లైబ్రరీ …. నిశ్శబ్దం తాండవమాడుతోంది. ఎవరి పనుల్లో వారు మునిగినట్లు ఉన్నారు. చదువుకునే వాళ్ళు చదువుతున్నారు. ఏసీ ని కావలించుకుని నిద్దరోయేవాళ్ళు నిద్రలో ఉన్నారు. కలలు కూడా కంటున్నారో ఏమిటో. నెట్ చూసే వారు అది… కళ్ళతో కబుర్లాడుకునే ప్రేమికులు వాళ్ళ పనిలో. లైబ్రరియన్ కంప్యూటర్ స్క్ర్రీను పై బిజీ. సెక్యూరిటీ వాచ్‌మెన్ ఓ కన్ను తలుపు వైపు, ఓ కన్ను తన కన్ను చూడగలిగినంత మేర పిల్లల వైపు వేసి ఎదురుగా సంతకం పెడుతున్న పిల్లాడ్ని ఏ కన్నుతో చూడాలో తేల్చుకోలేక తంటాలు పడుతున్నాడు. అప్పుడప్పుడు పేజీలు తిప్పే శబ్దం తప్ప ఇంకేమీ వినబడ్డం లేదు. ఇంతలో హాచ్ అంటూ ఓ తుమ్ము వినిపించింది. లైబ్రరీయన్ తన పనిలో నుంచి తల ఎత్తకపోయినా కూడా తక్కిన వారంతా వెంటనే తమ పనులాపి, కాస్త చిరాగ్గానూ, కాస్త ఆతృత తో నూ చూసారు…ఎవరా ఆ తుమ్ముడుకాయ? అని.
తుమ్మి అలవాటు కొద్దీ “ఎక్స్‌క్యూజ్ మీ” అనబోయిన రాజేశ్ అది లైబ్రరీ అని గుర్తువచ్చి తనలో తానే మెల్లిగా అనుకుని, చుట్టూ పరికించి చూసాడు. అతను తమని చూడ్డం చూసిన మిగితా వారంతా వెంటనే అతని మీద నుంచి దృష్టి మరల్చి మళ్ళీ తమ పనుల్లో పడ్డారు. ఎవర్నన్నా మనం చూస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని చూస్తే మనలో దొరికిపోయామన్న భావన కలుగుతుంది. అందువల్లనే వెంటనే దృష్టి మరల్చేది. మళ్ళీ అందరూ తమ పనుల్లోకి దిగాక – “ఛీ, వెధవ జలుబు” – నూట తొంభైయ్యో సారి అనుకున్నాడు. చదువుతున్న రీడర్స్ డైజెస్ట్ వంక మళ్ళీ దృష్టి సారించాడు. ఎవరో “లాంగ్ లాంగ్” అనే చైనా పియానిస్ట్ కథ.
“పియానో! ఎంత బాగుండేది నాకూ పియానో వచ్చుంటే? ఈ చదువులు మానేసి అలా ఏదన్నా చేసి ఉండాల్సింది. అనవసరంగా ఎందుకొచ్చిన ఇంజినీరింగ్ చదువు?”
“ఏం? దీన్నే గా పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉంటావు అందరికీ? ఈ కాలేజీ లో చదువుకుంటున్నా అని?” – మనసు ప్రశ్న.
“ఇక్కడ చదివితే ఇక్కడని కాక పక్క కాలేజీ అని చెప్పనా మరి? గొప్పగా కాక-ఎవరన్నా అడిగితే ఏడుస్తూ చెప్పనా ఇక్కడే చదువుతున్నా అని?”
– రాజేశ్ కి నిన్నటి కేంపస్ ఇంటర్వ్యూ గుర్తు వచ్చింది.
“ఈ ఇంటర్వ్యూ కోసం ఎంత కష్టపడ్డాను? ఈ కంపెనీ లో రావాలి అని మొన్నో కంపెనీ వస్తే దానిక్కూడా కూర్చోలేదు. రావాలే కానీ, జీవితాంతం ఇక్కడే పని చేయాలనుకున్నాను… మనసులో బాధ గా ఉంది. ఎవర్ని చూసినా వెక్కిరిస్తున్నట్లే అనిపిస్తున్నది. రవి గాడు… నాకంటే ఎందులో ఎక్కువ? వాడికొచ్చింది. వాడు నాతో మాట్లాడినంత సేపు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తోంది.”
ఇందాక ఆ చందు – “నీకు రాలేదా? నమ్మలేకపోతున్నానంటే నమ్ము” అన్నాడు. అంటే వ్యంగ్యమా? జాలా? ఆశ్చర్యమా? వ్యంగ్యం లాగే ఉంది ఆ వ్యాఖ్య. నమ్మలేకపోతున్నానంటే చాలదూ? మళ్ళీ “నమ్ము” అంటాడేమిటి? అంటే నేను నమ్మనని ఎందుకు అనిపించింది వాడికి? నమ్మలేకపోతున్నాడంట వెధవ. నాకు మాత్రం ఏదో మా గొప్ప నమ్మకంగా అనిపిస్తున్నట్లు ఇక్కడ. అసలు….”
ఇంతలో టేబుల్ ఊగుతున్న భావన. ఫోను. ఆలోచన ఆపి ఫోను వంక చూసాడు. ఏదో కొత్త నంబరు. వెంటనే దాన్ని పట్టుకుని శబ్దం చేయకుండా తలుపు వద్దకు వచ్చాడు. అంత వేగం లోనూ సెక్యూరిటాసురుడు తనను నఖశిఖపర్యంతం చూట్టం గమనించాడు. “ఇంతలో ఏమి ఎత్తుకుపోతాను రా వెధవా?” మనసులోనే తిట్టుకుని తలుపు తోస్తూ – “హలో…” అన్నాడు. వెంటనే మొహం లో రంగులు మారాయి. ఏమీ మాట్లాడకుండానే కట్ చేసాడు. వెధవ కాల్స్. ఈ హచ్ వాళ్ళకి పనీ పాటా లేదు. కసిగా తిట్టుకుంటూ మళ్ళీ ఆ తోసి మూసిన తలుపుని తోస్తూ లోపలికొచ్చాడు. వెళ్ళి ఇందాకటి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ రీడర్స్ డైజెస్ట్ తీసాడు మళ్ళీ.
ఇదివరలో మొదటి సారి మందు రుచి తెలిసే వయసు 28 సంవత్సరాలు ఉండేదట. ఇప్పుడది 20 ఏళ్ళైందట. ఏదో సర్వే చేసారులా ఉంది. “ఈ సర్వేలెందుకు చేస్తారో అసలు? పనికిమాలిన సర్వేలు…” చిరాకు పడ్డాడోసారి దాన్ని చూసి. “మరి ఎప్పుడూ నన్నెవరూ అభిప్రాయమడగలేదే? ఎవర్ని అడుగుతారో వీళ్ళ్దు… పీపుల్స్ సర్వే అని రాస్తారు పైగా అందరూనూ.” “ఇరవై సగటు వయసా అయితే? ఇంకా నేను తాగలేదే మరి? ఓ సారి తాగి చూద్దామా??” తాగుడనగానే రాజేశ్ కి తన నేస్తం కిశోర్ గుర్తువచ్చాడు. “ఏం చేస్తున్నాడో వాడు… వారమైంది మాట్లాడి. ఉండేది ఒకే కాలేజీ. చదివేది ఒకటే క్లాసు. ఒకే బెంచీ. హాస్టల్లో పక్క పక్క గదుల్ల్లో. అంతే. తెలుసుకోవాలనుకుంటే ఎంతలో పని? అంతలో అయ్యే పనే ఇప్పుడు ఇంత కష్టమై కూర్చుంది. ఎందుకు మాట్లాడ్డం మానేశాడో అర్థం కాదు. తిక్క వెధవ. మనం హలో అంటే హలో అనడమే కానీ, మునుపటి చనువేదీ? ఏం జరిగిందంటే చెప్పడు. వీడు తాగితే నాకేం, తిరిగితే నాకేం? అసలు ఆ రోజు – “ఎందుకు రా తాగుతావ్?” అన్నందుకే మాట్లాడ్డం మానేసి ఉంటాడా? అమ్మాయిల్లాగా ప్రతి చిన్నదానికి ఆ అలక ఏమిటి? అసలు వాడేం మారలేదు ఏమో! నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా? అడిగితే ఏం లేదంటాడు కానీ, మునుపటిలా ఉండలేకపోతున్నా వాడితో. వాడి విషయాలేమీ తెలీడం లేదు నాకు. నేనే మారానేమో ఒక వేళ?” …. మళ్ళీ తుమ్ము!
“ఏమి జలుబో ఏమో కానీ…. ఏమీ చేయలేకపోతున్నాను. క్లాసు పుస్తకం ముందేస్తే కళ్ళు మామూలుగానే మూసుకుపోతాయి. ఇప్పుడైతే మరీనూ. పోనీ మొన్నటి నవల కొనసాగిద్దాం అంటే రెండు పేజీలు చదివే సరికి తుమ్ములు, దగ్గులు మళ్ళీ మొదలు. కంప్యూటర్ ముందు కూర్చుంటే చాట్ చేస్తూ రెండు ఎంటర్లు కొట్టగానే తలనొప్పి. కిటికీ తెరిచి దిక్కులు చూద్దామంటే బయట చలి గాలి. కాసేపు ఆడుతూ ఉంటే కాస్త పర్వాలేదనిపించింది కానీ … ప్చ్! ఇలా అయితే ఎలా? అంతా అయిపోయి, భోజనం తినీతినగానే వచ్చి ఈ లైబ్రరీ లో కూర్చున్నాను! ఖర్మ. ఇది కాస్తా వెకేషనై కూర్చుంది. లేకుంటే మిగితా నేస్తాలన్నా ఉండేవారు. అసలా కిశోర్ గాడితో టాకింగ్ టర్మ్స్ లో ఉంటే బాగుండేది. నేనే ఎన్ని సార్లు కదిలించినా ముక్తసరిగా జవాబు ఇచ్చినట్లు అనిపిస్తుంది. వాడుగా ఏమీ అనడు. అరే! నిన్న ఇంటర్వ్యూ పోయిందే…ఓ సారొచ్చి పరామర్శించొచ్చు కదా?? ఇందాకే ఎదురుగ్గా కూర్చుని లంచ్ చేస్తూ నవ్వాడు. అంతే. అదేమి విచిత్రమో గానీ, ఆ క్షణం లో నాకు కూడా ఏమీ తోచలేదు మాట్లాడ్డానికి వాడితో. గంటలగ్గంటలు కబుర్లు చెప్పుకునే వాడితో కూడా నాకేమీ మాటల్లేకపోడం ఏమిటో! తప్పు నాదేనేమో! వాడి గురించి పొరబడ్డానేమో!”
డైజెస్ట్ ని ఇక జీర్ణించుకోలేక మూసేసాడు. “500 మస్ట్ సీ మూవీస్” – ఎదురుగ్గా ఎవరో వదిలి వెళ్ళిన లావుపాటి పుస్తకం చూసాడు. “ఈ సినిమాలు చూసి తీరాలా? తీరకపోతే?” అనుకున్నాడు. “ఏమిటి ఇంత తిక్కగా తయారయాను? రేపట్నుంచి తిక్క రాజేశ్ అన్నా అంటారేమో ఇక!” అనుకున్నాడు. ఓ సారి అటూ, ఇటూ చూసాడు. షరా మామూలే, ఎవరి పనుల్లో వారు. “నాకు మాత్రమే ఎందుకు బోరు కొడుతోంది ప్రతీదీ? ” అనుకున్నాడు. మెల్లగా లేచి, పిల్లిలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. తలుపు దాటగానే, స్వేచ్ఛగా ఊపిరి పీల్చాడు. “ఇప్పుడు మళ్ళీ నిశ్శబ్ద ప్రపంచం నుండి బయటకొచ్చేసా. ఇక మళ్ళీ నేను నేనే!” అనుకున్నాడు. ఎదురుగుండా మైదానం లో ఎవరో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. కాసేపు చూస్తున్నాడు. “కిశోర్ గాడు కూడా ఉంటే బాగుండేది… ఆ కంపెనీ లో వచ్చుంటే బాగుండేది…. ఈ జలుబు రాకుంటే బాగుండేది…. చా! నేను మరీ ఏడుపుగొట్టు పెస్సిమిస్ట్ అయిపోతున్నా ఈ మధ్య!” – తన ఆశల్లోని నిరాశావాదాన్ని బాగా పట్టుకున్న రాజేశ్ తన్ను తానే ఓ సారి తిట్టుకుని, నవ్వుకున్నాడు. ఇంతలో మళ్ళీ ఫోను.
“రాజేశ్ కాలింగ్” అని వచ్చింది. ఉలిక్కిపడ్డాడు. కళ్ళు నులుముకుని మళ్ళీ చూసుకున్నాడు. అదే. అప్పుడెప్పుడో దయ్యాలు చేసే ఫోన్లంటూ, దయ్యం సెల్ నంబరంటూ ఓ ఫార్వర్డ్ రావడం గుర్తు వచ్చింది. ఇది అటువంటిదే కాబోలు అని అనుకుని, వెంటనే తిట్టుకుని, ఆ వెంటనే నవ్వుకుని, ఫోను ఎత్తాలా వద్దా అని ఆలోచించి – మొత్తానికి ఎత్తేశాడు. “ఎరా సోదిమొహం వెధవా! ఎవరి ఫోను తీస్కపొతున్నవో తెల్వదురా బయ్ నీకు?” – అవతలి వైపు నుంచి గొంతుక. వెంటనే గుర్తు పట్టాడు రాజేశ్. అది కిశోర్ ది. వెంటనే ఓ సారి ఆ ఫోను పరికించి చూసాడు. నిజమే, వాడి ఫోనుకి, తన ఫోనుకి ఆట్టే తేడా లేదు. పరికించి చూస్తే తప్ప తెలీదు. నవ్వొచ్చింది అతనికి. మళ్ళీ ఫోనుకి చెవిని ఇచ్చాడు. “ఏం రా? అడుగుతూంటే సమజైత లేదా? ఫోన్ ఎప్పుడిస్తావ్?” – అదే అభిమానం తో కూడిన చిరు కోపం. “ఏం బే! ఇప్పుడా చూస్కునేది? ఐదు నిముషాలాగు…తెచ్చిస్తా. క్యాంటీన్ లో కాఫీ కి రా…అక్కడ ఇస్తాను..” అన్నాడు. అవతల వైపు నుండి సరేనన్న జవాబు తో ఫోను కట్టయింది. రాజేశ్ మొహంలో ఎంత వద్దనుకున్నా ఓ నవ్వు. “వాడు మనసులో ఏమీ పెట్టుకోలేదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించినట్లు ఉన్నా నేనే. అసలు వాడి గురించి నేనిలా ఆలోచిస్తున్నా అని వాడికేమీ అనిపించనట్లే ఉంది..అలాగే ఉండనీ!” అనుకున్నాడు. ఆ క్షణం లో మరి పోయిన ఉద్యోగమూ, ప్రాణం తోడుతున్న జలుబూ – రెండూ గుర్తొచ్చినా కూడా ఈ ఒక్క కాల్ వల్ల కలిగిన ఉత్సాహం వాటివల్ల కలిగిన నిరుత్సాహాన్ని బైటకి పంపేసినట్లు ఉంది. ఓసారి ఫోను ని చూసి, నవ్వుకుంటూ క్యాంటీన్ వైపు కి వెళ్ళిపోయాడు.
—————
తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.
Pingback: పొద్దు లో నా కథ « sowmyawrites ….
చాలా బాగుంది కథ…
షార్ట్ అండ్ స్వీట్.
బాగుందండి.ఇలాంటి కధలు మీరే రాయగలరేమో?
బాగుంది.
ఏమి కథ లేకుండా,కేవలం కథనం తో వ్రాయడంలో మీకు మరెవరు సాటి లేరు !
కథనం పర్వాలేదు. డైజస్ట్ ని జీర్ణించుకోలేకపోవడం లాంటి వాక్యాలు బావున్నాయి. ఐతే కథలో వ్యక్తపరుద్దామనుకున్న విషయానికి సరిపడా సంఘటనలు లేకపోవడం ప్రధాన లోపంగా అనిపించింది. పాత్రల చిత్రణ, సన్నివేశాలు నడిపించడం మీద దృష్టి కేంద్రీకరించండి.
కథ పూర్తిగా స్వగతం లో ఉండటం మంచి టెక్నిక్కే కానీ రాసింది ఒకటికి రెండు సార్లు చదువుకుని మనకి నచ్చేలా తీర్చిదిద్దుకుని అప్పుడు పోస్టు చేస్తే ఇంకా బాగా వస్తుంది.
సెక్యూరిటాసురుడు – బాగుంది 🙂
ఈ ప్రయోగాలు అసహజంగా ఉన్నాయి:- “ఏడుపుగొట్టు పెస్సిమిస్ట్ ” , “సోదిమొహం వెధవా!”
చాణుక్య గారు మీరు పొగిడినట్టా తిట్టినట్టా? 🙂
సౌమ్య గారు మీరు కధ మీద దృష్టి పెడితే బాగుండును
కేవలం కథనం తోనే కధను మొత్తం ఆఖరివరకు లాగించడం,అదీ మీ లాంటి వారి నుంచీ(మీరు చక్కగా రాయగలరని నా అభిప్రాయం) చూసి నిరాశకు గురి అయ్యాను
నిత్య జీవితం లో జరిగే ప్రతి సంఘటనను చక్కని కధగా మలచవచ్చు
దానికి చక్కని క కథనం కావాలి
కాని కధ ప్రాణం లాంటిది
అది లేక పోతే శరీరం వృధా
గమనించగలరు
సౌమ్య గారూ, ఉబుసుపోకుండా ఉన్నప్పుడు మనల్ని వేధించే ఆలోచనా ప్రవాహాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచారు.
– నల్లమోతు శ్రీధర్
your story is very nice .
namaskaram soumya garu,
mee katha(chini chini badhalu)chadivanu.
kastapadi(intha manchi katha rayadaniki kasta pade vuntaru)chala baga rasaru.
nenu mimmalni abhinandisthunnanu, kani kathanam sariga ledu ani naa abhiprayam.
ee sari rasinappudu okatiki rendusarlu chaduvukunte meeku oka anchana vastundi.
ante meeru aa kathani inka baga rayadaniki veelu vuntundi.
istam leni vakhyalu, avasaram leni sambhashanalu kani evaina vunte meeru vatini tholaginchi inka baga rayadaniki avakasham vuntundi.
katha mathram chala sahajanga vundi andi, mana chuttu jarige vishayalani chala baga cheparu, meeru inka manchi kathalani rayalani aashisthunna.
soumya garu namaskaram…
mee katha lo yeedo lopenchinattlu anipestundi…
ee kadanu chaduvutunte meeru maa college lo chaduvutunaaremo ani anukunaanu. maa grandaalayaniki chaala daggaraga vundi mee varnana.
chaala baagundi
Sowmya,
Me katha chala bavundi.
ee katha lo feelings anni chala natural ga unnayi.
emo andaru artham ayyindi antunnaru naaku peddaga kadha vunnatlu anipinchaledu mari……..edo saaga deesinatlu alane ekkuvaga introduction anipinchindi……….