నాకు బాగా చిన్న వయసులో నసీరుద్దీన్ కథలతో పరిచయమై, తరువాత్తరువాత చిన్న చిన్న గణిత చిట్కాలు, పిల్లలతో ఆడించే ఆటలతోనూ పరిచయమై… ఆ తరువాత – “ఎందుకు?” అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు చాలా ప్రశ్నలకి జవాబు చెప్పినప్పుడు, నాలో తెలుసుకోవాలి అన్న ఒక జిజ్ఞాసను కలిగినప్పుడు, కలుగుతున్నప్పుడు నేను ఎవరిని తలుచుకుంటాను అంటే – నళినీమోహన్ నీ, ఆయన పుస్తకాలని నాకు పరిచయం చేసిన మా నాన్ననీ. ఎవరీ నళినీమోహన్? నళినీమోహన్ గారి పూర్తి పేరు మహీధర నళినీమోహన్.
మహీధర నళినీ మోహన్ (en.wikipedia.org నుండి) |
ప్రసిద్ధ రచయిత మహీధర రామమోహనరావు గారు వీరి తండ్రి. రచయితగా కాక శాస్త్రవేత్తగా నళినీమోహన్ గారి గురించి చెప్పుకోవలసింది చాలా ఉంది. అయితే, ఆ సమాచారమంతా వికీ పేజీలో ఉంది. ప్రస్తుతం ఈ వ్యాసం రాయడంలో నా ఉద్దేశ్యం రచయితగా ఆయన ఎంత బాగా రాస్తారో, ఆ రచనలు నాకు సైన్సును తెలుసుకోవడానికి ఎంత ఉపయోగపడ్డాయో తెలియజేయడం. వ్యక్తిగత అనుభవమే అయినా కూడా, ఈయన రచనలు తెలిసినవారు తక్కువమంది ఉన్నారేమో అన్న అనుమానం చేతనూ, తెలుగులో ఇలాంటి రచనలు అప్పట్లోనే వచ్చాయి అని తెలీనివారికి తెలపాలన్న ఆరాటం చేతనూ రాస్తున్నాను ఈ వ్యాసాన్ని.
నళినీమోహన్ గారు వృత్తిరీత్యా అంతరిక్ష శాస్త్రవేత్త. ఫిజిక్స్ లో డాక్టరేటు కలిగిన మనిషి. ఆ తరహా మనుష్యుల్ని నిజజీవితంలో కలిసిన ప్రతిసారీ నాకు ఎదురైన అనుభవం.. వాళ్ళు మాట్లాడేది పైనుంచి వెళ్ళడమే. చాలా మంది మేధావులు ఇలా చెప్పడమే చూసాను, విన్నాను నేను. కానీ, నళినీమోహన్ గారు అలా కాదు. కృష్ణబిలాల గురించి చెప్పినా, కెప్లర్ సిద్ధాంతం చెప్పినా, రాకెట్టు కథ చెప్పినా, గురుత్వాకర్షణ శక్తి అదీ ఇదీ అని ఈక్వేషన్లు గీసినా – ఏమి చేసినా కూడా అది అందరికీ అర్థమయ్యేలానే ఉంటుంది. అదీ ఆయన శైలి లోని సరళత్వం. విషయం తెలిసి ఉండటమే కాదు, అది అర్థమయ్యేలా చెప్పగలగడం ఓ గొప్ప కళ. ఆ కళలో నళినీమోహన్ గారు నిష్ణాతులు. ఆయన వ్యాసాలు మనతో కబుర్లు చెబుతున్నట్లు ఉంటాయి. చిన్నపిల్లలు కథ చెప్పమంటే అనగనగా అనుకుంటూ మొదలుపెడతామే, అలా మొదలౌతాయి. తరువాత విషయం లోకి నెమ్మదిగా వెళతాయి. అక్కడ కూడా మనకు ఏదో శాస్త్రీయ విషయాల మీద వ్యాసం చదువుతున్నట్లు ఉండదు. ఆ భాష ఎలా ఉంటుంది అంటే, ఎక్కడికక్కడ మన నానుళ్ళూ, సామెతలూ వాడుతూ ఉంటారు -ఆ క్లిష్టమైన విషయాలు మనకు అవగతం కావడానికి. ఎక్కడో కొన్ని చోట్ల తప్పితే, ఈ వ్యాసాల్ని సాంకేతిక పరమైన చదువులు చదవని వారు కూడా అర్థం చేసుకోగలరు. చేసుకోవడమే కాదు, తెలీని మరొకరికి విశదీకరించనూ గలరు.
ఇంతా విని నేనేదో ఈయన రచనల్ని కాచి వడబోశాననుకోకండి. నేను ఈయన రాసిన పిల్లల రచనలు తప్ప ఏదీ పూర్తిగా చదవలేదు. కానీ, తరుచుగా ఆయన రాసిన వ్యాసాలు – వివిధ పుస్తకాల్లోవి – చదువుతూ ఉంటాను. ఊహ తెలిసిననాటి నుండి నళినీమోహన్ గారి ఏకలవ్య శిష్యురాలినే నేను. నా వ్యక్తిగత పరిణామంలో నళినీమోహన్ గారి పాత్ర మరువలేనిది. ఎప్పుడన్నా కాస్త తీరిగ్గా ఉంటే, నళినీమోహన్ గారి “ఆకాశంలో ఆశ్చర్యార్థకం” పుస్తకమో, లేక “ప్రపంచానికి ఆఖరు ఘడియలు” పుస్తకమో తీస్తాను. ఒక వ్యాసం చదివే సరికి మళ్ళీ నా మనసంతా ఆయన పట్ల ఓ విధమైన ఆరాధనాభావంతో ఓ పక్క నిండిపోతుంది. ఓ పక్క పరిశోధన పట్ల ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఓ పక్క నేను తెలుగునేలపై పుట్టడం ఎంత అదృష్టం – ఇలాంటి ఒక రచయిత రచనలు చదవ గలుగుతున్నాను! అనిపిస్తుంది. ఇవన్నింటితో పాటు నాకు తరువాతి క్షణం నుంచి ఆకాశాన్ని చూసినా, ఖాళీగా ఉన్న ఓ బహిరంగ ప్రదేశాన్ని చూసినా ఆయన వాక్యాలు కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. ఈ వ్యాసాల వల్లనే నాకు నక్షత్రాల మీద ఆసక్తి కలిగి నేను ఏ నక్షత్రం ఎక్కడుంటుంది, ఆకాశం ఏ రోజుల్లో ఎలా ఉంటుంది వంటి విషయాలను గురించి క్రమంగా తెలుసుకోగలిగింది. ఈయన రచనలొక్కటే కాదనుకోండి… కానీ, ఈయన రచనలు పరిచయం కాకుంటే మాత్రం నేను నేనుగా ఉండేదాన్ని కాదు. ఇప్పుడు తెలిసిన కాస్త కూడా తెలిసి ఉండేది కాదు. ఈ పుస్తకాలు – ఏకబిగిన పూర్తిగా చదవడానికి కాదు, జీవితాంతం మీ లైబ్రరీ లో పెట్టుకుని – మీరు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలూ కూడా – సమయం చిక్కినప్పుడు తీరిగ్గా కూర్చుని అప్పుడప్పుడూ చదువుతూ ఉండడానికి, మీ ప్రపంచం గురించిన జ్ఞానం మీరు పెంపొందించుకుంటూ ఉండడానికి. “నిప్పుకథ”, “కేలెండర్ కథ”, “పిడుగుదేవర కథ” వంటివి కాస్త ఒక వయసు వారిని ఉద్దేశించినవేమో అనిపిస్తుంది నాకు. పైన చెప్పిన “ఆకాశం లో…”, “ప్రపంచానికి…” వీటి తరువాతి లెవెల్ ఏమో అని అనిపిస్తోంది. ఎందుకంటే, ఈ రెండింటినీ ఇప్పుడు చాలా ఆసక్తితో చదువుతున్నాను నేను. ఒకానొకప్పుడు నేను పదిహేను పదహారేళ్ళప్పుడు చదవలేకపోయినట్లు గుర్తు.
పుస్తకాలు బోలెడున్నాయి. నళినీమోహన్ గారి పుస్తకాలు ప్రత్యేకం. ఎందుకంటే చెప్పదలుచుకున్న విషయాన్ని ఏ పాయింటూ వదలకుండా మానవ భాష లోనే చెప్పడం.
ఇంతటి మేధావి నళినీమోహన్ గారు వృద్ధాప్యంలో ఆల్జీమర్స్ తో కొన్నాళ్ళు బాధపడ్డాక దాదాపు రెండేళ్ళ క్రితం మరణించారు. ఆ వార్త పేపర్ లో చదివిన రోజు నాకు కలిగిన బాధని మాటల్లో చెప్పలేను. నా సొంత మనిషి ఎవరో దూరమైన భావన కలిగింది, ఆయనెలా ఉంటారో తెలీకపోయినా కూడా. ఈ రెండేళ్ళలో ఎన్నిసార్లు ఆయన్ని తలుచుకున్నానో లెక్కలేదు. ఆయన స్మృతికి నేను చేయగలిగేది ఏమన్నా ఉంది అంటే అది ఒకటి – ఆయన పుస్తకాలని నా తరం పాఠకులకు పరిచయం చేయడం.
ఈయన పుస్తకాలు ఇప్పుడు ముద్రణ లో ఉన్నాయో లేదో, అసలు ఆ పుస్తకాల గురించి ఎవర్ని సంప్రదించాలో అయితే నాకు తెలీదు. ఎవరికన్నా తెలిస్తే తెలుపగలరు.
———————-
తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.
మహీధర నళినీమోహన్ గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉంది, ధన్యవాదాలు సౌమ్య గారు.
మోహన్ గారు రచించిన “మెదడుకు పదును” అప్పట్లో నాకు గణితం మీద ఆశక్తిని పెంచింది!
కళ్యాణ్
ఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ లెబారెటరీలో ఫిజిసిస్టుగా పనిచేసిన నళినీమోహన్‌గారిని నేను ఒక్కసారే కలుసుకోగలిగాను. 1996లో బొంబాయిలోని మరాఠీ విజ్ఞాన పరిషత్తువారు ఏర్పాటు చేసిన జాతీయ సైన్సు రచయితల సమావేశానికి ఆయన వచ్చారు. కార్యదర్శి దేశ్‌పాండే మమ్మల్నిద్దరినీ జయంత్ నారళీకర్‌గారికి పరిచయం చేస్తూ ‘వీరిద్దరూ తెలుగులో సైన్సు వ్యాసాలు రాయడమే కాదు, వీరిద్దరి పేర్లలోనూ నళినీ, రోహిణీ అనే స్త్రీల పేర్లుంటాయి ‘ అని చమత్కరించాడు.
మాస్కోలో చదువుకున్న నళినీమోహన్‌గారు ఎన్నో సైన్సు వ్యాసాలూ, పుస్తకాలూ రాసి పాఠకుల ఆదరణ పొందారు. నేను ఎడిట్ చేసే కాలనిర్ణయ్ కేలండర్ పేజీల వెనకపక్క ప్రచురించేందుకని నేను కోరిన వెంటనే ఆయనొక వ్యాసం పంపారు.
సోవియట్ ప్రచురణలు తెలుగులో విరివిగా లభించే రోజుల్లో సామాన్యపాఠకులకు సైన్సు వ్యాసాలూ, పుస్తకాలూ అందుబాటులో ఉండేవి. వాటి లోటు ఈనాడు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే విజయవాడవంటి నగరాల్లో సైన్స్ మ్యూజియంవంటిది ఎవరైనా నెలకొల్పగలిగితే కొన్ని లక్షలమంది విద్యార్థులకు అదెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మల్టీప్లెక్స్ థియేటర్లూ, బ్రాందీ షాపులూ నడపడంలో ధనిక, పాలకవర్గాలకు ఉన్న ఆసక్తి ఇటువంటి విషయాల గురించి ఎందుకుంటుంది?
నళినీమోహన్‌వంటి సైన్సు రచయితను గుర్తుచేసుకుంటున్నప్పుడు ఇటువంటి విషయాలు రాయకుండా ఉండడం కష్టమనిపిస్తుంది!
నళినీమోహన్ గారు చనిపోయిన విషయము ఈ రోజు మీ బ్లొగ్ చదివేక తెలిసింది.ఆయన మరణం ఒక తీరని లొటు.నళినీమోహన్ గారు అనేకమందిలొ సైన్స్ నేర్చుకోవాలనే జిజ్ఞాసను కలగచేసారు.
నమస్కారం.
మహీధర నళినీ మోహన్ గారిని యాకోవ్ పెరెల్మాన్ తొ సరిపోల్చవచ్చు. యా.పె. గారి నిత్య జీవితం లో భౌతిక శాస్త్రం చిన్నప్పుదు ఎన్ని సార్లు చదివేనో గుర్తు లేదు.
వారి పేరు పరిచయమే కానీ రచనలు, రచనల పేర్లు అంతగా గుర్తులేవు. విలువైన ఈ వ్యాసానికి కృతజ్ఞతలు.
I still remember reading his articles on stars in Andhra Prabha magazine when I was in my teens. After my marriage when I got a powerful binoculars, I started watching the sky on summer nights remembering his articles. That was how good his articles were. I liked his relating the science to the traditional observation of customs like Vaikunta Ekadasi or Kartika masam etc.
Dr Mahidhara Nalini Mohan is a Great son of Andhra soil and his proficiency in different fields is amazing.He is a scientist,author,grammarian,homeo physician and a decent poet in Telugu.Dr Mahidhara through out worked towards making physics simple and easy.The recognition what was to be given to such a Great person,I feel has not been accorded for various reasons.
I used to read Mr.Mahidhara Nalinimohan`s articles in the story-books at my child-hood..
One article I can remember that “How to create a Rain-bow with Water?”.
ఆంధ్రజ్యోతి వారపత్రిక వారు 1984 లో అనుకుంటాను, తెలుగువారిలో ప్రముఖ వ్యక్తి అని ఓ పోల్ నిర్వహిస్తే, నళినీమోహన్ గారు అందులో ప్రథములై నిలిచారు. ఈయన పుస్తకాలు చదివి పెరిగిన వారిలో నేనొకణ్ణి. నళినీమోహన్ గారు, పెరల్మన్ పుస్తకాన్నొకదాన్ని తెనుగు చేశారు. ఆ పుస్తకంలో పజిల్స్ నేర్వడం వల్లే నాకు ఉద్యోగం దొరికింది. అలాగే ఈయన “కేలండరు కథ” నాకు వృత్తి రీత్యా ఉపయోగపడింది. ఈ రకంగా నేనాయనకు ఋణపడి ఉన్నాను.
ఆయన పుస్తకాలు విశాలాంధ్రలో కొన్ని దొరుకుతున్నాయి. ఈయన పుస్తకాలు పిల్లలతో చదివించడం మనందరి బాధ్యత.
మహీధర నళినీమోహన్ గారు మీ అందరకూ ఒక శాస్త్రవేత్తగా మాత్రమే తెలుసు. ఆయన శ్రీనాధుడి స్థాయి ఉన్న కవి అని, స్వీడిష్, జర్మన్, రష్యన్ లాంటి 7 పరభాషలలో మహా పండితుడని, మీకందరికీ తెలియపర్చడానికి గర్వపడుతున్నాను. నేను, మాచిన్నాన్న వీరి సైన్సు పుస్తకాలు చదివి సైన్స్ మీద జిజ్ఞాస పెంచుకుని, ఆయనకి ఏకలవ్య శిష్యులుగా పెరిగాము. మా చిన్నాన్నకి ఉద్యోగం వచ్చిన తర్వాత “నా గురువుని ఒక్కసారైనా కలవాలి” అని నిర్ణయించుకుని అతని చిరునామా సంపాదించి అతనిని కలుసుకున్నారు. ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉండేవారు. ఆయన గదిలో అసంఖ్యాకంగా పడున్న అముద్రితాలను చూసి మా చిన్నాన్న ఆశ్చర్యపోయారు. అందులోంచి కొన్ని పుస్తకాలు జెరాక్స్ తీసుకుని ఇంటికి తెచ్చారు. అష్టావాధాని అయిన మా నాన్నగారికి ఆ సాహిత్యం చూసి ఒళ్ళు పులకరించిపోయింది. “ఈయన ఈకాలంలో పుట్టాల్సినవాడు కాదురా..మహానుభావుడు” అని అన్నారు. “గురువుగారూ..మీ వెలుగు ఇంకా ప్రసరించాలి. మీరు మాలో ఇంకా ప్రేరన కలిగించాలి” అని చెప్పి ఆయనచేత ఎన్నెన్నో ఊళ్ళల్లో సైన్సు మీద, సాహిత్యం మీద ప్రసంగాలు ఇప్పించారు మా చిన్నాన్న. ఆయన ఫొటో మా ఇంట్లో ఎక్కడుంటుందో తెలుసా? దేముడి గదిలో.