“చంపేస్తున్నావు. ఇంకా నవ్వలేను” అంటూ నజ్ద్ర్యోవ్ ఇంకా నవ్వాడు.
“ఇందులో హాస్యం ఏమీ లేదు. నేను వస్తానని మాట ఇచ్చాను”
“కాని, అక్కడికి వెళ్ళావంటే నీకేమీ బాగుండదు; వాడు లుబ్ధాగ్రేసరుడు. నీ నైజం నాకు తెలుసు. అక్కడ చీట్లాటా, బాన్-బాన్ సీసా దొరుకుతాయనుకుంటున్నావుగామాలు, శుద్ధ పొరపాటు. సబాకవిచ్ ను తగలేసిరిలెస్తూ; మా ఇంటికి వచ్చెయ్యి. స్టర్జిన్ కూర తినిపిస్తాను. తప్పుడు ముండాకొడుకు పనోమరేవ్ వంగి వంగి దణ్ణాలు పెడుతూ ‘తమ కోసం ప్రత్యేకంగా తెప్పించాను. కావలిస్తే సంత అంతా తిరిగి చూడండి; ఇలాంటి చేప దొరకదు’ అన్నాడు.వాడు దొంగవెధవే అనుకో, ఆమాట వాడి మొహానే అనేశాను. “మా సర్కారు కాంట్రాక్టరొకడూ, నువ్వొకడివీ – మీ ఇద్దరిలాంటి మోసగాళ్ళు మరి ఉండరు?’ అన్నాను. నవ్వుతూ గడ్డం నిమురుకున్నాడు; బండవెధవ. నేనూ కున్షిన్నికోవూ ప్రతిరోజూ మధ్యాహ్నం వాడి దుకాణంలోనే భోంచేసేవాళ్ళం. అన్నట్టు నీకింకో సంగతి చెప్పటం మరిచాను. నువ్వు చూస్తే వదిలిపెట్టవు. అయితే పదివేల రూబుళ్ళిచ్చినా నేను దాన్ని ఇవ్వను; ముందే చెబుతున్నాను.ఒరేయ్, నర్ఫీరి! కుక్కపిల్లను పైకి తీసుకురా.. భలే కుక్కపిల్ల. ఎవరో ఎత్తుకొచ్చి ఉంటారు; అసలు యజమాని అయితే చచ్చినా అమ్మడు. హ్వస్తీరెవ్ తో మారకం వేసుకున్నాను చూడూ, ఆ అడగుర్రాన్నిచ్చి ఈ కుక్కపిల్లను తీసుకున్నాను.”
చిచీకవ్ ఆ ఆడగుర్రాన్ని గానీ, హ్వస్తీరెవ్ ను గానీ ఏ జన్మలోనూ ఎరగడు.
ఆ సమయంలో ఆడమనిషి పొట్టివాణ్ణి సమీపించి, “ఏమన్నా భోంచెయ్యరా బాబూ?” అని అడిగింది.
“వద్దు ఏమీ వద్దు. ఎంత జల్సా చేశామనుకున్నావోయ్. పోనీ ఒక గ్లాసు వోద్కా ఇయ్యి. మీ దగ్గర ఏ రకం ఉన్నది?”
“సుగంధ విత్తులు వేసినది”
“నాక్కూడా ఒక గ్లాసు ఇయ్యి” అన్నాడు పొడుగాటివాడు.
“థియేటరులో ఒకనటి కోయిలలాగా పాడింది. కున్షిన్నికోవ్ నా పక్కనే కూచుని ఏరవల్సిన పువ్వు అన్నాడు. యాభై అంగళ్ళయినా ఉన్నాయనుకుంటాను. ఫినార్దీ నాలుగ్గంటల సేపు పిల్లిమొగ్గలు వేశాడు.” అతను ఆడమనిషి చేతినుంచి గ్లాసు అందుకున్నాడు. ఆమె మర్యాదగా వంగింది.
పర్ఫీరి కుక్కపిల్లను తీసుకురావటం చూసి, అతను “ఆఁ, ఇలా ఇయ్యి” అన్నాడు. పర్ఫీరి కూడా తన యజమాని లాగే జెర్కిన్లాటిది ధరించి ఉన్నాడు. అయితే, అది దూది కుక్కినది, జిడ్డు ఓడుతున్నది.
“ఇలా తెచ్చి దాన్ని కిందపెట్టు”
పర్ఫీరి కుక్కపిల్లను కిందపెట్టేసరికి అది నాలుగు కాళ్ళూ చాచుకుని, నేలను వాసన చూసింది.
“ఇదుగో కుక్కపిల్ల” అంటూ నజ్ద్ర్యోవ్ దాని వీపు పట్టుకుని పైకి ఎత్తాడు. అది బాధగా మూలిగింది.
నజ్ద్ర్యోవ్ కుక్కపొట్టను జాగ్రత్తగా పరీక్షించి పర్ఫీరితో, “నేను చెప్పినట్టు చెయ్యనే లేదే! దువ్వెనతో దువ్వాలని తోచనే లేదా?” అన్నాడు.
“దువ్వానే”
“అయితే మరి దీనికి ఈగలెందుకున్నాయి?”
“నాకు తెలీదు, బండి నుంచి పట్టాయేమో”
“అబద్ధం, అబద్ధం. నువు దీన్ని దువ్వనేలేదు. వెధవా, నీ వంటివే దీనికి పట్టించి ఉంటావు కూడానూ. ఒక్కసారి చూడు చిచీకవ్, ఎంతమంచి చెవులో చూశావా? పట్టుకు చూడు”
“ఎందుకూ? చూస్తేనే కనిపిస్తున్నాయి. మంచి జాతిది” అన్నాడు చిచీకవ్.
“అలా కాదు. దీన్ని తీసుకో, చెవులు పట్టుకు చూడు.”
అతని తృప్తి కోసం దాని చెవులు తడువుతూ చిచీకవ్, “అవును, పెరిగాక మంచి కుక్క అవుతుంది” అన్నాడు.
“దాని ముక్కు చూడు చల్లగా ఎలా ఉందో, పట్టుకో”
అతను ఏమనుకుంటాడోనని చిచీకవ్ దాని ముక్కు తాకుతూ, “అవును, బాగా వసిపట్టుతుంది” అన్నాడు.
“ఇది నిజమైన బుల్డాగ్. ఎంత కాలం నుంచో నాకు బుల్డాగ్ ను సంపాదించాలని. ఇదిగో పర్ఫీరి, దీన్ని తీసుకుపో” అన్నాడు నజ్ద్ర్యోవ్.
పర్ఫీరి దాన్ని చంకలో పెట్టుకుని తీసుకుపోయాడు.
“చూడు చిచీకవ్ నువు నావెంట బయలుదేరితీరవలసిందే. ఎంతోలేదు, మూడుమైళ్ళు. క్షణంలో వెళ్ళి వాలతాం. ఆ తరువాత కావాలంటే సబాకవిచ్ వద్దకు పోదువుగానిలే”
చిచీకవ్ ఆలోచించాడు: “పోనీ నెను నజ్ద్ర్యోవ్ ఇంటికి పోతేనేం? ఇతనూ మరొకడిలాటివాడేగా, పైగా డబ్బు పోగొట్టుకుని ఉన్నాడు. వాలకం చూస్తే అన్నిటికీ సంసిద్ధుడల్లే కనిపిస్తాడు. అటువంటి వాడు మననుంచి ఏమీ తీసుకోకుండా ఏదైనా ఇచ్చెయ్యగలడు.”
అతను నజ్ద్ర్యోవ్ తో “సరే పోదాం పద.అయితే ఒక్క షరతు: నన్ను నిలబెట్టెయ్యగూడదు, నాకు చాలా పని ఉన్నది.” అన్నాడు.
“బాగుందోయ్ బుజ్జిగాడా భేషుగ్గా ఉంది. ఉండు, ఇందుకొక ముద్దు పెట్టు!” నజ్ద్ర్యోవ్, చిచీకవ్ లు ఒకరినొకరు ముద్దుపెట్టుకున్నారు.
“భేష్! ముగ్గురమూ కలిసి బయల్దేర్దాం”
“వద్దు, నన్ను వదిలిపెట్టండి, నేనింటికి పోవాలి” అన్నాడు పొడుగువాడు.
“అదేమీ కుదరదు. నేను నిన్ను వెళ్ళనివ్వను”
“నా భార్య ఊరుకోదు. నువు ఈ పెద్దమనిషి బండిలో వెళ్ళు.”
“వద్దు వద్దు ఆ మాట ఎత్తకు”
ఈ పొడుగాటి మనిషి స్వభావం గలవాళ్ళు మొట్టమొదట్లో దృఢనిశ్చయం కనబరుస్తారు.మనం నోరు మెదపకముందే వాళ్ళు వాదించటం ప్రారంభిస్తారు: వాళ్ళు అనుకున్నదానికి విరుద్ధమైనదేదీ ఆమోదించరనీ, అవివేకాన్ని వివేకంగా ఆమోదించరనీ ఇతరులు చెప్పినట్టు సుతరాము వినరనీ అనిపిస్తుంది.కాని కొసకి వారి తీర్మానమంతా నీరుగారి పోతుంది. వాళ్ళు కాదన్నదాన్ని వాళ్ళే ఆమోదిస్తారు. అవివేకాన్ని వివేకమని ఒప్పుకుంటారు. ఇతరులు ఎలా ఆడిస్తే అలా ఆడతారు – ఆరంభశూరులు.
“చాల్లే” అంటూ పొడుగువాడు మారు మాటాడక మిగిలినవాళ్ళవెంట బయలుదేరాడు.
“వోద్కాకు డబ్బులివ్వలేదు బాబూ” అన్నది ఆడది.
“అవునమ్మా, అవునమ్మా! ఏమోయ్, నాబదులు డబ్బిస్తావా, నా జేబులో చిల్లిగవ్వ లేదు”
“ఎంత ఇవ్వాలి?” అన్నాడు అతని బావ.
“ఇరవై కోపెక్కులేనండి”
“ఇంకా నయం సగమియ్యి, చాలు”
“చాలా తక్కువ బాబూ”, అంటూ ఆడది, ఇచ్చిన డబ్బు కృతజ్ఞతతోనే స్వీకరించి, గబగబా వెళ్ళి తలుపు తెరిచి పట్టుకున్నది. వోద్క ఖరీదు ఉన్నదానికి నాలుగింతలు చెప్పి ఉండటంచే, ఆమెకు నష్టమేమీ రాలేదు.
ప్రయాణీకులు బళ్ళలో ఎక్కి కూచున్నారు. దారిలో సంభాషణ సాగేటందుకు వీలుగా చిచీకవ్ బండి, మిగిలిన ఇద్దరూ ఎక్కిన బండి పక్కపక్కగా నడిచాయి. బక్కచిక్కిన బాడుగ గుర్రాలు లాగే నజ్ద్ర్యోవ్ బండి మధ్యమధ్య ఆగుతూ వెనకగా వచ్చింది. అందులో పర్ఫీరి కుక్కపిల్లను పెట్టుకుని కూచున్నాడు.
వాళ్ళమధ్య సాగిన సంభాషణ పాఠకునికి అంతగా పట్టేది కాదు గనక, నజ్ద్ర్యోవ్ గురించి కొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే అతను ఈ గాధలో నిర్వహించబోయే పాత్ర అల్పమైనది కాదు.
నజ్ద్ర్యోవ్ స్వభావం గురించి పాఠకుడికి ఇదివరకే కొంత తెలుసు. అటువంటి వాళ్ళు అందరికీ తగులుతూనే ఉంటారు. వాళ్లను చలాకీ మనుషులంటాం. చిన్నప్పుడు బడిలో చదివేటపుడు కూడా అలాటివాళ్ళు స్నేహపాత్రులుగా భావించబడతారు. వాళ్ళతో స్నేహం చేసేందుకు బొప్పెలు కడితే ఏంగాక, వాళ్ళ ముఖాలలో బోళాతనమూ సూటి అయిన స్వభావమూ , సాహసమూ స్ఫురిస్తుంది. వాళ్ళు ఇతరులతో సులువుగా స్నేహం కలిపి మరుక్షణంలోనే చిన్ననాటి నుండి ఎరిగినట్టుగా సంబోధిస్తారు.వాళ్ళు ఆజన్మ మిత్రులు కాబోలనుకుంటాం. కాని ఆ సాయంకాలం లోపునే కొత్త స్నేహితులకు వాళ్ళతో చచ్చే తగాదా అవుతుంది. వాళ్ళు అమితంగా మాట్లాడేవాళ్ళూ, సుఖ లంపటులూ, సాహసికులూ అయి ఉండి ప్రతిదానికీ మేమున్నామని వస్తారు. పద్దెనిమిది, ఇరవై ఏళ్ళప్పుడు ఎలా ఉండేవాడో, ముప్పైఅయిదో ఏటకూడా అలాగే ఉండి నజ్ద్ర్యోవ్ సుఖాల కోసం బతుకుతున్నాడు. పెళ్ళి అయినాక కూడా అతనిలో మార్పు రాలేదు, దానికి తగ్గట్టే ఆ భార్యకూడా పెందలాడే ఉత్తమ లోకాలు చూసుకున్నది, ఇద్దరు చిన్నపిల్లలు మిగిలారు. వాళ్ళు తండ్రికి ఏమాత్రమూ పట్టలేదు. వాళ్లను చూసుకోవటానికి ఆకర్షణీయమైన ఒక చిన్న ఆయా ఏర్పాటయింది. అతను ఇంటి పట్టున ఒక్కరోజుకు మించి ఉండేవాడు కాడు. చుట్టుపక్కల కొన్ని మైళ్ళ దూరంలో ఎక్కడ సంత జరిగినా, సంబరం జరిగినా నృత్యోత్సవం జరిగినా రెప్పపాటులో వెళ్ళి అక్కడ వాలి, పేకాట దగ్గర పేచీలు పెట్టటమూ తగాదా చెయ్యటమూ చేసేవాడు; అలాటి వాళ్ళు పేకాట అంటే ప్రాణాలిచ్చేస్తారు.
(ఇంకా ఉంది)
————
-కొడవటిగంటి కుటుంబరావు