తక్కిన ప్రాణులను “నోరులేని జీవాలుగా” పరిగణించడం మనకు అలవాటు. భౌభౌలూ, కావుకావులూ మన వాక్పటిమకు సాటిరావు. కుక్కలనూ, పిల్లులనూ పెంచుతున్నవారు వాటితో మాట్లాడతారుగాని ఆ సంభాషణ అంతా ఏకపక్షమే. అందుకే తమకున్న రోగ లక్షలాణెటువంటివో వివరించలేనివారు పశువుల డాక్టర్‌వద్దకు వెళ్ళాలనేది ఒక జోక్. చిలక పలుకులు నిజమైన మాటలు కావు. మాటలంటే కేవలం ధ్వనులు చెయ్యడంకాదు; వాటి వెనక ఆలోచనలూ, ఉద్దేశాలూ ఉంటాయి. మాటలు పలకగలగడమూ, భాషల ఆవిర్భావమూ మనుషులు సాధించిన ప్రత్యేక విజయాలు. ఇందుకుగాను నోటి నిర్మాణంలోనూ, మెదడు పరిణామంలోనూ కొంత అభివృద్ధి జరగాలి.
మనుషుల శరీర నిర్మాణం దృష్య్టా సుమారు 30, 40 వేల సంవత్సరాల క్రితం దాకా భాషలు మొదలవలేదని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రాచీన మానవ అవశేషాలనుబట్టి తొలి భాషలు ఎప్పుడు మొదలయి ఉంటాయో శాస్త్రజ్ఞులు ఊహించగలుగుతున్నారు. అరుపులూ, కూతలూ, పెడబొబ్బలూ పెట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లేవీ అవసరం కావుగాని, మాటలు మాట్లాడడానికి నోట్లో నాలుక అష్టవంకరలూ తిరగగలిగి ఉండాలి. నాలుక కండరాలను నియంత్రించడానికి మెదడు కొంత శ్రమపడాలి. అందుచేత పదాలు ఉచ్చరించడానికి నాలుకనూ, మెదడునూ కలిపే నరాలు ప్రవేశించే మార్గం తగుమాత్రం పెద్దదిగా ఉండాలి. పుర్రెకు అడుగున ఈ సదుపాయానికై ఏర్పాటయిన రంధ్రం చింపాంజీ, గొరిల్లాలవంటి నరవానరాలకు మనకన్నా చిన్నదిగా ఉంటుంది కనకనే అవి మాట్లాడలేవు. అంతేకాక నాలుక స్వేచ్ఛగా తిరగడానికి వాటి దంతాల మధ్య మనుషులకున్నంత స్థలం ఉండదు.
ఆధునిక మానవుల ఆవిర్భావం జరుగుతున్నప్పుడు వారి శరీరాల్లో (ముఖ్యంగా, మెదడుకు సంబంధించిన నాడీవ్యవస్థలో) కొద్దిపాటి మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మనుషులు రెండు కాళ్ళమీద నడవడం మొదలుపెట్టాక వారి చేతులూ, చేతి వేళ్ళూ నైపుణ్యాన్నీ, ప్రత్యేకతనూ సంతరించుకోసాగాయి. ఇందుకు అనుగుణంగా వారి మెదడులోని కొన్ని భాగాల్లో అపూర్వమైన అభివృద్ధి జరిగింది. వీటిలో నుదుటి వెనక ఉండే బ్రోకా కేంద్రం ఒకటి. ఇది పెద్దది కావడం వల్ల పెదవులూ, నాలుకా బాగా తిరగగలిగాయి. పదాలను ఉచ్చరించడానికీ, వాటిని విని, అర్థం చేసుకోవడానికీ తగిన పరిణామాలు జరిగాయి.
జంతువులూ, పక్షులూ అవసరమైనప్పుడు శబ్దాలు చేస్తూ సంకేతాలు పంపగలవు. జత కట్టడానికో, సాటి ప్రాణులను హెచ్చరించడానికో, కోపమూ, బాధా వ్యక్తం చెయ్యడానికో రకరకాల చప్పుళ్ళు చెయ్యగలవు. కానీ అవన్నీ పరిమితంగా, వాటి అవసరాలకు మించకుండా ఉంటాయి. కోతులలాగా చెట్లకు అంటిపెట్టుకోకుండా విభిన్న పరిస్థితులలో జీవించసాగిన మానవజాతి మనుగడకు భాష ఉపయోగం జీవపరిణామంలోనూ, మానసిక అభివృద్ధిలోనూ అత్యవసరం అయిపోయింది. సముదాయాలుగా జీవిస్తూ, పరస్పరం సహకరించుకోసాగిన తొలి మానవుల జీవనశైలి జటిలం అవుతున్నకొద్దీ భాష అవసరం పెరిగింది.
మొదటగా ఒక్కొక్క వస్తువుకూ సంకేతాలు ఏర్పాటు చేసుకోవలసివచ్చింది. రోజువారీ సంఘటనల వైవిధ్యం పెరుగుతున్నకొద్దీ ఈ శబ్దాల మధ్య పొరబాట్లూ, అపార్థాలూ తలెత్తకుండా ఉండడానికని క్రమంగా వేరు వేరు పదాలవంటివి ఏర్పాటు చేసుకోక తప్పలేదు. ఒకవంక మెదడులో ఉచ్చారణకు సంబంధించిన అభివృద్ధి జరుగుతూ ఉంటే మరొకవంక తాము వింటున్న ఒక్కొక్క పదానికీ అర్థాలు స్ఫురించడం, ఆ పదం వర్ణిస్తున్న వస్తువునో జంతువునో ఊహించుకోగలగడం కూడా మనుషులకు సాధ్యమైంది. జంతువులలాగా కాకుండా “ఫలానా పరిస్థితిలో ఫలానా సంఘటన జరిగితే ఏమౌతుంది” అనే ఆలోచనలు తలెత్తడానికీ, వాటి గురించి సాటివారితో మాటల ద్వారా చర్చించడానికీ అవకాశాలు పెరగసాగాయి.
నాలుక వంపు, నోటి పైకప్పు ఆకారం, స్వరపేటిక స్థానం వగైరాల్లో తేడాలు 1. మనిషి, 2. చింపాంజీ |
ప్రాణుల్లో నోరు ఆహారానికై ప్రధానంగా ఉద్దేశించబడిన అవయవం. శబ్దాలూ, మాటలూ ఆ తరవాత మొదలైన ప్రక్రియలు. మాట్లాడడానికి జీవపరిణామ క్రమంలో స్వరపేటికలో తగిన మార్పులు జరగాలి. జపాన్‌లోని కొందరు పరిశీలకులు ఈ మార్పులు ఆహారం మింగడానికి సంబంధించినవని భావిస్తున్నారు. మన గొంతులోని ఆహారనాళిక శ్వాసనాళికకు సమీపంలోనే ఉంటుంది. అందుకనే తక్కిన జంతువులతో పోలిస్తే మనుషుల్లో ఆహారం శ్వాసనాళికకు అడ్డంపడే ప్రమాదం ఎక్కువ. ఊపిరి తీసి వదిలేందుకని ఏర్పాటైన శ్వాసకోశవ్యవస్థ పరిణామక్రమంలో మాటల ఉచ్చారణకు పనికొచ్చి ఉంటుంది.
స్వరపేటిక నిర్మాణంలో చింపాంజీలకూ, మనుషులకూ పెద్దగా తేడాలు లేవు. ఈ రెండు జాతుల్లోనూ స్వరపేటిక గొంతుకు దిగువ భాగాన ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది జరగడానికి కొంతకాలం పడుతుంది కనకనే పసిపిల్లలకు మాటలు రావు. నియాండర్తాల్ మానవుల స్వరపేటిక నిర్మాణం నేటి పసిపిల్లలను పోలి ఉండేదనీ, అందుకనివారు మాట్లాడగలిగేవారా అన్నది సందేహాస్పదమనీ భావిస్తున్నారు. ఎటొచ్చీ చింపాంజీల్లో నాలుక వెనకభాగపు కండరాన్ని పట్టి ఉంచే ఎముక స్థానం తేడాగా ఉండడంవల్ల అవి మాట్లాడలేకపోయాయని ఈ పరిశీలకుల ఉద్దేశం. ఆధునిక మానవుల్లో స్వరపేటిక ప్రాంతం దీర్ఘంగా సాగి ఉంటుంది కనక మాట్లాడడం వీలవుతోంది. ముఖ్యంగా అచ్చులు పలకడానికీ, అవసరమైనప్పుడు ముక్కుతో అనునాసికాలు మాట్లాడకుండా ఉండడానికీ ఏర్పాట్లున్నాయి. అందువల్లనే మనుషులు రకరకాల పదాలు ఉచ్చరించగలరు.
మనుషులకు భాష విషయంలో శారీరకంగా ప్రత్యేకత ఉంటే దానికి జన్యుపరమైన కారణాలుండాలి. మాట్లాడడంలో ఇబ్బందులకు గురవుతున్నవారిమీద ఇటీవల జరిపిన పరిశోధనల వల్ల అందుకు సంబంధించిన ఒక జన్యువు గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది. ఒక కుటుంబంలో వంశ పారంపర్యంగా కనబడుతున్నఈ వింత రుగ్మత గురించి పరిశోధనలు చేశారు. వాటివల్ల తేలినదేమిటంటే ఫాక్స్‌పీ2 (FOXP2) అనబడే ఈ జన్యువులోని డీఎన్‌ఏ క్రమంలో మ్యుటేషన్ కారణంగా ఒకే ఒక్క మార్పు జరిగితే ఈ సమస్యలు తలెత్తుతాయి. పిండదశలో ఇవి మొదలవడంతో మెదడులో మాటలు పలకడానికి తోడ్పడే నరాలు దెబ్బతినడం, ఇతర సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. ఈ కారణంగా బాధితులకు నోటినీ, పెదవులనూ, తక్కిన ముఖభాగాలనూ సరిగ్గా కదిలించడంలో ఇబ్బందు లున్నట్టుగా తెలిసింది. స్పష్టమైన ఉచ్చారణలోనూ, వ్యాకరణపరమైన వాక్య నిర్మాణంలోనూ లోపాలు కలిగాయి.
ఈ జన్యువు మనలోనేకాక సేంద్రియ పదార్థాల్లోనూ, చుంచులూ, గొరిల్లాలూ, చింపాంజీలవంటి ప్రాణుల్లోనూ కూడా ఉంటుంది. దీనివల్ల ఒక రకమైన ప్రోటీన్ నిర్మాణం జరుగుతుంది. ప్రోటీన్లన్నీ అమినో ఆసిడ్లతో తయారవుతాయి. ఉదాహరణకు విభిన్నజాతులుగా ఏడున్నర కోట్ల సంవత్సరాల క్రితమే వేరుపడిన చుంచులకూ, వానరాలకూ 715 అమినో ఆసిడ్లలో ఒక్క అమినో ఆసిడ్ తేడాగా ఉంటుంది. మనుషులకు 60 లక్షల సంవత్సరాల క్రితం బంధువులుగా ఉండిన గొరిల్లాలూ, చింపాంజీ వగైరాలకూ మరి రెండు అమినో ఆసిడ్లు తేడాగా ఉంటాయి. కానీ ఈ జాతులన్నిటిలోనూ ఉండే ఆర్జినీన్ అనే ఒక అమినో ఆసిడ్ వ్యాధిగ్రస్తులలో మ్యుటేషన్‌వల్ల హిస్టిడీన్ అనే అమినో ఆసిడ్‌గా మారిపోవడంతో మాటలకు సంబంధించిన ఒక రుగ్మత కలుగుతుందని తెలిసింది.
ఇదేదో భాషకూ, వ్యాకరణానికీ సంబంధించిన జన్యువు కాకపోవచ్చుగాని మ్యుటేషన్ జరిగినప్పుడు ఈ మార్పు మనుషులలో మాటలపై ప్రభావాన్ని కలిగిస్తుంది. మనుషుల లక్షణాలన్నీ కేవలం జన్యువులమీదనే ఆధారపడవు. వారి జీవనవిధానం తక్కిన జంతువులకు భిన్నంగా కొనసాగడంతో వారి జన్యువుల్లోని ప్రోటీన్ల ప్రభావక్షేత్రాల్లో మార్పులు కలిగి, వారికి ప్రత్యేకతను కలిగిస్తాయి. శారీరక లక్షణాలూ, పరిసరాల ప్రభావమూ రెండిటికీ ఇందులో ప్రాముఖ్యత ఉంటుంది. మొత్తంమీద మాటల గారడీ మనిషిజాతికే పరిమితమైనది.
వీటన్నిటి ఫలితంగా చదవడం, రాయడం అనేవి మానవ సంస్కృతిలో ప్రధానమైన అంశాలు అయిపోయాయి. ఈ రెండిటికీ అవసరమైన లిపీ, తక్కిన రాత పరికరాలూ తయారవడానికి ముందుగా భాషలు మొదలయాయి. చదవడం, రాయడం పసితనం నుంచీ అలవాటైన మనవంటివారికి నిరక్షరాస్య సమాజం గురించి ఊహించుకోవడం కూడా కష్టమనిపిస్తుంది. కాని మానవచరిత్రలో ముందుగా భాషా శబ్దాలూ, ఆ తరవాత ఎన్నో వేల సంవత్సరాలకు వాటన్నిటినీ అక్షరబద్ధం చేసే పద్ధతులూ వచ్చాయి.
నాగరికత అనేది సుమారుగా క్రీస్తుకు 9 వేల సంవత్సరాల కిందట మొదలైందనుకుంటే లిపి మొదలైన దాఖలాలు మరొక అయిదారు వేల ఏళ్ళ దాకా కనబడవు. అప్పటిదాకా మనుషులకు శబ్దాలతోనే పని గడిచిపోయింది. భాషలన్నీ మాట్లాడడం, వినడాలకే పరిమితం అయి ఉండేవి. అతి ప్రాథమిక స్థాయిలో నోటి మాటల సంకేతాలుగా మొదలైన భాషలు త్వరలోనే తొలి మానవజాతులకు ముఖ్యమైన జీవితావసరం అయిపోయాయి. నిత్యజీవితంలో ప్రతి వస్తువుకూ, స్థలానికీ, ప్రతి భావనకూ, చర్యకూ, ఉద్దేశానికీ పదరూపం ఏర్పడింది.
తమ సాటివారితో అవసరార్థం ఎప్పటికప్పుడు సంభాషించుకోవటానికే ఆరంభమైనప్పటికీ భాషలన్నీ భూత భవిష్యద్వర్తమానా లన్నిటికీ ఉపయోగపడగలిగిన స్థాయికి ఎదిగాయి. ఇందులో ముఖ్యంగా అనుభవాలకు రూపకల్పన చెయ్యడం వీలైంది. జరిగిపోయిన విషయాలనూ, అవసరమైనవీ, గుర్తుంచుకోవలసినవీ అనిపించిన చారిత్రక సంఘటనలనూ నమోదు చెయ్యటానికి కథలూ, గాథలూ తయారు కాసాగాయి. లిపీ, రాత పరికరాలూ మొదలవని ఆ యుగంలో ఇవన్నీమౌఖిక రూపంలోనే మొదలై కొనసాగాయి.
శ్రుతీ (వినదగినవి), స్మృతీ (గుర్తుంచుకోవలసినవి) అనే రూపాల్లో మనదేశపు తొలి సాహిత్యమంతా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజుల్లో సీడీ రామ్‌లూ, హార్డ్ డిస్క్‌ల సంగతి పల్లెటూరివాళ్ళకు కూడా తెలుస్తుందేమో కాని ఆనాడు గ్రంథాలూ, పుస్తకాల గురించి ఎవరికీ తెలియదు. మొత్తం మీద ప్రపంచమంతటా మానవ నాగరికతలోని తొలి దశలలో భాషలన్నీ నోటిద్వారా శ్రవణ రూపంలోనే ప్రాచుర్యం పొందాయి.
రాముడి రాజాస్థానంలో లవకుశులు రామాయణగాథను గానంచేసి వినిపించారని మన పురాణాల్లో ఉంది. అసలు రామాయణ, మహాభారతాల్లోని సంఘటనలన్నీ అతిప్రాచీనకాలానికి చెందినవనీ, గాథలుగా ప్రచారంలో ఉన్న ఈ పురాణాలకు వాల్మీకి తదితరులు సాహిత్యరూపా న్నిచ్చారనీ కొందరి అభిప్రాయం. ఇందులో నిజమెంతో తెలియకపోయినా పురాణశ్రవణం అనేది పురాణ పఠనంకన్నా చాలా పాత సంప్రదాయం. ఎటొచ్చీ తొలియుగాల్లో పుస్తకం చూసి ఉదహరించకుండా కంఠస్థం చేసిన వివరాలనే చెప్పేవారు. మన దేశంలోనే కాదు; ప్రపంచమంతటా పురాణాలన్నిటినీ గాథల రూపంలోనే వినిపించేవారు. అక్షరాస్యత పెరిగిన ఇన్ని వేల సంవత్సరాల తరవాత కూడా మనవాళ్ళలో ఇటీవలి దాకా హరికథలూ, బుర్రకథలూ మొదలైనవన్నీ దృశ్య, శ్రవణ రూపాల్లో జనాదరణ పొందాయంటే ఈ సంప్రదాయం ఎంత పాతదో అర్థమౌతుంది.
గతంలో జరిగిన సంఘటనల గురించీ, ఆనాటి వీరులూ, మేధావులూ పొందిన అనుభవాల గురించీ నలుగురూ విని, నేర్చుకుని, స్ఫూర్తినీ, జ్ఞానాన్నీ సంపాదించడానికి ఇటువంటి సమావేశాలు జరుగుతూ ఉండేవి. సమాజానికి పనికొచ్చే నీతులూ, బోధలూ అన్నిటినీ చక్కగా వర్ణిస్తూ, తమ ప్రదర్శనను ఒక కళగా నేర్చుకుని గానం చెయ్యగలిగినవారికి ప్రత్యేకస్థానం ఉండేది. స్పష్టమైన ఉచ్చారణా, బాగా మోగే కంఠస్వరమూ, మంచి జ్ఞాపకశక్తీ, ఆకట్టుకోగలిగిన శైలీ మొదలైనవన్నీ ఈ ప్రదర్శకులకు అవసరమయేవి.
గ్రీస్‌కు ఉత్తరాన ఉన్న బాల్కన్ ప్రాంతంలో పురాణాలను గానం చేసే పద్ధతి ఆధునిక యుగంలో కూడా కొనసాగుతూ ఉండేది. ఆ విధంగా సంప్రదాయరీతిలో పాడుతున్న వ్యక్తి చుట్టూ శ్రోతలు చేరి కూర్చుని తమకు పరిచితమైన పురాణగాథలని తమకు పరిచితమైన పద్ధతిలో వినబడే పాటల ద్వారా ఆస్వాదిస్తారు. వీటిలో ఒక్కొక్క ప్రదేశానికీ సంబంధించిన సంప్రదాయాలుండేవి. అలాగే అంత్యక్రియల వంటి సందర్భాలకు తగిన పద్ధతిలో గానం జరిగేది. ఇటువంటి రకరకాల పాటలనూ, గాథలనూ కూర్చే సంప్రదాయాలు కూడా తరతరాలుగా అందించబడేవి. వీటి ఇతివృత్తాల నిర్మాణమూ, కథనరీతులూ వేటికవిగా వివిధ సంప్రదాయ పద్ధతుల్లో ఉండేవి. కొన్ని మామూలు సంఘటనల వర్ణనలైతే మరికొన్ని గంభీరంగానూ, లోతైన అర్థాలు కలిగినవిగానూ వినిపించబడేవి. ప్రాచుర్యం పొందుతున్నకొద్దీ శ్రోతలను ఆకట్టుకునే విధంగా వీటిలో సాహిత్యపు సొగసులూ, కవిత్వపు అందాలూ చోటుచేసుకున్నాయి.
ప్రఖ్యాత గ్రీక్ కవి హోమర్ క్రీ.పూ. ఎనిమిదో శతాబ్దంలో ఇలియడ్, ఓడిసీ మొదలైన గొప్ప పురాణాలను రచించాడు. అప్పటికే నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం జరిగిన కాంస్య యుగపు సంఘటనలను అతను గ్రంథస్థం చేసినట్టుగా చెపుతారు. ఆనాడు టర్కీలోని ట్రోయ్ నగరాన్ని గ్రీక్ సేనలు పదేళ్ళపాటు ముట్టడించి నాశనం చేసిన వైనం, అందులో ముఖ్య పాత్రధారి అయిన ఒడీసియస్ అనే గ్రీక్ వీరుడు మళ్ళీ స్వదేశానికి చేరుకోవటానికి పదేళ్ళ పాటు పడిన కష్టాలూ అన్నీ ఈ పురాణాల్లో లభిస్తాయి. ఈ గాథలను శతాబ్దాలపాటు గాయకులు పాటలు కట్టి పాడి వినిపించేవారనీ, అవి వినడం వల్లనే వాటి గురించి హోమర్ రాయగలిగాడనీ అంటారు. హోమర్ కూడా గొప్ప గాయకుడే.
హోమర్ విగ్రహం |
ఆ రోజుల్లో పురవీధుల్లోనైనా, రాజాస్థానాల్లోనైనా శ్రోతల ఎదుట ప్రాచీనకాలపు వీరుల, వీరాంగనల గురించిన గాథలను పాడి వినిపించడం ఆచారంగా ఉండేది. ఇటువంటి రచనల్లో నిజంగా జరిగినది ఏమిటో, గాథలుగా వర్ణించినవారు స్వకపోల కల్పితంగా చేర్చినది ఎంతో చెప్పడం కష్టం. ప్రేక్షకుల ఎదుట గానం చేస్తున్నవాడు చిలవలూ, పలవలూ కల్పించి, ఉన్నదాన్ని మరికాస్త జనరంజకంగా చెయ్యడానికి ప్రయత్నించి ఉండవచ్చు. గట్టి సాక్ష్యాధారాలేవీ లేని పరిస్థితిలో కొన్ని తరాలపాటు మార్పులూ చేర్పులూ సంతరించుకుంటూ అందివచ్చిన ఈ వివరాలకు లిఖితరూపాన్ని ఇస్తున్నప్పుడు నిజనిర్థారణకై కవి చెయ్యగలిగినది ఏమీ ఉండకపోవచ్చు. మన పురాణాల్లో కూడా తరుచుగా కనబడే ఈ రకపు అద్భుతరసం, అతిశయోక్తులూ, అభూతకల్పనలూ వాటిలోని వాస్తవికతను వెనక్కి నెట్టినప్పటికీ, శ్రోతల ఊహాశక్తిని ప్రభావితం చేశాయి. అపోహలనూ, మూఢనమ్మకాలనూ కూడా పెంచాయి.
ఆఫ్రికా సంప్రదాయాలు |
అయితే పుస్తకాలూ, గ్రంథాలూ అవతరించని కాలంలో ప్రాచుర్యంలో ఉండిన మౌఖిక సంప్రదాయానికి కొంత ప్రత్యేకత ఉంది. ప్రాచీనకాలపు చరిత్రను గురించిన వివరాలు లభ్యమయేది అటువంటి “పుక్కిటి” పురాణాల్లోనే. ఎందుకంటే ప్రతిచోటా పురాతత్వ అవశేషాలూ, రాళ్ళమీద చెక్కిన శాసనాలూ దొరకవు. అలాంటప్పుడు జరిగిపోయిన విషయాల గురించిన వివరాల కోసం ఆదిమ సంప్రదాయాల్లో కూడా వెతుక్కోవాలి. ఉదాహరణకు ఉత్తర అమెరికాలోని తొలి మానవుల చరిత్రను గురించి మనకు తెలిసినది చాలా తక్కువ. అయితే కొన్ని ఆధారాలు అక్కడి ఆదిమ తెగలు ఈనాటికీ చెప్పుకునే గాథల్లోకనిపిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలో నాగరికత ఏనాడూ ఉండేది కాదనడం పొరపాటని ఇటీవలి పరిశీలకులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి గాథల ఆధారంగా అక్కడ కూడా ప్రాచీన రాజవంశాల వివరాలున్నట్టుగా తెలుస్తోంది.
ఒకవంక ఆదిమజాతులన్నీ ఈ గాథలని పూర్తిగా నిజమని నమ్ముతూ అదే నిజమైన చరిత్ర అని భావిస్తూ ఉంటే సంప్రదాయరీతుల్లో అధ్యయనం చేసే చరిత్రకారులు మాత్రం ఇటువంటి సాక్ష్యాధారాలను కొట్టిపారేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రతి విషయానికీ కేవలం లిఖితరూపంలో దొరికే సాక్ష్యాల మీదనే ఆధారపడక, పురాణగాథలుగా చలామణీ అవుతున్న సంప్రదాయాల్లోని ఆధారాలను కూడా పరిగణించడం తప్పులేదన్న భావన బలపడుతోంది. పురాతత్వ పరిశోధకులకు ఇతరత్రా లభిస్తున్న సాక్ష్యాలకు ఈ వివరాలు తోడైనట్టుగా కనిపిస్తోంది. వీటిలో నమ్మదగినవి ఏమిటో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంమీద ఒకే రకమైన మాటల్లో రాసిపెట్టినవాటికీ, కేవలం నోటితో పలికినవాటికీ తేడా ఉంటుందని అనుకోవడం ఎంతవరకూ సమంజసమో చెప్పడం కష్టమే.