కౌంతేయులు

-సుగాత్రి

రామాయణంలోని పాత్రలతో పోలిస్తే మహాభారతంలోని పాత్రలు మరింత సంక్లిష్టమైనవి. అయినప్పటికీ అవే మనకు వాస్తవికంగా, సహజంగా, ఇప్పటి పరిస్థితులకు తగినవిగా తోస్తాయి. ఎందుకంటే రామాయణం ఏ పుణ్యకాలంలోనో నివసించిన ఆదర్శప్రాయమైన వ్యక్తులు, వారి జీవితాలను వర్ణిస్తే, మహాభారతం ఒక సంధికాలంలో ధర్మానికీ-అధర్మానికీ మధ్య గుంజాటనపడిన వ్యక్తుల గురించి వివరిస్తుంది. ఆ సంధికాలంలోని పరిస్థితులే కొంచెం అటూ-ఇటూగా ఈ కాలానికి వర్తిస్తాయి. ఆ కారణం వల్లే మహాభారతంలోని పాత్రల గురించి మనం కూలంకషంగా అర్థం చేసుకోవడం అవసరం కూడా.

పైగా మహాభారతం యొక్క విశిష్టత ఏమిటంటే తవ్వితోడినకొద్దీ జల ఊరినట్లు తరచిచూసినకొద్దీ కొత్త అర్థాలు బోధపడుతాయి. వాటిలో ప్రతిదీ ‘ఇదే నిజమేమో/ఇదీ నిజమేనేమో’ అనిపిస్తుంది.

ఐతే ఇంత వాస్తవికంగా, మనలాంటివాళ్ళే అనిపించే పాత్రలు, సన్నివేశాలు కూడా వాటిలో దేవుడి మహిమలు, ప్రత్యక్ష ప్రమేయమూ ఎక్కువయ్యేకొద్దీ మనకర్థం కాని మిస్టరీలుగా మిగిలిపోతారు. అలాంటప్పుడు ఈ దేవుళ్ళ పాత్రలు ఏవో కొన్ని ఇబ్బందికర వాస్తవాలను మరుగుపరచేటందుకే రంగప్రవేశం చేశాయేమో అని కూడా అనిపించకమానదు. ముఖ్యంగా పాండవుల పుట్టుక విషయంలో.

పాండవులు కురువంశానికి చెందిన పాండురాజు కొడుకులు. ఇక్కడ మహాభారతంలోనే వివిధ రకాల కొడుకులను గురించి ఏముందో చూద్దాం. ఆదిపర్వం పంచమాశ్వాసం లో షట్ పుత్రులుగా ఔరసుడు (= ధర్మపత్ని యందు పుట్టినవాడు), క్షేత్రజుడు (= తన అనుమతితో భార్యకు ఇతరుల వలన పుట్టినవాడు), దత్తకుడు (= తల్లిదండ్రులచేత దత్తత ఇవ్వబడ్డ పుత్రుడు – అదే కులానికి చెందినవాడు), కృత్రిముడు (= స్వయం నిర్ణయం చేయగలిగి ఉండి తనంత తానుగా దత్తత వచ్చినవాడు), గూఢోత్పన్నుడు (= తనకు తెలియకుండా తన భార్యకు పరపురుషుడి వల్ల పుట్టినవాడు), అపవిద్ధు (= దత్తతచేసుకున్న అనాథ) లను పేర్కొన్నారు. వీరే కాక కృతక, స్వయందత్త, పౌనర్భవ, సహోధ, పుత్రిక-పుత్రులను కూడా స్మృతుల్లో పేర్కొన్నారు.

ఇక్కడ పాండవులు పాండురాజుకు ఏ రకమైన కొడుకులు? క్షేత్రజులని అందరికీ తెలిసిన విషయమే. పాండవుల తండ్రులు దేవతలని చెప్పే నమ్మశక్యంగాని మాటలను పక్కనబెట్టి వాస్తవిక దృష్టితో ఆలోచిస్తే వాళ్ళెవరో మానవమాత్రులేనని, కొన్ని బలమైన కారణాల వల్ల వారెవరన్నది రహస్యంగా ఉంచారని స్పష్టమౌతుంది. ఆన్ని విషయాలనూ బాహాటంగా చెప్పిన మహాభారతంలో ఈ ఒక్క విషయం ఇంత రహస్యంగా ఎందుకు ఉంచవలసి వచ్చింది ? ఆని ఆలోచిస్తే అప్పటి సామాజిక పరిస్థితులు, ఆచారవ్యవహారాలు కొంతవరకు అర్థమవుతాయి.

కురువంశపు అసలు వారసులైన ధార్తరాష్ట్రులుండగా, కురువంశానికి సంబంధించని వారితో (వంశాంకురం లేనప్పుడు మాత్రమే ఆపద్ధర్మంగా ఉపయోగపడే నియోగ పద్ధతి ద్వారా) కుంతి కన్న పాండవులు కురువంశానికి చెందిన వాళ్ళుగా ఆమోదించబడలేదా? అందుకే వాళ్లనెవరూ కౌరవులని పిలవలేదా? లేక పాండవుల జననం వర్ణధర్మానికి అనుగుణంగా జరగలేదనా?

భారతీయ ఇతిహాసాల్లో వర్ణాశ్రమధర్మాలకు పెద్దపీట వేశారు. వర్ణధర్మానికి సంబంధించినంత వరకు వర్ణాంతర వివాహాలు రెండురకాలు:
అనులోమ వివాహం: ఒక పురుషుడు తన వర్ణానికి చెందిన స్త్రీని గానీ, లేదా అంతకంటే కింది వర్ణానికి చెందిన స్త్రీని గానీ పెళ్ళాడితే అది అనులోమ వివాహం. అనులోమ వివాహాలు సంఘామోదం పొందినవి.

ప్రతిలోమ వివాహం: ఒక పురుషుడు తన వర్ణాని కంటే ఉన్నత వర్ణానికి చెందిన స్త్రీని పెళ్ళాడితే అది ప్రతిలోమ వివాహం. ప్రతిలోమ వివాహాలు సంఘామోదం పొందనివి. ప్రాచీన ధర్మశాస్త్రాలు నిమ్నవర్ణాలకు చెందిన పురుషులు అగ్రవర్ణాలకు చెందిన స్త్రీలను తాకినందుకే శిక్ష విధించాలని నిర్దేశించాయి. బ్రాహ్మణకన్య అయిన (శుక్రాచార్యుడి కూతురు) దేవయాని తనను పెళ్ళాడమని వర్ణవ్యవస్థలో తన కంటే ఒకమెట్టు కిందున్న క్షత్రియుడైన రాజు యయాతిని కోరినప్పుడు అతడు పెళ్ళాడకపోవడానికి కారణం అది ప్రతిలోమ వివాహం అవుతుందనే.

నియోగం: భర్త వల్ల సంతానం పొందలేకపోయిన స్త్రీ వంశాన్ని నిలపడం కోసం భర్త సోదరుడి వల్ల సంతానవతి కావడాన్ని నియోగ అంటారు. మొదట్లో ఇది అగ్రవర్ణాల్లో మొదలైనా తర్వాతికాలంలో కిందివర్ణాలకు విస్తరించి తర్వాత్తర్వాత కింది వర్ణాలకే పరిమితమైంది. మహాభారతంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అంబిక, అంబాలికలకు నియోగపద్ధతిలో పుట్టినవారే!

మొదటి నుంచి మనం పరిశీలించినట్లైతే వ్యాసుడు ఒక మహర్షికి, ఒక శూద్ర కన్నెకు పుట్టినవాడు. ఐనా అది అనులోమ సంబంధం కాబట్టి ఆయన ఒక మహర్షిగానే గుర్తించబడ్డాడు. తర్వాత ఈ మహర్షి అంబ, అంబిక, అంబాలికలకు పుత్రసంతానం ప్రసాదించాడు. అది అనులోమమే గాక నియోగం కూడా. దానికీ అభ్యంతరం లేదు . తర్వాతి తరంలో కౌరవుల పుట్టుకలో ఎటువంటి మతలబులూ లేవు. శంతనుడి తర్వాత కురువంశంలో ఇలా జరగడం ఇదే మొట్టమొదటిసారి. బహుశా దుర్యోధనుడి అభిజాత్యానికి ఇదీ ఒక కారణం కావచ్చు.

ఐతే ఆ కాలంలో అనులోమ సంబంధం ద్వారా పుట్టిన సంతానానికి ఉన్న హోదా ప్రతిలోమ సంబంధం ద్వారా పుట్టిన సంతానానికి లేదు. ఇంతవరకు మనం పరిశీలించిన సంబంధాల్లో ప్రతిలోమ సంబంధం ఒక్కటి కూడా లేదు . అందుకే వాటిని గురించి బాహాటంగా చెప్పారు. కురువంశానికి సంబంధించి సంతానం విషయంలో దేవతల ప్రస్తావన మొదటిసారిగా కుంతి విషయంలోనే వస్తుంది. ఆమెకు పెళ్ళికి ముందే అక్రమంగా పుట్టినవాడు కర్ణుడు. అంతకు ముందు మత్స్యగంధికి వ్యాసుడు కూడా పెళ్ళికి ముందే అక్రమంగా పుట్టినవాడే ! ఐనా అక్కడ ఆమె శూద్రస్త్రీ కావడం వల్లా , అంతకంటే ముఖ్యంగా అది అనులోమం కాబట్టీ ఎవరికీ అభ్యంతరం లేకపోయింది. ఇక్కడ దైవసంతానమని చెప్పడానికి కారణం కుంతి రాచకన్నె కావడమొక్కటే కాక అది ప్రతిలోమ సంబంధం కావడం కూడా ఒక బలమైన కారణం అనిపిస్తుంది.

పాండురాజుకు సంతానయోగం లేకుండా పోయింది . సరే! అదే కుటుంబంలో వెనుకటితరంలో అదే సమస్య వచ్చినప్పుడు ఏం చేశారు? నియోగపద్ధతిలో సంతానాన్ని పొందారు. ఇప్పుడూ అదే పని ఎందుకు చెయ్యలేదు? అని ప్రశ్నించుకుంటే అసలు నియోగ చేయదగినవారెవరున్నారు? అనే ప్రశ్న వస్తుంది. ధృతరాష్ట్రుడున్నాడు. కానీ ఆయన గుడ్డివాడు. వాళ్ళమ్మ గర్భాదానమప్పుడు కళ్ళు మూసుకుంటేనే గుడ్డివాడు పుట్టాడు (అని కనీసం వాళ్ళ నమ్మకం). ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి (నియోగ) పాటిస్తే గుడ్డివాడికి ఎలాంటి కొడుకులు పుడతారో నని భయపడి ఉండొచ్చు (గాంధారికి అటువంటి లోపాలేవీ లేని నూటొక్క మంది మంది సలక్షణమైన సంతానం అప్పటికి ఇంకా పుట్టలేదు). లేదా గాంధారి అందుకు ఒప్పుకొని ఉండకపోవచ్చు. (రామాయణంలోని స్త్రీపాత్రలతో పోలిస్తే మహాభారతంలోని స్త్రీపాత్రలు దృఢమైన వ్యక్తిత్వం కలవారు కావడం గమనించదగ్గది.) ‘నియోగిం’చడానికి విదురుడున్నాడు కానీ దాసీపుత్రుడాయె! విదురుడు వ్యాసమహర్షి పుత్రుడే ఐనా దాసికి పుట్టినవాడు. ఆ కారణం వల్లే రాజ్యాధికారానికి అనర్హుడయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కుంతి కడుపున కూడా విదురుడి పుత్రులే పుడితే వాళ్ళకు కూడా రాజ్యార్హత ఉండదు. అందువల్ల వ్రతం చెడకుండా ఫలం దక్కాలంటే యోగ్యుడైన పరపురుషుడెవరి ద్వారా ఐనా సంతానం పొంది, ఆ రహస్యం ఎవరికీ తెలియకుండా ఏ దేవుడి పేరో చెప్తే సరిపోతుంది. ఇది గతంలో కుంతీ ‘కుమారి’ కాలుజారినప్పుడు చేసినపనే కద? అందుకే ఊరికి దూరంగా వనవాసం పేరుతో క్యాంపేయడం.

ఐతే ఒక కొడుకుతో తృప్తిపడలేక పోయారా దంపతులు. ఉన్నదెలాగూ నిర్జనారణ్యంలోనే కాబట్టి, సాకుగా చూపడానికి దేవతలున్నారు కాబట్టి పరపురుషుల ద్వారా ఒకరి తర్వాతొకరంటూ మొత్తం ముగ్గురు కొడుకులను కన్నది కుంతి.

ఇక విదురుడి సంగతి: విదురుడు సాక్షాత్తూ వ్యాసమహర్షి పుత్రుడు. మహారాజైన తన సోదరుడినే నిరంతరం అంటిపెట్టుకుని ఉన్న విదురుడికి తాను దాసీపుత్రుడు కావడం వల్లనే రాజ్యాధికారం పొందలేకపోయాడని తెలుసు కానీ అందుకు అసంతృప్తి చెందినట్లు ఎక్కడా బయటపడలేదు. అతడు పాండవపక్షపాతి అన్నదీ మొదటి నుంచీ అర్థమౌతూనే ఉంటుంది. పెద్దల సభలో ఒక పెద్దమనిషిగా మసలుకున్నంతవరకే తనకు గౌరవం లభిస్తుందని, మహారాజుకు సవతి సోదరుడైనంత మాత్రాన లేదా సర్వగుణ సంపన్నుడైనందున తాను సింహాసనమెక్కాలనుకుంటే దాసీపుత్రుడైన తనను సమర్థించేవాళ్ళెవరూ ఉండరనీ అతడికి బాగా తెలుసు. అతడు ఎప్పుడూ ధృతరాష్ట్రుడి సాంగత్యం వీడలేదు. ఆ గుడ్డిరాజు తన సలహాలను పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా అవకాశమొచ్చినప్పుడల్లా నీతులు బోధించేవాడు, సలహాలిచ్చేవాడు. అంతేగానీ అతడు ఎప్పుడూ అతడి మాటకు ఎదురుచెప్పలేదు.

పాండవుల పట్ల తనకున్న ప్రేమను ప్రకటించే విషయంలో మొదట్నుంచి విదురుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ద్రౌపదీస్వయంవరంలో పాండవులు గెలుపొందే వరకూ పాండవులను కాపాడుకొస్తున్నా వారికి బాహాటంగా సాయమెప్పుడూ చెయ్యలేదు. వాళ్ళు వారణావతానికి వెళ్ళేటప్పుడు కూడా వారికి పొంచి ఉన్న ప్రమాదం గురించి అందరి ముందూ చెప్పినా అది ఇతరులెవ్వరికీ అర్థం కాకుండా చాలా నిగూఢంగా, యుధిష్టిరుడికొక్కడికే అర్థమయేటట్లు మాట్లడుతాడు. దానికి కారణం తానే కౌరవసభలో వారిమీద ఆధారపడి ఉండడం, పాండవులకు బలగం లేకపోవడమే!

పాండవుల పట్ల అతడి అభిమానం ద్రౌపదీస్వయంవరం నుంచి కౌరవపాండవులు హస్తినకు వస్తున్నప్పుడు బయటపడుతుంది. అతడు అద్భుతమైన శ్లేష వాడి ధృతరాష్ట్రుడితో అంటాడు: “కౌరవులకు జయము జయము”. పాండవులు బతికే ఉన్నారని అప్పటికింకా తెలియని ఆ గుడ్డిరాజు సహజంగానే అందరిలాగే కౌరవులంటే తన పుత్రులనే అనుకున్నాడు. ఆనందాతిరేకంతో “ద్రౌపదిని లోపలికి తీసుకురండి. దుర్యోధనా! నీ భార్యకు ఆభరణాలు తెసుకురా!” అని హడవుడి పడిపోతాడు. అప్పుడు విదురుడు చల్లగా అసలు విషయం చెప్తాడు. ధృతరాష్ట్రుడు విదురుడు ఊహించినట్లే నిరాశ చెందినా సర్దుకుని “నా తమ్ముడి కొడుకులు, నా సొంత కొడుకులు వేరువేరు కాదు. అందరూ నాకు సమానమే” అంటాడు. దానికి సమాధానంగా విదురుడు “మహారాజా! మీ బుద్ధి ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.” అని ముక్తాయింపు ఇస్తాడు. అతడు ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకున్నది అదే!

టెక్నికల్ గా పాండురాజు కొడుకులు, ధృతరాష్టుడి కొడుకులు అందరూ కురువంశం వారే కాబట్టి అందరూ కౌరవులే ఐనా కౌరవులుగా గుర్తింపు పొందింది మాత్రం ధార్తరాష్ట్రులైన దుర్యోధనాదులే! అందువల్ల ధృతరాష్ట్రుడే కాదు ఆ స్థానంలో ఎవరున్నా తప్పుగా అర్థం చేసుకుంటారని విదురుడికీ తెలుసు. ఎప్పుడూ పొల్లు మాటాడి ఎరుగని విదురుడు తెలిసితెలిసీ అంత పెద్ద శ్లేష వాడాడంటే పాండవులు కూడా కురువంశం వారేనని గుర్తుచేయడమేగాక వారిని కూడా కౌరవులుగా గుర్తించాలని అతడు లోపల్లోపల బలంగా కోరుకుంటున్నాడన్నమాట. మరి ఆ వాస్తవాన్ని, ఆ కోరికను అతడు అంతకుముందెప్పుడూ ఎందుకు బయటపెట్టలేదు? ఇప్పుడైనా స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోయాడు? ఎదుటివారెవరైనా, వారికి తన మాటలు నచ్చినా, నచ్చకపోయినా నిష్కర్షగా చెప్పే విదురుడు ఈ ఒక్క విషయంలోనే ఎందుకు డొంకతిరుగుడుగా మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ విషయాన్ని కదిపితే పాండవుల తండ్రులెవరనే చర్చ మొదలౌతుంది. అది మరుగుపరచడానికే గదా వాళ్ళ ప్రయత్నమంతా?

ఇక ధృతరాష్ట్రుడు పాండవులు తన తమ్ముడి బిడ్డలై ఉంటే తన కొడుకును అంత గుడ్డిగా వెనకేసుకువచ్చేవాడు కాదేమో? అతడిలో ఈ ద్వైధీభావం కడదాకా కొనసాగింది.

ధర్మజుడు-విదురుడు:

విదురుడికి పాండవులతో, ప్రత్యేకించి యుధిష్టిరుడితో ఉన్న ఆ అనుబంధం కేవలం బంధుత్వం వల్లనే అనుకోలేం. ధర్మజుడు-విదురుల మధ్యనున్న సంబంధం కృష్ణార్జునులవలె స్నేహసంబంధం కాదు, దుర్యోధన-కర్ణులవలె దాత-హితుల సంబంధం కాదు. అంతకు మించిన అనురాగబంధమేదో వాళ్ళిద్దరినీ కలిపి ఉంచింది. అదేమిటి? రక్తసంబంధమా? ఇద్దరూ ధర్మశాస్త్రంలో నిష్ణాతులే. ఇద్దరూ శాంతికాముకులే. పెద్దగా యుద్ధవిద్యలు రానివారే. విదురుడికి తనకు అర్హమైనదేదో తనకు దక్కలేదు. ధర్మజునికి దక్కినా దానికి అతడు భారీ మూల్యాన్నే చెల్లించవలసివచ్చింది. రాజు కావడానికి అన్ని విధాలా అర్హుడైన తాను ధృతరాష్ట్రుడి వంటివాడిని సేవిస్తూ అతడి పుత్రవాత్సల్యాన్ని భరిస్తూ, అతడి ఆవేశకావేషాల్ని సహిస్తూ బ్రతకవలసివచ్చినందుకు విదురుడు బాధపడినట్లు ఎప్పుడూ బయటపడలేదు కానీ అడవులపాలైనప్పుడు ధర్మజుడు మాత్రం ఆక్రోశించాడు.

పైగా విదురుడు సాక్షాత్తూ యమధర్మరాజు అవతారం. యుధిష్టిరుడు స్వయంగా ఆ యమధర్మరాజు కుంతీదేవికి ప్రసాదించిన పుత్రుడు!
వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి మరింత స్పష్టంగా అర్థమయ్యేలా స్వయంగా వ్యాసుడే చెప్తాడు: అదీ ఎప్పుడు? విదురుడు కూడా చచ్చిపోయాక!

విదురుడు చనిపోయిన తర్వాత వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రుడితో ఇలా అంటాడు: “విదురుడు నా యోగశక్తుల ద్వారా జన్మించిన యమధర్మరాజు అవతారం. అతడు తన యోగశక్తులతో ధర్మజుణ్ణి పుట్టించాడు. ధర్మజుడే విదురుడు – విదురుడే ధర్మజుడు. ధృతరాష్ట్రా! ఇంతకాలం విదురుడు నిన్ను సేవించినట్లే ఇక మీదట ధర్మజుడు నిన్ను సేవిస్తాడు.”

ఇక వీళ్ళిద్దరి సంబంధాన్ని మరింతగా తేటతెల్లం చేసే సంఘటన విదురుడి మరణానంతరం జరుగుతుంది. విదురుడు సన్న్యసించి యతిగా మారి ఆహారము, బట్టలు త్యజించి అడవిలో ఎవరూ రాని చోటుల్లో తిరుగుతున్న సంగతి తెలిసి ధర్మజుడు అతడున్న చోటికి ఆరాటంతో పరిగెత్తుకుంటూ పోతాడు “విదురా! ఆగు!! నేను… నీ ధర్మజుణ్ణి.” అంటూ. విదురుడు వెళ్ళి వెళ్ళి ఒక చెట్టుకు చేరగిలబడి ధర్మజుణ్ణి చూస్తూ తన యోగశక్తులతో ఒక్కో అవయవం ద్వారా అతడిలో ప్రవేశిస్తాడు. ఆ విధంగా విదురుడు తన ప్రాణాన్ని, తన శరీరాన్ని, తన మేధస్సును ధర్మజుడికిస్తాడు. ఉపనిషత్తుల్లో సరిగ్గా ఇలాంటి పద్ధతిలోనే తండ్రి తన ఆఖరిక్షణాల్లో కొడుకుకు తన శక్తులను అందజేస్తాడని ఉంది.

ఇక భీముడి లక్షణాలను బట్టి చూస్తే అతడు ఏ ఆటవికజాతి సంతానమో అన్న సందేహం కలగడం సహజమే. ఈ అనాగరిక లక్షణాలు దగ్గర్నుంచి చూసిన దుర్యోధనుడికి అతడంటే అసహ్యమూ, చిన్నచూపూ ఉండడం కూడా సహజమే. భీముడు ఏ ఆటవికజాతి సంతానమో అనడానికి కొన్ని ఆధారాలు:

అతడి అసాధారణమైన బలం,
చిన్నప్పుడే కాళ్ళు చేతులు కట్టి లోతు నీళ్ళలో పడేసినా చులాగ్గా చేపపిల్లలాగ ఈదుకురాగలిగిన సహజ సామర్థ్యం,
విష ప్రభావం అతడిమీద పెద్దగా లేకపోవడం,
గంధమాదన పర్వతంపై పువ్వులకోసం కీకారణ్యంలోకి జంకూగొంకూ లేకుండా చొచ్చుకుపోయిన మొండిధైర్యం,
అడవిలో అందరినీ కాపుగాసే చురుకుదనం,
రాక్షసకన్య (హిడింబ) తో ప్రణయం, వారికి పుట్టిన ఘటోత్కచుడు రాక్షసుడే కావడం.
ఆవేశాన్ని, మనసులో మాటను దాచుకోని నిర్మలత్వం,
తనవారిపై అతడు చూపిన అవ్యాజమైన ప్రేమ,
సమయ, సందర్భాలను లెక్కచేయక అన్యాయాన్ని ఎదిరించే ఆవేశం,
కీచకుణ్ణి చంపిన తీరు,
దుశ్శాసనుడి రక్తం రుచిచూడడం.

ఇవి పెంపకం ద్వారా అలవరచుకున్న లక్షణాలు కావు. ఎందుకంటే వీటిలో ఒక్కటీ నాగరికులైన రాచబిడ్డలకు తగిన లక్షణం కాదు. అతడితోబాటు అడవిలో పుట్టి పెరిగిన ఇతర పాండుపుత్రులకు కూడా అబ్బలేదు. అంటే ఈ లక్షణాలు అతడి జీన్స్ లోనే ఉన్నాయనుకోవాలి.

భీముడి సంగతిలా ఉండగా రాచపుట్టుక పుట్టి అంత:పురంలో పూర్తిగా రాజభోగాలతో పెరిగినవాడు దుర్యోధనుడు. రాజ్యానికి తానే అసలైన వారసుణ్నని విశ్వసించినవాడు. కర్ణుణ్ణి చేరదీసిన దుర్యోధనుడికి కులద్వేషం ఉందనలేం. ఐతే “అన్ని విధాలా” కురువంశానికి సరైన వారసుడిగా తానుండగా రాజ్యాన్ని కురువంశంతో నేరుగా సంబంధం లేనివాళ్ళతో, నాగరికసమాజానికి దూరంగా పుట్టిపెరిగిన అడవిమనుషులతో రాజ్యం పంచుకోవలసి రావడం అతడు సహించలేనిది. శంతనుడి కాలం నుంచి వారసత్వం విషయంలో ఇలాంటి పేచీ ఎప్పుడూ ఏర్పడలేదు. పాండవులు నిజానికి పాండురాజు కొడుకులు కాదని అతడికి తెలియకుండా ఉండదు. అలాగే దేవతల పుత్రులని నమ్మేంత అమాయకుడూ కాడతను. పైగా రాజ్యం పాండవులకు అప్పగిస్తే భీముడిది తనమీద పైచేయి అవుతుంది. అది అతడు భరించలేడు.

భీముడికి నాగులతో ఉన్న అనుబంధం ఇక్కడ గమనించదగ్గది. ప్రాచీన భారతదేశంలో ఈ నాగజాతి వాళ్ళు ఒక రకం తెగ – కొంతవరకూ ఆటవికులు. ఈ ఆటవికతెగ క్రమంగా తమ హోదా పెంచుకంటూ వచ్చి చివరకు చాతుర్వర్ణ వ్యవస్థలో కలిసిపోయారు. పరమశివుడి మెడలోని నాగుపాము, వినాయకుడి కడుపును కలిపి కుట్టిన పాము, అతడి ఏనుగు తల (నాగ అనే మాటకు పాము, ఏనుగు అని రెండర్థాలున్నాయి), ఆకాలంలో నాగజాతి వారికి ఉన్న ప్రాబల్యానికి చిహ్నాలే అని చరిత్రకారులు చెప్తారు. సమస్త భూభారాన్నీ తన భుజస్కంధాలమీద మోస్తున్న ఆదిశేషుడు నాగుడే. ఇవే కాక ఇంకా నాగుల ప్రస్తావన మన పురాణాల్లో చాలా చోట్ల వస్తుంది. ఏతావాతా భీముడి తండ్రి ఎవరో ఈ నాగజాతికి చెందిన మహాబలాఢ్యుడై ఉండాలి. అర్జునుడి భార్యల్లో ఒకతె ఐన ఉలూచి కూడా నాగకన్యే.

తరచి చూస్తే పాండవుల్లో అర్జునుడొక్కడే అసలు సిసలు రాచబిడ్డేమో.. అతడికి ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి – కీర్తి, కాంత, కనకం మీద వ్యామోహం, ఎంత సేపూ తన గురించి తప్ప పక్క వాళ్ళగురించి అసలు పట్టించుకోక పోవడం, ఏ కృష్ణుడి దన్నో లేకపోతే కూలబడిపోవడం, తాను పైకి రావడం కోసం ఇంకో ఏకలవ్యుడిని పడగొట్టటం లాటివి, పైగా బిరుదులు. ఇంద్రుడు అంటే రాజు అనే అర్ధం ఉంది కాబట్టి — ఇతడు ఏ రాజు కొడుకో అయి ఉండే అవకాశం ఉంది. ద్రౌపది పట్ల అతడికి గల ప్రేమ కూడా అనుమానాస్పదమే. అతడికి ఎంతసేపూ తాను మత్స్యయంత్రాన్ని కొట్టి వీరుణ్ణనిపించుకోవాలనే ఆరాటమే తప్ప ద్రౌపది మీద అతడేనాడూ అనురాగం చూపినట్లు లేదు. పైగా ద్రౌపదితో పెళ్ళయాక కూడా ఊళ్ళమీద పడి ఊరికొకర్ని పెళ్ళాడి ద్రౌపదికి సవతులుగా తెచ్చాడు. ఇదీ (బహుభార్యాత్వం) నాగరిక రాజుల లక్షణమే. భీముడొక్కడే ద్రౌపదిని పెళ్ళాడాక తర్వాత పెళ్ళిచేసుకోలేదు.

కుంతి-విదురుడు:

విదురుడు వంశాన్ని నిలపడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మజుడికి తండ్రి అయ్యాడన్న విషయం గమనించాలి. పాండురాజుకు అప్పటికే ఒక కొడుకైనా ఉండి ఉన్నట్లైతే విదురుడు ఒప్పుకునేవాడు కాదు. ఆ తర్వాత కూడా అతడు కుంతి అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం గమనిస్తాం. పాండవుల వనవాసమప్పుడు కుంతి విదురుడింట్లోనే ఉంది. కర్ణార్జునులు తొలిసారి తలపడినప్పుడు ఆమెను సాంత్వనపరచిందీ విదురుడే! ఐతే అంతమాత్రం చేత ధర్మజుడు పుట్టిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యా సంబంధం కొనసాగిందని అనుకోవడం విదురుడి వ్యక్తిత్వాన్ని అవమానించడమే అవుతుంది.

దుర్యోధనుడు పాండవులకి రాజ్యం నిరాకరించడానికి కారణాలు (?)

పాండవుల పుట్టుక వెనుక నున్న కారణమే బహుశా దుర్యోధనుడు వాళ్ళకి రాజ్యాధికారం నిరాకరించడానికి కారణమేమో? అసలు హస్తినకు రాజు పాండురాజైనప్పుడూ, ధృతరాష్ట్రుడు అతడి ప్రతినిధిగా మాత్రమే పరిపాలన సాగిస్తున్నప్పుడు యుధిష్టిరుడికి రాజ్యం అప్పగించకుండా అర్ధరాజ్యం మాత్రమే ఇచ్చి, అదీ ఎక్కడో ఉన్న ఇంద్రప్రస్థానికి పంపడమేమిటి? ఆయన పంపితే భీష్మాదులు మిన్నకుండడమేమిటి? యుధిష్టిరుడికే నిజంగా రాజ్యార్హతుంటే , కురువృద్ధులందరూ పాండవులకి అర్ధరాజ్యమివ్వడమనే సంధి మంత్రానికి సమ్మతించేవారా ? ధృతరాష్ట్రుడు పెద్దలు, మంత్రుల మాటలని పెడచెవిని పెట్టగలిగేవాడా ? అందరికీ కుంతి పెద్దకొడుకు పుట్టుక రహస్యం తెలిసినా – వారి అభిజాత్యం కాపాడడానికే, ఈ సంగతి ఎక్కడా ప్రస్తావించకుండా మిన్నకుండిపోయేరా? ధృతరాష్ట్రుడు పాండవులమీద పుత్ర ప్రేమ చూపించినా, నిజంగా వాళ్ళకి రాజ్యార్హత లేదు కాబట్టే , అంతగా తన పిల్లలవైపు మొగ్గు చూపించాడా? ధృతరాష్ట్ర్రుడు ధార్మికంగానే రాజ్యంచేసినట్టు అనిపిస్తుంది, తన మంత్రుల, సన్నిహితుల, పెద్దల మాటని అతనెన్నడూ పెడచెవిన పెట్టిన ధాఖలాలు లేవు. పాండవులు అడవిలో పుట్టినా, వాళ్ళ జన్మరహస్యం అప్పటి పెద్దలందరికీ, అందులోనూ రాజైన ధృతరాష్ట్రుడికి తెలియదనుకోడానికి లేదు. ఈ సంగతి తెలిసిన శకుని – దుర్యోధనుడికీ సంగతి చెప్పి ఉండవచ్చు.

దుర్యోధనుడు – అన్నగా తన తమ్ములందరినీ బాగానే చూసుకొన్నాడు. స్నేహానికి ప్రాణం పెట్టాడు. గురువులని, పెద్దలనీ గౌరవించాడు, ప్రజలని కూడా పీడించినట్టేమీ ఆధారాలేమీ లేవు. మరి, ఇంత మంచివాడు, ఒక్క పాండవుల పట్ల ఎందుకలా ప్రవర్తించినట్టు ?

ధర్మయుద్ధమైన కురుక్షేత్రంలో చాలామంది రాజులు, సామంతులు దుర్యోధనుడి పక్కనుండి యుద్ధం చేసారు – వారందరికీ కూడా దుర్యోధనుడి నిర్ణయంలో ధర్మమే కనిపించి ఉండాలి కదా?

భీష్ముడు, ద్రోణుడు మొదలైన కురు వృద్ధులు కూడా ఎంతగా శాంతి కాముకులైనా, పాండవ పక్షపాతులైనా, చివరకి ఆ కాలంనాటి ధర్మాన్ననుసరించి దుర్యోధనుడి మాటకెదురు చెప్పలేకపోయుండవచ్చు.

ఏతావాతా ఈ ధృష్టితో పరిశీలిస్తే, అప్పట్లో రాజలోకమంతా ఈ విషయంలో రెండుగా చీలినట్టుగా కనిపిస్తుంది. ఈ చీలిక చివరికి శ్రీకృష్ణ, బలరాములలో కూడా కనిపిస్తుంది. నవయుగ నిర్మాతైన కృష్ణుడు – కాలంచెల్లిన ఒక సాంఘికాచారం కన్నా, అర్హతున్నవాళ్లకే పట్టం కట్టడానికి నిర్ణయించుకొన్నట్టుగా కనిపిస్తుంది. కానీ, ఆచార పరాయణులు, సాంఘిక నియమాలనే ధర్మ సూత్రాలుగా భావించేవాళ్లంతా – కొందరు మౌనంగాను, మరికొందరు బాహాటంగానూ ధుర్యోధనుడి పక్షం వహించి ఉండవచ్చును.

ఏ ధర్మమూ ధుర్యోధనుడి పక్షంలో లేకపోతే, కురుక్షేత్రం ధర్మయుద్ధమెలా అవుతుంది? ఇది రెండు – విరుద్ధమైన ధర్మాల మధ్య జరిగిన పోరాటమేగాని, ధర్మానికి – రాజ్యకాంక్షకి మధ్య జరిగిన యుద్ధం కాదేమో.

ఉపసంహారం:

ఆస్తి కోసమో, ఐదూళ్ళ కోసమో అన్నదమ్ముల బిడ్డల మధ్య యుద్ధం జరగడం ఒక వాస్తవం. దాని చుట్టూ శతాబ్దాల తరబడి కవులనేక మంది అల్లిన కథ మన ముందు మహాభారతమనే పేరుతో ఉంది. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఆధారం చేసుకుని శ్రీకృష్ణుడు సూర్యుడికి చక్రం అడ్డేయడాన్ని, సైంధవ వధను కల్పించిన కవుల కల్పనాచాతుర్యం అమోఘం. మహాభారతాన్ని ఒక పవిత్రగ్రంథంగా భావించి పూజించడమో, లేక అభూతకల్పనగా కొట్టిపారేయడమో కాకుండా దీంట్లోని వాస్తవాలను జాగ్రత్తగా ఏరుకునే ప్రయత్నాలు విరివిగా జరగాలి.

Reference: Yuganta by Iravati Karve

-సుగాత్రి

ఈ నెల అతిథి సుగాత్రి సాహిత్యం(http://sahityam.wordpress.com) బ్లాగరి. పొద్దు ప్రారంభసంచికల్లో సినిమా శీర్షిక నిర్వహించారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

13 Responses to కౌంతేయులు

  1. Mr Anonymous says:

    devaranyam only with 2 not with three, please correct

  2. radhika says:

    చాలా ఆశక్తికరం గా వుంది.నాకెందుకో కొన్ని విషయాలు లోతుగా తెలుసుకోకుండా వదిలేస్తేనే బాగుంటుందనిపిస్తుంది.తరచి చూసే కొలదీ తప్పులెక్కువ కనిపిస్తుంటాయి నాకు.

  3. radhika says:

    చాలా ఆశక్తికరం గా వుంది.నాకెందుకో కొన్ని విషయాలు లోతుగా తెలుసుకోకుండా వదిలేస్తేనే బాగుంటుందనిపిస్తుంది.తరచి చూసే కొలదీ తప్పులెక్కువ కనిపిస్తుంటాయి.

  4. pavan says:

    “maha” bharatamlo nenu telusukunna maro kotha konam. donno and cant decide what’s true and whats false. coz its histroy and history is written / rewritten by people who win.
    But maha bharatamlo enni kathalu enni konalu..

  5. lalitha says:

    సుగాత్రి గారు,
    మీ ప్రతిపాదన, అది వివరించిన తీరు బాగుంది.
    మీరు చాలా related విషయాలు తెలిసిన వారిల, చాలా చదివిన / విన్న వారిలా ఉన్నారు.

    నేను ఇటువంటి విశ్లేషణలతో ఏకీభవించ లేను.
    అయితే ఈ కథలను “science fiction లాగా చదివి ఆనందించ వచ్చు. అభూత కల్పనలు అనుకుంటూ ఆస్వాదిస్తూనే అందులోనుండి మనం గ్రహించ గలిగే విషయాలను గ్రహించుకోవచ్చు. చరిత్ర అనుకోవచ్చు. లేదా realistic fiction అనుకోవచ్చు. మరీ ఇంతలా పనిగట్టుకుని పాండవుల పుట్టుకను మనకున్న పరిమిత ఉపకరణాలతో విపరీతంగా శోధించడం కొంచెం మనసుకి కష్టం అనిపిస్తుంది.

    వ్యాసుడికి రాజ్య సంబంధమైన కాంక్షలూ, బంధాలూ లేవు. ధృతరాష్ట్రుడికి అటువంటివి ఉన్నాయి. మీ ఆలోచనను పట్టుకు ముందుకు వెళ్తే ధృతరాష్ట్రుడి వల్ల పిల్లలను కనడం సముచితం కాదు అనిపిస్తుంది ఆ దృష్ట్యా. ఈ నాడు infertility కి ఉన్న రక రకాల ఉపాయాలలో తల్లి గర్భాన్నో, తండ్రికి సంబంధించి ఇంకోటో అరువు తెచ్చుకోవడం కూడా ఉన్నాయి కదా. అక్కడ అలా అరువు వచ్చిన వారి విషయాలు గుప్తంగా ఉంచడం కూడా సాధారణం కదా. కొన్ని సార్లు వెల్లడి అవుతాయి కూడా. రెండు రకాల పరిస్థితులూ పాఠకులలో ఉత్సుకతను కల్పించడానికి రచయిత ప్రవేశ పెట్టిన అంశాలు అయ్యుండచ్చు అది fiction అయితే. నిజమే అయితే ఇంకా ఎన్నో రకాల కారణాలు ఉండ వచ్చు.

    మరీ ముఖ్యంగా నాకు కష్టమనిపించినవి:
    1. విదురుదూ, భీష్ముడు మున్నగు వారు పాండవ పక్షపాతులా, లేక ధర్మ పక్షపాతులా?
    2. భీముడి రోషంలో సహజ మానవ ఉక్రోషం (ముఖ్యంగా ద్రౌపది పరాభవించబడ్డప్పుడు) కనిపిస్తుంది కాని ఆటవికత ఎక్కడ ఉంది? ఆ కారణంగా దుర్యోధనుడూ అతనిని చిన్న చూపు చూసి ఉండచ్చా? లేక అక్కడ ముఖ్యంగా ఉన్నది అసూయా?

  6. lalitha says:

    నేను వ్యాఖ్య అంతా రాసేశాక మీరిచ్చిన refrence చూశాను.
    చిన్నప్పుడు విన్న కథలను విరుద్ధంగా వేరొకరు చెప్పినప్పుడు కష్టంగా అనిపిస్తుంది.
    అలాగే ఇదీనేమో అనుకుని చాలా సార్లు చదివాను. అయినా రాజీ పడ లేక వ్యాఖ్య రాశాను.
    రాజాజీ కర్ణుడి పాత్ర గురించి, దుర్యోధనుడి పాత్రలోని మన్వతా కోణం గురించి చదివినప్పుడూ మొదటీ సారి ఇంకో కోణంలో తెలిసిన పాత్రల గురించి ఆలోచించడం తెలుసుకున్నాను. ఏకీభవించగలిగినా లేక పోయినా.
    ఈ వ్యాసం చదివితే ఆలోచింప చేయాలి అన్న దానికన్నా ఇంకా విపరీతమైన భావన ఏదో కలిగింది నాకు. అందుకే అలా రాశాను.

    తర్వాత ఐరావతి గారి గురించి, యుగాంత గురించి గూగుల్ చెయ్యడం మొదలు పెట్టాను.

    ఎవరైనా బాగా తెలిసిన వారు balanced గా ఈ వ్యాసం గురించి చర్చిస్తారేమోనని ఎదురు చూస్తున్నాను.

  7. Very interesting analysis, Sugatri gaaru.
    There is nothing inherently wrong with this kind of analysis or the approach used in this essay. I don’t think the essay casts the pandavas or any of the characters in particularly bad light due to the conclusions of the analysis .. all it says is that there was deliberate obscuration about the births of the paandavas .. which is true.
    BTW, Ranganayakamma does similar kind of exercise vis-a-vis Ramayana in her Ramayana Vishavrksham .. that too an interesting read.

  8. సుధాకర బాబు says:

    సుగాత్రి గారూ!

    బ్లాగులో ఏదో లింకు ద్వారా యధాలాపంగా ఈ వ్యాసానికి వచ్చాను కనుక పాత వ్యాసానికి ఇంత ఆలస్యంగా వ్యాఖ్యానిస్తున్నాను. అసందర్భం కాదని ఆశిస్తున్నాను. మీ వ్యాసం ఆసక్తికరంగా ఉన్నది. చదివితే అవును ఇదే జరిగి ఉండాలి అనిపిస్తుంది. ఆశ్చర్యం! పాండురాజు, మాద్రి అడవులనుండి తిరిగి రాలేదు! కనుక కుంతి చెప్పినదే సత్యం అనుకోవాలి. అవునా? కాని మీరుచూపిన “అవునేమో”లు (conclusions) సహేతుకంగా లేవు అనుకొంటాను. అతికించినట్లు ఉన్నాయి.

    మీరు ఇంతకు ముందు చదివి ఉండకపోతే గనుక
    http://www.archive.org/details/MahabharataVimarshanamu అనే పుస్తకం ఒకమారు చదవాలనుకోవచ్చును. అందులో కూడా “పాండవులు” బహుశా సిథియన్ జాతికి చెందినవారని, అక్రమంగా దుర్యోధనుని చంపి రాజ్యాన్ని లాక్కున్న దోపిడిగాండ్రని వ్రాశారు.

    బిడ్డల పోలికలు, బలాలు జన్యుపరంగా కలిగి ఉండవచ్చును కాని గుణాలు జాతిననుసరించి అంతగా రావు. అవి conditioned traits. విదురుడి బిడ్డ (అని మీరు నేరుగా అనలేదనుకోండి) అయినంతలో ధర్మరాజుకు ధర్మ చింతన, రాచబిడ్డ అయినంతలో అర్జునుడికి సుఖలాలసత వస్తాయా? అలాగయితే విదురుడికి వచ్చిన ధర్మచింతన ధృతరాష్ట్రుడికి రాలేదు గదా? (దేవతల పుత్రులు అన్న దృక్పథాన్ని పక్కన పెట్టమని అన్నారు గదా?)

    బలం, కోపం, దుడుకుతనం వంటి లక్షణాలు భీమునితో ఇంచుమించు సమంగా, కొన్ని యెడల అధికంగా, కురువంశపుత్రుడయిన దుర్యోధనునికి కూడా ఉన్నాయి గదా? తండ్రులు వేరయినా అర్జునునితో సమంగా (లేదా అధికంగా) ఆయుధ నైపుణ్యం కర్ణునికి రాలేదా? ఆటవికుడైన ఏకలవ్యుడు ధర్మరాజుకు దీటైన ధర్మతత్పరతను ప్రదర్శించలేదా?

    మీరు వ్రాసిన ప్రకారం విదురుడు, వ్యాసుడు వంటి కొద్దిమందికే పాండవుల జన్మ రహస్యం తెలుసు. లక్ష శ్లోకాలు వ్రాసిన వ్యాసుడు ఈ విషయాన్ని కప్పిపెట్టడం ఆశ్చర్యం కాదూ? అంటే నిజంగానే ఇది జరిగిన కధ, దానిలోని సత్యం దాయవలసిన అవసరం ఆ రచనాకాలానికి రచయితకు ఉందని అంగీకరించాలి గదా? అంటే జనమేజయుని కాలానికి వ్యాసుడు బ్రతికి ఉన్నాడా?

    కౌరవ సభలోని భీష్మ ద్రోణాది మహామహులు కుంతి ఏదో కట్టుకథ చెబితే నమ్మేటంత మూర్ఖులు కారు. ఒకవేళ వాళ్ళు నమ్మినా కూపీ తీయకుండా దుర్యోధనుడు వదిలేవాడు కాదు. అజ్ఞాత వాసాన్ని భంగపరచడానికి అతనెంత ప్రయత్నించాడు?

    ఏతావతా నేను మీ చక్కని వ్యాసాన్ని విమర్శించడం లేదు. కాని నాకు అనిపించే విషయాలు.

    1. మహాభారతం ఒక కల్పిత గాధ అనుకొంటే అందులో రచయిత వ్రాసినంతవరకు తీసుకోవాలి.

    2. అది వక్రీకరింపబడిన ఒక చారిత్రిక సంఘటన అనుకొంటే మీరు వ్రాసినవి తప్పక పరిశీలించవలసిన విషయాలు. కాని మీ ప్రతిపాదనలు మరి కొంత బలంగా ఉండాలి.

    మీ వ్యాసం నాకు చాలా ఆసక్తి కలిగించింది మరియు నచ్చింది. అయితే మరింత లోతుగా తరచి చూచే అవసరం కనిపిస్తున్నదని చెప్పడానికే ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. – సుధాకర బాబు.

  9. సుధాకర బాబు గారూ!

    నా వ్యాసం చదివి మీ అభిప్రాయం సవివరంగా తెలిపినందుకు చాలా ధన్యవాదాలు. మీరిచ్చిన లింకులో ఆ పుస్తకం లేదు. కల్పిత కథల్లో రచయిత ప్రతిదీ వాచ్యం చెయ్యనవసరం లేదు కదండీ? చెప్పకుండా వదిలేసిందీ, between the lines చూడవలసిందీ ఎంతో ఉంటుంది. దానికి సూచనలు కథలో వదిలిపెడతారు, అంతే. ఇక్కడ వ్యాసుడు చేసింది ఆ పనే అనుకుంటున్నాను.

    లలిత గారూ,

    నా రచన గురించి మీరు ఇంతగా ఆలోచించి మీ అభిప్రాయాలు వివారంగా తెలిపినందుకు నెనర్లు.

    కొత్తపాళీ గారికి ప్రత్యేకంగా నెనర్లు.

    చావా కిరణ్ గారూ, రాధిక గారూ, పవన్ గారూ,

    నెనర్లు.

    అనానిమస్ గారూ, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు.

  10. సుధాకర బాబు says:

    లింకు పేరు తప్పు వచ్చినందుకు మన్నించండి. ఇది ప్రయత్నించ గలరు

    http://www.archive.org/details/mahabharatavimar021093mbp

  11. కామేశ్వర రావు says:

    సుగాత్రిగారు,
    కొత్తపాళిగారన్నట్టు ఇలాంటిది విచారణ చెయ్యడం తప్పేమీ కాదు. అయితే సుధాకరబాబుగారన్నట్టు ఏ దృష్టితో పరిశీలిస్తున్నామో స్పష్టంగా తెలియాలి. ఒక కల్పిత రచనగా విమర్శించినప్పుడు మీరన్నట్టు రచయిత వాచ్యం చెయ్యకుండా వదిలేసింది, in between the lines విమర్శకులు వెతికే ప్రయత్నం చెయ్యడం సహజమే. కానీ అది రచయిత చెప్పదలుచుకున్న విషయానికీ, రచయిత దృక్పథానికీ అనుగుణంగా చెయ్యడం సరైన పని. ఏ కవైనా, రచయిత అయినా తన రచనలోని పరమార్థానికి అనుగుణంగానే సూచనలు చేస్తాడు కదా. మరి వ్యాసుడు మహాభారతం ద్వారా చెప్పదలుచుకున్నదేమిటి, దానికి మీరనుకుంటున్న సూచనలు ఎంతవరకూ ఉపయోగపడతాయి?
    నిజానికి ఈ between the lines చదవడమన్నది, మనకి బాగా తెలిసున్న రచయితల విషయంలోనే సజావుగా చెయ్యగలుగుతాం. ఆ కవి/రచయిత సామాజిక నేపథ్యం, ఇతర రచనలూ మొదలైన వాటి ద్వారా ఆ రచయిత దృక్పథాన్ని అవగాహన చేసుకొని/అంచనా వేసి, దానిబట్టి అతను చెప్పకుండావదిలేసిన వాటిగురించి అంచనా వెయ్యడం సరైన విమర్శా పద్ధతి. Internal evidence within the work itself is not good enough to decide on the unsaid content of the work.
    మరి వ్యాసుని విషయంలో ఇవేవీ మనకి తెలియవు (అసలతను ఒకే వ్యక్తో కాదో కూడా మనకి తెలియదు). అంచేత అతని రచన విషయంలో ఇలాటి విమర్శ శాస్త్రీయం అవదు. అది కేవలం మన ఊహ, కల్పనే అవుతుంది.
    ఇక దీనినొక చారిత్రక ఇతిహాసంగా, అందులోని పాత్రలను చారిత్రక వ్యక్తులుగా గుర్తించి, ఆ దృష్టితో విశ్లేషించాలంటే దానికి మరిన్ని చారిత్రక అంశాల మద్దత్తు ఉండాలి.
    మొత్తానికి నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, మీరు ఇలాటి విశ్లేషణ చెయ్యడంలో తప్పులేదు, మీ పరిధిలో మీరు చేసిన ఆలోచనకూడా బావుంది. అయితే ఇది కేవలం మీ ఊహ, కల్పనగానే గ్రహించగలం కాని శాస్త్రీయమైన విమర్శ/పరిశీలన అనలేం.
    “శ్రీవాణీగిరిజాశ్చిరాయ దధతో…” అన్న మొట్టమొదటి పద్యంలో నన్నయ్య, భారతం ముగ్గిరిచేత ఆంధ్రీకరించబడుతుంది అని (పేర్లతో సహా) సూచించాడనడం లాంటిదే ఇదీను!

  12. కె.మహేష్ కుమార్ says:

    చాలా వివేకవంతమైన విశ్లేషణ. దీన్నే ఒక విధమైన తార్కిక ఇంటర్ప్రిటేషన్ లేక కొంతవరకూ సైకో అనాలిసిస్ అనుకోవచ్చేమో! ఆలోచించడానికి చాలా ఉంది.

Comments are closed.