మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం

-డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

జానపద సాహిత్యంగానూ, నోటి పాటల రూపంలోనూ వేల ఏళ్ళుగా ప్రజలలో తరతరాలుగా ప్రాచుర్యంలో ఉన్న అలిఖిత సంప్రదాయం ఆధునిక నాగరికతకు పూర్వపు సంస్కృతిలోని ఒక ముఖ్యమైన అంశం. దీని ప్రభావం ఆ వెనకగా వచ్చిన ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది. మన దేశంలో వేదాలూ, ఉపనిషత్తులూ, పురాణాలూ, బౌద్ధమత రచనలూ, ప్రాచీన కాలపు గ్రీస్‌, యూరప్‌లోని ఇతర దేశాల సాహిత్యమూ, మెక్సికో మతాచారాలూ, చైనా న్యాయశాస్త్రమూ, వేల ఏళ్ళనాటి ఈజిప్ట్‌ ఆధ్యాత్మికవాదమూ అన్నీ ఒకనాటి మౌఖిక సంప్రదాయాల మీద ఆధారపడినవే. మన ప్రాచీనులకు అక్షరాస్యతకన్నా జ్ఞానమే ముఖ్యం. ప్రసిద్ధ వైయాకరణుడైన పాణినికే అక్షరజ్ఞానం ఉండేది కాదని కొందరంటారు. తమ జ్ఞానాన్ని లిపిబద్ధం చెయ్యడం అవసరమని చాలామంది అనుకోలేదు. జ్ఞాపకశక్తికీ, కంఠస్థం చెయ్యడానికీ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. సులువుగా గుర్తుండడానికి విషయాలను శ్లోకాలుగానూ, గీతాలుగానూ నేర్పేవారు. రచనాపద్ధతులు వ్యాప్తిలోకి వచ్చాక కూడా, అరుదుగా, ఏ రాజవంశాల చరిత్రను శాసనాలుగా చెక్కడానికో లిపిని వాడేవారు.

…వేదపఠన పద్ధతి వగైరాల్లో ఉత్తర భారతదేశానికీ, దక్షిణాదికీ తేడాలుండవు. అలాగే బౌద్ధమత విషయాల్లో వివిధ దేశాలవారు ఒకే పఠనపద్ధతిని పాటిస్తారు. ఆధునికులు నమ్మకపోవచ్చుగాని వీటిని తు.చ. తప్పకుండా వప్పచెప్పకపోతే మహాపాపమని తలిచేవారు కనకనే ఇవన్నీ వేల సంవత్సరాలు గడిచినా నిర్దుష్టంగా కొనసాగుతున్న సంప్రదాయాలు.

వివిధ దేశాల్లో ఆధ్యాత్మిక, తాత్విక విషయాలను లిపిబద్ధం చెయ్యడం అపరాధంగా భావించబడేది. నాగరికత అభివృద్ధి అయిన తరవాతకూడా కొందరు ప్రాచీనులు తమకు లభించిన మౌఖిక వారసత్వాన్ని లిఖితరూపంలో నమోదు చెయ్యరాదని అనుకునేవారు. అక్షరాలు కనిపెట్టాక కూడా అవి నేర్చుకోవడం హానికరమనే అభిప్రాయం ఉండేది. ప్రజలు అక్షరాలను మాత్రమే గుర్తుంచుకుని అవి నేర్పుతున్న విషయాలను మరిచిపోగలరన్న హెచ్చరిక ప్రాచీన ఈజిప్ట్‌ మత సంప్రదాయంలో కనబడుతుంది. ప్రసిద్ధ గ్రీక్‌ తత్వవేత్త ప్లేటోకూడా చర్చకే ప్రాధాన్యతనిస్తూ చదవడం, రాయడం పరిమితమైన ప్రయోజనాన్నిస్తాయనీ, జ్ఞాపకశక్తిని నశింపజేస్తాయనీ అన్నాడు. వ్యక్తిగత చర్చలో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సత్యాన్వేషణ కావించే ప్రవృత్తికై మనసు మీదనే ఆధారపడాలి కాని పుస్తకాల మీద కాదు.

లిఖిత సాహిత్యాన్ని నిరాకరించినవారిలో కెల్ట్‌ జాతులుండేవి. క్రీస్తు శక ప్రారంభంలో ఐర్లండ్‌ మొదలైన ప్రాంతాల్లో నివసించిన కెల్ట్‌ జాతుల్లో “పండిత” వర్గానికి డ్రూయిడ్‌లనే పేరుండేది. ప్రాచీన అగ్నిదేవతలనూ, ఇతర వేల్పులనూ ఆరాధించే ఈ డ్రూయిడ్‌లు తమ తెగలకు సంబంధించిన పూజలూ, తంతులూ నిర్వహిస్తూ, ప్రాచీన సంప్రదాయాలనూ, గాథలనూ, పాటలనూ ఎరిగినవారై ఉండేవారు. ఇవన్నీ తరతరాలుగా ఎన్నో శతాబ్దాలుగా వారికి వారసత్వం రూపంలో అంది వస్తూ ఉండేవి. వీరిలో కొందరికి ద్రష్టలుగానూ, జ్ఞానులూ, ప్రవక్తలూ, పూజారులుగానూ, గారడీ విద్యలు తెలిసినవారుగానూ గుర్తింపు ఉండేది. ఇదంతా ఆటవిక లక్షణాలతో కూడుకుని ఉండేది. తరవాతి యుగాల్లో రూపొందిన మతాలకు ఇదొక పూర్వదశ.

గమనించవలసిన దేమిటంటే ఈ ఆటవిక పూజారులకు ఉండిన ప్రత్యేకతల్లో గాథలను పాడి వినిపించగలిగిన నైపుణ్యం ముఖ్యమైనది. మెక్సికో, దక్షిణ అమెరికాలతో సహా ప్రపంచ నాగరికత లన్నిటిలోనూ ఊరూరా తిరుగుతూ, కథలూ, గాథలూ పాడి వినిపిస్తూ తిరిగే ప్రవక్తలూ జానపద గాయకులూ ఉండేవారు. తమతమ జాతుల సంప్రదాయాలనూ, రాజవంశాల చరిత్రనూ ఏకరువుపెడుతూ జాతిలో సమైక్యతనూ, సంఘీభావాన్నీ కలిగించేవారు. లిఖిత సాహిత్యమూ, అక్షరాస్యతా లేని సామాన్యులకు జ్ఞాన విజ్ఞానమంతా ఈ రూపంలోనే అందుతూ ఉండేది. కెల్ట్‌జాతి ప్రజలు ఇంగ్లండ్‌లోని వేల్స్‌ ప్రాంతంలోనూ, స్కాట్లండ్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లండ్‌, స్పెయిన్‌, టర్కీవంటి ప్రదేశాల్లోనూ ఉండేవారు. ఫ్రాన్స్‌ను లోబరుచుకున్న రోమన్‌ సామ్రాజ్యం అక్కడి ప్రాచీన మతసంప్రదాయాలని తుడిచిపెట్టి తమ దేవతలకు స్థానం కల్పించింది. అటువంటి ప్రాంతాల్లో ఆ తరవాత క్రైస్తవ మతం ప్రవేశించింది. ఐర్లండ్‌లో మాత్రం క్రైస్తవ సంప్రదాయం నెలకొనే దాకా డ్రూయిడ్‌ల పెత్తనమే కొనసాగింది. వారి అలిఖిత గాథల గురించిన వివరాలన్నీ క్రైస్తవ రచనల ద్వారానే మనకు లభిస్తున్నాయి.

పురాణం చెప్పే పంతులైనా, సోదెమ్మలైనా, బుడబుక్కలవాళ్ళైనా ఒకరు చెప్పడం, తక్కినవారు వినడం ప్రధానంగా ఉండేది. గౌతమ బుద్ధుడివంటి ప్రవక్తలుకూడా రచనలకన్నా తమ బోధనలకే ప్రాధాన్యతనిచ్చారు. మన ప్రాచీన విద్యల్లో వ్యాకరణ నియమాలనుంచి ప్రతిదీ సులువుగా గుర్తుండే సూత్రపద్ధతి ద్వారా నేర్పబడేది. మన సంప్రదాయంలో ఇటువంటివి నేర్పడంలోనూ, నేర్చుకోవడంలోనూ ఎంత శ్రద్ధ వహించేవారంటే వేదపఠన పద్ధతి వగైరాల్లో ఉత్తర భారతదేశానికీ, దక్షిణాదికీ తేడాలుండవు. అలాగే బౌద్ధమత విషయాల్లో వివిధ దేశాలవారు ఒకే పఠనపద్ధతిని పాటిస్తారు. ఆధునికులు నమ్మకపోవచ్చుగాని వీటిని తు.చ. తప్పకుండా వప్పచెప్పకపోతే మహాపాపమని తలిచేవారు కనకనే ఇవన్నీ వేల సంవత్సరాలు గడిచినా నిర్దుష్టంగా కొనసాగుతున్న సంప్రదాయాలు.

వర్ణ విచక్షణ కారణంగా వలస పాలకులు ఆఫ్రికా అంతటినీ అనాగరికమైన చీకటి ఖండంగా అభివర్ణించారు కాని అది నిజం కాదు. అక్కడ విలసిల్లిన ఎన్నో ప్రాచీన నాగరికతలన్నీ సాక్ష్యాలు మిగలకుండా రూపుమాసిపోయాయి. అక్కడి అలిఖిత సంప్రదాయాలను కొనసాగించే గ్రియోట్‌ గాయకులు ఎన్నో శతాబ్దాల చరిత్రనూ, గ్రామాల స్థలపురాణాలనూ, వంశాల చరిత్రనూ కంఠతాపట్టి చెపుతూ ఉంటారు. పశ్చిమాఫ్రికా మొదలైన ప్రాంతాల్లో అనుకున్నదానికన్నా వెయ్యేళ్ళు ప్రాచీనమైన చరిత్ర ఉన్నట్టుగా సాక్ష్యాలు లభిస్తున్నాయి. లిఖిత సాహిత్యం మొదలైన కాలానికి అప్పటిదాకా ఉన్న శ్రుత సంప్రదాయమే ప్రాచీన విషయాలకు ఏకైక ఆధారంగా ఉండేది. సమాజం మారుతున్న కొద్దీ గత కాలపు వివరాలకు మార్పులూ, చేర్పులూ జరగకుండా, పొరబాట్లు దొర్లకుండా, వ్యక్తుల మీద ఆధారపడకుండా వాటిని నిర్దుష్టంగా ఎక్కడో అక్కడ నమోదు చెయ్యడం అవసరమని అనిపించింది. అప్పటినుంచీ పవిత్ర గ్రంథాల రచనలు ప్రపంచమంతటా మొదలయాయి.

..వడగళ్ళు అనే మాట రాయడానికి ఒక గారె బొమ్మనూ, దాని పక్కనే కాసిని గళ్ళనూ గీసే పద్ధతి పెట్టుకోవచ్చు. ఈ బొమ్మలకూ, వడగళ్ళకూ సంబంధం లేకపోయినా వడనూ, గళ్ళనూ గుర్తించినవారు ఆ పదాలను కలిపి చదువుకోగలుగుతారు. కొన్ని లిపులు ఈ పద్ధతిలో రూపొందాయి.

అతి ప్రాచీన కాలంలో పాలస్తీనాలోనూ, బేబిలోన్‌ ప్రాంతంలోనూ అలిఖితాలుగా ప్రాచుర్యంలో ఉండిన జుడాయిజమ్‌ సూత్రాలను క్రీ.శ. మూడో శతాబ్దంలో యూదు మతబోధకులు గ్రంథస్థం చేశారు. ఆధునిక పరిశోధనల్లో వివిధప్రాంతాలలో చెల్లాచెదురుగా జీవిస్తున్న యూదుమతస్థుల సంప్రదాయాలను సేకరించే ప్రయత్నాలు మొదలయాయి. మరుగున పడిపోతున్న హీబ్రూ భాషలోని పదాల ఉచ్చారణా, పాత ఆచారాలూ, అన్నిటినీ పరిరక్షించేందుకు ఏర్పాట్లు జరిగాయి. లిపి ఆవిర్భావానికీ, పుస్తకాల తయారీకీ కొంత సాంకేతిక ప్రగతి అవసరం కావడం వల్లనే బైబ్‌ల్‌, కురాన్‌, జెంద్‌ అవెస్తా మొదలైన తొలి మత గ్రంథాలన్నిటికీ అంతులేని విలువా, వాటి పట్ల ఎనలేని భక్తీ ఉండేవి. ఎందుకంటే అప్పట్లో అవి గ్రంథరూపంలో వెలిసిన విజ్ఞానసర్వస్వాలు.

ఈ రోజుల్లో చాలామందికి పుస్తకాలు చదివే అలవాటు తప్పడం, చదవనేర్చినవారు కూడా టీవీ ముందు గుడ్లప్పగించి కూర్చోవడం జరుగుతోంది. ఈ ఆధునిక “నిరక్షరాస్యత” కారణంగా మళ్ళీ మౌఖిక, దృశ్య, శ్రవణ సంప్రదాయాలకు ప్రాముఖ్యత పెరిగినట్టుగా అనిపిస్తోంది. కాని ఈ యుగంలో సమాచారం, విజ్ఞానం, పనికిరాని చెత్తా అంతా పర్వతాల ప్రమాణానికి పెరిగి కంప్యూటర్లూ, ఇంటర్నెట్‌ వగైరా అనేక మాధ్యమాలద్వారా లభ్యం అవుతోంది. పుస్తకాల మాట ఎలా ఉన్నా సమాచారం, సంపర్కం లేకుండా మానవ సమాజాలకు ఆనాడైనా, ఈనాడైనా జరగదు.

లిపుల వ్యాప్తి మొదలయాక పరిస్థితులు క్రమంగా మారుతూవచ్చాయి. ప్రపంచంలోని ఆధునిక లిపులలో ఎన్నో రకాలు కనిపిస్తాయి. ఇంగ్లీష్‌వంటి భాషల్లో హల్లులకూ, అచ్చులకూ వేరువేరు అక్షరాలుంటాయి. ఏ మాట రాయాలన్నా 26 అక్షరాలలో అవసరమైనవాటిని పక్కపక్కనే రాస్తూపోవాలి. అచ్చు లేని హల్లులను క్‌, గ్‌ వగైరాలుగా ఉచ్చరించాలి. ప్రతి అక్షరాన్నీ ఉచ్చరించడానికి అచ్చులు కావాలి. తెలుగువంటి భారతీయ లిపుల్లో ఉచ్చరించగలిగిన సిలబల్‌ అక్షరాలు రాయవచ్చు. అక్షరం స్వరూపం మారదు కాని గుణింతాలు మారుతూ ఉంటాయి. ఈజిప్ట్‌ వంటి కొన్ని ప్రదేశాల ప్రాచీన భాషల్లో అచ్చులు వాడేవారు కారు. అన్నీ హల్లులే. సందర్భాన్ని బట్టి పదాలను ఉచ్చరించాలి. ఆ ఛాయలు కొన్ని ముస్లిమ్‌ పేర్లలో ఇప్పటికీ కనిపిస్తాయి. మహ్మద్‌, మహమద్‌, మహమ్మద్‌, ముహమ్మద్‌, మొహమ్మద్‌, మహ్మూద్‌, మెహమూద్‌ ఇలాంటివన్నీ కొద్ది వ్యత్యాసాలతో పలుకుతారు. చైనా, జపాన్‌ మొదలైన భాషలన్నీ రేఖామాత్రంగా కనిపించే బొమ్మలవంటివిగా మొదలయాయి. కనబడుతున్న వస్తువులను వర్ణించడానికి చిత్రలిపిని వాడడం సులువు. కుక్క అనే పదాన్ని సూచించడానికి చిన్న కుక్క బొమ్మను గీయవచ్చు. చదివేవారు దాన్ని చూడగానే కుక్క అనో, తమ భాషలో ఆ అర్థాన్ని సూచించే మరొక మాటనో ఉచ్చరిస్తారు. మరొక పద్ధతిలో ఒక పదంలో వినబడే అక్షరాలను బట్టి వాటికి ప్రతీకలైన బొమ్మలు గీసుకోవడం వీలు. ఉదాహరణకు వడగళ్ళు అనే మాట రాయడానికి ఒక గారె బొమ్మనూ, దాని పక్కనే కాసిని గళ్ళనూ గీసే పద్ధతి పెట్టుకోవచ్చు. ఈ బొమ్మలకూ, వడగళ్ళకూ సంబంధం లేకపోయినా వడనూ, గళ్ళనూ గుర్తించినవారు ఆ పదాలను కలిపి చదువుకోగలుగుతారు. కొన్ని లిపులు ఈ పద్ధతిలో రూపొందాయి. ఇవన్నీ వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో పరిణామం చెందాయి.

ఈనాటి భాషల్లో ఎడమనుంచి కుడివైపుకు రాసేవే ఎక్కువగా కనబడతాయి కాని ఉర్దూ, అరబిక్‌ వంటివన్నీ వ్యతిరేక దిశలో సాగుతాయి. తూర్పు దేశాల్లో నిలువుగా రాసే సంప్రదాయం కూడా ఉండేది. దీనికీ, ప్రాచీనులు తొలి యుగాల్లో చేసిన ప్రస్థానాలకూ సంబంధం ఉందని కొందరంటారు. మొదట నమోదు చేసిన వివరాల్లో ప్రతిరోజూ సూర్యబింబం స్థానాన్ని సూచించేవారని ఈ ప్రతిపాదన చెపుతుంది. మన దేశంలో ఎక్కువ మంది దక్షిణంగా ప్రయాణించారు కనక సూర్యబింబం స్థానాన్ని మొదటగా ఎడమ కొసలో గీయవలసివస్తుంది. ఆ తరవాత రోజు గడిచిన కొద్దీ కుడి వైపుకు రాస్తూ పోవాలి. మధ్య ఆసియాలో ప్రజలు ఉత్తరంగా వెళ్ళారనీ, చైనా మొదలైన ప్రాంతాల్లో పడమటి దిక్కుగా ప్రయాణించారనీ, ఆ కారణంగా అక్షరాలు రాసే పద్ధతి రూపొందిందనీ అంటారు. ఆదిమయుగాల్లో సూర్యుడిని ఆరాధించేవారు కనక ఇది నిజమేనేమో.
మరొక సిద్ధాంతం ఈజిప్ట్‌లోని పెపైరస్‌ కాగితాలమీద ఆధారపడినది. నైల్‌ నది ప్రాంతంలో విరివిగా పెరిగే రెల్లుగడ్డి వంటి పెపైరస్‌ను కాగితాల తయారీకి వాడేవారు. ఇది ఎండాక చుట్టచుట్టుకుని ఉండేది. కుడిచేత్తో రాసేటప్పుడు దీన్ని ఎడమచేత్తో తెరుస్తూ పోవాలి. ఇలా చెయ్యాలంటే కుడి నుంచి ఎడమకు రాస్తూపోవడమే వీలుగా ఉంటుంది. ఈ పరిస్థితులన్నిటిలోనూ నిజంగా ఏం జరిగిందో ఊహించాలే కాని ఖచ్చితంగా చెప్పడం వీలవదు.

లిపుల్లో అన్నిటికన్నా ప్రాచీనమైనవి క్రీ.పూ.3000 ప్రాంతాల సుమేరియా, ఈజిప్ట్‌ నాగరికతల్లో ఆరంభమైనట్టుగా తెలుస్తోంది. మెసపొటేమియాలో ఎన్నో శతాబ్దాలుగా గొర్రెల, మేకల పెంపకానికీ, వ్యవసాయానికీ సంబంధించిన లెక్కల కోసమని ఆవంలో కాల్చిన మట్టిబిళ్ళలు వాడేవారట. ఇవి అనేక ఆకారాల్లో తయారయేవి కనక ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినప్పుడు గుర్తుంచుకోవడం వీలయేది. ఆ తరవాత బంకమట్టి మెత్తగా ఉన్నప్పుడు బిళ్ళలమీద పుల్లతో గుర్తులు గీసుకోవడం మొదలైంది. కాల్చిన తరవాత ఈ గుర్తులు ఎన్నేళ్ళైనా చెరిగిపోకుండా ఉండేవి. ములుగర్రతో గీసిన ఈ రచనా పద్ధతిని కీల లిపి (క్యూనీఫాం) అంటారు. రాయవలసిన సమాచారం పెరిగిన దశలో దీన్ని పైనుంచి ఎడమ వెైపున మొదలుపెట్టి కుడి వైపుకు పంక్తులుగా రాసేవారు. ఈనాటి మనవంటి లిపులన్నిటినీ ఇదే పద్ధతిలో రాసి, చదువుతాం. తమ అవసరాల కారణంగా అప్పటివారు రాసే పరికరాలూ, పద్ధతులూ అన్నీ స్వతంత్రంగా సృష్టించుకోవలసివచ్చింది. లిపికై ఎన్నో శతాబ్దాల తరబడి జరిగిన ప్రయత్నాలు ఇటువంటివే.
సుమేరీన్ కీల లిపి
సుమేరియన్‌ కీల లిపి

ఈ కాలంలోనే ఈజిప్ట్‌లో మొదలైన రాత పద్ధతుల్లో ఏడెనిమిది వందల రకాల గుర్తులుండేవి. దాదాపు మూడున్నర వేల ఏళ్ళపాటు కొనసాగిన ఈ లిపికి లెక్కలేనన్ని నమూనాలు చరిత్రకారులకు లభించాయి. కుడినుంచి ఎడమకు సాగే ఈ రాతలో అన్నీ బొమ్మలవంటి గుర్తులే. వీటిలో కొన్ని గుర్తులు శబ్దాలకూ, మరికొన్ని భావనలకూ ప్రతీకలుగా ఉండేవి. వీటిలో అచ్చులుండేవి కావు కనక వీటిని ఎలా ఉచ్చరించేవారో మనకు తెలియదు. ఎడమ వైపున గీసిన గుర్తుల ఆధారంగా చదివేవారికి సందర్భమూ, ఉచ్చారణా తెలుస్తూ ఉండేవి. సుమేరియన్‌, ఈజిప్ట్‌, మధ్య అమెరికా నాగరికతల్లో వేటికవిగా రూపొందిన ఈ లిపులన్నిటిలోనూ మొదట బొమ్మలు సరిగ్గా గీసినా, రానురాను అవి రేఖామాత్రపు సూచకాలుగానే రూపొందాయి. ఈనాటికీ ఏ లిపిలోనైనా అక్షరపు స్వరూపానికి స్వతహాగా అర్థమేమీ ఉండదు. వంకరటింకర గీతలన్నీ ఏయే అక్షరాలకు ప్రతీకలో తెలిశాక ప్రజలు వాటిని చూడగానే పోల్చుకుని చదవడం, ఆ శబ్దాలను బట్టి భావాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది.
ఈజిప్టు లిపి
ఈజిప్ట్‌ రచనా పద్ధతి

క్రీ.పూ. 1300 ప్రాంతాల చైనాలో స్వతంత్ర పద్ధతిలో మొదలైన లిపిలో శబ్దాలను సూచించే మూడు నాలుగు వేల గుర్తులుంటాయి. మెక్సికోలో రాసే పద్ద్ధతులు క్రీ.పూ. 600కు మునుపే మొదలైనట్టుగా తెలుస్తోంది.
చైనీసు లిపి
క్రీ.శ. ఏడో శతాబ్దపు చైనాలిపి

ఈ విధంగా అక్కడక్కడా మొదలైన లిపులు కూడా తక్కిన సాంస్కృతిక అంశాలలాగే భౌగోళిక పరిస్థితులకూ, అవరోధాలకూ లోనవుతూ వ్యాప్తి చెందగలిగాయి. మధ్యధరా సముద్రంలోని క్రీట్‌ దీవిలో మొదలైన అక్షరాస్యత పసిఫిక్‌లోని టోంగా దీవిలో రూపొందలేదు. పశ్చిమాసియాలో మొదలైన లిపులు అరేబియాకూ, ఇతియోపియాకూ వ్యాప్తి చెందగలిగాయి కాని మెక్సికో నాగరికతలోని లిపి పద్ధతులు దక్షిణ అమెరికాకు అందలేదు.
మధ్య అమెరికా ప్రాంత లిపి
మధ్య అమెరికా ప్రాంతపు లిపి

నాగరికతలు లిపులనూ, లిపులు నాగరికతలనూ ప్రభావితం చేసుకున్నాయి. మొదట్లో ఇదంతా పాలక వర్గాలకే పరిమితం అయినా వీటివల్ల ప్రజల జీవితాలు త్వరితమైన మార్పులు చెందడంతో చరిత్ర ఎన్నో మలుపులు తిరిగింది. పంతొమ్మిదో శతాబ్దంలో ప్రపంచపు ప్రాచీన లిపులను పరిశీలించిన యూరపియన్‌ పరిశోధకులు తమ లిపులను పోలినవాటిని ఉన్నతమైనవిగానూ, తేడాగా ఉన్నవాటికి తక్కువరకంగానూ పరిగణించేవారు. లిపులన్నీ మెసపొటేమియాలో మొదలైన అక్షరాలనుంచి పుట్టుకొచ్చినవే అని అనేవారు. తరవాతి పరిశోధనల్లో ఇరాన్‌, చైనాలమధ్య ఉన్న విశాలప్రాంతంలో మధ్యస్థంగా అనిపించిన లిపుల దాఖలాలేవీ దొరకలేదు. మధ్య అమెరికాలో దొరికినదాన్ని అసలు లిపిగానే అంగీకరించని వైఖరిని తరవాతి కాలంలో సరిదిద్దుకున్నారు. ఈజిప్ట్‌లోనూ, సింధునది ప్రాంతంలోనూ తలెత్తిన రచనాపద్ధతులు స్వతంత్రమైనవిగా అనుకోవడం మొదలైంది. ఇప్పటి దృక్పథం మారడంతో అక్షరాస్యత ఏ మాత్రమూ లేని సమాజాలు కూడా ఉన్నతమైన నాగరికతను సాధించాయని ఒప్పుకుంటున్నారు.

మాటలను పలకడం, రాయడం అనేవి వేరువేరని ఈనాడు ఎవరూ భావించరుగాని ఇది కొన్ని శతాబ్దాల తరబడి జరిగిన పరిణామాల ఫలితమే.

————————–

కొడవటిగంటి రోహిణీప్రసాద్ సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) నుండి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త. తెలుగులో http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) అనే బ్లాగులు రాస్తూంటారు.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

One Response to మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం

  1. radhika says:

    ఆశక్తికరమయిన వ్యాసం.సమగ్రం గా వుంది.ఇప్పటికీ అమెరికాలో ప్రాధమిక విద్యలో రాత ఎక్కువగా కనపడదు.అంతా బొమ్మలను గుర్తించడం,వల్లెవేయడమే ఎక్కువ గా కనిపిస్తుంది.కారణం ఏమిటో

Comments are closed.