గతనెలలో తెలుగు వికీపీడియా

రవి వైజాసత్య
[రవి వైజాసత్య]

రవి వైఙాసత్య (http://saintpal.awardspace.com/)

తెలుగు వికీపీడియాలో గ్రామాలు, సినిమాలు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా అన్న పలు సద్విమర్శలు దృష్టిలో పెట్టుకొని, అవేకాదు, ప్రతి ఒక్కరికీ నచ్చేవి, ఉపయోగపడేవి ఇంకా చాలా ఉన్నాయని తెలియజెప్పేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు వికీపీడియన్లు. అందులో భాగమే ఈ శీర్షిక.

ఇటీవల మొదటి పేజీలో ప్రదర్శించబడిన కొన్ని తప్పకుండా చదవదగిన వ్యాసాలు: సుడోకు, మాయాబజార్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, హైదరాబాదు, తళ్ళికోట యుద్ధము, అక్షరధామ్, టి.జి.కమలాదేవి, మలేరియా, ఒమన్, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (ఈ రేంజి చూస్తే తెలియట్లా తెవికీ విస్తృతి ఈ ఈమధ్య గణనీయంగా పెరుతోందని)

ఇలాంటి ప్రముఖ వ్యాసాలను ప్రతివారం కోరుకున్న వారికి ఈ-మెయిల్ రూపములో పంపిస్తున్నాం. మీరూ మెయిలింగ్ జాబితాలో చేరాలనుకుంటే tewiki-maiku-subscribe@googlegroups.com కు ఈ-మెయిల్ చెయ్యండి.

తెలుగు వికీ విస్తృతి పెంచటంలో భాగంగా ఇప్పుడు మానవ శరీరంలోని వివిధ భాగాల గురించి శాస్త్రీయ వ్యాసాలు వస్తున్నాయి. (మచ్చుకు కాలేయం, ముక్కు వ్యాసాలు చూడండి). ఇవి చూసిన తర్వాత మీరు, ఎవరన్నారూ తెలుగులో శాస్త్రీయ పరిభాష లేదని? అని అనుకుంటారు.

తెలుగు వర్ణమాలలో ఏ అక్షరాలు దంత్యాలు? ఏవి తాలవ్యాలు? తెలుగులో పాలు అన్న పదం కన్నడలో హాలు ఎలా అయ్యింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుగు వర్ణమాలలో వచ్చేస్తున్నాయి (ఆహా..అయితే చూడండి )

తెవికీలో జ్ఞాన గుళికలవేట

పట్టి తెచ్చిన వీరులకు తెవికీ వీరతాళ్ళు, వీరనారీమణులకు గంధపు పూతలు..ఇక కాస్కోండి మరి. చిన్న క్లూ (ప్రశ్నలోనే ఒక పదానికి లింకుంటుంది దాన్ని పట్టుకొని వెళితే గమ్యం చేరతారోచ్)

*తొలకరి వర్షాలు నేలతాకగానే అబ్బా ఏమీ మట్టి వాసన మావూరు గుర్తుకొస్తుందే అనుకుంటాము కదా? మరి ఆ వాసన ఎక్కన్నుండొస్తుందో వెతికి పట్టుకోండి చూద్దాం.

*ఒక మహర్షికి, జింకకు పుట్టినవాడు. ఈయన పేరుమీదుగానే శృంగేరి నగరానికా పేరువచ్చింది. ఎవరీ జింక పుత్రుడు? ఏమా కథ?

మీకు తెలుసా?

* దక్షిణ భారతదేశములోనే అత్యధికంగా వర్షం కురుస్తూ దక్షిణ చిరపుంజిగా పేరుగాంచిన ప్రదేశం ఆగుంబె. ఆర్.కె.నారాయణ్ పుస్తకం ఆధారముగా తీసిన మాల్గుడి డేస్ ఇక్కడే చిత్రీకరించారు. (ఆ ఇల్లు ఫోటో వ్యాసంలో చూడండి)

* అవధానం, ఇది నాకు తెలుసులేవో.. మేడసాని మోహన్ గారిని చూడలేదా అనుకుంటున్నారా, ఈ అవధానం వేరు. మీరే చూడండి.

*ఇటీవల మన క్రికెట్టు వీరుడు టెండుల్కర్ తన సతీమణితో కలిసి ఇక్కడ సర్పదోష నివారణ చేశాడట!!! (కుక్కే సుబ్రమణ్య లో) ఎక్కడుందీ గుడి? ఏమిటీ విశేషం? చదివితే మీకే తెలుస్తుంది.

*భీమునిపట్నం దేశంలోనే రెండవ ప్రాచీన పురపాలక సంఘమని?

* పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు ఓడిపోయాడని? మరి శ్రీనాథుడు నాకు చెప్పలేదే అంటారా?

*ఖడ్గతిక్కన – వెనుక కథ ఏంటి? చారిత్రక సత్యాసత్యాలు తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చూడాల్సిందే.

* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎ.పి.యస్.ఆర్.టి.సి.), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ ప్రపంచంలోనే ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ 1999 లో నమోదైనది.

నా సిఫారుసులు (నాకు నచ్చిన వ్యాసాలు)

రాజా రవివర్మ,

ఆది శంకరాచార్యులు,

విశ్వామిత్రుడు,

రుక్మిణీదేవి అరండేల్,

జోగ్ జలపాతం,

రాచమల్లు రామచంద్రారెడ్డి.

స్వేచ్ఛా గ్రంథాలయమైన వికీసోర్స్ లో ఏం జరుగుతోంది?

* తెలుగు వికీసోర్స్ శరవేగంగా 5000 పుటల దిశగా పరుగులెత్తుతోంది.

* ఆంధ్ర మహాభారతము గుంపు సౌప్తిక పర్వాన్ని తెనుగిస్తున్నారు. మీరూ ఒక చెయ్యి వేస్తే బాగుంటుంది.

* భగవద్గీత తెలుగు అనువాదం పూర్తయ్యింది !!

* కుమారీ శతకము పూర్తి తాత్పర్యాలతో సహా లభిస్తున్నదిప్పుడు.

*ఇవే కాక వీణె బసవప్ప రాసిన గానవిద్యా వినోదినిని, మొల్ల రామాయణాన్ని మరియు కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారి ఆంధ్ర విజ్ఞానసర్వస్వాన్ని యూనీకోడీకరిస్తున్నారు. (అంటే ఇవన్నీ ఎత్తిరాసే గొడవల్లేకుండా ఉచితంగా యూనీకోడ్లో పూర్తిగా శోధించే విధంగా త్వరలోనే లభ్యమవుతాయన్నమాట.)

(మరిన్ని విశేషాలు మరోసారి…)

రవి వైఙాసత్య (http://saintpal.awardspace.com/)

రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! అమెరికాలో పరిశోధన పనిలో ఉన్నారు. తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది.

This entry was posted in జాలవీక్షణం and tagged . Bookmark the permalink.

3 Responses to గతనెలలో తెలుగు వికీపీడియా

  1. jyothi says:

    కుమారీ శతకం రాసింది నేను ఐతే అక్కడ unknown author అని ఉందేమిటి? కాస్త సరి చేయండి.

  2. అక్కడ unknown అని ఉన్నది, కుమారీ శతకకర్త గురించి. వ్యాసాన్ని చేర్చినవారి పేర్లు ఆయా పెజీల చరితంలో ఉంటాయి చూడండి.

  3. చక్కటి ఉదాహరణలు. రాసేవారికి బాగా పనికొస్తాయి.

Comments are closed.