[రవి వైజాసత్య]
గత నెలలో తెవికీ
తెలుగు వికీపీడియా మొదటిపేజీ రూపు కొంత ఆధునీకరించి కొత్త తరహా మార్గదర్శిని ప్రవేశపెట్టాము. మొదటిపేజీలోని యాదృచ్ఛిక పేజీని నొక్కి ఒక 20 సార్ల తర్వాతైనా కండపుష్టి ఉన్న వ్యాసం వస్తుందేమో అని ప్రార్థించే బదులు ఇప్పుడు ఈ మార్గదర్శినిలోని లింకులను పట్టుకొని విస్తృతమైన సమాచారం కల వివిధ వ్యాసాలలో విహరించవచ్చు.
కొత్తగా ఈ వారపు బొమ్మ అనే శీర్షిక ప్రారంభమయ్యింది. తెలుగు వికీలోని మంచి మంచి బొమ్మలను ఎంపిక చేసి ఈ శీర్షికలో ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్య మొదటి పేజీలలో వారం వారం ప్రదర్శిస్తున్న వ్యాసాలను బట్టి తెలుగు వికీపీడియా రాశిలోనే కాక వాసిలో కూడా మెరుగవుతున్నదని మీరు గమనించి ఉండవచ్చు. మీరింత వరకూ ఈ వారం వ్యాసాలను చూచి ఉండకపోతే.. గత నెలలో ఈ వారపు వ్యాసాలుగా ప్రదర్శించబడినవి ఇవి: మంగళగిరి, ఖొరాన్, తోలుబొమ్మలాట, భారత జాతీయపతాకం. వికీ వ్యాసాల నాణ్యతను పెంచటానికి తెలుగు వికీలో అచ్చుతప్పులు దిద్దటానికి, భాషను మెరుగుపరచటానికి ఒక ప్రత్యేక దళం ఏర్పాటు చేయటం జరిగింది. మీరూ ఒకటి, రెండు వ్యాసాలను ప్రూఫురీడు చేసి తోడ్పడండి. వ్యాసాలు చదివి తగు సూచనలు చేసినా మాకు ఆనందమే.
తెవికీలో జ్ఞాన గుళికలవేట
*మనదేశంలో కూడా ఒకప్పుడు పొద్దు పొదుపు సమయం (డే లైట్ సేవింగ్ టైం) ప్రవేశ పెట్టారంట! ఎందుకు? ఎప్పుడు?? (భారత ప్రామాణిక కాలమానం)
*భారతదేశ జాతీయ పతాక రూపకర్త పత్తి వెంకయ్య..కాదు కాదు పింగళి వెంకయ్య అంటారా మరీ ఈ పత్తి ఏమిటి ఆయనకా పేరు ఎందుకొచ్చిందంటారూ?
*జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం.. వాతాపి ఏంటో? ఎవరో చెప్పుకోండి చూద్దాం.
మీకు తెలుసా?
*భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్న గుహలు కర్నూలు జిల్లాలోని బెలూం గుహలు అని
* లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు కొంగర జగ్గయ్య అని
*చిరంజీవులు ఏడుగురు అని? (సప్త చిరంజీవులు)
*గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదని ఎందుకు చెబుతారో? (బొప్పాయి)
*మనం ఆవురావురుమని తినే ఇడ్లీని బహుశా ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకున్నామని?
బహు భాషా నిఘంటువు – విక్షనరీ
బహు భాషా నిఘంటువైన విక్షనరీలో ఇప్పుడు 20 వేలకు పైగా పదాలున్నాయి. పబ్లిక్ డొమెయిన్లో దొరుకుతున్న మిగిలిన నిఘంటువులను కూడా చేర్చే ప్రయత్నం త్వరలోనే చేస్తున్నాం. అప్పుడు మీరు బ్రౌణ్యంలో ఏమని ఉంది? వేమూరిగారు దీనికి తెలుగులో ఏం అర్ధం చెప్పారు, అసలీ పదం గురించి శంకరనారాయణ గారు ఏమంటారు అని నాలుగుచోట్ల తిరిగి వెతకాల్సిన పని లేకుండా, ఎంచక్కా తెలుగు విక్షనరీలో శోధిస్తే చాలు మీకు వివిధ నిఘంటువుల్లో ఆ పదానికి ఏ అర్ధాలు ఇచ్చారో సందర్భ సహితంగా మీకు తెలియజేస్తుంది. అసలు విక్షనరీ యొక్క అసలు మజా వీటిన్నింటికీ మాండలిక పదాలు, వాటిని ఏ ఏ ప్రాంతాల్లో ఉపయోగిస్తారు అన్న మరెన్నో విశేషాలు చేర్చిన తర్వాత వస్తుంది. ఇది ఒక మహా యజ్ఞము. మీరూ ఒక పట్టు పట్టాలి. తెలుగు వారికి తెలుగులో సరైన నిఘంటువులు లేవు అని తోసివెయ్యటం అలవాటయ్యింది. నిఘంటువులు ఉన్నాయి. అన్నీ అంతర్జాలంలో అందుబాటులో లేకపోవచ్చు. గూగుల్ బుక్స్ లో, మిలియన్ బుక్స్ ప్రాజెక్టులో మంచి వనరులున్నా అవి తెలుగులో శోధించగలిగే పద్ధతిలో లేవు. ఇలాంటి సమస్యలన్నింటినీ కొంత వరకైనా అధిగమించటానికే తెలుగు విక్షనరీ. పైపెచ్చు ఇది పూర్తిగా ఉచితం. ఎవరైనా వాడుకోవచ్చు..కాపీ కొట్టవచ్చు.
తెలుగు విక్షనరీలో ఆంగ్ల పదాలెందుకున్నాయి? అని చాలా మందికి అనుమానం రావచ్చు. విక్షనరీ కేవలం తెలుగు – తెలుగు నిఘంటువే కాదు. బహు భాషా నిఘంటువు. దీన్లో సూత్ర ప్రాయంగా అన్ని భాషాల పదాలకు తెలుగులో అర్ధము మరియు వివరణ ఉంటుంది. కానీ తెలుగు విక్షనరీకి ప్రస్తుతమున్న వనరుల పరిమితి దృష్ట్యా తెలుగు-తెలుగు, ఆంగ్ల-తెలుగు పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కానీ ఎవరైనా తమిళ, కన్నడ, హిందీ, సంస్కృతం వంటి ఇతర భాషా పదాలకు కూడా తెలుగు అర్ధములు, వివరణ చేర్చగలిగేట్టైతే వారికిదే సభాముఖంగా మా ఆహ్వానము.
సంఖ్యానుగుణ వ్యాసాలు:
ఈ వ్యాస పరంపర మొదలై చాలా రోజులైనా ఈ మధ్యన మరలా పుంజుకుంటున్నది. ఒక్కొక్క సంఖ్యకు సంబంధించిన వ్యాసాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఉదాహరణకు మూడు సంఖ్యతో త్రిభుజి, త్రిమూర్తులు, త్రికరణాలు వగైరా
ఇలా వివిధ సంఖ్యలతో 170కి పైగా వ్యాసాలున్నాయి. రవ్వా శ్రీహరి గారి సంకేత పదకోశము యొక్క వికీ తోబుట్టవులే ఈ వ్యాసాలు. కానీ సంకేత పదకోశంలా చెప్పి వదిలెయ్యకుండా వాటి గురించి వివరంగా రాయటమే వికీలో ప్రత్యేకత.
మచ్చుకు కొన్ని: షోడశ సంస్కారాలు, షణ్ముఖుడు, అష్టదిగ్గజములు, అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు. పూర్తి జాబితా
నా సిఫారుసులు
చార్లీ చాప్లిన్, నక్సలైటు, మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము, రవీంద్రనాధ టాగూరు, రాజమండ్రి, శకుంతల
మీ సహకారం
తలా ఒక చెయ్యేసి ఈ క్రింది వ్యాసాలు తెలుగులోకి అనువదించి తెలుగు వికీకి తోడ్పడదాం రండి
చదరంగం (ఆట), జపాన్, టిప్పు సుల్తాన్, తొమ్మిది, ఇళయరాజా
–రవి వైజాసత్య(http://saintpal.awardspace.com/)
రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.
america lo unna telugu mida abhimanamto telugu bhasha ku seva chestunnanduku miku na abhinandanalu.
keep it up
e web site lo telugu links add cheste inka bavuntundi