మూడవ ప్రకరణం
ఈ లోపుగా చిచీకవ్ బండిలో కూచుని సంతృప్తిని అనుభవిస్తున్నాడు; బండి కొంతసేపుగా రహదారి వెంట నడుస్తున్నది. అతని ముఖ్యాశయమూ, ధ్యేయమూ ఏమిటో మనం క్రిందటి ప్రకరణంలో తెలుసుకున్నాం. అందుచేత అతని మనసు ఆ విషయంలోనే నిమగ్నమై ఉండటంలో వింతేమీ లేదు. అతను వేసుకుంటున్న అంచనాలూ, చేస్తున్న ఊహలూ సంతృప్తికరంగా ఉన్నట్టు అతని ముఖమే చెబుతున్నది, ఎందుకంటే ఆ ముఖంలో అప్పుడప్పుడూ తృప్తితో కూడిన చిరునవ్వు తాండవిస్తున్నది. అతను తన ఆలోచనలలోనే ముణిగి ఉండడం చేత తన బండీవాడు చేస్తున్న పనిని గమనించలేదు. మానిలవ్ నౌకర్లు వాడికి చక్కని ఆతిథ్యం ఇచ్చారు, ఆ ఆనందంలో వాడు కుడివైపున నడుస్తున్న మచ్చల పగ్గపు గుర్రానికి బుద్ధులు నేర్పుతున్నాడు, ఈ బూడిద రంగు మచ్చల గుర్రం మహా దొంగది, అది బండిని లాగుతున్నట్టు అభినయిస్తున్నది; నిజంగా లాగుతున్నవి మధ్యనున్న ఎర్రగుర్రమూ, రెండో చివర ఉన్న పగ్గపు గుర్రమూనూ. బ్రౌను రంగుగా ఉన్న ఈ గుర్రాన్ని పన్నులు వసూలు చేసే అసిసరు వద్ద కొన్నారు, అందుకని దానిపేరు అసిసరు అయింది. ఈ రెండు గుర్రాలూ సంతోషంతో బండి లాగేవి, అందుచేత వాటి సంతోషం వాటి కళ్ళలో కనిపించేది.
బండీ వాడు, సేలిఫాన్, తాను కూచ్చున్న చోట లేచి నిలబడి మచ్చల గుర్రాన్ని కొరడాతో కొడుతూ “నీ దొంగ వేషాలు నా దగ్గరా? నీ సంగతి చెబుతానుండు! నీ పని నువు చూసుకోలే, జర్మను భడవా. ఎర్రగుర్రం చూడు, పెద్దమనిషి, దాని పని అది చేస్తుంది. దానికో గుప్పెడు దాణా ఎక్కువ వెయ్యాలనిపిస్తుంది. ఎందుకూ? అది పెద్దమనిషి తరహా గుర్రం. అసిసరు కూడా మంచి గుర్రమే… ఏం తల మహా ఆడిస్తున్నావ్? చెబుతున్నదేమిటో వినాలే మొద్దూ! నేను నీ మంచికేగా చెబుతానూ!… ఆఁ, ఎక్కడికా పోవటం? రాక్షసీ! పాపిష్టి బోనపార్ట్!” అంటూ కొరడాతో కొట్టాడు.
తరువాత వాడు మూడు గుర్రాలనూ ముద్దుగా సంబోధిస్తూ తలా ఒక చురకా అంటించాడు-శిక్షించటానికి కాదు, తన సంతోషం తెలపటానికి. ఈ విధంగా తాను తృప్తిపడి వాడు మళ్ళీ మచ్చల గుర్రంతో సంభాషణ సాగించాడు: “నీ సంగతి ఎవరూ తెలుసుకోలేరనుకుంటున్నావు గామాలు. కాదు, గౌరవం సంపాదించుకోవాలంటే సరిగా నడుచుకోవాలి. మనం ఆగామే ఆ భూస్వాముల ఇంట చూడు, చాలా మంచివాళ్ళు. మంచివాళ్ళతో మాట్లాడటం నాకెప్పుడు ఇష్టం. మంచివాడితో నాకెప్పుడు పేచీలేదు. అటువంటివాడితో స్నేహం చెయ్యొచ్చు. ఒకడితో కలిసి ఓ కప్పు టీ తాగాలన్నా, ఓ ఫలహారం చెయ్యాలన్నా, వాడు మంచివాడైతే నాకెంతో సంతోషంగా ఉంటుంది. అసలు మంచివాణ్ణి అందరూ గౌరవిస్తారు. మన యజమాని చూడరాదూ, ఎందుకంటే ఆయన జారును కొలిచాడు, తెలిసిందా? చర్చి కౌన్సిలు సభ్యుడు…”
సేలిఫాన్ ఈ విధంగా ప్రారంభించి చాలా గొప్ప విషయాలు తరిచాడు. వాడి మాటలు ఆలకించినట్టయితే చిచీకవ్ కు తనను గురించి ఎన్నో వివరాలు తెలిసి ఉండేవి. కాని అతను తన ఆలోచనల్లో ఎంతగా నిమగ్నుడై ఉన్నాడంటే పిడుగుపడిన చప్పుడు వినబడినదాకా అతనికి బాహ్య ప్రపంచం గురించి గమనం లేదు. అప్పుడాయన చుట్టూ కలయజూశాడు. ఆకాశమంతా మబ్బు కప్పి ఉన్నది. రోడ్డుమీద దుమ్ములో వాన చిలుకుతున్నది. ఇంతలో మరింత సమీపంగా ఇంకొక పిడుగు పడింది, ధారాపాతం హెచ్చింది. మొదట్లో పక్కవాటంగా కొట్టే బండిని ఈ వైపునా, ఆ వైపునా బాదింది, తరవాత నిటారుగా పడుతూ బండి కప్పు మీద టపటప చప్పుడు చెయ్యసాగింది. చివరకు నీటిబొట్లు పైనుంచి కారి మన కథానాయకుడి ముఖంపై పడసాగాయి. ఆయన అటూ ఇటూ ఉన్న తోలు తెరలు పైకెత్తి, సేలిఫాన్ తో బండిని వేగంగా తోలమన్నాడు. సేలిఫాన్ చేస్తున్న ప్రసంగం నడిమధ్యలో ఆగిపోయింది. ఇది తాత్సారం చేసే సమయం కాదని తెలుసుకుని, వాడు తన ఆసనం కింది పెట్టెలోనుంచి బూడిద రంగుగల చింకిదుస్తు ఒకటి తీసి మీదవేసుకుని, పగ్గాలు చేతబట్టుకుని గుర్రాలను అదిలించాడు. అవి అతని ప్రసంగం వింటూ నడవటం దాదాపు మానేశాయి. తాను రెండు అడ్డదార్లే దాటాడో, మూడే దాటాడో సేలిఫాన్ కు జ్ఞాపకం రాలేదు. ఒక్కసారి తాను వచ్చిన రహదారి జ్ఞాపకం చేసుకుని, చాలా అడ్డదార్లు దాటిపోయినట్టు నిశ్చయించుకున్నాడు. క్లిష్ట పరిస్థితిలో రష్యను అయినవాడు ఆటే ఆలోచించకుండానే కర్తవ్య నిర్ణయం చేస్తాడు గనక వాడు ఈసారి అడ్డదారి రాగానే అది ఎక్కడికి పోయేదీ ఆలోచించకుండా కుడి వైపుకు తిరిగాడు.
వానేమో గంటల తరబడి కురిసేటట్టు కనబడింది. రోడ్డుమీది దుమ్మంతా బురదగా మారింది. గుర్రాలకు బండిని లాగడం అంతకంతకూ కష్టమవుతున్నది. సబాకవిచ్ ఉండే గ్రామం ఎంతకూ రాకపోవడం చూసి చిచీకవ్ ఆందోళన పడసాగాడు. ఆయన అంచనా ప్రకారం వాళ్ళు ఎప్పుడో చేరుకుని ఉండవలసింది. తోలుతెరలలో ఉన్న గుండ్రని అద్దాల కిటికీల గుండా అతను బయటికి చూడసాగాడు. కాని ముఖం ఎదట అరిచెయ్యి కనిపించనంత చీకటిగా ఉంది.
అతను చివరకు తల బయటికి పెట్టి, “సేలిఫాన్”, అని కేక పెట్టాడు.
“ఏం బాబుగారూ?” అన్నాడు సేలిఫాన్.
“ఎక్కడన్నా గ్రామం కనబడుతుందేమో చూడూ!”
“లేదు బాబూ. ఎక్కడా ఏమీ కనబడటం లేదు.” తరవాత వాడు కొరడా ఝళిపిస్తూ మొదలూ చివరా లేని దండకం ఒకటి ప్రారంభించాడు. అందులోకి సమస్తమూ వచ్చాయి; రష్యా అన్నిమూలలా గుర్రాలను వేగంగా పరుగెత్తించటానికి సాధారణంగా ఉపయోగించే ప్రోత్సాహ వాక్యాలూ, విశేషణాలూ నోటికి ఎలా వస్తే అలా ఏకరువు పెట్టాడు. చిట్టచివరకు వాడు వాటిని సెక్రెటరీలని కూడా అన్నాడు.
ఇంతలో బండీ అన్నివైపులకూ ఒరుగుతూ ఉండటము, తాను పడుతూ ఉండడం చిచీకవ్ గమనించాడు. దీనినిబట్టి బండీ ఒకవేళ రహదారి విడిచిపెట్టి కొత్తగా దున్నిన పొలాలకు అడ్డం పడిందేమోనన్న అనుమానం కలిగింది. ఈ సంగతి సేలిఫాన్ కు కూడా తెలిసినట్టే ఉందిగాని వాడు పైకేమీ అనలేదు.
“ఒరే వెధవా, నన్ను ఏరోడ్డున తీసుకుపోతున్నావురా?” అని చిచీకవ్ అడిగాడు.
“నేనేం చేసేది బాబూ? ఈ వాన చూడండి. చీకట్లో చమికీ కూడా కనిపించడం లేదంటే నమ్మండి.”
వాడిలా అంటూండగానే బండీ ఒరిగి, చిచీకవ్ పడకుండా ఉండటానికి రెండు చేతులూ పట్టుకోవాల్సి వచ్చింది. సేలిఫాన్ కైపులో ఉన్నాడని ఇప్పుడే అతనికి స్ఫురించింది.
“జాగర్త, జాగర్త! పడిపోగలం!” అని అతను కేకపెట్టాడు.
“లేదు బాబూ. నేను తమర్ని పడనిస్తానా? పడనివ్వటం తప్పు కాదూ? ఆ మాత్రం నాకు తెలీదా? ఏమయినా సరే తమర్ని పడనివ్వను,” అన్నాడు సేలిఫాన్.
తరవాత వాడు బండిని మరలించసాగాడు. ఆ తిరగడంలో బండి పక్కకు ఒరిగింది. చిచీకవ్ దభీమని బురదలో బోల్లపడిపోయాడు. సేలిఫాన్ గుర్రాలను ఆపాడు; వాడాపకపోయినా అవి ఆగేవే, చచ్చేట్టు అలసి ఉన్నాయి. ఈ అనుకోని సంఘటనతో వాడి మతి కాస్తా పోయింది. వాడు తాను కూచుని ఉన్న పెట్టె మీదనుంచి దిగి, చేతులు నడుముకు పెట్టుకుని బండి కేసి చూశాడు. ఈ లోపల వాడి యజమాని బురదలో నుంచి పైకి లేవటానికి యత్నిస్తున్నాడు. “హారి దీని తస్సాదియ్యా? ఒరగనే ఒరిగిందే!” అన్నాడు సేలిఫాన్.
“నువు చెడతాగావు!” అన్నాడు చిచీకవ్.
“లేదు బాబుగారూ. ఎలా తాగుతానూ? తాగటం ఎంత తప్పు! నాకు తెలీదూ? ఒక స్నేహితుడితో ముచ్చటించాను, ఎందుకంటే బుద్ధిమంతుడితో మాట్లాడటం మంచిపనే, అందులో తప్పేమీ లేదు-ఇద్దరమూ ఫలహారం చేశాం. ఫలహారం చెయ్యటంలో కూడా తప్పేమీ లేదు; ఎందుకంటే బుద్ధిమంతుడితో ఏదైనా ఫలహారం తీసుకోవచ్చు.”
“కిందటిసారి నువు తాగినప్పుడేం చెప్పాను? మరిచిపోయావా?” అన్నాడు చిచీకవ్.
“లేదు దొరా, ఎలా మరిచిపోతానూ? నా డ్యూటీ నాకు తెలుసు. తాగరాదని నేనెరుగుదును. ఒక బుద్ధిమంతుడితో మాట్లాడుతూ కూచున్నాను. ఎందుకంటే..”
“బుద్ధిమంతుడితో మాట్లాడకుండా ఒళ్ళు చిట్లగొట్టేస్తాను.”
సేలిఫాన్ దేనికైనా సమ్మతించటానికి సిద్ధపడి, “దొరగారి ఇష్టం ఏదైతే అదీ. కొట్టటమైతే కొట్టేదేమరి. నేనెందుకు వద్దంటానూ? కొట్టాల్సి వస్తే కొట్టొద్దుమరీ? అందుకేగా తమరు యజమాని అయిందీ? కొట్టకపోతే కమతగాళ్ళు చెప్పినమాట వింటారా? వాళ్ళని దారిలో ఉంచాల్సిందే. కొట్టాలిసుంటే కొట్టాలిసిందే మరి” అన్నాడు.
ఈ వాదనకు ఏమనాలో యజమనికి అంతుబట్టలేదు. ఈ సమయంలో దేవుడు వాళ్ళకి సహాయం వచ్చినట్టయింది. ఎక్కడో కుక్కలు మొరిగాయి. చిచీకవ్ అది విని పరమానందంతో సేలిఫాన్ ను గుర్రాలను వేగంగా తోలమన్నాడు. రష్యను బండివాళ్ళకు పసిగట్టే శక్తి ఉన్నది, అది వాళ్ళకు కళ్ళలాగా ఉపకరిస్తుంది. అందుకే వాళ్ళు కళ్ళు మూసుకుని బండి తోలినా చివరకు ఎక్కడో ఒకక్కడ వచ్చి చేరుకుంటారు. అందుకే కన్ను పొడుచుకున్నా కనబడని చీకటిలో బండిని సేలిఫాన్ నేరుగా ఒక గ్రామానికి తోలి, బండి తాలూకు కర్రలు ఒక కంచెకు తగిలి, బండి ఇకముందుకు పోవడానికి లేనిచోట ఆపాడు. వర్షధారల తెరగుండా చిచీకవ్ కు ఇంటి కప్పులాంటిది కనబడింది. అతను సేలిఫాన్ ను గేటు ఎక్కడ ఉన్నదీ చూసి రమ్మని పంపాడు. వాడికది ఒకంతట కనిపించకపోయి ఉండును. కాని రష్యాలో ఇంటికాపలా, కుక్కలవంతు గనక కుక్కలు ఒక్కసారిగా మొరిగి గేటు ఎక్కడ ఉన్నదీ తెలియజేసేసరికి, వాడు రెండు చెవులలోనూ వేళ్ళు దూర్చుకోవలసి వచ్చింది. ఒక చిన్న కిటికీ నుండి వచ్చే వెలుతురు మసక మసకగా కంచె దాకా వస్తూండటం చేత మన ప్రయాణీకులకు గేటు కనిపించింది. సేలిఫాన్ గేటు మీద బాదేసరికి ఏదో కప్పుకున్న ఆకారం గేటులోనుంచి తొంగిచూసి, ఆడ గొంతుతో, “ఎవరా తలుపు కొట్టేది? ఎందుకంత చప్పుడు చేస్తున్నారు?” అని అడిగింది.
-కొడవటిగంటి కుటుంబరావు