[నెల్లుట్ల వేణుగోపాలరావు]
తెలుగు సమాజానికీ సాహిత్యానికీ నెజ్జనులు చేయదగ్గ సేవలు
సృష్టికి ప్రతిసృష్టి లాంటి అంతర్జాల మొకటి తయారవుతున్నదని మొదటిసారి విని ఇంకా నిండా పది సంవత్సరాలు కాలేదు. సత్యం కంప్యూటర్స్ లో మిత్రులు వ్యాసమూర్తి గారు ఇంటర్నెట్ అంటే ఏమిటి, యాహూ మెయిల్ అంటే ఏమిటి అని కొందరు సత్యం ఉద్యోగులకు చెప్పిన పాఠాన్ని అప్పటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటు చూస్తున్న ఎకనమిక్ టైమ్స్ విలేకరిగా నేను కూడ విన్న అనుభవం నిన్నమొన్నటిదిలానే ఉంది. ఇదంతా మయసభలాగ ఉందే అని అనుకున్న ఆ అనుభవం నుంచి పది సంవత్సరాలు తిరగకుండానే ఆ మయసభ మహాసభ లాగ మారిపోయినట్టు కనబడుతున్నది. ఈ అంతర్జాలం ఎందరికందుతుందిలే అనుకుంటే ఆ లోలోపలి వలలో ఒక్కొక్కరమూ అందరమూ చిక్కుతున్నట్టే అనిపిస్తున్నది. ఎంత అసంబద్ధ పదబంధమది అని వేళాకోళంచేసిన వర్చువల్ రియాలిటీ కనీసం కొందరి జీవితాలలోనైనా వాస్తవికతగానే మారినట్టున్నది.
మనమధ్యనుంచే, మనకళ్లముందే పుట్టిన నెట్ సమాజం ఒకటి ఊహాతీతమైన వేగంతో, కళ్లు మిరుమిట్లు గొలిపేలా విస్తరిస్తున్నది. కొన్ని వేలమందో, లక్షలమందో తెలుగు నెజ్జనులు ఈ కొత్త సమాజంలోనే తమ జీవితం గడుపుతున్నారు. ఈ నవసమాజంలోనే తమ మానవసంబంధాలన్నిటినీ పెంచుకుంటున్నారు. పాత మానవప్రపంచానికీ కొత్త నెట్ ప్రపంచానికీ పోలికలూ ఉన్నాయి, చెప్పుకోదగిన తేడాలూ ఉన్నాయి. అసలు ఈ రెండు ప్రపంచాలూ ఇప్పటికైతే ఒకదానితో ఒకటి కలిసే ఉన్నాయి కూడ. ఒకదానితో ఒకటి కొంతవరకు అనుసంధానం లో ఉన్న వృత్తాలలాగ ఈ ప్రపంచాలలో కలిసిన భాగమూ ఉంది, కలియని భాగమూ ఉంది. ఈ రెండు వృత్తాలూ ఒకదానిలో ఒకటి కలిసిపోయి అద్వైతం సిద్ధించడం గాని, ఒకదానినుంచి ఒకటి విడిపోయి స్వతంత్ర అస్తిత్వం సంతరించుకోవడం గాని సమీపభవిష్యత్తులో సాధ్యం కాకపోవచ్చు కూడ.
పాశ్చాత్య దేశాలలో ఏమోగాని, ఇంకా సగం జనాభా నిరక్షరాస్యతలోనూ, సగం కన్న ఎక్కువే పేదరికంలోనూ మునిగిఉన్న మన సమాజంలో నెట్ ప్రపంచం ఆ మిగిలిన సగానికయినా చేరడం ఎప్పటికి సాధ్యమవుతుందో తెలియదు. మన వృద్ధిరేటు గణాంకాలూ, తలసరి ఆదాయం పెరిగిందనే ప్రభుత్వాల సగటు భాగహారాలూ, రోజురోజుకూ పెరిగిపోతున్న టెలిడెన్సిటీ, తలసరి కంప్యూటర్ వినియోగం లెక్కలూ ఏమి చెప్పినప్పటికీ మనకు తెలిసిన నెట్ ప్రపంచం, మనకు తెలియని మానవప్రపంచం కన్న చిన్నదేనని ఒప్పుకోక తప్పదు. తెలుగు సమాజం విషయానికే వస్తే ఎనిమిదికోట్ల తెలుగువారిలో నెట్ ప్రపంచంతో పరిచయం ఉన్నవారు బహుశా పదిలక్షలకు మించుతారనుకోను. ఆ పదిలక్షల నెట్ ప్రపంచ వాసులలో క్రియాశీలంగా ఇతరులతో సంబంధాలు పెట్టుకుని తమ ఆలోచనలు పంచుకుంటున్న నెజ్జనుల సంఖ్య ఇంకా తక్కువ కావచ్చును. అంటే మహాజనవ్యవస్థలో నెజ్జనవ్యవస్థ ఇంకా ఒక్కశాతానికయినా చేరిందా అనేది అనుమానమే.
అయితే ఈ జనాభాశాతాన్ని బట్టి నెజ్జనుల ప్రాధాన్యతను తక్కువగా అంచనా కట్టడానికి వీలులేదు. వారి జనాభా శాతం ఎంత తక్కువైనప్పటికీ వారికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల, ఇతరులతో అత్యంత వేగంగా సంభాషించడానికి ఆ సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్న అపారమైన శక్తిసామర్థ్యాలవల్ల, వారు దేశదేశాంతరాలలో పొందుతున్న విలువైన, అరుదైన అనుభవాలవల్ల, వారికి మాత్రమే తెలిసివస్తున్న అవగాహనలవల్ల, వారికి ప్రస్తుత సమాజంలో ఉన్న గౌరవ ప్రతిపత్తుల వల్ల వారి ఆలోచనలకూ మాటలకూ చేతలకూ చాల విలువ ఉంటుంది.
మరి మన నెజ్జనులు ఈ వాతావరణంలో చేయగల పనులేమిటి? తమ చుట్టూ ఉన్న, తాము పుట్టి పెరిగిన, తమ తల్లిదండ్రులూ రక్తబంధువులూ, బాల్యం గడిచిన పుట్టినూళ్ళూ, చెరగని జ్ఞాపకాల చిన్ననాటి సావాసగాళ్లూ, తమ బాల్య కౌమార తొలి యవ్వన దశల్లో వాళ్లు భాగస్తులైన విలువలూ సామూహిక ఆలోచనలూ ఆచరణలూ ఉన్న సమాజానికి మన నెజ్జనులు ఏమయినా చేయగలరా? భాషద్వారానూ, రక్తపాశంద్వారానూ తమను కట్టిపడేస్తున్న సమాజం కొరకు నెజ్జనులు ఏమయినా చేయగలరా?
సమాజం ఒక పెద్ద నిరక్షరాస్య, నిరుద్యోగ, దారిద్ర్య, అసమాన, దౌర్జన్యపూరిత, దగాకోరు సముద్రంగా ఉన్నప్పుడు ఈ నెట్ ప్రపంచం అక్కడక్కడా మెరుస్తున్న ఒంటరి జ్ఞాన ద్వీపంగా, ఉన్నతాదాయ వర్గ ద్వీపంగా, పాలూ తేనే నిండిన ఆనంద జీవనద్వీపంగా వెలుగుతున్నది. అలా వెలుగుతున్న మన నెజ్జన బృందం, కింద విస్తరిస్తున్న నీడను చూడడం, ఆ వెలుగునీడల సంబంధాన్ని చూడడం, తమకు వీలయిన పరిధిలో ఆ నీడలను పోగొట్టే పనిలో పాలు పంచుకోవడం నైతిక బాధ్యత అనుకుంటాను.
నెజ్జన బృందం తమకు తెలిసో తెలియకో అరుదైన జీవన అవకాశాల, సమ్మోహక సాంకేతిక పరిజ్ఞానాల, మహా అనుభవాల పరిధిలోకి ప్రవేశించింది. ఆ జీవనం ఇచ్చే అనూహ్య అవకాశాల గురించి, ఆ సాంకేతిక పరిజ్ఞానం మనిషికి తొడిగే రెక్కల గురించి, ఆ మహా అనుభవాల నుంచి ఒక మామూలు మనిషి నేర్చుకోగల పాఠాల గురించి తోటి వారందరితోనూ పంచుకోవడం నెజ్జనుల బాధ్యత అని నేననుకుంటాను. నెజ్జనులు ఒక కొత్త సాంస్కృతిక వాతావరణం లోకి ప్రవేశించారు. ఆ వాతావరణానికి మైమరచి దాన్ని తలకెత్తుకోవడమూ వద్దు, దాన్ని తెలుసుకోకుండానే తిరస్కరించడమూ వద్దు. మొదట అది ఏమిటో అర్థం చేసుకోవలసి ఉంది. తాము అర్థం చేసుకున్న పద్ధతి సరయినదా కాదా నలుగురితో సంభాషణలో తేల్చుకోవలసి ఉంది. అటువంటి సమాచారపూర్వక సంభాషణకు నెట్ ఒక మంచి వాహిక అవుతుంది. ఆ వాహికవల్లనే ఈ కొత్త సమాజంలో ప్రవేశించిన నెజ్జనులు తప్పనిసరిగా అటువంటి సంభాషణ జరపవలసి ఉంటుంది. ఇప్పటికే ఏర్పడిన అనేక బృందాలలో, సొంత రచనావేదికలలో మన నెజ్జనులు పెద్దఎత్తున సంభాషించడం చూస్తూనే ఉన్నాం. కాని ఆ సంభాషణలలో ఎంతభాగం సమాజానికి ఉపయోగకరమైన పద్ధతిలో నడుస్తున్నదో మనం ఒకసారి పునరాలోచించుకోవలసే ఉన్నది.
ఇక్కడ అప్రస్తుతమనుకోకపోతే ఆధునిక సాహిత్యంలో జరిగిన పరిణామాలతో మన నెట్ ప్రపంచ పరిణామాలను పోల్చడానికి సాహసిస్తాను. తెలుగు ఆధునిక సాహిత్యంలోకి కొత్తవర్గాలు, కొత్త కులాలు, కొత్త సమూహాలు ప్రవేశించినకొద్దీ ఆ సాహిత్య భాషలో, వస్తువులలో, కథన పద్ధతులలో, శైలీశిల్పాలలో, పదచిత్రాలలో, పాత్రలలో, చివరికి పాత్రల హావభావాలలో కొత్త అనుభవాలు, కొత్త సమాచారం, కొత్త దృష్టికోణాలు ప్రవేశించాయి. అంతకుముందు తెలుగుభాషాసాహిత్యాలకు, సంస్కృతికి తెలిసిఉండని కొత్త జీవన పార్శ్వాలు తెలిసి వచ్చాయి. అంటే కనుక్కున్న ఒక్కొక్క ద్వీపమూ, ఒక్కొక్క ఖండమూ మన ఈ ప్రపంచం ఎంత విశాలమైనదో మనకు తెలియజెప్పి మన అనుభవాన్నీ, దృక్పథాన్నీ సుసంపన్నమూ విశాలమూ చేసింది. ఆ వరుసలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతులు కనుక్కున్న కొత్త ఖండం నెట్ ప్రపంచం. ఈ అన్వేషణను సాగించి విజయం సాధించిన నెజ్జనులు ఈ ఖండం గురించి రాయడం ద్వారా మన భాషా సాహిత్యాలకు కొత్త మేలు జరుగుతుంది. ఒక కొత్త సాంస్కృతిక బృందంతో సంపర్కంలోకి వచ్చిన క్రమంలో తమ కొత్త అనుభవాలు, కొత్త ఆలోచనలు ఏమిటి, అవి తమ పాత ఆలోచనల కన్న ఎట్లా భిన్నమైనవి, వాటిమధ్య సామ్యాలేమిటి, భేదాలేమిటి, ఒక స్థానిక సంఘటననో పరిణామాన్నో తమకు తెలిసిన అంతర్జాతీయ చారిత్రక నేపథ్యంలో ఎట్లా అర్థం చేసుకోవచ్చును వంటి అంశాలను చర్చకుపెట్టడం ద్వారా నెజ్జనులు తెలుగు సామాజిక సంస్కృతిని తప్పనిసరిగా ఉన్నతీకరించగలరు.
తమకు తోచిన భావాలను వ్యక్తీకరించడం, దాన్ని నలుగురిలో చర్చకు పెట్టడం నెజ్జనులకు చాల సులభం. బహుశా శిలా, తామ్రశాసనాలమీద తొలి అక్షరాలు చెక్కిన నాటినుంచీ, తాళపత్రాలమీద గంటం కదలాడినప్పటినుంచీ, కాగితాలమీద కలాలతో రాసినప్పటినుంచీ, తాము రాసిన అక్షరాలను అచ్చులో చూసుకున్ననాటివరకూ రచయితలెవ్వరికీ దొరకని అవకాశం నెజ్జనులకు దొరుకుతున్నది. ఆ రచయితలందరికీ రచన సులభమే అయిందేమో గాని, ఆ రచనను పాఠకులకు చేరవేయడం నెజ్జనులకు అయినంత సులభం కాలేదు. రచన చేయడానికి, పాఠకులకు చేరవేయడానికి మధ్య గతంలో ఉండిన అంతరం సమయంలోనూ, వాహికలలోనూ చాల పెద్దది. ఆ అంతరం నెజ్జనులకు లేకుండాపోయింది. లేదా గణనీయంగా తగ్గింది. ఈ సద్యోరచన, సద్యోముద్రణ, సద్యోపఠనం మంచిదేనా, దీనివల్ల సాహిత్య ప్రమాణాలు పడిపోవా అని ప్రశ్నించేవారుండవచ్చుగాని, నావరకు నేను ఇదంతా గొప్ప సృజన వికాసానికి దారితీస్తుందని, మన భావనాప్రపంచంలోకి ఒక్కసారిగా కొన్నివేల, లక్షల కొత్త మెదళ్ల, కలాల ప్రవేశం జరుగుతుందని అనుకుంటున్నాను. మౌలికంగా ప్రతిమేధా సృజనాత్మకమైనదే, ప్రతిమేధా రచన చేయగలదు అనే విశ్వాసానికి నెట్ ప్రపంచం రుజువులు చూపుతున్నదనుకుంటాను. ఈ నెట్ ప్రపంచాన్ని వాడుకుని తమ రచనాపాటవాన్ని నిరూపిస్తున్న నెజ్జనులు ఆ రచనాశక్తిని ఉపయోగకరంగా, సమాజ హితానికి వాడాలని నేననుకుంటాను.
ఇదంతా సాహిత్యానికీ, సంస్కృతికీ, భాషకూ సంబంధించిన వ్యవహారమనీ, నెజ్జనులలో చాలమంది అవేవీ పట్టించుకోని, తెలియని ఉత్తి సాంకేతిక నిపుణులనీ అనుకుంటే, ఉత్తి సాంకేతిక నిపుణులయిన నెజ్జనులు కూడ తెలుగు సమాజానికీ, సాహిత్యానికీ, సంస్కృతికీ అందించదగిన కానుకలున్నాయి. అసలు భాషా సాహిత్య సంస్కృతులు తమకు సంబంధంలేనివారెవరూ ఉండరని వాదించవచ్చుగాని, ఇప్పటికి ఆవాదనను పక్కన పెడతాను. అట్లాగే ఇవాళ చాలమంది నెజ్జనులు గుంపు సంభాషణలలోను, తమ సొంత బ్లాగులలోను రాస్తున్న విషయాలు చూస్తుంటే వాళ్లు రచయితలు కారని, వారికి సాహిత్యంతో సంబంధలేదని నేనయితే అంగీకరించలేను. వాళ్ల రచనా శక్తిలో, అభివ్యక్తిలో ఇంకా మెరుగుపరచుకోవలసినది చాల ఉండవచ్చును. కొండొకచో ఆ అభివ్యక్తిలో అనుచితమయిన వ్యక్తీకరణలూ, అసంపూర్ణ భావాలూ కూడ వస్తూ ఉండవచ్చును. కాని ఆ అభ్యంతరాలను మించి చూడవలసిన విషయమేమంటే, ఇంతకుముందువరకూ రచన తమకు సంబంధలేని వ్యవహారమని అనుకున్న వర్గాల నుంచి హఠాత్తుగా రచయితలు పుట్టుకొస్తున్నారు. అవి పూర్తి రచనలు కాకపోవచ్చును, కాని రచనా ప్రయత్నాలు. తమ భావప్రకటనాశక్తిని నిరూపించుకునే ప్రయత్నాలు. తమ దగ్గర తోటి మనుషులతో పంచుకోవలసినది ఏదో ఉందని గుర్తించిన ఉదాహరణలు.
తెలుగు సమాజానికీ, సాహిత్యానికి నెజ్జనులకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఏమి చేయవచ్చునో ఉదాహరణ ప్రాయమైన పనులు మాత్రం ప్రస్తావించి ముగిస్తాను. నా ఈ ప్రస్తావనలను సంపూర్ణంగా విస్తరించగల శక్తి నెజ్జనులకు ఉన్నదనే నా విశ్వాసం.
ప్రస్తుతం తెలుగు సమాజం అనేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నది. సమాజం తనముందు తాను పెట్టుకున్న ఆదర్శాలు — స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సహకారం, చట్టబద్ధమైన పాలన, మనిషి పట్ల గౌరవం, అభాగ్యులపట్ల దయ, సామాజిక ఘర్షణలకు అహింసాయుత పరిష్కారాలు – వంటి ఆదర్శాలు వెల్లివిరియ వలసి ఉండగా అంతకంతకూ ఆ ఆదర్శాలన్నీ లుప్తమయిపోతున్నాయి, రద్దయిపోతున్నాయి. ఆ అదర్శాలను స్వయంగా పాలకులే కాలరాస్తున్నారు. ఏ సామాజిక దురన్యాయాలకు వలసపాలకులను కారణంగా చూపి వారిని వెళ్లగొట్టే మహా ఉద్యమం నడిపి విజయం సాధించామనుకున్నామో, ఆ వలసపాలన ముగిసిపోయి ఆరు దశాబ్దాలు గడిచినా అవే దురన్యాయాలు, బహుశా అంతకన్న ఎక్కువ దురన్యాయాలు సాగుతున్నాయి. ఆ దురన్యాయాలను స్వయంగా పాలకులే సాగిస్తున్నారు. పాలకులు చూపిన దారే రాజమార్గమని ప్రజలు ఒంటరిగానూ, సామూహికంగానూ నమ్ముతున్నారు. ఈ సామాజిక అవ్యవస్థను ఏదో ఒక రూపంలో నెజ్జనుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడ అనుభవిస్తూనే ఉన్నారు. ఆ అనుభవాల గురించి నెజ్జనుల దృష్టికి వస్తూనే ఉన్నది. నెజ్జనులు తాము ఏమీ చేయలేమనే నిస్సహాయతలోకో, తాము ఇదంతా పట్టించుకోనక్కరలేదనే నిర్లిప్తతలోకో జారుకుంటున్నారు. కాని మిగిలిన సమాజం కన్నా మెరుగైన విజ్ఞానవివేకాలు, కొత్త అనుభవాలు, కొత్త జీవనశైలి తెలిసిన నెజ్జనులకు ఈ నిస్సహాయత, నిర్లిప్తత ఉచితమైనవి కావు. తెలుగు సమాజంలో ఏమి జరుగుతున్నదో నిత్యం తెలుసుకుంటూ, ఈ అవ్యవస్థపై తమ నిరసనను ప్రకటించడం, ఆ అవ్యవస్థకు ఎవరు కారణమో వారిని నిలదీయడం, సమాజంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వెలుగురేఖ కనబడితే దాన్ని ఎత్తిపట్టడం, మొత్తంమీద సమాజం తన ఆదర్శాల దిశగా నడిచేట్టుగా అంకుశంతో పొడవడం నెజ్జనులు తమ బాధ్యతగా స్వీకరించవలసిఉంది. ఇందులో వ్యక్తిగత స్థాయిలో తమ గ్రామాల విద్యా వైద్య అవకాశాల మెరుగుదల కొరకు పనిచేయడం దగ్గర ప్రారంభించి మొత్తంగా సామాజిక రుగ్మతలకు వైద్యం చేయగల పనులదాకా నెజ్జనులు తమ ఆలోచనలు, ఆచరణ పంచుకోవలసిన సందర్భాలెన్నో ఉన్నాయి.
తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకే చూస్తే నెజ్జనులు చేయగల పనులు ఎన్నో ఉన్నాయి. అత్యద్భుతమైన వారసత్వం ఉన్న మన సాహిత్యం ఇతర భాషా సమూహాలకు తెలియకపోవడం గురించి, కనీసం మన సాహిత్య వారసత్వం ఏమిటో మన వారికే తెలియకపోవడం గురించి ఎందరో ఎన్నో సార్లు వాపోవడం నెజ్జనులు వినే ఉంటారు. అట్లాగే గత శతాబ్దంలో అతి ఎక్కువగా ఇతరభాషలనుంచి మనభాషలోకి భాషాంతరీకరణం చేసుకున్న మనం, నెట్ ప్రపంచం ఏర్పడి సమాచారవనరులు ఎంతగానో పెరిగిన తర్వాత ఆదానప్రదానాలలో బాగా వెనుకబడుతున్నాం. బహుశా నెజ్జనులు ఈ పనులన్నీ ఇతరులకన్న మెరుగ్గా చేయగలరనుకుంటాను. వారు తెలుగు నుంచి ఇతర భాషలలోకి, ఇతరభాషలనుంచి తెలుగులోకి అనువాదం చేయగలరు. మన భాషలోని విలువైన రచనలను నెట్ ప్రపంచం మీదికి ఎక్కించి మరింత ఎక్కువమందికి పరిచయం చేయగలరు. ఆ రచనలను, అనువాదాలను గత రచయితలకన్న ఎక్కువ వేగంగా ఎక్కువమంది దృష్టికి తీసుకువచ్చి పరిపుష్టం చేయగలరు. అట్లాగే ఇప్పటివరకూ వెలువడిన తెలుగు సాహిత్యగ్రంథాలన్నిటినీ ప్రోది చేసుకున్న గరిష్ఠ ప్రమాణాల గ్రంథాలయం ఒకటి భౌతికంగా నిర్మాణం కాలేదు. కనీసం అటువంటి గ్రంథాలయాన్ని డిజిటల్ రూపంలోనైనా నిర్మించడం సాధ్యం అవుతుందేమో ప్రయత్నించవలసి ఉంది. ఆ పని నెజ్జనులే చేయగలరు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు కలిసి తెలుగులో బహుశా రెండు లక్షల పుస్తకాలు వెలువడి ఉంటాయి. ఒక ప్రణాళిక వేసుకుని, నెజ్జనులు స్వచ్ఛందంగా భాగస్వామ్యం తీసుకుని ఒక్కొక్కరూ తలాకొంత పని చేస్తూ పోయినా ఒకటి రెండు సంవత్సరాలలో ముఖ్యమైన పుస్తకాల డిజిటల్ గ్రంథాలయం అయినా తయారవుతుంది. తెలుగు భాషాసాహిత్యాల ఔన్నత్యాన్ని తమ పరిధిలోకి వచ్చిన వారందరికీ తెలియజేయడానికి ఇతరుల కన్న నెజ్జనులకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఆ అవకాశాలను ఎట్లా వాడుకోవచ్చునో మరిన్ని ఆలోచనలు చేసి ఆచరణ సాధ్యమైన ప్రణాళికలు తయారుచేయవలసిందిగా నెజ్జనులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
— ఎన్ వేణుగోపాల్ (kadalitaraga.wordpress.com)
——————————————————–
నెల్లుట్ల వేణుగోపాలరావు గారు ప్రసిద్ధ పాత్రికేయుడు. సమకాలీన సామాజిక రాజకీయ విషయాలపై విమర్శనాత్మక వ్యాసాలు రాస్తూ ఉంటారు. 1986 నుంచి 89 వరకు ఆంధ్ర పత్రికలో పని చేశారు. 1989-90 లలో సాహిత్య, కళా, సాంస్కృతిక అంశాలమీద వారంవారం “కడలి తరగ” పేరుతో శీర్షిక రాశారు. 2000 లో వాటిలో కొన్నిటిని ఒక పుస్తకంగా కూడా వేశారు. ప్రజాతంత్ర వారపత్రికలో నాలుగు సంవత్సరాలపాటు “ఆఖరిపేజీ” అనే రాజకీయ శీర్షికను నిర్వహించారు. కడలితరగ పేరుతో బ్లాగును నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో “వర్తమానం” శీర్షికన వ్యాసాలు రాస్తున్నారు. మేనేజింగ్ ఎడిటరుగా వీక్షణం అనే పక్ష పత్రికను నిర్వహిస్తున్నారు. గతంలో కొన్నాళ్ళు తెలుగుపీపుల్.కామ్ లో కూడా ఒక శీర్షికను నిర్వహించారు.
రచయిత చేసిన సూచనలు అన్నీ గమనించదగ్గవే. స్థూలంగా చూస్తే ఈ రోజుల్లో తెలుగులో బాగా రాయగలిగినవారంతా ఎక్కువగా టీవీ, సినీ పరిశ్రమలకు తరలి వెళిపోతున్నట్టుగా తోస్తోంది. ధనార్జన దృష్ట్యా ఇది అనివార్యమే కావచ్చు. తమ పేరు పడినా, పడకపోయినా ఇలాంటి రచయితల్లో సమర్థులైనవారు ఆర్థికంగా లాభం పొందుతారు. ఇక మిగిలినది అమెచూర్ రచయితలు. వీరిలో ప్రతిభావంతులైనవారు ఇతర వృత్తుల ద్వారా డబ్బు సంపాదించుకుంటూ, నిజాయితీగా రచనలు చేస్తున్నారు. వీరిలో కొందరు రచయితలుగా రాణిస్తున్నారు.
ఇంటర్నెట్ సంగతి ఇంకాస్త భిన్నం. సంపాదకత్వం ఉన్న సైట్లలో రాసేవారి రచనలు పరిశీలనకూ, ఎంపికకూ లోనైన తరవాతనే పోస్ట్ అవుతాయి. ఇవి ఎంత బావున్నప్పటికీ ఇవి రాసేవారికి డబ్బివ్వడమనేది జరగదు కనక రచయితలు కేవలం తమ ఆసక్తి వల్లనో, కొన్ని విషయాలు తెలియజెయ్యడం తమ బాధ్యత అనుకోవడం వల్లనో రాస్తూ ఉంటారు. బ్లాగ్ వగైరాలు ఎవరికి వారుగా రాసుకోవచ్చు. వీటి స్థాయిలో ఎన్నెన్నో తేడాలు కనిపిస్తాయి. అందుచేత మొత్తం మీద ఇంటర్నెట్ రచనల పోకడ అచ్చయే పత్రికలకు కాస్త భిన్నంగా ఉంటుంది. ఎటొచ్చీ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండేదే. అందులో సులువుగా లభించే మంచి విషయాలను చదివి వాటిని తెలుగువారితో పంచుకోవడం ఎవరైనా చెయ్యగలిగిన పనే.
ఇంతకూ సక్రమంగా వెలువడుతున్న వెబ్ పత్రికలు ప్రస్తుతం నాలుగైదే కనబడుతున్నాయి. వీటిని తెలుగు ప్రాంతాల్లో ఉన్నవారు ఎక్కువగా చదవరేమో గాని విదేశాల్లో ఉంటున్నవారికి ఇవి ముఖ్యంగానే అనిపిస్తాయి. ఇవి కాక ప్రముఖ దిన పత్రికలన్నీ నెట్ ఎడిషన్లు వెలువరిస్తున్నాయి గనక ఏ దేశంలో ఉన్నవారికైనా తెలుగు పత్రికలు చదవడం వీలవుతోంది. ఇదొక పెద్ద మార్పు.
వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. కాని భారీస్థాయి నిరక్షరాస్యతే మన జాతినీ భాషనీ నిలబెట్టే బలమై కూర్చుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పుడు చదువుకు ఉన్న ఏకైక అర్థం-ఇంగ్లీషు మీడియమ్. కాబట్తి చదువుకోనివాడే తెలుగువాడుగా మిగులుతున్నాడు. చదువుకున్నవాడు కాస్తా ఇంగ్లీషువాడుగా మారిపోతున్నాడు. తెలుగులో అక్షరాస్యులైనవాళ్ళూ, విద్యావంతులైనవాళ్ళూ నాలుగక్షరమ్ముక్కలు ఒంటబట్టేసరికి తమ పిల్లలు ఇంగ్లీషువాళ్ళైపోవాలని కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనకు చదువు వద్దేవద్దు భగవంతుడా అనాల్సి వస్తోంది.
ఏ దేశంలోనైనా అక్షరాస్యత ఆ జాతినీ భాషనీ బతికిస్తుంది. తెలుగుకు ఏ విధమైన అధికారహోదా గానీ లేని ఈ దేశంలో సంపూర్ణ అక్షరాస్యత తెలుగుని అంతిమంగా చంపేస్తుంది.
నిరక్షరాస్యతా ! జిందాబాద్.