చివరకతను కొంత ఉద్రేకంతో ఇలా అన్నాడు:
“వంశ గౌరవంగాని, హోదాగాని లేని నాకు మీరు ఈ విలువ లేని మనుషులను ఇచ్చి ఎంత మహోపకారం చేస్తున్నారో మీకేం తెలుసు! నేను ఎన్ని కష్టాలుపడ్డాను! తుఫానులో చిక్కిన నావలాగ…ఎంత అవమానానికీ, ఎంత దురన్యాయానికీ గురి అయ్యాను, ఎన్ని రకాల దుఃఖాలు అనుభవించాను! ఎందుకు? న్యాయంగా వర్తించినందుకు, నా అంతరాత్మ ఆదేశాలను పాటించినందుకు, దిక్కులేని వితంతువులకూ, అనాథ శిశువులకూ సహాయం చేసినందుకు!…”
ఈ మాటలంటూ అతను చేతి రుమాలుతో ఒక కన్నీటిచుక్క తుడుచుకున్నాడు కూడా.
మానిలవ్ హృదయం కరిగిపోయింది. స్నేహితులిద్దరూ ఎంతోసేపు ఒకరి చేతులు ఒకరి నలుపుకుంటూ, మౌనంగా నీరు నిండిన కళ్ళతో ఒకరి నొకరు చూసుకుంటూ కూచున్నారు. మానిలవ్ మన కథానాయకుని చేతులు విడవకుండా పట్టుకుని, ఎంత ఆప్యాయంగా నొక్కాడంటే, అతనికి తన చేతులను ఎలా విడిపించుకోవాలో తెలియలేదు. చిట్టచివరకు అతను చేతులను ఉపాయంగా విడిపించుకుని, సాధ్యమైనంత త్వరగా అమ్మకం పత్రం రాసుకోవటం మంచిదని అని, తన టోపీ తీసుకుంటూ సెలవిప్పించమన్నాడు.
“అదేమిటి? అప్పుడే వెళ్ళిపోతారా?” అన్నాడు మానిలవ్, చప్పున స్ఫురణకు వచ్చినట్టూ, కొంచెంగా భయపడినట్టూ.
ఆ క్షణంలోనే మానిలవ్ సతి ఆ గదిలోకి వచ్చింది.
“లీజంకా, పావెల్ ఇవానొవిచ్ వెళ్ళిపోతారట”, అన్నాడు మానిలవ్ దైన్యంతో.
“మనం ఆయన్ని బాధపెట్టి ఉంటాం”, అన్నది మానిలవ్ సతి.
చిచీకవ్ తన గుండే మీద చెయ్యి పెట్టుకుంటూ, “అమ్మా, ఇదుగో, మీతో కాలక్షేపం చేసిన ఆనందం ఇక్కడ దాచుకుంటాను! నా మాట నమ్మండి, మీరున్న ఇంట్లో కాకపోయినా, మీ సమీపంలోనైనా శాశ్వతంగా నివసించటం కన్నా నాకు హెచ్చు ఆనందం ఉండబోదు.”, అన్నాడు.
ఈ ఆలోచన మానిలవ్‌కు దివ్యంగా తోచింది. “చూడండి, పావెల్ ఇవానొవిచ్, మనం ఇలా కలిసి ఒకే ఇంటగానీ, ఒకే చెట్టు నీడన గాని జీవిస్తూ తత్వ విచారంలో జీవితం గడిపితే ఎంత బాగుంటుంది!”, అన్నాడాయన.
“అంతకంటే స్వర్గమేముంటుంది?” అన్నాడు చిచీకవ్ నిట్టూర్చుతూ. అతను మానిలవ్ సతి చెయ్యి ముద్దు పెట్టుకుని, “అమ్మా, సెలవు!… ప్రియమిత్రమా, సెలవిప్పించండి. నేను అడిగినది మాత్రం మరువకండి!” అన్నాడు.
“ఎంత మాటా! మనం మళ్ళీ రెండు రోజుల్లో కలుసుకుంటాంగా!” అన్నాడు మానిలవ్.
ఆల్కైడ్స్, తెమిస్టోక్లస్ లు చేతులూ, ముక్కూ లేని ఒక కొయ్య సిపాయి బొమ్మను ఏదో చేస్తూండటం చూసి చిచీకవ్, “నాయన్లారా, వెళ్ళొస్తాను. మీకోసం బహుమానాలు తేలేదని ఏమీ అనుకోకండి, నాకసలు మీరున్న సంగతి కూడా తెలియదు. ఈసారి వచ్చేటపుడు తప్పక తెస్తాను, నీకు కత్తి తెస్తానోయ్, కత్తి నీకిష్టమేనా?”
“ఇష్టమే” అన్నాడు తెమిస్టోక్లస్.
“మరి నీకు డోలు తెస్తాను. దోలు నీకిష్టమేగదూ?” అన్నాడు చిచీకవ్ వొంగి ఆల్కైడ్స్ తో.
ఆల్కైడ్స్ తలవంచుకుని రహస్యంగా “ఇష్టమే” అన్నాడు.
“ఇంకేం నీకు డోలు తెస్తాను, మంచి డోలు. అది ఏమంటుందో తెలుసా? టర్ ర్ -టర్ – ట-ట-ట అంటుంది. వస్తాను, నాన్నా వస్తాను!” అంటూ అతను కుర్రాడి తలమీద ముద్దు పెట్టుకుని,కుర్రాళ్ళ అమాయకపు కోరికలను గురించి తల్లిదండ్రుల ఎదుట నవ్వే తీరుగా మానిలవ్ దంపతుల కేసి చూసి నవ్వాడు.
వారు మెట్లదాకా వెళ్ళినాక మానిలవ్, “మీరు ఉండిపోవడం మంచిది, పావెల్ ఇవానొవిచ్! ఆ వాన మబ్బులు చూశారా?” అన్నాడు.
“అవి చిన్న మబ్బులేగా?” అన్నాడు చిచీకవ్.
“అయితే మరి సబాకవిచ్ ఇంటికి దారి తెలుసా?”
“మిమ్మల్నే అడుగుదామనుకుంటున్నాను”
“మీ సెలవైతే ఇప్పుడే మీ బండీ వాడికి దారి చెబుతాను”
మానిలవ్ అంత మర్యాదగానూ బండీ వాడికి వెళ్ళవలసిన దారి వివరించి చెప్పాడు.
రెండు అడ్డదార్లు వదిలేసి మూడోది పట్టుకోవాలని తెలుసుకుని బండీవాడు “పట్టుకుంటాంలెండి దొరా!” అన్నాడు.
చిచీకవ్ బండి ఎక్కి వెళ్ళిపోతుంటే భార్యాభర్తలిద్దరూ మునివేళ్ళమీద నిలబడి చలాసేపు వీడ్కోలు చెప్పి, చేతి రుమాళ్ళు ఊపారు.
మానిలవ్ బండి దూరాన అదృశ్యమైనదాకా నిలబడి, అది కనబడకుండా పోయినాక కూడా మెట్లమీదనే ఉండి పైపు కాల్చుకున్నాడు. చివరకాయన లోపలికి వెళ్ళి బల్లవద్ద కూచుని, తన అతిథిని సంతుష్టపరచినందుకు నిష్కల్మషమైన ఆనందం పొందుతూ, ఆలోచనలో పడ్డాడు. ఆయన ఆలోచనలు ఇతర విషయాలపైకి పోయి పోయి చివరికెక్కడ తేలాయో భగవంతుడికే తెలియాలి. స్నేహితులతో కాలక్షేపం చెయ్యటంలో గల పరమానందాన్ని గురించి ఆయన ఆలోచించాడు. స్నేహితుడితో ఒక నదిఒడ్డున నివసిస్తే బాగుంటుందనుకున్నాడు. ఆ నది మీదుగా ఒక వంతెన అవతరించింది. ఆ తరువాత ఒక బ్రహ్మాండమైన భవనం ప్రత్యక్షమైంది, దానిపై గల బురుజు ఎంత ఎత్తుగా ఉన్నదంటే, దానిపైన నిలబడి చూస్తే మాస్కో నగరం కనిపిస్తుందన్నమాట; తరువాత ఆయన సాయంకాలం వేళల అక్కడ కూచుని టీ తాగుతూ ఇంపైన గోష్టి జరిపినట్టు ఊహించుకున్నాడు; తానూ చిచీకవ్ కలిసి మంచి బండిలో ఏదో పార్టీకి వెళ్ళినట్టూ అక్కడ అందరూ తమ మంచితనమూ, సంస్కారమూ చూసి ముగ్ధులైనట్టూ; తమ గాఢమైన మైత్రిని గురించి జారు చక్రవర్తి విని తమ ఇద్దరినీ జనరల్స్‌గా నియోగించినట్టూ, ఆ తరువాత ఇంకేమేమో జరిగినట్టూ తనకే అర్థం కాకుండా ఊహించుకున్నాడు.
చిచీకవ్ కోరిన విడ్డూరమైన కోరిక జ్ఞాపకం వచ్చేసరికి ఆయన ఊహలన్నీ పటాపంచలయాయి. ఆ కోరికను ఆయన మెదడు జీర్ణం చేసుకోలేక పోయింది. దాన్ని గురించి ఎంత తల పగలగొట్టుకున్నా అది ఆయనకు అవగాహన కాలేదు. అందుకని రాత్రి భోజనాలకు వేళ అయేదాకా ఆయన అలాగే పైప్ కాలుస్తూ కూచుండి పోయాడు.
—————
-కొడవటిగంటి కుటుంబరావు