–కొల్లూరి సోమశంకర్ (http://kollurisomasankar.wordpress.com)
దేశ విదేశీ భాషల సాహిత్యం మధ్య వారధి అనువాదం. మూల భాష పరిచయం లేని వారికొక కానుక అనువాదం. అనువాదాలు లేకపోతే వివిధ భాషలలో పేరొందిన సాహిత్యకారులు, వారి సుప్రసిద్ధ రచనలు ఇతర భాషీయులకు తెలిసేవి కావు. అనువాదం విశ్వ సాహిత్యాలను సన్నిహితం చేసింది. మన తెలుగు సాహిత్యం కూడ సంస్కృతం లోని మహాభారతాన్ని ఆంధ్రీకరించడంతోనే ప్రారంభమైంది. ఎందరో సాహిత్యకారుల కవితలు, కథలు, నవలలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి చదువరులను అలరించాయి.
|
“No matter how great your words may be, you will be judged by your translation” అన్నట్లు తర్జుమా, స్వేచ్ఛానువాదం, అనుసృజన, రూపాంతరం – పదం ఏదైనా అనువాదం సాంస్కృతిక, వైజ్ఞానిక వినిమయ సాధనం. ఇక నా అనువాదాల విషయానికి వస్తే, నేను కొన్ని వ్యాసాలను అనువదించినా, ఎక్కువగా చిన్న కథలను (Short Stories) అనువదించాను. నేను రచయిత, అనువాదకుడికన్నా ముందు పాఠకుడిని.
నాకు ఆఫీసులో ఇంటర్ నెట్ అందుబాటులో ఉండడం వల్ల, లంచ్ టైంలో ఏదో ఒక కథ చదువుతూ భోజనం చేయడం అలవాటయ్యింది. గూగుల్ లాంటి సెర్చి ఇంజన్లలో వెదికితే చిన్న కథలను పోస్ట్ చేసే వెబ్ సైట్లు బోలెడన్ని దొరుకుతాయి. నాకు నచ్చిన కథలున్న వెబ్ సైట్లను ‘ఫేవరెట్ల’లో ఉంచుకుని కనీసం రోజుకి రెండు కథలైనా చదువుతుంటాను. ఇలా చదవడం 2001 నుంచి జరుగుతోంది. మా ఆఫీసులో ఇంటర్ నెట్ ను వ్యక్తిగతంగా నేను ఉపయోగించుకున్నంతగా మరెవరూ వాడలేదంటే అతిశయోక్తి కాదు. కథలు చదువుకోడానికే అందరి కంటే ముందుగా ఆఫీసు చేరి, అందరికంటే ఆఖరున ఇంటికి వెళ్ళేవాడిని. అప్పటినుంచి ఇప్పటిదాక కొన్ని వందల కథలు చదివాను. నేను చదివిన కథలన్నీ చాలా వరకు వర్ధమాన రచయిత/రచయిత్రులవే. నేను చదివిన కథలలో కొన్ని మృదువుగాను, కొన్ని ఆర్ధ్రంగాను హృదయాన్ని తాకితే, మరికొన్ని గాఢంగా ఆలోచింపచేసాయి. అలాంటి కథలని మిగతా తెలుగు పాఠకులతో పంచుకోవాలనే తపనతో నేను అనువాదాలు మొదలుపెట్టాను.
ఇప్పటి దాక నేను తెలుగులోకి అనువదించిన అన్ని కథలు ఇంటర్ నెట్ నుంచి సేకరించినవే. తద్వారా నాకు లభించిన మరో సౌలభ్యం ఏంటంటే మూల రచయితలతో ఈ-మెయిల్ ద్వారా పరిచయం! నేను ఎక్కువగా ఆంగ్లం, హిందీలనుంచే కథలు అనువదించాను. కొన్ని తమిళ, బంగ్లా, మణిపురి కథలను ఆంగ్ల మాధ్యమం ద్వారా, ఒక కాశ్మీరీ కథను హిందీ మాధ్యమం ద్వారా తెలుగులోకి అనువదించాను. ఇక్కడ నాకు లభించిన గొప్ప అదృష్టం ఏమిటంటే ఆయా కథలను మూల రచయితలే ఆంగ్లంలోకి అనువదించడం! తద్వారా “Losses in Translation” బాగా తగ్గాయి. రెండు మళయాల కథలు, ఒక ఒరియా కథ, ఒక స్పానిష్ కథ, ఒక అరబిక్ కథలను మాత్రం మూల భాషలలో ఒకరు రాస్తే, ఆంగ్లానువాదం వేరొకరు చేసారు.
ఈ అనువాద క్రమంలో నాకేవైనా అవరోధాలు ఎదురైతే, మూల రచయితలని సంప్రదించేవాడిని. వారి సూచనలు, వివరణలతో నా సమస్య తీరిపోయేది. కొన్ని కథలలో కథావస్తువు నేపధ్యం గురించి కొంత సమాచారం అవసరమైతే వికీపీడియా నాకు ఉపయోగపడింది.
అనువాదాల కోసం నేను మూస కథలను కాకుండా, విభిన్నమైన వాటిని, ఏ ప్రాంతపు కథైనా తెలుగు వారి మనసులకు తాకే కథలని ఎంచుకున్నాను. కథలు సార్వజనీనత కలిగి ఉండి, కథావస్తువు తెలుగు నేపధ్యానికి నప్పేలా జాగ్రత్త వహించాను. నాకు నచ్చిన కథలను మూల రచయితల అనుమతితో అనువదించుకుంటూ పోయాను. పైగా ఈ కథలన్ని నా ఆలోచనా ధోరణికి దగ్గరగా ఉన్నవే. నేను నా సొంతంగా రాస్తే ఎలాంటి కథ రాస్తానో, అలాంటి కథలనే అనువాదాలకు కూడ ఎంచుకున్నాను. మూల కథలను ఎంచుకోడంలో నేను పాటించిన మరో ప్రాక్టికల్ పద్దతి – కథ యొక్క నిడివి. ప్రింట్‌లో మూడు పేజీలకి మించని కథలను ఎక్కువగా ఎంచుకున్నాను. ‘వేగం’ మంత్రమైన ఈ కాలంలో నిడివి ఎక్కువగా ఉండే కథలను పాఠకులు ఎక్కువగా ఇష్టపడడం లేదు. కథనం షార్ప్‌గా ఉండి, నిడివి తక్కువైనా అపరిమితమైన విస్తృతిని ప్రదర్శించే కథలను పత్రికలు కూడ ఆదరిస్తున్నాయి.
ఇక అనువాదాలపై ఉన్న కొన్ని అపప్రధలను ప్రస్తావిస్తాను.
- అనువాదమంటే చాలా క్లిష్టమైనదని, అదే సమయంలో అనువాదాలు చాలా తేలికని రెండు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యాప్తిలో ఉన్నాయి.
- సొంతంగా రాయలేని వాళ్ళు మాత్రమే అనువాదాలు చేస్తారు.
- అనువాదాల ద్వారా తేలికగా పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు.
- అనువాదాల ద్వారా సాహిత్యలోకంలో చిరస్ధాయిగా నిలిచిపోవచ్చని ఆశించడం అత్యాశ.
అనువాదకులంటే విశ్వాసద్రోహులనే ఇటాలియన్ సామెత ఉండనే ఉంది. పైగా అనువాదాలంటే ‘thankless job’ అనే అభిప్రాయం కూడ ఉంది. మరి ఇలాంటి పరిస్థితులలో అనువాదకులు తమ కార్యరంగంలో ముందుకు పోడానికి ప్రేరణ ఏముంటుంది?
|
ఆత్మ సంతృప్తి! తోటి చదువరులకి మంచి సాహిత్యాన్ని అందించగలిగామనే ఆనందం మాత్రమే అనువాదకులకు రివార్డు! ఇతర భాషలలో పొందు పరచిన సాహిత్య సౌందర్యాన్ని , అన్య భాషీయులకి అనువాదం ద్వారా అందించడం అనువాదకులకు లభించిన గొప్ప వరం! మాతృక సూర్యరశ్మి అయితే, అనువాదం చంద్రకాంతి. ఇవి ఒకదానికొకటి పోటీ కాదు, కానీ పాఠకులకి రెండూ అవసరం. కాబట్టి అనువాదాల పట్ల చిన్నచూపు అవసరం లేదు.
నేను అనువదించిన కథలలో ఒకటైన ‘ ఓ మనిషీ , ఎందుకిలా?’ అనే కథని ఆంగ్లంలో చదివినప్పుడు నేను చలించిపోయాను. చాలా సేపటి వరకు మామూలుగా అవలేకపోయాను. ఆ కథని ఎలాగైనా తెలుగులోకి అనువదించాలనే కోరికతో మూల రచయిత్రిని సంప్రదించడానికి రెండు నెలల పాటు ఇంటర్ నెట్ లో అనేక గ్రూపులలో సభ్యుడిగా చేరి, నిర్విరామంగా ప్రయత్నించాక, ఆవిడ ఈ-మెయిల్ ఐడి సంపాదించి, ఆమె అనుమతి పొందగలిగాను. ఆ కథని అనువదించగానే, చిత్తు ప్రతిని మా కొలీగ్ కిచ్చి చదివి అభిప్రాయం చెప్పమన్నాను. తెలుగు వెర్షన్ చదవగానే అతడు కూడ చాలా సేపు మౌనంగా ఉండిపోయాడు. భావాల కతీతమైన బాధ ఏదో కదిలించి వేసిందని తర్వాత చెప్పాడు. ఈ కథ విపులలో ముద్రితమయ్యాక, ఇదే స్పందన అనేక మంది నుంచి లభించడంతో మంచి కథ ఒక భాషకో, సమాజానికో పరిమితం కాదు, రసజ్ఞులైన పరభాషా పాఠకులను సైతం స్పందింపజేయగలుగుతుందని నిరూపించింది. నాకు చాలా ఆనందం కలిగింది, అంత మంచి కథని అనువదించగలిగినందుకు.
అనువాదకులకి మూల భాష, లక్ష్య భాష రెండిటి లోను ప్రవేశం ఉండాలి. అయితే తమకు పరిచయం లేని సంస్కృతులనుంచి అనువాదం కోసం కథలు ఎంచుకునేడప్పుడు అనువాదకులు అధిక పరిశ్రమ చేయాలి. 2002లో నేను The Learning Stamp అనే అమెరికన్ కథని ‘బాకీ’ అనే పేరుతో అనువదించినప్పుడు ఆ కథలో ప్రస్తావించిన Mustang కారుని నేను పొరపాటుగా ముస్తాంగ్ అని రాసాను. కాని దాన్ని మస్టాంగ్ అనాలని నాకు చాలా ఆలస్యంగా 2007లో తెలిసింది. అలాగే Tet అనే వియాత్నామీస్ కథని “అమ్మ వస్తే బాగుండు” అనే పేరుతో తెలుగులోకి అనువదించాను. ఆ కథలో టెట్ పండగ నేపథ్యాన్ని వివరించాలో వద్దో తేల్చుకోలేకపోయాను. వియత్నాం పాఠకులకి ఆ పండగ గురించి బాగా తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. కాని తెలుగు పాఠకులకి దాని గురించి తెలిసే అవకాశం బహుశా తక్కువే. కాబట్టి తెలియజేస్తే బాగుండేది. కాని దినపత్రికలో కథ ప్రచురితమైనప్పుడు, ఇదే కథని మనీ ప్లాంట్ సంకలనంలో ముద్రించినప్పుడు నేను ఆ సమాచారాన్ని పొందుపరచలేకపోయాను. ఇక్కడ రెండు ఇబ్బందులు ఉన్నాయి.
1. మాతృకలేని అంశాలని అనువాదంలో జొప్పించడం
2. వివరణలు ఇవ్వడం పాఠకుల అవగాహనని శంకించడం అవుతుందేమోననే భయం
కాబట్టి మధ్యేమార్గంగా ఈ కథని నా బ్లాగులో ఉంచినప్పుడు ఆ వివరణని ప్రత్యేకంగా ఇచ్చాను.
ఇలాంటి విషయాలలో అనువాదకులు ఎంతమేర స్వేచ్ఛ తీసుకోవాలనేది వారి వారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అనువాదకులు తమ అనువాదాన్ని, మూల రచనని పక్క పక్కన పెట్టుకుని పోల్చుకుంటుండం వల్ల తమ అనువాద సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. తమ అనువాదం పట్ల, తద్వారా ఎదురయ్యే పరిణామాల (ఏవైనా సరే) పట్ల అనువాదకులకి పూర్తి బాధ్యత ఉండాలి. వినమ్రత అనువాదకులకి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. ఎందుకంటే దాంతో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని తమ అనువాదాలకు మరింత శోభ చేకూర్చవచ్చు.
నా అనుభవంలోని కొన్ని సంఘటనలను వివరిస్తాను. నేను దాక్టర్ అన్వితా అబ్బి రాసిన “రబ్బర్ బాండ్” అనే కథని తెలుగులోకి అనువదించి దానికి కథానుసారంగా మనీప్లాంట్ అనే పేరు పెట్టాను. తీరా కథ ప్రచురితమై, అవిడకి ఇన్‌ఫార్మ్ చేసాక, తెలుగు Title విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసారు. తెలుగులో కూడా రబ్బర్ బాండ్ అనే పేరే బావుండేదని అన్నారు. మనీ ప్లాంట్ అనేది ఎందుకు సరైన పేరో ఆవిడకి నచ్చజెప్ప గలిగాను. మరొక సంఘటన నేను అనువదిందిన రెండు కథలకు పత్రికల వాళ్ళు పొరపాటున మూల రచయితల పేర్లు ప్రచురించలేదు. నేను వెంటనే ఆ విషయం మూల రచయితలకి తెలియజేసి, తర్వాతి సంచికలో సవరణ వేయించి వాటి కాపీలు కూడా మూల రచయితలకి పంపాను. నా ఈ చర్య ఎటువంటి అభిప్రాయ భేదాలకు చోటివ్వలేదు.
అనువాదాలు చేయడంలో నాకు ఉపయోగపడిన పెద్దల సూచనలు, మెలకువలను మీతో పంచుకుంటాను. మొదటగా అనువాదకులు మూల కథలోని నేటివిటీని పోగొట్టకూడదు. “మాతృకలోని రచనా వైదుష్యం అనువాదంలోను ప్రతిబించినప్పుడే పాఠకులు రసాస్వాదన చేయగలుగుతారు. అనువాదంలోని ప్రతి పుటలోను మూల కర్త భావ సౌందర్యం కనిపించాలి. మూల కర్త ఎక్కడా మరుగున పడకూడదు. అదే మంచి అనువాదానికి గీటురాయ“ని గోవిందరాజు రామకృష్ణారావు గారు అంటారు.
శ్రీమతి కెబిలక్ష్మి గారి అభిప్రాయంలో వాగ్రూప సంకేతాలు ఒక భాషలో ఉన్నట్లు మరొక భాషలో ఉండవు. కానీ ఆ సంకేతాల వెనకున్న ఆలోచనల్లో సారూప్యత ఉంటుంది. ఆ ఆలోచనలని, భావాలని అందుకుని సాంస్కృతిక సమస్యలని, భాషాపరమైన ఇబ్బందులని తమ సామర్ధ్యంతో అనువాదకులు అధిగమించాలి. అనువాదకుడికి అభిరుచి, అవలోకనం, ఆలోచన, ఆసక్తితో పాటు మానవ ప్రకృతి పరిశీలన, పరిశోధన తప్పని సరి. అనువాదకుల ప్రతిభకి మూల కధ ఎంపికే గీటురాయి.
భావానువాదం కావాలేకాని, భాషని యథాతథంగా మరోభాషలోని తేవడం అనువాదం కాదని గుడిపాటి గారు అంటారు. అనువాదం సృజనాత్మకంగా ఉంటేనే చదివించగలుగుతుంది.
మూల కథల పేర్లు ఎలా ఉన్నా, తెలుగులో వాటికి పేర్లు పెట్టేడప్పుడు కథావస్తువుని పరిగణనలోకి తీసుకోడం సముచితంగా ఉంటుందని నా అభిప్రాయం.
చివరగా, సమాచార విజ్ఞానం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ కాలంలో, ప్రపంచీకరణ నేపధ్యంలో అనువాదకులు తమ భాషా నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలి. ఇది నిరంతరం కొనసాగాలి. అప్పుడే సాహిత్య రంగం సుసంపన్నం అవుతుంది.
ఈ వ్యాసం రాయడంలో నాకు ఉపకరించిన మరికొన్ని రచనలు:
1. ‘ఉభయతారకంగా ఉంటేనే ఉత్తమ అనువాదం’ – గోవిందరాజు రామకృష్ణారావు, ఆంధ్రజ్యోతి దినపత్రిక, వివిధ
2. ‘అనువాద కదంబం’ – శ్రీమతి కె.బి.లక్ష్మి, మనీప్లాంట్ సంకలనం ముందు మాట
3. ‘వికసించిన అనువాద సృజన’ – శ్రీ గుడిపాటి, మనీప్లాంట్ సంకలనం ముందు మాట
4. మనీప్లాంట్ పుస్తకంపై సమీక్ష – ఎస్. నారాయణ స్వామి, ఈమాట, జనవరి 2008
5. ” నేచర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్” – వి.వి.బి. రామారావు, మ్యూస్ ఇండియా, సెప్టెంబరు – అక్టోబరు 2007 సంచిక
6. “లిటరరీ ట్రాన్స్‌లేషన్-సమ్ యాస్పెక్ట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్” – అంబికా అనంత్, మ్యూస్ ఇండియా, సెప్టెంబరు – అక్టోబరు 2007 సంచిక
7. “మై లిమిటెడ్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ ట్రాన్స్‌లేటర్” – లతా రామకృష్ణన్, మ్యూస్ ఇండియా, సెప్టెంబరు – అక్టోబరు 2007 సంచిక
8. “సాహితీ సేతువు – అనువాదం”, గుడిపాటి, వార్త ఆదివారం అనుబంధం,2 సెప్టెంబర్ 2007.
అనువాద రచయితగా కొల్లూరి సోమశంకర్ సుపరిచితులే! 44 అనువాద రచనలు, 20 దాకా స్వంత రచనలూ చేసిన అనుభవం ఆయనది. 2004 లో మిత్రులతో కలసి 4 x 5 అనే కథా సంకలనం వెలువరించారు. 2006 లో, మనీ ప్లాంట్ అనే అనువాద కథా సంకలనం వెలువరించారు.
ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి తెలుగు కథలని హిందీలోకి అనువదిస్తున్నారు.
సోమశంకర్ రచనల పూర్తి జాబితా కోసం ఆయన బ్లాగు చూడవచ్చు
టెట్ పండగ గురించిన వివరణ *Foot Note లో ఇస్తే బాగుంటుంది. చాలా పుస్తకాలలో ఇలాగే ఇస్తారు, ఆనవాయితీగా. మన హిందీ కథలో హోలీ గురించి కూడా అనువదిస్తున్నప్పుడు (ఆంగ్లం లోకి) ఫుట్ నోట్ పద్ధతి ఆచరణయోగ్యమే.
చాలా బావుంది. అనువాదమైనంత మాత్రాన అంటరానిదేమీ కాదన్న అభిప్రాయం సరైనదే.
టెట్ గురించి చిన్న వివరణ:
టెట్ వియాత్నాంలో పెద్ద పండగ.కొద్దిగా మన సంక్రాంతిని పోలి ఉంటుంది. వారికి ఆ పర్వదినం నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.ఈ పండగ చాంద్రమానం ప్రకారం ప్రతీ ఏడాది 12 వ నెలలో 23 వరోజున ప్రారంభమై వారం రోజులపాటు కొనసాగుతుంది. ఉద్యోగాలు, సంపాదనల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళిన కుటుంబ సభ్యులందరూ ఈ పండగ సందర్భంగా ఒక చోట కలిసి సంబరాలు చేసుకుంటారు. పిల్లలూ, పెద్దలు కలసి టపాసులు కాల్చుకుని దుష్ట శక్తులను తరిమివేస్తారు. ఈ పండగ సమయంలో పాత తప్పులను క్షమించి, పాత అప్పులను మాఫీచేసే సాంప్రదాయం వియాత్నాంలో ఉంది. ఎక్కువగా ఈ పండగని గ్రామీణ ప్రాంతాలలో జరుపుకుంటారు.
“అనువాదకుడికి అభిరుచి, అవలోకనం, ఆలోచన, ఆసక్తితో పాటు మానవ ప్రకృతి పరిశీలన, పరిశోధన తప్పని సరి. అనువాదకుల ప్రతిభకి మూల కధ ఎంపికే గీటురాయి” అక్షరలక్షలు చేసే సూచనలు ఇవి.ధన్యవాదాలు సోమశంకర్ గారు.
ఇతరభాషలలోని ఉత్తమ సాహిత్యం అనువాదం మూలంగానే పాఠకులకు అందించగలం కాబట్టి అనువాదం సాహిత్యానికి అవసరమైన ప్రక్రియలలో ఒకటి.
అనువాదంలో తలదూర్చినవాళ్లెవరూ మీ వ్యాసంలోని అంశాలతో ఏకీభవించకుండా ఉండలేరు.
కధలకంటే సేస్త్ర సాంకేతిక విజ్ఞానపు పుస్తకాల అనువాదం మరింత క్లిష్టం గా ఉంటుంది.అట్లూరి గాంధీ అనువదించిన స్టీఫెన్ హాకింగ్ పుస్తకం కాలం కద చదివాను.ఆ అనువాదాన్ని మరింత సులువుగా ఎలా చయ్యోచ్చోఅని ఆలోచించినపుడు అనువాదకుని యాతన తెలిసివచ్చింది.ఉద్యోగ సంఘాల పుస్తకాల అనువాదం (AISGEF) కంటే ,ఇటేవల అనువదించిన శాస్ట్రవిజ్ఞానం,తత్వశాస్త్ర పారిభాషిక పదాలతో కూడిన poverty of thought ….a criticism on jiddu Krishnamurthy educational philosophy ….(రచయిత….డా.కానూరి జయకుమార్ )పుస్తకాన్ని అనువదించటానికి కొంచెం సరేమ పడాల్సి వచ్చింది. చాలా వరకు తెలుగు అకాడమి ప్రచురించిన పారిభాషిక పడాలనే వాడకతప్పని పరిస్తితి. ఐతే ఆ పదాలకంటే సమర్దవంతం గా భావ వ్యక్తేకరణ చేయగల పదాలు దొరికినపుడు కొత్త పదాలు వాడుకోవాలి. దాంతో బాటు బాగా ప్రాచుర్యంలో ఉండి అందరికీ అర్ధమయేవిగా ఉన్న పరభాషాపదాలనుకుడావిరివిగా వాడాలి.
వ్యాపార ప్రకతనలలో తలుగు భాషను పాడు చేస్తున్నారు.