అంతర్జాల పత్రికలు

అంతర్జాలంలో అనేక తెలుగు పత్రికలు వెలుగు చూస్తున్నాయి, విజయవంతంగా నడుస్తున్నాయి. తొలినాళ్ళలో అంతర్జాల పత్రికలు సాహిత్య ప్రధానంగా ఉండేవి. సాహిత్య వ్యాసాలు, కథలు, పాత గ్రంథాల సమీక్షలు, పద్యాలు మొదలైనవి ప్రధానంగా ఈ పత్రికల వస్తువులు. పాఠకుల అభిప్రాయాలను ప్రచురించాలంటే పత్రిక తరువాతి సంచిక వరకు ఆగవలసి వచ్చేది. యూనికోడు ప్రాచుర్యం పొందని ఆ రోజుల్లో అంతర్జాల పత్రికలన్నీ బొమ్మలూ. PDFల రూపంలోనే ఉండేవి. మామూలు అచ్చు పత్రికనే కంప్యూటర్లో చూస్తున్నట్లుండేది.

వెబ్2.0 వచ్చాక, బ్లాగులూ, వికీలూ వెల్లువెత్తాక, అంతర్జాల పత్రికల ధోరణి మారిపోయింది. అభివృద్ధి చెందిన సాంకేతిక సౌలభ్యాలు, తగ్గిపోయిన ఖర్చులు, పత్రికలకు చోదకాలయ్యాయి. ముఖ్యంగా, కంటెంటు మేనేజిమెంటు విషయంలో జరిగిన సాంకేతిక పురోగతి కారణంగా అంతర్జాల ప్రచురణ చిటికెల మీద పని అయిపోయింది. బ్లాగుల కారణంగా వెలికివచ్చిన కొత్త తరపు నెజ్జనుల ప్రతిభ ఈ పత్రికలకు ముడిసరుకయింది. అచ్చు పత్రికలకు అలవాటు పడిన పాత తరం రచయితలు అంతర్జాలంలో చురుగ్గా రాయడం ఇంకా మొదలు కాలేదు. అయితే, అంతర్జాల పత్రికల ప్రగతి గమనిస్తూ ఉంటే వాళ్ళూ జాలంలో చిక్కుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.

వెబ్ పత్రికలకు, అచ్చు పత్రికలకూ ముఖ్యంగా రెండే తేడాలు.

1. ఫోటోలు బొమ్మలు లేకపోవడం: ఔత్సాహిక రచయితలున్నారు గానీ, ఔత్సాహిక చిత్రకారులూ, పొటిగరాపు పంతుళ్ళు లేకపోవడము, వీటి కోసం డబ్బులు ఖర్చు పెట్టవలసి రావటం, వెబ్ పత్రికలన్నీ కూడా ధనాపేక్ష లేనివే కావడం దీనికి ప్రధాన కారణం.

2. ప్రకటనలు లేకపోవడం: దీనికి ప్రధాన కారణం ప్రకటనలిచ్చేవారు లేకపోవడం (అసలిదే కారణమని కొందరంటారు)

మరో రెండు తేడాలు :
3. ప్రసిద్ధులైన రచయితలు అచ్చు పత్రికలకు అందుబాటులో ఉన్నంతగా వెబ్ పత్రికలకు ఉండరు.

4. వెబ్ పత్రికల పాఠకులు అచ్చు పత్రికల కంటే తక్కువ.

*** *** *** *** ***

ఈమాట!

వస్తునాణ్యత పరంగా వెబ్ పత్రికలు అచ్చు పత్రికలకు తీసిపోయినవేమీ కాదు. కొండొకచో వెబ్ పత్రికలే ముందంజలో ఉన్నాయి. అలాంటి పత్రికల్లో పేరెన్నికగన్నది ఈమాట! తెలుగు వెబ్ పత్రికల్లో వయసు రీత్యానూ, పరిణతి రీత్యానూ పెద్దది – ఈమాట. ఎప్పుడో యూనికోడు ప్రాచుర్యంలోకి రాకముందే పుట్టిన ఈ పత్రిక కాలంతో పాటు రూపునూ, సాంకేతికతనూ మార్చుకుంటూ, మెరుగుపరచుకుంటూ, అదే సమయంలో తన రచనల స్థాయిని కాపాడుకుంటూ వస్తోంది.

ఈమాట

ఈమాట ద్వైమాసిక సాహితీ పత్రిక. చాలా స్పష్టమైన ఆశయాలు కలిగినది.

సంపాదకవర్గం:
వేలూరి వేంకటేశ్వరరావు, కె.వి.ఎస్. రామారావు, సురేశ్‌ కొలిచాల, శంఖవరం పాణిని, పద్మ ఇంద్రగంటి ఈమాటను నిర్వహిస్తున్నారు.

“అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి తోడ్పడింది” అనే మాట ఈమాటకు చెందినంతగా మరో పత్రికకు చెందదు. తెలుగు సాహిత్యానికి నెట్లో ఉన్న ప్రధాన వనరుల్లో ఈమాట ఒకటి. ఈమాట కూడబెట్టినంత సాహితీ సంపద అంతర్జాలంలో మరో తెలుగు పత్రిక చెయ్యలేదు. ఇప్పటి వరకూ వచ్చిన యాభై పైచిలుకు సంచికలను ముందేసుకుని కూచ్చుంటే సాహిత్య భోజనులకు అజీర్తి చెయ్యడం ఖాయం! ఈమాట గ్రంథాలయంలో తెలుగు పుస్తకాలు డౌనులోడు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి.

కళ్ళకింపైన చక్కని మూసను ఈమాటకు వాడుతారు. పత్రిక వెనుక గట్టి సాంకేతిక వర్గం కూడా ఉన్నట్టుంది.., ఈ వర్డ్ ప్రెస్ మూసకు మార్పుచేర్పులు చేసి చాలావరకు తమకనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. యూనికోడులోనే కాక, మూడు ఇతర రూపాల్లోనూ ఈమాట లభిస్తుంది.

ఇందులో వచ్చినన్ని పరిశోధనాత్మక వ్యాసాలు ఇంకెక్కడా రాలేదేమో. ఆంగ్లంలో ఎకడెమిక్ జర్నల్ తరహాలో ఈ పత్రికని నడుపుతున్నారు. ప్రతి రచనా, ముందుగా ముగ్గురు సమీక్షకులు పరిశీలిస్తారు, అవసరమైన చోట్ల మార్పుచేర్పులకు సూచనలు ఇస్తారు.

ఎప్పుడో ఎనిమిదేళ్ళ కిందటే ఆడియో వ్యాసాలను అందించిన ఘనత ఈమాటది. ఈమాట అచ్చులోనూ వస్తే, మరింత మంది పాఠకులకు చేరువయ్యే అవకాశం ఉంది.

*** *** *** *** ***

సుజనరంజని

కాలిఫోర్నియా బే ఏరియా తెలుగువారి సాంస్కృతిక సంస్థ, సిలికానాంధ్ర వారి పత్రిక ఇది. మాసపత్రిక. 2004 జనవరి నుండి ప్రచురితమౌతోంది. ప్రతి నెలా ఒక ముఖచిత్రాన్ని ప్రచురిస్తారు. మామూలు అచ్చు పత్రిక భావన కలుగజేస్తుంది. తెలుగు సాహిత్యమే ప్రధానంగా నడిచే పత్రిక ఇది.

సుజనరంజని

పద్య సమస్యలిస్తూ పాఠకుల నుండి పూరణలను కోరే “పద్యం హృద్యం” శీర్షిక సుజనరంజని ప్రత్యేకత! మరే పత్రికలోనూ లేని శీర్షిక ఇది. గళ్ళ నుడికట్టును కూడా ఇస్తారు కానీ, దాన్ని డౌనులోడు చేసుకుని ప్రింటు తీసి, ఆపై పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. సుజనరంజని యూనికోడులోనే కాక, పీడీయెఫ్ గా కూడా లభిస్తుంది.

సంపాదకబృంద సభ్యులు:
తాటిపాముల మృత్యుంజయుడు
తల్లాప్రగడ రావు
ప్రఖ్య వంశీకృష్ణ
తమిరిశ జానకి
కూచిభొట్ల ఆనంద్
డా.జుర్రు చెన్నయ్య

శీర్షికా నిర్వాహకులు: కాకుళవరపు రమ, పసుమర్తి బాలసుబ్రహ్మణ్యం

తాము స్వయంగా తయారుచేసుకున్న సాఫ్టువేరును, మూసను వాడుతున్నారు. సైటు మిగతా పత్రికలతో పోలిస్తే నిదానంగా లోడవుతుంది. బహుశా బొమ్మలు ఒక కారణం కావచ్చు. పత్రికలో అచ్చుతప్పులు పంటికింద రాళ్ళలాగా తగులుతూ ఉంటాయి. పాఠకులు తమ అభిప్రాయాలను తెలియజెప్పేందుకు సరైన వీలు లేదు. ఈ మధ్య ఈ అంశాన్ని ప్రవేశపెట్టారు కానీ పాఠకుల స్పందన తరువాతి సంచికలోనే వస్తుంది. అంతర్జాల పత్రికల్లో ఇది లేకపోవడం లోటే గాక, చిత్రం గానూ అనిపిస్తుంది.

*** *** *** *** ***

ప్రజాకళ

ప్రజాకళ అక్టోబరు 2006 లో మొదలైంది. దీన్నొక మాస పత్రికగా తీసుకురావాలనేది పత్రిక పెట్టిన కొత్తలో వారి ప్రయత్నం. ఈ మధ్య కాలంలో తమ ఉద్దేశ్యాన్ని మార్చుకుని ప్రతి వారం ఏదో ఒక కొత్త రచనతో సైటుని అప్ డేట్ చేస్తూ తాజాగా వుంచాలనేది తమ కోర్కె అని చెప్పారు. అయితే ఆ ప్రయత్నాలు ఇంకా కార్యరూపానికి రాలేదు. కవిత్వం, కథ, నవల, సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శ తదితర రచనలను పరిచయం చేస్తారు.. “ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు పరిచయం చేయాలనేది” కూడ వారి కోర్కె.

ప్రజాకళ

సాజీ గోపాల్ నేతృత్వంలో ప్రజాకళ వస్తూంది. అయితే పత్రికలో ఆ వివరాలను ప్రచురించలేదు. “అందుచేత తెలుగులో ప్రజాస్వామిక సాహిత్యం పట్ల ఆసక్తీ, ప్రేమా వున్న కొంతమందిమి మేము ఈ వెబ్ సైటు ప్రారంభిద్దాం అని అనుకున్నాము.” అని మాత్రం రాసారు. ఈ విషయమై ఒక ప్రముఖ పాఠకుడు అడిగిన ప్రశ్నకు సమాధానమూ ఇవ్వలేదు. బహుశా ఆ ప్రశ్నకు అక్కడే సమాధానం ఇవ్వకపోవడంలో తమ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసేందుకే ఆ ప్రశ్నని తీసెయ్యకుండా, అలాగే ఉంచేసినట్టున్నారు. (ఆయనకు సమాధానాన్ని నేరుగా ఈమెయిలుకు పంపి ఉండవచ్చు.)

ప్రజాకళ వర్డ్‌ప్రెస్ సాఫ్టువేరును వాడుతున్నది. ఉచితంగా దొరికే మూసను వాడుతున్నారు. మొదటినుండీ ఒకే మూసను వాడుతూ వస్తున్నారు. పీడీయెఫ్ రూపంలో కూడా దొరుకుతుంది.

*** *** *** *** ***

ప్రాణహిత

ప్రాణహిత 2007 జూలైలో మొదలైంది. “ప్రధానంగా, విభిన్న గొంతుకల సమ్మేళనమై వినబడే ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యానికి క్రియాశీల వేదిక కావడమే ప్రాణహిత లక్ష్యం.” అని చెబుతూ.., “ప్రపంచవ్యాప్తంగా, దేశ దేశాల్లో ప్రజల పక్షం నిలబడ్డ సాహిత్యాన్ని తెలుగు చేసి మీకందించే ప్రయత్నం చేస్తాం.” అని తమ సంకల్పాన్ని చెప్పుకున్నారు. ఎక్కడా స్ఫుటంగా ప్రస్తావించనప్పటికీ ప్రాణహిత ప్రధానంగా తెలంగాణా ప్రాంత అంశాలకు ప్రాధాన్యత నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ప్రాణహిత

ప్రాణహిత సంపాదకవర్గం: నారాయణ స్వామి, హిమబిందు, మమత, జయప్రకాశ్, చైతన్య, జి. ఎస్. రాంమోహన్ (హైదరాబాద్)

ప్రాణహితది ఆహ్లాదకరమైన రూపం. వర్డ్‌ప్రెస్ సాఫ్టువేరులో, ఒక చక్కటి మూసను కొని, వాడుతున్నారు. మొదటి నుండీ దాన్నే వాడుతున్నారు. పత్రిక పీడీయెఫ్ రూపంలో కూడా దొరుకుతుంది

పాఠకులకు ప్రజాకళ, ప్రాణహిత పత్రికలలో దగ్గరి పోలికలు కనిపిస్తాయి. వారి సాహితీ దృక్పథం, ప్రచురిస్తున్న వస్తువుల్లో ఉన్న సారూప్యత అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. రెండు పత్రికల్లోనూ ఉన్నత విలువలతో కూడిన వ్యాసాలు వస్తున్నప్పటికీ, తమకో ప్రత్యేక గుర్తింపును, ఒక బ్రాండును స్థాపించుకోవడంలో ఇదొక అడ్డంకి. ఈ రెండు పత్రికల గురించిన పేజీలను చూస్తే వీటి సామ్యం అవగతమౌతుంది.

*** *** *** *** ***

కౌముది

వెబ్‌లో ప్రచురితమౌతున్న మరో మాస పత్రిక కౌముది. ప్రముఖ రచయిత, కిరణ్ ప్రభ (పాతూరి ప్రభాకరరావు), ఆయన భార్య కాంతి ఈ పత్రికకు నిర్వాహకులు. గతంలో సుజనరంజని పత్రికను నిర్వహించిన కిరణ్ ప్రభ 2007 జనవరిలో కౌముదిని ప్రారంభించారు.



యూనికోడు యుగంలో మొదలైనప్పటికీ, కౌముదిని పీడీయెఫ్, బొమ్మల రూపాల్లోనే ప్రచురిస్తున్నారు. పాఠకుల స్పందన వెంటనే కనిపించదు.

*** *** *** *** ***

భూమిక

భూమిక స్త్రీవాద పత్రిక. అచ్చు పత్రికగా మొదలై, 2006 నవంబరులో అంతర్జాలానికెక్కింది. “తెలుగులోనే కాక యావత్ దక్షిణ భారతంలోనే వస్తున్న ఏకైక స్త్రీవాద పత్రికగా” భూమిక గురించిన పేజీలో రాసారు. కొండవీటి సత్యవతి ఈ పత్రిక సంపాదకురాలు. భూమికలో పనిచేసే వారంతా స్త్రీలే! ప్రసిద్ధులైన స్త్రీలు భూమికలో ముఖ్య భూమికలు నిర్వహిస్తున్నారు.

భూమిక

భూమికలో రచనలు ఎక్కువగా స్త్రీకి సంబంధించినవే. కాల్పనిక రచనలు తక్కువగానూ, వాస్తవ విషయాలకు సంబంధించిన రచనలు ఎక్కువగాను ఉంటాయి.

కేవలం రచనలతోటి సరిపెట్టడమే కాకుండా, స్త్రీలకు మాటసాయం చేసే ఉద్దేశ్యంతో భూమిక ఒక హెల్ప్‌లైన్ ను కూడా నిర్వహిస్తోంది.

*** *** *** *** ***

నవతరంగం

తెలుగు పత్రికలలో పసి కూన ఇది. పొద్దు లాగానే ఒక వేళాపాళా లేకుండా వచ్చే పత్రిక. సినిమా కోసమే ప్రత్యేకించిన పత్రిక. సినిమా విమర్శకుడిగా పేరొందిన వెంకట్ సిద్ధారెడ్డి మరి కొందరు ఔత్సాహికులతో కలిసి స్థాపించిన పత్రిక. రాకేశ్వరరావు, మంజుల, దేవరపల్లి రాజేంద్ర కుమార్, సౌమ్య, ప్రసాద్, శ్రీరామ్ మొదలైనవారు ఇతర రచయితలు. నిష్పాక్షిక సినిమా సమీక్షలకు నెలవుగా నవతరంగం పేరు పొందుతోంది. నవతరంగం అనే పేరుతో తమ సైటు కొత్త ఆలోచనలను, కొత్త భావాలను తెస్తుంది అని చెప్పదలచినట్టున్నారు. బహుశా వెంకట్ కు న్యూవేవ్ సినిమా పట్ల ఉన్న అభిమానం ఆయనచేత ఈ పేరు పెట్టించి ఉండవచ్చు.

నవతరంగం

ఇది కూడా వర్డ్‌ప్రెస్ సాఫ్టువేరు ఆధారంగా నడిచే పత్రికే! మామూలుగా ఉచితంగా దొరికే మూసల జోలికి పోకుండా, నవతరంగం తన మూసను కొని మరీ వాడుతోంది. ఆ విధంలో ఒక అసౌకర్యానికి గురౌతోంది. పదే పదే రూపును మార్చుకోవడానికీ, ప్రయోగాలకూ ఖర్చు పెరిగిపోతోంది. (తమరి విధేయ పత్రిక ఈ ప్రయోగాలకు పెట్టింది పేరని పాఠకులకు తెలియంది కాదు). సైటు చాలా త్వరగా లోడవుతుంది.

పత్రికలో బాగా కనిపించే తేడా.. దానికున్న పోర్టల్ రూపమే! ఇటీవలి వ్యాసాల సంక్షిప్త పరిచయం మొదటి పేజీలో కనిపిస్తాయి. ఎంచుకున్న శీర్షికలలోని సరికొత్త వ్యాసాల మొదటి వాక్యాలు మొదటి పేజీ అంతా పరుచుకుని ఉంటాయి.

ఫోకస్, భారతీయ సినిమా, ప్రపంచ సినిమా, విశ్లేషణ, సమీక్ష మొదలైన వర్గాలున్నాయి. ఇవి వర్గాలు.. శీర్షికలు కావు. ఒక్కో వ్యాసమూ ఒకటి కంటే ఎక్కువ వర్గాలోకి చేర్చారు. అది సహజమే. కానీ ఆ వర్గాలనే పైనున్న లింకులుగా పెట్టడంతో ఒకే వ్యాసం ఒకటి కంటే ఎక్కువ లింకుల్లో ఉంటోంది. పైనున్న లింకులు ఆ లింకులకే ప్రత్యేకమైన వ్యాసాలను చూపిస్తే బావుంటుంది. వర్గాలను పేజీలో మరోచోట పెట్టొచ్చనుకుంటాము.

ఇకపోతే… నవతరంగంలో ఉండాల్సినవీ, అక్కడ లేనివీ – ఫోటోలు. ఒక సినిమా పత్రికలో పాఠకులెక్కువగా ఆశించేది ఫోటోలను. నవతరంగం, నవతరపు సినిమా పత్రికైనప్పటికీ అది అవసరమే! పత్రిక మరింత పుంజుకునేటప్పటికి ఆ లోటూ తీరవచ్చు.

నవతరంగం, అంతర్జాలంలో వస్తున్న మార్పులని తనకనుగుణంగా మార్చుకొన్న మొదటి పత్రిక. ఇక్కడ, సాంప్రదాయక పద్ధతిలో సంపాదక వర్గం పని చెయ్యదు. సినిమా పట్ల ఉత్సాహం, అవగాహన, రాయగల నేర్పు ఉన్న రచయితలకి, నవతరంగం నేరుగా – తమ రచనలని, ప్రచురించుకొనే సౌకర్యం కలిగిస్తోంది. ఇది ఓ కొత్త ప్రయోగం.

సాటి ఉత్సాహవంతులను కలుపుకుని వెంకట్ సిద్ధారెడ్డి చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైనట్టే! పాఠకుల స్పందన కూడా బావుంది. తెలుగు సినిమాపై నిజాయితీతో కూడిన విమర్శ కరువైన ఈ రోజుల్లో ఇది అవసరమైన ప్రయోగం. ఉత్సాహవంతులు, కార్యకుశలురూ అయిన నవతరంగ చోదకులు మరిన్ని కొత్త శీర్షికలతో పత్రికను నిత్యనూతనంగా ఉంచుతారని ఆశించవచ్చు.

*** *** *** *** ***

చాలా వరకూ వెబ్-పత్రికలన్నీ – సాహిత్యానికి, లేదా ఏవో కొన్ని సామాజికాంశాలకీ పరిమితమైపోయాయి. ఎంతో మంది తెలుగు వాళ్ళు, ప్రపంచం నలుమూలలా – ఎన్నో రంగాలలో నిష్ణాతులుగా పని చేస్తున్నారు. ఇప్పుడు, తెలుగులో రాయటం చాలా తేలికైపోయింది. పత్రిక పెట్టడానికి కాని ఖర్చు కూడా లేదు, ఉత్సాహం, రాయాలనే పట్టుదలా, ఏదో ఒక రంగంలో నైపుణ్యం ఉంటే చాలు. కాబట్టి, రాబోయే కాలంలో – ఎకనామిక్సు, పొలిటికల్ సైన్సు, సైన్సులు, సోషియాలజీ మొదలైన రంగాలలో – నైపుణ్యం ఉన్నవారు కొంతమంది – నవతరంగం తరహాలో ఒక చోట చేరి, ఆయా అంశాలలో తెలుగులో రాస్తే బావుటుంది. ఇప్పటికే, కొంతమంది – భాషా శాస్త్రం, కంప్యూటర్ సైన్సు, టెక్నాలజీ, సైన్సు మొదలైన విషయాలలో, ఉన్నత స్థాయి రచనలు చేస్తూ ఉన్నారు. ఈ ట్రెండు ఇలాగే కొనసాగితే, తెలుగు అంతర్జాలం, వెబ్-పత్రికలు – ప్రింటు మాధ్యమాలకి ప్రత్యామ్నాయంగా ఎదగటం, తమ ఉనికిని స్థిర పరుచుకోవటం ఖాయం.

-పొద్దు

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

10 Responses to అంతర్జాల పత్రికలు

  1. venkat says:

    మంచి వ్యాసం (మా గురించి రాసినందుకు మాత్రమే కాదు :-))
    మరో విషయం. మొదటి పేజీలో ఈ వ్యాసానికి ఇచ్చిన లింకు సరిగా లేదు.
    సరి చేసుకోగలరు

  2. chavakiran says:

    హుమ్! ఇంత మంది థీములు కొంటున్నారంటే నేను కూడా తయారు చేసి అమ్మినా పొయ్యేది 🙂

  3. చక్కని రౌండప్.
    పొద్దు గురించి ఇలాంటి ఒక సమీక్ష రాసి పొద్దుకి పంపుదామని నేననుకునే సరికే మీ నుంచి ఇలాంటి వ్యాసం 🙂

    ప్రకటనల గురించి మీరు చెప్పింది నిజం. అవకాశాలు లేకే.

    ఇక కమర్షియలైజ్ చేసిన వెబ్‌సైటులు మరీ దారుణంగా తయారవుతున్నాయి. నిజాయితీ లోపిస్తుంది.
    ఉదా: గ్రేట్ ఆంధ్ర, ఆంధ్రవిలాస్, ఐడిల్ బ్రెయిన్ మొ.

    వాటికన్నా వెబ్ పత్రికలే చాలా నయం.

  4. మెచ్చదగిన ప్రయత్నం

  5. cbrao says:

    కౌముది గురించి, మరీ మూడు వాక్యాలలో, టూకీగా తేల్చేసారే? మొత్తంగా వ్యాసం, నిశ్పక్షపాతంగా వుంది.

  6. ప్రకటనల విషయానికొస్తే,
    మన సైట్లన్నీ తెలుగు లో వుంటాయి కాబట్టి గూగుల్ యాడ్స్ మన దాంట్లో పనిచేయవు. అది లేనప్పుడు ప్రత్యామ్నయంగా text-link-ads లాంటివి వున్నాయి. కానీ అవన్నీ కీవర్డ్ బేస్డ్ యాడ్స్ కాబట్టి అదీ మనకి సరిపోదు. ఇక పోతే ఈ మధ్యనే యాక్సిల్ యాడ్స్ ఇండియాలోనూ తమ కార్యకలాపాలు ప్రారంబించారు. వాళ్ళకి ఇలా భాషాసంబంధమైన సమస్యలు లేవు. హిట్లు వస్తున్నాయంటే ఇస్తారు. నవతరంగంలో ఒక వారం పాటు ప్రయోగాత్మకంగా ఈ యాక్సిల్ యాడ్స్ ప్రకటనలు ప్రచురించడం జరిగింది. కానీ వీక్షకుల అభిప్రాయం ప్రకారం ఆ యాడ్స్ రీడబులిటీ ని తగ్గిస్తున్నాయని మాకూ అనిపించి తీసేసాము. అయినా యాక్సిల్ వాడు వెయ్యి ఇంప్రెషన్స్ కి 15 రూపాయలు ఇస్తాడు. మనలో రోజుకి వెయ్యి హిట్లు వచ్చే సైటైదైనా వున్నా రోజుకి 15 రూపాయల కోసం ప్రేక్షకులకు ఫ్లాషీ యాడ్స్ తో విసిగించడం కంటే ప్రకటనలు లేకుంటేనే మేలేమో కదా!

  7. ప్రవీణ్ గారూ,
    అంతకన్నానా? 🙂 మీవంటి వారి సూచనలు పొద్దుకు అనుసరణీయం!

  8. బాగా వ్రాసారు వ్యాసం.
    అన్నట్టు పొద్దు క్రొత్త లే అవుటు మీద అభిప్రాయ సర్వే నిర్వహించారా, ఎందకంటే నాకైతే పాత రూపే నచ్చింది. ఉదయభానుడి రంగులో ఆహ్వానికంగా వుండేది. ఇప్పుడేమో రాత్రిలా చీఁకటి పడిపోయింది.

  9. shiva bandaru says:

    మంచి సైట్స్ కు సహాయం అవసరం ఉంటే ప్రస్తుత పరిస్తుతులలో యాడ్స్ కన్నా డొనేషన్స్ స్వీకరించటం ఆలోచించండి. Paypal ను ట్రై చేయండి.

    ముందు ముందు Chandana brothers లాంటి లోకల్ వారు యాడ్స్ ఇచ్చే పరిస్తితులు వస్తాయు.

    మంచి సమాచారంతో , సౌకర్యాలతో వీక్సకులను సంపాదించడం అవసరం. రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది.
    Best of luck….

    In my opinion wordpress is not good at web site monitisation .

    look at joomla (joomla.org)Content management system , it is more easy and more interactive and best banner ad management system and easy integration with other ad networks.

    with it you can easily sell add impressions eg : 1000 impressions (CPM)at Rs 100, et. and easily manage advertisers , ads and impressions.

    You can also add paid classified systems, job boards,matrimony ads,real estate ads, to your content rich web magazine.

    Some important things :

  10. kusumakumari says:

    enno kotta vishayaalu mii vyaasaM valana telisaayi.

Comments are closed.