మృతజీవులు – 4

రెండవ ప్రకరణం

మన ఆగంతకుడు వచ్చి వారం రోజులకు పైగా అయింది. అతనికి బండీ ఎక్కి సాయంకాలపు పార్టీలకు వెళ్ళటంతోనూ, విందులు కుడవటంతోనూ కాలం హాయిగా వెళ్ళిపోతున్నది. చిట్టచివరకు అతను నగరం విడిచి వెళ్ళి, మాట ఇచ్చిన ప్రకారం మానిలవ్‌నూ, సబాకివిచ్‌నీ చూద్దామని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ ఇందుకు మరొక కారణం, ఇంతకంటే ముఖ్యమైనదీ, అతని అంతస్సుకు సన్నిహితమైనదీ కూడా ఉండి ఉండవచ్చు…ముందు చెప్పబోయే కథను పాఠకుడు ఓపికగా చదివినట్టయితే కాలక్రమాన, కొంచెం కొంచెంగా అన్ని విషయాలూ తెలుస్తాయి; ఈ గాథ వెళ్ళినకొద్దీ మరింత విస్తృతమైన విషయాలను తడవబోతున్నది గనక కొంచెం దీర్ఘంగానే ఉంటంది.

ఉదయం పెందలాడే బండీకి గుర్రాలు పూన్చమని బండీవాడు సేలిఫాన్‌కు ఉత్తరు వివ్వబడింది. పెట్రూష్కను ఇంటివద్దనే ఉండి గదినీ, తోలుపెట్టెనూ జాగ్రత్తగా చూస్తూండమన్నారు. మన కథానాయకుడి తొత్తులైన ఈ ఇద్దరినీ పరిచయం చేసుకోవటంవల్ల పాఠకుడికి నష్టం ఉండదు. అయితే నిజానికి వీరు అంత ప్రాధాన్యంగల పాత్రలు కారు; రెండవ తరగతికి, మళ్ళీ మాట్లాడితే మూడో తరగతికి చెందినవారు; వీరికి ప్రధాన సంఘటనలతో సంబంధం లేదు. కథలో స్థాలీపులాకంగా తగులుతూ ఉంటారు. అయితే ఈ కథకుడు రష్యను అయినప్పటికీ, అన్నిటినీ వివరించటంలో జర్మనులకున్నంత శ్రద్ధగలవాడు. ఈ సందర్భంలో మనకు ఎక్కువ కాలం వ్యర్థంకాదు; ఎందుకంటే

పాఠకుడు అదివరకు వీరి గురించి పెట్రూష్క వదులుకోటు వేసుకున్నాడనీ, అది ఒకప్పుడు అతని యజమానిదనీ, అతని వృత్తిలో ఉండేవారికి సహజంగా ఉండే మందమైన పెదవులూ, ముద్దముక్కూ అతనికి కూడా ఉన్నాయనీ తెలిసినదానికి అదనంగా చేర్చదగిన వివరాలు ఆటేలేవు. అతను ఆటే మాటకారి కాదు, మితభాషి. అతనికి పఠనాసక్తి, అంటే పుస్తకాలు చదవాలనే తృష్ణ చాలా హెచ్చు. అయితే అతనికి ఆ విషయమై ఎలాటి విచక్షణా లేదు. విరహాతురుడైన కథానాయకుడి అనుభవాలుగల కథ అయేది, నిఘంటువయేది, ప్రార్థనల పుస్తకమయేది అతనికి ఒకటే. రసాయనశాస్త్రానికి సంబంధించిన పుస్తకం ఇచ్చినా అతను వద్దని ఉండడు. అతనికి కావాలిసింది పఠనమేగాని, పాఠం కాదు. అక్షరాలతో రకరకాల మాటలు ఏర్పడటం, ఒక్కొకసారి మాటలు అర్థం కాకపోతేనేం, అతనికి సరదాగా ఉండి చదివేవాడు. అతని చదువు చాలావరకు పడుకునే, నడవలో మంచం మీద పరుపు వేసుకుని, దానిపైన పడుకుని. అతనికి ఈ అలవాటుండబట్టే ఆ పరుపు అట్టలాగా తయారయింది. పఠనాసక్తి గాక అతనిలో మరి రెండు విశేషాలున్నాయి; అతను పడుకునేటప్పుడు వేసుకున్న దుస్తులతోనే, ఆ కోటుతోనే పడుకునేవాడు. అతనివెంట ఎప్పుడూ, అతని తాలూకు ప్రత్యేకమైన వాసన ఒకటి ఉండేది. చాలాకాలంగా మనుష్యులుండిన గదిలో కొట్టే వాసన అది. అందుచేత ఎవరూ ఎన్నడూ నివసించని గదిలోకి అతని పైకోటూ, వస్తువులూ తెచ్చిపెడితే చాలు; ఆ గదిలో పదేళ్ళుగా మనుషులు కాపరం చేస్తున్నట్టుగా తోచేది.

చిచీకవ్‌ ఒకంతట తృప్తిపడే రకం కాదు. కొన్ని విషయాలలో చాలా పట్టుదలగలవాడు. అతను ఒక్కొక్క రోజు ఉదయం గాలి మూచూసి మొగం చిట్లించి, తల అడ్డంగా తిప్పి, “ఒరే అబ్బీ, నీకు చెమటో ఏదో పట్టింది, వెళ్ళి స్నానం చేయరాదూ?” అనేవాడు. దీనికి పెట్రూష్క సమాధానం చెప్పక ఏదో పనిలో నిమగ్నుడయేవాడు. బ్రష్‌ తీసుకుని వంకెకు వేళ్ళాడే తన యజమాని కోటువద్దకైనా వెళ్ళేవాడు, లేకపోతే ఏదో వస్తువును అది ఉండవలసిన స్థానంలో పెట్టేసేవాడు. మౌనంగా ఉన్నప్పుడు వాడు తన మనసులో ఏమనుకునేవాడు? “నువు మహామంచివాడివిలే, చెప్పిందే నలభైసార్లు విసుగులేకుండా చెపుతూ…” అనుకునేవాడేమో. తన యజమాని ఉపన్యాసం దంచేటప్పుడు తొత్తు అయినవాడు ఏమనుకుంటాడో ఊహించటం బ్రహ్మతరంకాదు. పెట్రూష్క విషయం ప్రస్తుతానికి ఇది. పోతే బండివాడు సేలిఫాన్‌ వేరేరకం మనిషి…పాఠకులకు ఈ తక్కువరకం మనుషులంటే విముఖత్వమని కథకుడికి తెలుసు. అందుచేత వీళ్ళను గురించి ఇంతసేపు చెప్పటానికి సిగ్గుగా ఉంది. తమకంటే ఏపాటి కొంచెం ఉన్నతస్థితిలో ఉన్న వ్యక్తుల పరిచయ భాగ్యంగాని సంపాదించాలని కుతూహలపడడం రష్యనుల సంప్రదాయం. వారికి మామూలు మనుషులతోటి గాఢమైత్రి కన్న జమీందారులూ, ప్రభువులూ లాటివారి ముఖపరిచయం ఎన్నోరెట్లు ప్రియతరం. ఆ మాటకు వస్తే ఈ కథకుడు తన కథానాయకుడు కేవలం చర్చి కౌన్సిలు సభ్యుడు మాత్రమే అయినందుకు ఆందోళన చెందుతున్నాడు. కోర్టుకౌన్సిలు సభ్యుల్లాటివాళ్ళు అలాటి వ్యక్తి పరిచయాన్ని సహించవచ్చుకాని ఏ జనరల్‌ పదవో అందుకున్నవారు అలాటి వ్యక్తులను చాలా నిరసనతో చూస్తారు. ఒకవేళ అసలు గమనించకుండానే వెళ్ళిపోయారంటే కథకుడికి అది గుండెలో పోటే. ఈ రెంటిలో ఏది జరిగినా బాధాకరమే అయినప్పటికీ మనం మన కథానాయకుడివద్దకు వెళ్ళక తప్పదు.

తాను ఇచ్చే ఉత్తరువులు కిందటి రాత్రే ఇచ్చి, అతను తెల్లవారగట్టే లేచాడు. ఆపాదమస్తకం తడి స్పాంజితో రుద్దుకుంటూ స్నానం చేశాడు. ఇలా ఆదివారంనాడే చేస్తాడు, ఆ రోజు ఆదివారమే మరి చెక్కిళ్ళు నున్నబారి నిగనిగలాడేలాగ క్షౌరం చేసుకున్నాడు. కలినేత ఎర్రకోటు వేసుకున్నాడు. మందమైన ఎలుగుబంటి చర్మం లైనింగు వేసిన పైకోటు ధరించాడు. వెయిటరు ముందు ఈపక్కా, తరవాత ఆపక్కా సాయం పట్టగా మెట్లు దిగివచ్చి, బండిలో ఎక్కి కూచున్నాడు. బండి చప్పుడు చేసుకుంటూ హోటలు గేటుదాటి వీధిలోకి మళ్ళింది. పక్కగా వెళుతున్న ప్రీస్టు ఒకడు నెత్తిమీద టోపీ తీశాడు. వీధిలోని అలగా కుర్రాళ్ళు, మురికి చొక్కాలు తొడుక్కున్నవాళ్ళు, చేతులు చాచి, “దిక్కులేనివాణ్ణి బాబూ, ధర్మం!” అన్నారు. వారిలో ఒకడు బండీ మెట్టుమీద ఎక్కటానికి ప్రయత్నిస్తూండటం చూసి బండివాడు కొరడాతో చురక తగిలించాడు. బండీ కుదుపుతో వీధిలో పరచిన రాళ్ళమీదుగా పరిగెత్తింది.

చారలుగల సరిహద్దు స్తంభం కనిపించగానే మన కథానాయకుడికి ప్రాణం లేచివచ్చినట్టయింది. ఎందుకంటే, ఇతర పీడల్లాగానే, రాళ్ళు పరచిన రోడ్డుకు కూడా ఒక అంతం ఉన్నదని ఆ స్తంభం సూచించింది. మరి రెండు మూడుసార్లు అతని తల బండీకి అటూఇటూ కొట్టుకున్నాక బండీ మెత్తని మట్టిరోడ్డు ప్రవేశించింది. నగరం దాటగానే రోడ్డుకు అటూ ఇటూ కూడా రకరకాల పెంటకుప్పలూ, చెత్తదిబ్బలూ ప్రత్యక్షమయాయి. ఇది రష్యాలో పరిపాటే. వాటిలో వంటచెరుకు గుట్టలూ, ఎత్తు ఎదగని పైన్‌ (Pine) మొక్కల పొదలూ, పెద్ద వృక్షాల కాలిన మొదళ్ళూ మొదలైనవి ఉన్నాయి. వారికి తగిలిన గ్రామాలలో బారుగా గుడిసెలున్నాయి. అవి చూడటానికి చెక్కగూళ్ళలాగా ఉన్నాయి. బూడిదరంగుగా ఉండే వాటి కప్పుల అడుగున ఎంబ్రాయిడరీ చేసిన తువాళ్ళలాగా కనిపించే చెక్కడాలుంటాయి. మామూలు తప్పకుండా కొంతమంది బైతులు (గ్రామస్తులు) గొర్రెదుస్తులు ధరించి, తమ ఇళ్ళ బయట ఉండే బెంచీలమీద కూచుని, నోళ్ళు తెరుచుకు చూస్తున్నారు. ఆడవాళ్ళ లావుపాటి మొహాలు ఇళ్ళ ఎగువ భాగాలలోని కిటికీల నుంచి తొంగి చూస్తున్నాయి. కింది కిటికీలలోనుంచి దూడలూ, పందులూ ముట్టెలు బయటికి పెట్టాయి. ఇవన్నీ సుపరిచితమైన దృశ్యాలే.

పదిమైళ్ళు ప్రయాణం సాగించాక మానిలోవ్‌ లెక్క ప్రకారం వాళ్ళ గ్రామం అక్కడే ఎక్కడో ఉండాలని మన కథానాయకు డనుకున్నాడు. అయితే పదకోండో మైలు దాటినా కూడా ఆ గ్రామం జాడ కనబడలేదు. సమయానికి ఇద్దరు బైతులు తటస్థపడకపోతే ఆ గ్రామం అంతు చిక్కిఉండకపోను. “జమానిలవ్కా గ్రామం ఇక్కడికి చాలా దూరమా?” అన్న ప్రశ్న వినగానే బైతులు నెత్తిమీద టోపీలు తీసేశారు. ఇద్దరిలోనూ గసిక1లాటి గడ్డం కలవాడు రెండోవాడి కన్న కాస్త తెలివిగా కనిపించాడు. “జమానిలవ్కా కాదే, మానిలవ్కా కావాలి”అన్నాడు వాడు.

“ఒకవేళ మానిలవ్కా యేమో”

“ఆఁ, మానిలవ్కా! అయితే నేరుగా ఇంకో అరమైలు పోయి కుడివేపు తిరగండి”

“కుడివేపుకా?” అన్నాడు బండీవాడు.

“కుడివేపుకు” అన్నాడు బైతు. “ఆ రోడ్డే మానిలవ్కా పోతుంది. జమానిలవ్కా అనే వూరే లేదు. అసలు దాని పేరు మానిలవ్కా. మరి జమానిలవ్కా అంటే ఆ పేరుగల గ్రామం ఈ చాయలే లేదు. అట్టా ఎదురుగా కొండమీద ఇల్లు కనిపిస్తూంటుంది రెండంతస్తుల ఇటుకల మేడ షావుకారుగారి లోగిలి, ఆయన కాపరం అందులోనే. అదే మానిలవ్కా, జమానిలవ్కా అనే వూరు ఇటువేపుల ఏనాడూ లేదన్నమాట.”

వాళ్ళు మానిలవ్కాను వెతుక్కుంటూ బయలుదేరారు. నేరుగా ఒకటిన్నర మైళ్ళు వెళ్ళినాక కుడివేపుకు చీలే రోడ్డు వచ్చింది. ఆ దారిన పడి ఒక మైలుకాదు, రెండుమైళ్ళుకాదు, మూడు మైళ్ళు వెళ్ళినా ఎక్కడా ఇటుకల మేడ జాడలేదు. పల్లెపట్టుల్లో ఉండేవాళ్ళు మనని ఆహ్వానించి, తమ గ్రామం పదిమైళ్ళలో ఉన్నదన్నారంటే కనీసం ఇరవై మైళ్ళ దూరం ఉంటుందని మనం అనుకోవచ్చు ఈ సంగతి చిచీకవ్‌కు స్ఫురించింది. మానిలవ్కా గ్రామం ఏమంత ఒనరుగా లేదు. షావుకారు లోగిలి ఎత్తయిన గుట్టమీద ఉన్నది. ఏ వేపునుంచి గాలి వీచినా ఇంటికి రక్షణ లేదు. దానిచుట్టూ గరిక మైదానం. ఇంగ్లీషు పద్ధతిలో రెండు మూడు చోట్ల లైలాక్‌ (Lilac) పొదలూ, అకేషియా2 (Acacia) పొదలూ వేశారు. అక్కడక్కడా అయిదారేసి చొప్పున బర్చ్‌ (Birch) చెట్ల గుంపులున్నాయి; వాటి తలపై చిన్నచిన్న ఆకులు పలచపలచగా ఉన్నాయి. రెండుచోట్ల మధ్యగా ఒక పొదరిల్లున్నది. ఆ పొదరింటి శిఖరం మట్టంగా, ఆకుపచ్చరంగు వేసి ఉన్నది. దానికిగల కర్ర స్తంభాలు నీలంరంగు వేసి ఉన్నాయి. పొదరింటి మీద “ఏకాంత ధ్యానమందిరం” అని రాసి ఉన్నది. దానికి దిగువలో ఒక పాచిపట్టిన కొలనున్నది. రష్యను భూస్వాములు వేసుకునే ఇంగ్లీషు ఉద్యానాలలో అలాటిది ఉండటం స్వాభావికమే. కొండ దిగువనా, కొంచెం ఎత్తులోనూకూడా బూడిదరంగుగల చెక్కల కుటీరాలున్నాయి. మన కథానాయకుడు ఎందుకో వాటిని చూస్తూనే లెక్కించనారంభించి, రెండువందలకు పైగా ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఈ ఇళ్ళమధ్య ఎక్కడా ఒక చెట్టుగాని, ఒక పచ్చని పొదగాని, పొరపాటున కూడా కనిపించలేదు. ఈ దృశ్యానికి ప్రాణం తెచ్చినది ఇద్దరు ఆడవాళ్ళు; వాళ్ళు పావడాలు ఎగదోసి, కొలనులో మోకాలిబంటి నీటిలో నిలబడి, చెరొక కర్రా పట్టుకుని, చినిగిన వల ఒకటి లాగుతున్నారు. అందులో రెండు మూడు చేపలు చిక్కుకుని ఉన్నాయి. వాళ్ళు ఎందుకో ఒకరినొకరు ఆక్షేపించుకుంటూ జగడమాడుతున్నట్టు కనిపించారు. దూరాన ఉన్న పైన్‌ అడవి నీలపు మరకలాగా ఉన్నది. వాతావరణం కూడా ఈ దృశ్యానికి తగ్గట్టే ఉంది. ఎండాలేదు, పూర్తిగా ముసురూలేదు; ఆదివారాలప్పుడు తప్పిస్తే మిగతా రోజుల్లో సౌమ్యంగా ఉండే బారకాసు సిపాయిల దుస్తుల్లాగా, తేలిక బూడిదరంగు కాంతిగా ఉన్నది. అంతలో ఒక కోడి గట్టిగా కూసి దృశ్యానికి మెరుగుపెట్టింది. పెట్టల తగాదాల్లో ఇతర పుంజులు ఈ కోడి నెత్తిని నసాళం అంటా పొడిచేశాయి. అది రెక్కలు విదిలిస్తే వాటికి చాలాభాగం ఈకలు కూడా లేక తుంగచాపల్లా ఉన్నాయి.

బండీ ఇంటిముందు ఆవరణలో ప్రవేశించేసరికి ఇల్లుగలాయన వాకిటనే నిలిచి ఉండటం చిచీకవ్‌ కంటపడింది. ఆయన పలచని ఆకుపచ్చ కోటు ధరించి, ఎండకు చెయ్యి అడ్డంపెట్టుకుని, సమీపించే బండిని పరీక్షిస్తున్నాడు. బండీ దగ్గరికి వస్తున్నకొద్దీ ఆయన మొహం వికసించసాగింది; చిరునవ్వు విస్తరించింది.

చిచీకవ్‌ బండి దిగుతూండగానే ఆయన “పావెల్‌ ఇవానొవిచ్‌గారే! ఇంతకాలానికి మేం జ్ఞాపకం వచ్చామన్నమాట!” అన్నాడు.
 
(ఇంకా ఉంది)
——–
1. గసిక = శలాక, కోతగా చెక్కిన కొయ్య, త్రవ్వు సాధనము, బరిసె, గశికము (కొయ్యమేకు)
2. అకేషియా = కసింద చెట్టు

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.