కొడవటిగంటి కుటుంబరావు – జీవితపు వరవళ్ళు

gokhale.PNG

మాధవపెద్ది గోఖలే

కుటుంబరావు కక్కయ్య మనకు, సాహిత్యలోకానికి భౌతికంగా అందకుండా దూరమైపోయినాడు. కాని మనలోను, సాహిత్యలోకంలోను, సమాజంలోనూ శాశ్వతంగా వుండిపోయింది ఆయన ప్రతిపాదించిన సాహిత్య శాస్త్రవిజ్ఞానం. ఆయన మన ఊహకందని ఒక నూతన పంథా మహారచయితగా తను బతికుండగానే అయినాడు. కనుక గతించినాక ఆయనకు ముట్టచెప్పవలసిందేం వుండదు.

మా అమ్మకు మేనత్త కొడుకు అవటంవల్ల ఆయన నాకు కక్కయ్య అయినాడు. నాకు బుద్ధి తెలుస్తున్న నా అయిదవ ఏటనుండి చివరిరోజులవరకూ తనని సన్నిహితంగా ఎరుగుదును. విమర్శనాదృష్టితో మాట్లాడటం, సామాజిక జ్ఞానం అప్పట్లోనే కనపరుస్తూండటంవల్ల తోటివారిలో ప్రత్యేకంగా కనబడుతూ ఆయన నన్ను చిన్నతనంలోనే ఆకర్షించాడు. తర్వాత మా చరిత్రలు దగ్గరగా నడవటం, ఆయన దృక్పథాలకు నేను సన్నిహితంగా ఉండటం ఇందుకు దోహదం చేసింది.

కుటుంబరావు పుట్టింది (1909), పెరిగింది, భవిష్యత్తుకు బీజాలు వేసుకుంది తెనాలిలో. ఆయన అయిదవ ఏట తండ్రి, పదకొండవ ఏట తల్లి మరణించారు. తోటి సంతతివారు అన్న వెంకటసుబ్బయ్య (ఓవర్సీరు, కవి, సాహితి పత్రిక సంపాదకవర్గం వాడు, సన్యసించి వెళ్ళాడు), చెల్లెలు అన్నపూర్ణ, తమ్ముడు కృష్ణమూర్తి (కథకుడు, బొంబాయి ఫిలింస్ డివిజన్‌లో వ్యాఖ్యాత) తో వారు నలుగురు. ఆయన తన పదహారవ ఏట గుంటూరులో ఇంటరు, పందొమ్మిదవ ఏట విజయనగరంలో బి.ఏ., ఇరవయ్యవ ఏట బెనారెస్‌ (BHU)లో ఎం.ఎస్‌సి. (పూర్తి చేయలేదు) చదివాడు.

బాల్యంలోను, యవ్వనంలోను విమర్శనావాదతత్వం కుటుంబరావుది. బంధువుల్లో దుస్సంప్రదాయాల్ని, నాటకాల్లో అసభ్యతను, అసమర్థతను, సాహిత్యరంగంలో ప్రయోజనారహితమైన రచనలను, కుతర్క రాజకీయాలను ఎగతాళి, విమర్శ చేసేవాడు. కాని యీ రంగాల్లో ఆయన సన్నిహితంగా పాల్గొంటూ వాటిలోని మంచి విలువల్ని పాటించకపోలేదు. అట్టి సందర్భాల్లోనే ఆయనకు కథారచనపై ప్రేరణ కలిగింది.

ఆ రోజుల్లో, తన 15వ ఏటికే ప్రముఖ ఇంగ్లీషు రచయితలను, ఆధునిక సాహిత్యాన్ని అమితంగా చదివేవాడు. ఆయన విమర్శనాత్మక ధోరణి గిట్టని మా బంధువులు ఆయన్ని “వెర్రికుట్టె, కొరకరాని కొయ్య” అనేవారు. వాళ్ళే ఆయన కథలు ప్రథమంగా పత్రికల్లో అచ్చయినప్పుడు చచ్చినట్టు వారి ధోరణిని కొంత మార్చుకుని “మనవాడు పరవాలేదే!” అనేవారు, లోపల కొంత కన్నీరు వుంచుకునే.

1931లో, నా పధ్నాలుగవ ఏట, మద్రాసు ప్రభుత్వ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ – క్రాఫ్‌ట్స్‌లో కళాభ్యాసం కోసం చేరాను నేను. ఆ సమయంలో కక్కయ్య మద్రాసు వచ్చి తన కథలను మొదట ప్రచురించిన ఆండ్ర శేషగిరిరావును (ఆంధ్రభూమి), శ్రీనివాస శిరోమణిని (చిత్రగుప్త) కలిసినపుడు, నేనూ ఆయనతో ఉండి, వారు కక్కయ్యను చాలా గౌరవించటం, రచన చేయటం గురించి అడగటం చూశాను. ఆ నాడు చలం స్త్రీల దుస్థితిపై తన దృష్టి కేంద్రీకరిస్తే, కుటుంబరావు సమాజంలోని కుళ్ళు, పీడలు, తిరోగతి, పురోగతుల్ని తన రచనలకు ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేయటం మొదలుపెట్టాడు.

సాహిత్యం, కళలు సమాజాన్నుంచి విడదీయలేనివని, సాంఘిక ప్రయోజనం లేని రచనలు నిర్జీవమైనవని, మానవ పురోగమనానికి సాహిత్యం ప్రేరణ కలుగజేయగలదని ఆనాడే ఆయన విశ్వసించాడు. ఆయన రచనలు ఈ లక్ష్యాలకే పరిమితమై, పదునైన సూక్ష్మ వాక్యాలతో విమర్శనాత్మకంగా నడిచి ఒక బలమైన శైలిని ఏర్పరచుకున్నాయి.

ఆనాటి కుటుంబరావు రచనలు సమాజం ఆమోదిస్తున్న సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమైనవి. ‘వీడు నిరుద్యోగి, బడుద్ధాయి, వక్రమార్గాల్లో పడ్డాడు. వీడు రాస్తే అవాకులూ, చవాకులూ అచ్చువేసుకునేందుకు మనకు పత్రికలు తలవెండ్రుకలన్ని’ అని చుట్టూ ఉండే సంప్రదాయవాదులు, ఛాందసులు, పాతగొప్పల వాక్కులవారూ ఆ నాడాయన్ని అనేవారు.

తన రచనలపై నిలదీసినవార్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా ఎదిరించేవాడాయన. ఫలానా తన రచన ఏ విధంగా పనికిమాలిందో సహేతుకంగా రుజువుచేస్తే తన రచనలు చేయటం మానుకుంటానని కచ్చితంగా వాదించేవాడు.

మా అమ్మ పిల్లలమర్రివారి ఆడబడుచు (కక్కయ్య అమ్మా అంతే). ఆ వంశంలో నటకులు, కవులు, సాహితీపరులు ఉన్నారు. కక్కయ్య రచనలు చదివినపుడు ‘మన ఆచారాలు, నీతినియమాలు ఇంతమందికి (సమాజానికి) గిట్టగా లేంది నీకేం మాయరోగంరా వాటిపై పేపర్లో రాయటానికి? మీ అమ్మా నాన్నలుంటే నువిలా చెడేవా?’ అని మా దగ్గిర ఆడచుట్టాలు కక్కయ్యను అనడం ఎరుగుదును. ‘మన బుద్ధులు మన గడప దాటవు గనక నా రాతలు మీకు గిట్టవు. మీ ఆచారాలు, నీతినియమాలకు మగ్గుతున్న ఓ నలుగుర్ని -మాటవరసకు నన్ను- బయటికి లాగనిస్తే, వారికి సుఖపడే గీత ఎలా ఉంటుందో రుజువు చేస్తా’ అని వారికి సమాధానం ఇచ్చేవాడు కక్కయ్య. ఆయన తన రచనలో చూపే ధోరణే నిత్యజీవితంలో కూడా అక్షరాలా కనపడేది.

కక్కయ్య కంఠం శ్రావ్యంగా ఉండేది. సంగీతాభిలాష ఎక్కువ. శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించటం, స్వరం అల్లటం నేను తెనాల్లోనే చూశాను.

తెనాలి ఆ రోజుల్లో సాహిత్యానికి, నాటకరంగానికి, రాజకీయాలకు, విద్యావంతులకు, విమర్శకులకు కూడలి స్థలం. కక్కయ్యకు సమకాలికులు, సన్నిహితులైన ఆధునిక రచయితలు చలం, గోపీచంద్, జి.వి.కృష్ణారావు, చక్రపాణి, ధనికొండ, బాలకృష్ణశాస్త్రి తెనాలి వాస్తవ్యులే. కృష్ణశాస్త్రి, శివశంకరశాస్త్రి మొదలైనవారు తరచు తెనాలి వస్తూ బ్రహ్మసమాజ కార్యకలాపాలు, నవ్యసాహిత్య పరిషత్ ఔత్సాహికులతో సమావేశాలు జరుపుతూ ఉండేవారు. కక్కయ్యకు వారు పరిచితులే కాక, నవ్యసాహిత్య పరిషత్ లో ఆయన సభ్యుడు కూడా. (అయితే త్వరలోనే రాజీనామా చేశాడు)

తెనాలి రామవిలాససభ నాటకసమాజం నటకులు మాధవపెద్ది వెంకట్రామయ్య, స్థానం నరసింహారావు, గోవిందరాజుల సుబ్బారావు, అద్దంకి శ్రీరామమూర్తి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి మొదలైనవారి ఉమ్మడి నాటక కార్యకలాపాలు జరుగుతున్న ఆ కాలంలో వారి పరిచయం కక్కయ్యకు ఉండేది. ఇట్టి సాహిత్య, నాటక, సంగీతాది కార్యక్రమాల వాతావరణంలో కక్కయ్య అభిరుచులు, రచనా దృక్పథానికి గట్టి పునాది ఏర్పడి, ఆయన భవిష్యత్తుకు ఉపకరించినై.

1925లో తన పదహారవ ఏట కక్కయ్యకు వివాహం జరిగి, ఇంకో ఆరేళ్ళకు కొడుకు రామచంద్రరావు (పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఎడిటింగ్ ప్రొఫెసర్) పుట్టాడు. తర్వాత 1929లో బెనారెస్ చదువు అనంతరం, 1931లో వరంగల్, హనుమకొండలలో టీచరుగా పనిచేసి, ట్యూషన్లు చెప్పి, మళ్ళీ తెనాలి చేరి సొంతగా ప్రెస్సు పెట్టుకున్నాడు కాని అది ఎక్కువ రోజులు నడిచింది కాదు.

ఆయితే ఆనాడు కక్కయ్యకు, చక్రపాణికి ఏర్పడ్డ మైత్రి ఒక అపూర్వ విశేషంగా పెంపొంది, ఉభయుల అంత్యదశల వరకు ప్రాణప్రదంగా వీరివెంట వచ్చింది. ఇది ఒకరి మేధస్సులను ఒకరు తెలుసుకున్నందువల్లనే సాధ్యమైంది. చక్రపాణి గాఢమైన సాహిత్యప్రియుడు, రచయిత. ఆయన శరత్ (Sarat Chandra Chattopadhyay), రవీంద్రనాథ మైత్రా, తారాశంకర బెనర్జీ తదితరుల రచనలు తర్జుమా చేసి ‘యువ’ ప్రచురణలనే పేర పుస్తకాలు ముద్రించటం సాగించాడు. కక్కయ్య కథల పుస్తకాలు కూడా చక్రపాణి ద్వారానే మొదట అచ్చయ్యాయి.

కక్కయ్య భార్య 1940లో మరణించటంతో ఆయన తన కొడుకును బంధువులకు అప్పగించి, తెనాలి నుండి సెలవు తీసుకున్నాడు.

అప్పటికి నాగేశ్వరరావు పంతులు గతించగా, ఆంధ్రపత్రిక ఆధిపత్యాన్ని శంభుప్రసాద్ స్వీకరించాడు. 1940లో కక్కయ్య ఆంధ్ర వారపత్రిక సంపాదకవర్గంలో చేరాడు. తర్వాత కొద్ది నెలలకే నేను కూడా ప్రధాన చిత్రకారుడిగా చేరాను.

సుమారు 1943లో ప్రజానాట్యమండలివారి ‘మా భూమి’ నాటకం, నాజరు ‘బెంగాలు కరువు’ బుర్రకథా, ఆ రోజుల్లోనే మొదలై, రూపురేఖలు దిద్దుకుంటున్న అభ్యుదయ రచయితల సంఘం కార్యకలాపాలూ మద్రాసులో పెద్ద సంచలనం కలుగజేసినందువల్ల శ్రీశ్రీ, కొడవటిగంటి మొదలైన ప్రముఖ రచయితలు అభ్యుదయ రచయితల సంఘంలో చేరటం జరిగింది. ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ (భారతదేశం అంతటా కూడా) ప్రజానాట్య మండలిని, అభ్యుదయ రచయితల సంఘాన్ని ఎక్కువగా ప్రోత్సహించి అండగా ఉండేది.

‘ఏది అభ్యుదయ సాహిత్యం?’ అంటూ ఆనాడు చెలరేగిన గాలి దుమారాన్ని శ్రీశ్రీ, కొడవటిగంటి బలంగా ఎదుర్కొని అభ్యుదయ రచయితల సంఘం సాహిత్య పత్రిక ‘అభ్యుదయ’లో గట్టి రచనలు చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలోనే తెనాలివద్ద పెదపూడి అనే పల్లెటూర్లో, చదలవాడ పిచ్చయ్య సహకారంతో, దాదాపు ఒక మాసం పాటు సాహిత్య పాఠశాల ఒకటి నడిచింది. చరిత్ర పరిశోధకులు, భాషా పండితులు, ప్రముఖ రచయితలు, కళాకారులు ఇందులో పాల్గొన్నారు. పాఠశాల ప్రారంభకులుగా మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ దేవీప్రసాద రాయ చౌధరి, రోజుకు ఒక తరగతి నడిపేందుకు శ్రీశ్రీ, కొడవటిగంటి, కృష్ణశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, కోరాడ రామకృష్ణయ్య, నిడదవోలు వెంకటరావు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, జమ్మలమడక మాధవరాయశర్మ, అయ్యలసోమయాజుల నరసింహశర్మ, మద్దుకూరి చంద్రశేఖరరావు, నేను వగైరా పాల్గొన్నాము.

కక్కయ్య రచనల్లో ఆనాటి వరకు సామాజిక ప్రయోజనకర విధానం కనిపించినా, ‘అరసం’, కమ్యూనిస్టు పార్టీ సంపర్కం, మార్క్సిజం పఠనం వల్ల ఆయన రచనా విధానంలో, ఆ తర్వాత నుండి గతితార్కిక భౌతికవిధాన దృక్పథం కొట్టవచ్చినట్లు కనుపించటం ప్రారంభమైంది. ఈ దృక్పథ పురోగమనం వల్లనే ఆయన మన వాతావరణానికి సాహిత్య శాస్త్రవిజ్ఞానాన్ని ప్రతిపాదించటం జరిగింది.

ఒక విధంగా ఆంధ్రవారపత్రిక నూతన విధానం, పెరుగుదల కొన్ని మాట పట్టింపులకు దారితీయటం వల్ల కక్కయ్య ఆ ఉద్యోగం వదిలి, 1942 ఆఖరులో రెండవ ప్రపంచయుద్ధం పనులకు బొంబాయి, సిమ్లా, జైపూర్‌లలో పనిచేసి, 1945 ప్రాంతంలో మద్రాసు తిరిగివచ్చాడు.

అప్పటికి నేను 1943లో ఆంధ్రపత్రికను వదలి, చక్రపాణి ప్రోద్బలంతో, ఆయన నాగిరెడ్డితో కలిసి బి.ఎన్.కె. ప్రెస్సులో ప్రారంభించిన ‘ఆంధ్రజ్యోతి’ కథల మాసపత్రికలో చేరాను. చక్రపాణి అదే ప్రెస్సులో తన ‘యువ’ ప్రచురణల పనికూడా చూసుకునేవాడు. ఆనాటి అభ్యుదయ సాహిత్యోద్యమంలో పడిన నేను 1944లో చక్రపాణి వద్ద సెలవు తీసుకోకుండానే, విజయవాడలో అప్పుడే ప్రారంభమవుతుండిన కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక ‘ప్రజాశక్తి’ లో చేరాను.

1945లో మద్రాసులో వున్న కక్కయ్యకు కొమ్మూరి పద్మావతమ్మ ప్రథమ పుత్రిక వరూధిని చిన్నమ్మతో ఆయన వివాహం జరిపించాము. ఆ రిజిస్టరు పెళ్ళికి సాక్షి సంతకాలు చేసింది శ్రీశ్రీ, నేనూ అయితే, శుభాశీస్సులు బళ్ళారి రాఘవాచార్యుల నుండి ముట్టినై.

తర్వాత కమ్యూనిస్టు పార్టీని ప్రభుత్వం నిషేధించటం వల్ల నేను మద్రాసు మళ్ళీ వచ్చి, తిరిగి ‘ఆంధ్రజ్యోతి’ లో చేరాను. పిల్లల మాసపత్రిక ‘చందమామ’ను కూడా చక్రపాణి అప్పుడే ప్రారంభించారు. అప్పటికి ఇంకా ఏ ఉద్యోగమూ దొరకని కక్కయ్య 1949లో ఈసారి ‘ఆంధ్ర దినపత్రిక’లో చేరి, 1952 నాటికి ‘చందమామ’కు ఎడిటరుగా చేరాడు. ఆయన జీవితంలో ఈ ఒక్క ఉద్యోగమే 1952 నుండి 1980 వరకు స్థిరంగా నిలిచిపోయింది. ఆయన చాలా గట్టి స్వతంత్రభావాలు గలవాడు. తన రచనల విషయంలో, ప్రత్యేకించి జీతండబ్బుల కోసం ఏనాడూ తన అభ్యుదయ పంథానుండి దిగజారలేదు. ఆయన భావాలు తన ఉద్యోగాలు ఊడేందుకు ఎక్కువచోట్ల పనిచేసినై. ‘నాకు ఉద్యోగాలు అచ్చిరావు’ అని ఆయన అన్నాడంటే రచయితగా తన స్వాతంత్ర్యానికీ, చేసే ఉద్యోగాలకూ వైరుధ్యాలొస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఆయన సత్ఫలితాలకు “ఆంధ్రవారపత్రిక’ తరఫున కక్కయ్యకో చిన్న యోగ్యతాపత్రం లభించింది. ‘మీ హయాంలో వారపత్రిక కవరుపేజీ చాలా ముచ్చటగా ఉంటున్నదండీ’ అన్నదే ఆ పత్రం. అంటే పత్రిక విలువా (పాఠకుల లేఖల్లో ఈ విషయం వ్యక్తమయేది), సర్కులేషనూ పెరగటం పరిగణనలోకి రాక, ఆయన మెరుగుపరచింది కేవలం అట్టమీద బొమ్మ మటుకేనని చెప్పటం. కక్కయ్య వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

కోడంబాకం ట్రస్టుపురంలో కక్కయ్య కు సొంతంగా ఇల్లు ఏర్పడి, వరూధిని చిన్నమ్మకు ఒక ఆడపిల్ల, ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆడపిల్ల శాంతసుందరికి వివాహం, పెద్దవాడు రోహిణీప్రసాద్ (న్యూక్లియర్ ఫిజిసిస్ట్) ఉద్యోగంలో చేరి వివాహమాడటం జరిగినై. (రెండవ పిల్లవాడు ‘బగ్గీ’ గతించాడు)

ఇప్పటికి అచ్చయిన కక్కయ్య వేలాది రచనల్ని కొందరైనా చదివి ఉండటం అసాధ్యం అనుకుంటా. ఆయన దిట్ట అయిన బహుముఖ రచయిత అని –షుమారుగా- నాకు తెలుసు. ఆయన గతించిన కొద్ది కాలంలో అనేక పత్రికల్లో పడ్డ దాదాపు యాభై రచనల్లో కొన్ని అంది, చదివినాక ఒక వింత అనుభూతి పొంది, ఈయన మన సాహిత్యలోకానికి, సమాజానికి సాహిత్యశాస్త్ర విజ్ఞానం ప్రతిపాదించిన ఒక అసాధారణ రచయితగా మన మధ్య జీవించినవాడని నేను భావించాను.

భావవిప్లవకారుడు కొడవటిగంటి
సాహిత్యసమాలోచన ప్రగతి సాహితి, జవాహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూ ఢిల్లీ
సంపాదకుడు: అశోక్ టంకసాల, జూన్ 1982

మాధవపెద్ది గోఖలే (1917-1981) తెలుగు సినీ కళాదర్శకుడుగా అత్యున్నత ఖ్యాతిని పొందారు. మాయాబజార్, చంద్రహారం మొదలైన విజయావారి సుప్రసిద్ధ చిత్రాలన్నిటికీ ఆయనే కళాదర్శకుడు. మహామంత్రి తిమ్మరుసు మొదలైన ఇతర సినిమాలకు కూడా ఆయన పనిచేశారు. మద్రాసు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ ట్స్ స్కూల్‌లో దేవీప్రసాద్ రాయ్‌చౌదరికి శిష్యుడు. (మద్రాసు మెరీనా బీచ్ రోడ్డు మీద కనిపించే ట్రయంఫ్ ఆఫ్ లేబర్, మహాత్మా గాంధీ విగ్రహాలు రాయ్‌చౌదరి నిర్మించినవే). సినీ గాయకుడు సత్యం గోఖలే తమ్ముడు. కళలోనే కాకుండా గోఖలే అభ్యుదయ రచయితగా కూడా సుప్రసిద్ధుడే. ఆయన రాసిన బల్లకట్టు పాపయ్య తదితర కథలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. కుటుంబరావుగారి బంధువుల్లో ఆయనకు సన్నిహితంగా మెలిగిన బహు కొద్దిమందిలో గోఖలే ఒకరు. అందుకే వ్యక్తిగత జీవిత విశేషాలను ఆయన తన వ్యాసంలో వివరించగలిగారు. – రో.ప్ర.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

3 Responses to కొడవటిగంటి కుటుంబరావు – జీవితపు వరవళ్ళు

  1. గోఖలే గారికి.. ఈ వ్యాసం రాసినందుకు, రోహిణీప్రసాద్ గారికి అది మాకు అందించినందుకు… ఎన్ని ధన్యవాదాలు చెప్పాలో తెలీడం లేదు. నాకు కొ.కు రచనలంటే ఇష్టం. ఇంట్లో అయితే “కొకు సాహిత్యం” సంపుటాలు, “చదువు” నవల తప్ప వేరేవి లేవు ఆయన రాసినవి. కాలేజీ కి వచ్చాక, కొకు లేఖలు, కొకు వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు..ఇలా బోలెడు కనబడ్డాయి. ఓ అభిమాని గా నా దృస్ఠి లో – “కొకు కి తెలీనిదంటూ లేదు” – 🙂 నాకెప్పడు ఆశ్చర్యం కలి్గించే విషయం ఏమిటి అంటే ఒక మనిషి జీవితం లో ఇన్ని విషయాల పట్ల అవగాహన ఎలా కలిగించుకన్నాడు? అన్ని రచనలు ఎలా చేయగలిగాడు…అదీ అన్ని విభిన్న విషయాల్లో… ఇంత చదువరి గా, రచయిత గా ఆయన కావడం వెనుక కథేమిటి అని. ఇటీవలి కాలం లోనే రోహిణీప్రసాద్ గారి బ్లాగు(ల)ను చదవడం జరిగింది… కొకు గారి పట్ల కలిగిన ఆశ్చర్యమే కొంత భాగం మళ్ళీ ఆయన మీద కూడా కలిగింది… 🙂 ఇన్ని విషయాల్లో knowledge ఎలా వచ్చింది అని. ఓహ్! మరీ పెద్ద కామెంటు ఐపోయింది. పొద్దు కి కూడా ధన్యవాదాలతో
    -Sowmya

  2. Pingback: ప్రాణహిత » కుటుంబంలో సంగీతం

  3. Pingback: ఈమాట » కొడవటిగంటి కుటుంబరావు రచనలలో కుటుంబ నేపథ్యం

Comments are closed.