్టికవినయా?
    మైత్రి తప్ప యతుల మైత్రి నెరుగ!
    పట్టుబట్టి, గురుల పదముల బట్టియు
    వ్రాతు గాత, నేర్చి, వాణి మురియ!

    కామేశ్వరరావు గారు,
    మీ మూడూ పద్యాలూ బావున్నాయి, “నవవర్షారంభ ప్రాక్సంధ్యకై” నాకు బాగా నచ్చింది
    రానారే, మీ ఈ కందం బాగా వచ్చింది.
    భవదీయుడు

  10. అన్నట్టు నేను వ్రాసిన తేటగీతి రెండవ పాదంలో తప్పు ఉన్నట్టుంది – కొను యో పబ్బరాజమా, గుఱుతు నీవు

    కొనెడి యో పబ్బరాజమా, గుఱుతు నీవు – అని వుంటే సరిపోతుందేమో.

Comments are closed.