“వాడి సంగతి మీకింకా తెలీదు, వాడు చాకులాంటివాడు. ఇంక రెండోవాడు ఆల్కైడ్స్ అంత చురుకు కాడు. వీడున్నాడే ఒక పురుగుగాని, పక్షిగాని కనిపిస్తే వాలు, వాడి కళ్ళు వాటివెంటే పడతాయి; వాడు వాటి వెంటపడి వాటిని చూస్తాడు. వీణ్ణి రాజ్యతంత్ర శాఖలో చేరుస్తామనుకుంటున్నాను… తెమిస్టోక్లస్, నువు రాయబారిగా పోతావుట్రా?” అని మానిలవ్ కొడుకును అడిగాడు.
తెమిస్టోక్లస్ రొట్టెను నములుతూ తల అటూ ఇటూ ఆడించి, “అవును, పోతాను” అన్నాడు.
కుర్రాడి వెనకాలే నిలబడి ఉన్న నౌకరు సమయానికి రాయబారి ముక్కు తుడవకపోతే సూప్ లో ఏదో పడి అభాసు అయి ఉండేదే. సంభాషణ ప్రశాంత జీవితం మీద నడిచింది. ఇంటి యజమానురాలు మధ్య మధ్య అడ్డొచ్చి పట్నంలో నాటక సమాజం గురించీ, అందులోని నటులను గురించీ వ్యాఖ్యానించింది. పంతులు సంభాషణను అతి శ్రద్ధతో గమనిస్తూ మాట్లాడుతున్నవారిలో ఎవరు నవ్వబోతున్నట్టు తోచినా నోరంతా తెరిచి బలంగా నవ్వేశాడు. ఆయన కృతజ్ఞతా స్వభావం కలవాడై, తన యజమాని ఋణం ఉంచుకోరాదనుకున్నాడేమో. అయితే ఒక్కసారి మటుకు ఆయన మొహాన కోపం తాండవించింది. ఆయన బల్ల మీద గట్టిగా కొట్టి, తన ఎదురుగా ఉన్న పిల్లలను తన చూపులతో గుచ్చాడు. ఆయన తగుసమయంలోనే ఈ పని చేశాడు, ఎందుకంటే తెమిస్టోక్లస్ అప్పుడే ఆల్కైడ్స్ చెవి కొరికాడు. ఆల్కైడ్స్ కళ్లు మూసి, నోరు తెరిచి దీనంగా ఏడవడానికి సిద్ధపడ్డాడు; అయితే అలా చెయ్యడం వలన మిగిలిన తిండికి కాస్తా స్వస్తి చెప్పవలసి వస్తుందేమోనని భయపడి, ఏడిచే ప్రయత్నం మాని, మొహం మామూలుగా పెట్టి, నీళ్ళు తిరిగిన కళ్ళతో ఎముక ఒకటి తీసుకుని, రెండు బుగ్గలూ జిడ్డుతో నిగనిగ లాడేదాకా పళ్ళతో గీకాడు.
“మీరసలు భోజనమే చెయ్యటం లేదు, చాలా కొంచం తింటున్నారు” అని ఇంటావిడ అతిథితో చీటికీమాటికీ అంటూ వచ్చింది. ఆవిడ అలా అన్నప్పుడల్లా చిచీకవ్, “చాలా కృతజ్ఞుణ్ణి. బాగానే తింటున్నాను. సద్గోష్ఠి ముందు ఎంత మంచి వంటకాలూ చాలవు” అంటూ వచ్చాడు.
భోజనాలు ముగించి లేచారు. మానిలవ్ ఆనందానికి మేరలేదు. ఆయన అతిథి వీపు మీద చెయ్యి ఆనించి డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకుపోయే ప్రయత్నంలో ఉండగా, ఆ అతిథి తలవని తలంపుగా, మహా గాంభీర్యంగా, తాను మాట్లాడవలసిన విషయం ఒకటి ఉన్నదని ప్రకటించాడు.
“అలా అయితే పఠన మందిరానికి పోదాం, దయచెయ్యండి”, అంటూ మానిలవ్ అతన్ని ఒక చిన్నగదిలోనికి తీసుకుపోయాడు. దాని కిటికీలోంచి దూరాన ఉన్న అడవి నీలంగా కనిపిస్తున్నది.
“ఇది నా గర్భగుడి”, అన్నాడు మానిలవ్.
“చక్కని గది”, అంటూ చిచీకవ్ గదిని కలయజూశాడు. గది ఆకర్షవంతంగా లేకపోలేదు. గోడలకు బూడిదరంగూ, నీలంరంగూ కలిపిన రంగు వేశారు. గదిలో నాలుగు కుర్చీలూ, ఒక వాలుకుర్చీ, ఒక బల్లా, దానిమీద లోగడ చెప్పిన పుస్తకం, గుర్తుతోసహా ఉన్నాయి. అన్నిటికన్న అక్కడ హెచ్చుగా కనిపిస్తున్నది పొగాకు. అది రకరకాల ప్రదేశాలలో -పొట్లాలలోనూ జాడీలోనూ, బల్ల అంతటనూ – కనిపిస్తున్నది. గది కిటికీలు రెంటిలోనూ పొగాకు నుసి, బారులుగా అమర్చిన చిన్న చిన్న కుప్పలుగా ఉన్నది. దాన్ని అలా అమర్చడం ఇంటి యజమానికి సరదా లాగుంది.
“మీరు ఇలా వాలుకుర్చీలో కూచోవాలని నా ప్రార్థన. అందులో మీకు సౌకర్యంగా ఉంటుంది.”, అన్నాడు మానిలవ్.
“క్షమించాలి. నేనిలా కుర్చీలో కూచుంటాను.”
“క్షమించటానికి వీల్లేదు. ఈ వాలుకుర్చీ అతిథుల కోసమే. అంచేత మీకిష్టంలేకపోయినా కూచోవలసిందేనూ!” అన్నాడు మానిలవ్ నవ్వుతూ.
చిచీకవ్ కూచున్నాడు.
“మీకొక పైప్ ఇవ్వమన్నారా?”
“వద్దు, థాంక్స్. నేను పొగతాగను”, అన్నాడు చిచీకవ్ మంచిగానూ, నొచ్చుకుంటున్నట్టుగానూ.
“ఏం?” అన్నాడు మానిలవ్ మంచిగానూ, నొచ్చుకుంటున్నవాడిలాగానూ.
“నాకు అలవాటు లేదు, అదంటే భయం కూడాను. పొగతాగితే ఒళ్ళు ఎండిపోతుందంటారు.”
“తమరు అనుమతిస్తే అది కేవలం అపోహ అంటాను. ఆ మాటకు వస్తే నస్యం సేవించటం కన్న పైప్ కాల్చటం ఒంటికి ఎంతో మంచిదంటాను. మా రెజిమెంటులో ఒక లెఫ్టినెంటు ఉండేవాడు, చాలా మంచివాడూ, సంస్కారీనూ; భోంచేసేటప్పుడే కాదుగదా ఇంకెక్కడ కూడా నోట్లోనుంచి పైపు తీసేవాడు కాదు. ఇప్పుడాయనకు నలభై దాటాయి, అయినా మంచి దృఢంగా ఉనాడు.”
ఒక్కొక్కప్పుడు అలాగే జరుగుతుందనీ, ప్రకృతిలో అనేక విషయాలు ఎంతటి మేధావులకూ అంతుబట్టని విషయాలు ఎన్నో ఉన్నాయని చిచీకవ్ అన్నాడు.
“కాని ముందు నేనొక ప్రశ్నడుగుతాను మీ సెలవైతే…” అంటూ అతను వింతగా వినబడే గొంతుతో పలికి, ఎందుకో తనవెనుకవైపు చూసుకున్నడు. మానిలవ్ కూడా ఎందుకో తెలియరాకుండా తన వెనకవైపు చూశాడు. “మీరు జనన మరణ లెక్కలు తీసుకుని ఎంతకాలమయినది?”
“చాలా కాలమయింది. ఎప్పుడు తీసుకున్నామో నాకు జ్ఞాపకం కూడా లేదు.”
“అంటే అటుపిమ్మట మీ కమతగాళ్ళు చాలామంది చనిపోయి ఉండాలిగా?”
“ఆ సంగతయుతే నాకు తెలీదు. మా నిగామానును అడగాలనుకుంటాను. ఒరే, ఆ నిగామానును కేకేసుకురా. ఇవాళ అతను రావలసినరోజే.”
నిగామాను వచ్చాడు. అతనికి సుమారు నలభై ఏళ్ళుంటాయి, గడ్డం ఉంచుకోడు, పొడుగు కోటు వేసుకున్నాడు, సుఖజీవితం గడిపేవాడిలాగా కనిపించాడు, ఎందుకంటే అతని మొహం కొవ్వి ఉబ్బరించి ఉన్నది. అతని పాలిపోయిన శరీరచ్ఛాయ చూస్తే మెత్తని పరుపులూ దిళ్ళూ మరిగినట్టున్నాడు. భూస్వాముల కింద పనిచేసే నిగామానులందరూ ఎలా పైకి వస్తారో ఇతనూ అలాగే వచ్చాడని తెలుస్తున్నది. ఒకప్పుడీ ఇంటనే నౌకరీ కుర్రాడిగా ఉంటూ చదవటమూ రాయటమూ నేర్చుకున్నాడు, తరవాత తమ యజమానురాలికి అభిమాన పాత్రురాలైన ఇంటి దాసీలకు పెద్దదైన ‘అగాష్కనో’ ను పెళ్ళాడి, స్టోరుకీపరై తరవాత నిగామాను అయ్యాడు. నిగామాను అయాక అతను సహజంగా నిగామాను లందరూ ప్రవర్తించినట్టే ప్రవర్తించాడు; గ్రామంలో ఉండే కలవారితో పూసుకు తిరుగుతూ లేనివారి కష్టాలు పెంచాడు; ఉదయం ఎనిమిది దాటాక నిద్రలేచి, సమొవార్ సిద్ధమై టీ తాగేదాకా బయటికి కదిలేవాడు కాడు.
“ఇదుగో చూడవోయ్, కిందటిసారి జననమరణ లెక్కలు తీసుకున్నాక మన కమతగాళ్ళు ఎంతమంది పోయి ఉంటారు?”
“ఎంతమందా? ఓ, చాలామంది పోయారు” అన్నాడు నిగామాను. అతనికి ఎక్కిళ్ళు వస్తూండటం చేత నోటికి చేతిని డాలు లాగా అడ్డం పెట్టుకున్నాడు.
“నేనూ అలాగే అనుకున్నాను మరి. చాలామంది పోయారు”, అన్నాడు మానిలవ్. ఆయన చిచీకవ్ కేసి తిరిగి, “అవును, చాలామంది పోయారు” అన్నాడు.
“మాటవరసకు, వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది?” అని చిచీకవ్ అడిగాడు.
“అవును, చనిపోయిన వాళ్ళ సరి అయిన సంఖ్య ఎంత?” అన్నాడు మానిలవ్.
“సంఖ్య ఎంతో నాకుమాత్రం ఏం తెలుసూ? చచ్చినవాళ్ళ సంఖ్య చెప్పేందుకు లేదు. ఎవరు లెక్కగట్టారు గనకా?” అన్నాడు నిగామాను.
మానిలవ్ చిచీకవ్ కేసి తిరిగి, “నిజమే, చాలమంది చచ్చారని నేనూ అనుకున్నాను గాని, ఇంతమంది చచ్చారని స్పష్టంగా చెప్పటానికి లేదు”, అన్నాడు.
చిచీకవ్ నిగామానుతో, “అయితే ఇప్పుడు లెక్కపెట్టి, చనిపోయినవా రందరి పేర్లు జాబితావేసి ఇవ్వాలి”, అన్నాడు.
“అవును, ప్రతి ఒక్క పేరూ జాబితాలో చేర్చు”, అన్నాడు మానిలవ్.
“చిత్తం”, అంటూ నిగామాను వెళ్ళిపోయాడు.
—————
-కొడవటిగంటి కుటుంబరావు