మరో వనాన్ని స్వప్నిస్తాను

జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/)

రోజంతా శ్రమించి
కొంత స్థలాన్ని చదునుచేసి
విత్తనాలు చల్లాను
మొలకలకోసం నిరీక్షిస్తున్నా
పొటమరిస్తున్న ఉనికిని
స్వాగతించడానికి!

స్నేహితుల్లారా!
మిమ్మల్ని పిలవాలనివుంది
మొలకలు వస్తూ వస్తూ
సమయ సంకేతాన్నిచ్చి రావుకదా!
వేచివుండాలి!

ఏ అర్థరాత్రో అపరాత్రో
వెన్నెల లేనప్పుడు
వజ్రపుతునకల్లా బయటపడ్తే
నిరీక్షిస్తూ నిరీక్షిస్తూ
నిదుర కళ్ళతో జోగితే
మొలుచుకొచ్చిన రంగేదీ కనపడదు కదా!

పైగా ఎర్రబారిన కళ్ళను చూస్తే దిగులేస్తుంది
ఎదిగిన నారుమడుల్లో
కలుపుతీయడానికి పిలుస్తాను
ఒక్కణ్ణే ఎంతసేపని పనిచేయను?

ఆకును చూసో తొడిమను చూసో
పువ్వులొచ్చే జాడల్ని కనిపెట్టొచ్చు
కాయలొచ్చే తీరుల్ని చెప్పొచ్చు

నిండు పూలవనంలో
మీరు తిరుగాడుతూ
నేత్రాల్ని టప టపలాడిస్తుంటే
రేకల పరిమళాల్ని పీలిస్తూ
వనమాలిని మెచ్చుకుంటుంటే
చాటుగావిన్న మాటలైనా ఉత్తేజాన్నిస్తాయి

బీడు భూముల్లో
మరో వనాన్ని స్వప్నిస్తాను
వనాల్ని స్వప్నించడం
వడగాల్పుల ఎండల్లోనైనా
నడుమొంచడం కొత్త కాదుకదా!

వేపపువ్వుల్లోనో
విప్పపువ్వుల్లోనో దాగిన
తేనెను వెదకి తెచ్చేపని మీకప్పచెపుతున్నా
వేరే పువ్వులేవీ లేవా అని విసుక్కోవద్దు

వాటి మాధుర్యమేదో
పదేపదే లాగిపెడ్తుంది
తొలిపొద్దులో రాలే మంచుబిందువుల్ని
ముద్దాడేందుకు లేత అకుల్ని సిద్దంచేయాలి!
చదును చేయాల్సిన స్థలాలింకా మిగిలివున్నాయి సుమా!

జాన్ హైడ్ కనుమూరి (http://johnhaidekanumuri.blogspot.com/)

వీరు రాసిన ‘హృదయాంజలి’ కవితాసంపుటి మార్చి 2004 లో శ్రీ మునిపల్లె రాజు గారిచే ఆవిష్కరించబడింది. వీరు రాసిన ‘హసీనా’ గురజాడ రాసిన ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ తర్వాత స్త్రీ సమస్యలతో వచ్చిన దీర్ఘ కవిత అని వాడ్రేవు చినవీరభద్రుడు గారి అభిప్రాయం. వీరి ‘అలలపై కలలతీగ’ కవితాసంపుటి ఫిబ్రవరి 2006లో విడుదలైంది. వీరి గురించి మరిన్ని వివరాలతో బాటు, వీరు రాసిన కవితలు కొన్ని వీరి బ్లాగులో చూడవచ్చు.

About కనుమూరి జాన్ హైడ్

జాన్‌హైడ్ కనుమూరి రాసిన 'హృదయాంజలి' కవితాసంపుటి మార్చి 2004 లో శ్రీ మునిపల్లె రాజు గారిచే ఆవిష్కరించబడింది. వీరు రాసిన 'హసీనా' గురజాడ రాసిన 'పుత్తడిబొమ్మ పూర్ణమ్మ' తర్వాత స్త్రీ సమస్యలతో వచ్చిన దీర్ఘ కవిత అని వాడ్రేవు చినవీరభద్రుడు గారి అభిప్రాయం. వీరి 'అలలపై కలలతీగ' కవితాసంపుటి ఫిబ్రవరి 2006లో విడుదలైంది.జాన్‌హైడ్ గారి ర గురించి మరిన్ని వివరాలతో బాటు, వీరు రాసిన కవితలు కొన్ని ఈ బ్లాగులో చూడవచ్చు.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

10 Responses to మరో వనాన్ని స్వప్నిస్తాను

  1. జాన్‌ హైడ్ కవి గారు దేనినైనా కవితగా మార్చగలరనే సృజనశీలత దీని లో ఉంది. కవీ స్పందించు. పరిమళాలు పూయించు. మానవత్వాన్ని గుభాళించు …

  2. అందమైన పదచిత్రాల్ని చిత్రించడం బాగుంది.

  3. radhika says:

    adbhutam gaa vumdamDi.

  4. sridevi says:

    chala bagundi

  5. nagaraja says:

    కదిలించింది. చాలా చాలా బాగుంది.

  6. జాన్ హైడ్ కనుమూరి says:

    స్పదించిన వారికి
    ధన్యవాదములు

  7. శ్రీనివాస్ భీమా says:

    ఆలోచించే ప్రతి వారికి ఉత్ప్రేరకంగా వుంది.
    ప్రతివొక్కరినీ ఆలోచింపచేసేలా వుంది
    అభినందనలు

  8. రామ్మోహన్ రావు says:

    చక్కని పదాలతో ఎవ్వరికైనా అలరించేటట్టు వుంది

  9. అరుణ కుమార్ says:

    కవిత చాల బాగుంది

  10. శర్మ says:

    మనసును హత్తుకుంది.

    స్వప్నించడం కష్టమే.

Comments are closed.