మద్రాసులో నా కచేరీ ఎక్కడ జరిగినా కొడవటిగంటి కుటుంబరావు, ఆయన సతీమణి శ్రీమతి వరూధిని, వారి అమ్మాయి, అబ్బాయి తప్పక వచ్చేవారు. నాకు ఆయనతో బాగా పరిచయం అయ్యేక, ఆయన్ని, ప్రేక్షకులలో వెనకాల ఎక్కడో కూర్చుని వుండటం (నా కచేరీలోనే) చూసాను ఒకసారి. కచేరీ అయాక, నన్ను ఆయన వేదిక దగ్గరకు వచ్చి కలిసినపుడు నేనన్నాను “అదేమిటండీ, మీరలా ఎక్కడో కూర్చొనడమేమిటి? ఈసారికి మా ఇంటికి వచ్చేయండి. కచేరీకి మనం కలిసి వెళదాం. మీరు ముందర కూర్చుంటే నాకు ప్రోత్సాహంగా వుంటుంది” అని. అందుకు కుటుంబరావు ఏమన్నారో తెలుసా? అబ్బే, అలా కూర్చుంటే thrill ఉండదు. మన స్నేహ విషయం తెలియనివ్వకుండా అలా శ్రోతలతో కలిసిపోయి, వాళ్ళ వ్యాఖ్యానాలు, ప్రశంసలు, ఒక చెవినీ, మీ కచేరీ మరొక చెవినీ వింటోంటే గొప్ప thrillingగా ఉంటుంది. అది పాడు చేయకండి” అన్నారు. అటువంటిది సంగీతంలో ఆయన ఆసక్తి.
మరొకసారి కలిసినపుడు, “ఏమండీ, నిన్న నేను ఇంకొకరి కచేరీకి వెళ్ళాను. నాకో సందేహం వచ్చింది, ఆ కచేరీ వింటోంటే” అన్నారు. ఏమిటని అడిగాను నేను. “ఒకే రాగానికి రెండు versions ఉంటాయా?” అని ప్రశ్నించారాయన. “ఏ రాగానికయినా వేర్వేరు treatments ఉండొచ్చు – కళాకారుడి మూడ్‌ని బట్టి. లేదా ఒకే కళాకారుడు ఆ రాగాన్ని వేర్వేరు విధాలుగా treat చేయవచ్చు. అతని మూడ్‌ని బట్టి. కాని మీకు సందేహం వచ్చినట్టు ఒకే రాగానికి రెండు versions వుండవు” అని వివరించాను. ఆయనకు ఆ సమాధానం చాలా నచ్చినట్టుంది. “కరెక్ట్” అన్నారు. అటువంటిది ఆయన విమర్శనాత్మక పరిశీలన.
కుటుంబరావు తమ అమ్మాయి వివాహానికి రిసెప్షన్లో నా కచేరీ పెట్టారు. మరి అప్పుడు పెండ్లికుమార్తె తండ్రిగా అందరినీ ఆహ్వానిస్తూ అటు వుండాలి కదా; హాయిగా వేదిక దగ్గరగా ఇంకొంతమంది సంగీతాభిమానులతో కలిసి, నా వీణ వింటూ ఇటు వుండిపోయారు. శ్రీమతి వరూధిని వచ్చి, “మీ కళారసన బంగారంగానూ, మీరీవేళ కూడా చిట్టిబాబుగారి వీణ కచేరీ వింటూ కచేరీకి వెళ్ళిన శ్రోతలాగ ఇక్కడే కూర్చుండిపోతే ఎలా? అతిథులను ఆహ్వానించవద్దూ” అని బుజ్జగించి తీసుకువెళ్ళేదాకా వెళ్ళలేదు. అటువంటి కళారసన కొడవటిగంటిది.
మేం ఇద్దరం ఎప్పుడు, ఎక్కడ కలిసినా సంగీతపరమైన ఏదో విషయం కదపందే ఊరుకొనేవారు కాదు.
కుటుంబరావుకు కర్ణాటకం, హిందుస్థానీ రెండూ అభిమానమైనవే. హిందుస్థానీలో కరీంఖాన్, ఫయాజ్‌ఖాన్, బడేగులాం అలీఖాన్ లాంటివారిని ఆరాధిస్తే కర్ణాటకలో సెమ్మంగుడి, అరియకుడి, సుబ్బులక్ష్మి, చెంబై, మధురమణి, బాలమురళి మొదలయినవారిని అభిమానించేవారు. సినిమా సంగీతంలో సైగల్‌ను తప్ప ఎవరినీ అంతగా మెచ్చుకొనేవారు కాదు. లతా మంగేశ్కర్ కన్న ఆశా భోంస్లే గొప్ప గాయని అని వాదించటం ఆయనకో సరదా.
కొడవటిగంటిది శ్రావ్యమైన గొంతు. సంగీతాన్ని స్వయంగా అభ్యసించేవారు. ప్రసిద్ధ హార్మోనియం వాయిద్యగాడు గోవిందరావు టేంబే వాయింపును ఆయన కరతలామలకం చేసుకున్నారు. (కొ.కు. రెండవ కుమారుడు ప్రసాద్ సితార్ బాగా వాయిస్తాడు) మహారాష్ట్ర గాయకులైన బాలగంధర్వ, దీనానాథ్, మాస్టరు కృష్ణారావుల పాటలకు ముగ్ధుడై ఒకప్పుడు బొంబాయిదాకా వెళ్ళి వారి పాటలు ప్రత్యక్షంగా విని వచ్చారు. ఆయన ఎంతో పాత రికార్డులు కూడా మొదటినుంచీ సేకరించేవారు.
ఒక రచయిత ఆయా అంశాలకు తెచ్చే పోలికను బట్టి ఆయన విషయపరిజ్ఞాన్ని, మేధాశక్తిని అంచనా గట్టవచ్చుననుకుంటే, కృష్ణశాస్త్రి కవితను సన్నాయి వాయిద్యానికీ, శ్రీశ్రీ కవితను డోలు వాయిద్యానికీ సంగీతపరంగా కుటుంబరావు చెప్పే పోలికను బట్టి ఆయనను అంచనా వేయవచ్చు. ఈ పోలికలో ఎంత విస్తృతమైన, నిగూఢమైన ఆలోచన ఉన్నదో యోచించినవారికి తెలుస్తుంది.
అంతటి రచయిత, మేధావి, భౌతికవాదికి నాటకాలవంటి ఇతర కళలతోబాటు సంగీతం పట్ల గొప్ప ఆసక్తి మాత్రమే కాక ప్రవేశం కూడా ఉండటం, ఆయన పరిపూర్ణ వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పాలి.
సాహిత్యసమాలోచన ప్రగతి సాహితి, జవాహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూ ఢిల్లీ
సంపాదకుడు: అశోక్ టంకసాల, జూన్ 1982
మద్రాసులోని అనేక ప్రసిద్ధ కళాకారుల్లో చిట్టిబాబు (1936-1995) ఒకరు. ఈమని శంకరశాస్త్రి శిష్యుడుగా, ఆకర్షణీయమైన వీణ విద్వాంసుడుగా తెలుగువారందరికీ ఇష్టుడూ, పరిచితుడూ అయిన చల్లపల్లి చిట్టిబాబుగారి వీణ కచేరీలు మద్రాసులో ఎక్కడ జరిగినా మా నాన్నగారు సకుటుంబంగా హాజరయేవారు. పన్నెండేళ్ళకే కచేరీలు మొదలుపెట్టిన ప్రాడిజీ చిట్టిబాబు. భానుమతి నిర్మించిన లైలా మజ్నూ సినిమాలో చిన్ననాటి నాగేశ్వరరావుగా నటించినది చిట్టిబాబే. ఆయన తెలుగు, తమిళంలో ఎన్నో సినిమా రికార్డింగులకి వీణ వాయించి, రంగులరాట్నం తరవాత పూర్తిగా కచేరీలకే పరిమితమైపోయారు. దేశవిదేశాల్లో కచేరీలిచ్చి, ఎన్నో ప్రజాదరణ పొందిన రికార్డులు రిలీజ్ చేసిన తరవాత అనారోగ్యం కారణంగా 59 ఏళ్ళకే మద్రాసులో మృతి చెందారు. కొమ్మలో కోయిల మొదలైన అనేక గీతాలకు స్వరరచన చేసి కోయిల శబ్దాన్ని వీణ మీద పలికించిన గొప్ప సంగీతకారుడు.
మా నాన్నగారు చనిపోయినప్పుడు పరామర్శించడానికి చిట్టిబాబు వెంట ఆయన తల్లి కూడా మా ఇంటికి వచ్చారు కాని ఉద్వేగం ఎక్కువై ఆవిడ కారు దిగి లోపలికి రాలేదు. సరిగ్గా ఒక వారం లోపునే ఆవిడ కూడా గుండెపోటుతో చనిపోవడంతో నేను చిట్టిబాబుగారింటికి వెళ్ళి ఆయనను పరామర్శించవలసి వచ్చింది. – రో.ప్ర.
“ఒక రచయిత ఆయా అంశాలకు తెచ్చే పోలికను బట్టి ఆయన విషయపరిజ్ఞాన్ని, మేధాశక్తిని అంచనా గట్టవచ్చుననుకుంటే, కృష్ణశాస్త్రి కవితను సన్నాయి వాయిద్యానికీ, శ్రీశ్రీ కవితను డోలు వాయిద్యానికీ సంగీతపరంగా కుటుంబరావు చెప్పే పోలికను బట్టి ఆయనను అంచనా వేయవచ్చు. ఈ పోలికలో ఎంత విస్తృతమైన, నిగూఢమైన ఆలోచన ఉన్నదో యోచించినవారికి తెలుస్తుంది.”
– నాకు అర్థం కాలేదు కానీ… ఆసక్తికరమైన వాక్యం…
“అంతటి రచయిత, మేధావి, భౌతికవాదికి నాటకాలవంటి ఇతర కళలతోబాటు సంగీతం పట్ల గొప్ప ఆసక్తి మాత్రమే కాక ప్రవేశం కూడా ఉండటం, ఆయన పరిపూర్ణ వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పాలి.”
– కొకు జిందబాద్! 🙂
సౌమ్య గారు,
బహుశా, కృష్ణశాస్త్రి గారి మృదువైన కవిత్వాన్ని, శ్రీశ్రీ గారి విప్లవ కవిత్వాన్ని అలా వీణ మరియు డోలు తో పోల్చినట్లున్నారు.
Pingback: ప్రాణహిత » కుటుంబంలో సంగీతం
Pingback: ఈమాట » కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం
In the case chittibabu gaaru, this information linking him to a role and his screen appearance is an unknown ,rare piece of information. Thanks to Rohini Prasad garu for his special bent of mind in collecting, retaining and for timely emanation of the informative trivia.