ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమంలో కొన్ని ఘట్టాలు

indiaflagparade.pngindiaflagparade.pngindiaflagparade.pngindiaflagparade.pngindiaflagparade.pngindiaflagparade.png
ఆంధ్ర ప్రదేశ్ లో స్వాతంత్ర్యపోరాటంలో భాగంగా 1930లలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఈ వ్యాసంలో ఉన్న సమాచారం హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో PhD చేస్తున్న వుల్లి ధనరాజ్ గారు సమర్పించిన ఎమ్.ఫిల్. పరిశోధనాపత్రం (dissertation) లో నుంచి తీసుకోవడం జరిగింది. అందుకు తన అంగీకారం తెలిపిన శ్రీ ధనరాజ్ గారికి పొద్దు సంపాదకమండలి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

————————–

భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రపంచచరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. అహింసాయుతంగా స్వాతంత్ర్యోద్యమం జరిగినప్పటికీ, సాయుధ పోరాటాలు జరగకపోలేదు. 1913 – 1935 కాలంలో సాయుధ తిరుగుబాట్లు, కుట్రలు జరిగాయి. ముఖ్యంగా ఇవన్నీ బెంగాల్లోను, పంజాబు, ఇతర ఉత్తర భారత ప్రాంతాల్లోను జరిగాయి. దక్షిణాదిన చాలా తక్కువగా జరిగాయి.1933-35 ల్లో జరిగి, కాకినాడ కుట్ర కేసుగా ప్రసిద్ధి పొందిన విప్లవ ఘటన వాటిలో ఒకటి.

శాసనోల్లంఘనోద్యమం ఉధృతంగా ఉన్న రోజులవి. అయ్యదేవర కాళేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, తెన్నేటి విశ్వనాథం, బెజవాడ గోపాలరెడ్డి, బులుసు సాంబమూర్తి, క్రొవ్విడి లింగరాజు వంటి నాయకుల నేతృత్వంలో ఉద్యమం జరిగింది. ఉద్యమాన్ని అణచివేసే పనిలో భాగంగా బ్రిటిషువారు నాయకులను జైల్లో పెట్టడం, ప్రజల ఇళ్ళలో సోదాలు చేసి భయభ్రాంతులను చెయ్యడం వంటి పనులు చేసారు. గుమిగూడిన ప్రజలపై అకారణంగా లాఠీచార్జి జరిపేవారు. పెద్దాపురంలో జరిగిన సంఘటన పోలీసుల దౌష్ట్యానికి ఓ ఉదాహరణ.

పెద్దాపురం ఘటన:

1930 డిసెంబరు 16 న పెద్దాపురం పట్టణంలో 80 మంది వరకు పెద్దలు, పిన్నలు ధనుర్మాస వనభోజనాల కోసం బొక్కా నారాయణమూర్తి గారి తోటలోకి చేరుకున్నారు. వత్సవాయి జగపతి వర్మ గారు అతిథేయి. క్రొవ్విడి లింగరాజు, దువ్వూరి సుబ్బమ్మ, పెద్దాడ నారాయణమ్మ అక్కడ చేరిన ప్రముఖుల్లో కొందరు. ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించాలనేది కూడా వారు చర్చించబోతున్నారు. ఈ సమాచారం తెలిసికొన్న సర్కిలు ఇన్స్పెక్టరు దప్పుల సుబ్బారావు తన బలగంతో అక్కడికి చేరుకున్నాడు. వనభోజనార్థుల చుట్టూ వలయంగా చేరి, చెదిరిపొమ్మని హెచ్చరిక చేసాడు. వాళ్ళకు చెదిరిపోయే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే లాఠీచార్జి చేయించాడు.

ఇదిలా ఉండగా గాంధీ-ఇర్విన్ ఒడంబడిక పర్యవసానంగా బ్రిటిషు ప్రభుత్వం ఉద్యమంపై బిగించిన ఉక్కు పిడికిలిని కొంత సడలించింది. శాంతియుతంగా పికెటింగు వగైరాలతో ఉద్యమం జరుపుకునేందుకు అనుమతించింది. జైళ్ళలో ఉన్న అనేకమంది ఉద్యమకారులను విడుదల చేసింది. ఆంధ్రలోనూ అనేకులు విడుదలయ్యారు. వారిలో ప్రతివాది భయంకరాచారి ఒకరు.

మిగతా దేశంలో వలెనే ఆంధ్ర లోనూ శాసనోల్లంఘనం కొనసాగింది. అయితే శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహించుకోవచ్చని ఇచ్చిన హామీని విస్మరించి బ్రిటిషు ప్రభుత్వం అణచివేత చర్యలను కొనసాగించింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అటువంటి చర్యల్లో ప్రముఖమైనవి కొన్ని:

వాడపల్లి కాల్పుల ఘటన:

1931 మార్చి 30 న వాడపల్లిలో పోలీసు కాల్పులు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లి లో వెంకటేశ్వరస్వామి రథోత్సవం జరుగుతూండగా జరిగిన సంఘటన ఇది. రథంపై దేవుడి విగ్రహాలతో పాటు జాతీయ నాయకుల ఫోటోలను కూడా ఉంచి ఊరేగిస్తున్నారు. తహసీల్దారుతో సహా అక్కడికి చేరుకున్న డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్, వాటిని తొలగించమని ఆదేశించాడు. అందుకు తిరస్కరించిన ప్రజలపై కాల్పులు జరపగా నలుగురు మరణించారు. అనేకమంది గాయపడ్డారు.

సీతానగరం ఆశ్రమ ఘటన:

ఇక రెండోది 1932 జనవరి 19న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఆశ్రమంలో జరిగింది. సీతానగరం ఆశ్రమాన్ని మద్దూరి అన్నపూర్ణయ్య, మరికొందరి పర్యవేక్షణలో ఉంచి మిగిలినవారు ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొనేందుకు క్రొవ్విడి లింగరాజు నాయకత్వంలో కాకినాడ వెళ్ళారు. అప్పటికే – జనవరి 5న – ఆశ్రమం ప్రచురిస్తున్న “కాంగ్రెస్” పత్రికను చట్టవ్యతిరేకమైనదని ప్రభుత్వం ప్రకటించి ఉంది. ఈ నేపథ్యంలో డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ అక్కడికి చేరుకుని ‘ఈ ఆశ్రమాన్ని చట్టవిరుద్ధమైనదని ప్రకటించాం. దీన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి’ అని ఆదేశించాడు. అందుకు తిరస్కరించిన ఆశ్రమవాసులపై విచ్చలవిడిగా లాఠీచార్జి చేసాడు. 75 ఏళ్ళ ముదుసలిని కూడా వదలకుండా అందరినీ అరెస్టు చేసాడు.

సామర్లకోటకు చెందిన ప్రతివాది భయంకరాచారిని ఈ సంఘటనలు కలచివేసాయి. సామర్లకోటలో పదవ తరగతి వరకూ చదివిన భయంకరాచారి విశాఖపట్నం ఎ.వి.ఎన్ కళాశాలలో ఇంటర్మీడియెట్ లో చేరి సగంలోనే ఆపేసాడు. విద్యార్థిగా ఉండగానే ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. చదువు ఆపేసాక కొన్నాళ్ళు సీతానగరం ఆశ్రమంలో గడిపాడు. 19 ఏళ్ళ వయసులోనే లాహోరు కాంగ్రెసు సభలకు హాజరయ్యాడు. శాసనోల్లంఘనోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1930 మేలో గురజనపల్లిలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. గాంధీ – ఇర్విన్ ఒడంబడిక ననుసరించి ఇతర నాయకులతో పాటు తానూ విడుదలయ్యాడు. కన్ననూరు, బళ్ళారి జైళ్ళలో ఉండగా లాహోరు కుట్ర కేసు నిందితులు, బెంగాలు విప్లవకారులతో సంపర్కంలోకి వచ్చాడు. వారి వద్ద నుండి బాంబులు తయారుచేసే పద్ధతులు నేర్చుకున్నాడు.

భయంకరాచారి విప్లవ వీరులను ఆరాధించాడు. సంపూర్ణ విప్లవమే సంపూర్ణ స్వరాజ్యం తెస్తుందని నమ్మాడు. గాంధీ అహింసా మార్గాన్ని వ్యతిరేకించాడు. ప్రజలను చైతన్యవంతులను చేసి విప్లవోద్యమంలోకి ఉరకాలని ఉద్బోధించాడు. “యువతను ఉరితీస్తూ, ప్రవాస శిక్షలు విధిస్తూ ఉంటే జాతి కళ్ళు మూసుకుని కూర్చోలేదు. ఎదురుతిరిగి విప్లవించాలి. అందుకవసరమైన ఖర్చుల కోసం బ్యాంకులను దోచాలి..” అని అనేవాడు.

కాకినాడ బాంబు ఘటన:

ఉద్యమ నాయకులపై అన్యాయంగా లాఠీచార్జి జరిపిన డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ ను దోషిగా నిర్ణయించి, అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు భయంకరాచారి. మరో ఎనిమిది మందితో చేరి ఒక పథకాన్ని రూపొందించాడు. కలకత్తా, బొంబాయి, పాండిచ్చేరిల నుండి బాంబు తయారీ సామానులను సేకరించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యస్థలంగా ఉండేందుకు గాను సి.హెచ్.ఎన్. చారి అండ్ సన్స్ అనే ఓ బోగసు కంపెనీని పెట్టారు. అయితే ప్రత్యక్ష చర్యలో అందరూ భాగస్వాములు కాదు. భయంకరాచారితో పాటు కామేశ్వరశాస్త్రి అనే వ్యక్తి మాత్రమే ఇందులో పాలుపంచుకున్నాడు.

1933 ఏప్రిల్ 6 న కాకినాడలోని ఒక చోటికి ముస్తఫా రానున్నాడని తెలిసికొన్న వీరు, బాంబులు తయారుచేసుకొని అక్కడ మాటు వేసారు. అయితే ముస్తఫా అక్కడికి రాలేదు. ఇద్దరూ నిరాశ చెంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళారు. ఏప్రిల్ 14 న మళ్ళీ కాకినాడలోనే మరోచోట ప్రయత్నించారు. అయితే ఈ సారి కూడా ముస్తఫా వారనుకున్నట్టు రాలేదు. మళ్ళీ ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మాటు వేసారు. మూడోసారి కూడా ముస్తఫా మాటు వైపు రాలేదు. ఈసారి ఇళ్ళకు తిరిగివెళ్ళక, బాంబులను అక్కడే ఉన్న ఒక పడవలో ఒక సంచిలో పెట్టి దగ్గరలో ఉన్న హోటలుకు కాఫీ తాగేందుకు వెళ్ళారు. వీళ్ళు కాఫీ తాగుతూండగా రేవు కూలీ ఒకతను పడవలో ఉన్న సంచీని చూసి కుతూహలం కొద్దీ సంచీని తెరచి బాంబులను బయటికి తీసాడు. బాంబు పేలింది. ఆ కూలీతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు.

పేలుడు స్థలానికి కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే ఉన్న ముస్తఫా, పేలుడును విని ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నాడు. వెంటనే దర్యాప్తు మొదలైంది. ఘటనా స్థలంలో మరో మూడు బాంబులు దొరికాయి. అదొక విప్లవకారుల కుట్ర అని, అధికారులను చంపే పథకమనీ ఓ ఐదు రోజుల వరకూ దర్యాప్తు అధికారులకు తెలియలేదు. ఐదు రోజుల తరువాత కాకినాడకు చెందిన ఎస్.కె.వి.రాఘవాచారి అనే వ్యక్తి రామచంద్రాపురం సబ్ ఇన్స్పెక్టరుకు కుట్ర సంగతి వెల్లడించడంతో విషయం బైటపడింది. పోలీసులు ఒకరొకరినే పట్టుకుంటూ వచ్చారు. సెప్టెంబరు 11 న భయంకరాచారిని కాజీపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.

డిసెంబరు 1933 నుండి ఏప్రిల్ 1934 వరకు తూర్పు గోదావరి సెషన్సు కోర్టు ఈ కేసును విచారించింది. మొత్తం తొమ్మిది మందికీ వివిధ వ్యవధుల జైలు శిక్షను విధించింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు మద్రాసు హైకోర్టుకు వెళ్ళగా అక్కడ తీర్పు 1935 సెప్టెంబరు 26 న వచ్చింది. హైకోర్టు మాత్రం భయంకరాచారి, కామేశ్వరశాస్త్రి లను మాత్రమే కుట్రకు ప్రధాన నిందితులుగా పేర్కొంది. మిగిలిన ఏడుగురూ అప్పటికే గడిపిన రెండేళ్ళ శిక్ష సరిపోతుందని భావించి విడుదల చేసింది. భయంకరాచారికి ఏడేళ్ళ జైలుశిక్షను విధించి అండమాను జైలుకు పంపింది. కామేశ్వరశాస్త్రికి నాలుగేళ్ళ శిక్ష విధించింది. 1937 లో ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెసు గెలిచినపుడు భయంకరాచారి జైలు నుండి విడుదలయ్యాడు.

ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మరి రెండు సంఘటనలను కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం సమంజసంగా ఉంటుంది. బ్రిటిష్ పాలనలో తిరగబడిన సామాన్య ప్రజల ఆగ్రహజ్వాలల్లో ఒక ఆంగ్లేయాధికారి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒకటి కాగా ఆంగ్లేయాధికారులు ఒక సామాన్యుడిని పొట్టనబెట్టుకున్న ఘటన ఇంకొకటి:

కడప మసీదు ఘటన:

1832 జూన్ 15 సోమవారం నాడు ఎవరో ఒక పందిపిల్లను చంపి కడపలోని పెద్ద మసీదు (జుమ్మా మసీదు)లో పడేశారు. విషయం తెలిసిన ముస్లిములు కోపోద్రిక్తులయారు. “దీన్”, “దీన్” అని కేకలు వేసుకుంటూ వేలాది మంది ముస్లిములు గుంపులు గుంపులుగా మసీదు వద్దకు చేరుకున్నారు. సమయానికి కలెక్టరు లేకన్ ఊళ్ళో లేడు. ఆయన సబ్ కలెక్టరు మెక్డొనాల్డ్ ను మిలిటరీని తీసుకుని సంఘటనాస్థలానికి వెళ్ళి పరిస్థితి అదుపు తప్పకుండా చూడమని ఆదేశించాడు. పందిపిల్లను చంపిపడేసినవారి ఆచూకీ తెలిపితే రూ.500 లు బహుమతిగా ఇస్తామని చాటింపు వేయించాడు. యువకుడైన మెక్డొనాల్డ్ మిలిటరీ రాక ముందే తన సిబ్బందితో మసీదు వద్దకు చేరుకున్నాడు. అతడు అక్కడ గుమికూడిన ప్రజలకు నచ్చజెపుతూ ఉండగా ఒక యువకుడు హఠాత్తుగా మెక్డొనాల్డ్ పై దాడిచేసి కత్తితో రొమ్ముమీద పొడిచాడు. అంతలో అక్కడికి చేరిన సైన్యానికి కాల్పులు జరపమని ఆదేశాలిస్తూ మెక్డొనాల్డ్ సమీపంలోని ఇళ్ళలోకి దూరబోగా ఎవరూ రానివ్వలేదు. అంతలో మరో యువకుడు ఇంకో పోటు పొడిచాడు. మొదటిపోటు పొడిచిన యువకుడు సైనికులు జరిపిన కాల్పుల్లో గాయపడినా వెనుదీయక ఒక సైనికాధికారిని పొడిచి చంపి మరీ నేలకొరిగాడు.

ఈ సంఘటనలో మరణించిన సబ్ కలెక్టర్ మెక్డొనాల్డ్ యువకుడు. అప్పటికి కొన్ని నెలల క్రితమే అతడికి పెళ్లయింది. అతడి మరణవార్త విన్న భార్య ఆగ్నస్ దిగ్భ్రాంతికి గురై, కోమాలోకి వెళ్ళి 21 రోజుల తర్వాత కోమాలోనే చనిపోయింది. వీరిద్దరి సమాధులు కడప నగరంలో దొరల గోరీలు అనేచోట ఇప్పటికీ ఉన్నాయి.

పరాయి పాలన మీద పేరుకుపోయిన అసంతృప్తి, నిరసన భావాలే ఈ సంఘటనలో పెల్లుబికి ఈ హత్యాకాండకు దారితీశాయి. ఆంగ్లేయుల పాలనపై ప్రజల్లో అప్పటికే తీవ్ర అసంతృప్తి పేరుకుపోయి ఉందని రికార్డులు చెప్తున్నాయి. 1857 తిరుగుబాటుకు ముందే ప్రజల చేతుల్లో ఒక ఆంగ్లేయాధికారి ప్రాణాలు కోల్పోయిన అరుదైన సంఘటనల్లో ఇదొకటి.

పలనాడు సత్యాగ్రహం

ఇక రెండోది స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణాలు కోల్పోయిన తొలి ఆంధ్రుడు కన్నెగంటి హనుమంతు గాథ (తెలుగు అకాడెమీ వారి బియ్యే చరిత్ర పుస్తకం, ఈభూమి పత్రికలో వచ్చిన “తెల్లవాడి తుపాకిని ఎదురొడ్డిన కన్నెకంటి హనుమంతు” వ్యాసం ఆధారంగా):
గుంటూరు జిల్లా పలనాడులో అటవీప్రాంతం అధికం. అక్కడి పేద ప్రజలు పుల్లరి, వంటచెరకు, ఎరువు ఆకు మొదలైన వాటికి గాను ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసి వచ్చేది. వారిని అటవీశాఖాధికారులు, రెవెన్యూ ఉద్యోగులు నానా ఇబ్బందులు పెట్టేవారు. 1921 లో కరువు పరిస్థితుల వల్ల ప్రజలు పన్నులలో రాయితీలు కోరారు. అడవి నుండి వంటచెరకును ఉచితంగా తెచ్చుకొనేందుకు, నీటివనరులను వాడుకునేందుకు అనుమతి కోరారు. ఆవులను మేపుకోడానికి చెల్లించే 12 అణాల పన్నును 3 అణాలకు తగ్గించమని కోరారు.

ఈ వినతులను బ్రిటిషు పాలకులు పట్టించుకోలేదు. మాచర్ల, వెల్దుర్తి, శిరిగిరిపాడు, రెంటచింతల, ఇంకా ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పశువులను అడవిలోకి మేత కోసం తోలేవారు. అధికారులెవరైనా వాటిని బంధిస్తే, ప్రజలు మూకుమ్మడిగా వెళ్ళి వాటిని విడిపించుకొచ్చేవారు. నడిపాలెంలో వందగేదెలను అధికారులు నిర్బంధించగా, ఒక మహిళ నాయకత్వంలో ప్రజలు రేంజరుపై దాడి చేసి, వాటిని విడిపించుకున్నారు. అధికారులు కూడా వీరిని ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను సమీకరించుకొన్నారు.

అధికారుల నియంతృత్వ ధోరణికి ఆగ్రహించిన ప్రజలు అటవీ, రెవిన్యూ ఉద్యోగులను వెలివెయ్యడం మొదలుపెట్టారు. మాచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వ అధికారులకు చాకలి, మంగలి మొదలైనవారి సేవలు దొరకలేదు. డిప్యూటీ తాసీల్దారు కుమారుడికి గుక్కెడు పాలు కూడా కరవయ్యాయి. రేంజరు, తదితర ఉద్యోగులను ఇళ్ళు ఖాళీ చేయించి, వారికి తమ ఇళ్ళను అద్దెకు ఇచ్చేది లేదని చెప్పేశారు.

పలనాట పరిస్థితిని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరు అక్కడికి వచ్చి, తన ఆదేశాలను గ్రామాల్లో చాటింపించేందుకు గాను తప్పెటవాళ్ళను పిలిపించాడు. వాళ్ళంతా తమ తప్పెట్లు చెడిపోయాయని చెప్పారు. గ్రామాధికారి కూడా వారిని సమర్ధించాడు. ఇదే సమయానికి అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెసు పార్టీ పనుపున ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంతం నరసింహాచారి పలనాడు చేరుకున్నారు. వారి వలన శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతుందని భావించి, వారిని పూచీకత్తు చెల్లించమని కలెక్టరు ఆదేశించాడు. ప్రజలు వారిని తప్పెట్లతో ఊరేగింపుగా కలెక్టరు వద్దకు తీసుకువెళ్ళారు. చెడిపోయాయని తనకు చెప్పి, కాంగ్రెసు నాయకులను అవే తప్పెట్లతో స్వాగతించడం కలెక్టరుకు అవమానము, ఆగ్రహమూ కలిగించింది. పూచీకత్తు చెల్లించేందుకు నిరాకరించినందుకు గాను వారికి ఏడాది జైలుశిక్ష విధించాడు.

దీంతో రెచ్చిపోయిన ప్రజలు పన్నులు చెల్లించడం మానివేసి, పశువులను అడవిలోకి తోలారు. అటవీ నిబంధనలు అతిక్రమించవద్దని, పన్ను చెల్లించమని కాంగ్రెసు చెప్పినప్పటికీ ప్రజలు వినలేదు. పోలీసులతో ఘర్షణలూ జరిగాయి. వెల్దుర్తిలో రిజర్వు పోలీసు బలగంపై దాడి చేసి, వారి బంగళాను ఆక్రమించుకున్నారు. జెట్టిపాలెంలో పశువులను బంధించిన బందెలదొడ్డిపై దాడి చేసి, వాటిని విడిపించుకుపోయారు. దీంతో కలెక్టరు, పోలీసు సూపరింటెండెంటు మొదలైనవారు పలనాట విడిదిచేసి, పరిస్థితిపై కన్నేసి ఉంచారు.

ఈ సందర్భంలో మించాలపాడు వద్ద జరిగిన సంఘటన ప్రముఖమైంది. అధికారులు అక్కడి అడవిలో 300 పశువులను పట్టుకొని బందెలదొడ్డికి తరలిస్తూండగా వారిపై 300 మంది వరకు ప్రజలు దాడి చేసి, రాళ్ళు రువ్వారు. అధికారులు అందినవారిని అందినట్లు చితకబాదారు. చెన్నయ్య అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలిసి ఊళ్ళోనుంచి చెన్నయ్య మామ కన్నెగంటి హనుమంతు పరుగున వచ్చాడు. పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో చెన్నయ్యను కాపాడబోయిన కన్నెగంటి హనుమంతు, మరో ఇద్దరు మరణించారు. కాల్పులు జరిగింది సాయంత్రం 6 గంటలకైతే అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రాణాలతోనే ఉన్న హనుమంతు సమయానికి వైద్యసహాయం అందక మరణించాడు. అంతసేపూ క్షతగాత్రుడై పడి ఉన్న హనుమంతుకు మంచినీళ్ళివ్వబోయిన గ్రామస్థులను సైతం అధికారులు అడ్డుకున్నారు. తదనంతరం జరిగిన అణచివేత చర్యల కారణంగా పలనాట శాసనోల్లంఘనోద్యమం 1922 కల్లా చల్లబడింది. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర శాఖ ఈ ఉద్యమానికి సుముఖంగా లేకపోవడం ఉద్యమం చల్లారడానికి ఒక కారణం. ఈ ఉద్యమానికే పలనాడు సత్యాగ్రహం అని, పుల్లరి సత్యాగ్రహం అనీ పేరు వచ్చింది.

About వుల్లి ధనరాజ్

వుల్లి ధనరాజ్ హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో PhD చేస్తున్నారు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

3 Responses to ఆంధ్రలో స్వాతంత్ర్యోద్యమంలో కొన్ని ఘట్టాలు

  1. P.H.D Thesis work అని చెప్పిన తరువాత, అడగడానికి మొహమాటంగా ఉంది. వీటిని వికీలో పెట్టాచ్చా? (తగిన విధంగా మార్పు చేర్పులు చెయ్యబడతాయి)

  2. మంచి వ్యాసం.
    చరిత్ర మీద నాకెంతో వ్యామోహం వున్నా ఇలా మన పల్లె పల్లెల్లో జరిగిన చరిత్ర ఎక్కడ వుందో ఎలా సంపాదించాలో తెలియదు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  3. siriishasri says:

    ప్రసాద్ గారు చెప్పినది నిజమే!
    ఎన్నో సాహస కథలు అజ్ఞాతంలో ఉన్నాయి.
    ఉదాహరణకు, “మల్లు దొర”.
    ఇతను అల్లూరి సీతా రామ రాజుకు అనుచరుడుగా, కొంత కాలం మన్యం తిరుగు బాటులో
    పాల్గొన్నాడు.
    అండమాన్ జైల్ శిక్షను అనుభవించాడు.
    తర్వాత, ఇండియా కు స్వాతంత్ర్యం వచ్చినది.
    మల్లు దొర 1952 లో
    పార్లమెంట్ సభ్యుడు.
    1969 లో మరణించెను.
    ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
    చరిత్ర కారులు, స్థానిక రచయితలు,
    పరిశోధనకారులు
    కొంత ప్రయత్నం మీద ఈతని జీవిత కథను సేకరించ గలరు.
    [Comment converted from RTS to Telugu. – ed.]

Comments are closed.