(సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ఈ కవిత సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక బహుమతి కథల ప్రత్యేక సంచికలో (జూలై-సెప్టెంబర్ 2007) ప్రచురితమైంది. ఈ కవితను పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన నేత్రం సంపాదకులు శశిశ్రీ గారికి నెనర్లు.)
ఎన్ని కడవల అశృబిందువులో అక్షరాలుగా చింది
నన్నంతా తడిపి తడిపి తిరగేసినప్పుడు
ఆ పల్లెకు – నా పుట్టిల్లుకు నడుస్తాను.
బస్సంటే తెలీని ఆ ఐదుమైళ్ళ కాలిబాట
ఐదైదు స్మృతివిహంగాలై నా మెదడు మైదానం
నిండా వాల్తాయి.చేతిలోని లెదర్ బ్యాగ్
పుస్తకాల సంచి అయి వూగుతుంది.
ప్రతి మట్టి రేణువు చిరుమువ్వ అయి
నా కాలి వేళ్ళతో కిలకిలలాడుతుంది.దారిమధ్య ‘సగిలేరు‘ చెలిమ కన్నుల్ని తెరచి
నా బాల్యం దాకా గుచ్చి గుచ్చి చూస్తుంది.వానపొద్దున వొంటిమీది బట్టల్ని
ప్లాస్టిక్ సంచిలో పుస్తకాల వెనక కూరి
నెత్తిన అడ్డుంచుకొని పరిగెత్తిన
అమాయిక నగ్నత్వం నన్నిపుడు గిలిగింతలు
పెడుతుంది.రాళ్ల దెబ్బలు, కాపలా కేకల వాయిద్యాల్ని మోస్తూ
మామిడితోపు వాసన కాలిబాట దాకా వీస్తుంది.ఊరంచున పొలాలన్నీ
బడి పలకలై తడితడిగా లేస్తాయి.డొంకలో –
అరికాలి కింద నాటిన తుమ్మముల్లు
గ్రాంఫోను ముల్లయి పసి ఆటలన్నిట్నీ పాడుతుంది.
బడిగంట లేత వెలుగుల్ని రాల్చుతూ
ఎదకొలనులోకి నెలవంకలా జారుతుంది.అప్పుడే – పల్లె నన్ను తాకుతుంది.
స్మృతులన్నీ బెదరిన గుడిపావురాలవుతాయి.
కొత్తగాలినై వీధులెంట సాగుతోంటే
ఎన్ని చూపులో నన్ను మూచూసేందుకు
పొడుచుకొస్తాయి.వాళ్ళలో వాళ్ళు పరస్పరం నన్ను పరిచయం
చేసికొంటుంటారు.
నేను వీధి గతుకుల్ని పరిశీలిస్తున్నట్లుగా
హుందాగా నడుస్తుంటాను.నా స్వంత యింటి వాసన కొంత దూరాన్నించి
గుండెల్ని తాకుతుంది.
ఇంటిముందు అరుగుమీద అమ్మనాన్నలు
గుడ్డిదీపాలై
నాకేసి ప్రశ్నార్థకాలుగా వంగి
ఆపై ఆశ్చర్యార్థకాలై సాగి
మరుక్షణం కరిగి కరిగి కన్నీటి మడుగులవుతారు.చెదలుగుంపై వాళ్ల వొంటినంతా, మనస్సునంతా
తినేసిన
నా అనాదరణ పవరెంతో నాకిప్పుడు
అర్థమవుతుంది.
వాళ్ల జీవన సాయం సంధ్యలోకి అతిథినై
అడుగేసినందుకు సిగ్గుపడతాను.
నేనింకా –
ఆ యింటి కోడినై, కుక్కపిల్లనై, లేగదూడనై
నిక్కరులో వొదిగిన కుర్రాడినై
వాళ్ల కన్నీటిని పొదువుకొనే మట్టినై కరగనందుకు
చిరునామా చెప్పుకోలేనంత సిగ్గుగా ఉంది.
——————–
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కవిగా, కథా-నవలా రచయితగా ప్రసిద్ధుడు. 1987లో కవితలు రాయడం మొదలుపెట్టాడు. 1980లలో వచ్చిన అత్యుత్తమ కవితలను ఏర్చికూర్చిన కవితాసంకలనం “కవితా! ఓ కవితా!!” లో ఈయన రాసిన 2 కవితలు చోటు సంపాదించుకున్నాయి. పల్లె ప్రజల నెత్తుటిలో మలేరియా క్రిమిలా వ్యాపించిన హీనరాజకీయాల్ని – వాళ్ళ బతుకుల్నిండా చీడై కమ్ముకున్న కరువు గురించి – ప్రభుత్వ సవతి ప్రేమను గురించి ఆవేదన చెందుతూ వాటికి ఆస్కారమిచ్చిన మూలాల గురించి నిరంతరం అన్వేషిస్తూ ఉన్న అరుదైన రచయిత వెంకటరామిరెడ్డి.
చాలా చాలా బాగుందండి.చదివిన ప్రతి ఒక్కరికీ గుండె బరువెక్కుతుంది.
ప్చ్ ఇలాంటి అనుభూతినే వెతుక్కుంటూ పల్లెకెల్లణూ గానీ అ అనుభవం నాకు రాలేదు.
ఎందుకంటే నేనాడుకున్న వీధులూ లేవు. బాల్యం నాటి ఇల్లూ లేదు. ఆనాటి మనుషులు గానీ, లేదూడలు గాని, పల్లె పదాలు గానీ, పచ్చదనం గానీ… ఏదీ ఏదీ లేదు. తుమ్మముల్లేమొ గానీ కనీసం కావాలని తొక్కుదామంటే పల్లేరిగాయ కూడా కనిపించలేదు.
“కొత్తగాలినై వీధులెంట సాగుతోంటే
ఎన్ని చూపులో నన్ను మూచూసేందుకు
పొడుచుకొస్తాయి”
నా చూపుల్తో పొడిచిపొడిచి చూసినా వాళ్ళింకా లోపలికి ముడుచుకుంటున్నారే గానీ నన్ను చూడటానికి బయటకు రాలేదు.
ఈ కవితకు పూర్తి విరుద్దంగా నా అనుభవం. ప్చ్!
–ప్రసాద్
http://blog.charasala.com
chala bagundi. Naa chinnanati rosulanu naa madi mundu pratibhibam la unchindi. Chaduvu tunnantasepu na gunde balya jnapakaloto baruvekki veganga kottukundi.