మృతజీవులు – 1

కొడవటిగంటి కుటుంబరావు
కొడవటిగంటి కుటుంబరావు

[ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను మా నాన్నగారు (కొడవటిగంటి కుటుంబరావు) “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. దీనికి ఆయన పెట్టిన పేరు “మృతజీవాలు”. జీవాలు అంటే జంతువులు అనే అర్థాన్ని సూచిస్తాయనో ఏమో ప్రచురణకర్తలు “మృతజీవులు”గా మార్చారు. ఇది 1960లో విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా అచ్చయింది. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. – డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌]

………

డెడ్ సోల్స్ పుస్తక ముఖచిత్రం

ఒక సామాన్యపు బస్తీలోని హోటల్ గేట్ వద్ద అందంగా కనిపించే కమాను బండి, సాధారణంగా బ్రహ్మచారులూ, అర్థవేతనం పుచ్చుకునే అధికారులూ, చిల్లర సైనికోద్యోగులూ, సుమారు నూరుమంది కమత గాళ్ళు గల భూస్వాములూ — ఒక్క ముక్కలో చెప్పాలంటే “ఒక మాదిరి పెద్ద మనుషులు” ఎక్కి తిరిగేలాటిది, వచ్చి నిలబడింది. ఆ బండిలో ఒక పెద్దమనిషి కూచున్నాడు. అంత అందగాడూ కాదు, అంత అనాకారీ కాదు; లావుపాటివాడూ కాదు, బక్కపలచనివాడూ కాదు; ఆ మనిషి ముసలివాడనటానికీ లేదు, బొత్తిగా యువకుడనటానికీ లేదు.

ఆయన రాక ఆ బస్తీలో ఎలాటి సంచలనమూ కలిగించలేదు. అందువల్ల ఏమీ జరగలేదు కూడానూ. హోటలుకు ఎదురుగా ఉండే సారా అంగడి వాకిట నిలబడి ఉన్న ఇద్దరు రష్యన్ రైతులు కొద్దిగా వ్యాఖ్యానించిన మాట నిజమేగాని, ఆ వ్యాఖ్యానం బండిని గురించి తప్ప అందులో ఉన్న మనిషిని గురించి కాదు. “ఆర్‌రె, అదేం చక్రంరోయ్! నువ్వేమంటావ్? ఆ చక్రం అవసరమైతే మాస్కో దాకా పోతుందంటావా, పోలేదంటావా?” అని ఒకడు రెండోవాణ్ణి అడిగాడు. “పోతుంది” అన్నాడు రెండో వాడు. “అట్లా ఐతే కజాన్ దాకా పోలేదని నా ఉద్దేశ్యం” “కజాన్ దాకా పోలేకేం!” అన్నాడు రెండో వాడు. ఆ చర్చ అంతటితో ముగిసింది.

అదీగాక బండీ హోటలును సమీపించే సమయానికి ఒక యువకుడు ఆ బండిని సమీపించాడు. అతను చాలా పొట్టిగా, బిగుతుగా ఉన్న తెల్ల కాన్వాస్ లాగూ, కింద వేళ్ళాడే అంచులు, చాలా “ఫాషన్”గా కత్తిరించిన కోటూ, ఎదురు రొమ్మున షర్టుకు కంచు పిస్తోలు అలంకరించిన పిన్నూ ధరించి ఉన్నాడు. ఆ యువకుడు వెనక్కు తిరిగి బండీని తేరిపారజూసి, తన టోపీ గాలికి ఎగిరిపోకుండా చేత్తో పట్టుకుని తన దారిన తాను వెళ్ళాడు.

బండీ ఆవరణలోకి రాగానే హోటలు నౌకరొకడు పెద్దమనిషి వద్దకి వచ్చాడు – ఫలహార శాలల్లో ఈ నౌకర్లనే వెయిటర్లంటారు. వాడు ఎంత చురుకుగానూ, వేగంగానూ కదిలాడంటే వాడి మొహం ఆనవాలు తెలుసుకోవటం అసాధ్యమయ్యింది. వాడు చాలా పొడుగ్గా ఉండటమే గాక, నడుంపట్టీ మెడమీదికి వస్తున్న పొడుగుపాటి కోటు ధరించి, చేత్తో ఒక చేతిగుడ్డ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి తన జులపాలను విదిలించి, చప్పున ఆ పెద్దమనిషిని కాస్తా వెంటబెట్టుకుని పై అంతస్తుకు వెళ్ళి, ఒక పొడుగుపాటి చెక్క కూర్పు వరండా ఈ చివరనుండి ఆ చివరకు నడిపించి, ఈశ్వరానుగ్రహం వల్ల ఆ అతిథికి లభ్యమయినటువంటి గదిలో ప్రవేశపెట్టాడు.

అది మామూలు గదే, ఆ మాటకు వస్తే ఆ హోటలు కూడా మామూలు హోటలే – అంటే మామూలు బస్తీలలో ఉండే హోటళ్ళలాటిది; వాటిలో రోజుకు రెండు రూబుళ్ళ కిరాయి తీసుకుని ఒకగది ఇస్తారు; ప్రతి మూల నుండి నల్లటి బొద్దింకలు తొంగి చూస్తూంటాయి; అవతలి గదిలోకి వెళ్ళే ద్వారం ఒకటి ఉంటుంది; దానికి సొరుగుల పెట్టె అడ్డం పెట్టి ఉంటుంది; అవతలి గదిలో మాటా పలుకూ లేని ముభావం మనిషి ఒకడుంటాడు; అయితే ఆ మనిషికి కొత్తగా వచ్చిన వాడి ఆచోకీ అంతా కావాలి. ఈ హోటలు బయటి స్వరూపం లోపలి స్వరూపానికి అనుగుణంగానే ఉన్నది. అది నిడుపైన రెండంతస్తుల భవంతి కింది అంతస్తు గిలాబు* చెయ్యక ఎర్ర ఇటుకలు కనిపించేలాగా ఉంచారు. అది ఎండకు ఎండి, వానకు తడిసి, మురికి పట్టి మరింత నల్లగా అయింది. పై భాగానికి విధిగా పసుపు పచ్చ రంగు వేశారు.

భవనం అట్టడుగు మాళిగలో దుకాణాలున్నాయి. వాటిలో గుర్రాల పట్టెడలూ, మోకులూ, రొట్టెల చుట్టలూ ఉన్నాయి. ఈ దుకాణాల్లో ఒక దాని మూల, అంటే కిటికీ వద్ద, ఒక మనిషి నిలబడి వేడి పానీయాలు, మసాలా ఘాటువి అమ్ముతున్నారు. వాటి పక్కన ఎర్రని రాగితో చేసిన “సమవార్” (వేడి పానీయాలని కాచే బాయిలర్ లాటిది) ఉన్నది. వాడి మొహం కూడా వాడి సమవార్ లాగే ఎర్రగా ఉండటం చేత దూరంనుంచి చూస్తే రెండు సమవార్లు ఉన్నాయనిపించవలిసిందే – ఒక దానికి జీడినలుపు రంగు గడ్డం ఉండబట్టీ సరిపోయిందిగాని.

ఆగంతకుడు తన గదిని చూసుకుంటుండేంతలో అతని సామాన్లు పైకి వచ్చాయి. మొదటిది మధ్యకు తెరుచుకునే తోలుపెట్టె, తెల్ల తోలుతో చేసినది, అనేక ప్రయాణాలు చేసి మాసిపోయినది. తోలు పెట్టెను బండివాడు సేలిఫాన్ తెచ్చాడు. నౌకరు పెట్రుష్క సాయం పట్టాడు. బండివాడు చిన్న సైజు మనిషి. నౌకరుకు ముఫ్పై ఏళ్ళుంటాయి. వాడి మొహం మటమటలాడుతున్నది. వాడిపెదవులూ, ముక్కూ లావుగా ఉన్నాయి. వాడు వదులైన పొడుగుకోటు వేసుక్కున్నాడు. అది చాలా మాసిపోయి ఉన్నది, ఒకప్పుడు వాడి యజమానిదిలాగుంది. తోలుపెట్టె చేరినాక వాళ్ళు ఒక కొయ్య పెట్టే, బూట్లలో ఉంచే రెండు దిమ్మలూ, నీలం కాగితంలో చుట్టి ఒక కాల్చిన కోడీ తెచ్చారు.

ఇవన్నీ వచ్చి చేరాకా, బండివాడు సేలిఫాన్ తన గుర్రాల సంగతి చూడటానికి వెళ్ళాడు. నౌకరు పెట్రుష్క ఒక నల్లని చెక్కలగూడు లాటి అరలో తన వసతి ఏర్పాటు చేసుకున్నాడు. అందులో వాడు అప్పుడే తన పైకోటూ, తన వస్తువుల మూటా, వాటితో బాటు తన ప్రత్యేక మైన వాసనా పెట్టేశాడు. ఈ అరలోనే తన ముక్కాలి పడకను గోడకు చేర్చివేసి, దానిపైన ఒక చిన్న పరుపులాటిది పరిచాడు. అది పలుచగా, హోటలు యజమానివద్ద ముష్టెత్తిన రొట్టెలాగా, దాదాపు ఆ రొట్టె అంత జిడ్డు ఓడుతూ ఉన్నది. తన వస్తువులు సర్దే పని తన నౌకర్లకు వదిలిపెట్టి పెద్దమనిషి కూడలి గదికి వెళ్ళాడు.

ఈ కూడలి గదులు ఎలా ఉండేదీ ప్రతి ప్రయాణీకునికీ తెలుసు. రంగుకొట్టిన గోడల ఎగువభాగం పొగగొట్టం తాలూకు పొగతో మసిబారీ, కింది భాగం ప్రయాణీకుల వీపుల రాపిడికి నునుపెక్కీ ఉంటాయి. ఈ ప్రయాణీకులలో ముఖ్యంగా చెప్పుకోదగిన వాళ్ళు సంతరోజులలో ఆరేసి, ఏడేసి మంది కలిసి ఒక్కొక్క జట్టుగా వచ్చే వర్తకులు. వాళ్ళు విధిగా హోటలుకు వచ్చి తాము తాగే రెండేసి కప్పుల టీ తాగి తీరుతారు. పై కప్పు మాసిపోయి మట్టి కొట్టుకుని ఉంటుంది. దానికి షాండిలియర్‌ ఒకటి వేళ్ళాడుతూంటుంది. దానినిండా గాజు లస్టరు ఉండి, వెయిటరు పళ్ళెంనిండా పట్టినన్ని టీ కప్పులు గలగల లాడుతాయి.

గోడలనిండా సహజంగా తైలవర్ణ చిత్రాలుంటాయి. ఇవన్నీ ఎక్కడబడితే అక్కడే కనిపిస్తాయి. అయితే ఇక్కడి విశేషమేమంటే ఇక్కడ గల ఒక చిత్తరువులో ఒక సుందరికి ఎంత పెద్ద రొమ్ములున్నాయంటే అలాటివి పాఠకుడి కంట ఎన్నడూ పడి ఉండక పోవచ్చు. రష్యాలోకి దిగుమతి అయే చరిత్ర ప్రసిద్ధమైన చిత్తరువులను ఎవరు తెస్తారో, ఎప్పుడు తెస్తారో, ఎక్కడ తెస్తారో తెలియరాదు. కొన్నింటిని మటుకు అప్పుడప్పుడూ కళాప్రియులైన మా గొప్పవాళ్ళు తమ భృత్యుల సలహాపై ఇటలీలో కొని తీసుకురావటం కద్దు.

పెద్దమనిషి తన టోపీతీసి, తన మెడచుట్టూ ఉన్న పంచరంగుల శాలువా విప్పాడు. పెళ్ళయినవాళ్ళకు వారి భార్యలు అలాటి శాలువలు ఇవ్వటమేగాక వాటిని ఎట్లా కప్పుకోవాలో కూడా ఒకటికి పదిసార్లు చెబుతారు. బ్రహ్మచార్లకు ఈ సహాయం ఎవరు చేస్తారో నేను సరిగా చెప్పలేను, ఈశ్వరుడికే తెలియాలి.

అతను శాలువా విప్పుతూనే భోజనానికి ఆర్డరిచ్చాడు. భోజనశాలల్లో మామూలుగా వడ్డించే పదార్థాలు తెచ్చి వడ్డించారు – ఎన్నో వారాలు ముందే చేసి ఉంచిన పిండి రొట్టెముక్కలు వేసి కాబేజీ సూపూ, బటానీలతో మెదడు, కాబేజీలతో సాసేజీలు, కోడివేపు, ఉప్పువేసిన దోస ముక్కలూ, సర్వకాల సర్వావస్థలలోనూ ప్రత్యక్షమయే తీపిఉండలూ, ఇవన్నీ కొన్ని వేడిగానూ, కొన్ని చల్లగానూ తెచ్చి తనముందు పెడుతున్న వెయిటరును పెద్దమనిషి అర్థం లేని అడ్డమైన ప్రశ్నలు వేసి పనికిమాలిన విషయాలెన్నో తెలుసుకున్నాడు – ఈ హోటలు వెనుక ఎవరిది, ఇప్పుడు దీని కెవరు, ఇది లాభసాటిగా ఉంటున్నదా, దీని యజమాని దొంగముండా కొడుకేనా? దానికి జవాబుగా వెయిటరు, “భలే మోసగాడు, బాబూ!” అన్నాడు. నాగరికమైన యూరప్‌ లోనూ, రష్యాలోనూ కూడా ఈ కాలంలో అనేకమంది ఘరానా మనుషులు హోటళ్ళలో భోజనం చేస్తున్నంతసేపూ వెయిటర్లతో బాతాఖానీ కొట్టకుండానూ, మధ్య మధ్య వాళ్ళపైన హాస్యాలు విసరకుండానూ ఉండలేరు.

ప్రయాణీకుడు అడిగిన ప్రశ్నలన్నీ అర్థం లేనివనటానికి వీల్లేదు. అక్కడ గవర్నరు ఎవరో, న్యాయస్థానాధ్యక్షుడెవరో, పబ్లిక్ ప్రాసిక్యూటరెవరో, ప్రధాన స్థానికాధికారులెవరో, ఒక్కరు కూడా బీరుపోకుండా, వివరంగా అడిగి తెలుసుకున్నాడు. అంతకంటే కూడా ఆసక్తిగా ఆ ప్రాంతాల ఉండే ప్రముఖ వ్యక్తులందరిని గురించీ వివరాలు తెలుసుకున్నాడు: ఒక్కొకరికిందా ఎంతమంది కమతం చేస్తున్నారు, వాళ్ళ నివాసాలు బస్తీకి ఎంత దూరంలో ఉన్నాయి, ఎన్నిరోజులకొకసారి బస్తీకి వస్తుంటారు, ఆ ప్రాంతాలు ఏపాటి ఆరోగ్యవంతంగా ఉంటాయో, ఎక్కడైనా అంటువ్యాధులూ, జ్వరాలూ, మహమ్మారీ వగైరా ఉన్నాయా ఇత్యాది వివరాలు మహాశ్రద్ధగా విచారించాడు.

ఇవన్నీ ఊసుపోకకు అడిగే పశ్నలు కావు మరి. మనిషి వాలకంలో కొంత హుందా, పెద్దమనిషి తరహా ఉన్నాయి. ఆయన ముక్కు చీదుకుంటే బ్రహ్మాండమైన చప్పుడయింది. చీదినప్పుడల్లా ఆయన బాకా మోగినంత చప్పుడు చేశాడు, ఎలా చేశాడో మరి. ఈ చప్పుడు వినేసరికి వెయిటరుకు ఆ పెద్దమనిషి మీద గౌరవం లావయింది, అది చెవిని పడ్డప్పుడల్లా వాడు జులపాలు ఆడించి, మరింత నిటారుగా నిలబడి తలవంచి, ఇంకేమి సెలవు అని అడిగాడు. పెద్దమనిషి భోజనం పూర్తి చేసి, ఒక కప్పు కాఫీ తాగి, సోఫామీద చేరి, బాలీసుకు చేరగిలబడ్డాడు. ఇప్పుడాయన ఆవలిస్తూ వెయిటరుతో తనను గదికి తీసుకుపొమ్మని, అక్కడ రెండు గంటల పాటు పడుకుని నిద్రపోయాడు.

విశ్రాంతి అయినాక వెయిటరు కోరికపై ఆయన ఒక కాగితంపై తన ఉద్యోగమూ, హోదా, పేరూ, ఇంటిపేరు రాశాడు. ఈ వివరాలు కాలక్రమేణా పోలీసువారికి అందుతాయి. వెయిటరు కిందికి దిగి వెళ్ళిపోతూ ఈ విధంగా చదువుకున్నాడు:

పావెల్‌ ఇవానవిచ్‌ చిచీకన్‌
చర్చి కౌన్సిల్‌ సభ్యుడు మరియు భూస్వామి
ప్రయాణం సొంత పని మీద

(ఇంకా ఉంది)
*గిలాబు/గిలాబా = గచ్చు/సిమెంటు పూత వేయడం (plastering)

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

8 Responses to మృతజీవులు – 1

  1. vijayasimha says:

    Hello Sir,

    I like the your thought of bringing the good and unavailable books to lot of interested readers thru this blog.

    can you pls tell me what is the schedule of the “Mrutha Geevulu “.I mean is it updated Daily or weekly ?

    Thanks and Regards
    Vijay.

  2. Sowmya says:

    ee aalochana baagundi.
    kaanee.. o sandeham…ee navala pratyekata emiti? Gogol navala kaavadam okkatenaa? leka…emannaa koku garu idokkate anuvadam chesaaraa?? Koku gaaru raasina rachanalu boledu undagaa ide veyyadam lo emannaa antaryam undaa?

  3. విజయసింహ గారూ!

    మృతజీవులు ప్రతినెలా రెండవ మరియు నాల్గవ సోమవారాల్లో వస్తుంది.

    సౌమ్య గారూ!

    కొ.కు. గారు చేసిన అనువాదాల గురించి పైన రోహిణీప్రసాద్ గారు రాసింది చదవండి. ఇంకా మీరు ఈ సంపాదకీయం చదివితే మీ సందేహం నివృత్తి కావచ్చు. గొగోల్ కు పేరు తెచ్చిన రచనల్లో ఈ నవల ఒకటి. కొ.కు. గారి రచనలు పుస్తకాలుగా వచ్చాయి కానీ అనువాదాలు రాలేదు. ఆయన అనువాదాలను ఇప్పటి పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం మృతజీవులు ప్రచురణతో మొదలుపెట్టాం.

  4. It is a good idea to introduce old Russian classics to Telugu readers. One can also taste the flavour of Telugu idiom from a veteran writer while narrating a translated work.
    -K. Rohiniprasad

  5. హెచ్చార్కె says:

    సర్, రోహిణి ప్రసాద్ గారూ, మీరు చాల మంచి పని చేశారు. చేస్తున్నారు. ఆలస్యంగా చూడ్డం వల్ల ఆలస్యంగా స్పందిస్తున్నాను. ‘మృత జీవులు’ చదవకుండానే, చదవడానికి వుపక్రమిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. సాహిత్యాభిలాషులు తప్పక చదవాల్సి వుండి, ఏవేవో కారణాల వల్ల చదవ(లే)క పోయిన రచనలను ఇలా అందుబాటు లోనికి తీసుకురావడం… అందరూ కృతజ్ఙతలు చెప్పుకోవాల్సిన గొప్ప సేవ. నెట్ లో పొద్దు వంటి పత్రికలు ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు, వారికి వందనాలు.

  6. Rohiniprasad says:

    Thanks. A Study in Scarlet అనే మరొక అనువాద నవల ప్రాణహితలో వెలువడుతుంది.

  7. ramanarsimha says:

    Part-1 is very interesting.

    I will try to read totally.

  8. Pingback: వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 3) | పుస్తకం

Comments are closed.