సెప్టెంబరు వికీపీడియా విశేషాలు

రవి వైజాసత్య
[రవి వైజాసత్య]

తెవికీలో నిర్వహిస్తున్న ప్రాజెక్టులు మరియు నిర్వహణా దళాలు

తెలుగు వికీపీడియాలో వివిధ విషయాలకు చెందిన వ్యాసాలను అభివృద్ధి చేసి, విస్తృతపరచటానికి, ఆ వ్యాసాలను నిర్వహించడానికీ కొన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రాజెక్టులలో, ఒక విషయానికి చెందిన ఉన్న వ్యాసాలన్నీ ఒక ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. (ఉదాహరణకు, రామాయణము, గరుత్మంతుడు, క్షీరసాగర మథనం, ఆది శంకరాచార్యుడు, తైత్తిరీయోపనిషత్తు వ్యాసాలు హిందూమత ప్రాజెక్టుకు చెందుతాయి)

ఆయా ప్రాజెక్టులలో ఆసక్తి ఉన్న సభ్యులు ప్రాజెక్టు పేజీలో తమ పేరు నమోదు చేసుకొని ప్రాజెక్టు పరిధిలోని వ్యాసాలను అభివృద్ధి చేస్తుంటారు. ఈసారి పొద్దు వికీ శీర్షికలో ప్రస్తుతము తెలుగు వికీపీడియాలో క్రియాశీలకముగా నడుస్తున్న కొన్ని ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు బాటులు రాసి, మూసలు తయారుచేసి, వ్యాసాల నాణ్యతను బేరీజు వేసే వివిధ సాధనాలను తయారు చేసి పనులను సులభతరం చేసిన ప్రదీపుకు ప్రత్యేకంగా నెనర్లు

ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు ప్రాజెక్టు

తెలుగు వికీపీడియాలో ఇప్పటివరకు చేపట్టిన ప్రాజెక్టులలో ఇదే పెద్దది. ఈ ప్రాజెక్టులో అనేకమంది వికీజనులు వందల కొలది గంటల సమయాన్ని వెచ్చించారు.

ధరితిలోని ప్రతి తెలుగు వాడ గురించి
చరితలోని ప్రతి తెలుగు వాడి గురించి
ధరణిపైనున్న ప్రతి పశుపక్షి వృక్షముల గురించి
మరుగుకాని మేటి తెలుగు కథల గురించీ
చరణమైనా వ్రాద్దాం తెలుగు వికీ పై
కరములు కలపుదాం, కల నిజం చేద్దాం.

అంటూ చావా కిరణ్ స్వప్నంగా మొదలైన ఈ ప్రాజెక్టు, వీవెన్ సూచనతో కార్యరూపం దాల్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 25000 పైగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్లోని పంచాయితీ గ్రామాలన్నింటికీ మొలకలు వేసాం. త్వరలోనే వీటన్నింటికీ గణాంకాలు (జనాభా, వైశాల్యం, ఆక్షరాస్యత వగైరా వివరాలు) చేర్చబోతున్నాం. అయితే వాటన్నింటికంటే ముఖ్యమైనది ప్రతి గ్రామం గురించి సవివరంగా రాయటం. ఇలాంటి సమాచారం ఇప్పటివరకూ ఎక్కడా లభ్యమవకపోవటం వల్ల కష్టతరమవుతుంది. ఫ్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల గురించి సమాచారం పొందుపరిస్తే తెలుగు వికీని విన్నూత విజ్ఞానసర్వస్వముగా తీర్చిదిద్దవచ్చు. మన గ్రామం గురించి మనకంటే మిన్నగా రాయగలవారెవ్వరు?

తెలుగు సినిమాల ప్రాజెక్టు

ఈ ప్రాజెక్టులో భాగంగా 3600 తెలుగు సినిమాల సమాచారాన్ని పొందుపరచాం. ఈ సినిమా వ్యాసాలన్నీ వివిధ స్థాయిలలో, చాలా చక్కని వ్యాసాల దగ్గరి నుండి ఒకటి రెండు లైన్లతో ఉన్న మొలకల దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో సినిమాలతో పాటు అనేక సినీనటులు, నటీమణులు, దర్శకులు, సినీగీతరచయితలపై వ్యాసాలను సమకూర్చటానికి నవీన్, శ్రీనివాసరాజు, కాసుబాబు, కామేష్ గార్లు విశేష కృషి చేశారు. మీరేదైనా సినిమా చూసినప్పుడు ఒక పది నిమిషాలు సమయం తీసుకొని ఆ సినిమా సమాచారాన్ని తెలుగు వికీలో చేర్చగలిగితే ఇంటర్నెట్టు మూవీ డేటాబేసు కంటే ధీటైన తెలుగు సినిమాల సమాచార గనిగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దవచ్చు.

ప్రపంచదేశాల ప్రాజెక్టు

ప్రపంచదేశాల ప్రాజెక్టులో భాగంగా ప్రపంచములోని అన్ని దేశాలకు సంబంధించిన వ్యాసాలు రాయటమే కాకుండా ఈ ప్రాజెక్టు రూపశిల్పి కాసుబాబు గారు అనేక ప్రపంచ దేశాలకు చెందిన జాబితాలను తయారు చేస్తున్నారు. ఈ జాబితాలు ఎలాంటివంటే ప్రపంచ దేశాలు జనాభా వారీగా, వైశాల్యము వారీగా అమర్చిన సాధారణ జాబితాలనుండి తలసరి కాఫీ, టీల వినియోగము, కార్బన్ డై ఆక్సైడ్ విసర్జన వారీగా ప్రపంచదేశాల జాబితాలు అనేకం ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల ప్రాజెక్టు

ఈ ప్రాజెక్టులో తెలుగుగంగ, నాగార్జున సాగర్, పోతిరెడ్డిపాడు. శ్రీశైలం వగైరా నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు, ఆంధ్ర ప్రదేశ్లోని నదులు, చెరువుల గురించిన సమాచారమున్నది. ప్రత్యేకంగా ఇందులోని నీటిపారుదల ప్రాజెక్టుల వ్యాసాలను ఈ ప్రాజెక్టును ప్రారంభించిన చదువరి గారు ఏ పత్రికలకీ తీసిపోని విధంగా రాశారు.

జీవశాస్త్రపు ప్రాజెక్టు.

తెలుగు వికీ క్రియాశీలక సభ్యులలో ఒకరైన డా.రాజశేఖర్ గారు ఈ ప్రాజెక్టులో భాగంగా అతి స్వల్పకాలములోని చాలా జీవశాస్త్ర వ్యాసాలు అందించారు. ఇటీవల తెలుగు వికీపీడియాలో అనేకమంది వైద్యులు సభ్యులుగా చేరటంతో అనేక వైద్యశాస్త్ర సంబంధ వ్యాసాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి.

పుస్తకాల ప్రాజెక్టు.

ఇటీవల ప్రారంభమైన ఈ ప్రాజెక్టు సాహిత్య సంబంధమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భాగంగా పుస్తకాలు, రచనలకు సంబంధించిన సమాచారము పొందుపరుస్తున్నారు. దీని పరిధి, ప్రపంచములోని అన్ని ప్రముఖ పుస్తకాలైనా ప్రస్తుతము తెలుగు రచనలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

హిందూమత ప్రాజెక్టు

మాటలబాబు, విశ్వనాథ్, కంపశాస్త్రి గార్లు ఇప్పటికే అనేక హిందూమత సబంధ వ్యాసాలు అభివృద్ధి చేయటంతో, వీటిని మరింత వృద్ధి చేయటానికి ఒక ప్రాజెక్టుగా రూపొందించాము. దీనికి ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ఒక చిన్న అనుబంధ ప్రాజెక్టు కూడా ఉన్నది.

ఇవేకాక ప్రస్తుతం కొంచెం స్తబ్దుగా ఉన్న, ఆంధ్ర ప్రదేశ్ మండలాలు, భారతదేశ చరిత్ర, కంప్యూటర్ విజ్ఞానము, లినక్సు ప్రాజెక్టులు కూడా తెలుగు వికీలో ఉన్నాయి.

వీటన్నింటిలో మీ ఆసక్తికి తగిన ప్రాజెక్టు కనిపించలేదా? అయితే మీరే ఒక ప్రాజెక్టును ప్రతిపాదించండి. అలాంటి ప్రతిపాదనలను సమాలోచన చేసి ప్రారంభిస్తాము.

వికీ వ్యాసాల నాణ్యతను పెంచటానికి తెలుగు వికీలో అచ్చుతప్పులు దిద్దటానికి, భాషను మెరుగుపరచటానికి అక్షరదోష నిర్మూలన దళం మరియు శుద్ధి దళం అనే రెండు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేయటం జరిగింది. అక్షరదోష నిర్మూలన దళం సభ్యులు వికీవ్యాసాలలోని అక్షరదోషాలను దిద్దుతుంటారు. శుద్ధి దళం సభ్యులు వ్యాసాలను వికీకి అనుగుణంగా మార్చి, లింకులు చేర్చి, వ్యాసాన్ని వర్గీకరించి, మెరుగుపరుస్తుంటారు. ప్రాజెక్టులతో పాటు, ఈ దళాలలో కూడా ఆసక్తి ఉన్నవారెవరైనా చేరి తెలుగు వికీకి తగు సహాయం చెయ్యవచ్చు.

మీరింత వరకూ ఈ వారపు వ్యాసాలను చూచి ఉండకపోతే, గత నెలలో ఈ వారపు వ్యాసాలుగా ప్రదర్శించబడినవి ఇవి: కె.వి.రెడ్డి, నర్తనశాల, రుక్మిణీదేవి అరండేల్, ఖర్జూరం.

నా సిఫారుసులు

టెన్నిసన్, ఆళ్వారులు, వైరస్, ప్రోగ్రామింగు భాష, తట్టు, కోనేరు రంగారావు కమిటీ, మైదాన హాకీ

రవి వైజాసత్య(http://saintpal.freehostia.com/)

రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.

This entry was posted in జాలవీక్షణం and tagged . Bookmark the permalink.

7 Responses to సెప్టెంబరు వికీపీడియా విశేషాలు

  1. నవీన్, శ్రీనివాసరాజు, కాసుబాబు, కామేష్, డా.రాజశేఖర్, విశ్వనాథ్, కంపశాస్త్రి గార్లకు అభినందనలు. చావా, వీవెన్ లకు జేజేలు. ప్రదీపుకు ప్రత్యేక అభినందనలు.

    “తెవికీ వాల్మీకి” రవికి ఏమీ లేదు. 🙂

  2. శేషాచలపతి says:

    మంచి వ్యాసం రాసారు వైజాసత్యా! అక్కడ కృషి చేస్తున్నవారందరికీ అభినందనలు. మీ వ్యాసాన్ని మెచ్చుకునే నాబోటి వాళ్ళంతా మెప్పుదలతో చాలించకుండా, వికీపీడియాలో తమ వంతు రచనలు చేస్తే ఈ వ్యాస ఆశయం నెరవేరినట్టేనని తెలుసు. నేనూ ఆ పనిలో ఉంటాను. నెనరులు.

  3. Jijnasi says:

    ఇంతకుముందు విక్షనరీ, వికీసోర్స్‌ల గురించి కొన్ని వాఖ్యాలు అయినా వ్రాసేవారు. ఈసారి పూర్తిగా వికీపీడియామీదే దృష్టి పెట్టినట్లున్నారు!

    వికీపీడియా అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతుంది. అందుకు తోడ్పడుతున్న అందరూ అభినందన పాత్రులే. నేను కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

    కానీ నేను ఈ శీర్షికలో అభివృద్ధి చెందవలసిన “వికీ పాఠ్యపుస్తకములు” మరియు “విఖీ వ్యాఖ్యలు”కు సంభందించిన విషయములను కూడా చేరిస్తే బాగుంటుంది అని భావిస్తున్నాను.

    వికీపీడియా గురించి మీడియాలో వచ్చింది (మున్ముందు కూడా అవకాశముంది). కానీ “విక్షనరీ”, “వికీ మూలములు”, వికీ పాఠ్యపుస్తకములు” మరియు “విఖీ వ్యాఖ్యల”కు ఆ అవకాశము లేదు. వీటిని కూడా ఆ స్థాయికి తీసుకురావాలి అన్నది నా ఆకాంక్ష.

    “విక్షనరీ” మరియు “వికీ మూలములు” కొంతవరకూ పరవాలేదు. “వికీ పాఠ్యపుస్తకాలు” మరియు “వికీ వ్యాఖ్యలు”లో సభ్యుల చేరిక మరియు కృషి చాలా అవసరమున్నది. అది అందరికీ తెలియజేయడానికి ఇలాంటి శీర్షికలే వేదికలని నా విశ్వాసం.
    Continued….

  4. Jijnasi says:

    వైజాసత్య గారు వికీలో నెల వారీగా విశేషాలను ఇక్కడ పొందుపరుస్తున్నారు. పాఠకులు మరియు వికీ సభ్యులు ఇక్కడ అభిప్రాయములతో పాటు “వికీపీడియా”, “విక్షనరీ”, “వికీ మూలములు”, “వికీ పాఠ్యపుస్తకములు” మరియు “వికీ వ్యాఖ్యలు” లో ఎందులోనైనా విస్తరించవలసిన వ్యాసాలు లేదా వర్గాలను గురించి తెలియచేస్తే (సంబంధిత “వికీ ….” లోనూ సూచించవచ్చు) ఈ శీర్షికకు పూర్తి ప్రయోజనము చేకూరుతుంది అన్నది నా అభిప్రాయము.

  5. @రానారె: కనీసం విశేషంగా కృషిచేసిన వాళ్ళ పేర్లైనా పేర్కొనకపోతే, ఇదేదో నేను పొడిచేశానని అనుకునే ప్రమాదముందని వికీయోధులను పరిచయం చేయటం జరిగింది. అప్పుడప్పుడు కత్తెర్లు వేస్తుండటంతప్ప నేను ఒరగబెట్టిందేమీ లేదు. అనుకుంటూనే త్రివిక్రమున్ని మర్చిపోయా. గత సంచికలో పరిచయము చేసిన సంఖ్యానుగుణవ్యాసాల సృష్టికర్త త్రివిక్రముడే!! ఇంకా ఎందరో వికీవీరులు అందరికీ వందనాలు.
    @శేషాచలపతి గారూ: మీ ప్రోత్సాహానికి నెనర్లు.
    @జిజ్ఞాసి గారూ: చాలా మంచి సూచన. నిజానికి విక్షనరీ, వికీసోర్స్ వికీపీడీయా కంటే ముందే పరిగెడుతున్నాయి. వచ్చే సంచికలో తప్పకుండా విక్షనరీ, వీకీసోర్స్ తదితర ప్రాజెక్టుల పరిచయానికి పెద్దపీట వేస్తాను.

  6. chavakiran says:

    నేను ఆ నాలుగు ముక్కలు వ్రాయకముందే వికీలో అన్ని గ్రామాలకు పేజీలు అనే ఆలోచన అక్కడే ఉనన్ది, దాన్నుండి ఇన్స్పైర్ అయ్యే నేను వ్రాసినాను. కాబట్టి అది నా స్వప్నం కాదు 🙂

  7. cbrao says:

    తెలుగు వికీపీడియ కు రాసేవారంతా, నిస్వార్థ, సాహితీ సేవకులు. వందనాలు.

Comments are closed.