గమనిక: ఈ వ్యాసానికి మూలం ఆచార్య తిరుమల రచించిన “నవ్వుటద్దాలు” పుస్తకంలోని అక్షరాలతో అద్భుతాలు అనే వ్యాసం. ఇక్కడ ఉదహరించిన పద్యాలన్నీ ఆ పుస్తకం నుండి సేకరించినవే.
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటునుండి చూసినా ఒకేలా ఉండే అనులోమ, విలోమ, పద్య భ్రమకం, పాదభ్రమకం, ఇలా ఎన్నో ఎన్నెన్నో…..
బమ్మెర పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం కథలో వృత్యనుప్రాసాలంకారం (ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి అవడం) ఉపయోగించి సర్వలఘు కందం రాసి మనలనలరించాడు.
అడిగెద నని కడువడి జను
నడిగిన దను మగడు నుడువడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!
అడిగెద నని = అడుగుదామని
కడువడి = సంకోచించి/సందేహించి
జనున్ = వెళ్ళును
తను = తను
అడిగిన = అడిగితే
మగడు = భర్త
నుడువడని = చెప్పడని
నెడ = మనసు
నుడుగున్ = కంపించగా
వెడవెడ = చిన్న
చిడిముడి = తత్తరపాటుతో
తడబడ = తడబడుతూ
అడుగిడు = (ముందుకు) అడుగేస్తూ
అడుగిడదు = (అంతలోనే) ఆగిపోతూ
జడిమ = మెల్లిగా
నడుగిడు = అడుగువేస్తూ
నెడలన్ = వెళ్ళగా
మొసలికి చిక్కి శ్రీహరి కొఱకై ఆర్తనాదాలు చేయుచున్న గజేంద్రుని రక్షించుటకై వడివడిగా బయలుదేరిన విష్ణువు ననుసరించిన లక్ష్మీదేవి పరిస్థితిని వివరించే పద్యం ఇది. సంగతేమిటో, ఏమయిందో అడుగుదామని అడుగు ముందుకేసి కూడా అడగలేక, తడబడుతున్న అడుగులతో, గుండె దడతో భర్తను అనుసరించింది.
ఇంకో వింత చూద్దామా! ఒకే హల్లుతో వాక్యాలు, పద్యాలు ఎలా రాసారో చూద్దాం. ‘క’ గుణింతంతో.. “కాకీక కాకికి కోక కాక కేకికా?”- కాకి ఈక – కాకికి – కోక కాక – కేకికా (నెమలికా)?” అని దీనర్ధం. అలాగే న గుణింతంతో ఓ పద్యం:
నానా నన నా నున్న న
నూనను నిన్ననెను నేను నున్ను ని నిననై
నానీ నను నానా నను
నానూన యనంగ నొంటి యక్షరమయ్యెన్!!
అని లక్షణకారుడు చెబితే మరో తుంటరి నూనె అనే ఒక్క మాటతో గిలిగింతలు పెట్టాడు . ఇలా…”నా నూనె నీ నూనా? నీ నూనె నా నూనా? నా నూనె నీ నూనని నేనన్నానా”
మరి శ్రీశ్రీగారు ఊరకుంటారా. మ,న,స అనే మూడక్షరాలతోనే త్యక్షర కందాన్ని రసవత్తరంగా అందించారు.
మనసాని నిసిని సేమా
మనసా మసి మనిసి మనసు మాసిన సీనా
సినిమా నస మాసనమా
సినిమా నిసి సీమ సాని సిరిసిరి మువ్వా!!
సాని, రాత్రి సేమా (ఒకటేనా), మనసు ఒక మసి, మనిషి మనసు మాసిన సీనుతో సమానమా, సినిమా నస మా ఆసనమా, సినిమా,నిసి, సీమ, సాని అని మ,న,స అనేపదాలతో చమత్కారమందించారు. ఇందులో శ్రీ శ్రీగారు మహాకవిగా కంటె సినిమా కవిగా కనిపిస్తారు.
ఇక ఒక అజ్ఞాత కవిగారు సప్తస్వరాలతో కంద పద్యాన్ని చెప్పి రసజ్ఞుల నలరించారు.
మా పని నీ పని గాదా
పాపను మా పాప గారి పని నీ పనిగా
నీ పని దాపని పని గద
పాపని పని మాని దాని పని గానిమ్మా!!
ఇప్పుడు కొన్ని పద్య చమక్కులు చూద్దాం. ఎటువైపునుండి చదివినా ఒకేలా ఉండడమే కాకుండా అర్థభేదంతో ఉండే అనులోమ-విలోమ పద్యాలు. ఈ పద్యాలు మొదటినుండి చివరకు చదివితే ఒక అర్థం. చివరనుండి మొదటి వరకు చదివితే ఇంకో అర్థం వస్తుంది.
దామోదర సామ తనధ
రామా సరసాకర దశరధ హరి రాధా
కామా సదయాతి పరమ
ధామా వర యాదవకుల దారక రాసా!!
ఇప్పుడు క్రింది విధంగా చదివితే ఇంకో అర్థం వస్తుంది.
సారాకర దాల కువద
యారవ మాధామ రపతి యాదస మాకా
ధారా రిహ ధర శదరక
సారస మారా ధన తమసారద మోదా!!
పాద భ్రమకంలో ప్రతి పాదాన్ని మొదటి నుండి చివరకు, చివరి నుండి మొదటికి చదివితే ఒకేలా ఉంటాయి. ఇది చూడండి.
ధీర శయనీయ శరధీ
మార విభాను మత మమత మను భావి రమా
సారస వన నవ సరసా
దారద సమతార తార తామస దరదా!!
ఇక పద్య భ్రమకంలో ఐతే మొత్తం పద్యాన్ని ఎటునుండి చదివినా ఒకేలా ఉంటుంది. చూడండి. (ఈ ప్రక్రియను ఇంగ్లీషులో Palindrome అంటారు)
రాధా నాధా తరళిత
సాధక రధ తా వరసుత సరస నిధానా
నాధాని సరసత సురవ
తాధర కధ సా తళిరత ధానా ధారా!!
పింగళి వెంకట కృష్ణారావు కవిగారు ఒక సభలో తెనాలి రామకృష్ణుడికి వికట కవిత్వమెలా అబ్బిందో క భాషలో ఇలా చమత్కారంగా చెప్పారు.
తే.గీ. కవి కక కట కక కవి కగ కన కను క
దీ కవ కన కలి కడి కకా కళి కక
కజ కన కని కవో కలె కక కని కక
కర కము కన కజూ కచి కన కపు కడె!!
ఈ పద్యంలో క లు తీసివేసి చదివితే ” వికట కవిగ నను దీవన లిడి కాళిక జనని వోలె కనికరమున జూచి నపుడె ” అనే వాక్యం వస్తుంది.
ఇలా ఎందరో కవులు అక్షరాలతో పద్యాలాటలు ఎన్నో ఆడారు. కాని కొందరు ఇటువంటివి కవులు చేసే గారడీలని, కసరత్తులని, సర్కసులని ఎద్దేవా చేసారు. అసమర్థులకి అల్లరి, విమర్శలు చేయడం ఎక్కువే కదా. కాబట్టి వారిని పట్టించుకోకపోవడం బుద్ధిమంతుల లక్షణం.
అల్లంరాజు రంగశాయిగారు మ గుణింతంతో ఓ అందమైన కంద పద్యాన్ని అందించారు.
మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
ఈ పద్యానికి అర్థం చూద్దామా.
మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖము గల
మామా = మా యొక్క
మా = మేథ
మిమ్ము, ఒమ్ము = అనుకూలించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము
మిమై = మీ శరీరము
మేము ఏమే = మేము మేమే
మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుము
ఇమ్ము+ఔము = అనుకూలమగుమా
చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు. కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.
అలాగే సంస్కృతంలో ఉన్న ఒక ఏకాక్షర శ్లోకం
రరో రరే రర రురో రురూ రూరు రురో రరే
రేరే రీరా రార రరే రారే రారి రిరా రిరా!!
ర = రామ శబ్దంలోని “ర” రేఫ వలన
రోః = భయం కల
అర = వేగంగా పరుగెత్తే
రురోః = జింకయైన మారీచునికి
అరేః = శత్రువైన శ్రీరాముని
రేరే = (ర+ఈరే) = కౌస్తుభమణి పొందియున్న
ఉరో రరే = వక్షము నందు
రీరారా = లీల నాపాదించునట్టి
ఊరూరూః = ఊరువులచే గొప్పనైన
ఉః = లక్ష్మి = సీత
అర రర = తన నివాసానికి తీసుకువెళ్ళిన
ఇరార = లంకను పొందిన
ఇరారి = భూ శత్రువైన రావణునికి
రిః = నాశం కల్గించినదై
ఆరిరా = చెలికత్తెలను
రా = పొందిన దాయెను
శ్రీరామ పత్ని సీత లంకలో రావణ నాశనం సూచించే త్రిజట వంటి చెలికత్తెల్ని పొందిందని అర్థం.
శ్రీకృష్ణదేవరాయల భువన విజయ సాహిత్య సభకు ఒక కవి వస్తే మన తెనాలి రామకృష్ణుడు మేక తోకతో హడలకొట్టిన సంగతి తెలియనిదెవరికి! అది ఇలా ఉంది..
మేక తోకకు మేక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక
కాని అదే వికటకవి రాయలవారి కీర్తిని వర్ణిస్తూ అక్షర సౌందర్యంతో గంభీరంగా చెప్పిన ఈ పద్యం.
నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిద్గిరిభి
త్కరి కరిభిద్గిరి గిరిభి
త్కరిభిద్గిరి భిత్తు రంగ కమనీయంబై!!
నరసింహరాయల కుమారుడైన శ్రీకృష్ణదేవరాయల కీర్తి – కరిభిత్ = గజాసుర సంహారియైన శివునిలా, గిరిభిత్కరి = ఇంద్రుని ఏనుగైన ఐరావతంలా, కరిభిద్గిరి =కైలాసంలా, గిరిభిత్ = వజ్రాయుధంలా, కరిభిద్గిరిభిత్తురంగ = శివేంద్రుల వాహనాలైన నంది, ఉచ్చైశ్రవం (తెల్ల గుర్రం) లలా అందంగా తెల్లగా ఉందని భావం.
సరే అయితే కవుల చమత్కారాల అల్లికలు, ఆటలు, వింతలు, విడ్డూరాలు చూసాము కదా. ఇప్పుడు కాళిదాసు పేరు మీద చలామణిలో ఉన్న నోరు తిరగని ఈ పద్యాన్ని చదివి ఎంతవరకు అర్థమైందో చెప్పండి:
షడ్జ మడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్జ లాంశ్చ మడ్ఖాఖరే
జడ్జ ట్కి ట్కి ధరాడ్జ రేడ్ఘన ఘనః ఖడ్జోత వీడ్య భ్రమా
వీడ్యాలుడ్ భ్రమ లుట్ప్ర యట్ట్రి యపదా డడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా
పాదౌటే త్ప్రట తట్ప్రట ట్ప్రట రసత్ప్రఖ్యాత సఖ్యోదయః !!
(ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 1000 పైచిలుకు టపాలు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం సమర్పిస్తున్న వ్యాసం ఇది.)
ఇటువంటి విశేషాలను ఏ power point presentation తోనో audio visual lecture గా ప్రదర్శిస్తే తెలుగు గురించి అంతగా ఆసక్తి కనబరచని స్కూలు, కాలేజి పిల్లలను ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఈ వివరాలను అందించిన రచయిత్రికి అభినందనలు.
Yeah… Rohini Prasad gari idea బాగుంది. స్కూల్ పిల్లలకి చూపించండి ఎవరన్నా… మా స్కూల్ పిల్లలకి ఇంకా తెలుగు చదవడమే పూర్తిగా రాదు…సో, బెదరగొట్టను నేను… 🙂
జ్యోతి,
ఎక్కడనుంచి వెతికి పట్టుకుని, ఇంత బాగా వివరిస్తున్నారు?
చాలా బావున్నాయి. అలాగే ఇంతకు ముందు అంకెలతో ముడిపడిన పద్యాల గురించి కూడా రాశారు కదా. చూస్తాను, తెలుగు4కిడ్స్ లో ఏదైనా present చెయ్యగలనేమో.
కొన్ని సందేహాలు:
1. కడువడి జను – అంటే కడు వేగముగా వెళ్లును (అని నాకు అనిపిస్తోంది, సరైనదేనా?)
2. అడిగిన తన మగడు నుడువడని – (ఇది సరైనదనుకుంటాను – అడిగిన తను మగడు నుడువడని కాదేమో!?)
3. సప్తస్వరాలతో కందపద్యం అన్నారు. మొదటి స్వరమే లేదే!?
4. ఇమ్ము+ఔము – ఈ సంధి చేయబడ్డ పదం రంగశాయిగారి పద్యంలో ఎక్కడుంది?
బాగా కష్టపడ్డారండీ ఇంత మంచి మంచి పద్యాలు, శ్లోకాలు ఏర్చి కూర్చటానికి. వ్యాసం బాగుంది.
రానారె కు ధన్యవాదములు. తప్పులే . అంగీకరిస్తున్నాను. ఎడిటర్ గారు కాస్త సరిచేయండి.
జ్యోతిగారు,
చక్కటి సంకలనం!ఈ పదపద్యవిన్యాసాలు చాల ఆసక్తిదాయకంగా ఉన్నాయి.వీటికి నేనూ ఓ ఏకాక్షర ప్రయోగం చేరుస్తున్నాను:
క.నేనెన్నెన్నో నిన్న
న్నానని, నీనాననానినానని, నన్నో
నానీ! నిన్నూనిననను
నౌ, నౌ, నననీన నిన్ను నన్నౌనెన్నన్.
(కవిరాజు సంబర సూర్యనారాయణ శాస్త్రి-“తిమ్మరుసు మంత్రి”)
ఓ నానీ! నేను; నిన్ను= నిను గురించి,
ఎన్నెన్నో=ఎన్నియో మాటలు,
అన్నానని= అంటిననియు,
నీనాన= నీ సిగ్గును,
నానినానని= పోగొట్టితిననియు,నిన్ను;
ఊనిన= నమ్మియున్న,
నను= నన్ను,
నన= పువ్వు, ఈన= వికసించినట్లు,
నౌనౌ= నవ్వు నవ్వు,
నిన్ను, నన్ను= మనలనిద్దఱను (అపుడు),ఎన్నన్ ఔను= పొగడదగును.
ఇదే శీర్షిక, ‘అక్షరాలతో అద్భుతాలు ‘ మకుటంతొ, ఆచార్య తిరుమలగారి “నవ్వుటద్దాలు”(హాసం ప్రచురణలు,హైదరాబాదు,ప్రథమ ముద్రణ2005) పుస్తకంలో ఉంది(పుటలు63 నుండి 67వరకు).అలాగే అంకెలతో ముడిపడిన పద్యాలు “అంకెలతో పద్యాలాట” కూడా ఈ పుస్తకంలోనిదే.వలబోజు జ్యోతిగారు, ఈ వ్యాసకర్త- ఆచార్య తిరుమలగారి పేరు సూచించివుంటే బావుండును.
నారాయణరావుగారు సూచించిన విధంగా గమనికను చేర్చాం. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం.
పొద్దు నెట్ లో వచ్చే వ్యాసాలు చాలా బాగున్నాయి. పద్యాలు కూడా చదవడానికి అనుకులంగా ఉన్నాయి.
జ్యోతిగారు,
కారణి నారాయణరావు గారు చాల సున్నితంగా ఎత్తిచూపారు కానీ, ఆచార్య తిరుమలగారి సేకరణలని మీరు ఇంకో మాధ్యమంలో పెట్టారంతే (పుస్తకం నుంచి వెబ్-సైట్లో)..అటువంటప్పుడు ఆయనకి వ్యాసంలోనే కృతజ్ఞతలు తెలుపడం కనీస మర్యాద. ముందు ముందు మీరు రాసే వాటిలో ఈ పద్దతే ఆమోదయోగ్యం; గమనించగలరు
నిజమే ,చాలా పెద్ద తప్పు చేసాను.మూల రచయిత పేరు చెప్పకపోవడం. ఇందులో నా దురుద్దేశం లేదు. ఇలాంటి తప్పులు ఇకముందు చేయకుండా జాగ్రత్తపడతానని హామీ ఇవ్వగలను. పొద్దు పత్రికవారికి కూడా క్షమాపణలు. ఎటువంటి దండనకైనా సిద్ధమే…
జ్యోతి..
chI,cI poddu vaaru siggu paDaalsina vishayaM idi.
racayita pEru lEdu kaani ee copy racayirti photo maatraM vEsukunnaaru.
జ్యోతి గారు,
దురుద్దేశ్యం లేదన్నారు, హామీలిచ్చారు అవి చాలు. దండనలు అవీ ఎందుకండీ?
ఒక మాట, మంచి పద్యాలని ఒక చోట సేకరించి అంతర్జాలచదువరులకు అందుబాటు చేసారు. మంచి పనే చేసారు.
రమణ గారు,
అంతటి పెద్ద (తప్పుడు/బాధించే) మాటలు అనవసరమని నా అభిప్రాయం.